విషాద నగరం

ఒంటిస్తంభం లాంటి మూడంతస్తుల మేడలో డాబాపై గదిలో నివాసం. గాలీ వెలుతురూ, జాబిలీ వెన్నెలా, ఆకాశంలో నక్షత్రాలు, రోడ్డుకు అటువైపు చందమామ లాంటి ఎదురింటి చిట్టితల్లి నగుమోము–వీటికి అద్దె కట్టక్కర్లేదు.

వర్షాలు పడితే చాలు ఈ విశాలనగరం లోని మా శివారు కాలనీ వెనిస్ నగరంలా మారిపోతుంది. అధికారుల, రాజకీయ నాయకుల నిర్లక్ష్యం. ప్రజల దురాశ. అక్రమ కట్టడాలు. కుంటలు, చెరువుల ఆక్రమణ ఫలితం.

కాని, అప్పుడే చూడాలి అవేవీ తెలియని ఆ చిట్టితల్లి సంబరం. రెండేళ్ళ వయసు. అన్నయ్య తయారుచేసిచ్చే రంగురంగుల కాగితప్పడవలు నీళ్ళల్లో వదిలేప్పుడు చేసే అల్లరి. డాబా మీదనుంచి నాకు మంచి కాలక్షేపం. ఎంతసేపైనా చూడాలనిపించే సందడి. రోడ్‌పై వెళ్ళేవాళ్ళు కూడా ఆగి చూసే ముచ్చట.


మూడురోజుల కుంభవృష్టి తెరపిచ్చింది. సన్నటి జల్లు. రోడ్లన్నీ నీళ్ళల్లోనే మునిగి ఉన్నాయి. రోడ్డుపై ఐదారుగురు మనుషులు మూగి ఉన్నారు. చిట్టితల్లి హడావుడే అయుంటుంది అనుకున్నాను. చిట్టితల్లి కనపడలేదు. నీళ్ళల్లో పడవలు తేలుతున్నాయేమో అని చూశాను. ఇంటిముందు పడవలూ కనిపించలేదు. కనిపించడానికి అక్కడికి ఒక కిలోమీటరు దూరం వెళ్ళాలట.

తేలింది పడవలు కాదు.