వీరకళింగం – పుస్తక పరిచయం

పుస్తక సమీక్షలు పలు రకాలు. పాశ్చాత్య దేశాల స్కూళ్ళలో, కాలేజీలలో కూడా ఈ సమీక్షలు/పరిచయాలు వారి పాఠ్యాంశాలలో తప్పకుండా ఒక భాగంగా ఉంటాయి. నాబోటి వాళ్ళు, పుస్తక సమీక్ష ఎలా చేయాలని సరదాగా ఇంటర్నెట్‌ను తిరగవేసినా చాలు, కొన్ని వేల లింకులు బయలు పడ్తాయి! అయితే సారాంశం ఒకటే… రూపురేఖలు చర్చించడం, విషయ సంక్షేపం లేదూ సార సంక్షేపం అందించడం అంతే! మాన్యులు డాక్టర్ దీర్ఘాసి విజయ భాస్కర్ తమ వీరకళింగం పుస్తకం పంపించి పరిచయం చేయమంటే ఈ తతంగమంతా, ‘రాని పాట పాడవేడుకను’కుంటూ తవ్వుకోవాల్సి వచ్చింది. రసాస్వాదన లోంచి ఉద్భవించిన వాక్యాలకూ, దరీ దయా లేని అనంత చారిత్రక పాఠానికీ కాస్త గట్లు వేసుకుని గమ్మత్తుగా నన్ను నేను ‘కూడ తీసుకుని’ ఈ పుస్తక పరిచయం అనే సాహసానికి ఒడిగట్టాను.

తెలుగు సాహిత్యంలో చారిత్రక నేపథ్యం గల కావ్యాలు, రచనలు అనేకం ఉన్నాయి. నా దృష్టిలో చారిత్రక నేపథ్యం, కల్పన – ఈ రెంటినీ సమన్వయపరిచే సాహిత్యాన్ని మూడు రకాలుగా సృజించవచ్చు. మొదటిది శుద్ధ చారిత్రక చిత్రణ. ఇందులో కల్పనకు అవకాశం సకృత్తు. ఎంత చిత్రిక పట్టినా ఇందులోంచి చరిత్ర రజనే రాలుతుంది. ఇక రెండవది, చారిత్రక కాల్పనిక రచన. ఇందులో రచయిత ప్రధానమైన కొన్ని చారిత్రక ఘట్టాలను పునాదిగా చేసుకుని తన కల్పనా శక్తిని జోడించి కొండొకచో కొన్ని పాత్రలను కూడా కల్పించి చేసే రచన. ఇవే మనకు సాహిత్యంలో ఎక్కువగా దొరుకుతాయి. చారిత్రక నవలా ఆద్యుడుగా పూజించబడే సర్ వాల్టర్ స్కాట్‌ లేదా ఇతర యూరోపియన్ రచయితలు కూడా ఈ జాన్రానే పెంచి పోషించారు. ఇక మూడో రకం, కాల్పనిక చారిత్రక కావ్యాలు… ఆశ్చర్యపోకండి! నిజం! అసలు లేని చరిత్రను తమ కల్పనాశక్తితో సృష్టించి అదే నిజమేనేమోనని భ్రమింపజేసే రచనలు. ఇటువంటి జాన్రాకే మరొక ముద్దు పేరు అభూత కల్పన (fiction). ఈ మధ్యనే ఇటువంటి కల్పనాచాతురీ మహిమ కలిగిన ఒక భారతీయ చారిత్రక(?) చలనచిత్రం ప్రపంచవ్యాప్తంగా కొన్ని రికార్డులను నెలకొల్పి మనకు ఒక గొప్ప అవార్డును కూడా తెచ్చిపెట్టింది. పిల్లల మెదడులో అదే నిజమైన చరిత్ర అనే అపోహను కూడా కలిగించినా కలిగించి ఉండవచ్చు!

ఇటువంటి దురవస్థకు కారణం మనకు ఆదితః (ab initio) చరిత్ర పట్ల ఉన్న చిన్న చూపు. భారతీయులకు, అందునా మరీ ముఖ్యంగా ఆంధ్రులకు చరిత్ర పట్ల అంధత్వం ఎక్కువ. మన చరిత్ర సంస్కృతి మనకు ఇంకొకరు చెబితే గాని వాటి గొప్పతనం తెలియని బహు గొప్పవాళ్ళం మనం. దీనికి అనేకమైన కారణాలను చెబుతారు. గురు శిష్య పరంపరగా చరిత్ర మౌఖికంగా అందజేయబడిందని, చరిత్రను రుజువు చేసే శాసనాలు పత్రాలు వంటి వాటిని భద్రపరచడం సరిగా జరగలేదని, జనపదాలలో ప్రజా బాహుళ్యంలో చలామణి అవుతున్న చరిత్రకు పండితాదరణ దక్కలేదని, అబ్బో… లిస్టు కొండవీటి చేంతాడంత (మళ్ళీ చరిత్ర!). దీని గురించి మేధావి వర్గం విస్తృతంగా చర్చించవలసిన అవసరం ఉన్నది. కనుకనే, ఈ విషయ ప్రతిపాదన నేను ఇక్కడ చేస్తున్నాను.

కానీ చరిత్ర మీద నాకు అంతటి సాధికారికత లేని కారణంగా, ఈ విషయాల జోలికి వెళ్ళకుండా నన్ను నేను కట్టడి చేసుకుంటూ, భారత దేశపు చరిత్ర పాఠాలలో దీనికి ముందు దీనికి తరువాత అని చర్చించుకోదగ్గ బహు ముఖ్యమైన (very impactful, a water/blood-shed moment) అయినటువంటి… కళింగ యుద్ధం మూలాధారంగా, కళింగుల చరిత్రను దేదీప్యమానం చేస్తూ, బౌద్ధ సిద్ధాంతాల అంతర్లయగా సాగిన విజయ భాస్కర్‌ చారిత్రక కాల్పనిక నవల వీరకళింగం గురించి రెండు మూడు మాటలు మనవి చేసుకోదలిచాను. వారి రచనా వైద్యుష్యాన్ని, బహుముఖీన ప్రతిభను, శేముషిని పూర్తి రసానుభూతితో రంగరించి, నా శక్తి మేరకు పఠితులకు అందించడమే ముఖ్యోద్దేశంగా పెట్టుకున్నాను. చెప్పాలంటే వారి వీరకళింగ వీధులలో చరించి విస్మృతి పొంది, రసోన్మాదంలో (వాడ్రేవు వీరభద్రుడుగారి పదం) సింహపురి రంగభూమి సింహావలోకనం చేసి, వంశధారలో హంసగీతాలు విని, కళింగ సముద్రపు హోరులో కలిసిన కళింగుల పౌరుషాల జోరునూ కని, మానవ దురవస్థను (human predicament) నిర్మూలించే మహాబోధి సత్య సందర్శనం మనస్సున చేసి, ‘కత్తి దూసిన కఠినాత్ముని కారుణ్యమూర్తిగా మలచిన’ ఒక మహా ధర్మక్షేత్రపు మట్టిని తాకే అనుభూతిని పంచుకుంటూ, ‘దండయాత్రను దయతో తాత్వికత బోధించే తీర్థయాత్రగా’ మార్చిన వీరకళింగానికి జై కొడుతూ జోతలిచ్చే ప్రయత్నం చేస్తాను.

ఆర్. చారుమజుందార్ (భారతీయ చరిత్రకు త్రిమూర్తులైన వారు ముగ్గురు – మజుందార్, ఆర్. సి. దత్, రొమిల్లా థాపర్ -ర.) తమ అవుట్ లైన్ ఆఫ్ ది హిస్టరీ ఆఫ్ కళింగలో నిర్ద్వంద్వంగా ఈ సామ్రాజ్యపు ఎల్లలు ‘గోదావరి నుండి మహానది వరకు’ అని తేల్చి చెప్పేశారు. కానీ ఇది వీరకళింగం ఎలా అయింది అంటే, మొత్తం ఉత్తర భారతాన్ని అంటే గాంధారాన్ని కూడా పాలించిన మహా మగధ సామ్రాజ్య సమ్రాట్టులు, చక్రవర్తులు కూడా ఈ చిన్న కళింగ సామ్రాజ్యాన్ని జయించలేకపోయారు. బిందుసారుని మరణానంతరం సింహాసనాన్ని అధిరోహించిన అశోకుడు, కళింగని ఆక్రమించడానికి దాదాపుగా అప్పటిలో ఆరు లక్షల సైన్యంతో యుద్ధానికి వచ్చాడని మనందరం చదువుకున్న చరిత్ర పాఠం. అప్పుడే భూమి, ఆకాశం, నీరు దయానది రక్తంతో తడిసి ఎర్రబడ్డాయి. చివరికి ధమ్మం విజయం (victory through dhamma) సాధించింది. చండాశోకుడు దేవానాంప్రియ అశోకుడుగా మారడానికి కారణభూతమైంది. కళింగ యుద్ధపు ఈ పరిణామ క్రమాన్ని పరుసవేది పాఠంలా పఠితుడి హృదయాలలో పరుచుకొచ్చిన దీర్ఘాసి విజయభాస్కర్‌ తొలి నవలా ప్రస్థానమే వీరకళింగం. ఈ కళింగులెవరు? వీరి కథా-కమామీషు ఏమిటి? రచయిత ఈ విషయాన్నే తన ప్రస్తుత విచార క్షేత్రంగా చేసి నవలాంశంగా ఎందుకు ఎంచుకున్నారు? ఏ కారణాలు అతనిని ఈ నవల రాయడానికి ప్రేరేపించాయని తెలుసుకోవాలంటే… మనం ముందుకు నడిచి రచయిత గురించి ముందు తెలుసుకోవాలి.


పుడమినావరించిన తమోగర్భాన్ని చీల్చడానికి సూర్యుడు తన కిరణ సంచయాన్ని సన్నద్ధం చేస్తున్నాడు. కాలవాహిని మరో నూతన దినాన్ని కనడానికి పురిటి నొప్పులు పడుతోంది. సూర్యబింబాన్ని మావిలా నల్లని మేఘాలు చుట్టుకుని ఉండగా బయటపడడానికి ప్రయత్నిస్తోంది. ఉమ్మనీటి నుండి అమ్మ ఒడికి రావాలని అత్రంతో ఉన్నాడు. సముద్ర జలాలు రక్తస్రావంలా పొంగులార్చుతున్నవి. కోటి కాంతులతో భాస్కర బింబం బయటపడ్డది. ఆకాశం పొత్తికడుపు పై ప్రసవచారలు పడ్డాయి. తుట్ట తుది తిమిరశేషం పలాయనమైంది. నయనం కాంతి స్పర్శతో దృక్కుల చయనమైంది (పేజీ 141).

ఇటువంటి పద చిత్రాలను (figures of speech), అభిదలను (associations), సంజ్ఞలను (allusions) విశేషంగా వాడుతూ తన నవలాశిల్పాన్ని నిండా బలోపేతం చేసుకున్న విలక్షణమైన – ఆధునిక తెలుగు నాటక రంగంలో వేళ్ళపై గణించగలిగిన – నాటక రచయిత, దీర్ఘాసి విజయ భాస్కర్. వారు మొదటినుండి అణగారిన వారి సామాజిక గుర్తింపు, ఆర్థిక స్వాతంత్ర్యం, రాజకీయ అస్తిత్వం కోసం తపనబడ్డ యోధుడు. అనేక పరిషత్తు పోటీలలో బహుమతులు అందుకోవడమే కాకుండా, ఏడు నంది అవార్డులు, తెలుగు విశ్వవిద్యాలయ పురస్కారం, వీటన్నిటినీ మించి 2010లో కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కారం గ్రహించి ఆలనా పాలనా లేక అజ్ఞాతంలో పడి ఉన్న తన ప్రాంత చారిత్రక ప్రాభవపు అభిదాక్షరాలు వెతికి తవ్వి తీయాలని తపించిన తపస్వి. కళింగమొక ఊసర క్షేత్రం, భ్రష్ట భూమి, ఆ నేలపై కాలు మోపడమే పాపం అన్న నిందాప్రస్తావాన్ని (vote of censure) సవాలు చేసి తుత్తునియలు చేసేటటువంటి బృహత్కార్యానికి పూనుకుని శంఖం పూరించిన సైనికుడు. చరిత్ర అట్టడుగు పొరల్లో తొక్కి వేయబడిన తన ప్రాంత ప్రజల ఆత్మగౌరవ పతాకను సమున్నతంగా ఎగురవేయాలనే ఒక్క మహా సంకల్పంతో ఈ నవలా రచనకు శ్రీకారం చుట్టిన చైతన్య శీలి.

ఈ విషయాన్ని అత్యద్భుతంగా ముందుమాటలో వాడ్రేవు చినవీరభద్రుడు చాలా సవివరంగా తెలియజేశారు. రచయిత కూడా తన విచారక్షేత్రపు వివరణను, తలకెత్తుకున్న కర్తవ్యాన్నీ తడబడకుండా స్పష్టంగా చారిత్రక వజ్రాలగని నా కళింగాంధ్రఁవని అంటూ తన మాతృభూమి మహిత గురించి తొట్టతొలుతే మనవి చేసుకుని, అశోకుని ధర్మపత్ని కారువాకికి, యావద్భారత విజేత ఖారవేలుని భార్య సింధువులకు తోబుట్టువుననే అదృష్టంతో, నా తల్లి కళింగం గురించి కావ్యం రాస్తే తప్ప నా తపస్సు సఫలం కాదని నిర్ణయించుకుని నాందీ ప్రస్తావన పలికారు. తన నమ్మకాన్ని తమ విశేషమైన కృషితో విసుగు పుట్టకుండా ప్రధానంగా సాహిత్య, తాత్విక ఆధారాల మీద, కొంతమేరకు స్థానిక పరిజ్ఞానం మీద ఆధారపడి నవలా కథనాన్ని నిర్మించారు. ఒక అసిధారావ్రతాన్ని పూర్తి చేశారు. వారు ఈ పుస్తకాన్ని రచించడానికి ఎంతటి అధ్యయనం పరిశ్రమ చేశారో గాని, ఈ నవలా పరిచయం చేసేటప్పుడు నేను మాత్రం అంతకంటే ఎక్కువ పరిశ్రమ చేయవలసి వచ్చింది… ఎందుకంటే రచయిత ఇంటి పేరు దీర్ఘాసి.

నిజానికి దీర్ఘాసి అనేది శ్రీకాకుళంలోని ఒక ఊరి పేరు. ఆంధ్రదేశంలోని ఎలమంచిలి, టెక్కలి, శ్రీకాకుళం, భోగాపురం, పర్లాకిమిడి, నరసన్నపేట – కళింగ భూభాగంలో కమనీయంగా ఒదిగిపోయిన ప్రాంతాలు. వాటినే స్పృశిస్తూ రచయిత ఈ నవలను నిర్మించుకొచ్చారు. ఈ నవల రాయటం వెనుక ఉన్న వారి ఉద్దేశ్యాలను మరొక్కసారి మననం చేసుకుంటున్నప్పుడు మనకు పుస్తకపు ఆత్మ అవగాహనకు వస్తుంది.

రచయిత తన మాటల్లోనే తన రచనకు ఉద్దేశాలుగా మూడు ప్రధాన కారణాలను తెలియజేశారు. మొట్టమొదటిది ప్రధానమైనది కళింగాన్వేషణమే! ఆ అన్వేషణ వారి మాటల్లోనే:

ఒక అద్భుత శిల్పాన్ని, ఆదర్శమూర్తిని ప్రపంచానికి తలమానికమైన తన తల్లిని‘ మనకు వర్ణనలతో దర్శనం చేయించే ప్రయత్నం. మలి ఉద్దేశం, తన మాతృభూమి గొప్పతనాన్ని ప్రజలు, ప్రభుత్వం గుర్తించాలని తపనతో ఎంతో ఆర్తితో ‘500 ఏళ్ళ శాతవాహనుల గురించి గర్వపడతాం కానీ 1000 ఏళ్ళ గాంగుల పాలన ఎందుకు గుర్తుకురాద‘ని? అలాగే పురాణాల్లోనూ కొన్ని ప్రాంతాల్లోనూ కళింగం పట్ల ఉన్న అపకృతాన్ని కడిగి వేసేటట్లు, గోదావరి తీర ప్రాంతంలో జరిగినట్టుగా, కృష్ణానదీ తీర ప్రాంతంలో ప్రభుత్వం జరపని చారిత్రాన్వేషక తవ్వకాల పట్ల జరుగుతున్న చిన్న చూపుకు విలంబనాన్నీ గర్హించడం. ఇక అత్యంత ప్రధానమైన మూడవది – ‘కళింగం తన విశిష్టమైన జీవనశైలితో ధార్మిక నిష్ఠతో సమగ్ర భారతంలో సంలీనమై తన సంరాశీకరణంతో (commutation) ఈ దేశ సంస్కృతి, తాత్వికతల సంపన్నతకు ఎంత బలాఢ్యతను చేకూర్చిందో తెలియజేయడమే‘ ఈ పుస్తక లక్ష్యం అని బల్లగుద్ది మరీ చెప్పారు.

ఈ సాహస కార్యాన్ని రచయిత తన విశిష్టమైన శైలిలో చాలా గొప్పగా నడిపించుకొచ్చారు. ఒక విషయం పట్ల గాని, ఒక వస్తువు పట్ల గాని అనుభూతి చెందడానికి రెండు ప్రధాన కారణాలు ఉంటాయి. ప్రాచార్య శలాక రఘునాథ శర్మ ఒకచోట వివరించినట్టు, అవి మొదటిది దర్శనం. రెండవది వర్ణనం. ఇక్కడ దర్శన శబ్దానికి విశేషార్థ సంభావన చేసుకోవాలి. కేవలం చర్మచక్షులతో చూడటాన్ని దర్శనం అనం. జ్ఞాన నేత్రాలతో పట్టుకోవటం దర్శనం. జ్ఞానచక్షువు అన్నాం కనుక, చర్మచక్షువును మూసికొనటం ఈ దర్శనానికి పటుత్వం కలిగిస్తుంది. అలా దర్శించిన దానిని, దర్శించని వారికి దర్శించినంత అనుభూతి కలిగే విధంగా చెప్పటం వర్ణనం. దీర్ఘాసి విజయ భాస్కర్ తమ వర్ణనా వైదగ్ధ్యంతో ఈ విషయంలో సంపూర్ణంగా ఎలా సఫలీకృతులయ్యారో, కథను కవాతు చేయించిన కౌశల్యం, వారి కవితాత్మ తెలియ జేస్తాయి. నేను యీ నవల చదివి ముగ్ధుడినై వారికి పెద్ద అభిమానిని అయిపోయాను. ఇది నేను చదివిన వారి తొలి రచన.

వారు బహుకాలం ప్రభుత్వ ప్రశాసనంలో అతి ముఖ్యమైన అధికారిక పాత్రలో సేవలందించారు. ఉద్యోగంలో వారి దక్షత, రణనీతి సంగతి నాకు తెలియదు గానీ ఉత్కళోద్యానవనంలో వారు పూయించిన ఈ ఎర్రమందారం లాంటి వీరకళింగంలో మాత్రం నాకు అవి అడుగడుగునా కనబడి ఆశ్చర్యానందానుభూతులను కలిగించాయి. ఎంతో పకడ్బందీగా ఈ నవలను an official statement for empowering the people of Kalingaగా మలుచుకొచ్చారు. ఒక కళింగ ప్రాంతపు వీరుడుగా తన కార్యసూచితో (agenda) వారు చిత్రించిన వారి జీవనవృత్తమే (biodata) ఈ వీరకళింగమా అని అన్పిస్తుంది? వారి బహుముఖీన ప్రతిభ తేట తెల్లమౌతుంది.


త్వమేవాహం పుస్తకాన్ని విశ్లేషిస్తూ డాక్టర్ సి. నారాయణ రెడ్డి ఆరుద్ర గురించి… ‘శరీర శాస్త్రము, వృక్ష శాస్త్రము, గణిత శాస్త్రము, మనోవిశ్లేషణ శాస్త్రము, నౌకాశాస్త్రము మున్నగు వాని నుండి పారిభాషిక పదములను గ్రహించి వానిని తన భావవ్యక్తీకరణకు సరికొత్త ప్రతీకలుగా మలచుకున్నాడు‘ అంటారు (పేజీ 72, త్వమేవాహం, విశాలాంధ్ర ప్రచురణలు). విజయ భాస్కర్ తన వీరకళింగంలో కవిత్వపు గాఢతను నిలుపుకుంటూనే, మరొక నాలుగు అడుగులు ముందుకేసి తమ సామర్థ్యాన్ని ఇవే కాకుండా, ఇంకా వివిధ శాస్త్రాలపై తనకున్న పట్టును తెలియజేస్తారు. ఇది నన్ను సంభ్రమాశ్చర్యాలకు గురి చేసింది. కాస్త సావకాశంగా నవలలో వారి వాక్యాల వివరణ ఆధారంగానే ఈ విషయాన్ని నేను తుష్టీకరణం (appeasement) చేస్తాను. చిత్తగించండి.

నవల మొత్తం ఒక కావ్యం లాగ సాగుతుంది. పైపూతగా కళింగ పురవీధుల ధూళితోనో , రక్తస్వేదాలతోనో సమ్మిశ్రం చేసినా, అంతర్లీనంగా ఇదొక ప్రబంధ కావ్యమా అనిపింప చేసేటట్టు చక్కటి, చిక్కటి కవిత్వం ప్రతీ వాక్యంలోనూ వద్దన్నా మనల్ని పలకరిస్తుంది, వారిలోని కవీశ్వరుని మన కనుల ముందు నిలుపుతుంది. అసలు కొన్ని వాక్యాలు మనల్ని మంత్రముగ్ధుల్ని చేస్తాయి. క్రింది వాక్యాలు చదవండి; నేను చెప్పిన దాంతో మీరు నూటికి నూరు శాతం ఏకీభవిస్తారు.

… ఒకరి మీద ఉండే అవధిలేని ప్రేమ ఇలా చేయిస్తుందా? (పే35); పినభద్ర బాహు కొత్త అడవిలో పాదం మోపిన ఏనుగులా ఉన్నాడు (39); మృగాల నుండి రక్షించినవాడు మొనగాడయ్యాడు. దారి చూపినవాడు దండుకు నాయకుడయ్యాడు. పగ్గం పట్టగలిగినవాడు పాలకుడయ్యాడు (51); వంశధార తిలకచార మున్నీటిలో మునిగిపోయింది (66), రాజుకు మతం కన్నా రాజ్యం ముఖ్యం. మతాధిపతులకు రాజ్యమెంత ముఖ్యమో మతమూ అంతే ముఖ్యం(71); రక్తాభిషేకం జరుగుతున్న మగ అమ్మవారిలా కనబడ్డాడు రాజు (75); గుండెల మీద హారంలా శోభిస్తాడనుకున్న కొడుకు గుండెల్లో గునపంలా గుచ్చుకుని క్షోభింపచేస్తున్నాడు (80); జైనం వచ్చి జీవితం ఇచ్చింది బౌద్ధం వచ్చి బుద్ధి నేర్పింది వైదికం వచ్చి వెర్రి వెంగళప్పల్ని చేసింది (87). ప్రారంభం పరధ్యానం-మధ్యస్థం అర్ధమగ్నం-తుదకు తన్మయత్వం (91); ఇంకెవరినెవరు నొప్పించకుండా ఒకే ప్రక్క మీదికి ఎక్కి పడుకున్నారు. వారి శయ్య బౌద్ధ వైదికాలను ఇముడ్చుచుకున్న జంబుద్వీపంలా ఉంది (96);

… వ్యవస్థ విషాదమే వ్యక్తి విషాదాన్ని మరిపించగలదు (129); కళింగ జనావళి బుద్ధుణ్ణి ఆవిష్కరించే విశిష్ట దంతావళి(148); లోకానికి ఒక నైజం ఉంది. రాజు భుజం తట్టిన వాడిని లోకం భుజానికి ఎత్తుకుంటుంది రాజు నిందించిన వాడిని నిర్బంధంగా నిరాకరిస్తుంది (159); నిశీథి సగం రాత్రిని ఆరగించి అరిగించుకోవడం కూడా పూర్తయింది (163); భూచరాల పాదముద్రలు కళ్ళకు కనిపిస్తాయి జలచరాల కదలికలకు సాక్ష్యాలు దొరకవు (196); కళింగులు ప్రకృతి రహస్యాలు తెలిసిన జ్ఞానులు (209); తనకు అన్నం పెడుతున్న ఆలిలో అమ్మను చూస్తాడు భర్త (203).

… ఓరి కళింగుడా! శవంగా మారిపోతూ కూడా శౌర్యాన్ని ప్రకటించడం నీకే చెల్లింది రా! (235); ప్రాణసఖుడా! స్వేచ్ఛను మించిన ప్రణయముంటుందా ఈ సృష్టిలో (236); కళింగమంటే వ్యక్తుల సమూహం కాదు శక్తుల సందోహం. కళింగమంటే భౌగోళికమైన ప్రాంతం కాదు. ప్రకృతి శక్తుల కేళీ విలాసం (237); మహాశూన్యంలో ఒక కాంతిరేఖ తన ఉనికి కోసం అన్వేషిస్తున్నప్పుడు ఏ చిన్న శబ్దమైనా అది తన గతిని మార్చేస్తుంది. మనోమయ లోకంలో మానవ చేతన గమ్య నిర్ధారణ కోసం; ఆత్మోద్ధరణ కోసం తపిస్తున్నప్పుడు ఆ తపస్సును భిన్నం చేయకూడదు (238); ఇక అక్కడ మిగిలింది శోకతప్తుడైన అశోకుడు – ఆప్తబాంధవి కారువాకి మాత్రమే (249); అధికారం లేకపోతే అశోకుడైనా అర్భకుడనే విషయం నెమ్మదిగా తెలియవస్తుంది (257).

నవల నిండా ఉపాఖ్యానాల ఉద్బోధ కానవస్తుంది. బావరి కథ కాని, నౌకానిర్మాణ శాస్త్రవేత్త జాలరి ఓడేసు కథ కాని, కోస్తామాండలికంలో ఒక చేపకు కారువాకి నామకరణం చేసి నిర్ధారించిన కథ కాని, నిగ్రోధుడి ఆగమనం అతడి బోధ కానీ రచయిత యొక్క విషయ సంగ్రహ ఘోరపరిశ్రమను మనకు ఎరుక పరుస్తాయి. ప్రధాన కథకు ఆటంకం కలగకుండా ఈ ఉపకథలన్నీ కథకు దోహదం చేస్తూ కథనపు వడిని, పదునును ద్విగుణీకృతం చేస్తూ తనకు, పాఠకుడికి ఉపకరించేటట్టు చేసుకోవడంలోనే ఉత్కృష్టమైన ఒక కథా రచయిత అల్లికల ప్రతిభ ద్యోతకమవుతుంది.

అంతే కాదు. పురవర్ణనలు – ‘నగర నిర్మాణంతో పాటు ఐదేళ్ళు కష్టపడి జటపాలి రహదారిని పూర్తి చేశాడు‘ లాంటి వాక్యాలు చదివినప్పుడు విజయభాస్కర్ ఒక అద్భుతమైన ఇంజనీరు అవతారమెత్తుతారు. అలాగే, నౌకానిర్మాణపు మెలకువలను వృక్షశాస్త్రం ప్రకారంగా ఏ రకమైన కట్టెలను వాడాలి, నౌకాయానికి సంబంధించిన సరళాలను, జలసాగరం (ship construction bay) ఏర్పాట్లు, నౌకల వర్గీకరణ (classification of ships), నౌక ఆంతరిక భాగాలలో గదుల నిర్మాణం (living space designing in ships) పకడ్బందీగా చర్చించినప్పుడు, జాలరి ఓడేసు ద్వారా ఓపిగ్గా వివరించినప్పుడు, తద్యధః (defacto) వారిని ఒక నౌకా నిర్మాణ శాస్త్రవేత్తగా యీ రచన మన ముందర నిలువెత్తుగా నిలబెడుతుంది.

యుద్ధానికి నౌకలలో సైనికులను ఎంపిక చేసిన వివరాలను చదివినప్పుడు, వ్యవస్థీకృత సాహస యాత్ర (expeditionary forces) పట్ల అనుభవ జ్ఞానమున్న ఒక అడ్మిరల్‌ను తలపోస్తారు. యుద్ధ వర్ణనలలో అనశ్వర సౌందర్యాన్ని ఆపోశన పట్టి రణరంగ నీతిని, తంత్రాన్ని (war strategy) విశదీకరించినప్పుడు, ఎన్నో సంగ్రామాలలో రాటుదేలిన ఒక ఆర్మీ జనరల్ కనిపిస్తాడు. అడవులలో తమను తాము దాచుకుంటూ (camouflage) పాముల్లా ప్రాకగలిగే, పులిగా గాండ్రించగలిగే, జింకలా పరిగెత్తగలిగే వివరాలను, అరణ్య తంత్రాలను (jungle tactics) చదివినప్పుడు గణించదగ్గ ఒక గణనాయకుడు మనకు కనిపిస్తాడు. రాజు వస్తున్నప్పుడు జరిపే ఏర్పాట్ల పర్యవేక్షణ వివరాలు చదివినప్పుడు వారిలోని ఒక అడ్మినిస్ట్రేటర్ అధికారికంగా మనకు పరిచయం అవుతారు. మఫ్టీ పోలీస్ ఇంటిలిజెన్స్ ఎఫైర్స్ బందోబస్తు నేపథ్యం పట్ల పూర్తి నేతృత్వం వహించిన ఒక అధికారిక నాయకుడు మనకు కానవస్తాడు. నవలలో పలుచోట్ల భోజన వివరాలు, కళింగ ప్రాంతపు వంటల విషయాలు, పాకశాస్త్రపు మెలకువలు తియ్యగా పంచబడతాయి. మినప కుడుములు, చోడితోప, కొబ్బరి బూరెలు, కోడి కూర, మేక మాంసం, తాటి ముంజల తరిని గురించి వివరించినప్పుడు విజయభాస్కర్‌లోని పాకశాస్త్ర ప్రవీణుడు మనకు పరమాన్నాన్ని వడ్డించడానికి తయారుగా కనిపిస్తాడు.

మెగస్తనీస్ పర్యటన, కళింగుల గొప్పతనం గురించి వివరించినప్పుడు, కళింగ వర్ణన విస్తారంగా చేసినప్పుడు, కళింగ యుద్ధం గురించి సాధికారికంగా చర్చించినప్పుడూ శిఖరాయమానమైన ఒక చరిత్రకారుడు మన కనుల ముందర సగర్వంగా తల ఎత్తుకు నిలబడి కనబడతాడు. నీటి వాటా గురించి నిర్మొహమాటంగా చర్చించినప్పుడు వారిలోని సామాజిక, రాజకీయవేత్త తలెత్తి మన ముందర నిలుచుంటాడు. బయలాట జానపద కళారూపంతో భానుమతి కథను మనకు తెలియజేసినప్పుడు వారి లోని జానపద బ్రహ్మ బయటపడతాడు. నాకు ఇంకా బాగా నచ్చిన మరో విషయం ఏమిటంటే నవలలో పాత్రలకు ఎన్నో పేర్లు ఉంటాయి. కొన్ని పేర్లు చరిత్రలో నిజంగా ఉన్నవైతే మరికొన్ని వీరు కల్పించినవి. అసలు ఆ పేర్లు చదువుతున్నప్పుడు ఇంతటి సృజనాత్మకత ఎలా అబ్బిందీ రచయితకని మనల్ని ఆశ్చర్యం ముంచెత్తుతుంది. జీవితాన్ని ప్రగాఢంగా స్పర్శించడమే కాకుండా హత్తుకుని అనుభూతించిన రసవేత్తలకు మాత్రమే ఇటువంటి విద్య పట్టుబడుతుంది.

ఇక ఈ భాగపు ముగింపుకు వెళ్ళే ముందర ఇంతవరకు నేను చర్చించని రెండు ఆసక్తికరమైన విషయాలు చర్చించడం భావ్యంగా తలుస్తాను.

మొదటిది: ఈ నవలలో అశోకుడి పాత్ర చిత్రణ చాలా ఉదాత్తంగా జరిగింది. నేను ముందుగా సెలవిచ్చినట్టు చండాశోకుడు, దేవానాంప్రియ అశోకుడుగా మారే ప్రస్థానాన్ని రచయిత చాలా అద్భుతంగా మలుచుకొచ్చారు. కళింగ యుద్ధం, అలాగే కళింగ యుద్ధ భూమిలో మృతదేహాలను చూసి అశోకుని మదిలో జరిగిన అంతర్మథనం, అశోకుడు వంశధారలో మూడు మునకలు వేసి తన ఒంటికి అంటిన రక్త చారికల్ని ఆత్మ విమర్శ, పశ్చాత్తాపం, ధర్మ దర్శనం అన్న సుగంధ లేపనాలతో చెరిపి వేయటం, శరీరం యావత్తు ఒక వేణువులా మారిపోవటం, పవిత్ర స్నాతుడై అభిషిక్తుడై ఒడ్డుకు రావడం, పొడి బట్టలు కట్టుకుని బౌద్ధ క్షేత్రమైన దంతస్తూపానికి దోసిలొగ్గి నిలబడటం, పతాక స్థాయిలో ఉన్న అశోకుడు పతనమై తిష్య రక్షతి అన్న రాజ నర్తకి చేతిలో కీలుబొమ్మ కావటం, చిట్టచివరికి నేలకొరిగి పోవడం – చదువుతుంటే ఒక సన్నటి నీటి చెలమ మహోద్ధృత ప్రవాహమై కడకు ఇసుకపర్రలలో తడబడే అడుగులతో చిక్కి సాగరసంగమంతో సంతృప్తమైన సమాధానం కనబడుతుంది. నవలా రచయితగా విజయ భాస్కర్ సత్తా బయటపడుతుంది.

ఇక రెండవ విషయం, బౌద్ధం గురించి. నవలలో వివరించినటువంటి త్రిశరణాలు, చతురార్యాలు, అష్టాంగ మార్గపు ప్రతీకలు, బుద్ధుని ఏడు సిద్ధాంతాలు, మహాపరినిర్వాణం, అస్థికల పంపకం, దంత పేటిక గురించి నవలలో విస్తారంగా రచయిత చర్చించినా, బౌద్ధం పట్ల నాకున్న పరిమిత జ్ఞానం వల్ల ఈ విషయాల గురించి విశ్లేషణను సవినయంగా చేయడం లేదు. సిరికోన లోని విదుషీమణి, నాకు సోదరీ సమానులైన డాక్టర్ రాయదుర్గం విజయలక్ష్మి ఈ విషయం పట్ల విస్తృతమైనటువంటి పరిశోధన చేసి ఉన్నారు. వారి పరిశోధనాగ్రంథం (ఆధునికాంధ్ర కవిత్వంపై బౌద్ధమత ప్రభావం) నేను వీరకళింగం విశ్లేషణకు వాడుకోవాలని శ్రమించినా, నా పరిజ్ఞానం అందుకు సరిపడదని అర్థమైన మరుక్షణం నేను మర్యాద పాటించి నన్ను నేను ఉపసంహరించుకున్నాను.

కాకపోతే అడవి బాపిరాజు హిమబిందు ఏకాదశ ప్రకరణలో స్థౌలతిష్యునికి, నదిలో పడి తప్పిపోయి బౌద్ధ గురువుగా మారిన అతడి కుమారునికి, వైదికం-బౌద్ధం పట్ల జరిగినటువంటి సంభాషణలు; చారిత్రక నవలా చక్రవర్తిగా కొనియాడ బడుతున్న ముదిగొండ శివప్రసాద్ కొన్ని నవలలలోని ఇటువంటి సంభాషణలలు; ఈ నవలలోని సంభాషణలు – మూడింటికీ సారూప్యం తెద్దామని ప్రయత్నం చేసినా విస్తారభీతితో వాటి తులనాత్మకత జోలికి నేను వెళ్ళటం లేదు. కానీ ఒక్క మాట మాత్రం ఇక్కడ స్పష్టం చేయదలుచుకున్నాను.

రచయిత గొప్పతనం ఎక్కడ ఉంటుందంటే రచనా తత్వంలో జ్ఞానదాన దృష్టి (didactic or pedagogic approach) ఎక్కువైనపుడు పఠితుడి కుతూహలానికి అది అడ్డుకట్ట వేసి నవలను నిస్సారం చేస్తుంది. విషయ పరిజ్ఞానం పరోక్షంగా పాఠకుడికి సంభాషణల పునాది మీదుగా అందిస్తూ, కథ పట్ల ఆసక్తిని కొనసాగించేటట్టు మలచడమే నిజమైన రచయిత యొక్క ప్రతిభకు తార్కాణం. ఈ విషయంలో విజయ భాస్కర్ ప్రథమ శ్రేణిలో నిలిచారు అనడంలో నాకు ఎటువంటి సందేహము లేదు.


చారిత్రక నవలకు ఉండాల్సిన లక్షణాలను గురించి రాచమల్లు రామచంద్రారెడ్డి (రా.రా.) తమ సారస్వత వివేచనలో ‘కుల్లాయి గట్టితేనేమి?’ అన్న రెండవ వ్యాసంలో హంగరీకు చెందిన మార్క్సిస్ట్ ఫిలాసఫర్ జ్యార్జీ లూకాచ్ (györgy lukács) ది హిస్టారికల్ నావల్ ఆధారంగా చాలా వివరంగా తెలియజేశారు.

చారిత్రక నవలకు ఉండాల్సిన మొదటి లక్షణం చారిత్రకతట. అది అద్భుత కల్పన కాకూడదట. ఒక దేశపు చారిత్రక పరిణామ క్రమంలో అది ఒక దశా విశేషమని, కనుక అది శాశ్వతంగా ఉండదని, కాలక్రమేణా మారుతుందనే స్పృహ పఠితుడికి కలిగించాలి. ఈ స్పృహ ఎలా కలుగుతుందంటే భూతకాల శక్తులకు వర్తమాన కాలశక్తులకు జరిగే ఘర్షణ కీలక పాత్ర వహించడం. వీరకళింగం నిండా ఈ విషయం పుష్కలంగా ఉంది. రెండవ లక్షణం, దేశ కాల నిర్దిష్టత. దేశకాల విశిష్ట పరిస్థితులకు కార్యకారణ సంబంధం ఉంటుంది. పాత్రల మనోధర్మాలు, జీవిత పద్ధతులు, ప్రవర్తన రీతులు. వ్యక్తావ్యక్త ఆశయాలు అట్లే సన్నివేశాల పూర్వాపరాలు నిర్ణయించబడతాయి. విజయ భాస్కర్ సృజించిన ప్రతీ పాత్ర ఈ ప్రామాణికతకు పరిపూర్ణంగా సరితూగుతుంది. ఇక మూడవ లక్షణం, ఆనాటి చారిత్రక శక్తులకు సామాజిక ధర్మాలకు ప్రతినిధులను చిత్రించి వాటి మధ్య ఘర్షణను పాత్రల మధ్య జరిగే ఘర్షణగా చిత్రీకరించడం. నవలలో వైదిక పునరుద్ధరణకు ఇంద్రవర్ణుడి ఆక్రోశం, జానపదుల బయలాట కథాకథనంలో సైనికులకూ ప్రజలకు మధ్య వాగ్వివాదం లాంటివి ఈ విషయానికి పుష్టి కలిగిస్తాయి. అంతేకాదు రచయిత తన నవల యొక్క ముఖచిత్రపు చిత్రీకరణలో కూడా తీసుకున్నటువంటి శ్రద్ధ ప్రస్ఫుటమవుతూ కథ యొక్క సారాంశాన్ని చూచాయగా తెలియజేస్తూ ఎంతో కదిలించేటట్టుగా మనకు స్పష్టంగా కనబడుతుంది. ఇది ఎంతో అభినందించవలసిన విషయం.

ఇంకా రా.రా. తన వ్యాసంలో లుకాచ్ చెప్పిన చారిత్రక నవల యొక్క అతి ముఖ్య లక్షణాన్ని ఇలా తెలియజేస్తారు: నవలలో ఎంత సాహిత్యం ఉన్నా, చారిత్రకత వాస్తవికత ఉన్నా గత చరిత్రకు వర్తమాన చరిత్రకు గల కార్యకారణ సంబంధం పాఠకుడికి బోధపడాలి. లేదంటే, అది ఎంత గొప్ప నవలైనా రచయిత పూర్తిగా వైఫల్యం పొందినట్టే. విజయ భాస్కర్ ఒక గొప్ప బలమైన అభ్యూహతో (hypothesis) ప్రగాఢ సంకల్పంతో రచించిన చారిత్రక కాల్పనిక కావ్యం గనుక ఈ విషయంలో వారు పూర్తిగా కృతకృత్యులయ్యారు.

ఎంతో పరిశ్రమించి, అధ్యయనం చేసి, సాధికారతతో వీరు రచించిన వీరకళింగం ఒక సతత ఉత్తరకోస్తా ‘వంశధార’; కళింగపు కత్తి వాదరపై వారు చేసిన కసరత్తు కాకలు దీరిన కళింగ యోధుల కదనరంగపు కాహళీ ధ్వని; కవ్వించిన కారువాకి కుడి కాటుక కన్ను. కాష్టాల కొలిమిగా మారబోతున్న తన కన్న ఊరి కోసం ఆమె కన్నీరు చిందించిన ఎడమ కన్ను; మహాబోధి అస్థికల పంపకంలో అస్తిత్వాన్ని మరిపింప చేసి మౌనంగా ధ్యానాన్ని అందించిన మహా జ్ఞానవాటిక, బుద్ధదేవుని దంత పేటిక, జటాపాలి వీధుల్లో జావళీలు ప్రతిధ్వనింప జేసిన ఘంటిక; కత్తి మొననుండి కారిన కళింగ సైనికుడి రక్తస్వేదం, అశోకుడి ఆరు లక్షల సైన్యానికి ఎదురొడ్డి రొమ్ము విరిచిన కళింగ గజకాల్బలాల కదన ఘోష; కానలలో తిరుగాడుతూ కనులు మూసి ధ్యానం చేసుకుంటున్న శ్రమణుల కాలిబాట; కాదని, పనికిరాదని కర్కశంగా విసిరేసిన ఒక బంగారు కాసు తన సత్తా చాటుకుని సగర్వంగా చేసిన ఒక మహా సామ్రాజ్య స్థాపన (సింహళం); సూక్ష్మంలో చెప్పాలంటే… ఒక ఉత్సాహం, ఉద్వేగం, ఉత్ప్రేక్షతో కళింగ పురవీధులలో కమనీయంగా జరిపిన ఊరేగింపు పాట, తన కన్నతల్లికి (పుట్టిన గడ్డకు) దీర్ఘాసివారు దర్పంగా చుట్టిన తలపాగా, తలపై పెట్టిన కిరీటం, ఉత్తరాంధ్రకు పట్టిన నీరాజనం, ఉద్ధత్వంతో ఉపాసకుడై ఊరి ఋణం తీర్చుకోవడానికి విజయభాస్కర్ విన్రమంగా సల్పిన ఒక మహాయజ్ఞం!

వాడ్రేవు చినవీరభద్రుడు తమ ముందుమాటలో తెలియజేసినట్టు తెలుగులో వచ్చినటువంటి చారిత్రక నవలలు చాలా తక్కువ. శ్రీయుతులు బాపిరాజు, విశ్వనాథ, నోరి నృసింహ శాస్త్రి, ముదిగొండ శివప్రసాద్ – ఇప్పుడు దీర్ఘాసి విజయ భాస్కర్. ఒకటి రెండు చలన చిత్రాలుగా రూపొందించబడ్డా, విజయ భాస్కర్ తక్క మిగిలిన వారి రచనలలో వీరభద్రుడు చెప్పినట్టు, సాక్షాధారాలతో కూడిన చారిత్రక సన్నివేశాల్ని కల్పించడం మీద పరిపూర్ణమైన దృష్టి ఆ రచయితలు పెట్టలేదేమోనన్పిస్తుంది (బహుశా Emotion has preceded evidence). విజయభాస్కర్ అలా కాకుండా, ఆ ప్రదేశకాల పరిస్థితుల పత్తిని వత్తి చేసి, తమ కళింగుల చరిత్రనంతా మథించి నూరి నూరి నూనె తీసి, పాత్రల ప్రమిదలతో దీపాలుగా వెలిగించి, కళింగపుర పురావీధుల్లో దారి దీపాలుగా నిల్పి, తన నేల గురించి తన తల్లి గురించి… ఆపాదమస్తకం అవగతం చేసుకోండంటూ… ఒక మహాజ్యోతిని ఈ నవలా దీపశిఖతో ప్రసరింపచేసిన ధన్యులు. ఇంతటి మహత్కార్యానికి వారు పూనుకున్నందుకు బహుశా ఉత్తరాంధ్ర ప్రజానీకం వారికి కచ్చితంగా ఋణపడి ఉంటుంది.

కేవలం చారిత్రక పరిజ్ఞానమే కావాలనుకుంటే దానికి చరిత్ర గ్రంథాలు చాలా ఉంటాయి. కానీ చారిత్రక నవలలు రాయడం అవసరం. ఆ దశలోని ప్రజా జీవితంతో పాఠకుడు తాదాత్మ్యం పొందగలిగినప్పుడే… చారిత్రక నవల సార్ధకమవుతుంది‘ అని రా.రా. నొక్కి వక్కాణించినట్లు తెలుగు సాహిత్యంలో ఇటువంటి మరిన్ని నిజమైన చారిత్రక నవలలు రావాలి. ఈ పుస్తక పరిచయం చేసే సందర్భంలో రచయితతో వీలు దొరికినప్పుడు మాట్లాడిన రెండు మూడు సందర్భాలలోనూ వారు తమ తదుపరి రచన యావద్భారతాన్ని గెలిచిన ఖారవేలునిపై అని సూచనాప్రాయంగా తెలియజేశారు. అది వీరకళింగం కంటే మరింత మహోన్నతంగా ఉంటుందని, ఉండాలని, రసజ్ఞులైన పాఠకులు దానిని ఇదే రీతిన చదివి ఆనందిస్తారని ఆశిస్తూ… స్వస్తి!


నవల: వీరకళింగం (2023)
రచన: దీర్ఘాసి విజయ భాస్కర్
ప్రచురణ: సాహితీమిత్రులు, విజయవాడ.
వెల: ₹ 200. పే. 260.
ప్రతులకు: లోగిలి, అమెజాన్.ఇన్, ప్రముఖ పుస్తకదుకాణాలు.