ది వేస్ట్‌ లాండ్: 2. బరియల్ – చివరి దృశ్యం

[ఎలియట్ పరిచయం కోసం ఉపయుక్త వ్యాసాలు: టి. ఎస్. ఎలియట్: కవితాశిల్పం; టి. ఎస్. ఎలియట్: జెరోన్షన్. ది వేస్ట్‌ లాండ్ పూర్తిపాఠం పిడిఎఫ్.]


చివరి (నాలుగో) దృశ్యం

Unreal City,
Under the brown fog of a winter dawn,
A crowd flowed over London Bridge, so many,
Sighs, short and infrequent, were exhaled,
And each man fixed his eyes before his feet.
Flowed up the hill and down King William Street,
To where Saint Mary Woolnoth kept the hours
With a dead sound on the final stroke of nine.
There I saw one I knew, and stopped him, crying: “Stetson!
“You who were with me in the ships at Mylae!
“That corpse you planted last year in your garden,
“Has it begun to sprout? Will it bloom this year?
“Or has the sudden frost disturbed its bed?
“Oh keep the Dog far hence, that’s friend to men,
“Or with his nails he’ll dig it up again!
“You! hypocrite lecteur! – mon semblable, – mon frère!”

ఇది ఒక ఆధునిక నగరదృశ్యం. లండన్ కావచ్చు, ఆ పేరు చెబుతున్నాడు కాబట్టి, ఆ నగరంలోని ఒక ప్రసిద్ధమైన వీథి పేరు, చర్చి పేరు చెబుతున్నాడు కనుక. కాని ఒక లండన్ నగరమే అనలేము. పారిస్ కావచ్చు. మరో నగరం కావచ్చు. కాలము? ఇరవయ్యో శతాబ్దం కావచ్చు, క్రీస్తుపూర్వం రెండవ శతాబ్దం కావచ్చు. ఇందులోని యుద్ధం మొదటి ప్రపంచయుద్ధం కావచ్చు, వేయి సంవత్సరాలనాటి ప్యూనిక్ (Punic) యుద్ధాలు కావచ్చు. (ప్యూనిక్ యుద్ధాలు ప్రపంచచరిత్రలోనే పెద్దయుద్ధాలు. దాదాపు రెండు వందలసంవత్సరాల కాలంలో మూడు యుద్ధాలు జరిగాయి. ఘోరమైన జననష్టం జరిగింది. ఆ యుద్ధాలలో, బలమైన కార్టాజీనియన్ సామ్రాజ్యాన్ని రోమనులు అంతం చేసి తమ సొంతం చేసుకున్నారు. ఆ రోమన్ సామ్రాజ్యాధిపత్యం ఆరువందల సంవత్సరాలపాటు సాగింది.) ఇక్కడ దాని ప్రస్తావన ప్రాముఖ్యం ఏమిటి? యుద్ధాలు, వాటి పరిణామాలు ఏ కాలంలోనైనా ఒకటే. వాటి కారణాలు మారవు, పరిణామాలు మారవు. ఈ దృశ్యంలో, మొదటి ప్రపంచయుద్ధంలో ఆత్మీయులను ఎందరినో పోగొట్టుకున్న యీ నగరవాసులు, భయంతో దుఃఖంతో జీవితాలు దొర్లిస్తున్నారు, యాంత్రికంగా. ఇక్కడ కవి వర్ణిస్తున్నది జనప్రవాహం కిందికి దూకడం కాదు, అతికష్టంతో పైకి పాకడం (flowed up the hill) కొండపైనుండి కిందకు పడితే జలపాతం అంటారు. కొండ పైకి పాకే యీ ‘జనపాతాన్ని’ ఏమంటారు? అవాస్తవం, unreal. వారి జీవితాలు అవాస్తవికమే.

ఎలియట్: దాన్తె: బోదలేర్

ఎలియట్‌కు దాన్తె అభిమానకవి అన్నవిషయం ప్రసిద్ధమే. La Divina Commediaకు (The Divine Comedy) తన అభిమాన కావ్యాలలో అగ్రస్థానం. దాని తరువాత భగవద్గీత. ప్రస్తుత సందర్భంలో దాన్తె గురించి చెప్పనవసరం లేదు. ఇక బోదలేర్ ప్రభావం. ఇష్టమైనా కష్టమైనా బోదలేర్ ప్రభావం పడని కవి ఆ కాలంలో బహుశా ఎవరూ లేరు. ప్రస్తుతం మనం చదువుతున్న భాగంలో, మొదటి పాదంలోని ‘మిథ్యానగరం’ (Unreal city), చివరి పాదం ‘hypocrite lecteur! – mon semblable, – mon frère!’ బోదలేర్ నుండి గ్రహించినవే. ఏమిటి యీ బోదలేర్ స్మరణ ప్రాముఖ్యం?

బోదలేర్ ఏదీ దాచుకోడు – అతని పాపము, వేశ్యాసంగమము, సిఫిలిస్. ఈ దాచకపోవడం కేవలం వ్యక్తిగతవిషయం కాదు. అది సామాజికవిషయం కూడా. బోదలేర్ రోగగ్రస్తసమాజాన్ని తన కావ్యవస్తువుగా చేసుకున్నాడు. అతడి దృష్టిలో ఆధునిక సంస్కృతి డ్రైనేజి సంస్కృతి. మనిషికి తన మలం తనకు కనిపించకూడదు. విసర్జనం కళ్ళకు కనిపించకుండా కాళ్ళ కింద ప్రవహిస్తూ ఉండాలి. మనోమలం కూడా. ఈ డ్రైనేజి సంస్కృతిపై తన అసహ్యాన్ని తన కావ్యవస్తువును చేసుకున్నాడు బోదలేర్. డ్రైనేజి గొట్టాలలోని మురుగును బకెట్లతో తోడి రోడ్లమీదికి కుమ్మరించాడు. కొందరు కళ్ళు మూసుకున్నారు. ముక్కు మూసుకున్నారు. న్యాయస్థానాలు కత్తెరలు ప్రయోగించాయి. కాని అతడి కవిత్వబలాన్ని ఎవరూ కాదనలేకపోయారు. సమాజంలోని ఆత్మవంచనను, చెప్పే నీతులకు చేసే అవినీతికి అంతరాన్ని, బోదలేర్ బట్టబయలు చేశాడు. పాపాలు చర్చిలో ‘తండ్రి’ చెవిలో ఊదే రహస్యాలు కావు. బజారులో నిలబడి, ‘స్వర్గంలో ఉన్న తండ్రి’కి (Our Father in Heaven) వినిపించేటంత బిగ్గరగా అరుస్తాడు బోదలేర్. తన దోషాలు పాపాలు శాపాలు దాచుకోకుండా తన కావ్యవస్తువు చేసుకున్నాడు. ఆ పాపాలు శాపాలు తనవి మాత్రమే కావు, తన సమాజానివి. తాను ప్రతినిధి.

బోదలేర్: ధూర్జటి

ధూర్జటి కూడా ఏదీ దాచుకోలేదు. భగవద్భక్తులమని చెప్పుకొనేవారు కూడా, ఆ సర్వజ్ఞుడినుండి కూడా తమ పాపాలు దాచుకోవచ్చనుకొంటారు. ధూర్జటి అనుకోడు. తన పాపాల సంచి సర్వేశ్వరుడి సన్నిధిలో విప్పి పోస్తాడు.

కాయల్గాచె వధూ నఖాగ్రములచేఁ గాయంబు, వక్షోజముల్
రాయన్రాపడె ఱొమ్ము, మన్మధ విహారక్లేశ విభ్రాంతిచే,
ప్రాయంబాయెను, బట్టగట్టెఁ దల, చెప్పన్ రోత సంసారమేఁ
జేయంజాల విరక్తుఁ చేయఁ గదవే శ్రీకాళహస్తీశ్వరా!

రోసీ రోయదు కామినీ జనుల తారుణ్యోరు సౌఖ్యంబులన్,
పాసీ పాయదు పుత్రమిత్రజన సంపద్ర్బాంతి, వాంఛాలతల్
కొసీ కోయదు నామనం బకట! నీకున్ ప్రీతిగా సత్ర్కియల్
చేసీ చేయదు, దీని త్రుళ్ళణచవే శ్రీకాళహస్తీశ్వరా!

బహుశా తెలుగు వాడిగా పుట్టి ఉంటే, బోదలేర్ మరో ధూర్జటి అయ్యేవాడేమో? కవిత్వం బలెలేర్‌కు ఆత్మప్రక్షాళన సాధనం. భగవంతుడిని చేరడానికి అతడిది పెరటి దారి – unreal city: hypocrite lecteur! – mon semblable, – mon frère!

బరియల్ ఆఫ్ ది డెడ్ ముగింపు దృశ్యం ఆద్యంతాలలో బోదలేర్‌ను స్మరించడంలో కావ్యప్రయోజనం ఏమిటి? బోదలేర్ నుండి ఎలియట్ ఏ స్ఫూర్తిని దించుకున్నాడు?

Fourmillante cité, cité pleine de rêves,
Où le spectre en plein jour raccroche le passant!
Les Sept vieillards (The Seven Old Men)

పగిలిన చీమలపుట్టలా నగరం, కలలు నిండిన నగరం,
దారినపోయేవారిని ప్రేతం పట్టపగలు నిలదీసే నగరం!

Fourm (f), చీమ. Fourmillante (f), చీమల పుట్ట పగిలినట్లు; మందలు మందలుగా నగరవీథుల్లో నడిచే జనాలను చూసి అంటున్న మాట. ఈ ఎలియట్ సీనులో కూడా ప్రేతాలు ఒకరికొకరు హలో చెప్పుకొంటారు:

There I saw one I knew, and stopped him, crying: “Stetson!
You who were with me in the ships at Mylae!”

బోదలేర్ తన కవితలో తన సమాజంలోని ప్రేతాలలాంటి జీవులను, వారి యాంత్రిక జీవనవిధానాలను చెప్పాడు. ఉత్పత్తిశక్తులకు దాసులై, కేవలం భౌతికమైన అవసరాలకొరకు ఆర్జిస్తూ, పురుగులజనాభాలా పెరిగిపోతూ, ఏ ఆధ్యాత్మిక స్పృహ లేని జీవనం చేస్తున్న కీటకప్రాయులను (fourmillante) వర్ణించాడు. ఆ జనాన్నే యిక్కడ ఎలియట్ చెబుతున్నాడు.

దాన్తె

బోదలేర్‌తో పాటు దాన్తెను కూడా ఎలియట్ యిక్కడ ఆవాహన చేస్తున్నాడు. దాన్తె కావ్యం నరకం (Inferno) కూడా ఎలియట్ యథాతథంగా లండన్ బ్రిడ్జ్ మీదికి దించుకున్నాడు: I had not thought death had undone so many.

లండన్ బ్రిడ్జి మీద తమతమ పనులలో వెళుతున్న జనసమూహాలను గురించి, యీ దాన్తె వాక్యం వాడుకొన్నాడు ఎలియట్. ఆధునికనగరజీవనం నరకసదృశం అని ఎలియట్ ధ్వని. వీరివి జవము జీవము లేని బతుకులు. ఇక్కడి Unreal city విమర్శకులందరూ బోదలేర్‌దే అని గుర్తించినట్టున్నారు. కాని, యిందులోనూ, దాన్తె city ఉంది. ఎలియట్ ఏ ఉదాహరణనైనా సాధారణంగా వ్యతిరేకార్థంలోనే వాడుకొంటాడు. వేస్ట్ లాండ్ మొదటి లైనులోని April నుండి చూస్తూనే ఉన్నాము, చాసర్‌ను తలకిందులు చేశాడు. ఇక్కడ కూడా యీ Unreal city దాన్తె real cityని గుర్తు చేస్తుంది: che discernesse/ della vera cittade almen la torre. (Paradiso: Canto 16. see afar the tower of the true city.)

ఎలియట్ మిథ్యానగరం ఏం గుర్తు చేస్తుంది? ఇది దాంతే సత్యనగరానికి (vera cittade) కనిపించనంత దూరంలో ఉంది అని గుర్తు చేస్తున్నది. కనుక, బరియల్ ఆఫ్ ది డెడ్‌కు యీ ముగింపు దృశ్యం నగరమో నరకమో స్పష్టంగా కన్పించక పోవడానికి కారణాలు శీతాకాలపు పొగమంచు, నగరకాలుష్యం మాత్రమే కావు. (the brown fog of a winter dawn). అక్కడి మనుషులలో చైతన్యం లేదు, మనసులలో కాలుష్యం పోదు. జీవితాలకు అర్థం పరమార్థం లేదు. వాళ్ళ పాదాలు చూచుకొంటూ నడుస్తారు (each man fixed his eyes before his feet). తరువాత వేయబోయే అడుగు కంటే దూరం చూడలేరు. సత్యనగరదర్శనం కనుచూపు దూరంలో లేదు. వారి దృష్టి అసలు అటు వైపు లేదు.

Sighs, short and infrequent, were exhaled,
And each man fixed his eyes before his feet.
Flowed up the hill and down King William Street,
To where Saint Mary Woolnoth kept the hours
With a dead sound on the final stroke of nine.

ఈ గుంపును మనం యింతకు ముందు చూచాం, సొసోస్ట్రిస్ సోదిలో: I see crowds of people, walking round in a ring.జనం మందలు మందలుగా గానుగెద్దులలాగా గుండ్రంగా తిరుగుతూ కనిపిస్తున్నారు. ఎంతకాలం ఎన్ని మైళ్ళు నడిచినా ఉన్నచోటికే మళ్ళీమళ్ళీ వస్తున్నారు. అడుగు ముందుకు వెళ్ళలేరు. ఎటు వెళ్ళాలో తెలియదు, ఎటువెళుతున్నారో తెలియదు. దిక్కు తోచక, గమ్యం తెలియక, క్షణం తీరిక లేక తిరుగుతున్నారు.

ఈ దృశ్యంలో బతుకులు ఎలా సాగుతున్నాయి? బరువుగా, (దీర్ఘనిశ్స్వాసాలు – Sighs, short and infrequent, were exhaled; కొండపైకి పాకినట్టు – Flowed up the hill) సిసిఫస్ బండను కొండ పైకి దొర్లించినట్టు. అది తిరిగి కిందికి దొర్లుతుంది. తిరిగి దానిని పైకి తోసుకుంటూ వెళ్ళడం. వీళ్ళ బతుకులు కూడా అలానే దొర్లిస్తున్నారు (up the hill and down) యాంత్రికమైన దినచర్య, చర్వితచర్వణం.

కిందికి పైకి వీళ్ళు తిరుగుతున్నది ఎక్కడ? ఒక చర్చి వైపుకు (Saint Mary Woolnoth), కాని చర్చికి కాదు. బ్యాంకులు ఆఫీసులు ఎక్కడ పనిచేసే వాళ్ళు అక్కడికి తొమ్మిదికల్లా చేరుకోవాలి. (ఎలియట్ పనిచేసిన Lloyd’s Bank, యీ చర్చికి దగ్గరే.) వెళ్ళవలసింది వ్యాపారనిమిత్తం. వాళ్ళకు టైమ్ గుర్తు చేసేది చర్చి గడియారం. (ఈ వీథిలో ధనము దైవము సంధి కుదుర్చుకున్నాయి. హైదరాబాదులో Bank Streetలో రామాలయమో శివాలయమో ఉన్నట్టు.) చర్చి గడియారం గంట గంటకు గుర్తుచేస్తుంది, ‘ఒక గంట గడిచిపోయింది మీ జీవితాలలో’ అని గంటకొట్టి మరీ గుర్తు చేస్తుంది, మృత్యువుకు మరో గంట దగ్గరైనారని (dead sound; final stroke).

గడిచిపోయిన గంట వ్యర్థమా సార్థకమా?

ఎదురైన ప్రేతం, పలకరింపు

ఇంత వరకు యీ సీనులో మనం విన్నది ఎవరిగొంతు? I had not thought death had undone so many – ఈ పాదం దాన్తె నరకం లోది అని గుర్తించాం. కనుక, యిక్కడి ‘నేను’ దాన్తె నరకదృశ్యంలోని ఒక ప్రేతానిది. ఆ ప్రేతం మరో ప్రేతాన్ని గుర్తుపట్టి పలకరిస్తోంది.

There I saw one I knew, and stopped him, crying: “Stetson!
“You who were with me in the ships at Mylae!”

వేల సంవత్సరాల కిందటి పరిచయం. పాత మిత్రప్రేతాన్ని చూసి ప్రాణం లేచివచ్చి ఉంటుంది: మైలే (Mylae) వద్ద రెండు వేలసంవత్సరాల కింద మొదటి ప్యూనిక్ యుద్ధంలో యీ యిద్దరు కలిసి పోరాడినవారు. ( క్రీ.పూ. 260లో రోమ్‌ కు కార్టెజినాకు మధ్య జరిగింది యీ యుద్ధం.) హఠాత్తుగా కలిసిన ఆ రెండవ ప్రేతాన్ని అడుగుతున్నాడు:

That corpse you planted last year in your garden,
“Has it begun to sprout? Will it bloom this year?
“Or has the sudden frost disturbed its bed?
“Oh keep the Dog far hence, that’s friend to men,
“Or with his nails he’ll dig it up again!

మొక్కలు నాటడం విన్నాం, శవాలు నాటడం! ఆ ప్రేతానికి రెండువేల సంవత్సరాలు గడిచినా, క్రిందటి ఏడాదే అనుకుంటున్నాడు. పోయిన ఏడాది నీ పెరట్లో శవాన్ని నాటావు కదా? అది మొలిచిందా? అని అడుగుతున్నాడు! అసలు వాళ్ళు ప్రేతాలేనా? ప్రేతప్రాయులైన ప్రాణులా? అతడు మాట్లాడుతున్నది, ప్యూనిక్ యుద్ధం గురించేనా, లేక గత ఏడాది జరిగిన ప్రపంచయుద్ధమా? ఏదేతేనేం? ఏ యుద్ధచరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం? ఎవరి దేశపు పెరట్లో వాళ్ళు పాతిపెట్టిన శవాలే కదా? ఆ శవాలు ఫలిస్తాయా? (sprout, bloom) ఏ యుద్ధమైనా ఏ ఫలితాలనిస్తుంది? గతాన్ని తవ్వుకొని బాధ పడడం తప్ప, ఎవరినో తప్పు పట్టడం తప్ప? (the Dog far hence, that’s friend to men, /Or with his nails he’ll dig it up again!) ఎవరిని తప్పు పట్టగలవు? ఈ యుద్ధవిధ్వంసానికి, యీ సంస్కృతి పేకముక్కల్లా కూలిపోవడానికి, ఏ యితరేతర శక్తులు కారణం కావు. నీవూ నేనూ మనిద్దరం మనమందరం బాధ్యులమే.

You! hypocrite lecteur! – mon semblable, – mon frère! కపటపాఠకుడా! నా సదృశుడా!నా సోదరుడా! నీ దంభం (hypocrite!) కారణం. ఉత్తముడిలా నటించకు. నీవూ నాలాగే, నా వంటివాడివే (mon semblable). మనమంతా, ఒక్కొకరు ఒక మహా తకులం కాకపోయినా, ఆ హత్యలలో మనకూ భాగం ఉంది. నీవూ నేనూ భాయీ భాయీ (mon frère). శవాలు నాటి, పూలతోటలకోసం ఎదురు చూస్తాం. పునరుజ్జీవనం ఆశిస్తాం.

వేస్ట్ లాండ్ లోని మొదటి అంకం అంత్యక్రియలు (Burial of the Dead) సమాప్తం.

ఈ ప్రథమాంకం కావ్యవస్తువును అన్ని పార్శ్వాలలో ఆవిష్కరిస్తూ, ఒక స్వతంత్ర కవితగా కూడా నిలబడుతున్నది. కాని, కావ్యమంతా ఒకటిగా చూచినపుడు, యీ స్వతంత్రకవితలు మరింత అర్థవంతమవుతాయి. వసంతం కంటే శిశిరమే సుఖమనుకొనే మనస్తత్వం; స్వర్గమో నరకమో తెలియని ఒక అలౌకికానుభూతి; రేపటిసుఖం కంటే దూరం ఆలోచించని జీవితాలు; సమాజంలో జరిగే ఏ చెడుకూ తమ బాధ్యత లేదనుకొనే మనస్తత్వం; భూతమో ప్రేతమో, నరకమో నగరమో తెలియరాని జనము; ఇవి యిందులోని వస్తువు.

(సశేషం)