పిల్లిమొగ్గ

దర్భంగాకు చెందిన రామ్‌లవన్ పాండేని సగాదియాసహీకీ చెందిన జగా పాలే చిత్తుగా ఓడించి ఆలిండియా కుస్తీ పోటీల ఫైనల్స్‌కి చేరినపుడు బారాబతి స్టేడియం హర్షధ్వానాలతో మారుమోగి పోయింది. అది జగా గెలుపుగా కాక, ఒరిస్సా గెలుపుగా జనం వెర్రెత్తిపోయి పండగ చేసుకున్నారు.

జగా క్షణాల్లో ఒరిస్సా ప్రజల ఆశాజ్యోతి అయిపోయాడు. ఎన్నడూ ఎవరూ పట్టించుకోని, అసలు ఎవరికీ తెలియని జగాని చూడ్డానికి జనం విరగబడ్డారు. తొక్కిసలాట జరిగి కొందరు గాయపడ్డారు. ఇరవై మంది దాకా ఆస్పత్రిలో పడ్డారు. పరిస్థితి అదుపు తప్పి పోలీసుల్ని దింపాల్సి వచ్చింది. బట్టలు చిరిగిపోయి, వాచీలు, పెన్నులు పోగొట్టుకుని, ఒంటి మీద దెబ్బలతో వాపులతో ఇంటికి చేరిన వాళ్ళు దెబ్బలకు బాధపడకపోగా, ఒరిస్సా పౌరులైనందుకు గర్వపడ్డారు. ఒక్కొక్కరూ తామే జగా పాలే అయినట్టు వూగిపోయారు. ఒక రకమైన నిషా ఆవహించింది వాళ్ళని.

ఇక వార్తాపత్రికలైతే కుస్తీ పోటీ ఫొటోలతో నిండిపోయాయి. ఒరియా వీరుడు, ఒరిస్సా విజయ పతాక, సాటి లేని ధీరుడు, క్రీడా చక్రవర్తి అని జగా పాలేని వర్ణిస్తూ వార్తలు వెల్లువెత్తాయి.

పోటీ చూడలేకపోయినవాళ్ళు తమ దురదృష్టాన్ని తిట్టుకున్నారు.

ఆ తర్వాత వారమంతా జగా పాలే వారంగా ప్రకటించేశారు. బస్సుల్లో హోటళ్ళలో, ఒకటేమిటి, నలుగురు గుమిగూడిన ప్రతి చోటా జగా గురించే చర్చ. మార్స్ మీదికి మనిషి అడుగు పెట్టిన వార్త, ప్రముఖుల మరణ వార్తలు, వేటికీ ప్రాముఖ్యం లేకుండా పోయింది. ఎవరూ వాటిని పట్టించుకోలేదు. జగాయే పెద్ద వార్త ఇపుడు. వచ్చే ఏడాది పెళ్ళి ముహూర్తాలు లేకపోవడంతో, ఈ పోటీ జరిగిన తరువాత రెండువారాలలో ఎన్నో పెళ్ళిళ్ళు జరిగేయి. అన్ని పెళ్ళిమండపాల్లోనూ జగా గురించే చర్చ జరిగింది.

పోటీ చూడలేకపోయిన వాళ్ళు కూడా, అది బయటికి చెప్పి చిన్నబుచ్చుకోవడం ఇష్టం లేక ‘అవును, పోటీ చూశాం, ఎంత బాగుందో’ అని చెప్పుకోడం మొదలెట్టారు.

కుస్తీ పోటీని, జగా విజయాన్నీ వర్ణిస్తూ కవి ఆబిద్ రాసిన ఒక ఐదు పేజీల బుల్లి పుస్తకాన్ని పది పైసలకు రైల్వే స్టేషన్లో, బస్టాండ్లో అమ్మారు. కుస్తీ పోటీ ఫోటోలు మార్కెట్లో హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. నగరంలోని సామాజిక సంఘాలు, మహిళా యువజన సంఘాలన్నీ జగాని అభినందిస్తూ తీర్మానాలు చేశాయి.

తన గురించి ఇంత హడావుడి జరుగుతున్నా, జగా మాత్రం రోజులాగే వ్యాయామం చేసి, తన రోజువారీ వృత్తి–గోడౌనులో బస్తాలు మోయడానికి వెళ్ళాడు.

పదిహేనేళ్ళ వయసులో తండ్రి ఉద్ధవ్ పాలే చనిపోయిన నాటి నుంచి అదే అతని వృత్తి. ఉద్ధవ్ న్యుమోనియాతో చనిపోయాడు. దాన్ని నయం చేసుకోడానికి నానా తంటాలూ పడ్డాడు పాపం. దెయ్యం పట్టిందేమో అని వదిలించుకోడానికి మొహమ్మదియా బజారులో ఉండే ఛోటా మియా దగ్గరకు వెళ్ళాడు. ఆయుర్వేద వైద్యుడు గోవింద ఘడే రూపాయి ముప్పావలా తీసుకుని నాలుగు రకాల మందులు ఇచ్చాడు. బుధవారం రోజు ఆవులకు పద్ధెనిమిది మోపుల గడ్డి తినిపించి మట్టిరోడ్డు మీద దుమ్ములో పడుకోవాలని కరుణా గోసాయి సాధువు చెప్తే అదీ చేశాడు. ఇన్ని చేసినా, న్యుమోనియాకి మానవాళి మందు కనుక్కోకముందే ఉద్ధవ్ చనిపోయాడు.

తల్లి, ఇద్దరు తోబుట్టువులతో జగా ఒంటరిగా నిలబడ్డాడు.

ఒక పూరి గుడిసె, ఊరి మధ్యలో తాతల నాటి మూడు గుంటల స్థలం – ఇవే వాళ్ళ దగ్గరున్న ఆస్తిపాస్తులు.‘ఆ స్థలం అమ్మేసి, ఎక్కడైనా ఒక చిన్న ఇల్లు కట్టుకుని, మిగతా డబ్బుతో ఏదైనా చిన్న వ్యాపారం పెట్టుకోండి’ అని శ్రేయోభిలాషులు అడక్కుండానే సలహాలు ఇచ్చారు.

ఆ స్థలం ఊర్లో ఒక ఇరుకు బస్తీలో ఉంది. పక్కనే బుడగలు తేలే ఒక నిండు మురుగ్గుంట, మరో పక్క వడ్డీ వ్యాపారి గరీబ్ దాసు రెండంతస్తుల ఇల్లు తాలూకు ప్రహరీ గోడ, వాళ్ళ తూములోంచి నిరంతరం ఇటు వైపు ప్రవహించే మురికి నీరు – ఎవరు కొంటారు ఆ స్థలాన్ని?

తాతల్ని గౌరవిస్తూ ఆ స్థలాన్ని అసలు అమ్మనే కూడదని జగా తండ్రి ఉద్ధవ్ నిర్ణయించుకున్నాడాయె.

మరి కొన్ని సలహాలు కూడా వచ్చి పడ్డాయి. వయసు పదిహేనేళ్ళే అయినా జగా పుష్టిగా ఉంటాడు కాబట్టి ఎవరింట్లో అయినా పనివాడిగా చేరమని కొందరు, ఎద్దుల బండి తోలమని కొందరూ చెప్పారు. ఒకాయన అయితే తన యజమానికి వ్యక్తిగతంగా సహాయకుడుగా ఉద్యోగం ఇప్పిస్తానన్నాడు. పెద్దగా పనేమీ ఉండదు, తిండీ తిప్పలూ కూడా వాళ్ళే చూస్తారట.

అందరి మాటలూ జగా మౌనంగా విన్నాడు. లోపలి నుంచి ఎవరో అన్నారు: ‘వాళ్ళ మాటలేవీ పట్టించుకోకు జగా. ఎంత ఠీవిగా అందంగా ఉన్నా, కుక్క కుక్కే. అది యజమాని బూట్లు నాకాల్సిందే. గుంజకు కట్టేస్తే నోర్మూసుకుని ఉండాల్సిందే.’

పొలం దున్ని వ్యవసాయం చేస్తూ ఒకరికి తలొగ్గక గౌరవంగా బతికిన పూర్వీకుల రక్తం జగాలో సజీవంగా ఉంది. మూడు తరాల నుంచి పట్నంలో బతుకుతున్నా, అది ఒకరి కింద పడి ఉండటానికి ఒప్పుకోలేదు. జగా అందరి సలహాలనూ తిరగ్గొట్టి, తండ్రి లాగే బస్తాలు మోసే హమాలీ పనిలో చేరాడు. కూతురి సాయంతో తల్లి తినుబండారాలు చేసి అమ్మడం మొదలు పెట్టింది. రుచి బాగుండటంతో అది బాగానే సాగుతోంది. తమ్ముడు ఖగా కొన్నాళ్ళు వీధిలో తిరిగి వేరుశెనగలు అమ్మి, ఆ తర్వాత బీడీల ఫాక్టరీలో పనికి కుదిరాడు. బైట ప్రపంచానికి ఏదీ తేడాగా కనపడకుండా నలుగురు మనుషులు ఒకే కుటుంబంలా అలా బతకసాగారు.

జగాకి చిన్నప్పటి నుంచీ శరీర దారుఢ్యం మీద మోజు. తండ్రి గురువు సగాదియాసహి ఖలీఫా అతనికి ఈ ఆశ కల్గించాడు. పచ్చని శరీర చాయ, నీలి కళ్ళు, పొడుగాటి గడ్డం, ఆకుపచ్చని తలపాగా – ఇదీ ఖలీఫా రూపం.

“నా కుస్తీ గోదాకి ఎప్పుడూ రాలేదే?” అని పలకరించేవాడు జగాని. “జగాని నాకు అప్పగించు. కుస్తీలో ఎదురు లేకుండా చేస్తాను” అని ఉద్ధవ్‌ని అడిగేవాడు.

ఎవరూ లేని ఒంటరిగాడు ఖలీఫా. రెండు గదుల చిన్న ఇంట్లో ఉండేవాడు. తెల్లవారకుండానే జగా అతని దగ్గరకు వెళ్ళేవాడు. రక రకాల కఠిన వ్యాయామాలతో శిక్షణ మొదలయ్యేది. చాలా మంది కష్టం తట్టుకోలేక మధ్యలోనే పారిపోయినా, జగా మాత్రం శిక్షణ పూర్తయ్యేవరకూ గోదా దాటి వచ్చేవాడు కాదు.

వేరే వూళ్ళ నుంచి కుస్తీ ఆటగాళ్ళని పిలిచి పోటీలు నిర్వహించేవాడు ఖలీఫా. ప్రతి పోటీ లోనూ జగాదే విజయం. మెరుపువేగంతో కదిలి ప్రత్యర్థి మీద విరుచుకుపడేవాడు. ఈ ఆటలు చూడటానికి ఆ చుట్టుపక్కల నుంచి, దర్జీలు, మాంసం కొట్టేవాళ్ళు, వడ్రంగులు, డ్రైవర్లు వచ్చేవాళ్ళు. పెద్దగా ప్రచారం ఇష్టపడేవాడు కాదు ఖలీఫా. అందుకే మొహరం, దసరా వంటి పండగ సందర్భాల్లో మాత్రమే శిష్యులు తమ విద్య ప్రదర్శించడానికి ఒప్పుకునేవాడు.

కుస్తీలో జగా ప్రావీణ్యం విని, అతడికి మరి కొన్ని ఉద్యోగావకాశాలు వచ్చి పడ్డాయి. తుపాకీ పట్టుకుని ఒక ఇంటి ముందు గార్డుగా కూచోడం, దానికి మంచి జీతం. ఇంకో ఉద్యోగం మరీ గొప్పది. కావలసినంత తిండి, జీతం, అందరూ తనని చూసి భయపడే ఉద్యోగం. యజమాని చెప్పినపుడు, ఎవరిదన్నా కాలు విరగ్గొట్టడం, మొహం పగలగొట్టడం, మెడ విరిచేయడం… ఇదీ అతని పని అక్కడ. కేసేదైనా అయితే, యజమాని లాయర్ ఉంటాడు రక్షించడానికి. ఒక డబ్బున్న వ్యక్తికి అల్లుడుగా వెళ్ళే అవకాశం కూడా వచ్చింది కానీ జగా మాత్రం ఇవన్నీ తిరస్కరించి బస్తాలు మోయడానికే సిద్ధపడ్డాడు.

ఈ సెమీఫైనల్స్ తర్వాత ఎవరెవరో ఎక్కడెక్కడి నుంచో వచ్చారు జగాని చూడడానికి. చాలా మంది ఫొటోలు తీసుకున్నారు. ప్రశ్నల వర్షం కురిపించారు.

“ఎప్పటి నుంచీ కుస్తీ ప్రాక్టీస్ చేస్తున్నావ్? నీ గురువు ఎవరు? ఒమర్ ఖలీఫానా! ఏం తింటావు? ఇంతకు ముందు బహుమతులేవైనా వచ్చాయా? పెళ్ళయిందా? పిల్లలెంత మంది?”

“బాగా కండ పట్టాలంటే నెయ్యి మంచిదా? ఓ! నువ్వెప్పుడూ తినలేదా?”

మరి కొంత మంది ఇంకో అడుగు ముందుకేసి ఇంకొన్ని ప్రశ్నలు సంధించారు.

“రోజుకెన్ని కప్పుల టీ తాగుతావు? ఏ కంపెనీ బీడీ తాగుతావు? ఏ గుట్కా? ఇంతకీ ఏ రాజకీయ పార్టీకి మద్దతు నువ్వు? ఇప్పుడు దేశంలో జరుగుతున్న మార్పుల గురించి ఏమంటావ్? ఫోటో మీద సంతకం పెట్టి ఇవ్వవూ?”

ఊపిరాడేది కాదు జగాకి. అన్నిటికీ మౌనమే సమాధానంగా చేతులు కట్టుకు నిలబడేవాడు. దాన్ని కూడా ఫోటో తీసి పేపర్‌లో వేశారు.

ఈ గెలుపు తర్వాత జగా వెళ్ళి గురువుగారి పాదాలకు దణ్ణం పెట్టాడు. ఖలీఫా అతన్ని ఆలింగనం చేసుకుని ‘నా పేరు నిలిపావు’ అని అభినందించాడు. ఇదొక్కటే జగాకి సంతోషం కల్గించింది.

ఇద్దరు పోటీ పడినపుడు ఇద్దరిలో ఒకరు గెలిచి, రెండోవారు ఓడిపోక తప్పదనే సత్యాన్ని జగా ఎప్పుడో గ్రహించాడు. అందుకే ఈ గెలుపు అతన్ని పొంగిపోయేలా చేయలేదు.

ఖలీఫా దగ్గర నుంచి గుడికి వెళ్ళి గుళ్ళో వినపడుతున్న తంబూరా సంగీతాన్ని విన్నాడు. ఇంటికి వెళ్ళే దార్లో జగా గెలుపు గురించి అరుస్తూ న్యూస్ పేపర్లు అమ్ముతున్నారు.

ఇంటికి వెళ్ళేసరికి షడ్రసోపేతమైన భోజనం ఎదురు చూస్తోంది. అన్నం, పప్పు, బంగాళా దుంప వేపుడు, వంకాయ కూర, చేపలు. ఇంట్లోవాళ్ళందరూ వాటేసుకుని శుభాకాంక్షలు చెప్పారు. కాని, ఒకరిద్దరు పొరుగువారు తప్ప ఆ పేటలోఅతని ఘనకార్యాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోక పోవడంతో జగా ఊపిరి పీల్చుకున్నాడు.

మర్నాడు పొద్దున్నే వ్యాయామం తర్వాత రోజులాగే బస్తాలు మొయ్యడానికి వెళ్ళాడు. తన వ్యక్తిగత జీవితాన్ని అతడు ఎవరి దగ్గరా ఎత్తకపోయినా, అతడు బస్తాలు మోసే సంగతి పేపర్లో రానే వచ్చింది. తన గురించి పేపర్లో ఏం రాశారో అతనికి తెలీదు. గెలుపు సంగతి తెల్సి గోడౌన్‌లో అందరూ అతన్ని అభినందించారు.

చివరి రౌండ్ కూడా గెలిస్తే, ఒరిస్సా లోనే కాక శ్రీలంక, అమెరికా, జపాన్, రష్యా ఇలా అన్ని దేశాల్లోనూ కుస్తీ పోటీలకు వెళ్ళొచ్చని, బోల్డు డబ్బులు సంపాదించొచ్చని అన్నారు. అతని ఆరోగ్యం ఎలా జాగర్తగా చూసుకోవాలో చుట్టూ ఉన్న వాళ్ళంతా సలహాలు చెప్పారు. పాలు, మటన్, పండ్లు ఇవన్నీ తినాలట. రోజూ వ్యాయామం చేయాలన్నారు. వాళ్ళు చెప్పినట్టు చేసి ఒరిస్సా గౌరవం నిలబెట్టాలని కోరారు.

నిజానికి పాలు, మాంసం వీటిని జగా రోజూ గోడౌన్‌కి వెళ్ళే దారిలో కొట్లలో చూడటమే తప్ప కొనేంత స్థోమత ఎన్నడూ లేదు. అరటి పళ్ళు తప్ప మరే పండ్లూ కొనేంత డబ్బు లేదు.

ఇంతలోనే దక్షిణాది నుంచి వలస కూలీలు బోల్డుమంది రావడంతో మజ్జిగ పలుచనైనట్టు ఉన్నట్టుండి కూలీ రేట్లు పడిపోయాయి. ఈ లోపు బీడీ కంపెనీ నుంచి ఇంటికి వస్తున్న జగా తమ్ముడు ఖగాకి యాక్సిడెంట్ అయి ఆస్పత్రిలో పడటంతో ఖర్చు ఎక్కువైపోయి జగా కుటుంబానికి తినడానికి తిండే గగనంగా మారింది. సందు చివర కొత్తగా మిఠాయి కొట్టు రావడంతో జగా తల్లి చేసే పిండివంటలు కొనడం తగ్గిపోయింది. మాంసం సంగతి దేవుడెరుగు, జగా రోజూ తినే మామూలు తిండి కూడా సగానికి తగ్గించుకోవలసి వచ్చింది.

సీర్ చేప, వడియాల ఉప్మా, కాసింత అన్నం కోసమే నాలుగణాలు పెట్టాలి. అందుకే జగా కాస్త అన్నం, ఆకు కూరతో సరిపెట్టుకుంటున్నాడు. ఆకలి తీరేది కాదు. కడుపులో మంట రేగేది. పని దొరకని నాడు కాలే కడుపుతో మౌనంగా అరుగు మీద ఆలోచనల్లో మునిగిపోయి ఒంటరివాడై కూచునేవాడు. పోటి జరిగిన కొన్ని రోజులకే అందరూ అతన్ని మర్చిపోయారు. ఎవరూ అతన్ని పలకరించిన పాపాన పోలేదు. అయినా సరే జగా వ్యాయామం మానలేదు, బస్తాలు మోయడం ఆపలేదు.

మూడు నెలలు దొర్లిపోయాయి. ఫైనల్ పోటీ జరిగే రోజు రానే వచ్చింది. పంజాబ్ ఆటగాడు దిలీప్ సింగ్‌తో జగా తలపడ్డాడు. పోటీ ముగిశాక వార్తా పత్రికలు ఆటని ఏకగ్రీవంగా విశ్లేషించాయి. మహా బలాఢ్యుడైన దిలీప్‌ని ఎదుర్కోడానికి జగా శక్తి వంచన లేకుండా ప్రయత్నించాడు గానీ సాధ్యపడలేదు. ప్రయతిస్తే జగా గెలిచేవాడే.

పత్రికలన్నీ దిలీప్ భజనతో, అతని ఫోటోలతో నిండిపోయాయి. గొప్ప గొప్ప కుస్తీ ఆటగాళ్ళంతా అతని స్నేహితులే. జగా వలె అతను ఎవరూ లేని ఒంటరి కాదు. అతని ఆహారం, వ్యాయామ వివరాలన్నీ ప్రత్యేకంగా రాశారు.

జగా పేరు నెమ్మదిగా మాసిపోయి అతను ఎవరికీ తెలియని అనామకుడిగా మారిపోయాడు. బస్సుల్లో రైళ్ళలో, కూడళ్ళలో కొత్త చర్చలు మొదలయ్యాయి. ఒరిస్సా పరువు తీసినందుకు జగా మీద చాలా మంది మందిపడ్డారు. కోపంతో ఊగిపోయారు.

ఆట మర్నాడు జగా పాలే ఉదయాన్నే వ్యాయామం చేసి, బస్తాలు మోసే పనికి బయలుదేరి వెళ్ళాడు ఎప్పట్లాగే.

(ఒరియా మూలకథకు ఆంగ్లానువాదం: Sitakant Mahapatra)