పరిచయం: డాక్టర్ కథ

ఇష్టకష్టాలు…

ఇంటర్మీడియట్ అయిపోయాక నేను ఒక మూడేళ్ళు ఖాళీగా ఇంట్లో కూచున్నా. ఆ తర్వాతే రెండోసారి ఎంట్రన్స్ పరీక్ష రాసి మెడికల్ కాలేజ్‌లో జాయినయ్యింది. ఆ మూడేళ్ళూ మా ఊళ్ళో లైబ్రరీలో వున్న పుస్తకాలన్నీ తినెయ్యడమే నా పని. అలా చదివిన పుస్తకాల్లో ఒక చిన్న పుస్తకం నన్ను అమితంగా ఆకర్షించింది. అవడానికి చిన్న పుస్తకమే గానీ ఆ వయసులో అది నామీద చూపిన ప్రభావం మరపురానిది. నేను డాక్టర్నయి, ప్రాక్టీసు పెట్టి కొన్నేళ్ళయిపోయినా అందులోని విషయాలు నాకు గుర్తొస్తూనే వుండేవి. ఒక రకంగా నేను డాక్టర్నవడానికి కూడా స్ఫూర్తిని ఇచ్చిందా పుస్తకం.

అది చదివిన దగ్గరనుండీ, దాని గురించి మాట్లాడదామని యెవరిని కదిలించినా ఆ పుస్తకం చదివామన్నవాళ్ళు యెవరూ నాకు కనపడలా! ఒక రోజు విజయవాడ రేడియో స్టేషన్ మాజీ డైరెక్టర్, రచయిత్రి ముంజులూరి కృష్ఞకుమారిగారితో ఏవో మాటల మధ్య చాగంటి సూర్యనారాయణగారి పుస్తకం ‘డాక్టర్ కథ’ బాగుంటుంది అని నేనగానే ఆవిడ “ఆ పుస్తకం నాకు తెలుసు, ఆయన బెజవాడ వాడే, ఇక్కడే వైద్యం చేస్తూ వుండేవారు, ఆ పుస్తకం నా దగ్గర ఉండాలి, వెతికి ఇస్తాను” అన్నారు. కానీ నా దురదృష్టం, వాళ్ళింటో వున్న ఆ పుస్తక మహారణ్యంలో ఆవిడా పుస్తకాన్ని పట్టుకుని నాకు ఇవ్వలేకపోయారు. కాలం గడుస్తోంది, పుస్తకం నా మనసులో మెదులుతూనే వుంది, కానీ కళ్ళపడటంలా.

2022 ఆగష్ట్ 03వ తేదిన వి. ఎ. కె. రంగారావుగారిని బొమ్మిడాల ఛారిటబుల్ ట్రస్ట్‌ వారు సన్మానిస్తున్న సందర్భంగా నేను గుంటూరు వెళ్ళాను. పనిలో పనిగా అక్కడ పుస్తకాలమనిషి లంకా సూర్యనారాయణగారు నిర్వహిస్తున్న అపురూపమైన అన్నమయ్య గ్రంథాలయం సందర్శించాను. ప్రసంగవశాత్తు వారు తమ దగ్గర ఆరు వేల జీవితచరిత్రలున్నాయి అన్నారు. నేను వెంటనే ఈ చాగంటి సూర్యనారాయణగారి పుస్తకం గురించి అడగటమేమిటీ! వారు వెతికి నా ముందు పెట్టడమేమిటీ! అంతా మూణ్ణిమిషాల్లో జరిగిపోయింది. అంతే కాదు, ఆ పుస్తకం ప్రతి ఒకటి నాకు పంపి పుణ్యం కట్టుకున్నారు.

నేను నలభై సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ పుస్తకం చదివాను. మొదలు పెట్టేటప్పుడు అనుమానంగానే మొదలుపెట్టా, చిన్నతనంలో అప్పుడయితే చదివి బాగుందనుకున్నా, ఇప్పుడేమనిపిస్తుందో ఏమిటో! అనుకుంటూ.

ఆశ్చర్యం! చదువుతూంటే ఇప్పుడు మరింత బాగుందనిపించింది. నేనే కాదు, మా అబ్బాయి అన్వర్ కూడా ఆ పుస్తకాన్ని చదివి పొంగిపోయి “ఎంత మంచి పుస్తకం అమ్మా! ఎంత చక్కని వాక్యం అమ్మా! ఈ పుస్తకం మళ్ళీ వేసి చాలామందికి చదివే అవకాశం కల్పించాలమ్మా” అనడంతో, పుస్తకం మనమే యెందుకు వెయ్యగూడదూ? అనే దురాలోచన నాకు కలిగింది.

అక్కడి నుండి మొదలయ్యాయి మా పాట్లు. పుస్తకం పేరు, రచయిత పేరు తప్పా తెలిసిన సమాచారం ఏమీ చేతిలో లేదు. నా ఆదివారాలూ నా ఖాళీసమయాలూ నాకు కాకుండా పోయాయి. ఇక వెతుకులాట మొదలయింది. ఆయన బెజవాడలో డాక్టర్‌గా యే ప్రాంతంలో నివసించేవారు? యెలా వుండేవారు? వారి ఫోటో యేమైనా దొరుకుతుందా? వారి పిల్లలెవరన్నా కనిపిస్తారా? ఈ ప్రశ్నలకి సమాధానాల కోసం బెజవాడలో నాకు తెలిసినవారిని, పరిచయమున్న డాక్టర్లనీ అందరినీ అడగటం మొదలుపెట్టాను. విజయవాడ దగ్గర ఊరే కదా! ఆయన గురించి తెలుసుకోవడం పెద్దకష్టం కాదనుకున్నా. పైగా ఆయన 1985 వరకూ జీవించి వున్నారని తెలిశాక మరింత తేలిగ్గా పనవుతుందనుకున్నా, కానీ నేననుకున్నంత సులభంగా ఏమీ జరగలేదు. కొన్ని ప్రశ్నలకి సమాధానాలు ఇప్పటికీ దొరకలేదు.

మొదటగా వయసులోను, అనుభవంలోనూ సీనియర్లయిన కొంతమంది డాక్టర్లను కదిలించి చూశాను. వారి పేరు తెలుసు, చూశాము అన్నారు కానీ వారి కుటుంబ వివరాలు తెలియవన్నారు. నా స్నేహితురాలు బాలాంత్రపు ప్రసూన వాళ్ళమ్మగారు, ఆయన సూర్యారావుపేటలో ప్రాక్టీసు చేసేవారని, అక్కడకు దగ్గర్లోనే వారిల్లు కూడా వుండేదనీ చెప్పారు. నేనూ ప్రసూనా సూర్యారావుపేట వెళ్ళి, ఎల్.ఐ.సి. బిల్డింగ్ ఎదురుగా వున్న వాళ్ళింటికోసం వెదుకుతుంటే, ఆ పక్కింటావిడ సంజెదీపం వెలుగులో చాలా విషయాలు చెప్పింది. చాగంటి సూర్యనారాయణగారు వారి పక్కింట్లోనే వుండేవారని, ఆ దగ్గరలోనే ప్రకాశం రోడ్డులో ఆయన హాస్పిటల్ వుండేదని, ఆయనకు ముగ్గురు కూతుళ్ళూ ఒక కొడుకూ అని, వారంతా ఇప్పుడు యెక్కడెక్కడో వుంటున్నారని, వాళ్ళ ఫోన్ నంబర్లూ అడ్రసూ ఆ దగ్గరలో వుంటున్న పళ్ళరసాల బండి అతనికి తెలుసనీ చెప్పారు.

మేము ఆ పళ్ళరసాల బండి వెతుకుతూ బయలుదేరాం. ఆ జ్యూస్ బండి దగ్గరకెళ్ళి, అతను కాస్త ఖాళీ అయ్యేదాకా యెదురుచూసి, ఇలా ఫలానా సూర్యనారాయణగారి గురించీ వారి వారసుల గురించీ వివరాలు కావాలని అడిగితే, వారి బంధువుల ఫోన్ నంబరుంది కానీ ఇవ్వను. ఎవ్వరికీ ఇవ్వవద్దని వాళ్ళ ఆర్డరు అన్నాడు. కథకి అక్కడ అడ్డుకట్ట పడింది. ఎంత దుఃఖమేసిందో చెప్పడానికి లేదు, యేం చేయాలో పాలుపోలేదు. యెంతమంది ద్వారా ప్రయత్నించినా ఏ వివరాలూ దొరకలేదు. ఆయనెలా వుంటారో ఫోటో లేదు, మిగతా సమాచారమూ తెలియలేదు. ఒక దశలో ఎందుకీ కష్టం? పుస్తకం వేయడం మానేద్దాం అని కూడా అనిపించింది.

ఇంతలో ఒక రోజు ఒక డాక్టర్‌గారు చాగంటి సూర్యనారాయణగారు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ బెజవాడ బ్రాంచ్‌కి ప్రెసిడెంట్‌గా పనిచేసేవారని, ఆయన పేరిట ప్రతియేటా ఒక మంచి పేపర్ ప్రజెంట్ చేసినందుకు గోల్డ్ మెడల్ కూడా ఇచ్చేవారని, ఒక సంవత్సరం తనకూ అది వచ్చిందనీ చెప్పారు. అయితే ప్రస్తుతం ఆయన గురించిన సమాచారం కాని, ఫోటో కానీ అసోసియేషన్లో దొరకటం లేదని చెప్పారు.

ఇలా కాదని ఒకరోజు పనిగట్టుకుని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రస్తుత ప్రెసిడెంట్ డాక్టర్ రెహమాన్‌ని పీడించి, ఒక ఆదివారం అఫీసు తెరిపించి మరీ కార్యాలయానికి వెళ్ళాం నేనూ, మా అబ్బాయి. అక్కడ ఉద్యోగి ఉదాసీనంగా అక్కడ ఆయన గురించి ఏ సమాచారమూ ఫోటోలూ యేమీ లేవన్నాడు. అయితే యెంతో విచిత్రంగా ఆ బిల్డింగ్ ప్రారంభోత్సవం చేసింది చాగంటి సూర్యనారాయణగారేనని అక్కడి శిలాఫలకం మీద వుంది. ఇంకా ఆయన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా నాలుగు సంవత్సరాలు పనిచేశారని కూడా అక్కడున్న ప్రెసిడెంట్స్ లిస్ట్‌లో రాసి వుంది.

అక్కడ మెట్ల క్రింద ఉన్న చిన్న గదిలో, మూల పడేసి దుమ్ముకొట్టుకున్న మహామహుల ఫోటోలలో ఆయన ఫోటో వుంటుందేమోననే ఆశతో ఆ ఫోటోలన్నీ శుభ్రంచేసి, గుర్తు తెలియని ఆయన్ని యెంతో వెదికాం, కనిపెట్టలేకపోయాం. అయినా ముందు జాగ్రతగా అనుమానం వచ్చిన ప్రతి డాక్టర్ ఫోటోని మొబైల్‌లో భద్రపరుచుకున్నాం.

చివరికి డాక్టర్ టి. వి. ఎస్. శర్మగారనే సీనియర్ డాక్టర్‌గారికి సూర్యనారాయణగారి సమాచారం తెలిసివుండొచ్చని ఆయనని వెదుక్కుంటూ వారి ఇంటికి వెళ్ళాం. మమ్మల్ని టి. వి. ఎస్. శర్మగారు ఆదరంగా కూర్చోబెట్టి, తన తండ్రిగారు డాక్టర్ టి. వి. ఎస్. చలపతిరావుగారు, సూర్యనారాయణగారూ సమకాలికులని, కలిసి సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ వుండేవారని, ఆయనకి ఆధ్యాత్మికపరమైన ఆలోచనాధోరణి కూడా వుండేదనీ చెప్పారు. అంతే కాదు, ఆయన ‘లలితా సహస్ర నామాన్ని’ ఇంగ్లీషులోకి అనువదించారని, అప్పట్లో దానిని భారతీయ విద్యాభవన్‌వారు ప్రచురించారని, ఆ పుస్తకంలో ఆయన ఫోటో వివరాలూ వుండొచ్చనీ చెప్పారు. ఆ చిన్న క్లూతో వెనువెంటనే మా అబ్బాయి నెట్‍లో చూసి ఆయన పుస్తకం, దాని వెనుక ప్రచురించిన ఆయన చిన్న ఫోటో నా కళ్ళముందుంచాడు. అది చూడంగానే ఒక్కసారిగా నా కంట్లో నీళ్ళొచ్చాయి, మా అన్వేషణ కొంతయినా ఫలించినందుకు, ఆ గొప్ప వ్యక్తి రూపాన్ని చూడగలిగినందుకూ!

చాగంటి సూర్యనారాయణమూర్తిగారు డాక్టర్ వృత్తిలో వుండి రోగుల సేవ, సమాజ సేవా చెయ్యడమే కాక కొంత ఆథ్యాత్మిక మార్గంలో కూడా నడిచేవారని దీనినిబట్టి అర్థమవుతోంది. ఆయన గురించి మరి కొంత సమాచారం సంపాదించి ఈ పుస్తకంలో చేరుస్తున్నాం.

ఇంత ప్రయత్నం చేసి వేస్తున్న ఈ పుస్తకం యేం చెబుతోంది అంటే, 1919 ప్రాంతాలలో మద్రాసు మెడికల్ కాలేజ్‌లో ఎం. బి. బి. ఎస్. చదవడానికి వెళ్ళిన ఒక ఆంధ్ర యువకుడు పడిన కష్టాలేమిటి? అతను యెలాంటి పరిస్థితులలో చదువుకున్నాడు? అప్పటి అతని మనోభావాలేమిటి? అప్పటి చికిత్సా పధ్ధతులేమిటి? అప్పుడున్న మందులెలాంటివి? అతనెదుర్కున్న సవాళ్ళేమిటి? చదివిన చదువును బయటి ప్రపంచంలో వినియోగించడంలో అనుకూల ప్రతికూల ప్రభావాలేమిటి? అతను నేర్చుకున్న విలువలేమిటీ… ఇవన్నీ తెలుస్తాయి. అవన్నీ ఒకెత్తూ, అతను 1925లో ముఫ్ఫయి నలభై వేల జనాభా మాత్రమే కలిగి వుండి ఒక పెద్ద పల్లెటూరులా వున్న బెజవాడలో మొట్టమొదటి ఎం. బి. బి. ఎస్. డాక్టరుగా ప్రాక్టీసు మొదలుపెట్టినప్పటి అతని అనుభవాలు ఒకెత్తూ; ఒక వైద్యుడిగా ఆయన తన అనుభవాలను కించిత్తు హాస్యాన్ని ఒలికిస్తూ చెప్పిన తీరు, ఆయన భాషా పటిమ, చక్కని తెలుగువాక్య నిర్మాణం… ఇవన్నీ మనలని ఈ పుస్తకం పట్టుకుని వదలకుండా చదివిస్తాయి. అంతేకాదు ఒక వైద్యుడు పాటించవలసిన విలువలని కూడా చెబుతుందీ పుస్తకం.

పుస్తకం చదివి ఆనందించడమే కాక, ‘పుస్తకం ఏకబిగిన చదివించింది, చాలా మంచి పుస్తకం, పుస్తకం ప్రచురించాకా మరచిపోకుండా నాకొక ప్రతి పంపించాలి’ అని ప్రూఫులు కూడా దిద్దిపెట్టిన ప్రముఖ మ్యూజికాలజిస్ట్ వి. ఎ. కె. రంగారావుగారికి కృతజ్ఞతలు. సమాచారం తెలియడానికి, పుస్తకం వెలుగులోకి చూడటానికి సహకరించినవారందరికీ పేరు పేరునా ధన్యవాదాలు.

చిన్నతనంలో పదిహేడేళ్ళ ప్రాయంలో చదివిన పుస్తకం సుమారు నలభై యేళ్ళు ఒక మనిషిని వెంటాడిందంటే అది సామాన్యమైన విషయం కాదుకదా! అలాంటి పుస్తకం మీరు కూడా చదవాలని ఇప్పుడు ఇలా మీముందుకు…


పేరు: డాక్టర్ కథ
రచన: చాగంటి సూర్యనారాయణమూర్తి
ధర: రూ 175.
దొరుకు చోటు: ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలలో. ఇంకా బదరీ పబ్లికేషన్స్ – ఫోన్:9347234086 (వాట్సప్ మాత్రమే) 08674-253210, 253366.