కొన్ని జానపద పాటలు

ఈ జనవరి 2024 సంచికలో కొన్ని జానపద పాటలు విందాం. ఇవి నిజంగా జానపదుల పాటలా లేక ఆధునిక రచనలా అన్న విషయంలో భిన్నాభిప్రాయాలున్నాయి. ఆ చర్చలోకి నేను ఇప్పుడు వెళ్ళడం లేదు. ఈ జానపద వాఙ్మయం మనకు జాతీయవాదం బలంగా వున్న రోజుల్లో సినిమాల్లోను, గ్రామఫోను రికార్డులపైన, ముఖ్యంగా రేడియోలోను చాలా ప్రముఖంగా వినబడేది.

ఈ సంచికలోని మొదటి భాగంలో ప్రయాగ నరసింహ శాస్త్రిగారు గ్రామఫోను రికార్డులపైన, రెండవ భాగంలో ఒక ఆకాశవాణి ప్రత్యేక కార్యక్రమంలో మల్లిక్, ఎం. ఎస్. రామారావు, కె. వెంకటేశ్వరరావు, వి. బి. కనకదుర్గ, వింజమూరి సరస్వతి పాడిన జానపద పాటలు విందాం. ఈ కార్యక్రమాన్ని నాకందించిన కె. విజయగారికి నా ధన్యవాదాలు.

ప్రయాగ నరసింహ శాస్త్రిగారి గురించి ఈ తరం వారికి తెలియక పోవచ్చు. ఆయన తెలుగులో రేడియో ప్రసారాలు మొదలయినప్పటినుండి పని చేసిన తొలితరం కళాకారులు. ఆయన గురించిన కొన్ని వివరాలు వారి కుమార్తె వేదవతిగారి మాటల్లోను (వేదవతిగారు కూడా ఆకాశవాణిలో పని చేసి విజయవాడ స్టేషన్ డైరెక్టర్‌గా పదవీ విరమణ చేశారు.), ‘సారంగదేవ’ అన్న కలంపేరుతో బాలాంత్రపు రజనీకాంతరావుగారు తెలుగు స్వతంత్ర పత్రికలో (1953) రాసిన ఒక వ్యాసం ద్వారాను తెలుసుకోవచ్చు. ఆయన గాడేపల్లి సూర్యనారాయణ శాస్త్రిగారితో కలిసి చేసిన ‘బావగారి కబుర్లు’ అన్న రేడియో కార్యక్రమం చాలా ప్రసిద్ధి చెందింది. (ఈ కార్యక్రమాన్ని తరవాత చివుకుల రామమోహనరావు, నండూరి సుబ్బారావు గార్లు కొనసాగించారు.) నరసింహ శాస్త్రిగారు 1969లో పదవీ విరమణ చేసిన తరవాత కూడా రేడియోలోను, బయటకూడా చాలా కార్యక్రమాలు నిర్వహించారు, కొన్ని సినిమాల్లో కూడా నటించారు. ఆయన రేడియో కోసం చేసిన, పాడిన కొన్ని పాటలు (నూలు వడికే విధము తెలియండి, దండాలు దండాలు భారతమాత, మరువకు డార్యులారా, స్వరాజ్య స్థాపన వెంకటరమణగారి యూట్యూబ్ ఛానెల్ శోభనాచలలో వినవచ్చు. అలాగే బాలరాజు అన్న బుర్రకథ కూడా! ఇంకా ఇలాంటివి కొన్ని పాటలు, బుర్రకథలు, ఉదా. జగద్రక్షకుడు గాంధి మహాత్ముడు, రాబోయే సంచికల్లో విందాం.

ఇక్కడ వినిపిస్తున్న నాలుగు పాటలు నరసింహ శాస్త్రిగారు సుమారు 1938-48 మధ్య కాలంలో పాడినవి. ఐదవ పాట, ‘గూటి చిలకేదిరా’ అన్న తత్త్వం, ఆకాశవాణి వారి T.S. రికార్డుగా 1950లలో వచ్చింది. ‘గుర్రాల గోపిరెడ్డి’ అన్న పాట రైతుబిడ్డ (1939) సినిమా ద్వారా కొందరికి తెలిసి వుండొచ్చు (ఈ పాట పూర్తి పాఠం ఆయనే సంకలనం చేసిన ఈ గేయసంపుటిలో). ఆయన గ్రామఫోను రికార్డులపైన ఇచ్చిన పాటలు ఇంకా 20 వరకు వుంటాయి, ఉదా. బాపూజి బలాడ్. వాటిలో కొన్ని కూడా రాబోయే సంచికల్లో విందాం.


  1. జానపదం – ప్రకటన
  2. వల్లారి బాబోయ్
  3. ఏతాము తోడరా
  4. గొబ్బియల్లో చందమామ
  5. వియ్యపురాలి పాట
  6. నాదబ్రహ్మానంద-యోగి తత్త్వం
  7. గౌరీలక్ష్మీ సంవాదం
  8. కోలుకోలోయన్న
  9. సెప్పుకుంటా మనవి ఇనవే
  10. ఎయ్యరో గూడ ఎయ్యరో
  11. కొలనిగోపరికి గొబ్బిళ్ళో
  12. గుమ్మాలమ్మా నీకు గుబ్బరిటిపళ్ళో
  13. ఓ మన్నిదాయిలాల గొబ్బియల్లో
  14. దేవుడయ్యా దేవుడు మాయదారి దేవుడు
  15. ఏ ఊరు ఏ పల్లె తుమ్మెదా
  16. జోడు కొయ్యల ఓడ మీద
  17. ఎయ్‌రా ఏసెయ్ గెడ
  18. కోటిపల్లి రేవుకై
  19. ప్రయాగ నరసింహ శాస్త్రి – గుర్ర్రాల గోపిరెడ్డి
  20. ప్రయాగ నరసింహ శాస్త్రి – పాములవాడు
  21. ప్రయాగ నరసింహ శాస్త్రి – రూపాయి కావాలా
  22. ప్రయాగ నరసింహ శాస్త్రి – సిరిసిరిమువ్వ
  23. ప్రయాగ నరసింహ శాస్త్రి – గూటి చిలకేదిరా