యూట్యూబ్‍లో ఈమాట: గతనెలలో

ఈమాటలో మొదటినుండీ శబ్దతరంగాలనే శీర్షిక కింద ఎన్నో అపురూపమైన ఆడియోలు ప్రచురించాం. ఇవి పాఠకులను ఎంతగానో అలరించాయి కూడా. అయితే, కాలం గడిచేకొద్దీ పాతసంచికల రచనలు మరుగున పడడం సహజం. అలా మరుగున పడినవాటిని వెలికితీసి అందరికీ అందుబాటులో ఉంచాలనేది మా కోరిక. మారుతున్న కాలంతో పాటూ సాహిత్య వేదికలూ మారుతున్నాయి. ఈమధ్య కాలంలో తెలుగులో ఆడియో కథలు ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. వీటికి యూట్యూబ్ ముఖ్య వేదిక. ఇది ఇప్పుడు అందరూ వాడుతున్నదీ, అందరూ తేలిగ్గా కావలసినవి వెదుక్కుని ఆనందించగలిగినదీ కనుక, ఈమాట యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించాం. ఎందరో ఔత్సాహికులు ఈమాట లోని కథలను కవితలను ఆడియోరూపం లోకి తెస్తున్నారు. వారికి మా కృతజ్ఞతలు. వాటిని ఈ ఛానల్ ద్వారా ప్రచురించబోతున్నాం. కథలతో పాటు అలనాటి పాటలు, రూపకాలు, అరుదైన సాహితీవేత్తల గొంతులు, సంభాషణలు, ప్రాచుర్యంలో ఉన్న ప్రైవేట్ గీతాలు ఇలా అన్నింటినీ ఇక్కడ పొందుపరచబోతున్నాం. ఇలా ఈమాటలోని ఆడియోలు అన్నీ సమయానుకూలంగా అక్కడ అందరికీ సులభంగా అందుబాటులో ఉంచబోతున్నాం. అంతే కాక, సరికొత్త ఆడియో వీడియో రచనలకు కూడా చోటు కల్పించబోతున్నాం. ఈ మహాప్రయత్నంలో మాకు సహకరించి, ముందుండి నడిపిస్తున్న ప్రశాంతి చోప్రాగారికి, సహాయ సహకారాలందిస్తున్న పరుచూరి శ్రీనివాస్, తదితరులకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ సందర్భంగా, పాఠకుల నుంచి కూడా కంటెంట్ ఆహ్వానిస్తున్నాం. ఈమాట నియమావళికి అనుగుణమైన శబ్ద-దృశ్య-రచనలను ఈ ఛానల్ ద్వారా ప్రచురించగలం. ఈ ఛానల్‌కు సబ్‌స్క్రయిబ్ చేసి మా ప్రయత్నాన్ని విజయవంతం చేయమని ఈమాట పాఠకులకు మనవి.


గతనెలలో కొత్తగా:

  1. బాలానందం (మూడు పాటలు).

    న్యాయపతి కామేశ్వరి, రాఘవరావుల గురించి ఎటువంటి పరిచయం అవసరం లేదనుకుంటాను. ‘అక్కయ్య, అన్నయ్య’లుగా ప్రసిద్ధులైన వారిద్దరు, ఆంధ్ర బాలానంద సంఘం పేరుతో 1939-40 నుండి 1955-56 ప్రాంతం వరకు మద్రాసు, ఆ తరువాత హైదరాబాదు నుంచి తెలుగులో బాలల సాహిత్యానికి చేసిన కృషి అందరికీ తెలిసినదే. ముఖ్యంగా వాళ్ళిద్దరు చేసిన రేడియో కార్యక్రమాలు చాలామందిని ప్రభావితం చేశాయి. ధ్వని ప్రధానమైన రేడియోని సమర్ధవంతంగా వినియోగించుకుంటూ పిల్లలకు కార్యక్రమాలు రూపొందించటంలో వారు చూపిన ప్రతిభ గొప్పది. ‘బాలానందం’ బృంద గేయాలుగా వచ్చిన మరి కొన్ని రికార్డులను ఈమాట నవంబర్ 2015 సంచికలో వినవచ్చు.

  2. ఆడియో కథ: వేతన శర్మ
    రచన: రావి శాస్త్రి
    చదివిన వారు: శ్రీనివాస్ బందా