దక్షిణ అమెరికా దృశ్యమాలిక – 5

గలాపగోస్ ద్వీపాలు

పురాతన స్పానిష్ పలుకుబడిలో గలాపగోస్ అన్నమాటకు తాబేలు అని అర్థం. ఈ గలాపగోస్ అన్నది ముప్ఫై అయిదు అగ్నిపర్వత ద్వీపాల సముదాయం. ఎక్వదోర్ దేశానికి చెందినది. దక్షిణ అమెరికా ఖండానికి వెయ్యి కిలోమీటర్ల పశ్చిమాన ఉన్నాయి ఈ ద్వీపాలు. ప్రధాన భూఖండానికి అంత దూరంగా ఉండటంవల్ల అక్కడి జంతుజాలం ఆ ప్రధానఖండంలోని జీవజాలానికి భిన్నమైన, తమకే ప్రత్యేకమైన లక్షణాలను సంతరించుకొని పరిణామం చెందింది. ఉదాహరణకు, ఈ ద్వీపాలలో మనకు రాకాసి తాబేళ్ళు కనిపిస్తాయి. ఎగరడం రాని, ఈత మాత్రమే నేర్చిన కార్మొరాంట్ (Cormorant) పక్షులు కనిపిస్తాయి. ఈదే సామర్థ్యం సంపాదించిన మన తొండల్లాంటి ఇగ్వానాలు (Iguana) కనిపిస్తాయి.

ఈ 35 ద్వీపాలలో పదమూడు ద్వీపాలు చెప్పుకోదగ్గ పరిమాణం గలవి. మళ్ళా అందులో నాలుగింట్లో మాత్రమే జనావాసం ఉంది. శాంతాక్రూజ్, సాన్ క్రిస్తోబెల్, ఇసబెల్లా, ఫ్లోరియానా అన్న ఈ నాలుగు ద్వీపాలలో అంతా కలసి ముప్ఫైవేల జనాభా. అందులో మళ్ళా సగంమంది ఉండేది శాంతాక్రూజ్‌లోనే. పరిమాణం దగ్గరకు వస్తే ఇసబెల్లా ద్వీపం అన్నిటికన్నా పెద్దది. శాంతాక్రూజ్‌ది రెండవ స్థానం.

ఫిబ్రవరి 9, 2023న నేను బాగా ఉదయమే నిద్రలేచాను. మూడున్నర దశాబ్దాలుగా నేను కలలు కంటోన్న గలాపగోస్ యాత్ర ఈనాడు కార్యరూపం పొందుతోందిగదా అన్న ఉత్తేజభావనతో మనసంతా నిండిపోయింది. ఎంతో ఉత్సాహంగా టాక్సీ పట్టుకుని గుయాకీల్ ఎయిర్‌పోర్టుకు దారితీశాను. అక్కడ విమానం పట్టుకుని శాంతాక్రూజ్ ద్వీపంలోని పుయెర్తో అయోరా (Puerto Ayora) అన్న పట్టణానికి చేరుకోవాలన్నది ఆనాటి ప్రణాళిక.

గుయాకీల్ ఎయిర్‌పోర్ట్‌లో లగేజిని ఎంతో క్షుణ్ణంగా తనిఖీ చేశారు. సేంద్రియ పదార్థాల జాడ లేదని నిర్ధారించుకున్నారు. ఆర్గానిక్ మెటీరీయల్ ఏ చిన్న మొత్తమైనా గలాపగోస్ ద్వీపాలకు చేరితే అక్కడ అది చీడపురుగులకు వేదిక అవుతుందన్నది వారి ఆలోచన… అందుకే ఆ జాగ్రత్తలు.

విమానానికి ఇంకా గంట సమయముంది. ఒక బొలోన్ దె వర్టె, దానితోబాటు కాఫీ తీసుకుని నా దగ్గర ఉన్న ‘లోన్లీ ప్లానెట్’ గైడ్ పుస్తకంలో తలదూర్చాను. దాని పుణ్యమా అని నా టీనేజి దశలోని ఎన్నో జ్ఞాపకాలు మనసులో మెదిలాయి.

అది 1984-86 సంవత్సరాల్లో నేను ఇంటర్మీడియెట్ చదువుతోన్న సమయం. అప్పటి పాఠ్యపుస్తకాల ద్వారా గలాపగోస్ ద్వీపాల గురించి మొదటిసారిగా విన్నాను. మళ్ళీ ఆ తెలుసుకోవడం కూడా రెట్టింపు ఊపుతో జరిగింది. బోటనీలోకి వెళితే గలాపగోస్, జువాలజీలోకి వెళితే మరింత గలాపగోస్! అదిగో ఆ క్షణాల్లో, ఆ దినాల్లో నాలో గలాపగోస్ ద్వీపాల మీద ఆసక్తి వేళ్ళూనింది.

ఈ ద్వీపాలు ఛాల్స్ డార్విన్‌తో ఎంతగానో ముడిపడి ఉన్నాయి. అలాగే 1859లో డార్విన్ ప్రతిపాదించిన జీవపరిణామ సిద్ధాంతానికీ దానిలో అంతర్భాగమైన ప్రాకృతిక ఎంపిక (Natural Selection) అన్న అంశానికీ ఈ గలాపగోస్ ద్వీపాలలో ఆయన జరిపిన విస్తృత పరిశోధనలే పునాదిరాళ్ళు అయ్యాయి. వాటిగురించి క్లాసు పుస్తకాల్లో తెలిశాక వెంఠనే మా నాన్నతో కలసి, హైదరాబాద్ ఆబిడ్స్‌కు వెళ్ళి, ‘ఆన్ ది ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్’ అన్న పుస్తకం కొనేశాను. అప్పటికి నా వయసు పద్దెనిమిది. ఇంటర్ ముగిసి మెడికల్ కాలేజీలో అడ్మిషన్ కోసం ఎదురు చూస్తోన్న సమయం. ఆ వేసవి సెలవుల్లో డార్విన్ పుస్తకాన్ని అక్షరం వదలకుండా మథించాను. నాకది ఇప్పటికీ మరువలేని ఒక మధుర స్మృతి.

మరో దశాబ్దం తర్వాత యూకేలో స్థిరపడ్డాక డేవిడ్ అటెన్‌బరో అన్న ప్రకృతి చరిత్రకారుడు బి.బి.సి. కోసం రూపొందించిన డాక్యుమెంటరీలు విరివిగా చూశాను. నా ఆసక్తి మరోసారి పురివిప్పింది. ఆ ద్వీపాలకు వెళ్ళాలన్న టీనేజి ఆలోచన యూకే గడ్డ మీద ఒక సంకల్పంగా రూపుదిద్దుకొంది.


నేను గుయాకీల్ నుంచి గలాపగోస్‌కు తీసుకున్న ఫ్లైటు అబియాంకా ఎయిర్‌లైన్స్ వారిది. వెయ్యి కిలోమీటర్లు. రెండు గంటలు. విమానం సగమే నిండింది. ప్రయాణమంతా నీలిరంగు పసిఫిక్ మహాసాగరం మీదుగా సాగింది. చివరి ఇరవై నిముషాల్లో కొన్ని ద్వీపాలు కనిపించాయి.

విమానంలో నా పక్క సీటు మనిషి పేరు మిగేల్ (Miguel). ఎక్కినపుడు ఒకరినొకరు పలకరించుకున్నాం. ఆ వెంటనే ఆయన నిద్రాదేవతను ఆహ్వానించాడు. నేనో అరగంటసేపు నీలాల సాగరాన్ని చూశాను. విసుగనిపించింది. నేనూ నిద్రలోకి జారుకున్నాను. ప్రయాణం చివరి ఘట్టంలో పైలట్ ‘మనం క్రిందకు దిగుతున్నాం’ అని ఎనౌన్స్ చేసినపుడు నాకు మెలకువ వచ్చింది. మిగేల్ కూడా మెల్లగా ప్రపంచంలో పడ్డాడు. కొద్ది నిముషాలసేపు మా మధ్య సంభాషణ నడిచింది. మిగేల్ గుయాకీల్‌కు చెందిన పాతిక ముప్ఫై యేళ్ళ యువకుడు. గుయాకీల్‌లో యూనివర్సిటీ చదువులు ముగించాక గలాపగోస్‌లోని శాంతాక్రూజ్ ద్వీపానికి చేరాడు. అలా చేరి అయిదేళ్ళయిందట. క్రూజ్ షిప్‌లలో పని చేస్తున్నాడట. అతని స్నేహితురాలు స్థానికంగా ఉన్న హార్డ్‌వేర్ షాపులో పనిచేస్తోందట. వాళ్ళిద్దరూ ‘ముందు ఈ ద్వీపాల్లో కాసిన్ని రోజులు పనిచేసి చూద్దాం’ అని వచ్చారట. వాటితో అనుబంధం ఏర్పడింది. ‘కొంతకాలం ఇక్కడే ఉండిపోదాం’ అని నిశ్చయించుకున్నారు. ‘మాకీ ద్వీపాలు నచ్చాయి. సుందర ప్రశాంత వాతావరణం. జీతాలు కూడా ఎక్వదోర్ మెయిన్‌లాండ్‌తో పోలిస్తే ఎక్కువే’ అని చెప్పుకొచ్చాడు మిగేల్. ‘మీలాగా మెయిన్‌లాండ్‌ వాళ్ళు ఇక్కడికొచ్చి పనిచేయడానికి ఇష్టపడతారా?’ అని అడిగాను. అతను నవ్వేసి, ‘లేదు, ఇక్కడ పనిచెయ్యడం, స్థిరపడడం అందరికీ నచ్చే విషయం కాదు. ప్రకృతి పిపాస ఉండి, ప్రశాంత వాతావరణంలో జీవించాలనుకొనేవారికి ఇది నచ్చుతుంది – నిజమే. కానీ నా వయసు యువకులకు కావలసింది సందడి. వినోదం. ఉత్తేజం. సమవయస్కుల సాహచర్యం. ఆ సోషల్ లైఫ్ ఇక్కడ ఉండదు…’ అని వివరించాడు మిగేల్. నేను ఇలా ఒంటరిగా గలాపగోస్ ద్వీపాలకేసి రావడం అతనిలో కుతూహలాన్ని రేకెత్తించింది. ‘యు.ఎస్.లో ఉండే చాలామంది ఇండియన్లు క్రూజ్ ట్రిప్పుల్లో ఈ గలాపగోస్ ద్వీపాలకు వస్తూ ఉంటారు’ అని చెప్పాడు.

బాల్త్రా ద్వీపంలోని సీమోర్ ఎయిర్‌పోర్ట్‌లో దిగగానే నులివెచ్చని చిరుగాలి మాకు స్వాగతం పలికింది. గలాపగోస్ ద్వీపాల్లో అడుగు పెట్టనే పెట్టాను – అవును. కల నిజమయింది. మనసులో ఉద్వేగం. ఎయిర్‌పోర్ట్‌లోని ఎరైవల్స్ ప్రదేశానికి వెళ్ళడానికి కాస్తంత నడవాల్సి వచ్చింది. చేరీ చేరగానే మాకు అక్కడ ఓ పసుప్పచ్చని ఇగ్వానా కనిపించి పలకరించింది. మనుషులున్నారు అన్న పట్టింపే లేకుండా నిశ్చింతగా అక్కడ తిరుగుతోందా ఇగ్వానా! గలాపగోస్ ద్వీపాల్లోకి అడుగుపెట్టిన కొద్ది నిముషాల్లోనే అక్కడి జంతుజాల ప్రతినిధి నాకు కనిపించిందన్నమాట.

ఇది ప్రపంచంలోని మొట్టమొదటి ‘గ్రీన్ ఎయిర్‌పోర్ట్‌’ అన్న విషయాన్ని తెలిపే సైన్‌బోర్డ్ ఆ ప్రాంగణంలో కనిపించింది. నిర్మాణమంతా రీసైకిల్ చేసిన సామగ్రితోనే జరిగిందట. ఎయిర్‌పోర్ట్‌ యావత్తూ సౌరశక్తి మీద, వాయుశక్తి మీదా నడుస్తోందట. గలాపగోస్ ద్వీపాలలో ఉన్న రెండు విమానాశ్రయాల్లో ఈ సీమోర్ ఎయిర్‌పోర్ట్‌ ఒకటి. రెండవది సాన్ క్రిస్తోబెల్ ద్వీపంలో ఉంది. అన్నట్టు గలాపగోస్ చేరుకోవడానికి ముందుగా కీతో నగరానికో గుయాకీల్‌కో వచ్చి తీరాలి. తిన్నగా ఈ ద్వీపాలకు చేర్చే ఇంటర్నేషనల్ ఫ్లైట్‌లు లేవు.

అక్కడి టెర్మినల్ ప్రాంగణాన్ని చిన్నపాటి మ్యూజియంలా రూపొందించారు. ఆ ద్వీపాల ప్రకృతికి చెందిన చరిత్ర, జంతుజాలం, వృక్షజాలం – వాటన్నిటి వివరాలు, చిత్రాలూ అక్కడ ప్రదర్శించారు. అన్నట్టు ఎక్వదోర్‌ పౌరులు కానివాళ్ళు ఎవరైనా గలాపగోస్‌లో ప్రవేశించడానికి 100 డాలర్ల ఫీజు కట్టాలి. ఇంకోమాట – ఎక్వదోర్‌కు ప్రత్యేకంగా కరెన్సీ అంటూ లేదు; అమెరికన్ డాలరే వారి కరెన్సీ కూడానూ! ఆర్థిక సుస్థిరత కోసం వారు అలా డాలరును ఎన్నుకున్నారట.

ఆ ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణీకులకు ‘కె-9 చెక్’ అన్న ప్రత్యేకమైన శునకాలతో తనిఖీ ఉంది. పొరపాటున కూడా వాళ్ళు అక్కడికి హానికరమైన జీవసంబంధిత పదార్థాలు తీసుకురావడం లేదు అని నిర్ధారించుకోవడానికి – ఈ క్షుణ్ణమయిన తనిఖీ. అది ముగించుకుని బయటపడేసరికి మిగేల్ నాకోసం ఎదురుచూస్తూ కనిపించాడు. ‘ఇక్కడినుంచి శాంతాక్రూజ్ లోని పుయెర్తో అయోరాకు చేరుకోవడం కాస్త సంక్లిష్టమైన ప్రక్రియ. నాతో రండి’ అన్నాడు.

ముందు మేమో షటిల్ బస్సు పట్టుకున్నాం. అయిదు కిలోమీటర్ల అవతల ఉన్న ఇతబాకా (Itabaca) జలసంధి దగ్గరకు చేరుకున్నాం. నేలంతా నలుపూ బూడిద రంగుల్లో ఉంది. అదే బూడిదరంగు తుప్పలు కూడా అక్కడక్కడ కనిపించాయి. ఆ జలసంధి దగ్గర బోటు పట్టుకుని కాసేపు ప్రయాణించి శాంతాక్రూజ్ ద్వీపానికి చేరుకున్నాం. మా పుయెర్తో అయోరా పట్టణం ఆ ద్వీపపు అవతలి కొసన ఉందట – నలభై కిలోమీటర్ల దూరం. బస్సులోగాని, టాక్సీలోగానీ వెళ్ళాలి. ‘మనిద్దరం టాక్సీ తీసుకుందాం. ఖర్చులు పంచుకుందాం’ అన్నాడు మిగేల్. నేను సంతోషంగా ఒప్పుకున్నాను.

టాక్సీ పట్టుకున్నాం. ఆన్హేలో అన్న మనిషి మా టాక్సీ డ్రైవరు. ఈలోగా మిగేల్ మాతోపాటు రావటానికి ఆంద్రియాస్ అన్న మూడో మనిషిని పట్టుకోగలిగాడు. ఖర్చులు ఆ మేరకు తగ్గాయి. అక్కడి టాక్సీలన్నీ టయోటా వాళ్ళ తెల్లరంగు పికప్ ట్రక్కులు అన్న విషయం నేను గమనించాను.

పుయెర్తో అయోరా అన్నది శాంతాక్రూజ్‌లోని ప్రధాన పట్టణం. మొత్తం గలాపగోస్ ద్వీపాల్లోకెల్లా పెద్ద ఊరు. ఆ ద్వీపాలలో అది చక్కగా కేంద్రస్థానంలో ఉంది; వాటిల్ని శోధించడానికి వచ్చేవారికి ఆ ఊరు ఎంతో అనువైన వేదిక.

మేమంతా చక్కని, పచ్చని చెట్లమధ్య సూటిగా సాగిపోతున్న తారురోడ్డు మీద ప్రయాణించాం. కొన్నికొన్ని చెట్లు ఎంతో అపరిచితంగా అనిపించాయి. అంతా కలసి నాకు ముందు సీటు వదిలేశారు. మిగేల్, ఆంద్రియాస్‌లు ఏదో చర్చలో నిమగ్నమైపోయారు. బహుశా అది స్థానిక రాజకీయాల గురించి అనుకుంటాను. మధ్యమధ్యలో డ్రైవరు ఆన్హేలో కూడా ఆ చర్చలో పాలుపంచుకుంటున్నాడు. ఆ చర్చ అలా సాగుతూ ఉండగానే నాకు దూరాన రోడ్డు మధ్య ఓ బండరాయి కనిపించింది. టాక్సీ వేగం తగ్గించాడు ఆన్హేలో. తీరా చూస్తే అది బండరాయి కాదు – రాకాసి తాబేలు! నాకు గొప్ప ఉత్తేజం కలిగింది. టాక్సీలోని మిగతా ముగ్గురికీ నా ఉత్తేజం సంతోషాన్ని కలిగించింది. వాళ్ళకు ఆ దృశ్యం సామాన్యమే అయినా, సరికొత్తగా ఆ ద్వీపాలలో అడుగుపెట్టిన నాకు మరి ఉత్తేజం కలుగుతుంది గదా – ఆ విషయాన్ని వాళ్ళు గ్రహించి మౌనంగా అభినందించిన తీరు బావుంది. తాబేలు రోడ్డు దాటే దాకా ఓపిగ్గా కారు ఆపి, ఆ పైన ముందుకు ఉరికించాడు ఆన్హేలో. ఇలా తాబేళ్ళ ఉనికిని గురించి హెచ్చరించే ట్రాఫిక్ సైన్‌బోర్డులు రోడ్డుమీద ఉండటాన్ని గమనించాను.

ఆ ద్వీపాల్లో పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ బాగా తక్కువని, టాక్సీలే ప్రధానమైన రవాణా సాధనాలనీ చెప్పాడు మిగేల్. ‘ద్వీపమంతా తిప్పి చూపటానికి మధ్యాహ్నం వస్తావా’ అని ఆన్హేలోను అడిగాను. సరేనన్నాడు. మిగేల్ ద్వారా ఛార్జి గురించి చర్చించి చివరికి నలభై డాలర్ల దగ్గర అంగీకారానికి వచ్చాం. తన ఫోన్‌ నంబరు ఇచ్చి ఇంకేమయినా అవసరం పడితే తనకు ఫోన్ చెయ్యమన్నాడు మిగేల్. అప్పటిదాకా అతను అందించిన సాయానికి మనసారా థాంక్స్ చెప్పాను.

పుయెర్తో అయోరా పట్టణంలో గలాపగోస్ నేటివ్ హొటేల్ అన్నచోట రెండు రోజులు గడపాలన్నది నా ప్రణాళిక. ఆ హోటలు చూడ్డానికి ఎపార్ట్‌మెంట్ల బిల్డింగ్‌లా ఉంది. నాకు పై అంతస్తులో గది ఇచ్చారు. చూడగా అక్కడి ఎపార్ట్‌మెంట్లలో కుటుంబాలూ పిల్లలూ నివసిస్తోన్న ఛాయలు కనిపించాయి. కాస్సేపటికల్లా ఆ ఎపార్ట్‌మెంటు యజమానులు ఉండేది కూడా అక్కడే అని అర్థమయింది. అంటే నేను చక్కని హోమ్లీ వాతావరణంలో ఉండబోతున్నానన్నమాట.

హోటల్లో చెకిన్ చేసిన వెంటనే మరి ఆలస్యం చెయ్యకుండా రహదారులు పట్టుకునే ప్రయత్నం చేశాను. మిగేల్‌ని దింపి అరగంటలో ఆన్హేలో తిరిగి వచ్చాడు. ఆ ద్వీపాల్లో తిరగాలంటే రెండు పద్ధతులున్నాయి: గైడెడ్ టూరు తీసుకోవడం; టాక్సీ తీసుకోవడం. బాధ్యత ఎరిగిన స్థానికుని తోడు లేకుండా, యాత్రికులు ఒక్కళ్ళమే తిరుగుతాం అంటే అక్కడ ఒప్పుకోరు. కొన్నికొన్ని చోట్లకు గైడో టాక్సీ డ్రైవరో లేకపోతే అసలు అడుగు పెట్టనివ్వరు. వెళ్ళిన ప్రతిచోటా మన పేరూ పాస్‌పోర్ట్ నెంబరూ నమోదు చేసుకుంటారు. అక్కడికి ఏ సమయానికి వెళ్ళాం ఎప్పుడు వదిలిపెట్టాం అన్నది గమనిస్తూ ఉంటారు.

డ్రైవర్ ఆన్హేలోతో కలసి నా ద్వీపయాత్రని ఆరంభించాను. కాసేపటి క్రితం హోటలు చేరడానికి వచ్చిన రోడ్డులోనే మళ్ళీ ప్రయాణించాం. ఏనాడో నిప్పులు విరజిమ్మి కూలిపోయిన జంట జ్వాలాముఖీబిలాల దగ్గర మొట్టమొదట ఆగాం. లాస్ గమెలోస్ ట్విన్ క్రేటర్స్ అన్న పేరున్న ఆ రెండు బిలాలూ పక్కపక్కనే ఉన్నాయి. ఇపుడవి ఆ చుట్టుపక్కల ప్రదేశమంతా ఉండినట్టుగానే దట్టమైన చెట్టూచేమతో నిండి ఉన్నాయి. అదంతా నడిచి వెళ్ళి చూసి రావడానికి ఓ కిలోమీటరు మేర దారి ఉంది. ఆ చెట్టూ చేమా మధ్య, నేనంతవరకూ పేరు ఎరుగని ఓ చెట్టు విస్పష్టంగా కనిపించింది. దాని పేరు స్కెలాషియా (Scalacia) వృక్షమట. అది ఆ ప్రాంతానికే ప్రత్యేకమైన వృక్షమట. కొన్ని చెట్లకు ఋషుల గడ్డాల్లా వేలాడుతూ పొడవాటి నాచు మొక్కలు పందిరిలా అల్లుకుపోయి కనిపించాయి.

ఆన్హేలో బాగా చురుకైన కుర్రాడు. కాకపోతే గభాల్న సంభాషణలో పాల్గొనడానికి మోహమాటపడే వ్యక్తి. అడిగిన వివరాలు మాత్రం చక్కగా చెపుతున్నాడు.

ఏ చీకూ చింతా లేకుండా నింపాదిగా తిరుగాడే రాకాసి తాబేళ్ళను చూడటమన్నది మనకు ఆ ద్వీపాల్లో కనిపించే అపురూప దృశ్యం. మెయిన్ రోడ్డులో మరోసారి మూడో తాబేలు తటస్థపడి మా కారును కాసేపు నిలువరించింది. కార్లన్నీ ఎంతో మర్యాదగా ఆగిపోయి ఆ తాబేళ్ళకు దారి ఇవ్వడమన్నది మనకు అక్కడ పదేపదే కనిపించే దృశ్యం.

శాంతా రోసా అన్న చిరుపట్నం మీదుగా మేము ఎల్ చాతో రాంచ్ (El Chato Ranch) అన్న తాబేళ్ళ రక్షిత ప్రదేశాన్ని చేరుకున్నాం. అక్కడ విజిటర్స్ సెంటర్ చేరుకుంటున్నప్పడు పది పన్నెండు రాకాసి తాబేళ్ళు కనిపించాయి. ఆ ప్రదేశం వాటి సహజ ఆవరణం. అక్కడ గడ్డిని కొరుకుతూ తాబేటి నడక నడుస్తూ అవన్నీ నింపాదిగా సాగిపోతున్నాయి. ఆ పక్కనే ఉన్న బురద నిండిన గుంటల్లో కొన్ని తాబేటి సమూహాలు కనిపించాయి. మొత్తం మీద ఆ ముప్ఫై ఎకరాల ప్రాంగణంలో ఎక్కడ చూసినా తాబేళ్ళే తాబేళ్ళు…

ఆ తాబేటి సీమకు టికెట్టు బాగా ఖరీదు! కాకపోతే ఆ ధరలోనే ఓ నలభై ఐదు నిముషాల గైడెడ్ టూర్ చేరి ఉంది. మా బృందంలో అంతా కలసి పన్నెండుమందిమి… లూయిస్ అన్న అతను మాకు గైడు. నేనూ మరో జపనీస్ యువకుడూ మాత్రమే మా బృందంలో ఇంగ్లీషు తెలిసిన మనుషులం. అయినా పాపం లూయిస్, ఆంగ్లమూ స్పానిషూ కలగలసిన భాషలో మాకా ప్రాంతపు వివరాలన్నీ చెప్పాడు. ఆ తాబేళ్ళు శాంతాక్రూజ్ ద్వీపమంతటా ఉంటాయట. నీళ్ళూ గడ్డీ వెదుక్కుంటూ ద్వీపమంతా తిరుగాడుతూ ఉంటాయట, వాటి సగటు బరువు 250 కిలోలు. వాటిలో కొన్ని రకాల తాబేళ్ళు 450 కిలోల దాకా తూగుతాయి. 150 నుంచి 200 ఏళ్ళ వరకూ బ్రతుకుతాయి.

యూరోపియన్లు ఈ పసిఫిక్ ప్రాంతపు పశ్చిమ ప్రాంతాల్లో మొట్టమొదటగా తిరుగాడి శోధించినప్పుడు ఈ గలాపగోస్ ద్వీపాలను తమ నిత్యావసర వస్తువులను తిరిగి నింపే ప్రకృతి స్థావరాలుగా ఉపయోగించుకునేవారట. తాబేలు నీరూ తిండీ లేకుండా ఏడాదిపాటు ఉండగలదు. అంచేత వీటిని యూరోపియన్లు ‘ఆహారనిల్వలు’ లాగా ఓడల్లో భద్రపరచుకొనేవారట. ఆధునిక యుగంలో టిన్నుల్లో ఆహారం లభిస్తోంది గదా – అలాగే ఈ తాబేళ్ళు వాళ్ళకి సజీవ ఆహారపు నిలవలలాగా ఉపకరించాయన్నమాట. ఆ ప్రక్రియలో వందలాది తాబేళ్ళు హతమయ్యాయి. ఆహారంగానే కాకుండా, తాబేళ్ళలోని కొవ్వు భాగం దీపాల్లోకి నూనెగానూ ఉపకరించేది. మొత్తానికి ఆ తాబేళ్ళు పెనుముప్పును ఎదుర్కొన్నాయి. అదృష్టవశాత్తూ మారిషస్ ప్రాంతాల్లోని డోడో (Dodo) పక్షుల్లాగా ఈ తాబేళ్ళు పూర్తిగా ఆంతరించిపోలేదు. అయినా యూరోపియన్లు రాకముందు అక్కడ 15 రకాల తాబేళ్ళు ఉండేవి; ఇపుడు పన్నెండు రకాలే మిగిలాయి.

లూయిస్ మా అందర్నీ ఆ ద్వీపంలోని మరో ఆకర్షణ – లావా టనెల్స్ దగ్గరకు తీసుకువెళ్ళాడు. అగ్నిపర్వతాల చురుకుదనం ముమ్మరంగా ఉండి, వాటిలోంచి లావా పుష్కలంగా వెలువడి ప్రవహించిన కాలంలో, ఆ లావా పైభాగం ఘనీభవించి, ప్రవాహపు ఒక కొసలో చిన్నపాటి ప్రవేశమార్గాన్ని వదలగా ఏర్పడిన ‘సొరంగాలు’ ఇవి. ఆ సొరంగాలగుండా అందరం నడిచాం – ఇరుకైన గుహలో నడిచిన అనుభూతి కలిగింది.

తిరుగుప్రయాణంలో నేను మా పుయెర్తో అయోరా పట్టణంలోనే ఉన్న ఛాల్స్ డార్విన్‌ రిసర్చ్ స్టేషన్ (CDRS) దగ్గర దిగిపోయాను. ఆ పరిశోధనా కేంద్రంలో వందలాది సైంటిస్టులు పనిచేస్తున్నారు. గలాపగోస్ ద్వీపాలలోని విలక్షణమైన జీవజాలాన్నీ వృక్షసంపదనూ పరిరక్షించే కృషిలో నిమగ్నమైన శాస్త్రవేత్తలు వారు.

లోన్‌సమ్ జార్జ్ అన్న ఒంటరి ప్రాణి ఆ కేంద్రంలో నివసించిన ప్రముఖమైన కచ్ఛపం. బహుశా అది చరిత్రలోనే ఎక్కువగా పేరుమోసిన తాబేలు అనుకొంటాను. తాను చెందిన తాబేళ్ళ జాతి ఉపవర్గంలో, గలాపగోస్ ద్వీపాల్లో తిరుగాడుతోన్న చిట్టచివరి ప్రాణి అని శాస్త్రజ్ఞులు గుర్తించాక పరిశోధనారంగంలో దానిమీద ఆసక్తి పెరిగింది. దానికి తోడును వెదికి ఆ ఉపవర్గం అంతరించకుండా చేద్దామని ప్రపంచవ్యాప్తంగా ప్రయత్నాలు జరిగాయి. జంతుప్రదర్శనశాలల్లోనూ, ఇతర తాబేటి ఆవాసాల్లోనూ ఎంత వెతికినా ఫలితం లేకపోయింది. చివరికి 2012లో ఆ లోన్‌సమ్ జార్జ్ తుదిశ్వాస విడిచింది. అప్పట్లో అది అంతర్జాతీయ వార్త అయింది. డేవిడ్ అటెన్‌బరో (David Attenborough), సైమన్ రీవ్ (Simon Reeve) కలిసి బి.బి.సి. కోసం తీసిన డాక్యుమెంటరీల్లో ఈ లోన్‌సమ్ జార్జ్ ప్రముఖంగా కనపడుతుంది. ఈ చిట్టచివరి కచ్ఛపం కథ ఎంతోమందిని కదిలించింది. అతిశయించిన మానవజాతి పురోభివృధ్ధికి ఇలాంటి ఎన్నో ప్రాణులూ జీవజాతులూ బలి కావడం అన్నది ఆధునిక యుగపు చేదునిజం. అవధులు లేని దురాశ సాటి జీవజాతికి ఎంత ప్రాణాంతకంగా పరిణమించిందో…

పదహారో శతాబ్దంలో యూరోపియన్ అన్వేషకుల దృష్టి పడనంతవరకూ గలాపగోస్ ద్వీపాల్లో జనావాసమన్నది లేదు. ముందే చెప్పుకున్నట్టు ఆ అన్వేషకులు తమతమ నీటి నిల్వలనూ ఆహారపు వనరులనూ పరిపూర్ణం చేసుకోవడానికి అక్కడ ఆగేవారు. అన్వేషకులతోబాటు కొన్ని ద్వీపాలు సాగరచోరుల స్వర్గధామాలుగానూ పరిణమించాయి. ఏదేమైనా ఆ వేటగాళ్ళ ఆగడాలకు అక్కడి జంతుజాతి – ముఖ్యంగా రాకాసి తాబేళ్ళు, ఎంతో సులభంగా బలి అయ్యాయి. తమకంటూ శత్రువులు ఉంటారన్న స్పృహే లేకుండా వేలాది సంవత్సరాలుగా పరిణామం చెందుతూ ఆయా ద్వీపాల్లో తిరుగాడిన ఆ జంతుజాతికి, తమను తాము రక్షించుకోవాలి అన్న సహజ లక్షణం – నేచురల్ ఇన్‌స్టింక్ట్ – బొత్తిగా అలవడలేదు. అంచేత అవి మనుషుల గురించి, వాళ్ళ ద్వారా తమకు వాటిల్లబోతున్న ముప్పు గురించీ ఆలోచించనే లేదు. దాని ఫలితంగా అవి అతి సులభంగా మనిషి దౌష్ట్యానికీ క్రూరత్వానికీ బలి అయిపోయాయి. స్పానిష్ అన్వేషకులు మొట్టమొదటిసారిగా పదహారో శతాబ్దంలో గలాపగోస్ ద్వీపాలలో అడుగు పెట్టినపుడు, అక్కడ రెండున్నర లక్షల రాకాసి తాబేళ్ళు ఉండేవట. ఇపుడు పదిహేనువేలు మాత్రమే మిగిలాయట. మనిషే ప్రాణాంతకుడు అనుకుంటే, ఆ మనిషి తనతోబాటు తీసుకు వచ్చిన గొర్రెలు, పందులు, కుక్కలు, పిల్లులు, ఎలుకలు ఈ ద్వీపాల్లో చెలరేగి అక్కడి ప్రాణికోటి విధ్వంస ప్రక్రియలో తమ వంతు పాత్రను పోషించాయట.

ఛాల్స్ డార్విన్ 1835లో గలాపగోస్ ద్వీపాలకు రావడం, పరిశోధనలు జరపడం, అతని జీవపరిణామ సిద్ధాంతానికి ఆ ద్వీపాల్లోనే పునాది పడడం పుణ్యమా అని, ఆ ద్వీపాల ఉనికి ప్రపంచానికి తెలిసింది. మానవ సంపర్కంవల్ల అక్కడ జరిగిన, జరుగుతోన్న పర్యావరణ విధ్వంసం ప్రపంచం దృష్టికి వచ్చింది. అక్కడ తిరుగాడుతోన్న గొర్రెలూ పందుల కార్యక్షేత్రాలను పరిమితం చేయడం, శునకాలూ మార్జాలాల విహారాలను నియంత్రించడం జరిగింది. బయటనుంచి వచ్చిన మొక్కలూ వృక్షాల వ్యాప్తీ విస్తరణలకూ అడ్డుకట్టలు ఏర్పడ్డాయి… ఇన్నిన్ని రకాల శ్రద్ధలు ఫలించి, 1978లో యునెస్కోవారు ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించి ప్రకటించిన మొట్టమొదటి పట్టికలో గలాపగోస్ ద్వీపాలు చోటు చేసుకున్నాయి. ‘సజీవ సంగ్రహశాలలు, జీవపరిణామానికి విలక్షణ తార్కాణాలు’ అంటూ యునెస్కో ఈ ద్వీపాలను కీర్తించింది. ఈ ద్వీపాలకు వచ్చిన ఎవరికైనా ఒకే భావన కలుగుతుంది: ‘ఈ ద్వీపాలను మనం కాపాడుకోలేని పక్షంలో భూమండలాన్ని ఏ మాత్రం రక్షించుకోలేం; మనం నడిచే నేలమీది జీవవైవిధ్యాన్ని పరిరక్షించుకోవడం విషయంలో మనకున్న శ్రద్ధ, పట్టుదలలకు ఈ గలాపగోస్ ద్వీపాలు ఒక పరీక్షా వేదికలాంటివి…”


ఛాల్స్ డార్విన్ అనగానే చాలామందికి గలాపగోస్ ద్వీపాలు గుర్తొస్తాయి. ఈ ద్వీపాల్లోని జంతుజాలాన్ని చూసే ఆయన తన జీవపరిణామ సిద్ధాంతానికి రూపకల్పన చేశాడన్న అభిప్రాయం బాగా ప్రాచుర్యంలో ఉంది. అది పాక్షిక సత్యం.

డార్విన్ 1809లో ఒక సంపన్న ఆంగ్ల కుటుంబంలో పుట్టాడు. అందరూ అనుకునేట్టు అతను బయాలజీ చదివిన మనిషి కాదు. కానీ ప్రకృతి అంటే మొదటినుంచీ ఎంతో అనురక్తి ఉన్నవాడు. ప్రాథమికంగా అతడిని భూగర్భశాస్త్రం బాగా ఆకర్షించింది. 1831-36ల మధ్య ఐదేళ్ళపాటు ఎచ్.ఎమ్‌.ఎస్. బీగిల్ అన్న ఓడలో సుదూరప్రాంతాలలో తిరిగి శిలలనూ అగ్నిపర్వతాలనూ పరిశీలిస్తూ గడిపాడు. ఆ శోధనాయాత్ర మొదలెట్టినప్పుడు అతని వయసు ఇరవై రెండు సంవత్సరాలు. ఆ యాత్రలో భాగంగా గలాపగోస్ ద్వీపాల్లో 1835లో కొంతకాలం గడిపాడు. తన భూగర్భశోధనా యాత్రలో గమనించిన వన్యమృగ భౌగోళికవ్యాప్తికి (Global Spread) తోడుగా తాను విభిన్న ప్రాంతాలనుంచి సేకరించిన శిలాజాలలోనూ అదే ధోరణి వ్యాప్తి కనిపించడం అతడిని అబ్బురపరచింది. ఆలోచనలలో పడవేసింది. ఫలితంగా 1838లో ప్రాణుల ప్రాకృతిక ఎంపిక (Natural Selection) సూత్రానికి రూపకల్పన చేశాడు. ఆ అంశాన్ని కొంతమంది ప్రకృతి శాస్త్రవేత్తలతో చర్చించాడు. వీటన్నిటి వెనుకా ఆయన గలాపగోస్ ద్వీపాలలో గమనించిన విషయాలున్నాయి. అవి అతని ఆలోచనలను ఒక గాటిన పెట్టడానికి సాయపడ్డాయి. ఈ దశ ముగిశాక ఆయన మళ్ళా తన ప్రాథమిక అధ్యయన అంశమైన భూగర్భశాస్త్ర శోధనలో నిమగ్నమయ్యాడు. అయినా తాను రూపొందించిన ప్రాకృతిక ఎంపిక సూత్రాన్ని గురించి, అందుకు అవసరమయిన శాస్త్రపరమైన ఋజువుల గురించీ ఆలోచించడం, అన్వేషించడం కొనసాగించాడు. చిట్టచివరికి గలాపగోస్ వెళ్ళి వచ్చిన 24 సంవత్సరాల తర్వాత 1859లో, తన పరిశోధనా ఫలితాలను ది ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్ అన్న పుస్తకంలో పొందుపరిచాడు. ఈ పుస్తకంలో జీవరాసుల ఆవిర్భావాన్ని గురించి తాను చేసిన ప్రతిపాదనలకు గలాపగోస్ ద్వీపాల్లో సేకరించిన వివరాలు కూడా కొంతవరకూ ఉపకరించాయి. ఆ పుస్తకం ప్రచురించిన మొట్టమొదటి రోజునే కాపీలన్నీ అమ్ముడు పోయాయి. గత 165 ఏళ్ళుగా ఆ పుస్తకం సాధించిన విజయాలు, ప్రపంచం మీద చూపించిన ప్రభావం – అదంతా ఒక చరిత్ర.

ప్రపంచంలో ఇంకెక్కడా కనిపించని వృక్ష, జంతుజాలాలు గలాపగోస్ ద్వీపాలలో ఉన్నాయి. అక్కడి జీవజాలమంతా స్థానిక వాతావరణాలకూ భౌగోళిక పరిస్థితులకూ అలవడిపోయిన సంగతిని డార్విన్ గమనించాడు. ఆ అలవాటు పడిన క్రమంలో ఒకే రకపు జీవరాసుల మధ్య సూక్ష్మమైన భేదాలు రూపుకట్టుకోవడాన్ని కూడా ఆయన గమనించాడు. ఉదాహరణకు అక్కడున్న పది ద్వీపాల్లోనూ ఫించ్ అన్న చిట్టి గోరువంకల్లాంటి పక్షుల్లో – వాటి వాటి నాసికలలో స్వల్ప భేదాలు ఉండటాన్ని గమనించాడు. కొన్ని పక్షులకు మట్టమైన చిన్న ముక్కులు – గింజల్ని బద్దలు కొట్టడానికి ఉపయోగపడే ముక్కులవి; కొన్ని పక్షులకు నిడుపాటి నాసికలు – కీటకాలను పట్టుకోవడానికి, పూల పుప్పొడిని ఒడిసి పట్టడానికి ఉపయోగపడే ముక్కులవి. అలా భౌగోళికంగా పక్కపక్కనే ఉన్న ద్వీపాలలో కూడా పదమూడు రకాల ఫించ్ పక్షులను గుర్తించి వర్గీకరించాడు డార్విన్. అన్నట్టు ఆ తర్వాత ఆ పక్షులకు ‘డార్విన్ ఫించెస్’ అన్న పేరు స్థిరపడింది.

ఛాల్స్ డార్విన్ సనాతన సంప్రదాయానికి చెందిన మనిషి. అన్ని విషయాల్లోనూ అతని కుటుంబంవారికి బైబులే ప్రమాణం. జీవరాసుల ఉద్భవాన్ని గురించి బైబిలు చెప్పిన దానికి, తన పరిశీలనా పరిశోధనలకూ మధ్య ఉన్న దాటలేని అగడ్త డార్విన్‌ను చాలా కాలంపాటు కలవరపరచింది. బైబుల్లోని మొదటి అధ్యాయం జెనెసిస్ ప్రకారం భగవంతుడు సమస్తజీవరాసులనీ వారం రోజుల వ్యవధిలో పుట్టించి భూమిమీద వదిలాడు. తాను గమనించిన జీవపరిణామ విధానం బైబుల్లో చెప్పిన దానికి పూర్తిగా భిన్నం. ఈ భిన్నాల వత్తిడి పుణ్యమా అని డార్విన్ తన పరిశోధనలను ప్రపంచానికి వెల్లడించకుండా ఇరవై ఏళ్ళు గడిపాడు. అలా వెల్లడించడానికి తన ప్రతిపాదనలకు ఊతమిచ్చే ఋజువుల్ని – శిలాజాలతో సహా, ఎంతో విస్తారంగా సేకరించాక కూడా వాటి ప్రచురణ గురించి ఒకటికి పదిసార్లు ఆలోచించాడు. తాను ఒక తర్ఫీదు పొందిన మతాధికారి కూడా అవడంవల్ల తన పరిశోధనలూ ప్రతిపాదనలు, సూత్రాలూ సిద్ధాంతాలు, చర్చి అధినేతలూ అనుయాయుల నుంచి ఎంత తీవ్రమైన వ్యతిరేకత ఎదుర్కొంటాయో డార్విన్‌కు తెలుసు. అందుకే ఆ తటపటాయింపు. ఈలోగా ఆల్‌ఫ్రెడ్ రసెల్ వాలెస్ (Alfred Russel Wallace) అన్న శాస్త్రవేత్త కూడా జీవపరిణామం విషయంలో ఇలాంటి పరిశోధనలే చేశాడని, ఇలాంటి ప్రతిపాదనలే చేస్తున్నాడని, వాటిల్ని ప్రచురించబోతున్నాడనీ తెలియవచ్చింది. అది విన్న డార్విన్ స్నేహితులు ‘ఇక నువ్వు నీ పరిశోధనలూ సిద్ధాంతాలూ ప్రచురించక తప్పదు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడూ’ అని వత్తిడి చేశారు. డార్విన్ ఒప్పుకున్నాడు.

డార్విన్ తన ప్రతిపాదనల్లో మనుగడ పోరాటం – స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్, ప్రాకృతిక ఎంపిక – నేచురల్ సెలెక్షన్ అన్న మాటల్ని వాడతాడు. వీటితోపాటు ముడివడి వినపడే ‘మనుగడ యోగ్యత’ – సర్వైవల్ ఆఫ్ ది ఫిటెస్ట్ – అన్న పదబంధాన్ని రూపొందించింది మనమింతకు ముందు చెప్పుకున్న ఆల్‌ఫ్రెడ్ రసెల్ వాలెస్. ఆ పదబంధాన్ని స్వాగతించిన డార్విన్, దాన్ని తన ప్రతిపాదనల్లో కూడా విడదీయలేని భాగంగా చేశాడు. స్థూలంగా చెప్పాలంటే ‘ప్రకృతి తనంత తానుగా ఏ జీవరాశినీ ఎంపిక చేసి ప్రోత్సహించదు; వాటిలో జీవన పోరాట పటిమ, మనుగడకు యోగ్యతా ఉన్నవే జీవ పరిణామక్రమంలో నిలదొక్కుకుని ముందుకు సాగుతాయి’ అన్నది ఈ ప్రతిపాదనల సారాంశం. డార్విన్ ఆలోచన ప్రకారం మళ్ళీ ‘యోగ్యత’ అంటే శారీరకశక్తి పరంగానో, మేధోపరంగానో ముందు వరసలో ఉండడం కాదు; ‘మార్పు’కు సత్వరమే స్పందించి నిలబడగలగడమే మనుగడ యోగ్యత.


మధ్య యుగాలనాటి కోపర్నికస్‌కు, ఆధునిక యుగపు తొలిదినాల నాటి డార్విన్‌కూ మధ్య కొన్ని పోలికలు కనిపిస్తాయి. కోపర్నికస్ మతశాస్త్రం – థియాలజీ చదివాడు. పోలెండ్ దేశపు చర్చి వ్యవస్థలో భాగస్వామి. కానీ అతని పరిశోధనలు, వాటికి ఆధారంగా నిలిచిన శాస్త్రీయమైన లెక్కలూ కొలతలూ ‘మనకు తెలిసిన విశ్వానికి కేంద్రబిందువు భూగోళం కాదు, సూర్యమండలం’ అన్నాయి. ఈ మాట బైబిల్‌కు విరుద్ధం. అంచేత, తన సూర్యకేంద్ర సిద్ధాంతాన్ని బయలుపరచడానికి కోపర్నికస్ ఎంతగానో సంకోచించాడు. చివరికి బిక్కుబిక్కుమంటూ బయటపెట్టినప్పుడు, ఎందుకైనా మంచిదని సదరు పుస్తకాన్ని పోప్ పాల్ IIIకి అంకితమిచ్చాడు. ఇంత జాగ్రత్త తీసుకున్నా ఆ పుస్తకం చర్చి నిషేధానికి గురి అవనే అయింది.

డార్విన్ ప్రతిపాదించిన ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్ అనూహ్యమైన జనామోదాన్ని పొందినా, మతప్రపంచాన్ని గగ్గోలు పరచింది. శాస్త్రవేత్తలకూ మతాధినేతలకూ మధ్య మాటల యుద్ధాలు సాగాయి. మత వ్యవస్థ డార్విన్ మీద ‘ఇంగ్లండ్‌లోకెల్లా అతి ప్రమాదకరమైన వ్యక్తి’ అన్న ముద్ర వేసి వదిలింది. అయినా అతని ప్రతిపాదనలూ సూత్రాలూ సిద్ధాంతమూ కాలపరీక్షకు నిలిచాయి. ఆ సిద్ధాంతం వెలువడిన తర్వాత, 150 ఏళ్ళకు లభించిన జెనెటిక్ సాక్ష్యాలూ ఋజువులూ డార్విన్ చెప్పిన మాటలకు ఇపుడు తిరుగులేని ఊతంగా నిలుస్తున్నాయి. ఇంత జరిగినా, జీవపరిణామసిద్ధాంతం రుచించని మతాధినేతలు ఇప్పటికీ ప్రపంచంలో విరివిగా కనబడుతున్నారు. అది చదివి పిల్లలు చెడిపోతారన్న సద్బుద్ధితో ఆ సిద్ధాంతాన్ని పాఠ్యపుస్తకాలనుంచి తొలగించే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు!

డార్విన్ విగ్రహాలకూ జ్ఞాపికలకూ పుయెర్తో అయోరా పట్టణంలో కొదవ లేదు. చేతిలో పుస్తకంతో చెక్క బెంచీ మీద కూర్చుని కనిపించిన యువ డార్విన్ ప్రతిమ నా దృష్టిని ఆకర్షించింది. మనకు డార్విన్ అనగానే బవిరిగడ్డపు పెద్దమనిషే మనసులో మెదులుతాడు; డార్విన్ విషయంలో మన ఆలోచనలు అంతగా నియంత్రించబడ్డాయి. మరి అందుకు భిన్నంగా ఉన్న ఆ పడుచుదనపు ప్రతిమ నన్ను ఆకర్షించడంలో వింత ఏముందీ?!

డార్విన్ రిసర్చి కేంద్రంనుంచి మా హోటలుకు నడిచి వెళుతూ మర్నాడు గలాపగోస్‌లోని మరో ఆసక్తికరమైన ద్వీపం – బార్తొలోమోకు (Bartolomeo) ఎలా వెళ్ళాలా అని ఆలోచించసాగాను. అది ఆ ద్వీపాల్లోకెల్లా సుందరమైనది కూడానట. మా హోటలుకు ఎదురుగానే ఓ ట్రావెల్ ఏజెంట్ ఆఫీసు కనిపించింది. వెళ్ళాను. అరవై మధ్య వయసులో ఉన్నట్టున్న ఓ స్థూలకాయుడు ఎవరితోనో మాట్లాడుతూ కనిపించాడు. అతని పేరు ఒమెరో అట. గూగుల్ ట్రాన్స్‌లేట్ సాయంతో ఇలా రేపు బార్తొలోమో ద్వీపానికి వెళ్ళాలని ఉంది అని చెప్పాను. ‘ఓ! ఇంత ఆలస్యంగానా రావడం… అయినా ప్రయత్నిస్తాను’ అంటూ గబగబా రెండుమూడు ఫోన్లు నొక్కాడు. నేను ఆత్రంగా ఫలితం కోసం ఎదురు చూశాను. ‘రేపు అక్కడికి ఒకే ఒక్క బోటు వెళుతోంది. 300 డాలర్లవుతుంది’ అన్నాడతను. ‘బాగా ఖరీదు కదా’ అన్నాను. కాసేపు బేరసారాలు సాగాయి. చివరికి 260 డాలర్ల దగ్గర బేరం కుదిరింది.

నిజమే. గలాపగోస్ ద్వీపాలు చేరుకోవడం కష్టం. వాటిల్లో తిరుగాడడం బాగా ఖరీదైన వ్యవహారం. వచ్చేవాళ్ళు చాలావరకూ ఐదునుంచి ఏడు రోజులు సాగే క్రూజ్ యాత్రల్లో వస్తారు. ఒక ద్వీపాన్నుంచి మరో ద్వీపానికి ఆ ఓడలే తీసుకువెళ్తాయి. వాటి ధరలు కూడా కావాలనే చుక్కలంటేలా ఉంచుతారు. అన్ని రకాల పన్నులూ వేసి, అవి సరదాపురుషులకు అందుబాటులో లేకుండా చూస్తున్నారు. దాని ద్వారా ద్వీపాల మీద అనవసరపు టూరిస్టుల వత్తిడి తగ్గించాలన్నది అధికారుల ఆలోచన.

మర్నాటి కార్యక్రమం స్థిరపరచుకున్నాక పుయెర్తో అయోరా పట్టణ పరిశీలన ఆరంభించాను. సాగరతీరాన నడక ఆరంభించాను. అక్కడ ఉన్న ఛాల్స్ డార్విన్ ఎవెన్యూ అన్న వీధి – రెస్టరెంట్లు, షాపులు, చిన్న చిన్న మ్యూజియమ్‌లు, చిట్టి పొట్టి మాన్యుమెంట్‌లు, ట్రాఫిక్ ఏజెంట్‌ల ఆఫీసులు, వాటన్నిటిలోకి వచ్చి పోయే మనుషులు – బాగా కళకళలాడుతూ కనిపించింది. ఆ మెయిన్ రోడ్డునుంచి పక్కకు మళ్ళే చిన్న వీధుల్ని గమనించినపుడు అక్కడ ఓ ఫూడ్ స్ట్రీట్ దర్శనమిచ్చింది. సహజంగానే ఆ వీధి దుకాణాల్లో సీ-ఫూడ్ విరివిగా దొరుకుతోంది.

లాస్ కియోస్కోస్ అన్న రెస్టరెంట్లో నేను కుదురుకున్నాను. ఓ సెవీచె ఆర్డర్ చేసాను. ఎక్వదోర్ సెవీచెలతో నాకు గాఢమైన అనుబంధం ఏర్పడిపోయింది. రుచి బావుంటుంది. పరిమాణం బావుంటుంది. వాటితోపాటు అనుపానంగా అవకాడో, అరటికాయ చిప్స్ ఇస్తారు – కడుపు నిండే భోజనమది.

నింపాదిగా ఆనాటి అనుభవాలను నెమరు వేసుకుంటూ హోటలు కేసి నడిచాను… మార్కెట్ వీధులకు పెడగా ఉన్న మా హోటల్లో, ఆ పొద్దు పోయిన సమయం సద్దుమణిగి ఉంటుందనుకున్నాను. నా ఊహకు భిన్నంగా అక్కడ ఉత్సవ వాతావరణం పలకరించింది. స్థానిక జనాలంతా అక్కడ పోగుపడి కనిపించారు. లైట్ మ్యూజిక్ సాగిపోతూ ఉంది. గుర్తు తెలియని శక్తి నిండిన స్పానిష్ సంగీతం పరిసరాలను ఆవరించింది. నేను ఒక పక్కన చేరి ఆ సంగీతాన్ని ఆస్వాదించసాగాను. ఆ ఉదయం రిసెప్షనిస్టుగా పరిచయమయిన పాబ్లో ఆ క్షణాన వెయిటర్ అవతారాన్ని ధరించి కనిపించాడు. నేను వద్దు వద్దన్నా వినకుండా ‘మా హోటలు తరఫున కానుక’ అంటూ ఓ బీరు చేతికి అందించాడు. ఆ చల్లని బీరుని గుటకలు వేస్తూ మరి మూడు పాటలు విన్నాను. విన్నాక మెల్లగా నా గదికి చేరి పడక ఎక్కాను.


గలాపగోస్‌లో రెండవరోజు ఉదయాన అనుకొన్న ప్రకారం రేవు ప్రాంతానికి చేరుకున్నాను. అల్పాహారంగా ఓ బొలోన్ దె వర్దె అంది పుచ్చుకున్నాను. నవ్వొచ్చింది – వారం రోజులుగా ఎక్వదోర్‌లో ఉంటున్నాను గదా, అసలు సిసలు ఎక్వదోరియన్‌గా మారుతున్నానన్నమాట!

నేను ఎక్కింది కూర్చోడానికీ భోజనాలకూ విడివిడి విభాగాలున్న, సిబ్బంది కోసం పడకగదులున్న, యాట్ (yacht) అనే రకపు పెద్ద సైజు బోటు. ఫిలిప్ అన్న వ్యక్తి మా గైడు. కెప్టెన్‌తోబాటు మరో ఇద్దరు సిబ్బంది ఉన్నారు. నాలుగు పెద్ద వయసు అమెరికన్ జంటలు, నలభైలలోని ఓ ఇటాలియన్ వ్యక్తి, మలి ఇరవైలలోని ఓ ఎక్వదోర్ యువతి, నేను – ఇదీ మా యాత్రిక సమూహం. ఆ అమెరికన్ జంటలకు పూర్వపరిచయాలు ఉన్నాయి. మేమంతా యాట్ ఎక్కాక, పరస్పర అభివాదాలు ముగిశాక, ఆ అమెరికన్ జంటలు తమతమ కబుర్లలో మునిగిపోయాయి. ముందుకు వెళితే చక్కని దృశ్యాలు చూడవచ్చునన్న ఆలోచనతో నేను ఫ్రంట్ డెక్‌కి చేరుకున్నాను… అక్కడ ఆ ఎక్వదోర్ యువతీ ఇటాలియన్ వ్యక్తీ సూర్యస్నానంలో మునిగిపోయి కనిపించారు. వాతావరణం చక్కని సూర్యరశ్మితో నిండి ఉంది. ఎంతో ఆహ్లాదకరంగానూ ఉంది. నన్ను గమనించిన వాళ్ళిద్దరూ ఉత్సాహంతో పలకరించారు.

ఆ ఇటాలియన్ మనిషి పేరు స్తెఫానో. రోమ్ నగరం. ఆ ఎక్వదోర్ యువతి పేరు దియానా. వైద్యుల కుటుంబం మనిషి. శాంతియాగోలోని యూనివర్శిటీ ఆఫ్ చిలేలో పనిచేస్తోంది. నల్లని జుట్టు, తగుమాత్రం కమిలిన ఒంటి రంగు – ఆమె భారతీయ యువతి అంటే నమ్మేట్టుగా ఉంది. ప్రయాణాలు, సాహసాలు అంటే ఇష్టమట. మా బోటు బార్తొలోమో ద్వీపానికేసి పరుగులు తీస్తున్న సమయంలో మేము ముగ్గురం చక్కగా కబుర్లలో పడ్డాం. మా మా యాత్రానుభవాలు పంచుకున్నాం. మాలోని భ్రమణకాంక్ష మమ్మల్ని క్షణాల్లో స్నేహితులుగా మార్చింది.

మేము వెళుతోన్న దారిలో ఏవేవో చిరుద్వీపాలు కనిపించాయి. గైడు ఫిలిప్ సాయంతో అక్కడ కనిపించిన పక్షులను గుర్తుపట్టే ప్రక్రియలో పడ్డాం. నీలి కాళ్ళ బూబీలు, ఎర్రకాళ్ళ బూబీలు, నజ్కా బూబీలు, పెలికన్లు కనిపించాయి. ద్వీపాల ఒడ్డున విశ్రమిస్తున్న సీల్‌లు, సీ లయన్‌లు కూడా కనిపించాయి.

బార్తొలోమో ద్వీపానికి కొండగుర్తుగా పినకిల్ రాక్ అన్న శిలావిశేషం ఉంది. నిడుపాటి శిల చిట్టచివర సూదిలాంటి మొన – ద్వీపానికి రక్షణ సమకూర్చుతోందా అనిపిస్తుందా శిలను చూస్తే. పడవ దిగి ఓ కిలోమీటరు నడిచి దగ్గరలో ఉన్న కొండపైకి చేరితే ద్వీపమంతా ఒక్కసారిగా మన కళ్ళముందు విచ్చుకుంటుంది. వయ్యారాలు పోయే సాగరతీరం, ఆ తీరాన్ని ఆభరణాల్లాగా అన్నివేపులా అంటిపెట్టుకుని ఉండే అతి నీలమూ ఆకుపచ్చా కలగలసిన సాగరజలాలు, నేనున్నానంటూ నిట్టనిలువుగా ఓ పక్కన నిలచి కనబడే పినకిల్ రాక్ – చూడచక్కని దృశ్యమది. రెండు కళ్ళూ చాలవు. ఆ చిరుద్వీపపు ఉపరితలమంతా అనేక వర్ణాల సమ్మేళనం. ఆకుపచ్చని భూభాగాలు, వాటి పక్కన ఎరుపునుంచి గోధుమరంగుమీంచి నలుపువరకూ అనేక వర్ణాలలో వ్యాపించి కనిపించే బీడు భూమి – మొత్తం ద్వీపాన్నంతటినీ ఒకే ఫ్రేములో ఫోటో తీయగలిగితే అద్భుత వర్ణచిత్రంగా శోభిల్లే సుందరసీమ అది.

కాసేపు బార్తొలోమో ద్వీపంలో గడిపి మేమంతా ఆ దగ్గరలోనే ఉన్న శాంతియాగో ద్వీపం వేపు సాగిపోయాం. దారిలో మమ్మల్ని ఓ పెంగ్విన్‌ల సమూహం పలకరించింది. ధృవప్రాంతాలతో ముడివడిన పెంగ్విన్‌లు, అడవులు నిండిన ఈ భూమధ్యరేఖా ప్రాంతంలో కనిపించడం ఎంతో వింతగా అనిపించింది. ఈలోగా మా మనసెరిగిన బోటు కెప్టెన్ స్పీడు తగ్గించాడు. పెంగ్విన్‌లను దగ్గరనుంచి చూసి ఫొటోలు తీసుకునే అవకాశాన్ని కల్పించాడు.

శాంతియాగో ద్వీపంలో మా బోటు లంగరు వేసింది. మేమంతా తళతళా మెరుస్తోన్న సన్నని ఇసుక మీదకు దిగాం. అక్కడి నల్లని రాళ్ళమీద వందలాది ఎర్ర పీతలు తారాడుతూ కనిపించాయి. గుర్తుండిపోయే దృశ్యమది.

మా బోటుమేట్లంతా స్నోర్కలింగ్ (snorkeling) చెయ్యడం ఆరంభించారు. తీరప్రాంతాలలో లోతు తక్కువ సాగరజలాల్లో, సముద్రగర్భంలో సహస్రాబ్దాలుగా రంగురంగుల గుట్టలుగా పోగుపడిన పగడాల నిధులను – కోరల్స్‌ను – దగ్గరనుంచి చూసే అనుభవాన్ని మూటగట్టుకోవడానికి ఈ స్నోర్కలింగ్ అన్నది అతి సులభమైన పద్ధతి.

నీళ్ళలో చూడటానికి అనువుగా వాటర్ టైట్ గాగుల్స్ ధరించి, ఊపిరి పీల్చుకోవడానికి అనువుగా ఓ ఆరంగుళాల గొట్టపు పరికరాన్ని ముఖానికి బిగించి, ఆ పరికరం పై కొస నీటి ఉపరితలం మీద ఉండేలా జాగ్రత్తపడుతూ, నీటిమీద తేలుతూ, నీటి దిగువన కొద్దిపాటి లోతులో ఉన్న అనేక వర్ణాల కోరల్స్‌ను, చేపలు తదితర జలజీవాలనూ చూడటాన్నే స్నోర్కలింగ్ అంటారు. అంతగా ఈతరాని వాళ్ళు, నీటిమీద తేలడానికి అనువుగా గాలి నింపిన లైఫ్‌బాయ్‌లను ఒంటికి తగిలించుకోవచ్చు. ఆ సన్నాహాల పుణ్యమా అని, ఆరడుగుల దిగువన సముద్రగర్భంలో కనిపించే మనకు తెలియని పగడాల ప్రపంచాన్ని కళ్ళారా చూస్తూ విహరించవచ్చు. పగడాలతోపాటు రంగురంగుల చేపలతోనూ సావాసం చేయవచ్చు. అలా అందరం ఓ అరగంటసేపు స్నోర్కలింగ్ చేస్తూ గడిపాం.

బోటు ఎక్కేముందే మా అందరినీ మా బూట్లను అవుటర్ డెక్ మీద వదిలి మేము తెచ్చుకున్న రబ్బరు చెప్పులు వేసుకుని లోపలికి రమ్మన్నారు అక్కడి సిబ్బంది. ఆ సూచనను అందరం అనుసరించాం. ప్రయాణం ముగిసి తిరిగి షూసు వేసుకున్న సమయంలో నా రబ్బరు చెప్పులు తీసుకోవడం మరచిపోయాను. ప్రయాణం ముగిశాక ఆ సంగతి గుర్తొచ్చింది. అయ్యో అనిపించింది. ఎన్నో ఏళ్ళపాటు ఆ రబ్బరు చెప్పులు నాకు ఎంతో విశ్వాసంగా సేవ చేసాయి… దిగులనిపించింది. నిజానికి నాకు కార్లు, వాచీలు, ఫర్నిచరులాంటి భౌతిక వనరుల విషయంలో పెద్దగా అనుబంధం ఉండదు. కానీ ఈ రబ్బరు చెప్పులు వేరు: ఎన్నో యాత్రల్లో అవి నా సహచరులుగా మెలిగాయి. ఏ క్షణాన కావాలంటే ఆ క్షణాన నాకు సేవ చేశాయి. నా శరీరంలో భాగంగా మసిలాయి. అలాంటి వాటిని అంత అజాగ్రత్తగా ఎలా వదిలేశానూ? అవి మళ్ళా నా కంటబడతాయా?


మా తిరుగు ప్రయాణమంతా బోలెడన్ని కబుర్లతో నిండిపోయింది. ఇండియా, ఇటలీ, చిలే, ఎక్వదోర్ – ఆయా దేశాల జీవనసరళి, సంస్కృతి; ఎన్నో విషయాలు మా మధ్య చర్చకు వచ్చాయి. ఎంతో సమాచారాన్నీ ఎన్నో అనుభవాలనూ ఇచ్చి పుచ్చుకున్నాం. ‘మా డాక్టరు చెల్లిని మీరు కలవగలిగితే ఎంతో బావుండేది. ఆమె పుయెర్తో అయోరాలోనే ఉంది. తన రేడియాలజీ పరీక్షలకు ప్రిపేరవుతోంది’ అంది దియానా. ‘అదేం భాగ్యం? నేను సాయంత్రం ఖాళీగానే ఉన్నాను. మీకు కుదిరితే మనం ముగ్గురం కలసి డిన్నరు చెయ్యవచ్చు’ అన్నాను. ఆ మాటకు దియానా సంబరపడింది. వాళ్ళ చెల్లినడిగి ఏ మాటా చెపుతానంది. వాళ్ళిద్దరూ ఆ దేశానికే చెందినవాళ్ళు కాబట్టి పట్నంలోపల ఎక్కడో తక్కువ ధరలో వసతి సంపాదించారట. నేను ప్రయాణం ముగించి హోటలు చేరుకొనేసరికి దియానానుంచి డిన్నరు ప్రోగ్రాం నిర్ధారిస్తూ మెసేజ్ వచ్చింది. తనూ తన చెల్లెలూ అలా నాతో డిన్నరు చెయ్యగలుగుతున్నందుకు ఎంతో సంబరపడుతున్నాం అన్నది దియానా. ఊళ్ళో చక్కని సీ-ఫూడ్ దొరికే రెస్టరెంటు ఒకదాన్ని డిన్నరుకు ఎంపిక చేసినట్టుగా చెప్పి, ఆ వివరాలు పంపింది. ఆమె ఎంపిక చేసిన రెస్టరెంటు ఛాల్స్ డార్విన్ ఎవెన్యూకు బాగా దూరాన ఉందట… టూరిస్టుల హడావుడి ఏమాత్రం సోకని ప్రదేశమట. స్థానికులు అభిమానించే రెస్టరెంటట… అలా డిన్నరు కార్యక్రమం స్థిరపడుతున్నప్పుడు, నాలుగు రోజుల క్రితం కీతో నగరంలో గుజరాతీ మూలాల బ్రిటిష్ వనిత నీనా కలవడం, మళ్ళా ఆమెను గలాపగోస్ ద్వీపాల్లో కలుసుకొనే అవకాశం ఉందని అనుకోవడం గుర్తొచ్చింది. ఆమెను కూడా మా ఈ సాయంత్రపు కార్యక్రమంలో చేర్చితే బావుంటుందనిపించింది. దియానాకు పంపిన మెసేజ్‌లో, నాతోపాటు మరో మనిషి డిన్నరుకు చేరే అవకాశం ఉంది అని సూచించాను. ఫోను చేసి డిన్నరు కార్యక్రమం వివరాలు నీనాకు చెప్పి ఆమెనూ ఆహ్వానించాను.

నా దగ్గర్నించి వచ్చిన ఆహ్వానం చూసి నీనా సంతోషపడింది. కానీ తాను అప్పటికే తన ఇతర స్నేహితులతో మరో చోట డిన్నరు కార్యక్రమం పెట్టుకున్నానని, నన్నూ ఆ కార్యక్రమంలో చేర్చుదామనుకొంటున్నాననీ చెప్పింది. అది మరి సాధ్యం కాని విషయం. మావి సమాంతర కార్యక్రమాలయాయి. అయ్యో అనిపించింది. మృదువుగా నా అశక్తతను నీనాకు వివరించాను. ఆమె అర్థం చేసుకొంది. అదే మా మధ్య చిట్టచివరి సంభాషణ…

దియానావాళ్ళు ఎంపిక చేసిన రెస్టరెంటు పేరు ఫఫ్రె గ్యాస్ట్రో బార్. ఊరి మధ్యన, స్థానికుల నివాస స్థలాల నడుమన ఉంది. టాక్సీ పట్టుకుని చెప్పిన సమయానికి అక్కడికి చేరాను. డయానా, ఆమె చెల్లి ఎవెలిన్ సంబరంగా నన్ను ఆహ్వానించారు. రేడియోలజీ పరీక్షల సన్నాహాలవలన తాను బార్తలోమో ద్వీపానికి రాలేకపోయినా నన్ను ఇలా కలుసుకోగలగడం తనకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పింది ఎవెలిన్.

వాళ్ళిద్దరికీ ఆ రెస్టరెంటుతో పూర్వపరిచయం ఉంది. వారికది బాగా నచ్చిన ప్రదేశం. తమకు నచ్చిన ప్రదేశమూ భోజనమూ నాకు రుచి చూపించాలన్నది వారి అభిలాష. దియానాలానే ఎవెలిన్ కూడా ఎంతో స్నేహంగా ఆత్మీయంగా మాట్లాడింది. రేడియోలజీ కోర్సు ముగిశాక స్పెయిన్‌లోగానీ చిలేలోగానీ మరికొంత శిక్షణ పొందాలని ఉందని చెప్పింది.

దక్షిణ అమెరికా అంతా స్పెయిన్ ప్రభావం ఎక్కువ. అంచేత అక్కడి దేశాలలో బాగా చదువుకున్నవాళ్ళు – ముఖ్యంగా వృత్తివిద్యలు నేర్చిన వాళ్ళు, విదేశాలకు వెళ్ళి పని చెయ్యడమూ అంటే ముందస్తుగా స్పెయిన్ వేపే చూస్తారు – మహా అయితే చిలే. మన ఆంగ్ల ప్రభావిత దేశాల్లో యు.కె. వేపో, యు.ఎస్. వేపో, ఆస్ట్రేలియా వేపో చూస్తాం గదా – అలా వాళ్ళు స్పెయిన్, చిలేలకేసి చూస్తారన్నమాట. ఏదేమైనా ఇలాంటి సోషల్ సందర్భాల్లో ఇద్దరు డాక్టర్లు కలసినపుడు వాళ్ళు అప్రయత్నంగా తమ వృత్తి కబుర్లలోకి, డాక్టర్ల ప్రపంచంలోకి జారిపోతూ ఉంటారు. మిగిలినవాళ్ళను పట్టించుకోరు. ఆ పొరపాటు జరగకుండా నేను, ఎవెలిన్ జాగ్రత్త పడ్డాం. ముగ్గురం ప్రయాణాలు, యాత్రలు, ప్రపంచ రాజకీయాలు, భిన్నదేశాల విలక్షణ సంస్కృతులు, ఆహారపుటలవాట్లు – ఇలా ఎన్నో విషయాల గురించి కబుర్లు చెప్పుకున్నాం. అక్కచెల్లెళ్ళిద్దరూ మా ఎవరెస్టు బేస్ కాంప్ యాత్రావిశేషాలు వినాలని ఆసక్తి చూపించారు. హిమాలయాలు అనగానే ప్రపంచంలో ఎక్కడివారికైనా ఆసక్తి కలిగి తీరుతుంది – ఆ పర్వతాల మహిమ అది. నేను చెప్పిన వివరాలన్నీ చెవులు రిక్కించి విన్నారు దియానా, ఎవిలిన్. హిమాలయాల తర్వాత తమ ప్రాంతపు ఆండీస్ పర్వతాలే ప్రపంచంలోని ఎత్తైన శిఖరశ్రేణి అని చెప్పి ముచ్చటపడ్డారు.

గుయాకీల్‌లోని నేరాల ఉధృతి గురించి వారి దగ్గర కదిపాను. ‘మేమిక్కడే పుట్టి పెరిగాం. మాకు అంతా సరళంగా సహజంగానే కనిపిస్తుంది. రోజువారీ జీవితాల్లో నేర సామ్రాజ్యపు నీడలు మమ్మల్ని తాకవు’ అన్నారు వాళ్ళిద్దరూ. వాళ్ళకు గలాపగోస్ ద్వీపాలంటే ఎంతో ఇష్టం. అవి తమ దేశంలో భాగమైనందుకు వాళ్ళకు కాస్తంత అతిశయం కూడానూ!

అక్కచెల్లెళ్ళిద్దరూ పూనుకొని చక్కని పదార్థాలను ఆర్డర్ చేశారు. ఎవెలిన్ ఆ రెస్టరెంటులో మాత్రమే దొరికే ఒక ప్రత్యేకమైన చేపల వంటకాన్ని తెప్పించింది: పిండిలో కూర్చి వేయించిన మధ్యరకం పరిమాణపు చేప, దానితోపాటు చిప్స్, ఇతర అనుపానాలు ఉన్న భక్ష్యమది. మరో స్క్విడ్ బాణీ చేపల వంటకాన్ని దియానా కూడా ఆర్డర్ చేసింది. భోజనం ఎంతో బావుంది. బీరు కూడా దివ్యంగా ఉంది. చక్కని అనుభవం అది. ఎక్వదోర్ దేశాన్ని వదిలిపెట్టే సమయంలో, మెయిన్‌లాండ్‌కు వెయ్యి కిలోమీటర్ల దూరాన ఉన్న ద్వీపంలో, ఇద్దరు తెలివైన, చురుకైన అక్కచెల్లెళ్ళ ఆతిథ్యంలో చక్కని వీడ్కోలు భోజనాన్ని ఆరగించే భాగ్యం ఎంతమందికి కలుగుతుంది? అవును – యాత్రలు మనుషుల్ని దగ్గర చేస్తాయి. అనుబంధాలని ఏర్పరుస్తాయి. అపరిచితుల్ని క్షణాల్లో ఆప్తమిత్రులుగా చేస్తాయి. నాకీ ప్రయాణాల ఆసక్తే లేని పక్షంలో ప్రపంచపు మారుమూల ద్వీపంలో ఇద్దరు స్నేహశీలులతో కలసి కబుర్లు చెప్పుకుంటూ అనుభవాలు పంచుకొంటూ డిన్నరు చేసే అవకాశం లభించేదా?!


గలాపగోస్ ద్వీపాల్లో అప్పుడే రెండురోజులు గడిచాయి. మర్నాడు మధ్యాహ్నం బాల్త్రా ద్వీపంలో విమానం పట్టుకుని గుయాకీల్ మీదుగా కీతోకి చేరుకోవాలి. ‘మిగిలి ఉన్న కాస్త సమయాన్నీ గలాపగోస్ ద్వీపాల్లో సద్వినియోగం చేసుకోవాలి’ అన్న సంకల్పంతో, మూడో రోజున ఉదయం అయిదున్నరకే నిద్రలేచి నడక ప్రారంభించాను. పుయెర్తో అయోరా పట్టణం ఇంకా నిద్రలోంచి లేవనే లేదు. ప్రభాత సమయపు ప్రశాంతతను మనసులో ఇంకించుకుంటూ ఛాల్స్ డార్విన్ ఎవెన్యూలో నడక సాగించాను. అక్కడికి ఐదారు కిలోమీటర్ల దూరాన ఉన్న తోర్తూగా బే వరకూ వెళ్ళి రావాలన్నది నా ఆలోచన. అక్కడికి పడవలోనైనా వెళ్ళవచ్చు – నడిచి అయినా సాధించవచ్చు. వెళ్ళేటప్పుడు బోటులో వెళ్ళి తిరిగి వచ్చేటపుడు నడకను ఆశ్రయిద్దామనుకున్నాను. ఆ రేవు ప్రాంతంలో కాస్తంత జనాల సందడి కనిపించినా బోటు ఆచూకీ దొరకలేదు. బహుశా అంత పొద్దున్నే బోట్లు తిరగవనుకుంటాను. ఇక బోటు ప్రస్తావన పెట్టుకోకుండా తోర్తూగా బే వెళ్ళడానికి దారి వెతుక్కుంటూ నడక సాగించాను. ఆ ఐదు కిలోమీటర్లూ నడిస్తే గంట పడుతుందని గూగుల్ చెప్పింది. కాకపోతే చివరి వరకూ రోడ్డు లేదు – చెట్లూ పొదలలోంచి వెళ్ళాలి.

అక్కడ ఉన్న ఇళ్ళ మధ్యలోంచి ముందుకు సాగాను. చక్కని బూగేవిలా (Bougainvillea) పొదలు కనిపించాయి. కాసేపట్లో కాలిబాట కనిపించింది. అక్కడ కనిపించిన ఒకరిద్దరు స్థానికులు ఓపిగ్గా దారి చూపించారు. ముందుగా ఆ కాలిబాట ఓ చిన్నపాటి కొండమీదకు ఎగబ్రాకింది. ఆ తర్వాత చెట్టూ చేమా నిండిన అడవిలాంటి ప్రదేశం… అవన్నీ స్థానిక వృక్షాలు. వాటిల్లో బ్రహ్మజెముడు వృక్షాలది అగ్రస్థానం. టేబుల్ టెన్నిస్ బ్యాటు ఆకారంలో ఉండే ముళ్ళ ఆకులతో నిండి ఉండే ఒపుంటియా కాక్టస్ బాణీకి చెందిన వృక్షాలవి. సాధారణంగా పొడి నేలలో కనిపించే ఈ బ్రహ్మజెముడు, పొదల స్థాయిని దాటి ఎదగదు. ఇక్కడ మాత్రం అవి పెద్ద పెద్ద కాండాలతో కొమ్మలతో రసం నిండిన ఆకులతో వృక్షాల స్థాయికి ఎదిగి కనిపించాయి. బహుశా అవి స్థానిక పరిస్థితులకు అనువుగా ఎదిగి ఉండవచ్చు.

ఆ అడవిలాంటి ప్రదేశంలో నడుస్తున్నప్పుడు ఒకటి రెండుసార్లు, దారి తప్పలేదు గదా అన్న అనుమానం వచ్చింది. సముద్ర తీరానికి కాకుండా అడవి లోలోపలికి వెళుతున్నానేమో అన్న బెరుకు కలిగింది. కానీ అపుడపుడు బీచ్ దుస్తులు ధరించి, ఇతర పిక్నిక్ సామగ్రిని చేతబట్టి వెళుతోన్న బృందాలు కనిపించి, ‘పర్లేదు – నువు సరైన దారిలోనే వెళుతున్నావు’ అన్న భరోసాని కలిగించాయి. ఆ సంగతి ఎలా ఉన్నా అప్పుడే నిద్రలేచి తమతమ కుటుంబసభ్యులతోనూ, మిత్రబృందాలతోనూ గలగలా కబుర్లు చెపుతోన్న పక్షుల కిలకిలారావాలు నన్ను బాగా ఆలరించాయి. డార్విన్ ఆలోచనలకు ఊతమిచ్చిన ఫించ్ పక్షులు అడపాదడపా కనిపించాయి. అలా నడుస్తూ ఉండగానే తూరుపు దిక్కు ఎర్రబడింది. సూర్యోదయమయింది. లోకమంతా వెలుగుల వెల్లువ. ఉన్నట్టుండి అడవి ముగిసి, సువిశాలమైన, కల్మషాలేవీ లేని సాగరతీరం నా కళ్ళముందు నిలిచింది. అందమైన ఇసుక… అక్కడక్కడా తీరం వెంబడే పొడుచుకు వచ్చి పరచుకొన్న నల్లరాళ్ళు…

అప్పటికే బీచిలో జనాలు పోగుపడి ఉండటం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. నేనే తెల్లవారీవారక ముందే వచ్చేశాను అనుకొంటోంటే, మరి వీళ్ళు ఎప్పుడు ఇక్కడికి వచ్చి చేరారో! ఆ ఇసుకలోను, అక్కడి నల్లని రాళ్ళమీదా పాకుతోన్న నల్లని తొండల్లాంటి ప్రాణులు కనిపించాయి. ఏమిటా అని పరిశీలించాను – మెరైన్ ఇగ్వానాలవి. మామూలు ఇగ్వానాలు భూమికే పరిమితమయితే ఈ సముద్ర సమీపపు మెరైన్ ఇగ్వానాలు మెలమెల్లగా నీళ్ళకు అలవాటు పడి, ఉభయచరాలయ్యాయన్నమాట. డజన్లకొద్దీ ఇగ్వానాలు మనిషి జాడకు బెదరకుండా అక్కడ యథేచ్ఛగా తిరుగాడటాన్ని సంబరంగా చూశాను. ఇగ్వానాలతోపాటు అక్కడ పెలికన్లు, ఎర్రపీతలు, సీ లయన్లు, మరికొన్ని పేరు తెలియని పక్షులూ కనిపించాయి. వాటన్నిటినీ చూసుకుంటూ ఆ సముద్రతీరం వెంబడే గంటన్నర సేపు తిరుగాడాను.

నడక ముగించి మెల్లగా పట్నం దారిపట్టాను. అడవి దాటి ఊళ్ళో అడుగుపెట్టే సరికి ఊరంతా జనంతో కళకళలాడుతూ కనిపించింది. మధ్యాహ్నం మూడు గంటలకు నా విమానం. కానీ అది ఎక్కడానికి బాల్త్రా ద్వీపానికి వెళ్ళాలి. అందుకు రెండు గంటలు పడుతుంది. దానికి తోడు మరో రెండు గంటలని చేతిలో ఉంచుకోవడం క్షేమం… వెరసి నేను అన్నీ సర్దుకుని పుయెర్తో అయోరా వదిలి వెళ్ళవలసిన సమయం వచ్చేసిందన్నమాట.

హోటలు చేరే సమయంలో మా నిన్నటి ట్రావెల్ ఏజెంటు ఒమేరో, చేతిలో ఏదో పాకెట్ పట్టుకుని నాకేసి వడివడిగా రావడం కనిపించింది. ‘నీకో బహుమతిని తెచ్చాను’ అంటూ ఆ పాకెట్ నా చేతిలో పెట్టాడు ఒమెరో. విప్పి చూస్తే అవి నేను నిన్న మరచి వచ్చిన రబ్బరు చెప్పులు! వేటి గురించయితే బెంగపడ్డానో ఆ రబ్బరు చెప్పులు. నేను వాటిని వదిలి వచ్చినా అవి నన్ను వెతుక్కుంటూ వచ్చాయన్నమాట! వాటిల్ని ఒమేరో జాగ్రత్తగా సేకరించి భద్రంగా నాకు అప్పజెపుతున్నాడన్నమాట. ఒక్కసారిగా అతని మీద ప్రేమ పొంగుకు వచ్చింది. గత మూడు రోజులుగా గమనిస్తున్నాను – కనిపించినప్పుడల్లా నవ్వుతూ పలకరించేవాడు… ఇపుడీ విలువకట్టలేని బహుమతి!

అప్పటికే పదిన్నర అయింది. ముందటి రోజే టాక్సీ మిత్రుడు ఆన్హేలోకు చెప్పి ఉంచాను – నన్ను ద్వీపానికి అవతలి వేపున ఉన్న రేవు దగ్గర దింపమని. వస్తానన్నాడు. నేనేగాకుండా ఇంకెవరైనా పాసింజర్లు దొరుకుతారేమో చూస్తానన్నాడు.

పదకొండుకల్లా ఆన్హేలో వచ్చేశాడు. టాక్సీ వెనక సీట్లో ఓ పెద్ద వయసు జంట… హోటలు దగ్గర ఒమేరొ, పాబ్లో, మరి ఇద్దరు సిబ్బందీ ఎంతో ఆప్యాయంగా నాకు వీడ్కోలు పలికారు. ఇదిగో, చిన్నవనిపించే ఈ వీడ్కోళ్ళ వంటి విషయాలే యాత్రికుని మనసులో మెరుపుతీగల్లా చోటు చేసుకుంటాయి. కలకాలం గుర్తుంటాయి.

టాక్సీలో ముందుసీట్లో కూర్చున్నాను. వెనక ఉన్న పెద్దవాళ్ళని పలకరించాను. వాళ్ళూ ఉత్సాహంగా స్పందించారు. కానీ క్షణాల్లో వాళ్ళిద్దరూ ఏదో విషయాన్ని గురించి ఎంతో సీరియస్‌గా చర్చించుకోవడాన్ని గమనించాను – బహుశా ఏదో కుటుంబ వ్యవహారం అయి ఉండాలి. అంచేత వాళ్ళను మరింత పలకరించడం, మాటల్లో పెట్టడం నాకు ఇష్టం లేకపోయింది. టాక్సీ మనిషి ఆన్హేలోతోనే అడపా దడపా ముచ్చట్లు…

మా టాక్సీ శాంతాక్రూజ్ ద్వీపపు దక్షిణ కొసనుంచి ఉత్తరదిశగా సాగిపోయింది. దారిలో మెరక భూములూ అడవినేలలూ వచ్చాయి. ఈ రోడ్డుమీద వెళ్ళడం గత మూడురోజుల్లో నాకు ఇది మూడోసారి. యథాప్రకారం మాకు దారిలో రాకాసి తాబేళ్ళు కనిపించాయి. ఈ తాబేళ్ళు ఇలా మెరకభూముల్లోకి వచ్చే ఋతువు ఇది – మిగతా సమయాల్లో అవి ఆడవుల్లోని ఇతర ప్రాంతాల్లో తిరుగుతూ ఉంటాయని వివరించాడు ఆన్హేలో. చివరకు పడవల రేవుకు చేరుకున్నాం. మళ్ళా మా గలాపగోస్ ద్వీపాలకు ఎప్పుడొస్తారూ అని ఆప్యాయంగా అడిగాడు ఆన్హేలో. ‘వస్తాను. తప్పకుండా వస్తాను… ఈసారి ఇంకా ఎక్కువ సమయాన్ని గడుపుతాను’ అన్నాను. ఒకరికొకరం ఆత్మీయంగా వీడ్కోళ్ళు చెప్పుకున్నాం.

రేవు దగ్గర బోటు ఎక్కి కనలేత్తో జలసంధి దాటి బాల్త్రా ద్వీపానికి చేరుకున్నాం. అక్కడ షటిల్ బస్సు కోసం కాసేపు ఆగవలసి వచ్చింది. రాళ్ళమీద సేదదీరుతోన్న సీ లయన్‌లు కనిపించాయి. రకరకాల పక్షులు కనిపించాయి. అందులో కొన్ని సాగరవిహంగాలు. ఎయిర్‌పోర్ట్ దగ్గర రెండుమూడు ఇగ్వానాలు కనిపించాయి. అవును, ఆ ద్వీపాల్లో ఎక్కడ చూసినా సహజ జీవజాలమే…

విమానం పైకి ఎగిరినపుడు పైనుంచి కొన్ని ద్వీపాలు కనిపించి పలకరించాయి. ఆ ద్వీపాల మీద అడుగు పెట్టాను, రెండు మూడు రోజులు తిరిగాను అన్న ఆలోచనే నాకు విభ్రమ కలిగిస్తోంది. డార్విన్ జీవపరిణామ సిద్ధాంతానికి శిలాన్యాసం చేసిన ద్వీపాలవి. జీవరాసుల గురించి ప్రపంచపు అవగాహనను సమూలంగా మార్చిన సిద్ధాంతానికి పుట్టినిళ్ళవి. 190 ఏళ్ళ క్రితం, డార్విన్ చూసిన జీవజాలాన్నే నేనూ చూసి వస్తున్నాను. 40 ఏళ్ళ క్రితం, డార్విన్ రాసిన ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్ పుస్తకాన్ని చదివి, ఏనాటికైనా గలాపగోస్ ద్వీపాలను చూడాలని చేసుకున్న సంకల్పం ఈనాటికి నెరవేరింది.

తిరిగి చూసుకుంటోంటే ఎంత అద్భుతమైన అనుభవం అనిపిస్తోంది. ఏదో ఒక జురాసిక్ పార్కులో తిరుగాడినలాంటి అనుభవం…

నా తదుపరి గమ్యం కొలంబియా దేశంలోని కార్తాహేన నగరం.

(సశేషం)