ఫిబ్రవరి 2022

ఒక భాషకు చెందిన సాహిత్యం, ప్రత్యేకించి ఒక కాలానికి చెందిన సాహిత్యం కొన్ని సారూప్యాలను కలిగి ఉండటం గమనిస్తాం. అది కొన్ని విభజనలకు లోబడే రీతిలో కొన్ని ధోరణులను ప్రస్ఫుటంగా వ్యక్తపరుస్తూ ఉంటుంది. ఈ ధోరణులను దాటి రాసే అరుదైన సాహిత్యకారులు ఉంటే ఉండవచ్చు గాక. కాని, సమకాలీన సామాజిక ధోరణులు, సమకాలీన ప్రసిద్ధ సాహిత్యకారుల దృక్పథాలు, చాపకిందనీరులా ఒక భాష సాహిత్యాన్ని ప్రభావితం చేస్తాయనడం అతిశయోక్తి కాదు. నిలవనీరులా సాహిత్యమిలా పాతబడే సందర్భాల్లో అనువాదసాహిత్యపు అవసరం స్పష్టమవుతుంది. ఒకే కాలానికి చెందిన, ఒకే నేలకు చెందిన మనుషులు, మరొక భాషలో, మరొక ప్రాంతంలో చేస్తున్న ప్రయోగాలను, వేస్తున్న ముందడుగులను చూపెడుతుంది. పరభాషల రచయితలు తమ తమ జీవనవాస్తవికతను సాంస్కృతిక వారసత్వాన్ని ఎలా నిలబెట్టుకుంటున్నారో గమనించే వీలిస్తుంది. వేరే వేరే సంస్కృతులు, వాతావరణాలలోని మనుషుల మధ్యనున్న భిన్నత్వాన్నీ ఏకత్వాన్నీ కూడా మిగతావారికి పరిచయం చేస్తుంది. అందువల్ల ఒక భాషలోని సహజ సాహిత్యం ఎంత ముఖ్యమో అనువాదసాహిత్యం కూడా అంతే ముఖ్యం. ఇలా ప్రపంచభాషలనుంచి ప్రోదిపడ్డ అనువాదాల వల్ల ఆంగ్లసాహిత్యం ఎంత పరిపుష్టమయిందో వేరుగా చెప్పక్కర్లేదు. అయితే, ఇది కేవలం రాశికే సంబంధించిన విషయం కాదు కనుక, అనువాదకులు కూడా తమ పని పట్ల ఆ గౌరవాన్ని, జాగ్రత్తని కలిగి ఉండాలి. కేవలం రెండు భాషలూ అర్థమవుతాయన్న మాట దగ్గర ఆగిపోకుండా, రెండు భాషలలోని నుడికారాన్ని ఆకళింపు చేసుకోవాలి. రెండు భాషలలోని వ్యావహారిక పదాలను, జాతీయాలను, వాడుకలో పదాలకున్న భిన్నార్థాలను తెలుసుకోవాలి. ఆపైన మూలభాషలోని సహజత్వాన్ని అనువాదభాషలోకి అంతే సహజంగా తేవాలి. మూలంలోని వాక్యాన్ని అనువాదభాషలోకి అలాగే తేవడం కృతకమైన పని. ఎందుకంటే మూలం ఏదైనా, అనువదించబడ్డాక అది ఆ భాషాసాహిత్యం అవుతుంది. అందువల్ల ఆ అనువాదం తెలుగులోకి అయితే అది తెలుగు భాష, వ్యాకరణం, నుడికారాలతో అలరారవలసిందే. కొన్ని రచనలు కేవలం తెలుగులో చెప్పబడతాయి. మరికొన్ని కథావస్తువులు తెలుగు నేల, సంస్కృతిలో ప్రతిక్షేపించబడతాయి. మూలానికి విధేయత అంటే, ఏ పదానికాపదం తెలుగులో చెప్పడం కాదు, మూలరచన ఉద్దేశ్యాన్ని మార్చకపోవడం, అదేసమయంలో మూలరచన ధ్వనినీ అనువాదభాషలోకి తేగలగడం. ఆ దృష్టితో చూసినప్పుడు, సృజనాత్మకత పరంగా, అనువాదసాహిత్యం సహజసాహిత్యానికేమాత్రమూ తక్కువ కాదు. ఇంటర్నెట్ వల్ల ఇప్పుడు ఇతర భాషల ఉచ్చారణ, వాడుక, భిన్నార్థాలవంటివి అందరికీ అందుబాటుకొచ్చాయి. ఆ రకంగా, అనువాదకుల విషయవస్తు సేకరణ సాంకేతికత వల్ల కొంత సులభమైన మాట నిజమే అయినా, మూలభాషలోని సాహిత్యరీతికి సరిపోయిన వ్యక్తీకరణను అనువాదభాషలోకి తేవడమన్న కష్టం నిత్యనూతనమైనదే. పైపెచ్చు, సృష్టిలో సృజనకారులకు ఉన్న వెసులుబాటు ప్రతిసృష్టిలో ఉండదు. అందువల్ల, సృష్టి ప్రతిసృష్టి రెండూ శ్రమపూరితాలే అయినా అనువాదకుల పని మరింత కష్టమైనది, వారి బాధ్యత మరింత గురుతరమైనది. ఇది కేవలం అనువాదకులే కాదు, పాఠకులు, ప్రచురణకర్తలూ గమనించాలి. మూలరచయితతో పాటు అనువాదకుల పేర్లనూ పుస్తకాలపై ప్రముఖంగా ప్రచురిస్తూ, ఈ ప్రక్రియకూ సముచిత గౌరవాన్నివ్వడం, సాహిత్య సమాజపు కనీస కర్తవ్యం.