పాఠకులు – రచన – రచయిత

వెల్చేరు నారాయణరావు భారతీయసాహిత్యం గురించి అనేక మౌలిక ప్రతిపాదనలు చేశారు. ఆయన చేసిన ఒక ప్రముఖ ప్రతిపాదనను ఇక్కడ పరిశీలిస్తాను [1, 5].

“భారతీయ సంప్రదాయంలో ఒక రచనని ఒక్కో కాలంలో వున్న శ్రోతలు/పాఠకులు ఎలా చూస్తారనేది ఆ రచన, దాని కర్తల స్వభావాన్ని నిర్దేశిస్తుంది.”

(ఈ వాక్యాన్ని రెండు మూడు సార్లు చదివి మననం చెయ్యండి.)

దీన్ని ముక్కలుగా విడదీస్తే:

  1. ఒక రచన ఏ తరగతికి చెందిందో నిర్ణయించేవారు దాని శ్రోతలు లేదా పాఠకులు.
  2. శ్రోతలు/పాఠకులు అంతా ఒకే నిర్ణయానికి వచ్చేయరు. వాళ్ళలో రకరకాలవాళ్ళు ఉంటారు; ఒక్కో రకం వారి వర్గీకరణ ఒక్కో రకంగా ఉండొచ్చు (దీన్ని తిరగేస్తే, ఒక రకమైన వర్గీకరణ చేసేవాళ్ళందరూ ఒక రకానికి చెందినవారిగా లెక్క వెయ్యొచ్చు).
  3. కాలంతో, పరిస్థితుల్లో వచ్చే మార్పులతో, శ్రోతలు/పాఠకులు మారతారు. అంటే, వాళ్ళ దృక్పథాలు మారుతాయి. ఆ కొత్త శ్రోతలు/పాఠకుల వర్గీకరణ అంతకుముందున్న శ్రోతలు/పాఠకుల వర్గీకరణకు ఎంతో భిన్నంగా కూడ ఉండొచ్చు.
  4. ఒకసారి ఒక రచన వర్గీకరణ మారినప్పుడు, దాని రచయిత వర్గీకరణ కూడ మారవచ్చు. అంతకుముందున్న దృష్టితో కాకుండా వేరే దృష్టితో ఆ రచయితని చూడవచ్చు. అతని గురించిన ఆలోచనలు మారవచ్చు.

దీనికి మకుటాయమానమైన ఉదాహరణ వాల్మీకి రామాయణం [2]. మొదట రామాయణం ఒక కథాకావ్యం. అంటే దాన్ని వినే లేదా చదివే శ్రోత దృష్టి ప్రధానంగా దాని కథ మీద వుండేది. అలాటి శ్రోత దృష్టిలో దాని కర్తకి ఉండవలసిన ముఖ్యగుణాలు – ఆ రకమైన కథని సమర్థవంతంగా హృదయరంజకంగా పాత్రలని సమదృష్టితో చూస్తూ నిర్వహించగలగటం, ధర్మాధర్మాలని స్పష్టంగా చూపించగలగటం, ఏ పాత్ర ఎలాటి కారణాలతో ఎలా ప్రవర్తిస్తుందనేది శ్రోతలకి తెలియచెప్పటం… ఇలాటివి. రామాయణంలో మనకు పరిచయమయే వాల్మీకికి ఇవన్నీ పుష్కలంగా వున్నాయి. అతను ఒక మహర్షి; దయార్ద్ర హృదయం వున్నవాడు; రసానుభవం పొందగలిగేవాడు; అన్ని పాత్రల్నీ సమదృష్టితో చూడగలిగినవాడు.

ఐతే కాలక్రమేణా రామాయణాన్ని కొందరు శ్రోతలు భక్తికావ్యంగా చూడటం మొదలెట్టారు. వాళ్ళ దృష్టిలో రాముడు భగవంతుడు. రామాయణం భగవల్లీలని వర్ణించే రచన. ఆ శ్రోతల దృష్టిలో దాని కర్తకి కావలసిన లక్షణాలు పైన చెప్పినవి కావు. ముందుగా అతను భక్తుడు కావాలి – నిష్పాక్షికదృష్టి వున్న వ్యక్తి కాదు; అదీ మామూలు భక్తి కాదు, తీవ్రమైన భక్తి వుండాలి. అతని పేరు వాల్మీకి కనుక దాని చుట్టూ ఈ గుణాలున్న ఒక వ్యక్తి కథని తయారుచేశారు. వల్మీకం నుంచి బయటికి వచ్చాడన్నారు. అంతకుముందు బందిపోటు దొంగన్నారు. అలాటివాడు పశ్చాత్తాపపడి సంస్కరించుకుని భక్తుడుగా మారితే ఎలాటి తీవ్రమైన భక్తిభావం వుంటుందో అది అతనికి ఆపాదించారు. ఇలా రకరకాలుగా రామాయణాన్ని చూసినవాళ్ళు వాళ్ళ ఊహల రచనకి సరిగ్గా సరిపోయే కథని వాల్మీకి చుట్టూ అల్లుకున్నారు. రామాయణం ఎంతో ప్రజాదరణ పొందింది కనుక దాని శ్రోతలు కూడ ఎన్నో రకాలవాళ్ళు. ఒక్కోరకం శ్రోతలు ఒకో వాల్మీకిని తయారుచేసుకున్నారు. అందువల్లనే మనకు ఒక వాల్మీకి లేడు, ఎందరో వాల్మీకులున్నారు.

వెల్చేరు ప్రతిపాదన వెనక వున్న ఆలోచన చాలా శక్తివంతమైంది. కవుల గురించి మనకున్న అనేక కథల్ని ఒక ఏకీకృత సిద్ధాంతం కిందికి అది తీసుకువచ్చింది. ఇప్పుడు ఈ సిద్ధాంతాన్ని ఇంకొందరు కవులకి అన్వయించి చూద్దాం. ముందుగా కాళిదాసు.


కాళిదాసు గురించి కూడ మనం అనేక కథలు వింటాం – అతనెలా కవి అయాడో, ఆ తరవాత భోజరాజు కొలువులో అతను ఎలాటి అతిమానుష సమస్యాపూరణలు చేశాడో, భోజకాళిదాసుల అనుబంధం ఎలాటిదో ఎన్నో అద్భుతమైన కథలు మనకు తెలుసు.

రామాయణాన్ని కొందరు శ్రోతలు భక్తికావ్యంగా చూడటం మొదలయ్యాక వాల్మీకి కథ ఎలా రూపాంతరం చెందిందో చూశాం. కాళిదాసు ఒక అద్భుతమైన కవి అని ఇప్పుడు కొత్తగా చెప్పక్కర్లేదు. వాల్మీకితో పోల్చదగ్గవాడు [4]. ఇతను ఎలాటి వ్యక్తి? ఏ వర్గంలో ఇతన్ని లెక్కవెయ్యాలి? అని చూసిన కొందరు శ్రోతలకి అప్పటికే వాల్మీకి ద్వారా తయారుచేసుకున్న ఒక నమూనా కనిపించింది. అది ‘భక్తికవి’ చట్రం. మరి ఆ చట్రంలో కాళిదాసుని బిగించాలంటే అతనికి కూడ ‘భక్తవాల్మీకి’ లాటి కథని అతికించాలి. అందుకే అతను మొదల్లో పశువులకాపరి అయాడు. తర్వాత కాళికాదేవి వరంతో ఆశుకవిగా మారాడు. వాల్మీకి పేరు వల్మీకంతో సంబంధం వున్న కథని తయారుచెయ్యటానికి ఎలా పనికొచ్చిందో అలాగే కాళిదాసు పేరు కూడ కాళికాదేవితో సంబంధానికి పనికొచ్చిందన్నమాట.

ఐతే ఇక్కడొక చిక్కొచ్చింది – వాల్మీకిలా కాకుండా కాళిదాసు అనేక కావ్యాలు రాశాడు; అనేక రకాలైనవి రాశాడు. రఘువంశం లాటి ‘ధార్మిక’ కావ్యాలతో పాటు శృంగారప్రధానాలైన శాకుంతలం, మేఘదూతం, భావనాప్రధానమైన ఋతుసంహారం లాటివి కూడ రాశాడు. అంచేత అతను అంత రసికుడెలా అయాడో కూడ అతని కథ వివరించాలి కదా! దీంతో అతను తన భార్యని వదిలేసి వేశ్యవాడల్లో మకాం పెట్టాల్సొచ్చింది. సరే, మరి అలాటి జీవితానికి పుష్కలంగా డబ్బు కావాలి కనుక అతన్ని పట్టుకెళ్ళి ఒక రాజు ఆస్థానంలో చేర్చేశారు. ఇంతవరకు బాగానే వుంది, అతని ‘రసికశృంగార భక్తవేషం’ బాగానే నప్పింది.

మరోవంక వున్న అతని అతిమానుష సమస్యాపూరణలు – వాటినెలా వివరించాలి? మనకున్న ప్రధాన ఇతిహాసాలైన భారతరామాయణాల కర్తలు ఋషులు. కనుకనే నానృషిః కురుతే కావ్యం అన్న నానుడి పుట్టుకొచ్చింది. మరి అంత అద్భుతకావ్యాలు రాసిన కాళిదాసు ఋషి కాకుండా ఎలా వుంటాడు? కాకపోతే కాళిదాసుని ఋషిని చెయ్యటం ఎలా? ఋషులు క్రాంతదర్శులు కదా! ఇంకేముంది, కాళీమాత వరంతో అతనికి క్రాంతదర్శనం కలిగించారు. అంచేత రాజుగారు ఎక్కడెక్కడో జరిగిన అనేక సంఘటనల గురించి ఇచ్చిన సమస్యల్ని అతను అక్కడవుండి చూసినట్టే అవలీలగా పూరించేశాడు. అంతేకాదు, స్వయంగా సరస్వతీదేవినే అతను ‘కోహం రండే’ అని గద్దిస్తే ఆమె ‘త్వమేవాహం త్వమేవాహం త్వమేవాహం నసంశయః’ అని సర్దిచెప్పుకోవలసి వచ్చింది.

ఇక్కడిదాకా అంతా బాగానే వుంది – కాళిదాసు ఋషయ్యాడు, ఋషులకి తగ్గ కావ్యాలు రాశాడు; రసికుడయ్యాడు, శృంగార కావ్యాలు రాశాడు; క్రాంతదర్శనంతో భోజుడిచ్చిన సమస్యల్ని అవలీలగా పూరించివేశాడు. ఐతే ఇక్కడ ఒక చిక్కొచ్చి పడింది. కాళిదాసు రసికతకి అతను వేశ్యావాటికలో ఉండటం కారణంలా కనిపిస్తే, ఇక శృంగారకవులు కాదల్చుకున్న వాళ్ళంతా వేశ్యావాటికలకి వరస కట్టేస్తే? కొంపలంటుకుపోవూ? సమాజం ఏం కావాలి?

దీనికీ ఓ మార్గం దొరికింది. కాళిదాసు కొన్నాళ్ళు కనపడకపోతే అతని జాడ చెప్పినవాళ్ళకి ఎన్నో వరహాలిస్తానని ప్రకటించాడు భోజుడు. దాంతో తనకు సహజంగా డబ్బు మీద వున్న వ్యామోహంతో కాళిదాసు వున్న ఇంట్లోనే వుంటున్న ఒక వేశ్య అతని తల నరికి రాజు దగ్గరికి తీసుకుపోయింది బహుమానం కోసం. (ఎంతో విద్యావంతులైన వేశ్యలు ఇలా జాడ చెప్పమంటే తలనరికి ఎందుకు తెస్తారన్న ఆలోచన ఆ పాఠకులకి రాలేదో లేక వాళ్ళ దృష్టిలో వేశ్యల పట్ల ద్వేషం అలాటిదో చెప్పలేం; ఏమైనా ఇదీ వాడుకలో వున్న కథ.) అలా చివరకు కాళిదాసు తిక్కతీరింది; ఇక కవి కాదల్చుకున్నవాడెవడూ వేశ్యల మొహం చూడడు గాక చూడడు!

నిజానికి కాళిదాసు ఎవరో అతని పుట్టుపూర్వోత్తరాలేమిటో మనకు తెలీదు. తన గురించి అతను ఏమీ చెప్పుకోలేదు, సమకాలీనులెవరూ అతని జీవితం గురించి చెప్పనూ లేదు. మహా ఐతే అతను హిమాలయ ప్రాంతాలవాడని అతని రచనలనుబట్టి మనం ఊహించుకోవచ్చు, అంతే. కాని అతని రచనల పట్ల ముగ్ధులైన కొందరు పాఠకశ్రోతలు అతని గురించి తయారుచేసుకున్న ఈ కథలు అతని రచనల్ని వాళ్ళు ఎలా చూశారనేదాన్ని మనకు తెలియచెప్తాయి. అంటే కథల్లో కనిపించే కాళిదాసు, అతని రచనల మీద వాళ్ళకున్న అభిప్రాయాల ద్వారా అతని పాఠకశ్రోతలు తయారుచేసినవాడు.


శ్రీహర్షుడి విషయంలో ఇంకో రకమైన కథ వుంది. అతని బుద్ధి ఎంత తీక్షణమైందంటే అతను మొదట రాసిన నైషధకావ్యం ఎవరికీ అంతుపట్టలేదట. దాంతో అతని మేనమామ అతనికి బుద్ధిమాంద్యం కలిగించే భోజనం కొంతకాలం పెట్టించి మళ్ళీ రాయమన్నాట్ట. అది కూడ ఎంతో క్లిష్టంగా ఉండటంతో ఇంకొంతకాలం తర్వాత మళ్ళీ రాయించాట్ట. అదే మనకిప్పుడు దొరుకుతున్న నైషధమట.

ఈ కథలోని శ్రీహర్షుణ్ణి తయారుచెయ్యటంలో మనకి దానిలోని పాండిత్యప్రహేళికల్లో తలమునకలై ‘నైషధం విద్వదౌషధం’ అని సంభ్రమాశ్చార్యాల్తో స్తుతించే పాఠకుల హస్తం స్పష్టంగానే కనిపిస్తుంది (నైషధం కాలానికి శ్రోతల స్థానంలోకి పాఠకులు వచ్చారనేది వేరే చెప్పక్కర్లేదు; అది శ్రోతల్ని ఉద్దేశించి రాసింది కాదు – శ్రోతలకి కావలసింది ఆపాతమధురాలైన కథలు కాని ఆలోచనామృతాలైన గ్రంథగ్రంథులు కాదు! దానికి పదేపదే మననం చేసుకుంటూ తాపీగా హాయిగా ఆలోచించుకునే పాఠకులు కావాలి [3].

ఇంకొక సంస్కృతకవిని చూద్దాం. ఇతను మహా ప్రతిభావంతుడని ఊళ్ళోవాళ్ళంతా పొగుడుతుంటే, ఇతని తండ్రి మాత్రం ‘అబ్బే, వీడేమిటి వీడి మొహం, వీడూ ఓ కవేనా! ఆ భాసుడు, కాళిదాసు, దండి, బాణుడూ – వాళ్ళూ కవులంటే’ అంటుండేవాడు. దాంతో కొన్నాళ్ళకి ఈ కవికి విపరీతమైన రోషం పుట్టుకొచ్చింది. తన తండ్రి బతికుండగా తనని కవిగా గుర్తించడని నిశ్చయించుకున్నాడు. అతన్ని చంపితేగాని తన ప్రతిభ బయటికి రాదని నిర్ణయించుకుని ఒక రోజు అటక మీద పెద్ద బండ తీసుకుని కూర్చున్నాడు. తండ్రి ఆ చాయలకి వచ్చినప్పుడు దాంతో మోది అతన్ని చంపాలనేది అతని పథకం. అలా ఎదురుచూస్తుండగా తండ్రి రానే వచ్చాడు. అతనితో పాటు కవిగారి తల్లి కూడ వచ్చి, ‘ఊళ్ళోవాళ్ళంతా మనబ్బాయి అంతవాడనీ ఇంతవాడనీ పొగుడుతుంటే మీరేమో వాణ్ణి పూచికపుల్ల కింద తీసిపడేస్తున్నారు, ఇదేం బాగులేదు’ అనటం, దానికతని తండ్రి ‘మనవాడి ప్రతిభ నాకు తెలీదా! వాణ్ణి మించిన కవి ఈ ప్రాంతాల్లో ఎక్కడా ఎవడూ లేడు. కాళిదాసనీ వాడనీ వీడనీ అంటాం గాని వీడు వాళ్ళందర్నీ తలదన్నేవాడు. ఐతే తల్లిదండ్రులమైన మనం వాణ్ణి పొగడకూడదు, వాడికి ఆయుక్షీణం’ అనటం వినిపించింది. అతనికి పశ్చాత్తాపం కలిగింది. వెంటనే కిందికి దిగి వచ్చి తను చెయ్యబోతున్న పని గురించి చెప్పి తనకి ప్రాయశ్చిత్తం ఏమిటో చెప్పమని తండ్రి కాళ్ళావేళ్ళాపడ్డాడు. చివరికతను, ‘అలా ఐతే నువ్వు వెంటనే బయల్దేరి మీ అత్తవారింటికి వెళ్ళు. అక్కడ ఎన్నాళ్ళుంటావో చెప్పకుండా ఆరునెలలు గడిపి రా, అదే నీకు ప్రాయశ్చిత్తం’ అని చెప్పాడు. ఆ కవి కూడ మర్నాడే అత్తవారింటికి వెళ్ళాడు.

అక్కడ ఏం జరిగిందో వివరించి చెప్పాల్సిన పని లేదు. ఒకటి రెండు వారాలు చాలా గౌరవంగా చూశారు. తర్వాత ‘ఎప్పుడు వెళ్తాడో కనుక్కో’మని వాళ్ళ అమ్మాయికి చెప్పిచూశారు. ఏమీ తేలలేదు. ఇక తిరిగి వెళ్ళే ఆలోచన లేనట్టుందని వాళ్ళకి అనుమానం రావటం మొదలైంది. మెల్లమెల్లగా అతన్ని అవమానకరంగా మాట్లాడటం, వెక్కిరించటం, చిన్నచిన్న ఇంటిపనులు పురమాయించటం… అలా అలా కొంతకాలం అయేసరికి ఇంటి నౌకర్ల పనులు, బయటి వ్యవసాయ వ్యవహారాలు ఇతని మీదే పడటం జరిగిపోయాయ్.

ఆరుమాసాలు గడిచాక ఇంటికి తిరిగివచ్చేసరికి ఇతనికి పూర్తిగా జ్ఞానోదయం ఐంది. సుభాషితాలు రాశాడు, ప్రఖ్యాతి గడించాడు. అతనే భర్తృహరి. అతని ఈ కథ ద్వారా, ‘సుభాషిత కవి’ చట్రం ఒకటి తయారయ్యింది. ఇలాటి కథలు ఇంకొందరు కవులకి కూడ తర్వాత్తర్వాత చిన్నిచిన్ని మార్పులతో అన్వయింపబడ్డాయి.

దాదాపుగా ఇదే కథని మనం భారవి గురించి కూడ వింటాం. ఐతే కిరాతార్జునీయ కర్త భారవికి ఇలా ‘బుద్ది చెప్పించాల్సిన’ అవసరం పాఠకులకి ఎందుకు కలిగిందనేది నాకు అంతుచిక్కని విషయం. ఇలాటి కథలు ఏదో ఒక ప్రయోజనాన్నాశించి తయారైనవి. ఎవరో ఊరికే కూర్చుని, ఈ భారవికి పొగరెక్కువ, దాన్ని దించుతా చూడు అని తయారుచేసినవి కావు. కనుక భర్తృహరికి అతికినంతగా ఈ కథ భారవికి అతకదు. భర్తృహరి సుభాషితాలు రాసినవాడు కనక, అతనికా అవసరం, అవకాశం ఎలా కలిగాయన్న కుతూహలం పాఠకుల్లో కలగటం ఆశ్చర్యం కాదు. దానికి వాళ్ళో కథ తయారుచెయ్యటమూ అసమంజసం కాదు.

ఇంకొక్క సంస్కృతకవిని చూసి తెలుగుకవుల విషయానికి వద్దాం. ఇతను జయదేవుడు. గీతగోవిందకారుడు. నారాయణరావు వివరించినట్టు అలంకార శాస్త్రకారులకు కొరకరానికొయ్యై కూర్చున్నవాడు. వాళ్ళు నిషేధించిన ‘ఉత్తమదేవతల శృంగారా’న్ని విచ్చలవిడిగా ప్రదర్శించినవాడు. బహిష్కరిద్దామంటే పాఠకులు అతని భాషాసౌందర్యాన్ని ఉవ్విళ్ళూరుతూ చదివి ఆనందిస్తున్నారు. కనుక చేసేదేమీలేక అతన్ని ‘భక్తికవి’ జాబితాలో వెయ్యటానికి ప్రయత్నించారు (ఆ పని చేసింది అలంకార శాస్త్రకారులో వాళ్ళ గోల భరించలేని మరెవరో మనకి తెలీదు). ‘భక్త జయదేవ’ కథలు తయారయ్యాయి. అతనికీ మానవాతీతశక్తుల్ని అంటగట్టారు. యథాప్రకారంగానే అతని ‘అసలు’ వృత్తాంతం ఏమిటో మనకి తెలీకపోయినా ప్రచారంలో వున్న కథలు ‘భక్తికవి’ మూసలో నడుస్తాయ్. అతనికి కృష్ణుడు కావాలన్నప్పుడల్లా కనిపిస్తూ వుంటాడు, తన రాసలీలల్ని చూసే దివ్యదృష్టిని జయదేవుడికి ప్రసాదిస్తాడు.

తరవాత కాలంలో వచ్చిన భక్తికవుల కథల్లో కనిపించే ఒక ముఖ్యమైన అంశం జయదేవుడి దగ్గర ప్రారంభమైందేమో అనిపిస్తుంది. అది, భక్తికవికి దగ్గర్లో ఉన్న రాజుల వల్ల ఉపద్రవాలు కలగటం. జయదేవుణ్ణి అక్కడి రాజు తన ఆస్థానానికి ఆహ్వానిస్తాడు. అతను వెళ్ళి తన అష్టపదుల్ని పాడి వినిపిస్తాడు. రాజు అతన్ని అక్కడే ఉండమంటాడు. మనం ఊహించినట్టే అతను ఆ ఆహ్వానాన్ని తిరస్కరిస్తాడు. ఐతే తరవాత వచ్చే రాజుల్లా కాకుండా ఈ రాజు మాత్రం అతన్ని సత్కరించి తిరిగి పంపేస్తాడు.

దీనికి మరో రూపాంతరం కూడ ఉంది. దాన్లో రాజు అతన్ని ఊరికే పంపెయ్యడు. అతని గీతగోవిందం తాళపత్రాల్ని తీసి నదిలో పారేయిస్తాడు. కాని జయదేవుడి మానవాతీతశక్తుల వల్ల అవి నానవు, మునగవు. చక్కగా నీళ్ళ మీద తేలుతుంటాయి. జయదేవుడి మహిమకి ఆశ్చర్యపడ్డ రాజు అతనికి సాగిలపడి గౌరవించి పంపుతాడు.

జయదేవుడి కథలో మరో విశిష్టాంశం అతని భార్య పద్మావతి. ఒక కథ ప్రకారం ఆమె నర్తకి. ఆమెకి కూడ గీతగోవింద రచనలో ప్రముఖస్థానం ఉంది. ఆమె చిన్నప్పుడు తల్లిదండ్రులామెని జగన్నాథస్వామి ఆలయం దగ్గర వదిలేసి వెళ్తే జయదేవుడామెని చేరదీశాడని ఒక కథ వుంది. కాదు, ఆమె దేవదాసి లేదా వేశ్యాకుటుంబంలో పుట్టినావిడ అని మరో కథ వుంది. బహుశః దీనికి కారణం అతను తనని తాను ‘పద్మావతీచరణచారణచక్రవర్తి’గా చెప్పుకోవటం. కాళిదాసు రసికతకి కారణాన్ని కల్పించినట్టుగా జయదేవుడు అలా అనటానికి కారణాన్ని కూడ అతని కథలో వివరించాల్సిన అవసరం కలిగింది. అంచేత ఆమె ఒక నర్తకి అయింది. అతని అష్టపదులకి ప్రేరణ అయింది. అంతకుముందున్న కథలకి మరికొన్ని చిలవలుపలవలు జోడించి తయారుచేసిన ‘భక్త జయదేవ’ చలనచిత్రంలో ఆమె నాట్యం చూస్తూ, రాధాకృష్ణుల రాసలీలల్ని మనోనేత్రంలో దర్శిస్తూ జయదేవుడు అష్టపదుల్ని గానం చేస్తాడు.

పద్మావతి వేశ్య అనో లేక దేవదాసి అనో అనటానికి కారణం కూడ ఊహించటం కష్టమేమీ కాదు. జయదేవుడామె చరణచారణచక్రవర్తి కావాలంటే అది మామూలు గృహిణుల వల్ల అయే పని కాదని అతని పాఠకులు తయారుచేసిన కొసమెరుపది. గౌరవప్రదమైన కుటుంబాల ఆడవాళ్ళు నర్తకులు కాలేరు కదా! పైగా భర్తల్ని తమ ‘చరణచారణచక్రవర్తులు’గా చేసుకోవటమా? శాంతం! పాపం!


ఇప్పటికి మనకు మూడు వర్గాల కవులు కనిపించారు – ఋషులు/ఋషితుల్యులు, భక్తికవులు, సుభాషితకవులు.

ఇంక మనం తెలుగు కవుల కథల వైపు మళ్ళుదాం.

తెలుగు తొలికవి నన్నయ. సంస్కృతభారతాన్ని ఆంధ్రీకరిస్తున్నానని ఆయన అన్నా అది నిజానికి స్వతంత్రరచన. సంస్కృతభారతం ఇతిహాసం. నన్నయభారతం కావ్యం. సంస్కృతభారతం కథాసరిత్సాగరం. నన్నయభారతం భాషాసౌందర్యమందారం. ప్రసన్నకథాకలితార్థయుక్తి, అక్షరరమ్యత వ్యాసభారతానికి అన్వయించవు. దేని దారి దానిదే.

మరి నన్నయభారత పాఠకులు ఆ రచనని ఎలా చూశారు? పైన చెప్పినట్టు దానికి వెంటనే కావ్యగౌరవం దక్కింది. కనుక యథాప్రకారంగానే నన్నయకి ‘ఋషి’త్వమూ దొరికింది. ఆ తర్వాత తెలుగుకవులు అందరూ వినమ్రంగా నన్నయకి నమస్కరించారు. నన్నయాదులు భాగవతాన్ని తాకకపోవటం తన పూర్వజన్మసుకృతంగా వర్ణించాడు పోతన. మిగతా ప్రముఖకవులూ ఆయన్ని వ్యాసవాల్మీకుల సరసన నిలబెట్టారు. ‘ధీరమతి’గా ప్రశంసించారు. ఇటీవలి విశ్వనాథ ఋషితుల్యుడిగా నన్నయని వర్ణించాడు.

ఐతే నన్నయకి మరోవర్గం పాఠకులు కూడ లేకపోలేదు. వీళ్ళదృష్టిలో నన్నయ మామూలు మనిషే. అంతేకాకుండా ఆదికవిగా తనకి పేరు రావాలని అప్పటికే తెలుగులో కవిత్వం రాసిన అధర్వణాచార్యుని వంటివారి రచనల్ని కాల్చేయించిన ఘనుడు, అసూయాపరుడు. ఈ కథ ఇటీవలి కాలానిదని తేలిగ్గానే చెప్పెయ్యొచ్చు – అప్పటికే వచ్చిన కన్నడభారతంతో పరిచయం వున్న నన్నయకి ‘తొలికవి’ అనిపించుకోవాలన్న ఉబలాటం ఉండటం అసమంజసం. కాగా నాకో సందేహం – ఆంగ్లేయులు రాజులయాక నియోగులు, వైదీకుల మధ్య పెరిగిన ఆర్థిక సామాజిక అంతరాలు, వాటినుంచి వచ్చిన వైషమ్యాలు కూడ ఈ కథల తయారీలో ముఖ్యపాత్ర పోషించాయేమో అని. ఏది ఏమైనా వాళ్ళ భావాలకి తగ్గట్టు రచయితని మలుచుకునే హక్కు ఏ పాఠకులకైనా వుంటుంది.

అరణ్యపర్వమధ్యంలో నన్నయ రచన ఆగిపోవటం అనేక కథలకి తావిచ్చింది. నన్నయని ఋషిగా, క్రాంతదర్శిగా చూసినవాళ్ళు ‘శారదరాత్రులుజ్జ్వల లసత్తర తారకహారపంక్తులన్…’ అనే ఆయన ఆఖరి పద్యం చివర్లో ‘పరపూరితంబులై’ అని అక్కడినుంచి తెలుగుభారతం పరపూరితం అవుతుందని జోస్యం చెప్పాడన్నారు. భారతం అలా ఆగిపోవటానికి కారణం ఆయన మరణం అని కొందరంటే ఋషితుల్యుడైన నన్నయ అలా అర్ధాంతరంగా మరణించడని, తన సహాధ్యాయి, భారతరచనలో తనకి కురుక్షేత్రయుద్ధాన అర్జునుడికి కృష్ణుడిలా సహాయపడ్డ నారాయణభట్టు మరణం వల్ల ఆయన భారతరచన మానేశాడని మరికొందరన్నారు. మరికొందరి కథనంలో వేములవాడ భీమకవి నన్నయకి సమకాలికుడు. కారణం ఏదైనా కానీ (ఉదాహరణకి, ఆంధ్రశబ్దచింతామణిని భీమకవి రాస్తే దాన్ని నన్నయ నాశనం చేయించాడని ఒక వృత్తాంతం) భీమకవి నన్నయని శపించాడు. ఆ శాపకారణంగా నన్నయ భారతరచన ఆగిపోయింది.

ఏది ఏమైనా మొత్తం మీద నన్నయ పాఠకులు అనేకమంది దృష్టిలో ఆయనకి ఋషివర్గంలోనే స్థానం దొరికింది.

భీమకవిది ఒక విచిత్రమైన కథ. ఆ కథ ప్రకారం అతను భీమేశ్వర వరప్రసాది. వశ్యవాక్కు. శాపానుగ్రహసమర్థుడు. చిన్నప్పుడు తన తల్లికి కళంకం ఆపాదించిన వాళ్ళు తింటున్న భోజనాలకి శాపం పెట్టి అప్పాలన్నీ కప్పలుగా అన్నం అంతా సున్నంగా చేసి, వాళ్ళంతా వచ్చి కాళ్ళావేళ్ళాపడితే అనుగ్రహించి మళ్ళీ మామూలుగా చేశాడు. పెద్దయాక తనని అవమానించిన కళింగగంగుని శపించి రాజ్యభ్రష్టుణ్ణి చేశాడు. వాడు వచ్చి వేడుకుంటే మళ్ళీ తిరిగి రాజ్యం వచ్చేలా అనుగ్రహించాడు. చివరికి ‘పేరాముదపా కడిగిన పారమ్మున వేసినట్టి’ పక్కింటి బాపడు చావాలని శపించాడు. శాపం తర్వాత ఏమయిందీ మనకి తెలీదు గాని బహుశః అతనలా చచ్చేవుంటాడు.

ఇలా భీమకవి వల్ల మనకొక ‘శాపానుగ్రహ సమర్థుడైన కవి’ మూస దొరికింది. ఆ తర్వాత చాలామంది ఇలాటివాళ్ళు తయారయ్యారు. చీటికీ మాటికీ తిట్టటం మొదలెట్టారు. ‘లొట్ట ఇదేటి మాట, కడు లోభులతో మొగమాటమేల, నే తిట్టెద’ అని ప్రతిజ్ఞలు చేసి మరీ భీకరసమాసాలతో తిట్టారు. ఒక కొసమెరుపేమిటంటే, వీళ్ళలో చాలామంది రచనలేమిటో పాఠకులెవరో మనకి తెలీదు కాని వాళ్ళకి వాళ్ళే తాము శాపానుగ్రహ సమర్థులమని చెప్పుకోవటం మొదలయ్యింది. ‘ఆ మాట పాఠకులు చెప్పాలి, మీకు మీరే కాదు’ అని ఎవరూ వీళ్ళకి చెప్పినట్టు లేదు. లేక, చెప్పినా అలాటి పాఠకులు వస్తారో చస్తారో మనకి మనమే అనేసుకుంటే పోలే? అనుకున్నారేమో తెలీదు. ఐతే వీళ్ళలో చాలామందికి తెలిసిన విద్య శాపానుగ్రహాల్లో ఒకటే. అదేమిటో వేరే చెప్పక్కర్లేదు. ఒకరయితే ఏకంగా ఒక పుస్తకమే రాసిపారేశాడు బూతుతిట్లపురాణంగా – చంద్రలేఖావిలాపం అని. ఐతే ఏమాటకామాట చెప్పుకోవాలి: ఆ కవికి పద్యమ్మీద మాంఛి పట్టుంది. మొత్తానికి ఈరకం కవులకి తిట్లదండకాల్లో ఉన్న ప్రావీణ్యత వాళ్ళనీ చిరస్మరణీయుల్ని చేసింది. పాఠకలోకం ముక్తకంఠంతో వీళ్ళని ‘తిట్టుకవులు’గా గుర్తించేసింది.


శ్రీనాథుడు మరొక విధమైన ప్రత్యేకకవి. బహుశః ఈయనతోనే ‘రాజాస్థానకవి’ అనే మరో మూస తయారయ్యిందేమో అనిపిస్తుంది. మొదట శ్రీనాథుడు కూడ ‘భక్తికవి’ మూసలోనే వుండేవాడు. శివపదార్చనశీలుడుగా శివధ్యానతత్పరుడిగా కథల్లోకెక్కాడు. ఐతే ఆయన తన రచనల్ని మంత్రులకీ రాజులకీ అంకితాలిచ్చి వాళ్ళ సన్మానసత్కారాలందుకోవటంతో కొందరు పాఠకులు ఎదురుతిరిగారు. వాళ్ళకాయన రాజుల మోచేతి నీళ్ళు తాగేవాడిలా కనపడ్డాడు. ఎవరి దగ్గర ఎలాటివి పుచ్చుకున్నాడో వివరంగా లెక్కలు కట్టారు వాళ్ళు. ఉదాహరణకి:

కాశికావిశ్వేశు కలిసె వీరారెడ్డి
రత్నాంబరంబు లే రాయడిచ్చు
రంభగూడె తెనుంగు రాయ రాహుత్తుండు
కస్తూరి కే రాజు ప్రస్తుతింతు
స్వర్గస్థుడయ్యె విస్సనమంత్రి మరి హేమ
పాత్రాన్న మెవ్వని పంక్తి గలదు
కైలాసగిరి బండె మైలారవిభుడేగె
దినవెచ్చ మేరాజు దీర్పగలడు

ఇలాగా, రాజాస్థానకవి దినఖర్చుల నుంచి కనకస్నానాల వరకు, అన్నభత్యాల నుంచి అగ్రహారాల వరకు రాజులు లేదా ధనికుల్ని ఇంద్రుడనీ చంద్రుడనీ పొగిడి వాళ్ళు వేసే బిచ్చంతో పబ్బం గడుపుకునేవాడిగా చిత్రించబడ్డాడు. చివరికి ఆ కవులు తినేదాన్ని ‘పడుపుకూడు’గా చెప్పటానికి కూడ వాళ్ళు వెనకాడలేదు.

బహుశః తమ కళ్ళముందే మామూలుగా తిరిగిన కవులు హఠాత్తుగా రాజప్రాపకంతో సంపదలు పొంది ఎదిగిపోవటాన్ని చూసిన పాఠకులు తయారుచేసిన చిత్రం ఇది. దీన్లో కవుల మీద పాఠకులకున్నది అభిమానం, గౌరవం కాదు; అసూయ, కోపం. ఇంతగా వాళ్ళకు కోపం తెచ్చే పని శ్రీనాథుడు ఏం చేశాడా అని ఆలోచిస్తే నాకు తోచేది ఇది – మొదల్లో, నైషధం, కాశీఖండం తెలుగు చేసినవాడిగా ఆయన్ని వాళ్ళు ఎంతగానో గౌరవించారు; ‘కాశీఖండ మయఃపిండం, నైషధం విద్వదౌషధం’ అని మురిసిపోయారు; ఐతే నైషధమూలంలోని సమాసాల్ని మక్కికి మక్కిగా తెలుగులోకి దించేశాడని కొంత అసంతృప్తి కలిగినట్టు ‘మీ డుమువులు మీరే వుంచేసుకుని మా సమాసాల్ని మాకిచ్చెయ్యండ’ని సంస్కృతపండితులు శ్రీనాథుడితో అన్నట్టు వినిపించే కథ మనకి చెప్తుంది. బహుశః హరవిలాసం, శివరాత్రిమహాత్మ్యం లాటి వాటిలో శృంగారం అదుపు దాటిందన్న భావన కూడ ఒక కారణమేమో. అన్నిటికీ మించి రాజుల ప్రాపకంతో భోగాలనుభవించాడన్న బాధ ఉండనే వుంది.

మొత్తానికి కారణాలేవైనా కానీ కొందరు పాఠకులకి శ్రీనాథుడి మీద గట్టిగానే తిక్కరేగింది. అందుకే ఈ కథనంలో శ్రీనాథుడు ఇప్పటి భాషలో చెప్పాలంటే చివరికి ‘దిక్కులేని చావు చచ్చాడు.’

శ్రీనాథ రచనలని నిశితంగా పరిశీలిస్తే తేలేది[6] ఆ రచనల్లోని శ్రీనాథుడు చివరిదశలో మహోచ్చస్థితిని చేరుకున్నాడు – చిన్నచిన్న మంత్రులు, సంస్థానాధీశుల దగ్గర మొదలైన అతని ప్రస్థానం ప్రౌఢదేవరాయల ఆస్థానంలో గౌడ డిండిమభట్టుని పాండిత్యపరీక్షలో ఓడించి అతని కంచుఢక్కని పగలగొట్టించి ‘దీనారటంకాల తీర్థమాడే’ దశని చేరుకుంది. అలాటి శ్రీనాథుడు కృష్ణవేణమ్మ మునుగు ప్రాంతాల్లో వ్యవసాయం చేసి జీవించి అన్నీ కొట్టుకుపోతే ఏడునూర్ల సుంకం చెల్లించలేక అక్కడి రాజు చేత క్రూరంగా శిక్షించబడటం అసూయాగ్రస్తులైన అతని పాఠకులు అతని మీద కక్ష తీర్చుకోవటానికి తయారుచేసుకుని ఆనందించిన కథే! అతని మిడిసిపాటుకి తగ్గ శాస్తి చేసిగాని శాంతించలేదు ఆ పాఠకవర్గం. ఎంతటి మహాకవికైనా తన భావిపాఠకుల చేతుల్లోనే భవిష్యత్తు నిర్మితమౌతుంది! ఒకరకంగా ఈ కథ తర్వాతి తరాల రాజాస్థానకవులకి ఒక మేలుకొలుపుగా ఉపయోగపడింది. జాగ్రత్తగా ఉండకపోతే శ్రీనాథుడికి పట్టిన గతే మీకూ పడుతుంది సుమా అనే హెచ్చరికగా పనిచేసింది. కనుక తర్వాత వచ్చిన ఏ రాజాస్థానకవికి ఇంతటి దుర్గతి పట్టలేదు, కనీసం పాఠకులు అల్లుకున్న కథల్లో!

ఐతే శ్రీనాథుడి పాఠకవర్గం అంతా ఇలాటివాళ్ళు కారు. ఒకవర్గం వారు అతని పద్యశైలికి దాసులై దాన్ని అనుకరించటానికి ప్రయత్నించారు. క్రీడాభిరామం కర్త అలాటివాడు. అతను శ్రీనాథుడి శైలిని ఎంతబాగా పట్టుకున్నాడంటే ఎందరో ఉద్దండ పండితులు కూడ అది శ్రీనాథుడు రాసిందేనని భ్రమించారు. అంతేకాదు, శ్రీనాథుడి తర్వాత వచ్చిన అనేక రచనల్లో అతని ప్రభావం ప్రస్ఫుటంగానే కనిపిస్తుంది.

మరొక వర్గం పాఠకులున్నారు. వీళ్ళ శ్రీనాథుడు విపరీతంగా దేశాటనం చేశాడు. ముఖ్యంగా పల్నాడు, గురజాల ప్రాంతాల్లో తిరిగి అక్కడి జనజీవనానికి విస్తుపోయాడు. అక్కడి భోజనవసతులకి చిరాకుపడ్డాడు. ఎందుకీ పాఠకులు అలా అనుకున్నారు? శ్రీనాథుడు అనేక ప్రదేశాలు తిరిగాడనేది అతని రచనల నుంచి స్పష్టమే. కనుక ఏ ప్రాంతంవారైనా అతను తమ ప్రాంతాలకు కూడ వచ్చి వుండొచ్చునని అనుకోవటంలో తప్పులేదు. అలా వచ్చివుంటే ఏమనుకునేవాడో ఊహించటం అక్కడినుంచి పెద్ద దూరం కాదు.

మరొక వర్గం పాఠకుల శ్రీనాథుడు సౌందర్యపిపాసి. ముఖ్యంగా స్త్రీలు ఎక్కడ కనిపించినా వారి ఆర్థిక సామాజిక స్థితిగతుల్తో సంబంధం లేకుండా వారిలో సౌందర్యాన్ని చూసినవాడు. నా అభిప్రాయంలో ఈ పాఠకులు శ్రీనాథుణ్ణి క్రీడాభిరామకర్తగా చూసినవాళ్ళు. అందులో ఉన్న అన్ని కులాల, వర్ణాల స్త్రీల వర్ణనల ప్రాతిపదిక మీద ఇలాటి శ్రీనాథుణ్ణి వాళ్ళు తయారుచేశారు.

ఇంకొక వర్గం వారి శ్రీనాథుడు శృంగారి. నైషధం, శివరాత్రిమహాత్మ్యం, హరవిలాసం – వీటిలో శృంగారం పాలు ఎక్కువగానే ఉంటుంది కనుక అతన్ని శృంగారిగా భావించటంలో ఆశ్చర్యం లేదు. అలాగే శ్రీనాథుడు ఏ విషయాన్ని చెప్పినా దాన్లో మమేకమై ఉల్లాసాన్ని అనుభవిస్తూ చెప్పినట్టుంది కనుక ఈ పాఠకులు ఆ శృంగార వర్ణనలకి ఆకర్షితులు కావటం వింతకాదు. ఐతే ఆంగ్లేయ ప్రభావం వల్ల శృంగారం మీద కలిగిన ఏహ్యత వీరిని మరోవంక లాగుతుంటే మధ్య నలిగిపోయారు వీరు. ఉదాహరణకి శ్రీనాథుడి పేరుతో వున్న అనేక చాటువుల్లోని శృంగారానికి విస్తుపోయిన వేటూరి ప్రభాకరశాస్త్రి ఏకంగా శృంగార శ్రీనాథం అని ఒక పుస్తకాన్ని ప్రచురించాడు. ఐతే ముందుగా ఈ పుస్తకాన్ని చదివేప్పుడు మనసులో మలినశృంగారభావాలు రాకుండా చూసుకుంటూ, కేవలం సాహిత్యాస్వాదన కోసమే చదువుతున్నామని గుర్తు తెచ్చుకుంటూ, అవసరమైతే పరమేశ్వరుణ్ణి తలుచుకుంటూ సాగమని జాగ్రత్తలు చెప్పిగాని ముందుకు కదలనివ్వలేదు.

మనకు శ్రీనాథుడివిగా చలామణీ ఔతున్న ఎన్నో చాటుపద్యాలు ఉన్నాయి. ఈ పరిశీలన చెప్పేదేమంటే, ఒకటి: అవి శ్రీనాథుడి పద్యాలు కావు, రెండు: అవి వివిధ వర్గాల పాఠకులు వాళ్ళవాళ్ళ శ్రీనాథుడు ఎలా ప్రవర్తిస్తాడో ఊహించుకుని చెప్పిన పద్యాలు, మూడు: ఆ పద్యాలన్నిట్నీ కలిపికట్టి శ్రీనాథుడి చిత్రం గీద్దామంటే కుదరదు – అవి ఒక శ్రీనాథుడి గురించి కాదు, అనేకమంది శ్రీనాథుల గురించి.

ఇంతటితో శ్రీనాథుడి వ్యవహారం ముగించి ముందుకు సాగుదాం. ఐతే, ఈ ప్రయత్నం ముఖ్యంగా రచయితల్ని వర్గీకరించటానికి పాఠకులు తయారుచేసుకున్న మూసల గురించి గనక ఆ విషయమై ఒక్కమాట చెప్పుకుందాం: రాజాస్థానకవిగా శ్రీనాథుడు ఒక వర్గం పాఠకులకి ఒక కొత్త మూసని తయారుచేసుకునే అవకాశం కలిగించాడు. అప్పటికే భక్తికవికి ఒక మూస తయారై వుండటంతో భక్తికవికి పూర్తి వ్యతిరేకమైన మూసగా రాజాస్థానకవిని తయారుచెయ్యటం వారికి తేలికయింది.


శ్రీనాథుడి తర్వాత వచ్చిన ‘భక్తికవి’కి కూడ తిప్పలు తప్పలేదు. ఈ భక్తికవి మారురూపం పోతన. యథాప్రకారం గానే ఆయన భగవద్భక్తుడు. ఆయన ఇష్టదైవం రాముడు. ఒకనాడు సూర్యగ్రహణ సమయాన నదీతటాన సీతాలక్ష్మణ సహితుడైన రాముడు కొండంతకోదండంతో ఆయనకి కనిపించి భాగవతరచనకి ఉపక్రమించమని ఆజ్ఞాపిస్తాడు. నువ్వు నిమిత్తమాత్రుడివి, పలికించేది నేనే అని భరోసా ఇస్తాడు. రచనంతా పూర్తయాక మూస ప్రకారంగానే దగ్గర్లో వున్న రాజు దాన్ని తనకి అంకితమివ్వమని అడుగుతాడు. ఆయన ఆ విషయం ఆలోచిస్తుంటే ‘కాటుకకంటినీరు చనుకట్టు పయింబడ’ ఏడుస్తూ ‘కైటభదైత్య మర్దనుని గాదిలికోడలు’ కనిపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోను భాగవతాన్ని ‘కర్నాటకిరాటకీచకుల కమ్మ’నని ఊరడిస్తాడు. తర్వాత లెక్కప్రకారంగానే రాజుగారు కోపించి పోతనని చెరసాలలో బంధించటం, భాగవతాన్ని తగలబెట్టించటం చకచకా జరిగిపోతాయి. శిథిలం కాకుండా మిగిలిన భాగాల్ని తెచ్చుకుని పోతన, అతని శిష్యులు కలిసి మళ్ళీ రాయటంతో కథ సుఖాంతం ఔతుంది.

ఇదే చట్రం కాస్తో కూస్తో తేడాలతో తర్వాత వచ్చిన అన్నమయ్య, త్యాగయ్య, రామదాసుల కథలకూ వర్తిస్తుంది. అలా భక్తికవి జీవితం ఎలా వుండాలో పాఠకులు పూర్తిగా నిర్ణయించేశారు. ఒకరిని భక్తికవి అనదల్చుకుంటే వాళ్ళకి దాన్ని బిగించేసి కథని రక్తి కట్టించేశారు.

శ్రీనాథుడి తర్వాతి కాలాల్లో వచ్చిన ప్రబంధ కవుల్ని రాజాస్థాన కవుల మూసలో వేసెయ్యటం పెద్ద కష్టమేమీ కాలేదు. ఆ కవుల విలాసజీవితాన్ని ఎలా ఊహించుకున్నారో చూడండి:

నిరుపహతి స్థలంబు, రమణీప్రియదూతిక అందియిచ్చు క
ప్పుర విడె మాత్మకింపయిన భోజన మూయల మంచ మొప్పు త
ప్పరయు రసజ్ఞు లూహ తెలియంగల పాఠక లేఖకోత్తముల్
దొరకిన గాక యూరక కృతుల్ రచయింపు మనంగ శక్యమే

ఐతే అప్పటికి కాస్త డొక్కశుద్ధి వున్న ప్రతికవీ ఎవరో ఒక రాజునో ధనికుణ్ణో చూసుకుని వాళ్ళ ఆస్థానాల్లో స్థానం సంపాయించే పనిలో పడటంతో ఎక్కడ చూసినా రాజాస్థాన కవులే ఐపోయారు. దీంతో పాఠకులు కూడ ఒక రాజాస్థానకవిని కాకుండా అందరినీ కలిపి ఒక గుంపుగా చూడగలిగారు. అలాటి పాఠకుల నుంచి అనేక వినోదాత్మక కథలు పుట్టుకొచ్చాయి.

అందరూ రాజాస్థానకవులే ఐతే వాళ్ళ కీచులాటలు, అసూయాద్వేషాలు ఏ స్థాయిలో వుంటాయో మనకు చెప్పే కథలకి కేంద్రబిందువు తెనాలి రామలింగడు. అసలిలాటి ఒక వ్యక్తి ఉన్నట్టు ఎలాటి దాఖలాలు లేవు. పాండురంగమహాత్మ్యం రాసిన తెనాలి రామకృష్ణుడు మాత్రం ఇతను కాదని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఐనా ముందుగా అనుకున్నట్టు కవుల కథలు పాఠకులు నిర్మించుకున్నవి. అవి ఒక రచనకి సంబంధించినవి కూడ కాకపోవచ్చు. తెనాలి రామలింగడి కథలు అలాటివి. అందుకు అష్టదిగ్గజాలు అనే భావన పనికొచ్చింది. ఒక్కడిగా వున్న రాజాస్థానకవే అసహ్యుడైనప్పుడు ఎనిమిది మంది ఒకచోట వుంటే వేరే చెప్పాలా? వాళ్ళు ఒకర్నొకరు తిట్టుకుంటారు, తన్నుకుంటారు, ఎలాగైనా సరే అవతలి వాళ్ళ కంటే తమే గొప్పని చూపించుకోవటానికి ఏమైనా చేస్తారు. అలా రాజాస్థానాలు కవుల కలహాలకి మదమత్సరాలకి నిలయాలుగా ముద్రపడిపోయింది. కీచులాడుకునే కవుల కథలు ఎన్నో మనకు మిగిలాయి.

ఇంతకుముందు చూసిన భక్తికవులందరికీ దేవతలు ప్రత్యక్షంగా కనిపించేవారు. కాని, తిక్కనకి హరిహరనాథుడు కల్లో కనిపించాడు. బహుశః అందుకనేమో ఆయన్ని భక్తికవిగా ఎవరూ భావించలేదు. కృష్ణరాయలికి కూడ ఇలాటి అనుభవమే ఎదురైంది – ఆంధ్రమహావిష్ణువు ఆయనకి కల్లో కనిపించి తన కథని రాయమంటాడు. ఆయన సరేనని ఆముక్తమాల్యద రాశాడు. కాని ఆయన్ని భక్తికవి మూసలో వెయ్యటం సాధ్యం కాలేదు. వచ్చిన చిక్కేమిటంటే – ఆముక్తమాల్యదలో రకరకాల కథలున్నాయి. భక్తుల కథలున్నాయి, వేదాంతుల కథలున్నాయి, చివరికి భగవంతుడి పెళ్ళి కథ కూడ వుంది. దానికి తోడు అసలు ఆముక్తమాల్యద రాసింది కృష్ణరాయలేనా అన్న సందేహం ఒకటి వచ్చిపడింది కొందరికి, కారణాలేవైనా కానీ (మరోరకంగా చెప్పాలంటే అది రాసింది రాయలు కాదు, పెద్దన అని ప్రచారం చెయ్యటంలో మునిగిపోయారు వారు) భక్తికవి అందామంటే ఆయనే ఓ రాజాయె, ఇక ఆయన్ని తిప్పలు పెట్టగలిగే రాజెవడు? మొత్తమ్మీద ఆయన చేత భువనవిజయం కట్టించి దాన్లో అష్టదిగ్గజాలకి సమస్యలిచ్చి పూరించమనే పని అప్పజెప్పి మమ అనిపించారు.

ఆంధ్రజైమినీభారతకర్త పిల్లలమర్రి పినవీరభద్రుడి గురించి కూడ రెండు మాటలు చెప్పుకుందాం. ఎందుకంటే, ఇతని గురించి కూడ ఒక విలక్షణమైన కథ వుంది. టూకీగా, ఇతను జైమినీభారతాన్ని నెలరోజుల్లో తెలుగు చేస్తానని పందెం వేశాడు. కాని, ఒక్కరోజు కూడ గంటం చేతబట్టిన పాపాన పోలేదు. ఇంట్లోవాళ్ళు గుండెలు చేతబట్టుకుని చూస్తున్నారు. ఇతనికి మాత్రం చీమకుట్టినట్టు లేదు. చివరిరోజు వచ్చింది. ఇతను గది తలుపు వేసుకుని ముసుగుతన్ని పడుకుని నిద్రపోతున్నాడు. బయటనుంచి బంధువులు తలుపు దగ్గర చెవిపెట్టి వింటే గంటం గరగరలు వినిపిస్తున్నాయి. చివరికి ఒకరు సాహసం చేసి తలుపు కన్నంలోంచి చూసేసరికి లోపల ఒక బాలిక గంటం పట్టుకుని రాస్తూ కనిపించి అంతలోనే మాయమయింది. అతను దిగ్గున లేచి కూర్చున్నాడు. ఇంకా మిగిలిన కొద్దిభాగాన్ని తనే రాసి పూర్తిచేసి మర్నాడు తన పంతం నెగ్గించుకున్నాడు. అలా ఇతన్ని ‘వాణి నా రాణి’ అని సవాలు చేసి నెగ్గిన గడసరిగా తయారుచేశారు పాఠకులు.

తర్వాత వచ్చిన ఆశుకవిమత్తేభాలు, ఘంటాసహస్రపద్యకవులకి దారి చూపించిన వాడితను. ఇరవైయవ శతాబ్దం మధ్యకాలం వరకు వీరు ఒక వెలుగు వెలిగారు. ‘ఆశుకవిసింహ’ వర్గంగా వీళ్ళని వర్గీకరించవచ్చనుకుంటాను. వీళ్ళపని గుక్క తిప్పుకోకుండా పద్యాలు చెప్పెయ్యటమే. గంటల్లెక్కన ఎవరెన్ని ఎక్కువ పద్యాలు చెప్తే వారు అంత గొప్పవారన్నమాట.


నాయకరాజుల కాలం నాటికి కవులు వుండటానికి రాజాస్థానాలే కాదు, ముద్దుపళని లాటి వేశ్యలు కూడ కవిపోషకులయారు. స్వయంగా కవిత్వమూ రాశారు. రాజులంతా కూడ కవులే. బహుశః కృష్ణదేవరాయల్ని అనుసరిస్తూ తొలి నాయకరాజు రఘునాథనాయకుడు రామాయణం రాయటంతో తర్వాతి వాళ్ళంతా అతన్ననుసరించి కావ్యాలో, నాటకాలో, యక్షగానాలో ఏవో ఒకటి క్రమం తప్పకుండా రాశారు. ఈ కాలంలో అత్యంత జనాదరణ పొంది ఎందరి మీదో ప్రగాఢప్రభావం చూపినవాడు భట్టుమూర్తి. కవుల కథల్లో అక్కడక్కడ ఇతను అష్టదిగ్గజాల్లో ఒకడుగా కనిపిస్తాడు. ఆ కథల్లో ఇతనికీ తెనాలి రామలింగడికీ చుక్కెదురు. రామలింగడిని చిక్కుల్లో పెట్టాలని ఇతను ప్రయత్నిస్తే పైయెత్తులు వేసి ఇతన్ని చిత్తు చెయ్యటంలో రామలింగడు దిట్టగా కనిపిస్తాడు. ఐతే ఒకసారి ముక్కుతిమ్మన ఉయ్యాలబల్ల మీద ఊగుతుంటే రామలింగడు అటు వెళ్తూ ‘తాతా ఊతునా’ అంటే అతను అలాగే కానిమ్మన్నాడని, సరేనని రామలింగడు ఖాండ్రించి అతని మీద ఉమ్మేశాడని, ఖంగు తిన్న తిమ్మన రామలింగడ్ని కాలితో జాడించి తంతే అతని పన్నొకటి ఊడిపడిందని, అది కనపడకుండా రామలింగడు దుప్పికొమ్ముతో చేసిన పంటిని తగిలించుకున్నాడని, తర్వాత ఒకరోజు కృష్ణరాయలు యథాలాపంగా తన భువనవిజయ సభలో ‘రవి కాంచనిచో కవి కాంచునే కదా’ అని సమస్య ఇచ్చి పూరించమంటే భట్టుమూర్తి ఇదే అదనని-

ఆ రవి వీరభద్రు చరణాహతి డుల్లిన బోసినోటికిన్
నేరడు; రామలింగకవి నేరిచెబో మన ముక్కుతిమ్మరాట్
క్రూర పదాహతిన్ దెగిన కొక్కిరిపంటికి దుప్పికొమ్ము పల్
గా రచియించె నౌర రవి కాంచనిచో కవి కాంచునే కదా

అని పూరించి రామలింగణ్ణి నవ్వులపాలు చేశాడనీ వింటాం. మొత్తం మీద ఈ కథవల్ల మనకో చక్కటి పద్యం దక్కింది. కొంత వినోదం చిక్కింది.

‘నిజానికి’ భట్టుమూర్తి కృష్ణరాయల కాలంవాడు కాదు, తర్వాతివాడు. ముందు కృష్ణదేవరాయల అల్లుడు అళియ రామరాజు అల్లుడు నరసరాజు దగ్గర, ఆ తర్వాత రామరాజు దగ్గర ప్రాపకం సంపాదించాడు. అక్కడ అతనికి దక్కిన బిరుదుపేరే రామరాజభూషణుడు. అది వేరే విషయం.

ఇక రామాయణం రాసిన ఆతుకూరి మొల్ల గురించి ఇక్కడ కొంచెం చెప్పుకోవాలి. ఆ కాలంలో పద్యరామాయణాలు రాసిన స్త్రీలు మరెవరూ కనిపించరు. పైగా అంతకుముందు బ్రాహ్మణులు, అక్కడక్కడ క్షత్రియులు తప్ప ఇంకెవరైనా పద్యకావ్యాలు రాయటం అరుదు. ఆమె కాలానికి రామాయణం భక్తికావ్యంగా అందరూ ఒప్పేసుకున్నారు. ఇక మిగిలిందల్లా ఎవరు ఎంత భక్తిని తమ రచనలో చొప్పించగలరనేదే. అందులో ఒక పద్ధతి కవి తనని తను రామాయణంలోని ఏదో ఒక పాత్రగా భావించుకోవటం, ఆ పాత్ర ద్వారా తన భక్తిని చాటుకోవటం. అలా మొల్ల రామాయణ పాఠకులు కొందరి దృష్టిలో ఇది ఆమె రాముణ్ణి తన భర్తగా భావిస్తూ రాసిన కావ్యం. అంటే భక్తికవిత్వవర్గంలో దీన్ని ఒక ఉపవర్గంగా చూడొచ్చు. (తర్వాత్తరవాత సుగ్రీవుడిగా తనని భావించుకుంటూ సుగ్రీవుడుండే రామాయణ భాగాల్ని రాసిన ఒక కవిని నా చిన్నప్పుడు చూశాను.) కనుక ప్రచారంలో వున్న కథల ప్రకారం మొల్ల కూడ రామాయణం పూర్తి చేసి ఆ ఊరి దేవాలయంలో వున్న రాముడికి అందించి అతనిలో ఐక్యమయింది. ఎప్పుడో వచ్చిన కథానాయిక మొల్ల అన్న చలనచిత్రంలో ఇలాటి దృశ్యాలే ఉన్నట్టు విన్నాను కాని దాన్ని నేను చూడలేదు.

ఆమె అదృష్టవశాత్తు అప్పటి రాజులెవరూ దాన్ని అంకితమివ్వాల్సిందేనని పట్టుబట్టి ఆమెని బాధించలేదు. స్త్రీ, అందునా తనని తాను సీతగా భావించుకుని రామాయణం రాసిన వ్యక్తి, కనుక మిగతా భక్తికవుల అగచాట్ల నుంచి ఆమెకి ఉపశమనం ఇచ్చారేమో పాఠకులు!

త్యాగయ్య గురించిన కథలు కూడ ఆయన్ను భక్తికవిగా చిత్రిస్తాయి. అలా భక్తికవికి మామూలుగా వుండే కథలాటిదే త్యాగయ్య కథ కూడ. ఒక్క తేడా ఏంటంటే ఆ కాలానికి రచనలు అంకితమివ్వకపోతే బాధించే రాజులు పోయారు (బహుశః అప్పటి రాజులూ అలాటి కథలు విన్నవారే కనుక అలా ప్రవర్తించటం బావుండదనుకున్నారేమో!) ఐతే శరభోజి మహారాజు త్యాగయ్యకి తెలియకుండా బంగారు నాణేలు పల్లకిలో పెట్టి పంపటం, వాటికోసం దారిదొంగలు వస్తే రామలక్ష్మణులు వాళ్ళని బాణాల్తో కొట్టటం లాటి కథలు ప్రచారంలో వున్నాయి. ఇవి, కొన్ని త్యాగయ్య పాటలు ఏ సందర్భంలో వచ్చాయో అని ఊహించుకుని ఆ ఊహల చుట్టూ అల్లుకున్న కథలు. అన్నమయ్య విషయంలోనూ ఇలాటి సన్నివేశాలు కొన్ని కనిపిస్తాయి.


ఇవన్నీ ఎప్పుడో ఉన్న కవులకి కాని ఈ మధ్యకాలంలో వచ్చిన వాళ్ళకి వర్తించే చట్రాలు కావని అనిపించొచ్చు కాని, నిజం కాదు. పందొమ్మిదో శతాబ్దంలో కొత్త రకం పాఠకులు వచ్చారు, మరికొన్ని కొత్త మూసలు తయారుచేశారు.

ఈ కొత్త పాఠకులకి దారి చూపించి, తెలుగు సాహిత్య చరిత్రలో పెనుమార్పులకు కారకుడైన విశిష్టవ్యక్తి కట్టమంచి రామలింగారెడ్డి. తెలుగు సాహిత్య విమర్శ రంగంలో ఈయన ప్రభావం బహుశః అద్వితీయం.
ఈయన దృష్టిలో తెలుగు కవంటే తిక్కనే. పాత్రల్ని సమకాలీన వ్యక్తుల్లా తీర్చిదిద్దితేనే అది కవిత్వం (దీన్నే సజీవ చిత్రణం అని కూడ అన్నారు). తిక్కన భారతంలో పాండవులు, ద్రౌపది, ఇతర పాత్రలు ఇప్పుడు మనముందు తిరిగే మనుషుల్లాగే ప్రవర్తిస్తారని అందువల్ల అదే నిజమైన సాహిత్యమని ఆయన సిద్ధాంతీకరించాడు. పాశ్చాత్యకథలని పోలిన బలమైన కల్పన వల్ల కళాపూర్ణోదయం ఒక్కటే ఆయనకి కాస్త విలక్షణంగా కనిపించింది. సజీవ పాత్రలు లేని కారణంగా దాదాపుగా మిగతా తెలుగు సాహిత్యం అంతా చెత్తకుప్పలకి తప్ప దేనికీ పనికిరాదని ఆయన నమ్మకం. భక్తికవులంటే ఆయనకి చిరాకు. రాజాస్థానకవులంటే అసహ్యం. ఆయన దృష్టిలో ఋషులెవరూ లేనేలేరు. శాపానుగ్రహసమర్థులందామా – అంతా ఉత్త చెత్త. అలా ‘సజీవచిత్రణకవి’ అనే మూస తయారుచేశాడు రామలింగారెడ్డి.

ఈ వడబోతతో తెలుగు సాహిత్యం మొత్తం మీద మిగిలింది ముగ్గురే కవులు: తిక్కన, సూరన, వేమన. సమాజ జీవితచిత్రణే ఏకైక కొలమానం. పాశ్చాత్యసాహిత్యపు పెనుతుపానులో కొట్టుకుపోతున్న నాటి యువతరానికి ఇది ‘పోరుకేక’ అయింది. అసలే ఆర్థికమాంద్యాలతోనూ దుర్భరనిరుద్యోగాలతోనూ సతమతమౌతున్న యువతకి ఇంక పాతపుస్తకాలేవీ చదవాల్సిన పని లేదని ఆంధ్ర విశ్వవిద్యాలయ ప్రథమ ఉపాధ్యక్షుడి హోదాలో కట్టమంచి అలా కరాఖండిగా పిలుపునివ్వటంతో వాళ్ళ నెత్తిన పాలుపోసినట్టయింది. ఆ ఉత్సాహంతో వాళ్ళు తెలుగు సాహిత్యాన్ని చించిచెండాడారు. తెలుగు చెప్పే పిలకపంతుళ్ళని గోచీలు ఊడదీసి (ఉపమానార్థంలో సుమీ) పరుగులు పెట్టించారు. కవుల గురించి మనం ఇప్పటిదాకా చెప్పుకుంటున్న కథల్ని పట్టుకుని – కాళిదాసు, దండి, భవభూతి ఒక కాలంవారా? ఆ ముగ్గురూ ఒకచోట ఎలా చేరారు? దక్షిణాంధ్ర సాహిత్యం అంతా బూతుపురాణం కాదా? దాన్ని ఎలా సమర్థిస్తారు? అష్టదిగ్గజాలెవరు – వాళ్ళ పేర్లు చెప్పండి చూద్దాం? ఇలా పుంఖానుపుంఖాలుగా క్లిష్టమైన ప్రశ్నలు గుప్పించి గద్దించి పాతపండితుల్ని గుక్కతిప్పుకోకుండా చేశారు. నవ్వులపాలు చేశారు. నోరెత్తకుండా చేశారు.

ఈ ఉద్యమస్ఫూర్తితో కొత్తపండితులు ఆంగ్లగ్రంథాలెన్నో ఔపోసన పట్టి తెలుగుకవుల దేశకాలాల మీద దీక్షతో పరిశోధనలు చేశారు, ఆంగ్లేయులనుంచి మహోపాధ్యాయ, మహామహోపాధ్యాయ లాటి బహుమానాల్ని దక్కించుకున్నారు. సర్-లు, బహద్దర్-లు, తమ పేరు ముందువెనకల గుద్దించుకున్నారు. మనకున్న సాహిత్యచరిత్ర నిండా బూతులబుంగలు, తప్పులతడకలని సిద్ధాంతీకరించి పట్టాలు పుచ్చుకున్నారు. కళాశాలల్లో, విశ్వవిద్యాలయాల్లో ఉన్నతపదవులు అధిరోహించారు. పాతసాహిత్యం గురించి మాట్లాడేవారికి ఈ కొత్త ‘విద్యావ్యవస్థ’లో పుట్టగతులు లేకుండా చేశారు. అలా సజీవచిత్రణం నిర్జీవవ్యవస్థకి పునాది అయింది. ఒక్కముక్కలో చెప్పాలంటే ఈ కొత్తపాఠకులు ఒకరిని మించి ఒకరు పోటీలుపడి వెయ్యేళ్ళ తెలుగు సాహిత్యాన్ని పాతికేళ్ళలో పాతరేశారు.

ఇదిలావుంటే రామలింగారెడ్డి వేమనకు తెచ్చిన ప్రాచుర్యంతో వేమన గురించిన పాతకథలు కూడ బయటకు వచ్చాయి. కాని వర్గీకరించటానికి అంత తేలికైన కవి కాడు వేమన. నిన్నమొన్నటివాడు కనుక చూస్తూ చూస్తూ ఋషి అనెయ్యలేం, పైగా రామలింగారెడ్డికి ఋషుల మీద నమ్మకం లేదాయె. పోనీ రాజాస్థానకవి అందామా, అదీ కుదరదు. శాపానుగ్రహాల మాట దేవుడెరుగు. రామలింగారెడ్డి ప్రవేశపెట్టిన ‘సజీవచిత్రణ’ మూస సరిపడేదైనా కొందరు పాఠకులకి మాత్రం దాంతో సంతృప్తి కలిగినట్టులేదు. పోనీ భక్తికవిని చేసేద్దామా అన్న ఆలోచన కలిగింది కొందరికి. దాంతో ఆయన యోగి వేమన ఐపోయాడు. కొంత కొత్తగా ఉండాలని కాబోలు, మొదట అతను వేశ్యాలోలుడని, తర్వాత జ్ఞానోదయం కలిగిందని నిర్ణయించారు. ఎందుకలా మారిపోయాడంటే, దానికి రకరకాల కారణాలు చెప్పారు. ఒక ప్రియమిత్రుడి మరణంతో జీవితం క్షణభంగురమని తెలుసుకున్నాడని యోగిగా మారాడని ఒక కథనం. తెలుగు చలన చిత్రం ప్రకారం అతనికి ప్రేమాస్పదురాలైన అన్న కుమార్తె అకాలమరణం అసలు కారణం. నేను ఎప్పుడో విన్న మరొక కథ అతను వేశ్యాగృహాన్నుంచి ఎప్పటికీ కదలకపోవటంతో అతని బంధువులా వేశ్యని ఎలాగైనా అతనికి విముఖత కలిగేట్టు చెయ్యమని బతిమిలాడుకున్నారని, ఆమె అలాగే చేస్తే అతను విరక్తి చెంది యోగుల్లో కలిసిపోయాడని. వీటన్నిటికి సామాన్యంగా కనిపించే అతను యోగి కావటం అనేది ఎంత నిజమో ఎవరికి తెలుసు?

ఇక వేమన పద్యాలు కొన్నిటికి మకుటం ‘విశ్వదాభిరామ వినుర వేమ’ కనుక దీన్లో అభిరాముడు ఎవరు అన్న ప్రశ్న ఒకటి వేసుకుని దానికి కూడ సమాధానాలు చెప్పారు. ఒక కథ ప్రకారం అభిరాముడు అతనికి ప్రియమిత్రుడు, పద్యాలు చెప్పమని ప్రోత్సహించిన వాడు. మరో కథ ప్రకారం అసలు పద్యాలు చెప్పిన వాడు అభిరాముడు; వేమన కవి కాడు, అతనికి మిత్రుడు మాత్రమే. ఇంకా రెండు మూడు కథలున్న గుర్తు కాని అవేమిటో ఇప్పుడు గుర్తు లేదు!

అన్నీ పాతకథలేనా అనే వాళ్ళకోసం ఒక కొత్త కథ. మహాప్రస్థానం అచ్చు వేసినప్పుడు శ్రీశ్రీ రాసిన కవిత్వానికి ప్రత్యేకమైన పేరు లేదు. అది భావకవిత్వానికి భిన్నమైంది, అంతే. తర్వాత అభ్యుదయకవిత్వోద్యమం రావటంతో అది అభ్యుదయకవిత్వం అయింది. ఆ తర్వాత విప్లవకవిత్వం కాలంలో మహాప్రస్థానం విప్లవకవిత్వం, శ్రీశ్రీ విప్లవకవీ అయారు. అలాటివాడు హఠాత్తుగా సినిమాపాటలు రాయటం మొదలెట్టటంతో అతన్ని ఏ లెక్కలో వెయ్యాలో తేలక పాఠకులు తికమకపడిపోయారు. అప్పటికింకా ‘సినీకవి’ మూస తయారుకాలేదు. సినారె ప్రవేశంతో అది ఆ తర్వాత జరిగింది. ఐతే ఏ ఉద్యమం మొదలైనా మహాప్రస్థానం పుస్తకం కొని చదువుకుని మరీ వీరావేశం తెచ్చుకునేవారు అప్పటి యువతరం పాఠకులు. దీన్నిబట్టి మహాప్రస్థానాన్ని ఉద్యమకవిత్వంగా లెక్కవేశారని అనుకోవచ్చు. ఐతే అదే అపోహతో అప్పట్లో ఒక సినిమా కోసం శ్రీశ్రీ ‘ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురుచూసి మోసపోకుమా, నిజం మరిచి నిదురపోకుమా’ అని రాస్తే కొందరు పాఠకులు అది తమకు అతనిస్తున్న సంకేతం అనుకుని నిద్రలు మానేసి నీరసపడిపోయారు.

మహాప్రస్థానం తర్వాత శ్రీశ్రీ రచనల్లో పదును తగ్గిపోయింది. సినీకవిగా స్థిరపడి విప్లవవాదాలు చెయ్యటం ఎబ్బెట్టుగా అనిపించటం మొదలైంది. పాఠకవర్గమూ తగ్గిపోయింది. సోవియట్ యూనియన్ పడకెయ్యటం, చైనా ధనికవాదానికి జైకొట్టటంతో సమసమాజనినాదం, దాంతోపాటు విప్లవకవిత్వం అటకెక్కాయి. నేటి తెలుగుసాహిత్య పాఠకులకు (అలాటివారు ఉంటే) శ్రీశ్రీ తెరమరుగయాడు.

మూణ్ణాళ్ళ ముచ్చటలుగా అనేక కవిత్వోద్యమాలు వచ్చాయి, వెళ్ళాయి. ఎవరి కవితలు వాళ్ళు అచ్చేసుకోవటం, వారే అప్పుడప్పుడు బూజులు దిలిపి వాటిని చదువుకోవటం మిగిలింది. ఈ రచనల్లో ఏవైనా దీర్ఘకాలంలో మిగుల్తాయా అనే విషయం కాలమే నిర్ణయిస్తుంది, అప్పటికి తెలుగు పాఠకులనే వాళ్ళుంటే.

ఉపసంహారం

ఏ రచనైనా బతకాలంటే పాఠకులుండాలి. పాఠకులే ఆ రచన దేనిగురించో, అది ఎలాటిదో నిర్ణయిస్తారు. వాళ్ళ ఆ నిర్ణయాన్ని బట్టి దాని రచయిత గురించిన కథలు తయారౌతాయి. మారే కాలంతో పాఠకులు మారతారు. వారి దృష్టికోణాలు మారతాయి. వాటితో వారు చదివే రచనలు, వాటి కర్తల కథలు మారతాయి. రచయితల గురించిన కథల ద్వారా మనకు వారి పాఠకుల మనోభావాలు తెలుస్తాయి. కథల పరిణామాలు మనకు కాలగతిని, పాఠకుల దృష్టి క్రమాల్ని తెలియజేస్తాయి. రచయితలు తమ గురించిన కథల్ని మలుచుకోవటానికి ప్రయత్నించొచ్చు. అవి అప్పుడప్పుడు ఫలించొచ్చు కూడ. కాని దీర్ఘకాలికంగా చూస్తే పాఠకుల తీర్పులే మిగుల్తాయి. రచయితలు ‘నన్ను పాఠకులు అపార్థం చేసుకుంటున్నారు’ అని బెంగ పెట్టుకోకుండా ‘కాలోహ్యనంతం విపులాచ పృధ్వీ’ అన్న ఆశావాదాన్ని నమ్ముకుని సర్దుకుపోతే అదృష్టవంతులౌతారు.

(ఈ వ్యాసం తొలిప్రతిని చదివి చక్కటి సలహాలిచ్చిన వెల్చేరు నారాయణరావు, కొంపెల్ల భాస్కర్‌లకు కృతజ్ఞతలు.)


  1. మన సాహిత్యంలో కవులు, పుస్తకాలు. వెల్చేరు నారాయణరావు, ఈమాట, మే 2013, జులై 2013.
  2. తెలుగు రామాయణాల రాజకీయాలు: బ్రిటిష్ పాలన, ముద్రణ సంస్కృతి, జాతీయ ఉద్యమాలు. వెల్చేరు నారాయణరావు, ఈమాట, సెప్టెంబర్ 2003.
  3. శ్రీహర్షమహాకవి గ్రంథగ్రంథులు”, కొంపెల్ల భాస్కర్, ఈమాట, ఫిబ్రవరి 2020.
  4. వాల్మీకి వాకిట్లో కాళిదాసు. కొంపెల్ల భాస్కర్, ఈమాట, మే 2001.
  5. తెలుగులో కవితావిప్లవాల స్వరూపం. వెల్చేరు నారాయణరావు, ఆర్కైవ్.ఆర్గ్‌.
  6. Srinatha: The poet who made Gods and kings”, Velcheru Narayana Rao, Oxford University Press, 2012.