మధుమేహం – రక్తపోటు 2

[వ్యాసం మొదటి భాగం.]

6. రక్తంలో గ్లూకోజ్ ఎక్కువైనా తక్కువైనా మంచిది కాదు

 
డయబెటీస్‌తో ముఖ్యమైన సమస్య ఏమిటంటే అది ఒక్క రోజులో వచ్చేది కాదు.  జబ్బు ఉన్నవారికి ఉన్నట్లు తెలియకపోవచ్చు కూడా. అలా కొన్ని సంవత్సరాలపాటు గడిచిపోవచ్చు. కాని కొంత కాలం జరిగిపోయిన తర్వాత దాన్ని నయం చెయ్యటం వీలుకాదు. అందువల్లే కనీసం సంవత్సరానికి ఒకసారి రక్తంలో గ్లూకోజ్ సాంద్రణ ఎంత ఉందో పరీక్ష చేయించుకోవటం మంచిది. సాంద్రణ 100 నుంచి 130-140 వరకూ ఉన్న వారిని ‘డయబెటీస్ రావటానికి ముందున్న స్థితి’లో (pre-diabetes) ఉన్నారని అంటారు.  డాక్టర్లు ఈ స్థితిని లక్షణ సంపుటి లేదా ‘మెటబోలిక్ సిండ్రోమ్’ అని కూడా అంటున్నారు. (Metabolic syndrome involves having at least 3 out of 5 health conditions that increase your risk of cardiovascular disease, stroke and Type 2 diabetes. Each condition is treatable with lifestyle changes and/or medication.) ఈ స్థితిని దాటి, డయబెటీస్ వచ్చిన తర్వాత వైద్యం చెయ్యటంవల్ల జబ్బు తగ్గదు. వ్యాధి లక్షణాలను అదుపులో ఉంచడానికి ప్రయత్నం చెయ్యడమే డాక్టర్లు చెయ్యగలిగింది. డయబెటీస్ ముదిరి క్రమంగా రక్తపోటు, గుండె జబ్బు, మూత్రపిండాల జబ్బు, కంటిచూపు పోవటం, నరాల జబ్బు, కాళ్ళకూ చేతులకూ స్పర్శ లేకుండా పోవటం ఇలా పరిణమిస్తుంది. అందువల్ల ఈ జబ్బు రాకుండా చూసుకోవడమే మంచిది. వచ్చిన తర్వాత వెనకకు వెళ్ళటం వీలు కాదు.
 
రక్తంలో గ్లూకోజ్ సాంద్రణ మామూలుగా 80-100 ప్రాంతంలో ఉంటుందని ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా! ఇది భోజనం తర్వాత వెంటనే పెరిగినా, ఆరోగ్యంగా ఉన్న మనుషుల్లో రెండుమూడు గంటల్లో తిరిగి ఈ స్థాయికి చేరుకుంటుంది. కాని అంతకంటే తక్కువ కాదు. మధుమేహం ఉన్న వారిలో ఇన్సులిన్‌ మోతాదు ఎక్కువైతేనో లేక ఇతర మందుల మోతాదు ఎక్కువైతోనో గ్లూకోజ్ సాంద్రణ ప్రమాదకరమైన స్థాయికి తగ్గిపోయే అవకాశం ఉంది. అందువల్ల ఇది జాగ్రత్తగా పరిశీలించాల్సిన విషయం.
 
రక్తంలో సాంద్రణ 80-100 మించి ఉంటే గ్లూకోజ్ ప్రాణ్యములకు (ప్రోటీన్‌లకు) అతుక్కుని వాటిని పని చెయ్యనివ్వకుండా చెయ్యడం, ఇంకా ఇతర కారణాలవల్ల జబ్బు రావడం – ఈ విషయాల గురించి ఇదివరకే మాట్లాడుకున్నాం. కానీ, గ్లూకోజ్‌తో సమస్య ఏమిటంటే అది ఎక్కువైనా ప్రమాదమే కాని, తక్కువైతే ఇంకా ప్రమాదం! ఎక్కువైతే కనపడని ప్రమాదం. తక్కువైతే వెంటనే కనిపించే ప్రమాదం!
 
గ్లూకోజ్ వాడకాన్ని బట్టి మన శరీరంలో మూడు రకాల అవయవాలున్నాయి.
 
కాలేయం, కండరాలు వంటి అవయవాలు మొదటి రకానికి చెందినవి. భోజనం చేసిన వెంటనే ఈ అవయవాలు గ్లూకోజ్‌ను వాడుకున్నా, మిగతా సమయాల్లో వాటి శక్తి కోసం ఇవి కొవ్వు పదార్థాలను ఎక్కువగాను, గ్లూకోజ్‌ని తక్కువగానూ వాడుకుంటాయి. రక్తంలో గ్లూకోజ్ సాంద్రణ పడిపోతే కొవ్వు పదార్థాలను ఎక్కువగా ఇవి వాడుకోగలవు.
 
రెండో రకం అవయవాల్లో ముఖ్యమైనది మెదడు. ఇది మామూలు పరిస్థితుల్లో గ్లూకోజ్‌ని తప్ప దాని స్థానంలో మరే పదార్థాన్నీ వాడలేదు. అంటే అకస్మాత్తుగా రక్తంలో గ్లూకోజ్ సాంద్రణ పడిపోతే మెదడులో ఉండే కణాలు చచ్చిపోతాయి. మస్తిఘాతం (stroke) వచ్చినప్పుడు మెదడులో ఏదో ఒక భాగం చచ్చిపోతుంది – రక్తప్రసారం లేక. అంటే ముఖ్యంగా ఆమ్లజని, గ్లూకోజూ అందక. అలాంటిది అసలు రక్తంలో గ్లూకోజ్ సాంద్రణ పడిపోతే మొత్తం మెదడుకే ప్రమాదం. అలాంటి స్థితిలో కొన్ని గంటలు మాత్రమే మెదడు కణాలు (brain cells) బతకగలవు. గ్లూకోజ్ సాంద్రణ మామూలు స్థాయికి రాకపోతే మనిషి కోమాలోకి వెళ్ళిపోవచ్చు.  అదీ షుగర్ జబ్బుకీ కోమాకీ మధ్య ఉన్న సంబంధం! గ్లూకోజ్ ఎక్కువైతే వెంటనే తెలియని జబ్బు. తక్కువైతే వెంటనే ప్రమాదకరమైన జబ్బు.
 
ఇక మూడో రకం అవయవాలు – ఏ పరిస్థితిలో అయినా గ్లూకోజ్‌ని తప్ప మరే పదార్థాన్నీ వాడుకోలేనివి. వీటిలో ముఖ్యమైనవి ఎర్ర రక్తకణాలు. రక్తంలో గ్లూకోజ్ సాంద్రణ పడిపోతే ఈ కణాలు చచ్చిపోతాయి. కానీ మెదడు కణాలు చచ్చిపోయిన ప్రభావం తొందరగా కనబడుతుంది. ఎర్ర రక్తకణాల చావు వల్ల నీరసం వస్తుంది.

గ్లూకోజ్ సాంద్రణ పడిపోతే ప్రమాదం కాబట్టి అలా జరక్కుండా ఉండటానికి మన శరీరం ఏం చేస్తుంది? మనం ఏం చెయ్యగలం?  మెదడుకి కావలసినంత గ్లూకోజ్ అందుతూ ఉండాలంటే రక్తంలో గ్లూకోజ్ సాంద్రణ 80-100 ప్రాంతంలో ఉండాలి. అది కొంచెం తగ్గితే ఇది వరకు మనం చెప్పుకున్నామే పాంక్రియాస్ అని ఒక అవయవం ఉందని, అదే అవయవంలో ఉన్న కొన్ని కణాలు గ్లూకగాన్‌ (Glucagon) అనే ఒక హార్మోన్‌ను రక్తంలోకి పంపిస్తాయి. (మీకు గుర్తుందో లేదో, రక్తంలో గ్లూకోజ్ ఎక్కువయినప్పుడు దాన్ని తగ్గించడానికి ఇన్సులిన్‌ని రక్తంలోకి పంపించేది ఈ అవయవమే.) సరే, గ్లూకగాన్‌ ఏం చేస్తుంది?
 
గ్లూకగాన్‌ ప్రభావం ఎక్కువగా రెండు అవయవాల మీద ఉంటుంది. ఇవి కాలేయం, కొవ్వు నిల్వలు.
 
1. కాలేయం మీద. రక్తంలో గ్లూకోజ్ సాంద్రణ తగ్గింది అనుకుందాం. దాన్ని వెంటనే పెంచాలంటే  మనం తినాలి. మనం ఏదో కారణంగా తినలేదనుకోండి. అప్పుడు శరీరమే ఏదో విధంగా గ్లూకోజ్ సాంద్రణ పెంచాలి. మన శరీరంలో రెండు చోట్ల గ్లూకోజ్ గిడ్డంగులు ఉన్నాయి: కాలేయం ఒకటి, కండరాలు మరొకటి. ఇదివరకు చెప్పుకున్నాం ఈ రెండు అవయవాలూ గ్లూకోజ్ బణువులను ఒకదానికొకటి చేర్చి తీపిజనిగా మార్చి నిల్వ చేస్తాయని. గ్లూకగాన్‌ ప్రభావం వల్ల కాలేయం తీపిజని (glycogen) నుంచి ఒక్కో గ్లూకోజ్ బణువును తెంచేసి రక్తంలోకి వదులుతుంది. క్రమంగా గ్లూకోజ్ సాంద్రణ పెరుగుతుంది. పద్ధతి ఇదీ. కాని రక్తంలో గ్లూకోజ్ సాంద్రణలో పెద్ద మార్పు వచ్చే దాకా ఆగదు శరీరం. ఎప్పటికప్పుడే గ్లూకోజ్ సాంద్రణ స్థిరంగా ఉండేట్లు చేస్తుంది.
 
కాలేయం తీపిజనిని ముక్కలుగా చేసి గ్లూకోజ్‌ను రక్తంలోకి పంపిస్తుంది. కాని తన అవసరానికి వాడుకోదు; నిజానికి వాడుకోలేదు. కారణం ఏమిటంటే, గ్లూకగాన్‌ అలా గ్లూకోజ్‌ను వాడుకోనివ్వదు. గ్లూకోజ్‌ను వాడుకోవటానికి అవసరమైన ప్రాణ్యములను (protein) పనికిరాకుండా చేస్తుంది. అందువల్ల కాలేయంలో నిల్వ ఉంచిన తీపిజని కాలేయం అవసరానికి కాదు, రక్తంలో గ్లూకోజ్ సాంద్రణ తగ్గినప్పుడు దాన్ని పెంచడానికి మాత్రమే.
 
మీరు గమనించే ఉంటారు – ఇన్సులిన్‌, గ్లూకగాన్‌ ఒకదానికొకటి విరుద్ధంగా పనిచేస్తూ ఉంటాయి.  రక్తంలో గ్లూకోజ్ సాంద్రణ పెరిగినప్పుడు ఇన్సులిన్‌ కాలేయంలో దాని వాడుకను ఎక్కువ చేస్తుంది. కాలేయం గ్లూకోజ్‌ని తన అవసరాల కోసం వాడుకోవటమేగాక, దాన్ని తీపిజనిగా మారుస్తుంది, కొవ్వుగా చేస్తుంది. రక్తంలో గ్లూకోజ్ తగ్గినప్పుడు గ్లూకగాన్‌ ప్రభావం వల్ల కాలేయం గ్లూకోజ్‌ని వాడుకోలేదు, తీపిజని నుంచి గ్లూకోజ్ తయారు చేసి రక్తంలోకి వదిలేస్తుంది, తన అవసరాలకోసం కొవ్వు వాడుకను ఎక్కువ చేస్తుంది. అంటే ఇన్సులిన్‌, గ్లూకగాన్‌ పరస్పర విరుద్ధంగా పనిచేస్తూ రక్తంలో గ్లూకోజ్ సాంద్రణ స్థిరంగా ఉండేట్లు చేస్తాయి.
 
మరోసారి పాంక్రియాస్ గురించి ఆలోచించండి. గ్లూకోజ్ సాంద్రణ పెరిగితే పాంక్రియాస్ ఇన్సులిన్‌ను రక్తంలోకి పంపించి దాని సాంద్రణ తగ్గేట్లు చేస్తుంది. గ్లూకోజ్ సాంద్రణ పడిపోతే గ్లూకగాన్‌ను రక్తంలోకి పంపించి దాని సాంద్రణ పెరిగేట్లు చూస్తుంది. పాంక్రియాస్ ఎంత ముఖ్యమైన అవయవమో కదా?
 
ఇంతకీ కాలేయంలో ఉన్న తీపిజని గురించి మాత్రమే మాట్లాడుకున్నాం. కండరాల్లో గూడా తీపిజని ఉందికదా? నిజానికి కాలేయంలో కంటే నాలుగైదురెట్లు ఎక్కువే ఉంది. మరి కండరాలు కూడా తమ తీపిజని నుంచి గ్లూకోజ్‌ను తయారు చేసి రక్తంలోకి వదుల్తాయా? లేదు. అలా చెయ్యవు. కండరాలు తమ తీపిజనిని తమ అవసరాలకు మాత్రమే వాడుకుంటాయి. దాన్నుంచి గ్లూకోజ్ తయారు చేసి రక్తంలోకి వదలవు. ముఖ్యమైన కారణం ఏమిటంటే కండరాలలో గ్లూకోజ్‌ను వాడుకోవటానికి గాని, తీపిజనినుంచి గ్లూకోజ్ తయారుచెయ్యడానికి గానీ అవసరం అయిన ప్రాణ్యముల  మీద  గ్లూకగాన్‌కు ఎలాంటి ప్రభావం లేదు. ఇది కూడా మంచిదేనేమో. మనం సోఫా మీద పడుకుని టి.వి. చూస్తూ ఉన్నప్పుడు కండరాలకు తీపిజనితో పెద్దగా అవసరం లేకపోయినా, చాలాసేపు శరీర శ్రమ చెయ్యాల్సొస్తే ఈ తీపిజనే కండరాలకు శక్తిని సరఫరా చేసేది. ప్రస్తుతం అవసరం లేదుకదా అని ఆ తీపిజనిని మెదడుకు ఇచ్చేస్తే మరి అవసరం అయినప్పుడో?    
   
2. కొవ్వు నిల్వల మీద. రక్తంలో గ్లూకోజ్ సాంద్రణ పెరగాలంటే, కాలేయం నుంచి గ్లూకోజ్‌ని విడుదల చెయ్యడమే కాకుండా, మామూలుగా ఎంతోకొంత గ్లూకోజ్‌ను వాడే అవయవాలకు కొవ్వు సరఫరా చేసి గ్లూకోజ్ వాడకాన్ని తగ్గించడం మరొక మార్గం. గ్లూకగాన్‌ కొవ్వు నిల్వలను ప్రభావితం చేసి కొంత కొవ్వును రక్తంలోకి పంపిస్తుంది. కొవ్వు రక్తం ద్వారా అన్ని అవయవాలకూ (మెదడుకు కాదు) చేరుతుంది. కొవ్వు వాడుక పెరిగి గ్లూకోజ్ వాడుక తగ్గడం వల్ల మెదడుకు గ్లూకోజ్ దొరికే అవకాశం ఎక్కువవుతుంది.
 
ఇక కండరాల గురించి. కొవ్వు నిల్వల నుంచి వస్తున్న కొవ్వును కండరాలు వాడుకుంటాయి. అందువల్ల గ్లూకోజ్ వాడుక తగ్గుతుంది. అంతేగాక, అవసరమైతే కండరాలలో ఉన్న తీపిజని నుంచి గ్లూకోజ్ తయారవుతుంది. దీనిని కండరాలు వాడుకుంటాయి. రక్తంలో ఉన్న గ్లూకోజ్‌ని మెదడుకు వదిలేస్తాయి.
 
అంటే గ్లూకోజ్ సాంద్రణ పడిపోకుండా శరీరం ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటుందన్నమాట. కనుక సమయానికి తినటం తప్ప మనం చెయ్యాల్సింది ఏమీ లేదు. నిజమే. కానీ షుగర్ జబ్బు ఉన్నవాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్త ఒకటి ఉంది. జబ్బు లక్షణాలను తగ్గించడానికి డాక్టర్లు ఇన్సులిన్‌ ఇంజెక్షన్లు గానీ మెట్ఫోర్మిన్‌ లాంటి మందులు గానీ ఇస్తారు. ఇవి రక్తంలో గ్లూకోజ్ సాంద్రణను తగ్గిస్తాయి. కానీ సమయంకాని సమయంలో ఈ మందులు వేసుకుంటే, లేక ఎక్కువ మోతాదులో వేసుకుంటే, గ్లూకోజ్ సాంద్రణ ప్రమాదకరమైన స్థాయికి పడిపోయే అవకాశం ఉంది. ఉదాహరణకు, ఉదయం అల్పాహారానికి ముందు రక్తంలో సాంద్రణ మామూలు స్థాయిలో ఉండవచ్చు. అప్పుడు ఏమీ తినకుండా మందులు వేసుకుంటే గ్లూకోజ్ సాంద్రణ ప్రమాదస్థాయికి పడిపోయే అవకాశం ఉంది. అందువల్ల మందు ఏ మోతాదులో ఎప్పుడు వేసుకోవాలో డాక్టర్లు రోగులకు వివరంగా చెప్పాలి. రోగులు వాటిని తు. చ. తప్పకుండా పాటించాలి.
 
ఈ భాగాన్ని ముగించే ముందు మరోసారి మెదడు గురించి మాట్లాడుకుందాం. మామూలు పరిస్థితుల్లో మెదడు గ్లూకోజ్‌ను తప్ప మరే పదార్థాన్నీ వాడుకోదు అనుకున్నాం కదా? దీనికి కారణం ఏమిటంటే చాలా అవయవాలు కొవ్వును వాడుకుంటాయి గాని మెదడు వాడుకోలేదు. నిజానికి ఇది మెదడు తప్పు కాదు. మెదడుకు వెళ్ళే రక్తనాళాల నుంచి కొవ్వు పదార్థాలు మెదడుకు చేరవు. మెదడు ఒక ‘గేటెడ్ కమ్యూనిటీ’ లాంటిది. గేట్ దగ్గర ఉండే కాపలాదారు లాగా రక్త నాళాల గోడలమీద ఉండే కణాలు గ్లూకోజ్‌ని లోపలికి రానిస్తాయిగాని కొవ్వును రానివ్వవు. అందువల్ల మెదడు కొవ్వును వాడుకోదు. కానీ, ఒక వారం పది రోజులు మీరు అసలు ఏమీ తినలేదనుకోండి. అప్పుడు గ్లూకోజ్ సాంద్రణ 50 దాకా పడిపోవచ్చు. కానీ మెదడులోని కణాలు చచ్చిపోవు. దీనికి కారణం కాలేయంలోను, రక్త నాళాల్లోనూ వచ్చే మార్పులు. కాలేయం కొవ్వు పదార్థాలను తీసుకుని ‘కీటోన్‌ బాడీస్’ అనే పదార్థాలను తయారు చేస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే కొవ్వు పదార్థాలను తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా చేస్తుంది అనుకోవచ్చు. మెదడులో ఉండే రక్తనాళాలు కొవ్వును మెదడు లోకి రానివ్వవుగాని, ఈ కీటోన్‌ బాడీస్‌‌ను ఉపవాస దినాలు పెరిగే కొద్దీ లోపలికి రానివ్వటం పెంచుతాయి. అందువల్ల మెదడు తన అవసరాలకు వీటిని వాడుకోవటం పెంచుతుంది. దీర్ఘ కాలం ఉపవాసం ఉన్న వారి రక్తంలో గ్లూకోజ్ సాంద్రణ 45-50 దాకా పడిపోవచ్చు. అప్పటికి మెదడులోని కణాలు తమ అవసరాల్లో దాదాపు 75% వరకూ కీటోన్‌ బాడీస్‌ను వాడుకోగలుగుతాయి. గ్లూకోజ్ వాడుక తగ్గుతుంది.

7. కొవ్వుకి డయబెటీస్‌కి సంబంధం ఏమిటి?

మన శరీరంలో రెండు రకాల పదార్థాలున్నాయి: నీటిలో కలిసిపోయేవీ కరిగిపోయేవీ, నీటిలో కలిసిపోనివీ కరిగిపోనివీ. చక్కెర నీటిలో కరిగిపోతుంది, నూనె అసలు కలవదు. నీటిలో కలవని దానిని కొవ్వు పదార్థం (fat) అంటాం. మన శరీరంలో కొవ్వు పదార్థాల నిల్వలు చాలా చోట్ల ఉన్నాయి. ముఖ్యంగా చర్మం కింద ఒక పొర కొవ్వు ఉంటుంది. ప్రతి జీవకణం చుట్టూ ఒక పొర కొవ్వు పదార్థం ఉంటుంది. అది లేకపోతే వానలో తడిశామంటే మనం కరిగిపోతాం! కొవ్వు పదార్థం మనకు ఎంత ముఖ్యమో ఇంతకంటే వివరంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ కొవ్వు నిల్వలో కూడా రెండు రకాలున్నాయి. చర్మం కిందా కణాల చుట్టూ ఉండేది ఒక రకం. పొట్టమీద, పొట్టలోపల, తొడలమీద, పిరుదులమీదా చేరేది ఇంకొక రకం. మొదటి రకం అవసరమైనది. రెండోది కూడా కొంత అవసరమే, కానీ ఎక్కువ అయితే జబ్బుకు కారణం అవుతుందని శాస్త్రజ్ఞుల అభిప్రాయం.

ఈ రెండో రకం కొవ్వు ఎక్కువ కావటం వల్ల డయబెటీస్ వస్తుంది, కీళ్ళనొప్పులూ నడుంనొప్పులూ  వస్తాయి. లారీ మీద లోడ్ ఎక్కువైతే టైర్లు పగిలిపోతాయని తెలుసుకదా? శరీరం విషయం కూడా అంతే. బరువెక్కువైతే కీళ్ళకూ నడుముకూ లోడ్ ఎక్కువయ్యి భరించడం కష్టం అవుతుంది. కానీ, ఈ డయబెటీస్ రావటం ఏమిటి? కొవ్వుకూ డయబెటీస్‌కూ సంబంధం ఏమిటి? దీని గురించి వివరంగా చెప్పాలంటే మనం మన పుట్టు పూర్వోత్తరాలదాకా వెనక్కి వెళ్ళాలి.

మనుషులూ మనుషుల్లాంటి జీవాలూ పుట్టి దాదాపు 10-20 లక్షల సంవత్సరాలు అయిందని ఒక అంచనా. ఈ సుదీర్ఘ మానవ చరిత్రలో ఎప్పుడూ తిండికి లోటే. మొదట ఏ చెట్టు కాయలు తినవచ్చు? ఏవి తింటే చచ్చిపోతాం? అనేది ఒక సమస్యగా ఉండేది. ఒకవేళ ఏదైనా తినటానికి దొరికినా మళ్ళా ఎప్పుడు దొరుకుతుందో తెలియదు. తిండి లేకుండా ఎంతకాలం ఉండాలో?  ఇలాంటి సమస్యలకు అలవడిన జంతువుల (మన పూర్వీకుల)  శరీరాల్లో కొన్ని మార్పులు (జీవ పరిణామ క్రమం, evolution వల్ల) వచ్చాయి. ఒకటి, తీపి పదార్థాలు ప్రమాదం లేనివి అని గ్రహించడం. అంటే పండిన కాయలు తింటే మనం చావం అని తెలుసుకోవడం. రెండోది, తిన్న వస్తువుని దేన్నీ విసర్జించకుండా దాచి పెట్టుకోవడం. అంటే ప్రస్తుత అవసరానికి మించి ఏమైనా తింటే శరీరం దాన్ని వెంటనే మలమూత్రాల ద్వారా విసర్జించదు. మళ్ళా ఎప్పుడు తింటామో తెలియదు కదా? అందువల్ల మిగిలిన పదార్థాన్ని దాచిపెడుతుంది. ఈ రెండు పరిణామాల ఫలితం ఏమిటో చూద్దాం.
 
లక్షల సంవత్సరాలపాటు తీపి వస్తువు అంటే విషవస్తువు కాదు అని ఎరిగిన మానవులు, ఈ మధ్య కాలంలో అసలు ఒక పదార్థం తియ్యగా ఉండటానికి కారణమైన వస్తువేదో కనుక్కున్నారు. నేరుగా దాన్నే తయారు చెయ్యడం నేర్చుకున్నారు. దాన్నే వంటకాల్లో అమితంగా వాడటం మొదలుపెట్టారు. “అబ్బా, ఎంత తియ్యగా ఉంది!” అనుకుంటూ మితిమీరి తిని, షుగర్ జబ్బు తెచ్చుకున్నారు. అదేమిటీ? ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది కొవ్వు గురించి కదా? మళ్ళా షుగర్ జబ్బు దగ్గరకు ఎందు కెళ్ళాం? ఇది కదా మీ ప్రశ్న? చెప్తాను. ఇందాక చెప్పానే దాచిపెట్టడం గురించి. మళ్ళా ఎప్పుడు తింటామో తెలియని శరీరం తిన్న ఆహారం నుంచి ప్రస్తుత అవసరానికి మించిన దాన్ని దాచిపెడుతుంది. ఈ దాచిపెట్టే క్రమంలో మనం కర్బనోదకాలు (starches, sugars, వగైరా) తిన్నా, కొవ్వుపదార్థాలు (fats) తిన్నా, ప్రాణ్యములు (proteins) తిన్నా, ఏం తిన్నా సరే, అవసరానికి మించిన పదార్థాన్ని కొంచెం తీపిజనిగా (glycogen), మిగతాదంతా కొవ్వుగా మార్చి దాచిపెడుతుంది.  ఉదకర్బనాలుగా ఎందుకు మార్చదు? ప్రాణ్యములను కూడా అలాగే దాచిపెట్టొచ్చుగదా? కొవ్వుగా ఎందుకు మార్చుతుంది?

ముందు ప్రాణ్యములు (proteins) గురించి మాట్లాడుకుందాం. (అసలు ప్రొటీన్స్‌ని మాంసకృత్తులు అని తెలుగులో ఎందుకు అంటారో గాని మాంసంలోనే కాదు, ఎన్నో ఆహారపదార్థాలలో ప్రొటీన్స్ ఉంటాయి. అవి లేని ప్రాణి లేదు.)  ప్రాణ్యములను  దాచిపెట్టడానికి వీలయిన అవయవాలు మన శరీరంలో లేవు. పైగా ప్రాణ్యములు మన శరీరంలో చాలా రకాల పనులు చేస్తాయి, కాని ఇంధనం లాగా దాచిపెట్టి అవసరానికి వాడుకోవడానికి తగినవి కాదు. అలా వాడుకోవడానికి తగిన పదార్థాలు కర్బనోదకాలు, కొవ్వుపదార్థాలూ మాత్రమే. అందువల్ల శరీరం అవసరానికి వాడుకోగా మిగిలిన దాంట్లో ఎక్కువ భాగాన్ని కొవ్వుగా మార్చి దాచిపెడుతుంది.

మన ఆహారంలో ఎక్కువ భాగం కర్బనోదకాలే. నూనెతో చేసిన వస్తువులు తప్ప మిగతా ఆహారంలో ఎక్కువ భాగం అవే. కానీ కర్బనోదకాలు నీళ్ళలో కలిసిపోతాయి. ఉదాహరణకు ఒక కిలో చక్కెర రెండు కిలోల నీటిని లాగేస్తుంది. అంటే ప్రస్తుత అవసరానికి పోగా మిగిలిన పదార్థాన్ని చక్కెరలాగా, లేక మరో కర్బనోదకం రూపంలో దాచిపెట్టాలంటే కిలోకి రెండు కిలోల నీళ్ళు కలిపి దాచిపెట్టాలన్న మాట. మనం కలపకపోయినా, అది శరీరంలో ఉన్న నీటిని లాగేస్తుంది. ఆరోగ్యంగా ఉన్న మనుషులు సగటున 70 కిలోల బరువుంటారు అనుకుందాం. అలాంటి మనిషి శరీరంలో 10 కిలోల నుంచి (మగవారు) 20 కిలోల (ఆడవారు) దాకా కొవ్వు ఉంటుంది. అదే కొవ్వు రూపంలో కాకుండా కర్బనోదకం (carbs) రూపంలో ఉంటే, నీరు పట్టడం వలన, మగవారు ఇంకో 20 కిలోలు, ఆడవారు ఇంకో 40 కిలోల బరువు ఉంటారు. అంటే సగటున మగవాళ్ళు 90 కిలోలు, ఆడవాళ్ళు 110 కిలోలు ఉంటారన్నమాట. కొవ్వు నీళ్ళలో కలవదు కాబట్టి నీరు పట్టదు. మనం అదృష్టవంతులం! మనం మితిమీరి తిన్నప్పుడు ఆ తిండిని పిండిపదార్థంగా మార్చి దాచిపెడితే మన బరువు సమస్య ఇంకా పెద్ద సమస్యగా మారేది.

సరే. ఇక తిండిని కొవ్వుగా మార్చడం, దాన్ని నిల్వ చెయ్యటం గురించి చెప్పుకుందాం. కొవ్వు దాచిపెట్టదానికీ షుగర్ జబ్బుకూ సంబంధం ఏమిటో చూద్దాం.

భోజనం చెయ్యగానే రక్తంలో గ్లూకోజ్ సాంద్రణ పెరుగుతుంది అని చెప్పుకున్నాం కదా? దాన్ని గమనించి పాంక్రియాస్ ఇన్సులిన్‌ను రక్తంలోకి పంపిస్తుంది. ఇన్సులిన్‌ ప్రభావంవల్ల గ్లూకోజ్ కండరాల్లోకి పోతుంది. అక్కడ తీపిజనిగా మార్చబడి నిల్వ అవుతుంది. కాలేయంలో కూడా కొంత తీపిజని తయారవుతుంది. ఇంకా మిగిలుంటే కాలేయంలోను, కొవ్వు గిడ్డంగుల్లోనూ కొవ్వుగా మార్చబడుతుంది.

ముందు కాలేయం గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ ఇన్సులిన్‌ ప్రభావం వల్ల కాలేయం పిండిపదార్థాలను కొవ్వుగా మార్చుతుంది. మార్చి రక్తంలోకి వదులుతుంది. అది కొవ్వు గిడ్డంగికి చేరి నిల్వ అవుతుంది. రక్తంలోంచి కొవ్వు పొట్టమీదా పిరుదులమీదా తొడలమీదా ఉన్న కొవ్వు గిడ్డంగుల కణాలకు చేరుతుంది. కొవ్వు కణాల సంఖ్య అందరిలోనూ ఒకే విధంగా ఉంటుంది. కొవ్వు చేరే కొద్దీ కణాలు పెద్దవి అవుతూ ఉంటాయి. పెద్దవి అయ్యేకొద్దీ వాటికి ఊపిరాడక ఇదివరకు మనం చెప్పుకున్న సమస్యలకు గురవుతాయి. అదే జబ్బుకు నాంది.

భోజనం చేసి మూడు నాలుగు గంటలు అయిందనుకుందాం. రక్తంలో గ్లూకోజ్ సాంద్రణ మామూలు కంటే కొంచెం తక్కువగా ఉంటుంది. అప్పుడు మనం కొంచెం దూరం నడిచొద్దాం అనుకున్నాం అనుకోండి. అప్పుడు రక్తంలో ఇన్సులిన్‌ తక్కువగాను, గ్లూకగాన్‌ ఎక్కువగానూ ఉంటాయి. గ్లూకగాన్‌ ప్రభావం వల్ల నడకకు కావాల్సిన శక్తి దాచిపెట్టి ఉంచిన తీపిజని నుంచీ కొవ్వు నుంచీ వస్తుంది. అంటే దాచిపెట్టడాన్ని ప్రభావితం చేసేది ఇన్సులిన్‌. వాడకాన్ని ప్రభావితం చేసేది గ్లూకగాన్‌.

అప్పుడప్పుడూ కొంచెం నడవటమో, మరొక విధమైన వ్యాయామం చెయ్యడమో ఆరోగ్యానికి మంచిది. బరువు తగ్గాలంటే వ్యాయామం చెయ్యాలని మీ డాక్టర్ చెప్పి ఉండవచ్చు. వ్యాయామం చేస్తే కొవ్వు కరిగిపోతుందా? ఎలాంటి వ్యాయామం? ఎంత సేపు చెయ్యాలి? ఇప్పుడు వీటి గురించి మాట్లాడుకుందాం.

ఇందాక మిగిలిన ఆహారాన్ని దాచిపెట్టడం గురించి మాట్లాడుకున్నామే. కొంత తీపిజనిగానూ మిగతాది కొవ్వుగానూ మార్చి దాచిపెడుతుంది మన శరీరం. నిజానికి దాచిపెట్టిన తీపిజని మహా అయితే 500 గ్రాములు ఉంటుంది. మిగతాది అంతా కొవ్వు. మనం ఒక్క రోజు ఉపవాసం ఉంటే, మొదట శరీరం వాడేది ఈ దాచిపెట్టిన తీపిజనినే. దానికి కారణం ఏమిటంటే మెదడుకు గ్లూకోజ్ కావాలిగదా? తీపిజనిని ముక్కలు చేసి గ్లూకోజ్‌ను విడుదల చేసి రక్తంలోకి వదులుతుంది కాలేయం. అది ఒక్క రోజుకు సరిపోతుంది.

ఎక్కువ రోజులు పస్తుంటే అప్పుడు శక్తి కోసమూ మెదడుకి సరఫరా చెయ్యాల్సిన గ్లూకోజ్ కోసమూ మార్గాలు వెతకాలి. శక్తికి కొవ్వును వాడుకోవచ్చు. కాని గ్లూకోజ్ విషయంలో ఒక పెద్ద తిరకాసు ఉంది. ఆహారంలో ఉన్న గ్లూకోజ్‌నూ మిగతా పిండిపదార్థాలనూ సులభంగా కొవ్వుగా మార్చి దాచిపెట్టగల మన శరీరం కొవ్వును గ్లూకోజ్‌గా మార్చలేదు. అందువల్ల గ్లూకోజ్‌ అవసరం ఎలా తీరాలి? శరీరంలో ఉన్న మాంసకృత్తులను గ్లూకోజ్‌‌గా మార్చాలి. ఈ పని మన శరీరం చెయ్యగలదు. కానీ, మాంసకృత్తులు ఏదో ఒక పనిచేస్తూ ఉంటాయి కదా? వాటిని మెదడుకు అవసరమైన గ్లూకోజ్‌గా మార్చితే మరి వాటి పనులు ఎలా జరుగుతాయి? ఇదీ సమస్య. చాలా రోజులు పస్తున్నప్పుడు మాంసకృత్తులను ఇంధనంగా వాడుకోవడం వల్ల శరీరం క్షీణిస్తుంది. మిగతా శరీరానికి శక్తికోసం కొవ్వు నిల్వను వాడుకోవచ్చు. సగటు మనిషిలో దాదాపు 40-50 రోజులకు సరిపోయే కొవ్వు ఉంటుంది. కానీ మెదడుకూ ఎర్ర రక్తకణాలకూ గ్లూకోజ్ సరఫరా చేసే ప్రయత్నంలో శరీరం తనను తానే క్రమంగా వాడుకుంటుంది. వంట చెరుకుకోసం ఇంటి దూలాలను చీల్చడం లాగ!

వ్యాయామం గురించి మాట్లాడుకుంటూ చాలా దూరం వచ్చేశాం. బరువు తగ్గాలంటే వ్యాయామం చెయ్యాలి. ఎలాంటి వ్యాయామం? నిజానికి మామూలు పరిస్థితుల్లో కండలు, కాలేయమూ తమ అవసరాల కోసం కొవ్వును వాడతాయి. అందువల్ల ఎలాంటి వ్యాయామం చేసినా కొవ్వు వాడుక పెరుగుతుంది. కొవ్వు నిల్వ తగ్గుతుంది.

బరువు తగ్గాలంటే రెండే మార్గాలు. మితిమీరి తినడం మానెయ్యడం. శారీరిక శ్రమ గానీ వ్యాయామం గానీ చెయ్యడం.

ఈ మధ్య అమెరికాలో ‘లో ఫాట్ ఫుడ్స్’ (కొవ్వు తక్కువగా ఉన్న ఆహారాలు) బాగా ప్రచారంలోకి వచ్చాయి. దుకాణాల్లో చాలావస్తువుల మీద ‘జీరో ఫాట్’ (కొవ్వు లేనివి) అని, ‘లో ఫాట్’ (కొవ్వు తక్కువగా ఉన్నవి) అనీ రాసుంటుంది. ఉదాహరణకు పెరుగు గురించి మాట్లాడుకుందాం. కొవ్వు తక్కువగానో అసలు లేకుండానో ఉన్న పెరుగు షాపుల్లో దొరుకుతుంది. కానీ ఆ డబ్బాలమీద ఉన్న వివరాలు చూస్తే ఈ పెరుగుల్లో చక్కెర అధికంగా ఉంటుంది. కొవ్వు తీసేసి చక్కెర వేసినందువల్ల మనకు ఒరిగేది ఏమీ లేదు. చక్కెరను మన శరీరం సులభంగా కొవ్వుగా మారుస్తుంది! అందువల్ల కొవ్వు తక్కువగా చక్కెర ఎక్కువగా ఉన్న ఆహారాలు బరువు తగ్గడానికి ఉపయోగపడవు. పైగా వీటిని మామూలు పదార్థాలకంటే ఎక్కువ ధరకు అమ్ముతూంటారు!
 
ఆరోగ్యంగా ఉన్న మనిషిలో కాలేయం కొవ్వును తయారుచేస్తుంది. అది రక్తం ద్వారా కొవ్వు నిల్వకు చేరుతుంది. అవసరం అయినప్పుడు కొవ్వు నిల్వ కొంత కొవ్వును కరిగించి రక్తంలోకి వదులుతుంది. అది అన్ని అవయవాలకూ (మెదడూ ఎర్ర రక్తకణాలకూ తప్ప) చేరుతుంది. ఇలా జరుగుతూ ఉంటే ఏమీ ప్రమాదం లేదు. కానీ కొవ్వు నిల్వలో చోటు లేదనుకుందాం. రక్తంలో తిరుగుతున్న కొవ్వుకు మరోచోటుకు వెళ్ళే అవకాశంలేదు. రక్తంలో కొవ్వు ఎక్కువయ్యేకొద్దీ కాలేయంలో తయారయిన కొవ్వు కాలేయంలోనే నిలబడి పోవటం ఎక్కువవుతుంది. అలా జరిగినప్పుడు కాలేయం సరిగ్గా పనిచెయ్యదు. మీకు జ్ఞాపకం ఉండే ఉంటుంది. ఇన్సులిన్‌ పనిచెయ్యాలంటే కాలేయం ఆరోగ్యంగా ఉండటం చాలా అవసరం. అది పనిచెయ్యకపోతే ఇన్సులిన్‌ పనిచెయ్యదు. షుగర్ జబ్బు మొదలవుతుంది. ఇదీ కొవ్వుకూ షుగర్ జబ్బుకూ సంబంధం. బరువు ఎక్కువగా ఉన్నవారిలో చాలామందికి షుగర్ జబ్బు వస్తుందనటానికి కారణం ఇదే.

అందువల్లే మీకు షుగర్ జబ్బు ఉందో లేదో పరీక్ష చేసేటప్పుడు డాక్టర్లు మీ రక్తంలో కొవ్వు ఎంత ఉందో కూడా చూస్తారు. దీన్ని ట్రైగ్లిసరైడ్స్ (Triglyserides) అని అంటారు డాక్టర్లు. అది ఎక్కువగా ఉంటే కాలేయంలో కొవ్వు నిల్వ ఉందేమో పరీక్ష చేస్తారు. ఉంటే దాన్ని ఫాటీ లివర్ (Fatty liver) అంటారు. రక్తంలో గ్లూకోజ్ ఎక్కువ ఉండటం లాగే ట్రైగ్లిసరైడ్స్ ఎక్కువగా ఉండటం, ఫాటీ లివర్ – ఇవి కూడా షుగర్ జబ్బు రావడానికి, లేక అప్పటికే ఉండటానికీ సూచనలు. ఈ పరిస్థితి రాకుండా చూసుకోవాలంటే మితంగా తినాలి. తీపి పదార్థాల, కొవ్వు పదార్థాల వాడుక తగ్గించాలి. శారీరిక శ్రమ గానీ వ్యాయామం గానీ చేస్తూ ఉండాలి.  

8. డయబెటీస్, బీపీ స్నేహితులా?

 
ఈమధ్య ‘మీకు షుగరూ, బీపీ ఉన్నాయా?’ అని అడుగుతున్నారు. డయబెటీస్ ఉన్నవాళ్ళకు సాధారణంగా బీపీ కూడా ఉండటం అందరికీ తెలిసిన విషయమే. రక్త పరీక్షలు చేసి డయబెటీస్ ఉందని డాక్టర్ చెప్పినప్పుడు బీపీ లేకపోవచ్చు. కొంత కాలం తర్వాత రావచ్చు. కానీ డయబెటీస్ ఉండి, బీపీ రాకుండా ఉండటం చాలా అరుదు. అందువల్లనే ఈ రెండింటిని ఒకే ‘మెటబాలిక్ సిండ్రోమ్’ యొక్క బాహ్య లక్షణాలు అని వైద్యులు అభివర్ణిస్తూ ఉంటారు. అనగా, ఈ రెండింటికి మూలకారణాలు ఒక్కటే! ఎందువల్ల డయబెటీస్‌కి, బీపీ‌కీ ఇంత దగ్గర సంబంధం ఎలా ఏర్పడింది?
 
డయబెటీస్ అంటే ఏమిటో మనకు తెలుసు. బీపీ అంటే ఏమిటో కూడా తెలుసుకుందాం. బీపీ అంటే బ్లడ్  ప్రెషర్. బ్లడ్ ప్రెషర్ అంటే రక్తనాళాల్లో ప్రవహించే రక్తం ఆ రక్తనాళాల మీద పెట్టే ఒత్తిడి. ఆ ఒత్తిడి బ్రతికున్న వాళ్ళందరికీ ఉంటుంది! అది మితిమీరి ఎక్కువగా ఉండటాన్నే డాక్టర్లు ‘హైపర్ టెన్షన్’ అంటారు, సాధారణ ప్రజలు బీపీ అంటున్నారు. దీని గురించి కొంచెం వివరంగా తెలుసుకుందాం.
 
రక్తం ద్వారా శరీరంలో అన్ని కణాలకూ ఆమ్లజని (oxygen) చేరుతుంది, గ్లూకోజ్ చేరుతుంది. నిజానికి గ్లూకోజే కాదు, కణాలకు అవసరమైన పోషక పదార్థాలన్నీ రక్తం ద్వారానే చేరతాయి. కణాలు విసర్జించే పదార్థాలను రక్తం ఊపిరి తిత్తులకూ, మూత్రకోశాలకూ తీసుకెళ్తుంది.
 
పొలాలకు నీళ్ళు పట్టాలంటే పెద్ద కాలువనుంచి చిన్న కాలువలు, వాటినుంచి ఇంకా చిన్న కాలువలు, అలా తవ్వుకుంటూ వచ్చి చివరికి ఒక సన్నటి కాలువనుంచి పొలంలోకి నీళ్ళు మళ్ళిస్తారు. ఎత్తు నుంచి పల్లానికి నీరు దానంతట అదే ప్రవహిస్తుంది. అలాకాకుండా బావినుంచో, చెరువునుంచో ఎత్తుగా ఉన్న పొలంలోకి నీళ్ళు పెట్టాలంటే పంపు కావాలి. మన శరీరంలో రక్తప్రవాహం ఈ రెండిటికీ మధ్య రకంగా ఉంటుంది. రక్తప్రవాహం పంపుతో నీళ్ళు పెట్టడం లాంటిది. మన పంపు గుండె. దాన్నుంచి ఒక పెద్ద గొట్టం మొదలయి, అది చిన్నగొట్టాలుగా చీలి, వాటినుంచి ఇంకా చిన్నగొట్టాలు చీలి, అలా చీలుతూ చివరికి చాలా సన్నటి గొట్టాల ద్వారా ప్రతి అణువుకూ రక్తం చేరుతుంది.
 
పొలాలకు కాలువల ద్వారానో, పంపుతోనో పెట్టే నీరు భూమిలో ఇంకిపోతుంది. రక్తం అలాకాదు. కణాలకు వాటికి కావలసిన పదార్థాలనూ, ప్రాణవాయువునూ అందించి, అవి విసర్జించిన బణువులనూ, బొగ్గుపులుసు వాయువునూ తీసుకుని గుండెకు చేరుతుంది. తిరుగు ప్రయాణంలో సన్నటి నాళాలు కలిసి పెద్దవి అవుతాయి, అవి కలిసి ఇంకా పెద్దవి అవుతాయి, ఇలా కలుసుకుంటూ వచ్చి చివరకు ఒక పెద్ద గొట్టం ద్వారా ఈ కలుష రక్తం గుండెకు చేరుతుంది.
 


బొమ్మ 3. రక్త ప్రసరణ వ్యవస్థ.

మరి ఈ కలుష రక్తం మంచి రక్తంతో కలిసిపోతే ఎలా? అందుకే అవి రెండూ కలవవు. నిజానికి గుండెలో రెండు పంపులు, నాలుగు అరలూ ఉన్నాయి. శరీరం నుంచి వచ్చే కలుష రక్తం కుడివైపున్న పై అరకు చేరి, అక్కడ నుంచి కింది పంపులోకి వస్తుంది. ఆ పంపు కొట్టుకున్నప్పుడు ఆ రక్తం ఊపిరితిత్తులకు చేరుతుంది. అక్కడ బొగ్గుపులుసు వాయువును వదిలేసి ప్రాణవాయువును పట్టుకుని రక్తం గుండెకు ఎడమవైపు పైన ఉన్న అరలోకి వచ్చి, అక్కడనుంచి దాని కింద ఉన్న పంపు ద్వారా శరీరమంతటికీ పంపబడుతుంది. మంచి రక్తాన్ని శరీరానికి పంపే ఎడమ పంపూ, కలుష రక్తాన్ని ఊపిరితిత్తులకు పంపే కుడి పంపూ ఒకేసారి కొట్టుకుంటాయి. అలా నిముషానికి 60-80 సార్లు కొట్టుకుంటాయి. ఒక్కోసారి కొట్టుకున్నప్పుడు దాదాపు 60 మిల్లిలీటర్ల రక్తం ప్రసారం అవుతుంది.

గుండె కొట్టుకున్నప్పుడు రక్తం ప్రవహిస్తూ రక్తనాళాల గోడల మీద పెట్టే ఒత్తిడిని మనం బ్లడ్ ప్రెషర్ అంటాం. ఇది ఎంత ఉండాలి? ఎంత ఉంటే ఆరోగ్యంగా ఉన్నట్లు? ఎంత ఉంటే ప్రమాదం? ఆరోగ్యంగా ఉన్న వారిలో బ్లడ్ ప్రెషర్ 120/80 కంటే తక్కువగా ఉండాలంటారు డాక్టర్లు. 120 సంఖ్య గుండె కొట్టుకున్నప్పుడు ఈ గోడలమీద పెట్టే ఒత్తిడి. 80 సంఖ్య గుండె మళ్ళా కొట్టుకునే ముందు రక్తనాళాల గోడల మీద రక్తం ప్రవహిస్తూ చేసే ఒత్తిడి. (దీన్ని విరామస్థానం అనీ విశ్రమ స్థానం అనీ అంటారు, కానీ గుండెకు విరామం, విశ్రమం లేవు; రెండు సార్లు కొట్టుకునే మధ్యకాలంలో అని చెప్పవచ్చు.) ఈ 120, 80 సంఖ్యలు బీపీని ఎక్కడ చూస్తున్నారా (కొలుస్తున్నారా) అన్న దాని మీద అధారపడి ఉంటుంది. మామూలుగా మోచేతి ధమని (బ్రాకియల్ ఆర్టరీ, brachial artery) మీద బీపీ చూస్తారు. మరొకచోట చూస్తే ఈ సంఖ్యలు వేరుగా ఉండవచ్చు.
 
మోచేతిమీద బ్లడ్ ప్రెషర్ చూసినప్పుడు అది 140/90 గానీ అంతకంటే ఎక్కువగానీ ఉంటే ఆ మనిషికి బీపీ ఉంది అంటారు డాక్టర్లు. కానీ ఒక్కసారి ఎక్కువ ఉన్నంత మాత్రాన బీపీ ఉంది అని తేల్చకూడదు. డాక్టర్ దగ్గరకు పోయే ఆలోచనే బీపీని పెంచవచ్చు. డాక్టర్ ఆఫీసులో సరంజామా చూడగానే కలిగే ఒత్తిడి వల్ల కూడా తాత్కాలికంగా బీపీ పెరగవచ్చు.
 
ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన విషయం – బీపీ ఎందుకు పెరుగుతుంది? సాధారణంగా సమస్య బీపీ పెరగటమే అయినా, కొద్దిమందికి బీపీ తక్కువవుతుందని మీరు వినే ఉంటారు. అలా ఎందుకు జరుగుతుందో కూడా తెలుసుకుందాం.

ఒక బావి నుంచి పంపు ద్వారా మొక్కలకు నీళ్ళు పోస్తున్నారనుకుందాం. పంపుకు ఒక మెత్తటి గొట్టం జతపరిచి ఉంది. నీళ్ళు గొట్టం  గుండా వస్తున్నాయి. గొట్టం వెడల్పు ఒక సెంటిమీటర్ అనుకుందాం. నీళ్ళు నెమ్మదిగా వస్తున్నాయి. కొంచెం దూరంలో ఉన్న మొక్కకు నీళ్ళు పొయ్యాలంటే మీరు ఆ మొక్క దగ్గరకు వెళ్ళి పొయ్యొచ్చు, లేక గొట్టం మూతికి వేలు అడ్డం పెట్టి కొంచెం మూసెయ్యొచ్చు. గొట్టం మూతి వెడల్పు తగ్గేకొద్దీ నీళ్ళు ఇంకొంచెం దూరంగా పడతాయి. ఆ మొక్కదాకా పోతాయి. గొట్టం మూతిని పూర్తిగా మూసేస్తే నీళ్ళు పంపటానికి ప్రయత్నం చేస్తున్న పంపు మీద భారం పెరుగుతుంది. గొట్టం పల్చటిదయితే అది ఉబ్బుతుంది, లేక దానికి చిల్లులుపడి నీరు కారిపోతుంది, లేదా గొట్టం పగిలిపోతుంది. గొట్టానికి వేలు అడ్డం పెడితే దాని మీద  ఒత్తిడి పెరిగినట్లే రక్తనాళాల వెడల్పు తగ్గితే అవి కారటమో, పగిలి పోవటమో జరగవచ్చు. లేక రక్తనాళాల ఒత్తిడి భరించగలిగితే, పంపు (గుండె) మీద ఒత్తిడి పెరగవచ్చు. మీరు గమనించే ఉంటారు – వెడల్పుగా ఉన్న గొట్టాన్ని (బెలూన్‌ని గానీ) ఊదటం కంటే సన్నటి గొట్టాన్ని ఊదటానికి ఎక్కువ శక్తి కావాల్సొస్తుంది. గుండె విషయంలో కూడా, సన్నటి రక్తనాళాల ద్వారా రక్త ప్రసారం చెయ్యడానికి ఎక్కువ శక్తి అవసరం అవుతుంది, వెడల్పాటి నాళాలయితే సులభంగా ఉంటుంది.
 
రక్తనాళాల మీద ఒత్తిడి పెరగడానికి ముఖ్యమైన కారణాలు: 1. వాటి  గోడలకు లోపల ఏదన్నా అతుక్కుని వెడల్పు తగ్గడం, 2. ఏదైనా పెద్దవస్తువు నాళానికి అడ్డంపడి దాన్ని పూర్తిగా మూసెయ్యడం, 3. శరీర అవసరాన్ని బట్టి హార్మోనుల ద్వారా రక్తనాళాలను సన్నబడేట్లు చెయ్యడం, 4. రక్త పరిమాణం పెరగడం,  5. ఆహార పదార్థాలు. ఒక్కోదాని గురించి వివరంగా తెలుసుకుందాం.
 
రక్తనాళాలకు కొలెస్టెరోల్ (cholesterol) అనే జిగట పదార్థం అతుక్కోవచ్చు: కొలెస్టెరోల్ వల్ల గుండె జబ్బు వస్తుందని డాక్టర్లు చెబుతూ ఉంటారు. కొలెస్టెరోల్ ఒక రకమైన జిడ్డు (కొవ్వు) పదార్థం. మనం వేపుడు కూరలు చేసినప్పుడు పాత్రలకు నూనె అతుక్కున్నట్లే, కొలెస్టెరోల్ మన రక్తనాళాల ద్వారా ప్రవహిస్తూ రక్తనాళాల గోడలకి అతుక్కుంటుంది. రక్తంలో కొలెస్టెరోల్ ఎక్కువయ్యేకొద్దీ ఇలా అతుక్కోవటానికి అవకాశం ఎక్కువవుతుంది. అందువల్ల రక్తంలో కొలెస్టెరోల్ ఎంత తక్కువగా ఉంటే అంత మంచిది. కానీ దాని అర్థం శరీరంలో కొలెస్టెరోల్ తక్కువగా ఉంటే మంచిది అని కాదు. కొలెస్టెరోల్ శరీరానికి చాలా అవసరం. అది తగిన మోతాదులో ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉండగలం. మన శరీరంలో ప్రతి కణం మీదా ఉన్న పొరలో కొలెస్టెరోల్ ఉండాలి. లేకపోతే ఆ పొరలు మెత్తగా ఉండవు. శరీరం కొయ్యబారి పోయినట్లు అవుతుంది. మన ఆహారంలో ఉన్న కొవ్వు పదార్థాలు జీర్ణం కావాలంటే కొలెస్టెరోల్  అవసరం. కొలెస్టెరోల్ నుంచి సబ్బు లాంటి పదార్థాలను తయారుచేసి జీర్ణకోశంలోకి పంపుతుంది కాలేయం. ఈ సబ్బు ఆహారంలోని కొవ్వు పదార్థాలను చిన్న చిన్న ముక్కలుగా చేసి సులభంగా జీర్ణం అయ్యేట్లు చేస్తుంది. లైంగికతకూ, బిడ్డలు పుట్టడానికీ  కారణమైన హార్మోనులు కొలెస్టెరోల్ నుంచే ఉత్పత్తి అవుతాయి. ఈ కారణాలవల్ల మనం కొలెస్టెరోల్ లేకుండా బతకలేం. మరి ఆహారంలో కొలెస్టెరోల్ ఉండాలి కదా? ఎంత ఉండాలి? ఈ ప్రశ్నలకు మనం సహజంగా ఊహించలేని సమాధానం ఏమిటంటే మనం కొలెస్టెరోల్ ఉన్న ఆహారాలు తినాల్సిన అవసరం లేదు. మనం తినే పిండిపదార్థాలనుండి, కొవ్వుపదార్థాలనుండీ మన శరీరానికి కావాల్సినంత కొలెస్టెరోల్ కాలేయం తయారు చేస్తుంది. సగటున రోజుకు దాదాపు 1500 మిల్లిగ్రాములు తయారవుతుందని ఒక అంచనా. కానీ ఆహారంలో కొలెస్టెరోల్ ఉంటే కాలేయం తక్కువ తయారు చేస్తుంది. లేక ఎక్కువ ఉన్న దాన్ని మలం ద్వారా విసర్జిస్తుంది.
 
కొలెస్టెరోల్‌తో ముఖ్యమైన సమస్య రవాణా సమస్య. కాలేయంలో తయారయ్యే కొలెస్టెరోల్ అన్ని అవయవాలకూ చేరాలి. ఈ రవాణా రక్తం ద్వారా జరగాలి. ఈ రవాణా చెయ్యడానికి కొలెస్టెరోల్‌ను మూటలుగా కడుతుంది కాలేయం. ఆ మూటలను (లేదా, బంగీలను) అవయవాలు గుర్తించలేకపోతే అవి  రక్తంలో తిరుగాడుతూ ఉంటాయి. వాటిలో ఉన్న కొలెస్టెరోల్‌ని డాక్టర్లు చెడ్డ కోలెస్టెరాల్ (LDL) అంటారు. చెడ్డ కొలెస్టెరోల్ పెరిగే కొద్దీ ఈ మూటలు రక్తనాళాలకు అతుక్కునే అవకాశం పెరుగుతుంది. ఇదీ కొలెస్టెరోల్ వల్ల రక్త నాళాలు సన్నబడటానికి కారణం.
 
శరీర కణాలకు అవసరం లేని కొలెస్టెరోల్, చచ్చిపోయిన కణాలలోని కొలెస్టెరోల్, రక్తం ద్వారా కాలేయానికి చేరతాయి. ఇలా రక్తం ద్వారా కాలేయానికి చేరే కొలెస్టెరోల్‌ని మంచి కొలెస్టెరోల్ (HDL) అంటారు. కాలేయం ఈ కొలెస్టెరోల్‌ని సబ్బుగా మార్చి ఆహారం జీర్ణం కావటానికి జీర్ణకోశంలోకి పంపిస్తుంది, అక్కడనుంచి మలంగా విసర్జిస్తుంది.
 
చెడ్డ కొలెస్టెరోల్‌ని తగ్గించడానికిగానీ మంచి కొలెస్టెరోల్‌ని ఎక్కువ చెయ్యడానికిగానీ మనం చెయ్యగలిగిందేమైనా ఉందా? చెడ్డ  కొలెస్టెరోల్ మూటలున్నాయే, అవి కొలెస్టెరోల్‌నే కాదు, రకరకాల ఇతర  కొవ్వు పదార్థాలను కూడా కాలేయం నుంచి అవయవాలకు మోసుకెళ్తాయి. మనం ఇది వరకే కొవ్వు పదార్థాల గురించి మాట్లాడుకున్నాం. ఆహారంలో అవసరానికి మించిన పిండి పదార్థాలను శరీరం కొవ్వు పదార్థాలుగా మార్చి కొవ్వు నిల్వలకు పంపుతుంది. అలా పంపేటప్పుడు కొలెస్టెరోల్‌ని కూడా ఆ మూటల్లోనే  జతపరుస్తుంది. దీన్నే మనం ‘చెడ్డ కొలెస్టెరోల్’ అనేది. అందువల్ల మితిమీరి తినడం మానెయ్యడం వల్ల చెడ్డ కొలెస్టెరోల్ తగ్గుతుంది. ఇక మంచి కొలెస్టెరాల్ విషయానికొస్తే  వ్యాయామం చెయ్యడం వలన, బరువు తగ్గడం వలన, సిగరెట్లు తాగడం మానెయ్యడం వలనా మంచి  కొలెస్టెరాల్ ఎక్కువ అవుతుంది.
 
రక్తనాళానికి రక్తపు గడ్డ (clot) అడ్డం పడటం: మనకు ముల్లు గుచ్చుకుంటేనో, లేక చర్మం గీరుకుపోతేనో రక్తం కారి కొంచెం సేపట్లో గడ్డ కడుతుంది. ఇంకొంచెం సేపట్లో అది ఎండిపోతుంది. శరీరం లోపల మనకు కనపడని రక్తనాళాలకు కూడా అప్పుడప్పుడూ దెబ్బలు తగులుతాయి. ఒక రక్తనాళానికి చెడ్డ కొలెస్టెరోల్ అతుక్కుందనుకుందాం. అలా అతుక్కున్న కొలెస్టెరోల్ కొంత కాలం తర్వాత ఊడొచ్చి ప్రవాహంలో కొట్టుకుపోవచ్చు. అలా ఊడినప్పుడు రక్తనాళంనుంచి కొన్ని కణాలు దాంతో ఊడిపోవచ్చు. మీరు గోడమీద ఏదైనా బంక అతికించి అది ఎండిపోయిన తర్వాత పీకెయ్యడానికి ప్రయయత్నిస్తే బంకతోబాటు గోడమీద ఉన్న సున్నం కూడా (లేక పెయింట్) బంకతో ఊడివస్తుందే, అలా. రక్తనాళం కణాలు ఊడిపోవటం అంటే దెబ్బ తగలటం లాంటిదే. కణాలు ఊడిన చోట రక్తం కారిపోకుండా అక్కడ రక్తం గడ్డ కడుతుంది. కొంత కాలం తర్వాత ఈ గడ్డ ఊడిపోవచ్చుకూడా. ఇలా ఊడిన చెడ్డ  కొలెస్టెరోల్ గానీ, రక్తం గడ్డలు గానీ సన్నటి రక్తనాళాలకు అడ్డం పడ్డాయంటే అవి మూసుకుపోతాయి, ఆయా రక్తనాళాల మీద ఆధారపడే అవయవాలు చచ్చిపోతాయి. ఊడిపోకుండా అలాగే వున్నంతకాలం కొలెస్టెరోల్ గానీ రక్తం గడ్డలు గానీ రక్త నాళాల వెడల్పు తగ్గిస్తాయి, బ్లడ్ ప్రెషర్ పెంచుతాయి.
 
శరీర అవసరాలనుబట్టి మన ప్రమేయం లేకుండానే రక్తనాళాల మీద ఒత్తిడి పెరగవచ్చు, తగ్గవచ్చు. ఉదాహరణకు చర్మానికి రక్తం సరఫరా చేసే నాళాలు చలికి సన్నబడతాయి. భయపడినప్పుడు గుండె వేగంగా కొట్టుకుంటుంది, రక్తనాళాలు సన్నబడతాయి. వ్యాయామం చేసేటప్పుడు కండరాలకు రక్తం సరఫరా చేసే నాళాలు వెడల్పవుతాయి, చర్మానికి పోయే నాళాలు సన్నబడతాయి. తిష్ఠ (infection) ఉన్న చోట రక్త నాళాలు వెడల్పవుతాయి, నిష్యందిస్తాయి (లీక్ అవుతాయి). ఇవన్నీ మన ప్రయత్నం లేకుండానే జరుగుతాయి. కానీ రోజూ వ్యాయామం, ప్రాణాయామం చెయ్యడం ద్వారా బీపీ తగ్గవచ్చుననడానికి చాలా ఆధారాలున్నాయి.
   
బీపీ ఎక్కువ కావడానికి రక్తనాళం కైవారం  తగ్గడమే కాదు, రక్త పరిమాణం (volume) ఎక్కువ కావటం కూడా  కారణం కావచ్చు. రక్తం ఎక్కువ కావడానికి చాలా కారణాలు ఉండవచ్చు. వాటిలో రక్తంలో గ్లూకోజ్ గాని, లవణం (salt) గానీ ఎక్కువగా ఉండటం ముఖ్యమైనవి. ఎందువల్లో ముందు తెలుసుకుందాం. నీరు ఎక్కువ సాంద్రణ ఉన్న వైపునుంచి తక్కువ సాంద్రణ ఉన్న వైపుకు ప్రవహిస్తుంది. దీన్ని అభిసరణం (osmosis) అంటారు.  నీటిలో కలిసిపోయే  పదార్థాలు,  లవణాలూ  లేని  నీటిని  మంచినీరు  అందాం.  మంచినీటి  సాంద్రణ అత్యధికంగా ఉంటుంది. నీటిలో  ఏదైనా కరిగిపోయినప్పుడు, ఆ కరగడానికి కొంత నీరు వాడుకలో ఉంది కాబట్టి నీటి సాంద్రణ తగ్గుతుంది. అంటే నీళ్ళలో కరిగి ఉన్న పదార్థాలు ఎక్కువయ్యేకొద్దీ నీటి సాంద్రణ తక్కువ  అవుతుంది. సాధారణంగా రక్తంలోనూ రక్తనాళాల కణాల్లోనూ నీటి సాంద్రణ సమానంగా ఉంటుంది. రక్తంలో ఉప్పు గానీ గ్లూకోజ్ గానీ ఎక్కువగా ఉంది అనుకుందాం. రక్తంలో  నీటి సాంద్రణ పడిపోయి రక్త నాళాల కణాలనుంచి నీరు రక్తంలోకి వస్తుంది. రక్తం పరిమాణం పెరుగుతుంది. బీపీ ఎక్కువవుతుంది. అందువల్ల ఆహారంలో ఉప్పు గానీ గ్లూకోజ్ గానీ, అలా నీటిలో కరిగిపోయే పదార్థం ఏదైనా మితిమీరి తింటే, బీపీ పెరుగుతుంది. అందువల్లే చక్కెర ఎక్కువగా ఉండే పానీయాలు తాగటం వల్ల షుగర్ జబ్బు రావడమేగాక బీపీ ఎక్కువ కావడం కూడా జరగవచ్చు. ఉప్పు ఎక్కువ వాడటం వల్ల బీపీ రావడానికి కారణం కూడా ఇదే.

9. డయబెటీస్ బారిని పడకుండా మనం నిత్యజీవితంలో తీసుకోగలిగే చర్యలకి సూచనలు:

  1. నిత్య కార్యకలాపాలలో శరీరం శ్రమించేలా ఒళ్ళు వంచి పనులు చేసుకొండి. ఉదాహరణకి వీలయినంత మేరకి నడవండి, మేడ మెట్లు ఎక్కండి, ఇంట్లోనూ, పెరట్లోను మీ పనులు మీరు చేసుకొండి. ఇవేమీ కుదరకపోతే రోజూ ఒక గంట సేపు నడవండి.
  2. ఊబకాయం మంచిది కాదు. మీ పొడుగుకి తగ్గ బరువుంటేనే ఆరోగ్యకరం. ఈ సమస్య కొంత వరకు జన్యు సంబంధితం. పరిష్కారం కొంత వరకు మన చేతుల్లోనే ఉంది. శరీరం అనే యంత్రం నడవడానికి కార్బులు ఇంధనంలా పని చేస్తాయి; అలాగని వాటి వాడకం మితి మీరకూడదు. ఉదాహరణకి పంచదార కూడా కార్బుల జాతిదే. కానీ పంచదార తినడం తగ్గిస్తే గుండె ఆరోగ్యానికి మంచిది, రక్తపు పోటు, కొలెస్టరోల్  విలువలు తగ్గుతాయి. ఎక్కువ పంచదార తింటే ఇన్సులిన్ ఉత్పత్తి పెరుగుతుంది, తద్రూపేణా రక్తపు పోటు పెరుగుతుంది.
  3. ఆహారం  విషయంలో ఆరోగ్యసూత్రాలు పాటించండి. అనగా, మోతాదు మీరి తినడం, తాగడం తగ్గించండి. మీ పరిసరాలలో దొరికే కాయగూరలు, పళ్ళు, అన్ని రకాలు తినండి.
  4. తీపి సోడాలు (పంచదార కలిపినవి, తీపి కోసం కృత్రిమ రసాయనాలు కలిపినవి), పళ్ళ రసాలు తాగడం తగ్గించండి. వాటి స్థానంలో మంచినీళ్ళు, సోడా నీళ్ళు, కొబ్బరి నీళ్ళు, పాలు, నిమ్మ మజ్జిగ, తరవాణి, చక్కెర లేని కాఫీ, టీ, వగైరాలు మంచివి. తీపి తినుబండారాలు, మిఠాయిలు, కేకులు, పండుగలలో మితంగా తింటే పరవాలేదు కానీ, దినదినము వాటిని చిరుతిళ్ళలా తినడం మంచిది కాదు.
  5. మద్యపానీయాల మోతాదు మించనీయకండి. (అనగా, వారాంతంలో, ఒక్కసారి,  8 ఔన్సుల ద్రాక్ష సారా కానీ, 12 ఔన్సుల బీరు కానీ సమ్మతమే!)
  6. శాకాహారాలు (కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, పిక్కలు, గింజలు, వగైరా) ఎక్కువగా తినండి. శాకాహారాలలో ఉండే విటమినులు, ఖనిజ లవణములు, కర్బనోదకాలు (పిండి పదార్థాలు, పీచు పదార్థాలు, చక్కెరలు) ఆరోగ్యానికి మంచివి.
  7. పాలు, పెరుగు, వెన్న వగైరా పాడి పదార్థాలు తినండి. గుడ్లు, జలపుష్పాలు (చేపలు) తినొచ్చు కానీ ఎర్రటి మాంసం తగ్గించండి.
  8. పేకెట్లలో దొరికే ‘తయారయిన’ (processed) పదార్థాలు తినడం తగ్గించండి. చిరుతిళ్ళు (snacks) తినేటప్పుడు అవి ఎలా తయారు చేసేరో తెలుసుకొండి.
  9. వరి అన్నానికి అలవాటు పడ్డవారు అన్నంలో పప్పు, కూర, పులుసు, పెరుగు కలుపుకోడానికి బదులు పప్పు, కూర, పులుసు, పెరుగులలో అన్నం కలుపుకు తినండి; అనగా, అన్నం పాలు తక్కువ, ఆధరవుల పాలు ఎక్కువ ఉండేటట్లు.

ఉపయుక్త ఆధారాలు

  1. Sweet walk through time.
  2. Regulation of Blood sugar.
  3. The Elevated Susceptibility to Diabetes in India: An Evolutionary Perspective.
  4. Sugar Substitutes Linked to Obesity, Artificial sweeteners induce glucose intolerance by altering the gut microbiota – Nature, 2014
  5. బొమ్మలు – గూగుల్ సౌజన్యంతో.