ఉత్తర మొరాకో శోధనలు 6

టాంజీర్‍-రబాత్-కాసాబ్లాంకా

బాగా పొద్దున్నే లేచి తెలతెలవారుతోన్న సమయాన మా రియాద్‌ టాంజిస్‌ మేడపైకి చేరుకొన్నాను. అద్భుతమైన సూర్యోదయం పలకరించింది. మదీనా ప్రాంతపు శ్వేతభవనాలన్నీ ఆ బాలభానుని కిరణాలు సోకి కెంజాయ రంగులో వెలిగిపోతూ కనిపించాయి. దూరాన కొండమీద ఉన్న కస్బా, ఇంకా పైకి దృష్టిసారిస్తే మిలమిల మెరిసే అట్లాంటిక్‌ సాగరం- ఆ క్షణాలు మార్మికతకు ప్రతిరూపాలనిపించాయి. ఆ దృశ్యాన్నీ అనుభవాన్నీ మనసులోకి ఇంకించుకొనే ప్రయత్నంలో పరిసరాలను మరచిపోయి అలా చూస్తూ ఉండిపోయాను. అలాంటి సమయంలో తన అతిథిని ఏ మాత్రం కదలించగూడదు అన్న సంగతి తెలిసిన మా రియాద్‌ యజమాని హఫీజ్‌ ఉదయపుటల్పాహారాన్ని – కాఫీతో సహా – ట్రేలో పెట్టుకొని మెల్లగా మేడమీదికి చేరాడు. నింపాదిగా బ్రేక్‌ఫాస్ట్‌ చేసి, ఆ పైన కాఫీ సేవిస్తూ, సూర్యకిరణాలు చురుక్కుమనిపించే దాకా మేడమీద ఉండిపోయాను.

మొరాకో దేశపు బ్రేక్‌ఫాస్ట్‌ నాకు బాగా పరిచితమైపోయిందనాలి. మిస్సెమ్మెన్‌, హర్ష, ఖుబ్జ్‌ అని పిలవబడే మొరాకో దేశపు రొట్టె, మన చిల్లుల పుల్లట్లలా కనిపించే బెఘ్రీర్‌ అనే వంటకం, వెన్న, జున్ను, వీటితోపాటు తాజా పళ్ళు, ముక్తాయింపుగా మింట్‌ టీ- ఇవీ అక్కడి అల్పాహారపు దినుసులు. మనం అడిగితే కాఫీ కూడా ఇస్తారు.

నా తదుపరి గమ్యం రబాత్ గురించి హఫీజ్‌ ప్రాథమిక సమాచారం అందించాడు. రైళ్ళ వివరాలు చెప్పాడు. ఆ రియాద్‌ను వదిలిపెట్టే సమయం వచ్చింది. అతనికీ అతని సహచరులకూ – ముఖ్యంగా వంట ఇంటి మనుషులకు – మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పాను. బ్యాక్‌ప్యాక్‌ ధరించి, హోటలు విడిచి పెట్టి టాంజియర్‌లో నేను చూడకుండా మిగిలిపోయిన ప్రదేశం వైపు దారి తీశాను. అమెరికన్‌ లెగేషన్‌ మ్యూజియం అన్నది ఆ మిగిలిపోయిన ఒకే ఒక్క ప్రదేశం.

ఆ మ్యూజియం మదీనాకు అవతలివైపున ఇరవై నిమిషాల నడక దూరంలో ఉందని తెలిసింది. మెల్లగా నడక సాగించాను. రెండొందలేళ్ళ క్రితం కట్టిన ఆ సువిశాల భవనం చూసీ చూడగానే నన్ను బాగా ఆకట్టుకొంది. అమెరికా దేశపు భౌగోళిక పరిధుల కావల, ఆ దేశపు దౌత్య వ్యవహారాలు గత రెండు శతాబ్దాలుగా నిరాఘాటంగా సాగిపోతున్న ప్రదేశాలున్నాయట. అలా సాగిపోతోన్న ప్రదేశాలలోకెల్లా ఈ అమెరికన్‌ లెగేషన్‌ భవనం అత్యంత ప్రాచీనమైనదట. ఆ కోవకు చెందిన ప్రదేశాలలో ‘హిస్టారిక్‌ ప్రాపర్టీ’ స్థాయిని అందుకొన్న ఏకైక భవనమిదేనట. 1776లో స్వాతంత్య్రం సాధించాక 1777లో అమెరికాను అధికారికంగా గుర్తించిన మొట్టమొదటి దేశం మొరాకోనే అట. ఈ అమెరికన్‌ లెగేషన్‌ భవనం కూడా అప్పటి మొరాకో అధినేత అమెరికాకు బహుమతిగా కట్టి ఇచ్చినదట. ప్రస్తుతం అది ఒక మ్యూజియంగా రూపొందింది.

నామమాత్రపు ప్రవేశ రుసుము చెల్లించి లోపలికి వెళ్ళాను. ఎన్నెన్నో ఆసక్తికరమైన వస్తువులు, ఛాయాచిత్రాలూ ప్రదర్శనకు పెట్టి ఉన్నాయి. వాటితోపాటూ ఆ ప్రాంగణంతో ముడిపడిన చిట్టిపొట్టి పిట్టకథల వివరణలు కూడా అక్కడ కనిపించాయి. అందులో ఒక కథ నన్ను ఆకట్టుకొంది. అప్పట్లో తమ దేశానికి కొత్త రాయబారిగా వచ్చిన ఒక అమెరికా అధికారికి ఆనాటి మొరాకో ప్రభువు ఎంతో మురిపెంగా రెండు బాగా ఎదిగిన సింహాలను బహుకరించాడట. వాటిల్ని ఏం చేసుకోవాలో తెలియక ఆ రాయబారి తికమకపడ్డాడట. బహుమతిని తిరస్కరించడం దౌత్యమర్యాద కాదు; అలా అని ఆ మృగరాజులను తమ కార్యాలయంలో ఎలా ఉంచుకొని పాలించాలో తెలియదు…

అక్కడి వివరాల్లో మరో ఆసక్తికరమైన కథనాన్ని నేను గమనించాను. ఇపుడు మనం గయానా అని పిలుచుకొనే పశ్చిమ ఆఫ్రికా దేశపు యువరాజు అబ్దుల్‌ రెహమాన్‌ ఇబ్రహీమ్ అక్కడి తెగల మధ్య యుద్ధాలలో బందీగా పట్టుబడి బానిసగా అమ్ముడుపోయాడట. అలా బానిసరూపంలో 1827లో అమెరికాలోని మిసిసిపి ప్రాంతం చేరుకొన్నాడట. ఆ సంగతి తెలుసుకొన్న మొరాకో ప్రభువు ఆ యువరాజును విడిచి పెట్టమని అమెరికా అధ్యక్షుడికి వినతి చేశాడట. దాన్ని మన్నించి యువరాజును విడుదల చేశారట. ఈ కథంతా ఆల్‌ఫ్రెడ్‌ టెర్రీ అన్న అమెరికన్‌ రచయిత 1977లో ప్రిన్స్‌ ఎమాంగ్‌ స్లేవ్స్‌ – బానిసల మధ్య యువరాజు – అన్న పుస్తకంగా రాశాడట. ఆ సంగతి తెలియగానే ఆ పుస్తకాన్ని నేను చదువవలసిన పుస్తకాల లిస్టులోకి ఎక్కించాను.

ఆ భవనంలోని ఫర్నిచరు, ఇతర గృహోపకరణాలను చూసినపుడు నాకు మౌంట్‌ వెర్నన్‌ అన్న వాషింగ్టన్‌ డి.సి. శివారు ప్రదేశంలో చూసిన జార్జి వాషింగ్టన్‌ ఇల్లు గుర్తొచ్చింది. అలాగే వర్జీనియా రాష్ట్రంలోని మాంటిచెల్లో అన్నచోట ఉన్న థామస్‌ జెఫర్సన్‌ నివాస గృహమూ గుర్తొచ్చింది.

టాంజీర్‍ నగరంలో ఏభై ఏళ్ళు గడిపి ఆ నగరంలో ఒక భాగమైపోయిన అమెరికన్‌ రచయిత పాల్‌ బౌవెల్స్‌ జీవితమూ రచనల వివరాలకు ఆ భవనంలోని ఒక చిరువిభాగాన్ని కేటాయించారు. 1979లో మరణించిన బౌవెల్స్‌కు ఈ అమెరికన్‌ లెగేషన్‌తో సన్నిహిత బాంధవ్యం ఉండేదట. అలాగే అక్కడ ప్రదర్శనకు ఉంచిన వర్ణ చిత్రాలలో జోహ్రా అన్న బెర్బర్ పసి యువతి చిత్రం నన్ను బాగా ఆకర్షించింది. లేత ఎరుపు రంగు దుస్తులు, తలకు స్కార్ఫు, సూటిగా చూసేకళ్ళు- నన్ను కట్టిపడేసిందా చిత్రం. ఆమెను అక్కడివాళ్ళు మొరాకో దేశపు మోనాలిసాగా పరిగణిస్తారట. సాటిలేని సొగసు ఆ పసియువతిది.


టాంజీర్‍కు గుడ్‌బై చెప్పే సమయం వచ్చేసింది. గ్రాండ్‌సోకోకు తిరిగి వెళ్ళి రైల్వేస్టేషన్‌ దాకా టాక్సీ తీసుకొన్నాను. ఉదయపు సందళ్ళు గడిచిపోయాయి గాబట్టి రోడ్లన్నీ ఖాళీగా కనిపించాయి. నే ఎక్కిన టాక్సీ ముందస్తుగా వలసకాలపు భవన వైభవాలను తాకుతూ సాగింది. అవి దాటాక ఆధునిక ఆకాశహర్మ్యాల మధ్యగా సాగింది. పోల్చిచూస్తే ఈ ఆకాశ హర్మ్యాల తళుకు బెళుకులు నాకు ఏ మాత్రం నచ్చలేదు. అదే ఆ నగరపు మదీనాలో అయితే అలనాటి అరేబియన్‌ నైట్స్‌ పుస్తకంలోని భవనాలూ వాతావరణమూ సరాసరి నడచి వచ్చి మన కళ్ళముందు నిలబడతాయి. ఈనాటి తళుకు బెళుకుల కన్నా ఆనాటి కళకళలంటేనే నాకు మక్కువ. నిజమే. నాది పాత విషయాలమీదకు మొగ్గే పక్షపాత దృష్టే కావచ్చు. కానీ అలాంటి పక్షపాతం నాకు సంతోషమూ సుఖమూ అందిస్తుంది. ఆ మొగ్గును నేను మనస్ఫూర్తిగా స్వీకరించి కాపాడుకోగలను!

చూడగానే టాంజీర్‍ రైల్వేస్టేషన్‌ ఒక అధునాతన విమానాశ్రయాన్ని తలపించింది. ఆ మధ్యే నిర్మించారట ఆ స్టేషన్‌ని. టాంజియర్‌ నగరపు 21వ శతాబ్దపు ప్రతీకగా ఈ స్టేషన్‌ని చెప్పుకోవచ్చు. అక్కణ్నుంచి రబాత్‌కు, కసబ్లాంకాకూ వెళ్ళే అల్‌ బొరాక్‌ బాణీ హైస్పీడ్‌ రైలుబళ్ళున్నాయి. ఆఫ్రికా ఖండంలో మొట్టమొదటి సూపర్‌ఫాస్ట్ రైళ్ళట అవి.

స్టేషన్లోకి వెళ్ళేటపుడు సెక్యూరిటీ వాళ్ళు కోవిడ్‌ వాక్సినేషన్‌ సర్టిఫికేట్లు తనిఖీ చేశారు. లైన్లో నా ముందు పదీ పన్నెండు మంది నిలబడి ఉన్నా అయిదే నిమిషాల్లో నా వంతు వచ్చేసింది. టికెట్టు తీసుకొని పరిశుభ్రత ఉట్టిపడుతోన్న సరికొత్త కంపార్టుమెంటులోకి అడుగు పెట్టాను. ఇలాంటి రైళ్ళు మనిషికి ఆధునిక సాంకేతికత అందించిన వరప్రసాదాలు గదా అనిపించింది.

క్షణాల్లో రైలు వేగం పుంజుకొంది. కదలిక అన్న భావనే నన్ను ఎంతో ఉత్తేజపరుస్తూ ఉంటుంది. కదలికలోనే జీవలక్షణముంది. మన భూగోళం తిరగడం మానేస్తే మనమంతా ఏమైపోతాం?! ప్రపంచం స్థంభించిపోతుంది గదా! ఈ కదలిక, తిరగడం అన్న లక్షణం మనుషులందరిలోనూ నిక్షిప్తమై ఉన్న సామాన్య గుణమయి ఉండాలి; కొంతమందిలో ఎక్కువ, కొంతమందిలో తక్కువ. పరుగులు పెట్టే బస్సులోనో, రైల్లోనో కూర్చుని ముందుకు దూసుకుపోవడమన్నది నన్నెంతో సంబరపరుస్తూ ఉంటుంది. మళ్ళా విమానాల్లో వెళితే అలాంటి భావన కలగదు.

రైలు అట్లాంటిక్‌ తీరం వెంబడే దక్షిణ దిశలో సాగిపోయింది. అపుడపుడు దూరాన సముద్రం దోబూచులాడసాగింది. కంపార్టుమెంటులోని వాళ్ళంతా బుద్ధిగా శుభ్రంగా మర్యాదగా మంచి బట్టలు వేసుకొని కనిపించారు. నా పక్కనే ఉన్న ఒకరిద్దరితో మాట కలిపే ప్రయత్నం చేశాను. పడలేదు. ఎవరి పనుల్లో వాళ్ళు మహా బిజీగా కనిపించారు. తీరిగ్గా కబుర్లు చెప్పుకొనే సమయం వారికున్నట్టు లేదు. పైగా నా వాలకం, నా దుస్తులు, ప్రపంచమంతా తిరిగి తిరిగి అరిగిపోయిన బ్యాక్‌ప్యాకు ఇవన్నీ ఆ నాగరిక బృందంతో మాట కలపడానికి అవరోధమయి ఉండాలి. ఏదేమైనా చిన్న చిన్న ఊళ్ళల్లో, నింపాదిగా నడిచే రైళ్ళల్లో, గ్రాండ్‌ టాక్సీల్లో నేను చవిచూసిన శబ్దాలూ దృశ్యాలూ మట్టి పరిమళాలూ వేరు; ఈ హైస్పీడ్‌ రైల్లో గమనిస్తోన్న వాతావరణం పూర్తిగా వేరు. యాంత్రికతా వేగమూ పెరిగినకొద్దీ ప్రయాణాల్లో దొరికే అనుభవాలూ కలిగే అనుభూతులూ తగ్గుమొహం పడతాయి కాబోలు. ఈ హైస్పీడ్‌ రైళ్ళల్లో కొత్తవాళ్ళతో స్నేహంగా, సన్నిహితంగా మాట్లాడే అవకాశమే ఉండదా?!

సుమారు డెబ్భైఏళ్ళ వయసున్న ఓ రిటయిరయిన సివిల్‌ సర్వెంటు మర్యాద కోసం కాబోలు, నాతో మాట కలిపాడు. మెల్లగా సంభాషణ వేగమందుకుంది. తన పేరు నజీర్‌ అని చెప్పాడాయన. రబాత్‌లో ఎక్కడెక్కడికెళ్ళాలి, ఏమేం చూడాలి, ఏ ఏ రెస్టారెంట్లు బాగుంటాయి అన్న వివరాలు చెప్పాడు. ఆయనకు లండన్లో ఓ స్నేహితుడున్నాడట, పదేళ్ళ క్రితం తను లండన్‌ వచ్చాడట. ఆ వివరాలు ఎంతో ఉత్సాహంగా చెప్పుకొచ్చాడు. రబాత్ నింపాదిగా సాగిపోయే నగరమన్నాడు. మరాకేష్, ఫెజ్ నగరాల్లాగా హడావుడిగా సందడి సందడిగా ఉండదన్నాడు. ఆ రెండు నగరాల పురాసాంస్కృతిక సురాపానపు మత్తులో మునిగి తేలిన తర్వాత ఆ ప్రభావం నుంచి నాలాంటివాళ్ళు కాస్తంత సేదదీరడానికి రబాత్‌ బాగా ఉపకరిస్తుందన్నాడు. టూరిస్టులు రబాత్‌కేసి పెద్దగా మొగ్గు చూపకపోయినా శ్రద్ధగా వెదికితే రబాత్‌లో కూడా ఆణిముత్యాల సొగసులున్నాయన్నాడు. తన జీవితమంతా గవర్నమెంటు ఉద్యోగిగా రబాత్‌లోనే గడిపాడట. కసబ్లాంకా కూడా ముచ్చటైన నగరమన్నాడు. ఆయన చెప్పిన ముఖ్యమైన వివరాలు రాసిపెట్టుకొన్నాను. అవసరమయితే ఫోను చెయ్యమని నెంబరిచ్చాడాయన.

టాంజీర్‍ రబాత్‌ల మధ్య రెండొందల ఏభై కిలోమీటర్ల దూరం. నేనెక్కిన అత్యాధునిక అతివేగపు రైలుబండి ఆ దూరాన్ని గంటన్నరలో అధిగమించేసింది. దానికి నే తీసుకొన్న రెండో తరగతి టికెట్టు ధర నూట ఎనభై తొమ్మిది దిర్హమ్‍లు- అంటే సుమారు 19 యూరోలు. ఎలా చూసినా అంత చక్కని రైల్లో అంతంత దూరానికి ఆ ధర కారుచౌక అనే చెప్పాలి.


రబాత్‌ మొరాకో దేశపు రాజధాని. రబాత్ చేరుకోవడమూ అంటే ఆ దేశపు నాలుగు రాజధానీ నగరాలనూ నేను ఒక చుట్టు చుట్టినట్టన్నమాట. మరకేష్‌, ఫెజ్‌, మెకనెస్‌, రబాత్‌- ఈ నాలుగూ చరిత్రలో ఏదో ఒక సమయంలో మొరాకోకు రాజధానులుగా వ్యవహరించిన ప్రదేశాలే. 1912లో మొరాకో ఫ్రెంచివారి రక్షిత ప్రదేశం – ప్రొటెక్టరేట్‌ – అయ్యాక రబాత్‌ ప్రాభవం ఊపందుకొంది. మధ్యయుగాలనాటి పాతపట్నం వెలుపల ఒక అధునాతన నగరం పుట్టుకొచ్చింది. తీర్చిదిద్దిన రోడ్లు, వాటికి రెండు పక్కలా చెట్ల వరుసలు, ఫ్రెంచి బాణీ అధునాతన కొలీనియల్‌ భవనాలు- సరికొత్త పట్నం ఆవిర్భవించింది. స్వాతంత్య్రం వచ్చాక రబాత్‌ మొరాకో దేశపు రాజధానిగా ప్రకటించబడింది. అప్పటిదాకా ఫ్రాన్సూ మడగాస్కర్లలో ప్రవాసజీవితం గడిపిన సుల్తాన్‌ అయిదో మహమ్మద్‌ స్వాతంత్య్ర సాధనా ప్రయత్నాలు ఫలించాక 1955లో దేశానికి తిరిగి చేరాడు.

నిర్దేశించిన సమయానికే రైలు రబాత్‌లోని అగ్డెల్‌ స్టేషను చేరుకొంది. చూడగానే అది కొత్తగా కట్టిన స్టేషననిపించింది. వెంటనే టాక్సీ చేసుకొని నేనుండబోయే హోటల్‌ బెలెయర్‌ చేరుకొన్నాను. ఆ దేశపు రాజప్రాసాదానికి దగ్గర్లోనే ఉందా హోటలు.

రిసెప్షన్లో ఊరి మ్యాపు ఒకటి అడిగి పుచ్చుకొని నగరశోధన ఆరంభించాను. పాతపట్నపు అవతలికొసన ఉన్న హసన్‌ టవర్‌ నా మొట్టమొదటి లక్ష్యం. ‘బాగా దూరం, టాక్సీ తీసుకో’ అని సలహా ఇచ్చారు అక్కడివాళ్ళు. సరే చూద్దాం అని రోడ్డు మీద బిరబిరా సాగిపోతోన్న టాక్సీలను ఆపే ప్రయత్నం చేశాను. ఒక్క టాక్సీ కూడా నన్ను పట్టించుకోలేదు. నా అవస్థ గమనించిన ఒక పోలీసాయన సాయం వచ్చాడు. ఆయన చెయ్యి ఊపీ ఊపగానే ఏదో మంత్రించినట్టు రెండు టాక్సీలు వచ్చి వాలిపోయాయి. మరో ఆలోచన లేకుండా అందులో ఒకదాంట్లో ఎగిరి దూకాను. పోలీసాయనకు థాంక్స్‌ చెప్పడం మర్చిపోలేదు. ఇరవైనిమిషాల్లో టాక్సీ నన్ను హసన్‌ టవర్‌ చేర్చింది.

టాక్సీ దిగగానే అజీజ్‌ అన్న గైడు తటస్థపడ్డాడు. ఆ ప్రదేశమంతా తిప్పి చూపిస్తానన్నాడు. మృదువుగానే తిరస్కరించే ప్రయత్నం చేశాను. ‘కోవిడ్‌ మొదలయిన తర్వాత ఇల్లు గడవడం కష్టమయిపోయింది’ అని వాపోయాడతడగాడు. ఆ మాట వెంటనే నా మనసును తాకింది. నిజమే! కోవిడ్‌ తాకిడికి విలవిలలాడని కుటుంబం లేదు. ప్రపంచంలోని అన్ని ప్రాంతాలూ దాని బారిన పడి గిజగిజలాడినవే. అలాంటి విపరీత పరిస్థితుల్లో ఒకరికొకరు చేయూతనిచ్చుకోవడం మన కనీస కర్తవ్యం అనిపించింది. మరో మాటలేకుండా అడిగినంత మొత్తానికి ఒప్పుకొని అజీజ్‌ను గైడ్‌గా తీసుకొన్నాను. కాసేపట్లోనే అది చాలా మంచి నిర్ణయమని బోధపడింది. అరగంట గడిచేసరికల్లా ఆ ప్రదేశం గురించి ఎన్నో కథలూ గాథలూ చెప్పి దాని చరిత్రను సజీవంగా కళ్ళముందు నిలిపాడు అజీజ్‌.

బౌ రెగ్రెగ్‌ అన్న నది ఎడమ ఒడ్డున ఒక విశాలమైన స్థలంలో విస్తరించి ఉందా హసన్‌ టవర్‌ ప్రాంగణం. నలభై నాలుగు మీటర్లు ఎత్తున్న పన్నెండో శతాబ్దానికి చెందిన ఆ అసంపూర్ణ నలుచదరపు బురుజును రబాత్‌ నగరపు పురాప్రతీక అనవచ్చు. అల్‌ మొహద్‌ వంశపు యాకుబ్‌ అల్‌ మన్సూర్‌ అన్న ప్రభువు ఆ కట్టడాన్ని ప్రపంచంలోకెల్లా ఎత్తయిన మినరెట్‌గానూ, దాన్ని పొందుపరచుకొని ఉన్న మసీదును ప్రపంచంలోకెల్లా అతి పెద్ద మసీదుగానూ రూపొందించాలని కలగన్నాడు. నిర్మాణానికి ఉపక్రమించాడు. ఆయన మరణించగానే ఆ పనులు ఆగిపోయాయి. పూర్తయిన కొద్దిపాటి నిర్మాణాలూ 1775 నాటి గ్రేట్‌ లిస్బన్‌ భూకంపంలో నేలమట్టమయ్యాయి. అయినా ఇప్పటికీ ఆ నలుచదరపు కట్టడపు ప్రాంగణంలో వేరువేరు ఎత్తుల్లో ఉండే మూడు వందల స్థంభాలు మనకు కనిపిస్తాయి. నలభై నాలుగు మీటర్ల హసన్‌ టవర్‌ అప్పటి చరిత్రకు సాక్షిగా ఇప్పటికీ నిలబడి ఉంది. ఒక శక్తివంతమైన ప్రభువు ఎనిమిది శతాబ్దాల క్రితం కన్న భగ్నస్వప్నానికి ప్రతీకగా మిగిలి ఉంది. ఆయన కల నిజమయి ఉంటే ఆ మసీదు ఆనాటి మసీదుల్లో ప్రథమస్థానం కాకపోయినా ద్వితీయ స్థానం ఖచ్చితంగా పొంది ఉండేది. ఆ కాలానికే చెందిన ఇరాక్‌ దేశంలోని సమారా నగరపు మసీదు అప్పటి ప్రపంచంలోకెల్లా పెద్దదయిన మసీదట.

ఆ పూర్తిగాని మసీదు పక్కనే రెండు పాలరాతి సమాధి గృహాలు ఉన్నాయి. అందులో ఒకటి దేశానికి స్వాతంత్య్రం సంపాదించడంలో కీలక భూమిక నిర్వహించిన అయిదో మహమ్మద్‌ సుల్తాన్‌ది. రెండోది ఆయన తండ్రిది. వీరిద్దరు ప్రస్తుత పాలకుడు ఆరో మహమ్మద్‌ తండ్రీ తాతలు. ‘ఇవే మా దేశపు తాజ్‌మహళ్ళు’ అన్నాడు గైడ్‌ అజీజ్‌. మేము వెళ్ళిన సమయంలో అవి తెరచిలేవు. అంచేత లోపలికి వెళ్ళి చూడలేకపోయాము. అలాగే ఆ అసంపూర్ణ మసీదు ప్రాంగణం కూడా కోవిడ్‌ జాగ్రత్తల దృష్ట్యా సందర్శకులకు నిషిద్ధమట. అంచేత నది ఒడ్డునే నిలబడి దానిని చూశాం. ఆ ప్రాంతమంతా ఎంతో సుందరంగా తోచింది. నదికి అటూ ఇటూ విరివిగా పూలమొక్కలు. కాస్త దూరాన ఏదో ముందు కాలాలకోసం కడుతున్నట్టున్న ఫ్యూచరిస్టిక్‌ స్టేడియం, నిర్మాణంలో ఉన్న ఆకాశంలోకి ఎగిసిపోతోన్న మరో మెగాటవర్‌. పూర్తయినపుడు అది మొరాకో దేశంలోకెల్లా ఎత్తయిన భవనమవుతుందన్న వివరం అందించాడు అజీజ్‌.

నాకు రైల్లో కలసిన నజీర్‌ ఇచ్చిన సలహా ప్రకారం, రబాత్ నగరమంతా కాలినడకన తిరుగుతాను అని అజీజ్‌కు చెప్పాను. ఆశ్చర్యపోయాడు. ఆ ఆలోచన విరమించేలా నన్ను ఒప్పించే ప్రయత్నం చేశాడు. చాలా చాలా దూరం నడవాలి అన్నాడు. మరేం ఫర్లేదు, నా దగ్గర బోలెడంత సమయముంది అన్నాను. ఊరును పరిపూర్ణంగా పరిచయం చేసుకోడానికి అక్కడి సందుగొందుల్లో దారితప్పడమే నేను ఎప్పుడూ ఎన్నుకొనే మార్గం అని వివరించాను. అర్థం చేసుకొన్నాడు. కస్బా ప్రాంతానికి ఎలా వెళ్ళాలో దారి వివరించాడు. ఆ ఊళ్ళో ఒంటరిగా కాలినడకన తిరగడంలో ఏ రకమైన ఇబ్బందీ ఉండదని, ప్రమాదమన్న ప్రశ్నే లేదనీ చెప్పాడు. అలా అలా సాగిపోయి చక్కని భవనాలు, ఆకర్షించే సౌధాలు, గృహ సముదాయాలు, దుకాణాలు చూసుకుంటూ నడిచాను. దారిలో ఫ్రెంచి బాణీలో కట్టిన బృహదాకారపు కెథెడ్రల్ ఒకటి కనిపించింది. ఊళ్ళో బాగా విస్తరించి ఉన్న ట్రామ్‌ నెట్‌వర్క్‌ కనిపించింది. ప్రజలకు స్థానిక రవాణా సౌకర్యం బాగా అందుబాటులో ఉందన్నమాట. అలాగే అక్కడ కనిపించిన పోస్టాఫీసు భవనం నన్ను బాగా ఆకట్టుకొంది. ఆర్ట్‌డెకో అనే ఫ్రెంచి వాస్తుశిల్పపు బాణీని మొరాకో బాణీతో మేళవించి కట్టిన భవనమది.

ఆ పాత పట్నపు ప్రాకారం నుంచి ఒక పెద్దపాటి దర్వాజా దాటుకుని బయటపడ్డాను. బయట నుంచి కోటగోడకేసి చూస్తే దాని పైభాగాన ఆయుధ ప్రయోగం కోసం కోటగోడలో ఏర్పాటు చేసిన రంధ్రాలు స్పష్టంగా కనిపించాయి. అక్కడే డర్‌నాజ్‌ అన్న సంప్రదాయ వంటకాలు దొరికే రెస్టారెంటు కనిపించింది. భోజనానికి నజ్‌ర్‌ సిఫార్సు చేసిన రెస్టారెంటది.

రెస్టారెంటు లోపలికి నడిచేసరికి మధ్యాహ్నం మూడయింది. నడచి నడచి అలసిపోయి ఉన్నాను. బయటంతా ఎండతాకిడి. ఆ అలసట నుంచీ ఎండ నుంచీ కాపాడే అభయగృహం అనిపించిందా డర్‌నాజ్ రెస్టారెంటు. భోజనంవేళ గడిచిపోయినా ఇంకా నింపాదిగా భోజనాన్ని ఆస్వాదిస్తోన్న ఆ ఊరి కుటుంబాలు ఎన్నో కనిపించాయక్కడ. ఆ రెస్టారెంటు అలంకరణ ఎంతో శోభాయమానంగా అనిపించింది. అక్కడి స్పెషల్‌ వంటకం చికెన్‌ టజీన్‌నూ, తాజా నారింజ రసాన్నీ తీసుకురమ్మని వెయిటర్‌కు చెప్పాను. టజీన్‌ను భుజించడం అన్నది నాకు బాగా ఇష్టమయిన పని అయిపోయింది. నిజానికి టజీన్‌ అన్నపదం ఏదో ఒక ప్రత్యేకమైన వంటకానికి చెందిన నామవాచకం కాదు; ఒకే బాణీకి చెందిన విభిన్న వంటకాలకు చెందిన సర్వనామం.


నగరపు ప్రాకారం వెంబడే నా నడన కొనసాగించి సాగరతీరాన ఒక కొండ మీద ఉన్న కస్బాకేసి వెళ్ళాను. అక్కడికి చేరేలోగానే అతి దగ్గరలో కనిపించి వినిపిస్తోన్న పెద్దపెద్ద సముద్రపుటలలు నన్ను రారమ్మన్నాయి. ఏదో మంత్రం వేసినట్టు అటువేపుకు మళ్ళాను. రోడ్డుకు రెండువైపులా వేలాది సమాధులున్న స్మశానవాటికలు కనిపించాయి. సముద్రపుటొడ్డున చల్లని సాగర సమీరాన్ని అనుభవిస్తూ పరవశిస్తోన్న కుటుంబాలు చాలా కనిపించాయి. అలాగే ఆ ఊరికి చెందిన యువకుల బృందమొకటి అక్కడ కనిపించింది. వెళ్ళి వాళ్ళను పలకరించాను. యథాప్రకారం బాలీవుడ్‌ సినిమాలు, మొరాకో రాజవంశం, ఆ దేశపు జీవన సరళి మా మాటల్లో దొర్లాయి. తెలియని ప్రదేశాల్లో యువకుల బృందం కనిపిస్తే ఎవరికైనా కాస్తంత బెరుగ్గా అనిపించడం కద్దు. కానీ వీళ్ళ విషయంలో నాకు అలాంటి భావన కలగలేదు. వాళ్ళంతా ఎంతో స్నేహంగా మాట్లాడారు.

వాళ్ళల్లో ఫాహద్ అనే అతని ఇల్లు కస్బాలో ఉందట. బాగా సాయంత్రం అయిపోతే పర్యాటకుల్ని కస్బాలోకి అనుమతించరని, తనతోపాటు వస్తే తానే ఆ ప్రాంతమంతా తిప్పి చూపించగలననీ అన్నాడు ఫాహద్. తనూ తన స్నేహితులూ ఇలా పరదేశీలకు కస్బా ప్రాంతం చూపించి పాకెట్‌ మనీ సంపాదించుకొంటామని చెప్పాడు. ఇక్కడి కస్బా పూర్తిపేరు కస్బా ఉదయ. 1195లో నిర్మించిన ఉదయాగేట్‌ అన్న వైభవోపేతమైన మూరిష్‌ దర్వాజా గుండా కస్బాలోకి ప్రవేశించాం. భారీ చెక్క తలుపులు, రాతిలో చెక్కిన కళారూపాలు-చూడ్డానికి ఎంతో బావుంది ఆ ఉదయాగేట్‌. కాస్త ముందుకు వెళితే ఆకట్టుకొనే మినరెట్‌ ఉన్న ఒక అందమైన మసీదు కనిపించింది.

కస్బా ఉదయ వెయ్యేళ్ళ నుంచీ ఉనికిలో ఉందని, ఆ ప్రాంతం చుట్టూ కోటగోడ ఉందనీ వివరించాడు ఫాహద్. అందమైన ఇళ్ళకూ వంపుసొంపుల వీధులకూ ఈ కస్బా ప్రసిద్ధి అన్నాడు. దిట్టమైన ప్రాకారం, దుర్భేద్యమయిన దర్వాజాలు, కాలం తెచ్చే మార్పులకు లొంగని జీవనసరళి- అదో విభిన్న ప్రపంచం. వంపులు తిరిగే అక్కడి వీధి మమ్మల్ని ఓ గుట్ట మీదకి చేర్చింది. ఆ గుట్టమీద సమతల ప్రదేశముంది. అక్కడ ఉన్న వ్యూయింగ్‌ ప్లాట్‌ఫామ్ మీద నిలబడి చుట్టూ చూస్తే అట్లాంటిక్‌ సాగరపు సువిశాల దృశ్యం కళ్ళముందు పరచుకొంది. దానితోపాటు బౌ రిగ్రెగ్‌ నది సాగరసంగమ బిందువు, రబాత్ సాలె ప్రాంతాల భవనాలు నింగిలో కలిసే రేఖలు- ఎంత చూసినా తనివి తీరని దృశ్యాలవి. నదీ ముఖానికి అవతలి వేపునే సాలె నగరముంది. సాలె కోర్సియస్‌ అన్న ఘనత వహించిన సాగరచోరుల రాజధానీ నగరమది. జిబ్రాల్టర్‌ జలసంధిలో తటస్థపడే యూరోపియన్‌ నౌకలను దోచుకోవడం, ఆ నావికులను బంధించి వాళ్ళను మొరాకోలోనూ, ఇతర ఉత్తర ఆఫ్రికా తీరప్రాంతాలలోనూ బానిసలుగా అమ్మడం-అదీ ఆ సాగరచోరుల వృత్తివ్యాపకం. అప్పటి మొరాకో ప్రభువు సుల్తాన్‌ మౌలె ఇస్మాయిల్‌ ఒక చేత్తో ఈ సాగరచోరులను అదుపులో ఉంచుతూనే మరోచేత్తో వారు పట్టి తెచ్చే యూరోపియన్‌ బానిసల ముఖ్యమైన కొనుగోలుదారుగానూ వ్యవహరించాడు!

అక్కడి వాతావరణాన్నీ ఆ సోయగాలనూ మనసులోకి ఇంకించుకొంటూ ఆ వ్యూయింగ్‌ ప్లాట్‌ఫామ్ మీద కాసేపు గడిపాక ఫాహద్‍తో కలసి మెల్లగా గుట్టమీద నుంచి దిగాను. కస్బా ఉదయ చారిత్రక నేపథ్యం పుణ్యమా అని అది ఎన్నెన్నో జాతులవారి నివాసకేంద్రమని చెప్పుకొచ్చాడు ఫాహద్. రాజుల కాలంలో బానిసలుగా వచ్చి చేరిన ఆఫ్రికన్లూ యూరోపియన్లూ ఒక పక్కన, స్థానిక బెర్బర్లూ ఆసియా ఖండపు అరబ్బులూ, ఇప్పటి కాలపు యూరోపియన్లూ ఆఫ్రికన్లూ మరో పక్కనా – వీటన్నిటి ఫలితంగా ఆ చిన్న ప్రపంచం ఒక నానాజాతి సమ్మేళనంగా పరిణమించిందని వివరించాడు. తనకేసే చూపించుకొని, ‘అసలు నా లోపలే ఎన్నో జాతుల రక్తం ప్రవహిస్తూ ఉండి ఉంటుంది’ అన్నాడు.

గంటసేపు అలా కస్బా వీధుల్లో తీరిగ్గా నడిచాక ఒక మేడమీది రెస్టారెంటుకు తీసుకువెళ్ళాడు ఫాహద్. మింట్‌టీతో పాటు అక్కడే దొరికే తీపి తినుబండారాలు తెప్పించాడు. వాటిని చూడగానే నోరూరింది. రెండుమూడు నోట్లో వేసేసుకున్నాను.

టీ తాగడం ముగిశాక ఫాహద్‍కు మంచి మొత్తమే టిప్పుగా ఇచ్చి గుడ్‌బై చెప్పాను. మెల్లగా నగరంలోకి సాగాను. అప్పటి దాకా ఆ ఊరి మదీనాలోకి వెళ్ళే అవకాశమే దొరకలేదు. మొరాకోలో ఏ నగరానికి వెళ్ళినా ఆ నగరపు మదీనాను చూడకపోతే ఆ వెళ్ళి రావడమన్నది అసంపూర్ణం. ఆ మదీనాలన్నీ వాటి పక్కన మొలుచుకొచ్చిన కొత్తపట్నాల అధునాతనతనూ, ఆయా ఆకాశహర్మ్యాల్నీ సవాలు చేస్తున్నట్టుగా కనిపిస్తాయి నాకు. బయటవాళ్ళనే గాకుండా స్థానికుల్ని కూడా తమవైపుకు బలంగా ఆకర్షించే శక్తివంతమైన అయస్కాంతాలవి. సాయంత్రం ఆరున్నర గంటలవేళ తమతమ దైనందిన కార్యకలాపాలతో కళకళలాడే ఆ మదీనాలలో తిరుగాడటం అంటే అదో శ్రవ్యదృశ్య విందు భోజనమే.

ఇతర మదీనాలలాగానే రబాత్‌ మదీనా కూడా తనదైన విలక్షణ శోభతో నా కళ్ళముందు పరచుకొంది. తనివి తీరేదాకా ఆ ప్రాంతంలో గడిపాను. వీధులన్నీ విశాలంగా ఉన్నాయి. షాపులన్నీ కొనుగోలుదార్ల కిటకిటలు లేకుండా ఆహ్లాదకరంగా అనిపించాయి. వాటివాటి అలంకరణలు కూడా తమవైన విలక్షణతో ఆకట్టుకున్నాయి.

తిరిగి హోటలుకు వెళ్ళేటపుడు ఆ దేశపు పార్లమెంటు భవనము, సాయుధ రక్షకుల పర్యవేక్షణలో ఉన్న రాజప్రాసాదమూ కనిపించాయి. ఎడతెగని నడకలతో గడిచిన రోజది. రబాత్‌ నగరాన్ని నడకరాయుళ్ళ స్వప్నసీమ అనవచ్చు. నగరంలో తిరుగుతోంటే ఆత్మీయంగా అనిపిస్తుందే తప్ప సంభ్రమాశ్చర్యాలు, మనమీద నగరం వాలిపోయి ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న భావన కలగనే కలగవు.


మర్నాడు పొద్దున్నే అగ్దెల్‌ రైల్వేస్టేషను చేరుకొని ఉదయం తొమ్మిదీ ఇరవై అయిదుకు, కాసాబ్లాంకాకు బయల్దేరే రైలుకు టికెట్టు తీసుకొన్నాను. ప్లాట్‌ఫామ్ మీదకు వెళ్ళి ఒక చివర నిలబడి రాబోతోన్న రైలుకోసం ఎదురుచూడసాగాను. అది గమనించిన ఒక పెద్దాయన ‘మీదే కంపార్టుమెంటూ?’ అనడిగాడు. టికెట్టు తీసి చూసి ఏడో నెంబరు అని చెప్పగా, ఆ కంపార్టుమెంటు ప్లాట్‌ఫామ్‌కు అటు చివర వస్తుంది అని చెప్పాడు. దూరాన బిరబిరా వస్తోన్న రైలు కనిపించేసరికి నేను ప్లాట్‌ఫామ్ అవతలికొనకేసి చెకచెకా అడుగులు వెయ్యసాగాను. అలా కాసేపు నడిచావో లేదో వెనక నుంచి మాన్సూర్‌, మాన్సూర్‌ అన్న పిలుపులు వినబడ్డాయి. ఆ పిలుపు నాకెందుకవుతుందీ అనుకొని నా చెకచెకలు కొనసాగించాను. ఎందుకో అనుమానం వచ్చి వెనక్కి తిరిగి చూస్తే ఒక నలభై ఏళ్ళ మహిళా, ఆమె టీనేజి కూతురూ నాకేసి పరుగు పరుగున రావడం కనిపించింది. గుండె గుభేలుమంది. తెలిసీ తెలియక ఆ మహిళలను కలవరపరిచే తప్పిదం ఏమన్నా చేశానా అని బిత్తరపోయాను. స్థానిక సంస్కృతీ సంప్రదాయాలను అతిక్రమించే పని ఏమీ చెయ్యలేదు గదా అన్న భీతి మొలకెత్తింది. నాకు చేరువయిన ఆ టీనేజి పాప తన చేతిలోని నోట్ల కట్టను నాకు చూపించింది. ఇవి నీవే అని సూచించింది. కాసిన్ని వంద దిర్హం నోట్లు ఉన్న కట్ట అది. ఇందాక జేబులోంచి టికెట్టు తీసినపుడు పడిపోయిందన్నమాట.

ప్రాణం తెరిపినపడింది. తెలిసీ తెలియక ఆ మహిళలను అగౌరవపరిచే ఏ పనీ చెయ్యలేదన్న ఎరుక గొప్ప ఉపశమనం కలిగించింది. నా డబ్బులు నాకు చేరినందుకు కాస్తంత అదనపు సంతోషమూ కలిగింది. వేరే దేశం వెళ్ళినపుడు అక్కడి సంస్కృతీ సంప్రదాయాల తెలుసుకోవడం, వాటికి భంగం కలగకుండా వ్యవహరించడం ఎంతో అవసరం. అదే సమయంలో ఎంతో సంప్రదాయకంగా వ్యవహరించే దేశాల్లో కూడా విదేశీ యాత్రికుల విషయంలో పట్టు విడుపులు ఉంటాయన్నది నా ఎరుకలోకి వచ్చిన విషయం.

నేనెక్కిన అల్‌ బొరాక్‌ రైలుబండి అట్లాంటిక్‌ సాగరతీరం వెంబడే పరుగులు పెట్టింది. నా పక్కనే కూర్చున్న ఫరూక్‌ అన్న పెద్దమనిషి అందరు సాధారణ మొరాకన్ల మాదిరే సంభాషణ మొదలెట్టాడు. ఈ దేశపు సగటు పౌరులందరిలోనూ ఇలా భేషజాలు లేకుండా సంభాషించడం అన్న సుగుణం కనిపిస్తుంది. భారతీయుల్ని తమకు ఎంతో దగ్గరివాళ్ళుగా భావిస్తారు వీళ్ళు. బహుశా బాలీవుడ్‌ సినిమాలు అందుకు కారణం కావచ్చు. అమితాబ్‌ బచ్చన్‌, షారుఖ్‌ ఖాన్‌లాంటి సినీ ప్రముఖులు ఇక్కడ అందరికీ సుపరిచితం.

స్థానిక రాజకీయాల గురించి కబుర్లాడటం మొదలెట్టాడు ఫరూక్‌. ఆ మధ్యే కొత్త ప్రభుత్వం ఏర్పడిందట. రబాత్, కసబ్లాంకాల్లో అతనికి వ్యాపార వ్యవహారాలున్నాయట. ఈ అల్‌ బొరాక్‌ సూపర్‌ఫాస్ట్‌ రైలుబళ్ళ గురించి ఎంతో అభిమానంతో మాట్లాడాడు. ‘గంటకు మూడొందల ఇరవై కిలోమీటర్ల వేగం’ అంటూ సగర్వంగా చెప్పుకొచ్చాడు. సూపర్‌ఫాస్ట్‌ కోవకే చెందిన అల్‌ అట్లస్‌ రైళ్ళతో పోలిస్తే ఈ అల్‌ బొరాక్‌ బళ్ళు మరీ వేగవంతమయినవి. రబాత్, కసబ్లాంకాల మధ్య ప్రయాణ సమయాన్ని బాగా తగ్గించాయివి. వంద కిలోమీటర్ల దూరాన్ని గంటలోనే దాటుకొని కాసాబ్లాంకా చేరుకొంది మా రైలు.

(రాబోయే చిట్టచివరి భాగం: కాసాబ్లాంకా నుంచి మరకేష్‌)