ఒక కథేదో రాస్తుంటే, 1995 ప్రాంతంలో నూనె ధర ఎంత ఉండివుంటుందా అన్న నిర్ధారణ కావాల్సి వచ్చింది. పల్లి నూనెనా, నువ్వుల నూనెనా, అది ఏ బ్రాండు – ఇంత సూక్ష్మ వివరం అవసరం లేదు గాని, మరీ గురికి బారెడు దూరం ఉండకపోతే చాలు. అయితే, ఆ నూనెతో ముడిపడిన ఒక ఘటన వల్ల దాని ధర నాకు బాగానే జ్ఞాపకం. కానీ జ్ఞాపకాలతో ఉన్న సమస్య ఏమిటంటే, మనం ఇంకో సంఖ్యను దాని స్థానంలో ప్రవేశపెట్టి చూసినా, అదీ అక్కడ పొసిగినట్టే అనిపిస్తుంది. అందుకే రిస్క్ తీసుకోవద్దనుకున్నాను. కానీ నెట్లో దాన్ని శోధించే మార్గం తెలియలేదు. అయితే, ‘పదేళ్ళ నాటి జాబితా’ పేరుతో ఆజన్మంలో నేను ఒక ఆర్టికల్ రాసివున్నాను. అదేమైనా పనికొస్తుందేమోనని గుర్తొచ్చింది. అందులో లీటర్ సన్‌ఫ్లవర్ ఆయిల్ ప్యాకెట్ 47 రూపాయలని ఉంది. అది 2003 నాటి ధర. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, 2003 నవంబర్ 23నాడు నోట్ చేసిపెట్టినది. అలాంటి కొన్నింటి ధరలనే మళ్ళీ సరిగ్గా పదేళ్ళ అనంతరం 2013 డిసెంబర్లో పోల్చి చూస్తూ రాసిందే ‘పదేళ్ళ నాటి జాబితా’ ఆర్టికల్. దీన్ని బట్టి నా కథకు అవసరమైన నూనె ధరను ఖాయం చేసుకున్నాను. అది అచ్చంగా నా మెమరీలో ఉన్నదే. అదే సన్‌ఫ్లవర్ ఆయిల్ ప్యాకెట్ నా జాబితా ప్రకారం 2013లో 80 రూపాయలు అయింది. అయితే, ఈ జాబితాను వెతుకుతున్నప్పుడే, ఇది రాసి సరిగ్గా మళ్ళీ పదేళ్ళు అయింది కదా అని స్ఫురించింది. ఇప్పటి ధరలతో పాత ధరలను మరోసారి పోల్చవచ్చు కదా అనుకున్నాను. సరిగ్గా 2023 నవంబరో, డిసెంబరో అయివుంటే ఇంకా బాగుండేదేమో! 2024 జనవరి అంటే కూడా గ్యాప్ మరీ ఎక్కువేం కాదుగా!
ముందుగా నాకు తక్షణం గుర్తొస్తున్నవి రాస్తూ పోతాను. వార్తాపత్రికల్లో రాసినట్టుగా ధరలకు ముందు రూ. అని రాయను. అన్నీ రూపాయల్లోనే ఉన్నప్పుడు, మళ్ళీ రూ. రూ. అని వస్తుంటే అది చదవడానికి అడ్డు తగులుతుంది.
డజన్ కోడిగుడ్లకు గుడిమల్కాపూర్ (హైదరాబాద్) చికెన్ సెంటర్లో 80 తీసుకున్నారు. ధరలు పెరిగాయన్న వార్త వచ్చిన తర్వాతి సంగతిది. మళ్ళీ తర్వాతి వారంలో అక్కడే 74 తీసుకున్నారు. 2013లో ఒక్కొక్కటీ 5 రూపాయలు. మరీ ఎక్కువేం పెరగనట్టేనా? 2003లో ఒక్కో గుడ్డు ధర 1.60. పెద్ద సైజు అరటిపళ్ళను ఆమధ్య డజన్ 60 రూపాయలకు కూడా తెచ్చాను గాని, సాధారణంగా వాటి ధర ప్రస్తుతం 40, 50 వరకే ఉంది. చిత్రంగా, 2013లో వాటి ధర 35. ఇవి కూడా పెద్దగా ఏం మారలేదు. కానీ 2003లో 10 రూపాయలు మాత్రమే. ఆర్థికవేత్తలు వీటిని ఎలా చూస్తారో గానీ మొదటి దశాబ్దంలో ధర మూడున్నర రెట్లు పెరిగితే, తర్వాతి దశాబ్దంలో పెద్ద మార్పు కనబడటం లేదు. ఇంకొన్నింటి విషయంలో కూడా ఇది గమనించాను. ఇంకొక ఆశ్చర్యం, ఎల్పీజీ సిలిండర్ ధర. మాది హెచ్‌పీ. ఇరవై ఏళ్ళ కింద బుడ్డి 270 ఉండేది. పదేళ్ళ కింద సబ్సిడీతో 412, సబ్సిడీ లేకుండా 1060కి వచ్చింది. ఇప్పుడు సబ్సిడీ ఏమీ జమవడం లేదు. కానీ చివరగా బుక్ చేసిన సిలిండర్ ధర 955 మాత్రమే. ఈ ధర ఎక్కువ కాదని కాదు గాని, పోల్చినప్పుడు మాత్రం తమాషాగానే ఉంది.
సిగరెట్ల విషయంలో మాత్రం ఇంకోరకంగా ఆశ్చర్యం కలుగుతుంది. కింగ్సైజ్ గోల్డ్‌ఫ్లేక్ ఇరవై ఏళ్ళ కింద, అంటే 2003లో వార్తాపత్రిక ధరతో సరిగ్గా సమానంగా 2.80 ఉండేది. పదేళ్ళ తర్వాత, 2013లో పేపర్ ధర 5 అయితే, సిగరెట్ 8కి పెరిగింది. అప్పుడు పేరు రాయలేదు గానీ ఇవి ‘ఈనాడు’ ధరలు అయివుంటాయి. ప్రస్తుతం ‘సాక్షి’ ధర మామూలు రోజుల్లో 5.50, ఆదివారం నాడు 7. అదే ‘హిందూ’ అయితే 8, 12. కానీ ఇప్పుడు సిగరెట్ ధర ఒక్కొక్కటీ 18 రూపాయలు.
ఇక, ఇరవై ఏళ్ళ కింద మూడ్రూపాయలు ఉన్న హైదరాబాదీ ఇరానీ చాయ్ కప్పు పదేళ్ళ కింద పది రూపాయలైంది. ఇప్పుడు 20. ఇది కూడా ఎక్కువ పెరిగినట్టే. పాలు ఇప్పుడు లీటర్ 58. మేము మొదటినుంచీ ‘విజయ’ లాయలిస్టులం. పదేళ్ళ కింద దాని ధర 34. బ్యాచిలర్‌గా ఉన్నప్పుడు మాత్రం 200 ఎంఎల్ ప్యాకెట్ తెచ్చేది. ఇరవై ఏళ్ళ కింద దాని ధర 3.50. ఇరవై ఏళ్ళ కింద జెమిని టీ పొడి 25 గ్రాములకు 4.50 ఉండేది. ఇప్పుడు మేము లూజ్‌గా తెచ్చుకుంటున్నాం. హైదరాబాదీ ఫ్లేవర్డ్ టీ పొడి. పావుకిలో నూర్రూపాయలు. బియ్యం శ్రీరామ రకం క్వింటాల్ ఇప్పుడు ఆరు వేలంటున్నారు. మసూరి బియ్యం కిలో ఇరవై ఏళ్ళ కింద 16, పదేళ్ళ కింద 40.
సెలూన్లో హెయిర్ కట్కు ఇరవై ఏళ్ళ కింద 12 తీసుకున్నారు. అప్పుడు పటాన్చెరులో ఉన్నాను. పదేళ్ళ కింద గుడిమల్కాపూర్‌లో 30 తీసుకునేవారు. ఇది కాలనీ లాంటి చోట్లలో. మెయిన్ రోడ్డు మీద మాత్రం 60 తీసుకునేవారు. ఇప్పుడు మేముండే మెహిదీపట్నం నవోదయా కాలనీలో 80 తీసుకుంటున్నారు. షేవింగ్ అయితే 50. ఇరవై ఏళ్ళ కింద ఇది ఆర్రూపాయలు ఉండేది. 125 గ్రాముల రిన్ సబ్బుకు ఇరవై ఏళ్ళ కింద 8.50. ఇప్పుడు 150 గ్రాములది 20. ఇరవై ఏళ్ళ కింద నెలకు నూర్రూపాయలుగా ఉన్న కేబుల్ బిల్ పదేళ్ళ కింద రెండు వందలైంది. ఇప్పుడైతే రెండేళ్ళుగా మా ఇంట్లో కేబుల్ కనెక్షన్ లేదు. కేబుల్ మాత్రమే సినిమాలు చూడటానికి మార్గమన్నది పోయిందిగా!
అన్ని సూత్రాలనూ తుంగలో తొక్కుతున్నవి మాత్రం మొదటినుంచీ ఉల్లిగడ్డలు, టమోటాలు. వాటి ధరల్ని రాసిపెట్టడంలో కూడా అర్థం లేదు. నా జాబితా ప్రకారం వీటి ధరలు: టమోటా 2003లో 8. 2013లో 40. అంటే, రూపాయికి కిలో దాకా కిందికి పడిపోయి మళ్ళీ ఒక దశలో స్థిరపడిన ధరలు ఇవి. ఇప్పుడు వందకు మూడు కిలోలు. ట్రాలీల్లో తెచ్చేవాళ్ళయితే నాలుగు కిలోలు కూడా ఇస్తున్నారు. ఆమధ్య 20కి కూడా కిలో వచ్చింది. అంతకుముందు 200కు పెరిగి హాహాకారాలు పుట్టిచ్చింది. ఇక, ఇరవై ఏళ్ళ కింద తొమ్మిది రూపాయలు ఉన్న ఉల్లిగడ్డలు, పదేళ్ళ కింద 34 అయ్యాయి. ఇప్పుడు కూడా 120కి మూడు కిలోలు వస్తున్నాయి. ఆమధ్య అయితే ఎర్రగడ్డలు నూటికి నాలుగు, ఐదు కిలోలు కూడా ఇచ్చారు. కాబట్టి, కొన్నింటి ధరలను కచ్చితంగా రాయడం కష్టం. ఆలుగడ్డలు కూడా అంతే. 2003లో పన్నెండు రూపాయలున్నవి, 2013లో 24 అయ్యి, ఇప్పుడు 30 వరకు నడుస్తున్నాయి.
జిరాక్స్ చేయించుకుంటే ఒక కాపీకి ఇరవై ఏళ్ళ కిందా రూపాయే, ఇప్పుడూ రూపాయే. కాకపోతే చిన్న షాపుల్లో రెండ్రూపాయలు తీసుకోవచ్చు. పదేళ్ళ కిందా, ఇప్పుడూ మల్టీప్లెక్స్‌లో సినిమా టికెట్ ధర కూడా దాదాపుగా 200 అలాగే ఉంది. కొన్ని చోట్ల మాత్రం 300 వరకు ఉంది. అయితే, ఇప్పుడు జీఎస్టీ అదనంగా పడుతోంది. ఇరవై ఏళ్ళ కింద మల్టీప్లెక్సులు లేవు. అప్పుడు టాకీసుల్లో బాల్కనీ టికెట్ హైదరాబాద్‌లో 35–40 వరకు ఉండేది.
ఇకనుంచీ వివరణలు ఇవ్వకుండా వస్తువు, వాటి ధరలు రాస్తాను. అన్నీ కిలోకు. బ్రాకెట్లో ఇచ్చేవి 2003, 2013, ప్రస్తుత ధరలు. ప్రస్తుతం అంటే 2024 జనవరి తొలి పక్షం. సౌలభ్యం కోసం 2003, 2013, 2023 అనుకుందాం. అలా అయితే పోల్చి చూడటానికి సులువుగా ఉంటుంది. చక్కెర (16, 32, 42); ఉప్పు (6.50, 16, 28); గోధుమ రవ్వ (14, 32, 44); చికెన్ (64, 148, 200); మటన్ (120, 400, 700); మైసూర్ శాండల్ సబ్బు (18, 30, 42), అజయ్ టూత్ బ్రష్: స్టాండర్డ్ రెగ్యులర్ మోడల్ (15, 21, 22. చిత్రం; ఒక్క రూపాయే పెరిగింది); కాల్గేట్ టూత్ పేస్ట్ 100 గ్రా. (30, 37, 69); ఆల్ ఔట్ (42, 59, 75); సాధారణ 1.5 వోల్ట్స్ బ్యాటరీ (7, 10, 15); లేజర్ బ్లేడ్ (1.50, 2, 2.50); రెనాల్డ్స్ జెట్టర్ పెన్ (15, 20, 29); మీడియం సైజు కుండ (15, 50, 200); రూపా చేతుల బనీన్ (40, 75, 170–ఇది ‘ఎసా’ ధర); యూరో అండర్వేర్ (45, 100, 126); టైలర్ ఛార్జ్: చొక్కా (50, 200, 250); టైలర్ ఛార్జ్: ప్యాంట్ (90, 250, 400); లీటర్ పెట్రోలు (37, 83, 109.58); బీరు 650 ఎంఎల్ (45, 90, 140); మొక్కజొన్న క్వింటాల్ (505; 1,274; 2,077); హైదరాబాద్–వేములవాడ ఎక్స్‌ప్రెస్ బస్ టికెట్ (58, 116, 200); సాధారణ మోటార్ బైక్ (40 వేలు, 64 వేలు, 92 వేలు); బంగారం 10గ్రా. 24 క్యారెట్లు (6,115; 30,550; 63,533); వెండి కిలో (9,000; 45,460; 77,500).
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పు 2003లో 57,141 కోట్లు, 2013లో 1,60,000 కోట్లు. ఇప్పుడు తెలంగాణది, ఆంధ్రప్రదేశ్‌ది కలుపుకోవాలి. తెలంగాణది 6.71 లక్షల కోట్లు, ఆంధ్రప్రదేశ్‌ది 4.28 లక్షల కోట్లు. ఇవి రెండూ ప్రస్తుత ప్రభుత్వాలు వెల్లడించినవి.
రూపాయి మారకం విలువ ఇలా మారింది: డాలర్ (45.53, 62.72, 83.0); యూరో (56.14, 85.0, 92.22); పౌండ్ (79.70, 101.66, 105.96). బీఎస్ఈ సెన్సెక్స్ సూచీ (5,263; 20,217; 71,658).
రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేటు (6 శాతం, 9 శాతం, 6.5 శాతం) తగ్గింది కానీ పల్లెటూళ్ళలో వ్యక్తిగత వడ్డీ ఇరవై ఏళ్ళుగా అదే కొనసాగుతోంది. నూటికి నెలకు రెండు రూపాయలు!