పరకాల కాళికాంబ స్వీయచరిత్ర

తెలుగు సాహిత్యంలో మహిళలు రాసిన స్వీయ చరిత్రలు అతి తక్కువ. అందులోనూ రాజకీయాలతో ముడిబడిన స్వీయచరిత్రలను వేళ్ళతో లెక్కపెట్టవచ్చు! అందుకే ఈ మధ్య కాలంలో వచ్చిన మూడు స్వీయచరిత్రలను మనం గుర్తుపెట్టుకోవాలి. కొండపల్లి కోటేశ్వరమ్మగారి నిర్జన వారధి (2012) మొదటిది. నంబూరి పరిపూర్ణగారు రాసిన వెలుగు దారులలో (2014) రెండవది. 2023లో వెలువడిన పరకాల కాళికాంబగారి నా జీవితం కొన్ని జ్ఞాపకాలు ఘట్టాలు మూడవది. ముగ్గురూ తమ తమ జీవితాల్లో కొంత కాలం కమ్యూనిస్టు కార్యకర్తలుగా పనిచేసినవాళ్ళే! వాళ్ళు రాసిన విధానంలో కొంత సింప్లిసిటీ కనిపిస్తున్నా, సమాజం పట్ల, ఉద్యమాలు, సంఘటనలు, రాజకీయాల పట్ల మహిళల దృక్పథం ఎలా ఉందో మనకు అవగాహనకు వస్తుంది. అందుకే వాటిని ఆహ్వానించి చదవవల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాళికాంబ తన పుస్తకంలో మనకు అనేకులైన మనుష్యులతో పరిచయం చేస్తారు. ఎన్నో సంఘటనలను, అనుభవాలను మన ముందుకు తెస్తారు. అందరినీ, అన్నిటినీ ప్రస్తావించడం సాధ్యంకాదు కాబట్టి ముఖ్యమైన వాటికే ఈ వ్యాసంలో చోటు కల్పిస్తున్నాను.

కాళికాంబ జీవితంలో ముఖ్యమైన ఘట్టాలను మనం పరిశీలించినప్పుడు ఆమె బాల్యం, విద్యాభ్యాసం, వివాహం, కమ్యూనిస్ట్‌ రాజకీయాలు, కుటుంబ పరిస్థితులు, కాంగ్రెస్‌ రాజకీయాలు ప్రముఖమైనవిగా అనిపిస్తాయి. ముందుగా ఆమె బాల్యం. ఆమె తండ్రి కామన సత్యనారాయణ మొదట్లో గాంధేయవాది. ఖద్దరు బట్టలు కట్టుకోవడం, రాట్నం మీద నూలు వడకటం చేసేవారు. పిల్లలకి నేర్పేవాళ్ళు. జైలుకు కూడా వెళ్ళారు. తర్వాత తల్లాపురం, అనంతపల్లి, బొమ్మడి, నర్సాపురం స్కూళ్ళలో స్కూలు టీచర్‌గా పనిచేశారు. వారికి పదిహేనుమంది సంతానం! అందులో ఐదుగురు మొగపిల్లలు, కాళికాంబతో సహా ముగ్గురు ఆడపిల్లలు బతికారు. కాళికాంబ తల్లి వరుస కాన్పులతో ఎప్పుడూ సతమతమవుతుండేది. కాళికాంబ తల్లి కంటే ముందే లేచి ఇంటి పనంతా చేసేది. వేకువనే తన ఇంటి గుమ్మమే కాకుండా, చుట్టుప్రక్కలవారి గుమ్మాలు కూడా తుడిచి ముగ్గులు పెట్టేది. తమ్ముళ్ళకి, చెల్లెళ్ళకి నీళ్ళుపోసి తయారు చేసేది. వీటన్నిటి వలన ఆమె కష్టపడటానికి వెనుకాడని మహిళ అని తెలుస్తుంది. పేరంటాలు, పూజలు, అట్లతద్ది ఇష్టంగా చేసేది. ఎవరైనా పేరంటానికి పిలిస్తే ముందుగా తయారయి వెళ్ళి పిలిచిన వాళ్ళకి అన్నీ అమర్చి సహాయం చేసేది. తర్వాత కమ్యూనిస్ట్‌ కార్యకర్తగా పనిచేసినా భగవంతుని మీద ఆమెకున్న అచంచల విశ్వాసం తగ్గలేదు. యథావిధిగా పూజలు చేసేది. గుళ్ళకి వెళ్ళేది. ఒకప్పుడు కమ్యూనిస్ట్‌ కార్యకర్తగా పనిచేసిన భర్త శేషావతారం ఆమె విశ్వాసాలకి అడ్డు తగల్లేదు. పైపెచ్చు కొంత ప్రభావితమైనట్లు అనిపిస్తుంది.

కాళికాంబ చదువులో కూడా ముందుండేది. సంగీతం కూడా నేర్చుకుంది. స్కూల్లో పాటలు పాడి, నాటకాలు వేసి ప్రైజులు సంపాదించుకుంది. తండ్రికి బొమ్మడి బదిలీ అవడం వలన ఆమె చదువు ఆగిపోయింది. పల్లెటూరు కావడం వలన ఆరవ తరగతి వరకే ఆ ఊర్లో ఉంది. ఈడు వచ్చిన పిల్లను పొరుగూరు పంపి చదివించడానికి అమ్మమ్మ అభ్యతరం పెట్టింది. కానీ తర్వాత కాళికాంబ పట్టుదలతో ప్రైవేటుగా ట్యూషన్‌ చెప్పించుకుని చదివి ఎనిమిదవ తరగతి పాసయింది. మూడు హిందీ పరీక్షలు పాసయింది. కమ్యూనిస్ట్ కార్యకర్తగా ఉన్నప్పుడు మాభూమి నాటకంలో కూడా నటించింది.

సుమారుగా 1946 నుండి ఆమె నాన్నగారు, అన్నయ్య హనుమంతరావు కమ్యూనిస్ట్ సిద్ధాంతాలకు ప్రభావితమయ్యారు. దేవుడు లేడని పూజలు మానేశారు. కాళికాంబను కూడా మీటింగులకు తీసుకెళ్ళేవారు. నలుగురితో పరిచయాలు చేసేవారు. కమ్యూనిస్ట్‌ సిద్ధాంతాల పుస్తకాలు చదవమని ఆమెని ప్రోత్సహించేవారు. ఆమె నాన్నగారిని, అన్నయ్యని కల్సుకోడానికి పరకాల శేషావతారం ఇంటికి వస్తుండేవారు. సిద్ధాంత పుస్తకాలు ఇస్తుండేవారు. ఆయన బ్రాహ్మణ యువకుడు. మంచి రచయిత. పార్టీలో ఆర్గనైజరు. కాళికాంబకు ఆయన పట్ల ఆకర్షణ కలిగి ఇష్టం ఏర్పడింది. కానీ వారి నాన్నగారు నిడమర్రు నుంచి వచ్చిన సంబంధాన్ని ఖాయం చేయగా, తండ్రి మాట తోసెయ్యలేక మెదలకుండా ఉండిపోయింది. కానీ కొందరు కమ్యూనిస్ట్‌ కార్యకర్తలు ఆమె తండ్రికి కాళికాంబ ఇష్టం ఏమిటో కనుక్కోమని చెప్పగా, ఆయన ఆమె మనస్సులో ఏముందో తెల్సుకొని, శేషావతారంతో పెళ్ళి ఖాయం చేశారు. పెళ్ళి సెప్టెంబర్‌ 7, 1947న జరిగింది. పూలదండల పార్టీ పెళ్ళి బ్రహ్మాండంగా జరిగింది. జనం తండోపతండాలుగా వచ్చారు. పెళ్ళి తర్వాత నాజర్‌ దళం బుర్రకథ ప్రదర్శన ఇచ్చారు.

తెలంగాణా సాయుధ పోరాటం 4 జూలై, 1946న మొదలైంది. కమ్యూనిస్ట్‌ పార్టీ తెలంగాణ పోరాటానికి సహకరిస్తుందని, పార్టీని, పార్టీ పత్రిక ‘ప్రజాశక్తి’ని ప్రభుత్వం నిషేధించింది. సభలు, ఊరేగింపులు జరపరాదని సెక్షన్‌ 144 పెట్టింది. పార్టీని నిషేధించడం వలన కమ్యూనిస్ట్‌ పార్టీ కార్యకర్తలందరూ రహస్య జీవితంలోకి వెళ్ళిపోయారు. శేషావతారం, కాళికాంబ నాన్నగారు, అన్నయ్య అండర్‌‌గ్రౌండ్‌లో ఉన్నారు. ఆ రోజుల్లో కాళికాంబ చాలా కష్టాలనుభవించారు. ఆమె అమ్మమ్మకి ఆమె పెళ్ళి కమ్యూనిస్ట్‌తో జరగడం సుతరాము ఇష్టం లేదు. ఎప్పుడూ సాధించేది.

కాళికాంబ ఎక్కడికి వెళ్ళినా పోలీసులు వెంటాడుతుండేవారు. ఇల్లు సోదా చేసేవారు. ఇంట్లో సామాన్లు, వండిన వంటలు, ఊరగాయలు అన్ని పాడుచేసి, చేతికి వచ్చినవి పట్టుకుపోతూ ఉండేవారు. నోటికి వచ్చినట్లు ఛండాలపు మాటలనేవారు. ఆడవాళ్ళని నానా భీభత్సంగా భయపెట్టడం, మానభంగాలు చేయడం, కొట్టడం చేసేవారని ఆమె పేర్కొన్నారు. పుస్తకాలు చించేసి పనికొచ్చే బట్టలు పట్టుకెళ్ళేవారు. ఒక్కోసారి భర్త ఇంటికి వచ్చినా, పోలీసులు మళ్ళీ వచ్చి పట్టుకెళతారన్న భయంతో, వణుకుతో, దడతో కాళికాంబ బతికేది. ఆమె చంటిపిల్ల అరుణతో ఉన్నప్పుడు పోలీసులొచ్చి ఈ పిల్ల ఎలా వచ్చిందని ప్రశ్నలు వేశారు. ఆడవాళ్ళని వేధించడం కాదు, చేతనైతే లీడర్లను పట్టుకోండి అని ఎదురు తిరిగారు కాళికాంబ. దీన్నిబట్టి ఆమె ధైర్యం గల స్త్రీ అని తెలుస్తుంది. శేషావతారం నర్సాపురం, రాజమండ్రి జైళ్ళలో గడిపారు.

కాంగ్రెసు సర్కారు నెదుర్కొనే బలం పార్టీకి లేదని, పోరాటం ఆపడం క్షేమమని కమ్యూనిస్ట్‌ పార్టీ నిర్ణయించి 21 అక్టోబరు 1951న పోరాటాన్ని విరమించింది. కమ్యూనిస్ట్‌ కార్యకర్తలు అండర్‌‌గ్రౌండ్‌ నుంచి బయటికి వచ్చారు. తర్వాత శేషావతారం, కాళికాంబలకు కమ్యూనిస్ట్‌ పార్టీతో విభేదాలొచ్చాయి. వాళ్ళు పార్టీలో చేర్చుకోమని ఎంత ప్రాధేయపడినా చేర్చుకోలేదు. పార్టీ చుట్టు తిరిగి విసిగిపోయి కాంగ్రెస్‌ పార్టీ వైపు మళ్ళారు. 1952 ఎన్నికల్లో అల్లూరి సత్యనారాయణరాజుకి నర్సాపురం అసెంబ్లీ సీటు ఇవ్వగా ఆయనకు సపోర్ట్‌గా ఎన్నికల ప్రచారం చేశారు. కానీ కాంగ్రెస్‌ పార్టీ ఓడిపోయింది. 1962 అసెంబ్లీ ఎన్నికల్లో అల్లూరిగారు శేషావతారాన్ని పట్టుబట్టి నర్సాపురం నుంచి పోటీ చేయించారు. శేషావతారం గెలిచారు. 1967 ఎన్నికల్లో ఓడిపోయినా, 1972 ఎన్నికల్లో మంచి మెజారిటీతో గెలిచారు. 1976లో ముఖ్యమంత్రి వెంగళరావు మంత్రివర్గంలో రూరల్‌ డెవలెప్‌మెంట్‌ శాఖ మంత్రిగా చేరారు. రూరల్‌ డెవలెప్‌మెంట్‌ శాఖలో ఉండగా శేషావతారంతో పాటు కాళికాంబ కూడా క్యాంపులకెళ్ళేవారు. గెస్ట్‌హౌస్‌లో ఉండకుండా మీటింగులకి హాజరయ్యేవారు. గ్రామాల్లో ప్రజలకి బర్రెలు, గొర్రెలు, పాడి పశువులు వగైరా శేషావతారం శాంక్షన్‌ చేసేవారు. రోడ్లు, వంతెనలు వేయించేవారు. ప్రజలు తమ బాధల్ని శేషావతారంగారితోనే కాకుండా ఆమెతో కూడా చెప్పుకునేవారు.

1978 ఎన్నికల్లో హాస్పిటల్‌ నుంచి శేషావతారం గెలువగా, క్యాబినెట్‌ మంత్రిగా చేశారు. అంజయ్యగారి మంత్రివర్గంలో పంచాయితీరాజ్‌ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు పంచాయితీ ఎన్నికలు జరిగి 12 సంవత్సరాలు అయిందని, ఎన్నికలు పెట్టాలని పట్టుదలగా శేషావతారం అంజయ్యగార్ని ఒప్పించారు. ఎన్నికల ప్రచారంలో కాళికాంబ కూడా తిరిగారు. శేషావతారం ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకుంటూ ప్రచారంలో పాల్గొనేవారు. శేషావతారం ఎన్నికలను ప్రిస్టేజ్‌గా తీసుకొని డబ్బు ఖర్చు, శ్రమ అధికంగా చేసి రాష్ట్రమంతా కాంగ్రెసును గెలిపించారు. ఈ విజయం వెనుక కాళికాంబ సహకారం ఎంతైనా ఉందని చెప్పవచ్చు. ఇలా శేషావతారం కాంగ్రెస్‌ రాజకీయాల్లో కాళికాంబ ముఖ్యపాత్ర వహించారు. ఎన్నికల్లో భర్తకు చేదోడుగా ప్రచారంలో పాల్గొనేవారు. ఇతర మహిళలను కూడా సంఘటితపరచేవారు. ఒకసారి భర్తను గెలిపించడం కోసం వంటిమీద బంగారం సూత్రాల గొలుసుతో సహా ఇచ్చారు. వస్తువులు తాకట్టు పెట్టిన డబ్బు కూడా వాడేవారు. శేషావతారం రాజకీయంగా ఎదగడానికి తోడ్పడిన అల్లూరి స్మృతికి ఆమె కూడా గాఢంగా అంకితమయి భర్తకు బాసటగా నిల్చింది. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఉద్యమ సందర్భంలో ఉద్యమకారులు శేషావతారాన్ని కొట్టడానికి వచ్చారు. ఆ ఒత్తిడిలో, ఆయన్ని రక్షించే ప్రయత్నంలో ఆమెకు కూడా దెబ్బలు తగిలాయి.

1978 శేషావతారం గుండె జబ్బుతో హైదరాబాద్‌ గాంధీ హాస్పిటల్లో ఉన్నపుడు, పి.వి. నరసింహారావు, మర్రి చెన్నారెడ్డి ఎన్నికల్లో పోటీ చెయ్యవద్దని, ఎమ్‌.ఎల్‌.సి. ద్వారా మంత్రి పదవి ఇప్పిస్తానన్నప్పుడు, ఆమె దొడ్డిదారిన అధికారంలోకి రావడం ఇష్టం లేదని వారికి తెగేసి చెప్పింది. చివరికి ఆమె పట్టుదల వలన శేషావతారం ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి అంగీకరించాల్సి వచ్చింది. ఆ ఎన్నికల్లో భర్త రాజకీయ భవిష్యత్తు కోసం, నగా నట్రాతో సహా సర్వం అర్పించింది. శేషావతారం మళ్ళీ గెలిచి మంత్రయి ఎంతో పేరు సంపాదించుకున్నారు.

కమ్యూనిస్ట్‌ రాజకీయాల నుండి కాంగ్రెస్‌ పార్టీలోకి మారినా మొదట్లో బతుకుతెరువు కోసం ఎంతో శ్రమ పడవలసి వచ్చింది. కాళికాంబ నాన్నగారు శేషావతారంతో జనరల్‌ స్టోర్స్‌ పెట్టించారు. అందులో నష్టం వచ్చింది. శేషావతారం కూడు-గుడ్డ అనే నాటకం రాసి వేయించారు. అందులోనూ నష్టం వచ్చింది. కాళికాంబ నాన్నగారు, అన్నయ్య, శేషావతారం నవ్యాంధ్ర అనే దినపత్రిక పెట్టారు. అది కూడా మూతబడింది. శేషావతారం మద్రాసు వెళ్ళి సినిమాల్లో పనిచేశారు. పుట్టిల్లు సినిమా కోసం పబ్లిసిటీ మేనేజర్‌గా పనిచేశారు. చివరికి ఆ సినిమా సరిగ్గా ఆడలేదు. ఈ సమస్యలన్నింటిని ఆమె ధైర్యంగా ఎదుర్కొంటూ శేషావతారానికి అండగా నిలిచారు. ఇద్దరు కుమారులను, ఇద్దరు కుమార్తెలను కష్టపడి పైకి తీసుకొచ్చారు.

శేషావతారం మరణం తర్వాత అంజయ్యగారు ప్రజల సానుభూతి మీద సీటు తప్పకుండా గెలుస్తుందని నర్సాపురం అసెంబ్లీ సీటు నుండి కాళికాంబను పోటీ చెయ్యమని అడిగారు. ఆమె అంగీకరించింది. ప్రచారం కోసం పార్టీ ఇచ్చే ఫండ్‌ ఆమెకి చేరేదికాదు. వస్తువులు తాకట్టు పెట్టుకుని తెచ్చిన డబ్బు ఖర్చు పెట్టేవారు. శేషావతారానికి తెల్సిన కొందరు ఆమెకు సహాయం చేశారు. చివరికి 800 ఓట్ల మెజారిటీతో ఆమె గెల్చింది. అంజయ్యగారొచ్చి ‘నన్ను బ్రతికించారమ్మ అని రెండు చేతులూ పట్టుకుని కళ్ళకద్దుకుని చాలా సంబరపడ్డారని’ ఆమె రాశారు.

పార్టీ ఇచ్చిన సీటు, ప్రజలిచ్చిన ఓటు, కార్యకర్తల కృషి, తన మీద ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా శేషావతారం మిగిల్చిన పనులు పూర్తి చేస్తానని ప్రమాణం చేసి, పట్టుదలగా ఒక సంవత్సరం బాధంతా గుండెల్లో దాచుకుని మొండిగా తిరిగి సేవ చేశారు. మంత్రులను కలసి, నర్సాపురంలో క్యాంపు చేసి పనులు చేశారు. ఆ రోజుల్లో కాళీపట్నం వెళ్ళాలంటే ఎన్నో ఇబ్బందులు పడవలసి వచ్చేది. పండిన పంట ఎడ్ల బండి మీద వేసుకొస్తుంటే, బండి, ఎద్దులు మునిగిపోయి, ధాన్యం తడిసిపోయి రైతులు నష్టపొయ్యేవారు. పట్టుదలగా బ్రిడ్జ్‌ కట్టడానికి శాంక్షన్‌ చేయించారు.

తిరగాలపల్లిలో జిల్లా పరిషత్‌ చైర్మన్‌ ద్వారా మహిళా సంఘాలకు భవనం ఏర్పాటు చేయించారు. బి.సి. కమిటీ మెంబరుగా, ఎన్నికల కమిటీల్లో పనిచేశారు. కమిటీ సభ్యులతో, చైర్మన్‌‌గారితో కలిసి తిరుపతి వగైరా క్యాంపులకి కూడా వెళ్ళేవారు. మహిళా కమీషన్‌ మెంబరుగా కూడా పనిచేశారు. మంగళగిరి మహిళా సమావేశంలో పాల్గొన్నారు. ఆ మీటింగ్‌లో కాంగ్రెస్‌ పార్టీ గురించి, మహిళా సమస్యల గురించి మాట్లాడి మంత్రుల ప్రశంసలు పొందారు. సంవత్సరం పాటు విసుగు విరామం లేకుండా కార్యక్రమాలు చేశారు. మళ్ళీ ఎన్నికల ప్రకటన రాగా కుటుంబ బాధ్యతలను దృష్టిలో పెట్టుకుని పోటీ చెయ్యనన్న తన నిర్ణయాన్ని హైదరాబాద్‌ వెళ్ళి విజయభాస్కర్‌ రెడ్డిగారికి తెలియజేశారు. కార్యకర్తలు, పుట్టింటివారు ఎన్నికల్లో నిల్చోమని పట్టుబట్టినా, తనదైన నిర్ణయం తీసుకున్నారు. ఆమె రాజకీయ జీవితం అలా ముగిసింది.


కొండవీటి సత్యవతిగారు ఈ పుస్తకానికి ముందుమాట రాశారు. పరకాల ప్రభాకర్‌గారు చివరిమాట రాశారు. వాటిని ప్రస్తావించకుండా వ్యాసాన్ని ముగిస్తే కాళికాంబ స్వీయచరిత్రకు న్యాయం జరుగదు. పరిపూర్ణత కలుగదు. వాళ్ళిద్దరి కృషి వల్లనే ఈ పుస్తకం వెలుగులోకి రావడమే కాకుండా, కాళికాంబను అర్థం చేసుకోవడంలో అవి మరింత తోడ్పడ్డాయి. ప్రభాకర్‌ ప్రోత్సాహంతో లండన్‌లో ఉన్నప్పుడు కాళికాంబ తన జ్ఞాపకాలను రాశారు. ఆ నోట్స్‌ని ప్రభాకర్‌ సత్యవతికి చూపించి పుస్తకరూపంలో తీసుకొస్తే బాగుంటుందని అన్నారు. సత్యవతి కూడా ఆ నోట్స్‌ చదివారు. ఇద్దరూ కలసి పూనుకుని ఈ పుస్తకం తీసుకొచ్చారు.

ముందుమాటలోనూ, చివరి మాటలోనూ రాసిన విషయాలను పరిశీలిద్దాం. సత్యవతిది సీతారామపురం. ఆమె తండ్రి కొండవీటి శ్రీరామమూర్తి వ్యాపారం చెయ్యాలని నర్సాపురం వచ్చారు. వారు అద్దెకుండే ఇంటి ఎడమవైపు కాళికాంబ కుటుంబముండేది. ఆ రెండు కుటుంబాల మధ్య మంచి సంబధాలుండేవి. సత్యవతి అమ్మ అన్నపూర్ణ, కాళికాంబ మంచి స్నేహితులు. సత్యవతి కాళికాంబను అత్తయ్య అని పిల్చేవారు. కాళికాంబ కుమారులు ప్రభాకర్‌, సుధాకర్‌, సత్యవతి కలసి ఆడుకునేవారు. సత్యవతిది పల్లెటూరు నుంచి వచ్చిన పేద రైతు కుటుంబమైనా కాళికాంబ వారిని తక్కువగా చూడలేదని సత్యవతి పేర్కొన్నారు.

సత్యవతి కాళికాంబ నోట్స్‌ చదివి స్పందించిన తీరు చెప్పుకోదగ్గది! ఆమె అంటారు: ‘నాకు తెల్సిన అత్తయ్య ఈ పుస్తకంలో కనబడలేదు. ఈవిడ పరకాల కాళికాంబ. కమ్యూనిస్ట్‌ కార్యకర్త. కులాంతర వివాహం చేసుకున్న ధీర. కమ్యూనిస్ట్‌ ఉద్యమంలో ఎన్నో ఎదురు దెబ్బలు తిన్న ఉద్యమ కెరటం. వ్యక్తిగతంగానూ, ఉద్యమంలోనూ, రాజకీయాల్లోనూ ఎంతో క్రియాశీలకంగా బతికిన ధీశాలి. ఆవిడ ఉద్యమ అనుభవాలు చదువుతున్నప్పుడు ఒళ్ళు గగుర్పొడిచింది. ఈ పుస్తకంలో ఉన్న కాళికాంబ వేరు, నాకు తెల్సిన కాళికాంబ అత్తయ్య వేరు’. ప్రముఖ సినీనటుడు అల్లు రామలింగయ్య, పి.వి. నరసింహారావు, కాసు బ్రహ్మానంద రెడ్డి, పరకాల పట్టాభి రామారావు, ఉద్దరాజు రామం, బుర్రకథ నాజర్‌ లాంటి ఎందరో ప్రముఖ వ్యక్తులతో తమకున్న అనుబంధాన్ని కాళికాంబ చాలా చోట్ల ప్రస్తావించడంతో ఆ తరంలోని చాలా మంది ఉద్యమ భాగస్వాముల గురించి తెలుసుకునే అవకాశం ఈ స్వీయచరిత్ర వలన కలిగిందంటారు సత్యవతి.

కాళికాంబ పెద్ద కుమారుడు పరకాల ప్రభాకర్‌ నిర్మొహమాటంగా ఏది దాచకుండా రాసిన చివరి మాట కాళికాంబ పట్టుదలను, త్యాగనిరతిని, కష్టపడి పనిచేసే ఓర్పును, బంధుప్రియత్వాన్ని, సర్దుకుపోయే తత్వాన్ని, మనుష్యులను కలుపుకుంటూ పోయే మనస్థత్వాన్ని, దీటైన వ్యక్తిత్వాన్ని కళ్ళముందుకు తెచ్చాయి. మొదటి నుంచి ప్రభాకర్‌కి తండ్రి అంటే ఎక్కువ ఇష్టం ఉండేది. ఆయన పట్ల ఆరాధన, ఒక విధమైన హీరో వర్షిప్‌ ఉండేది. కాని తర్వాత కాళికాంబతో సాన్నిహిత్వం పెరిగి, ఆమెను మరింత అర్థం చేసుకునే అవకాశం ఆయనకు కలిగింది. ఆ దగ్గరితనం వలన ఆమె పట్ల ఆరాధనా భావం, అభిమానం రెట్టింపయ్యింది. అందుకే ఇటువంటి పరిపక్వతతో గూడిన చివర మాట రాసి, వైవిధ్యభరితమైన ఆమె వ్యక్తిత్వాన్ని మనముందుంచారు.

మొదటిగా పిల్లల కోసం ఆమె పడ్డ తాపత్రయం, వారి బలహీనతలను క్షమించే ఓర్పు, ఆమెను ప్రేమమూర్తి అయిన తల్లిగా నిలబెడతాయి. ప్రభాకర్‌ విషయానికొస్తే తమ బంధువుల అమ్మాయిని వివాహం చేసుకోకుండా, తనతో పాటు చదువుకున్న అరవ అమ్మాయి నిర్మలను వివాహం చేసుకుంటానన్న అతని నిర్ణయాన్ని ఆమె కాదనలేదు. పైపెచ్చు బంధువులు ఆ నిర్ణయాన్ని నిరసించి, రాకపోకలు లేకుండా చేసినా, తట్టుకుని కోడలిని అక్కున చేర్చుకుంది. అంతేకాకుండా కోడలి తల్లిదండ్రులు అన్ని సౌకర్యాలతో కొడుకు దగ్గర హాయిగా ఉండటాన్ని ఆమోదించి ఆదరించింది. ఇన్ని చేసినా కోడలు ఆమె పట్ల గౌరవాన్ని, మర్యాదను నిలుపుకోలేకపోయింది.

కులవివక్ష వలన కూడా ఆమె ఎన్నో అవమానాలు, మానసిక క్షోభ భరించింది. ఎవరో కొందరు తప్ప, భర్త తరపువారు ఆమె కులం వలన ఆమెను తక్కువ చేసి చూడటం చేశారు. మంత్రిగారి భార్యయినా, స్వయంగా శాసనసభకు ఎన్నికైనా, కుల అహంకారంతో ఆమెను సూటిపోటి మాటలంటూ, కాకుల్లా పొడుస్తూ ఆమెను బాధించారు. అవేమీ పట్టించుకోని పరిణీత ఆమె. తన మనస్సుని ప్రతికూల ధోరణి వైపు సడలనివ్వని ధీరత్వం ఆమెది. విజేతగా అన్ని అవమానాలను కడుపులో పెట్టుకుని, భర్త కుటుంబంతో దూరం పెరగకుండా రాకపోకలు జరిగేలా చూసింది. భర్త ఒకటి రెండు సార్లు దారి తప్పబోతుంటే అడ్డుకుని దారి మళ్ళించిన గొప్ప ఇల్లాలు ఆమె. ఈ విషయాలన్నీ ఆమె తన పుస్తకంలో రాయకపోవడం ఆమె గొప్పదనానికి నిదర్శనం.

కొంతమంది ఆమెను తమ స్వంత ప్రయోజనాల కోసం ఉపయోగించుకున్నారు. నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీలో కొందరు ప్రభాకర్‌ మీద చాడీలు చెప్పి, అతనికి వ్యతిరేకంగా ఆమె చేత పత్రికా ప్రకటన ఇప్పించారు. అది ప్రభాకర్‌కి రాజకీయంగా చాలా నష్టం కలుగజేసింది. ఆమె పట్టదల అటువంటిదని నిర్మొహమాటంగా చెప్పడం ఆయన నిజాయితీకి నిదర్శనం. తల్లి గుణాలు పుణికి పుచ్చుకున్న వ్యక్తిగా మనకు కనపడతారు.

ఆమె పెద్దగా సుఖపడలేదని, చివరి రోజుల్లో సుఖపడినా ఆమెకు తెలియలేదని ప్రభాకర్ రాశారు. జ్ఞాపకశక్తి బాగా తగ్గిపోయి, అమ్నీసియాతో బాధపడినట్లు రాశారు. తన గురించి, నాన్నగారి గురించి ఆమె ఇంకా రాసుంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. చివరిగా ముగిస్తూ ఆమె గురించి ఆయన రాసిన వాక్యాలు మరపురానివి: ‘నువ్వు ఎంతమందికి బ్రతుకు తెరువు చూపించావు, ఎంతమంది చదువు సంధ్యలకు సాయం చేశావు. ఎంతమందికి వండి వార్చి, వడ్డించావు! ఎన్ని పెళ్ళిళ్ళు చేశావు, ఎన్ని కుటుంబాలు నిలబెట్టావు, ఎన్ని గృహచ్ఛిద్రాలను పరిష్కరించావు, ఎంతమందిని దారిలోకి తెచ్చావు, ఎంతమందిని ఆదుకున్నావు! అక్కా, అమ్మా, పిన్నీ, వదినా, చెల్లీ అంటూ నీ సాయం కోరి వచ్చిన ఎవరినీ ఎప్పుడూ నువ్వు వట్టి చేతులతో తిప్పి పంపలేదు. మన ప్రాంతంలో సుఖశాంతులతో వర్ధిల్లుతున్న అనేక కుటుంబాలు నీ పరోపకార పరాయణతకు ప్రత్యక్ష సాక్ష్యాలు… అమ్మా, నీకు నేనింతకన్నా ఏమివ్వగలను? నీ కథని, వీరగాథని, ఇలా పుస్తకరూపంలోకి తెచ్చి పదిమందికి తెలియజెప్పడం తప్ప?’

ఎన్నో ఫోటోలతో పాటు, కాళికాంబతో వారిరువురు తీసుకున్న ఫొటోలు ఈ పుస్తకంలో చేర్చడం పుస్తకానికే వన్నె తెచ్చాయి. కందుకూరి రమేష్‌‌ బాబుగారన్నట్లు ఈ పుస్తకానికి మంచి శీర్షిక పెడితే బాగుండేది. సునిశితమైన, సూటిగా ఉండే భావాలతో, పదజాలంతో రాయడం కాళికాంబ ప్రత్యేకత! అందుకే అందరూ చదవాల్సిన పుస్తకం. ఈ పుస్తకం తీసుకొచ్చి పాఠకలోకానికి, ముఖ్యంగా మహిళాలోకానికి, ఎంతో మేలు చేశారని చెప్పవచ్చు!

పేజీలు తిప్పుతున్నప్పుడు కొన్ని గాప్స్‌ కనిపించినా, కొన్ని ప్రశ్నలు తలెత్తినా, మొత్తం మీద ఆమె ఏం చెప్పాలనుకున్నారో దానికే ప్రాధాన్యం ఇస్తే బాగుంటుందని అనిపించింది. ఉదాహరణకి ఆమె కులాంతర వివాహం చేసుకున్నప్పటికీ ఆమె అసలు ఏ కులానికి చెందినదో చెప్పలేదు. అది అంత ముఖ్యం కాదనుకుని ఉండవచ్చు! స్త్రీవాద మాస పత్రిక భూమిక ఫిబ్రవరి 2024 సంచికలో కందుకూరి రమేశ్ బాబు కాళికాంబ స్వీయచరిత్ర మీద రాసిన వ్యాసంలో ‘కాళికాంబ కమ్మ కుంటుంబం నుంచి వచ్చి బ్రాహ్మణుల అబ్బాయిని పెళ్ళాడుతుంది’ అని వ్రాశారు. కానీ ఆమెది బి.సి.లకు చెందిన గౌడ కులమని ఒక స్నేహితుడి ద్వారా తెలిసింది. ఆమెకు తన తల్లి పట్ల ఎంతో ప్రేమ, జాలి ఉందని మనకు తెలుస్తుంది. తల్లి ప్రస్తావన పుస్తకంలో ఎన్నోసార్లు వస్తుంది. కానీ ఆమె తన తల్లి పేరును చెప్పకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. పుస్తకం విషయానుసారంగా, కాలానుసారంగా రాయలేదు. కొన్నిసార్లు సంఘటనలను గుర్తొచ్చిన క్రమంలో రాశారు. అందువలన సావధానంగా అర్థం చేసుకుంటూ చదవడం అవసరం!


ఆత్మకథ: నా జీవితం కొన్ని జ్ఞాపకాలు ఘట్టాలు
రచన: పరకాల కాళికాంబ
ప్రచురణ: భూమిక ప్రచురణలు, 2023.
ప్రతులకు: భూమిక ఉమెన్స్ కలెక్టివ్. ఫోన్ నంబర్ – 040 27660173