అవును. నేను చాలా తత్తరపాటు మనిషినే. గతంలోనూ అంతే, ఇప్పుడూ అంతే. నాకు పిచ్చి అంటారెందుకూ మీరు? ఈ జాడ్యం నా ఇంద్రియాలకు పదును పెట్టిందే కానీ వాటిని చంపెయ్యలేదు. ముఖ్యంగా నా వినికిడి శక్తి ఏమాత్రం పోలేదు. భూమి మీదవి, స్వర్గం లోవి, అన్ని చప్పుళ్ళూ నాకు వినబడతాయి, నరకం లోని శబ్దాలతో సహా. నేను వెర్రివాడిని ఎందుకవుతాను? నమ్మరా? అయితే చూడండి. జరిగిన కథ మొత్తం ఎంత నిమ్మళంగా వివరిస్తానో.
అసలు ఆ ఆలోచన నా బుర్ర లోకి ఎలా వచ్చిందో చెప్పడం నాకు ఇప్పుడు సాధ్యం కాదు. కాని ఒక్కసారి వచ్చాక అది పగలూ రాత్రీ ఆపకుండా నన్ను సతాయించింది. కారణం ఉందా, లేదు. కోరిక ఉందా, లేదు. నా కెప్పుడూ ఏ హానీ చెయ్యలేదు. నన్ను ఎప్పుడూ పల్లెత్తు మాటనలేదు. అతను కూడబెట్టుకున్న బంగారం అంటే కూడా నాకు ఏ ఆసక్తీ లేదు. నిజానికి ఆ ముసలాయనంటే నాకెంతో ప్రేమ. కానీ ఆ కన్ను! అవును. డేగ కన్నులా లేత నీలి రంగు కన్ను. సన్నటి శుక్లపు పొర కప్పుకున్న కన్ను. ఆ కన్ను నన్ను చూసినప్పుడల్లా నాకు రక్తం చల్లబడిపోయేది. రానురానూ ఆ కన్నును నేను భరించలేకపోయాను. ఇక తప్పదు – ఆ ముసలివాడి ప్రాణం తీసి ఆ కంటిచూపు నుండి నన్ను నేను రక్షించుకోవాలి.
అసలు విషయానికొచ్చాం ఇప్పుడు.
మీరు నాకు మతి భ్రమించిందనుకుంటున్నారు. మతి లేనివాడికి ఏమీ తెలీదు కదా? కాని, నన్ను గమనిస్తే తెలుస్తుంది మీకు ఎంత తెలివిగా, జాగ్రత్తగా నేను ఆ పని చేశానో. చంపివెయ్యడానికి వారం రోజుల ముందు నుంచీ ఎప్పుడూ లేనంత దయగా ఉన్నాను ఆ ముసలివాడి పట్ల. ప్రతి రోజూ అర్ధరాత్రి దాటాక నా గదిలోంచి బైటకు వచ్చి మెల్లిగా ఆ ముసలివాడి గది గడియ తీసి, కొద్దిగా తెరిచిన తలుపు సందులో ముందు వత్తి బాగా తగ్గించిన లాంతరు దూర్చి పట్టుకునేవాణ్ణి. ఎంతో జాగ్రత్తగా! ఆపైన నిదానంగా ఆ తలుపు సందులో నా తల దూర్చేవాడిని. మీకు నవ్వొస్తుందేమో కాని, ఎంత తెలివిగా నిదానంగా ఏ చప్పుడూ రాకుండా తల దూర్చేవాడినో చెప్పలేను. కనీసం ఒక గంట పట్టేది తల మొత్తం దూర్చడానికి, నిద్రపోతున్న ఆ ముసలివాడిని గమనించడానికీ. హ! పిచ్చివాడెవడైనా ఇలా చేస్తాడా? ఇంత తెలివిగా? ఇక నిదానంగా ముసలివాడికి నిద్ర ఏమాత్రమూ చెడకుండా లాంతరు వత్తి కొద్దికొద్దిగా కొద్దికొద్దిగా పెంచేవాణ్ణి, సన్నటి ఒక వెలుతురు కిరణం ఆ డేగకన్నుపై పడేదాకా. ఇలా ఏకంగా ఏడు రాత్రులు ప్రయత్నించాను. కాని, ఆ కన్ను ఎప్పుడూ మూసుకునే ఉండేది. అందుకే జరగాల్సిన పని జరగలేదు. నాకు వైరం ముసలివాడితో కాదు కదా. నా పగ అంతా ఆ డేగ కన్ను పైన, అది చూసే చూపు పైనా.
ఎనిమిదో నాటి రాత్రి తలుపు తెరిచేటప్పుడు మరికాస్త జాగ్రత్తగా ఉన్నాను. గడియారంలో నిమిషాల ముల్లు నాకన్నా వేగంగా కదులుతుందేమో. ఆరాత్రి నా తెలివి మీద, నా సామర్థ్యం మీదా నాకు గొప్ప నమ్మకం కలిగింది. విజయం తప్పదన్న భావన కలిగింది. నేనేమో ఇక్కడ తలుపును కొద్దికొద్దిగా తెరుస్తూ – ఆ ముసలివాడేమో నా ఊహలు కాని, నా ప్రయత్నాలు కానీ ఏమీ తెలియకుండా హాయిగా నిద్రపోతూ. నాకు కొద్దిగా నవ్వొచ్చింది. బహుశా కిసుక్కుమని వుంటాను, విని వుంటాడు, ఉన్నట్టుండి పక్క మీద కదిలాడు. నేనూ అంతే చటుక్కున తల వెనకకు తీసుకున్నాననుకున్నారేమో! లేదు. ఆ ముసలివాడి గది చిమ్మ చీకటి. కాటుకకన్నా నల్లటి చీకటి. తలుపు ఓరగా తెరిచి ఉందని ఆ ముసలివాడికి తెలిసే అవకాశం లేదు. నేను అతినిదానంగా ఆ తలుపును మెల్లగా నెడుతూనే ఉన్నాను.
తీసిన తలుపు లోంచి తల లోపలికి పెట్టి దీపం వెలుతురు పెంచబోతున్నప్పుడు నా వేలు జారి లాంతరుకు తగిలి చిన్నపాటి శబ్దం అయ్యింది. ముసలాడు చటుక్కున పరుపు మీద లేచి కూర్చుని “ఎవరది?” అని అరిచాడు.
నేను ఉలకలేదు. పలకలేదు. కదలలేదు. మెదలలేదు. దాదాపు గంటసేపు కనురెప్ప కూడా కదల్చకుండా అక్కడే అలానే నిల్చుండిపోయాను. ముసలివాడు తిరిగి పరుపు మీదకి ఒరిగిన శబ్దమేమీ రాలేదు. పక్కమీద కూర్చుని నిశితంగా వింటున్నట్టుంది – ఏడు రాత్రులుగా నేను చేసినట్టే.
అప్పుడు వినవచ్చిందొక మూలుగు శబ్దం. మనిషిలో చావుభయం పుట్టినప్పుడు బయటకు వచ్చే మూలుగు అది. నొప్పితోనో, బాధతోనో వచ్చే మూలుగు కాదది. విహ్వలమైన మనసు లోతుల్లోంచి పైకి తోసుకొచ్చే సన్నటి ఆ మూలుగు నాకు సుపరిచితం. ఎన్నోసార్లు, లోకమంతా నిద్రపోతున్న నిశిరాత్రి వేళల్లో నా గుండె లోతుల్లోంచి పెల్లుబికే శబ్దం అది. నా శరీరమంతా వ్యాపిస్తూ, పెరిగి పెద్ద్దదవుతూ, భయంతో నన్ను నేను మరిచిపోయేలా చేసే శబ్దం అది. అవును, ఆ మూలుగు నాకు బాగా తెలుసు.
అందుకే, ఆ ముసలివాడి లోలోపల గింగురుమంటున్న ఆలోచనలు నాకు తెలుస్తూనే ఉన్నాయి. అతని భయం, అతని ఆదుర్దా నాకు అర్థమవుతూనే ఉంది. నాలో నేనే నవ్వుకున్నాను ఒక్క క్షణం. కానీ జాలిపడ్డాను కూడా. మేలుకున్న తరువాత లోలోపల రానురానూ పెరిగిపోతున్న భయంతో ఆ ముసలివాడు మళ్ళీ నిద్రపోలేడని నాకు తెలుసు. తనకు తాను సర్దిచెప్పుకుంటాడు – అబ్బే, ఎలుక చప్పుడేమో. అబ్బే, బైట గాలికి చిమ్నీ ఊగిందేమో, కిటికీ కిర్రుమన్నదేమో – కాని ప్రయోజనం ఉండదు. ఏమీ ప్రయోజనం ఉండదు. ఎందుకంటే నల్లగా, చల్లగా ఆ ముసలివాడిని దుప్పటిలా కప్పుకుంటున్న చావు కలిగించిన భయం ఆ ముసలివాడిని పడుకోనివ్వదు. ఆ గదిలో నా తల ఉందని గ్రహించలేడు కాని మృత్యువు ఉందని ఊహించగలడు.
చాలాసేపు అలా ఎదురుచూశాక, చాలా నిదానంగా చేతిలోని లాంతరు వత్తి ఎంత కొద్దిగా పెంచానంటే – మీరు ఊహించలేరు నా చాకచక్యాన్ని – ఒక్కటంటే ఒక్కటే వెలుగు కిరణం, సాలెగూడు దారంలా సాగి వెళ్ళి ఆ కంటి మీద పడేలా. అది తెరిచి వుంది! విప్పారి వుంది. స్పష్టంగా కనబడుతూంది. చూసేకొద్దీ నాలో ఏహ్యతను, గగుర్పాటునూ పెంచుతోంది. నా రక్తం చల్లబరుస్తోంది. పొర కమ్మిన ఆ నీలి కన్ను మినహా నాకు ముసలివాడి ముఖం కనబడడంలేదు; లాంతరు వెలుగు పడుతూన్నది కేవలం ఆ కంటి మీదనే.
మీరు పిచ్చివాడన్నారు నన్ను. కాదు, పదునైన నా ఇంద్రియశక్తి అది అని నేను మీకు ముందే చెప్పాను. ఆ పదును వల్లే ఇప్పుడు వినగలిగాను – ఒక్క చిన్న శబ్దం. అతి చిన్న శబ్దం. ఒక గుడ్డలో చుట్టిన గడియారం చేసే మెత్తటి శబ్దం వంటిది. మెల్లిగా అర్థమయింది. అది ఆ ముసలివాడి గుండె చప్పుడు. వినేకొద్దీ నాలో ఆవేశం రగిలిపోయింది, యుద్ధభేరి వింటున్న సైనికుడిలా.
అయినా సరే, నన్ను నేను అదుపులో పెట్టుకున్నాను. చేతిలో లాంతరు పట్టుకుని కదలకుండా అలానే ఉండిపోయాను ముసలివాడి కంటి మీద పడే వెలుతురు గురి తప్పకుండా. క్షణక్షణానికీ ముసలివాడి గుండె మరింత వేగంగా మరింత గట్టిగా కొట్టుకోవడం నాకు వినబడుతూంది. ముసలివాడిలో భయం తారాస్థాయికి చేరినట్టుంది. ఆ అర్ధరాత్రి నిశ్శబ్దంలో, ఆ పాత ఇంట్లో, వింతగా వినిపిస్తున్న ఆ శబ్దానికి నాలోనూ భయం పుట్టింది. కొట్టుకుంటున్న వేగానికి ముసలివాడి గుండె బద్దలయేలా ఉంది. నేను కదలకుండా అక్కడే నిలబడిపోయాను. వాడి గుండె చప్పుడు పక్కింటికి వినిపిస్తుందేమో అని భయమేసింది.
ముసలివాడికి సమయం ముగిసింది. లాంతరు వెలుగు పూర్తిగా పెంచి పెద్దగా పొలికేక పెడుతూ గదిలోకి దూకాను. ముసలివాడు అరిచాడు – ఒకే ఒకసారి. క్షణం ఆలస్యం కాకుండా ముసలివాడిని మంచం మీద నుండి కిందకు తోసి బరువైన పరుపు వాడి మీదకు లాగాను. కొట్టుకుంటున్న వాడి గుండె చప్పుడు ఇంకా వినిపిస్తూనే ఉంది. అయితే అది ఇప్పుడు గోడ దాటి వినిపించదుగా. చివరకి గుండె కొట్టుకోవడం నిలిచిపోయింది. ముసలివాడు చచ్చిపోయాడు. పరుపు పక్కకి లాగి శవాన్ని తేరిపార చూశాను. కట్టెలా కొయ్యబారిపోయాడు. నా అరచేయి వాడి గుండె మీద ఆనించి చూశాను. గుండె కొట్టుకుంటున్న దాఖలా లేదు. కట్టెగా మిగిలాడు. వాడి కన్ను ఇక నన్ను వెంటాడదు.
నేను పిచ్చివాడిని కాదని మీకు ఇప్పటికీ నమ్మకం కలగకపోతే ముసలివాడి శవాన్ని ఎలా దాచేశానో చెబుతాను; దాంతో మీకు రూఢి అవుతుంది నేను తెలివైనవాడినని. రాత్రి గడిచిపోతోంది. చకచకా, నిశ్శబ్దంగా పని చేసేశాను. తల, చేతులు, కాళ్ళు మొండెం నుంచి వేరు చేశాను. చెక్కనేల నుంచి మూడు పలకలు ఊడతీశాను. శరీరపు ముక్కలను నేలకింద దాచి, చాలా జాగ్రత్తగా, ఎవరూ – ఆ ముసలివాడి చూపు కూడా – కనిపెట్టలేనంత చక్కగా చెక్కలు మళ్ళీ పరిచేశాను. ఏదో తొట్టిలోకి ఇంకిపోయినట్టు, కడగడానికి, తుడవడానికీ రక్తం లాంటిదేదీ కూడా కనబడలేదు. అంత లాఘవంగా చేశాను పని మరి.
ఇదంతా అయేసరికి తెల్లవారి నాలుగయింది. కానీ ఇంకా చీకటి పోలేదు. గడియారం నాలుగు గంటలు కొడుతూండగా వీధివాకిలి తలుపు ఎవరో కొడుతున్న చప్పుడయింది. లేశమైనా బెదురు లేకుండా (నేను భయపడడానికి ఇప్పుడు ఏముంది కనక?) తలుపు తెరవడానికి మెట్లు దిగి కిందకు వెళ్ళాను. తలుపు తీయగానే ముగ్గురు మనుషులు – పోలీసు అధికారులట – లోపలికొచ్చారు. పక్కింటివాళ్ళు ఏదో అరుపు విన్నారట. ఏదో ప్రమాదం శంకించారట. పోలీసులకు వెంటనే కబురు పంపారట. ఈ పోలీసువారు చూసిపోదామని వచ్చారట.
నవ్వుతూ ఇంట్లోకి రమ్మన్నాను. ఆ అరుపు నాదేనని, ఏదో పీడకలకి నిద్దట్లో అరిచానని నవ్వుతూ చెప్పాను. ఆ గదిలో ఉండే ముసలతను ఈ దేశంలో లేడని చెబుతూ బాగా సోదా చేసుకోండని పోలీసులకు ఇల్లంతా తిప్పి చూపించాను. చివరగా పోలీసులని ముసలివాడి గదిలోకి తీసుకెళ్ళి చూపించాను. ఎక్కడి వస్తువులు అక్కడే ఉన్నాయి. ఉత్సాహంతో కొన్ని కుర్చీలు తెచ్చి వేసి వాళ్ళని విశ్రాంతిగా కూర్చోమని చెప్పాను. సరిగ్గా ఆ ముసలివాడిని దాచిపెట్టిన చెక్కపలకల మీదకు ఒక కుర్చీ జరుపుకుని నేనూ కూచున్నాను. పోలీసుల అనుమానాలు వీడిపోయాయి. నాకు నిశ్చింత. సంతోషంగా నేను చెప్పే మాటలు వింటూ వాళ్ళు నాతో కబుర్లలోకి దిగారు.
కాసేపటికి నాకెందుకో శరీరం బలహీనమై పోలీసులు వెళ్ళిపోతే బావుణ్ణు అనిపించింది. తల బరువెక్కింది. చెవుల్లో గింగురుమంటున్న రొద. పోలీసులు ఇంకా మాట్లాడుతూనే ఉన్నారు. చెవుల్లో ఆ చప్పుడు మరింత ఎక్కువైంది. దాన్ని అణచడానికి నేను గొంతు పెంచి మాట్లాడాను. కానీ ఆ రొద తగ్గలేదు. ఇంకా గొంతు పెంచాను. చివరికి అర్థం అయింది నాకు. ఆ చప్పుడు నా చెవుల మధ్యన లేదు.
నేను తెల్లగా పాలిపోయి వుండుంటాను, సందేహం లేదు. కాని, గొంతు పెంచి మాట్లాడుతూనే ఉన్నాను, నా పెరుగుతున్న గొంతుతో పాటు ఆ రొద కూడా పెరిగింది. ఏదో గుడ్డలో చుట్టిన గడియారం చేస్తున్న చప్పుడు వంటిది అది.
ఊపిరి ఆడలేదు నాకు. కానీ పోలీసులకు మాత్రం ఏ చప్పుడూ వినబడటం లేదు. పైకి లేచి నిలబడి చేతులు ఊపుతూ ఏదేదో మరింత పెద్దగా మాట్లాడటం మొదలుపెట్టాను. చప్పుడు భరించలేనంతగా పెరిగింది.
అసలు వీళ్ళు ఇక్కణ్ణుంచి కదలరెందుకు? వాళ్ళక్కడ ఉండడం సహించలేనట్టు కోపంగా అడుగులు బలంగా వేస్తూ గదిలో అటూ ఇటూ పచార్లు మొదలెట్టాను. చెవులలో రొద ఇంకా పెరిగింది. ఏం చేసేదిప్పుడు? నేను కూర్చున్న కుర్చీని ఎత్తి ఆ చెక్కనేల మీద బరికాను. అయినా ఆ చప్పుడు తగ్గలేదు. పోలీసులు హాయిగా మాట్లాడుకుంటూ నాకేసి చూసి చిరునవ్వు నవ్వుతున్నారు. నన్ను సతాయిస్తున్న ఆ రొద వాళ్ళు వినడం లేదా నిజంగా? లేదు లేదు; వాళ్ళూ వింటున్నారు. విననట్టు నటిస్తున్నారు. వాళ్ళు అనుమానిస్తున్నారు. వాళ్ళకి తెలిసిపోయింది. ఘోరం దాచలేని నన్ను చూసే వాళ్ళు నవ్వుతున్నది. నా భయాన్ని ఎద్దేవా చేస్తున్నారు!
ఈ వ్యధ తట్టుకోలేను. వాళ్ళ చిరునవ్వులు క్షణం కూడా భరించలేను. లోపల అంతకంతకూ పెరిగిపోతున్న ఆ రొదకు నాకు పిచ్చెక్కిపోతోంది. పెద్దగా అరవాలి. తప్పదు. గుండెలు అవిసిపొయేలా అరవాలి. అరిచాను!
“దుర్మార్గులారా! నటించింది చాలు. ఇక ఆపండి. నా తప్పు ఒప్పుకుంటున్నాను. ఈ పలకలు పెరకండి. ఇక్కడే, ఇక్కడే. ఆ చప్పుడు ఏదో కాదు. ఆ ముసలివాడి వికారమైన గుండె చప్పుడు!”
(మూలం: The Tell-Tale Heart)