వాల్మీకి వాకిట్లో కాళిదాసు

ప్రస్తరేషు చ రమ్యేషు వివిధాః కానన ద్రుమాః
వాయువేగ ప్రచలితాః పుష్పై రవకిరంతి గాం

(రామాయణం వాల్మీకి)

( రకరకాల అడవిచెట్లు గాలి వేగానికి అటూయిటూ ఊగుతూ రమ్యమైన రాతినేలలమీద పువ్వులు రాలుస్తున్నాయి.)

అధికం ప్రతిభాత్యేతన్‌ నీలపీతంతు శాద్వలం
ద్రుమానాం వివిధైః పుష్పైః పరిస్తోమైరివార్పితం

(రామాయణం వాల్మీకి)

(చెట్లనుంచి రాలిన రకరకాల పువ్వులు, నలుపు, పసుపు కలిసిన రంగున్న యీ పచ్చికపట్టు (లాన్‌) మీద పడటంవల్ల అది  చిత్రకంబళం పరిచినట్టుగా మెరిసిపోతోంది.)

ద్రుమాః సపుష్పాః సలిలం సపద్మం
స్త్రియః సకామాః పవనః సుగంధిః
సుఖా ప్రదోషాః దివసాశ్చ రమ్యాః
సర్వం ప్రియే చారుతరం వసంతం

(ఋతుసంహారం కాళిదాసు)

(చెట్లు పువ్వుల్తోనూ, సరస్సుల్లో నీళ్ళు తామరపువ్వుల్తోనూ నిండి ఉన్నాయి. స్త్రీలు కోర్కెలతో నిండి ఉన్నారు. గాలిలో సుగంధం నిండి  ఉంది. సుఖవంతమైన సాయంత్రాలూ, రమ్యమైన పగళ్ళూ.. ఓ ప్రియా! వసంతం చాలా అందంగా ఉంది.)

నేత్రేషు లోలో మదిరాలసేషు
గండేషు పాండుః కఠిన స్తనేషు
మధ్యేషు నిమ్నో జఘనేషు పీనః
స్త్రీణామనంగో బహుధా స్థితోధ్య

(ఋతుసంహారం కాళిదాసు)

(మదవతుల కళ్ళల్లో చంచలతగా, బుగ్గల్లో తెల్లదనంగా, పాలిండ్లలో గట్టితనంగా, నడుములో సన్నదనంగా, పిరుదుల్లో పెరుగుదలగా .. ఇలా స్త్రీలలో రకరకాల రూపాల్లో మన్మధుడు వచ్చికూర్చున్నాడు)

ఒక్క “సలిలం సపద్మం” అన్నది వదిలేస్తే, వాల్మీకీ, కాళిదాసూ వర్ణించిన ఈదృశ్యం మొదటిసారిగా యూరప్‌లో చూసాను. ఇలా కొన్నేళ్ళు  చూసి చూసి, కిష్కింధాకాండంలో మొదటి 100 శ్లోకాలు, ఋతుసంహారంలో వసంతవర్ణనం చదువుతూంటే, అవే పరిసరాలూ, మనుషులూ  గుర్తుకొచ్చేవి. దాంతో ఆ రెండు వర్ణనల్నీ కలిపి చూడడం, అది ఒక రూపకంలా నా కళ్ళముందు ఆడడం మొదలైంది.

ప్రతీమారూ నేను చూసే ఈ రూపకానికి, సెట్స్‌, కళాదర్శకత్వం, నేపధ్యసంగీతం  మొదలైనవి వాల్మీకివి; నటులు, మాటలు,  కాస్య్టూమ్స్‌, దర్శకత్వం, గానం, సంగీతం, శిల్పం కాళిదాసువి.

వాల్మీకి ఈ రూపకానికోసం వేసిన కొన్ని సెట్స్‌ చూద్దాం. మధ్యమధ్యలో వీలయినప్పుడల్లా కాళిదాసు తెచ్చే నటుల్నీ, ఇచ్చే  సంగీతాన్నీ కూడా జోడిద్దాం. “ఈ వర్ణనలు చేసేటప్పుడు వాల్మీకీ, అతని నాయకుడు రాముడూ అడవిలో ఉన్నారు; కాళిదాసూ, అతని  నాయికలూ నగరాల్లో ఉన్నారు” అన్నది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవలసినది.

వాల్మీకి తన సీన్స్‌లో అందమైన కొండలు, గుహలు, కొలనులు, వాటిలో తామరపూలు చూపించాడు. చెట్లు, పువ్వులు ఎక్కువగా  చిత్రీకరించాడు. అతను వాడిన ప్రతీపదం అతను వేసే చిత్రానికి ఒక “కుంచెవాటు” అనాలి. విరగబూసిన చెట్లూ, రాలిన పువ్వులూ,  రాలని పువ్వులూ, రాల్తూ మధ్యలో గాలికి కదిలే పువ్వులూ… వాటి అందం.., అన్నీ కలిపిచూస్తే కలిగే ఆనందం.. వీటన్నిటినీ  అద్భుతంగా చిత్రీకరించాడు.

మత్తకోకిల సన్నాదైః నర్తయన్నివ పాదపాన్‌
శైలకంధర నిష్క్రాన్తః ప్రగీత ఇవ చానిలః

(రామాయణం వాల్మీకి)

మత్తెక్కిన కోకిలలు పాడుతూంటే ఆ స్వరాల్ని మోసుకొస్తూ కొండ గుహల్లోంచి వచ్చే గాలి,  (ఎలా ఉందంటే,) నటుల చేత నాట్యం  చేయిస్తూ తను వెనకనుంచి పాటపాడే పాటగాళ్ళా ఉంది.

అడవీ, కొండలూ వేదిగ్గా మారినయ్‌. తుమ్మెదలూ, కోకిలలూ, గాలీ ఆర్కెస్ట్రాగా అమరినయ్‌.

ఇలాంటి పరిసరాల్లో కాళిదాసు వెన్నెల్లో మేడలు కట్టాడు, మామిడిచెట్లు వేసాడు, దిగుడుబావి తవ్వించాడు, తన పరివారాన్ని  తీసుకొచ్చి పెట్టాడు. వాళ్ళకి అలంకరణలు చేసాడు. పుష్కలంగా మదిర సరఫరా చేసాడు.

ఈషత్తుషారైః కృతశీతహర్మ్యః
సువాసితం చారుశిరశ్చ చంపకైః
కుర్వంతి నార్యోపి వసంతకాలే
స్తనం సహారం కుసుమైర్మనోహరైః

(ఋతుసంహారం కాళిదాసు)

వాపీజలానాం మణిమేఘలానాం
శశాంకభాసాం ప్రమదాజనానాం
చూతద్రుమాణాం కుసుమాన్వితానాం
దదాతి సౌభాగ్యమయం వసంతం

(ఋతుసంహారం కాళిదాసు)

(ఇంటి సందుల్లో) కొద్దిగా మిగిలిపోయిన మంచువల్ల ఇళ్ళల్లో ఇంకా చలిగా ఉంది. అందుకే బయట దిగుడు బావుల్లోకి దిగారు కొందరు. జలక్రీడలాడుతున్నారు. ఆడవాళ్ళ తలనిండా ఘుమఘుమలాడే సంపెంగపూలూ, స్తనాలమీద మనోహరమైన పూలహారాలు, నడుముకు  మణుల్తోచేసిన వడ్డాణాలు ..అందరూ మొలలోతునీళ్ళల్లో ఉన్నారు.. అందువల్ల ఆతర్వాత ఇంకేమీ కనిపించటల్లేదు కాళిదాసుకి.  నీళ్ళమీద తేల్తూ మామిడి పువ్వులు, గట్టుమీద విరబూసిన చెట్లు మాత్రమే కనుపిస్తున్నాయి..

అంగాని నిద్రాలస విభ్రమాణి
వాక్యాని కించిన్‌ మదిరాలసాని
భ్రూక్షేప జిహ్మాని చ వీక్షణాని
చకార కామః ప్రమదాజనానామ్‌

(ఋతుసంహారం కాళిదాసు)

నిద్రలేకపోవడంవల్ల వాళ్ళ ఒంట్లో అంగాలు స్వాధీనంలో లేవు. పుచ్చుకున్న మదిర వల్ల  వాళ్ళ మాటలు నెమ్మదైపోతున్నాయి.  కనుబొమలు, చూపులూ వంకరలు పోతున్నాయి. స్త్రీలల్లో కామం పెరుగుతోంది.

వాళ్ళ మాటలు, వడ్డాణాల సవ్వడులూ, నీటి గలగలలూ వాల్మీకి నేపధ్య సంగీతానికి తోడై ఒక గొప్ప వసంతగీతాన్ని  సృష్టిస్తున్నాయి.

తమ ప్రియులు రాకపోవడంవల్ల కొందరు బయటే ఉండిపోయారు. వాళ్ళా బావిచుట్టూ ఉన్న వనంలో తిరుగుతున్నారు. ఎర్రనిపూలని  చూసినకొద్దీ వాళ్ళలో కోపం పెరిగి దుఃఖంగా మారిపోతోంది.

ఆమూలతే విద్రుమరాగ తామ్రం
సపల్లవాః పుష్పచయం దధానాః
కుర్వన్య్తశోకా హృదయం సశోకం
నిరీక్ష్యమాణా నవయౌవనానాం

(ఋతుసంహారం కాళిదాసు)

ప్రియులకోసం ఎదురుచూస్తున్న ఆ తరుణులకి పైనుంచి క్రిందదాకా పగడాలు కట్టినట్టు (పగడపుటెరుపు రంగులో)  పూసిన అశోకచెట్టుని చూడగానే గుండెల్లోంచి శోకం ఉబికివస్తోంది.

అంత చల్లని గాలులు వీస్తున్నా, విరహంతో వాళ్ళకి చెమటలు పడుతున్నాయి.

సపత్రలేఖేషు విలాసినీనాం
వక్త్రేషు హేమాంబురుహోపమేషు
రత్నాంతరే మౌక్తికసంగరమ్యం
స్వేదాగమో విస్తరతాముపైతి.

(ఋతుసంహారం కాళిదాసు)

దట్టమైన ఆ చెట్లగుంపుల మధ్యలో, చెమటలు పట్టిన వాళ్ళ తామరపువ్వుల్లాంటి ముఖాలు చూస్తూంటే, రత్నాలగుంపులో  పరుచుకుని పాకుతున్న ముత్యాల్లా అనిపిస్తున్నాయి.

కొందరు మామిడిచెట్లవంక చూస్తూ పాతజ్‌ నాపకాల్తో బాధ పడుతున్నారు. ఆ చెట్లకొమ్మలు ఊగినప్పుడల్లా వాళ్ళ మనసులుకూడా ఊగిపోతున్నాయి.

బావిలో దిగినవాళ్ళు  బయటకి వచ్చారు.

కుసుంభరాగారుణితైః దుకూలైః
నితంబబింబాని విలాసినీనాం
తన్వంశుకైః కుంకుమరాగగౌరై
రలంక్రియంతే స్తనమండలాని

(ఋతుసంహారం కాళిదాసు)

ఆడవాళ్ళు ఎర్రపువ్వుల రంగుల్తో ఉన్న పట్టుబట్టల్ని తమ గుండ్రని పిరుదుల చుట్టూ కట్టుకున్నారు. స్తనాలమీద కుంకుమరంగు  వస్త్రాల్ని కప్పుకుంటున్నారు.

కర్ణేషు యోగ్యం నవకర్ణికారం
చలేషు నీలేష్వలకేస్వశోకం
పుషం చ ఫుల్లం నవమల్లికాయాం
ప్రయాంతి కాంతిం ప్రమదాజనానాం
(ఋతుసంహారం కాళిదాసు)

కొత్త కొండగోగుపూలని చెవులకి ఆభరణాలుగా పెట్టుకున్నారు. ఉంగరాలు తిరిగి ఊగుతున్న నల్లని కురుల్లో ఎర్రని అశోకపువ్వుల కేసరాల్నీ, విచ్చుకున్న మల్లెపూలనీ పెట్టుకుని బయల్దేరారంతా. అంతా బాగా తాగి ఉన్నారు, దానికితోడు గాలిలో కూడా  తేనెలవాసనలు గుబాళిస్తున్నాయి.

రంగురంగుల పుప్పొడి గాల్లో ఎగురుతోంది. అది ఒక చెట్టుమీదనుంచి మరొకదానికి ఎగురుతూంటే, ఆ చెట్లు కావాలని ఒకరి మీద ఒకరు చల్లుకుంటున్నట్లుంది. ఆ రంగుల్లో తుమ్మెదల రొద ఆ కార్యక్రమానికి సంగీతంలా అమరింది. పూలగుత్తులు రాళ్ళమీద రాలి పడుతున్నాయి. కాముకుల  సుఖంకోసం పూలపరుపులు పరుస్తున్నాయి. కొండచరియల్లో, చెట్లకింద.. ఎక్కడ చూసినా రంగురంగుల పరుపులు. చుట్టూ కన్నెలేళ్ళు,  చక్రవాకాలు, నీటికోళ్ళు, కొంచపిట్టలు అటూఇటూ తిరుగుతున్నాయి (వాల్మీకి రామాయణం, కిష్కింధ 89,90).

ఆ పరుపులమీద చెట్లనీడల్లో, మన కాళిదాసు తీసుకొచ్చిన కాముకులు పడుకుని దొర్లుతున్నారు.

ప్రఫుల్లచూతాంకురతీక్ష్ణసాయకో
ద్విరేఫమాలావిలసద్ధనుర్గుణః
మనాంసి భేత్తుం సురతప్రసంగిణాం
వసంతయోద్ధా సముపాగత ప్రియే

(ఋతుసంహారం కాళిదాసు)

వాళ్ళు సురతాల్ని గురించి మాట్లాడుకుంటున్నారు. చెట్లపైనుంచి సూదైన మామిడిపువ్వుల బాణాలు వేస్తూ వసంతుడు వాళ్ళ మనసుల్ని  చీల్చి చెండాడుతున్నాడు. అతని వింటితాడు తుమ్మెదల బారుతో చేయబడి ఉంది.

ఛాయాం జనః సమభివంచతి పాదపానాం
నక్తం తథేచ్చతి పునః కిరణం సుధాంశోః
హర్మ్యం ప్రయాతి శయితుం సుఖశీతలం చ
కాంతాం చ గాఢముపగూహతి శీతలత్వాం

(ఋతుసంహారం కాళిదాసు)

ఇలా ఈ చెట్లకింద పగలు చల్లగా, రాత్రుళ్ళు వెన్నెల్లో.. మరీవేడిగా ఉంటే మేడల్లో .. మేడల్లో మరీ చలివేస్తే ఒకళ్ళ కౌగిళ్ళలో  ఒకళ్ళూ….

గురూణి వాసాంసి విహాయ తూర్ణం
తనూని లాక్షారసరంజితాని
సుగంధికాలాగురుధూపితాని
ధత్తే జనః కామమదాలసాంగః

(ఋతుసంహారం కాళిదాసు)

ఇంతకాలం చలిగా ఉందని లావు లావు బట్టలు వేసుకున్నారు. వసంతకాలం రాగానే వాటిని పారేసి, లక్కతో రంగు వేసి అగరు ధూపం వేసిన బట్టల్ని కామంతో అలిసిపోయిన ఒళ్ళకి చుట్టుకుంటున్నారు

వాల్మీకి ఇదేమీ పట్టించుకోవటల్లేదు. అతని కుంచె ముందుకు నడుస్తోంది. చెట్లలో మానవాకారాలు కనబడుతున్నాయి అతనికి. పూసిన కొండగోగుచెట్లు బంగారు నగలు పెట్టుకుని, పసుపుపచ్చని పట్టుబట్ట కట్టుకున్న మనుషుల్లా కనిపిస్తున్నాయి. పువ్వుల్తోనిండి ఊగుతున్న చెట్ల  చివరల్లో నల్లని తుమ్మెదలు మూగి రొదచేస్తుంటే, ఆచెట్లు నల్లని తలపాగా కట్టుకుని తలలూపుతూ పాడుతున్న గాయకుల్లా  అనిపిస్తున్నాయి. మామిడిచెట్లు ఒంటికి గంధం పూసుకున్న మనుషుల్లా కనిపిస్తున్నాయి. గాలివీచి చెట్లనుంచి పుప్పొడి పైకెగురుతూంటే, ప్రియురాళ్ళు విరహంతో నిట్టూరుస్తున్నట్లుంది. ఊగుతూ దగ్గరకొస్తున్న విరబూసిన చెట్లకొమ్మల్ని చూస్తూంటే ప్రకృతి  వాటన్నిటినీ కలిపి దండ గుచ్చుతున్నట్టుగా ఉంది.  జంతుకోటి అంతా సృష్టికి నాంది పలుకుతోంది.
కొన్నిలేళ్ళనీ, నెమళ్ళనీ పట్టుకొచ్చాడు. కాళిదాసు ఇంటిముందు గుంజకి కట్టేసి వెళ్ళిపోయాడు వాల్మీకి.

కాళిదాసు పరివారం వసంతుడికి స్వాగతమిస్తున్నారు.

మోదుగుచెట్లు విరగబూసి ఊగుతూంటే విరహపుమంటలు రేగుతున్నాయి వాళ్ళలో. ఆ చెట్లగుంపుల్తో చూస్తూంటే ప్రకృతి కాంత ఎర్రచీర  కట్టుకున్న క్రొత్తపెళ్ళికూతుర్లా ఉంది. కోకిలలు పాడుతున్నాయి, తుమ్మెదలు మేళాలు కడుతున్నాయి.

ఈ రూపకం ఏళ్ళుగా సాగుతూనే ఉంది.

ఇలా ఆదికవులిద్దరూ మనకి ఒక వసంతవేదికవేసి మధురమైన సంగీతరూపకాన్ని ప్రదర్శించారు. ఇద్దర్లో ఏఒక్కరు వెనకాడినా  ఈ ఘట్టం ఇంత రక్తి కట్టదు.

కొన్ని చిట్టాపద్దులు

1. వాల్మీకి పువ్వులూ, చెట్లూ, ప్రకృతీ వర్ణిస్తూ దాదాపు ముప్ఫైరకాల చెట్ల పేర్లు చెప్పాడు.
2. ఇద్దరి వర్ణనల్లోనూ ఎక్కడా హోలీలాంటి ఉత్సవం గురించిన మాట లేదు. అందువల్ల, ఇద్దరి కాలంలోనూ అది లేదనుకోవాలా?
3. కాళిదాసుకి, ఇంటి వెనక్కాల దిగుడు బావులు, ఇంట్లో పెంపుడు నెమళ్ళు.. లాంటివి చాలా ఇష్టం. మేఘదూతంలో ఈ కోరికలన్నీ  తీర్చుకున్నాడు.
4. కాళిదాసు వాల్మీకినుంచి కొన్ని భావాల్నీ, స్పిరిట్‌నీ అప్పు తీసుకున్నాడు (ఇప్పటి లెక్కల ప్రకారం కాపీ కొట్టాడు).

రచయిత భాస్కర్ కొంపెల్ల గురించి: భాస్కర్‌ కొంపెల్ల జననం పశ్చిమగోదావరి జిల్లా తణుకులో. నివాసంన్యూజెర్సీలో. ఈమాట సంస్థాపక సంపాదకులలో ఒకరు. యూరప్‌, మెక్సికోలలో కొంతకాలం ఉన్నారు. సంస్కృత, ఆంగ్ల సాహిత్యాల్లో అభిరుచి. కవితలు, కథలు , వ్యాసాలు రాసారు. ...