సాధన ఫలితం

[హరిశంకర్ పార్సాయి (1924-1995) హిందీ సాహిత్యజగత్తులో హాస్యవ్యంగ్య రచయితగా ప్రసిద్ధి చెందినవారు. కేంద్రసాహిత్య ఎకాడెమీ అవార్డు గ్రహీత. అలతి పదాలతో, నిరాడంబర శైలిలో కొనసాగే వీరి రచనలు సమాజంలో పేరుకుపోయిన కుళ్ళును కళ్ళకు కట్టినట్టు చూపిస్తాయి. ఉపరితలంలో హాస్యం ఉబికినట్టు కనిపించినా, వీరి రచనల్లో అంతర్లీనంగా కనిపించేది సమాజం పట్ల బాధ్యత. వీరి సంపూర్ణ రచనా సంపుటాలు పర్సాయి-రచనావళి మొదటి భాగం నుంచి ‘సాధనా కా ఫౌజ్‌దారి అంత్’ అనే రచనకు తెలుగనువాదం ఇది.]


అంతకుముందు వరకూ అతను బాగానే ఉండేవాడు. అప్పర్ డివిజన్ క్లర్క్. భార్య, ఇద్దరు పిల్లలు. కవితలూ గట్రా రాసే అలవాటు. మూడో పిల్లాడు పుట్టే వరకూ మన యు.డి.సి.కి కవిత్వం మీద ఉన్న ప్రేమకు సాటి ఉండేది కాదు. ఆపైన ఆ ప్రేమ భజనలవైపు మళ్ళింది – దయ చూపించు దేవా, దయ ఉన్న దేవా! దయ ఉన్న దేవుడు దయ చూపించి అతన్ని కుటుంబ నియంత్రణ కేంద్రానికి పంపించాడు. అక్కడ ఎర్ర త్రికోణంలో అతనికి ఈశ్వరుని ఛాయ కనిపించింది.

అతను నా దగ్గరికి అప్పుడప్పుడు వస్తుండేవాడు. కవిత్వం వినిపించేవాడు. ఏదైనా పుస్తకం చదవడానికి పట్టుకెళ్ళేవాడు, కానీ తిరిగి ఇచ్చేవాడుకాదు.

ఎందుకో రెండు మూడు నెలలు వరసపెట్టి అతను రాలేదు. ఉన్నట్టుండి ఒకరోజు ఊడిపడ్డాడు. అంతకు ముందు కూడా ఒక జిజ్ఞాసతో వచ్చేవాడు కాని ఇప్పుడు మాత్రం ఎంత పట్టుదలతో వచ్చాడంటే జిజ్ఞాస తీర్చుకునే తీరతానన్నట్టు వచ్చాడు. అతను కుర్చీలో కూర్చోవడం, చూడడం, మాట్లాడడం అన్నీ మారిపోయాయి. కవిత్వం గురించి ప్రస్తావించలేదు. పొద్దుటి వార్తాపత్రికల్లోని వార్తల గురించి మాట్లాడలేదు.

చాలాసేపటి వరకూ మౌనంగానే ఉన్నాడు. తర్వాత గంభీరమైన స్వరంలో అన్నాడు: “నేను జీవితపు సత్యాన్ని వెతుకుతున్నాను.”

నేను ఉలిక్కిపడ్డాను. సత్యాన్ని వెతికేవాళ్ళంటే జడుస్తాను. వాళ్ళు తరచుగా సత్యం వైపు వీపు పెట్టి దాన్ని వెతుకుతుంటారు. నాకు అతని మీద జాలేసింది నిజంగానే. ఈ పేద క్లర్కులకి సత్యాన్ని వెతకమని ఎవరు చెప్తారో ఏంటో? సత్యాన్ని వెతకడం కొందరికి విలాసం. అది పేదవాడికి అందుబాటులో ఉండేది కాదు. నేనేం అనలేదు. అతనే అన్నాడు.

“జీవితాంతం నేను సత్యాన్నే అన్వేషిస్తాను. ఇదే నా వ్రతం.”

“రాత్రంతా నల్లుల్ని చంపుతూ కూర్చుంటే, ఇక నిద్రెప్పుడు పోతావు!” అన్నాను.

అతనికి అర్థం కాలేదు. “అంటే ఏంటి అర్థం?” అని అడిగాడు.

“అంటే… జీవితాంతం జీవితపు సత్యం వెతుకుతూ ఉంటే ఎప్పుడు జీవిస్తావు ఇహ? చచ్చిపోయాకనా?”

అతనన్నాడు, “జీవించడం? ఎలాంటి జీవించడం? ముందసలు జీవించడంలోని ఉద్దేశ్యం మనిషికి తెలియాలి కదా!”

అతణ్ణి దారి తప్పించారు. నేను అతన్ని మళ్ళీ పట్టాల పైకి తీసుకురావడానికి ప్రయత్నిస్తూ అన్నాను.

“చూడు తమ్ముడూ, చాలామంది మూర్ఖులు జీవితపు ఉద్దేశ్యం వెతుకుతూ ఉద్దేశ్యరహితంగా జీవితం గడుపుతారు. నువ్వు వాళ్ళలో చేరాలనుకుంటున్నావా?”

అతను నొచ్చుకున్నాడు. “మీరెప్పుడూ ఇలానే మాట్లాడతారు. అయినా నేను మీ దగ్గరికి వస్తున్నాను. ఎందుకంటే నాకు తెలుసు. మీరు కూడా సత్యాన్ని వెతుకుతున్నారు. మీరు రాసేవాటిల్లో ఈ విషయం తెలుస్తుంది.”

“నీ ఊహ తప్పు. నేనెప్పుడూ అబద్ధాన్ని వెతుకుతూ ఉంటాను. మూలమూలల్లో ఉన్న అబద్ధాన్ని వెతుకుతూ తిరుగుతుంటాను. అబద్ధం దొరికితే చాలా సంబరపడతాను.” చెప్పాను.

అతనికేమీ అర్థం కాలేదు. నమ్మకమూ కుదరలేదు. అతను నన్ను తనలాంటి సత్యాన్వేషి అనే అనుకున్నాడు.

నేను అడిగాను. “నువ్వు ఒక్కసారిగా సత్యాన్వేషి ఎలా అయ్యావు? ఆఫీసులో డబ్బేమైనా గోల్‌మాల్ చేశావా?”

అతను చెప్పాడు. “లేదు, నాకొక గురువు దొరికారు. ఆయనే నన్ను సత్యం వెతికే దిశగా పంపించారు.”

“ఎవరీ గురువు?”

అతను పేరు చెప్పాడు. నాకు ఆయన తెలుసు. యు.డి.సి చెప్పాడు, “గురుదేవుని వాణి అమృతం. హృదయం వరకు ఆయన మాట చేరుతుంది.”

“మెదడు వరకు చేరుతుందా లేదా?” అడిగాను.

“మెదడా? మెదడు అయితే గిర్రున తిప్పుతారు.”

దానికి నిదర్శనం స్వయంగా అతనే. నా దగ్గరికి అప్పుడప్పుడు వస్తూ ఉన్నాడు. అతని సాధన పెరుగుతూనే పోయింది. ఒకరోజు వస్తూనే నన్ను అడిగాడు.

“చెప్పండి నేను ఎవర్ని?”

“నువ్వు బీహారీలాల్, యు.డి.సి.వి” చెప్పాను.

“కాదు. అదే భ్రమ. బీహారీలాల్ కేవలం ఈ దేహానికున్న పేరు. నేను శుద్ధంగా ఆత్మను.”

“భలేవాడివి! ఒక నెల ముందే నీకు పిల్లాడు పుట్టాడు కదా. ఆత్మ పిల్లల్ని కనగలదా?”

అతను వెంటనే బదులిచ్చాడు.

“మీ ఈ తర్కం తప్పు. గురుదేవులు ఇలాంటి ప్రశ్నలకి జవాబు ఇవ్వద్దని చెప్పారు. ఎవరూ నా ప్రశ్నకి సరైన సమాధానం ఇవ్వడమే లేదు. భార్యని అడిగాను, నేనెవర్ని? అని. ఆమె బదులిచ్చింది, నువ్వు నా భర్తవి. పెద్ద కొడుకుని అడిగాను, నేనెవర్ని? అని వాడు బదులిచ్చాడు, నువ్వు నాన్నవి. ఆఫీసులో మా మేనేజర్‌ని అడిగాను, సార్ నేనెవర్ని? అని. నువ్వు పిచ్చివాడివి, అని ఆయన జవాబు. అయినా నేను నిరాశపడడం లేదు. గురుదేవులు చెప్పారు, నిత్యం ఈ ప్రశ్న ఉచ్ఛారణ చేస్తూ ఉండు–నేనెవర్ని? నేనెవర్ని? ఏదో ఒకరోజున నీకు దీనికి సమాధానం దొరుకుతుంది. నువ్వెవరో నువ్వు తెలుసుకుంటావు.”

ఆ రోజు తర్వాత అతను మళ్ళీ రెండు మూడు నెలలు రాలేదు. అతని తోటివాళ్ళు చెప్పారు పార్కులో సాయంకాలం ‘నేనెవర్ని? నేనెవర్ని?’ అంటూ నాట్యం చేస్తున్నాడని. ఆఫీసులో కూడా రోజంతా అడుగుతూనే ఉంటాడుట, నేనెవర్ని? అని. నేనెవర్ని? అని ఫైళ్ళ మీద రాస్తున్నాడుట. అతను సంతకం చేయాల్సిన చోట కూడా నేనెవర్ని? అనే రాస్తున్నాడుట.

ఒక రోజు మళ్ళీ వచ్చాడు. మళ్ళీ అవే, జీవితంలో సత్యం గురించిన కబుర్లు చెప్పాడు. గురుదేవుని గుణగణాలని పొగడడం అయ్యాక నేను అడిగాను.

“మీ గురువు సత్యాన్ని కనుగొన్నారా?”

“ఎప్పుడో!”

“ఆయన ఎక్కడ ఉంటారు?”

“ఆయనకు విలాసవంతమైన ఆశ్రమం ఉంది. మొత్తం ఎయిర్ కండిషన్డ్.”

“గురువు ఆత్మకి వేడి అనిపిస్తుందా ఏంటి?”

“గురుదేవులు ఇలాంటి ప్రశ్నలకి జవాబు ఇవ్వవద్దని చెప్పారు.”

“మీ గురువుగారికి దగ్గర పెద్ద కారు ఉంది కదా?”

“అవును ఉంది.”

“ఆయన రుచికరమైన భోజనం కూడా చేస్తుంటారేమో కదా?”

“ఆ, చేస్తారు.”

“ఆత్మకి అన్ని సుష్టుగా తినేంత ఆకలి వేస్తుందా ఏం?” మళ్ళీ అడిగాను.

“గురుదేవ్ ఇలాంటి ప్రశ్నలకి జవాబు ఇవ్వద్దని అని చెప్పారు,” అన్నాడు.

అప్పుడు నేను అతనితో ఇలా అడిగాను. “నీ గురువు జీవితంలో సత్యాన్ని కనుగొన్నాడు. ఇక్కడ ఎయిర్ కండిషన్డ్ ఇల్లూ, కారూ, వగైరా కూడా పొందాడు. ఆయన దగ్గర డబ్బు కూడా ఉంది. అంటే ఆయన దృష్టిలో సత్యం ఏమిటంటే బంగ్లా కారు డబ్బులు రూపంలో ఇక్కడ సాక్షాత్కరించేది. అది సరే, నువ్వు ఈ సంగతి చెప్పు. మీ గురువుగారికి ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి?”

“గురుదేవుని గురించి ఈ ప్రశ్న తలెత్తదు. ఆయన అలౌకిక పురుషుడు. ఆయన్ని దేవగణాలలో ఒక్కడు.” అన్నాడు.

“నువ్వు యూనియన్‌లో ఉన్నావా?” నేను అడిగాను.

“లేదు, గురుదేవుల ఆదేశం ప్రకారం భౌతిక లాభాలు ఇచ్చే ఇలాంటి సంఘర్షణల్లో సాధకులు పడకూడదు.”

నేను అన్నాను. “అలా అయితే గురువు సత్యం వేరు, నీ సత్యం వేరు. ఇద్దరు సత్యాలు ఒకటి కావు. గురువుగారి సత్యంలో బంగ్లా, కారు, రూపాయలు లాంటి భౌతికంగా ప్రాప్తించేవే ఉన్నాయి. నీ విషయంలో ఆయనేమో భౌతిక లాభానికి సంబంధించిన గొడవలో పడవద్దని చెప్పారు. ఇది నీ సత్యం. వీటిలో ఏ సత్యం మంచిది? నీదా? గురువుదా?”

అతను సంకటంలో పడ్డాడు. సమాధానం దొరక్కపోయేసరికి విసుక్కున్నాడు. “మీరు నాస్తికులు. అందుకే ఇలా తలతిక్కగా మాట్లాడుతారు. నేను మీ దగ్గరికి రాను.”

అతను మళ్ళీ రాలేదు కానీ నాకు సమాచారం అందుతూనే ఉంది. అతని సాధన కొనసాగుతూనే ఉందని తెలిసింది. అతను ఆఫీసు పనిలో తప్పులు ఎక్కువయ్యాయి. ఫైల్‌లో నోట్‌కి బదులు రాశాడట- నేనెవర్ని? అని. మేనేజర్ పిలుస్తున్నారని వచ్చి చెప్పిన ఆఫీస్ బాయ్‌తో అనేవాడట: ‘నేను బీహారీలాల్ కాదు. నేను ఎవరో నాకు తెలియదు. నన్ను నేను ఇంకా వెతుక్కుంటున్నాను.’

ఒకరోజు నాకు కబురందింది, అతన్ని సస్పెండ్ చేశారు. ఇంకో రోజు అతని స్నేహితుడు కనిపించాడు. నేను అతని గురించి అడిగితే చెప్పాడు, ఎప్పుడూ ఉదాసీనంగా మౌనంగా ఉంటున్నాడని.

నేను అడిగాను. “నేనెవర్ని? అనే ప్రశ్న ఇంకా అడుగుతున్నాడా, లేదా?”

అతను చెప్పాడు. “ఇప్పుడు నేనెవర్ని అన్న ప్రశ్న వేయడం లేదు. బహుశా అతనికి సమాధానం దొరికిందేమో. సాధనంబున పనులు సమకూరు ధరలోన, కదా?”

చాలా రోజులు గడిచిపోయాయి. ఒకరోజు అతను ఉన్నట్టుండి వచ్చాడు. చాలా మారిపోయాడు. బాధపడుతూ ఉన్నాడు. కానీ ఒక ప్రత్యేకమైన ధృడత్వం కూడా వచ్చింది. అతను సస్పెండ్ అవ్వడం గురించి, వ్యక్తిగత సమస్యల గురించి చెప్పుకొచ్చాడు. సత్యం గురించి అసలు చర్చ చేయనే లేదు.

అంతా అయాక అతను అడిగాడు. “నేను మీ దగ్గరికి ఎందుకు వచ్చానంటే, నాకో మంచి క్రిమినల్ లాయరును సిఫార్సు చేయండి. మీకు చాలామంది వకీళ్ళు తెలిసి ఉంటారు కదా?”

“సంగతేంటి?”

“నేను నేరం చేశాను. కేస్ వేస్తారు.”

“ఎలాంటి నేరం?”

“మీరు నన్ను ఏడాదికాలంగా చూస్తూనే ఉన్నారు. నేను సత్యం వెతకడంలో మునిగిపోయి ‘నేనెవర్ని?’ అనే పాఠం తప్పించి ఇంకో మాట లేదు. దాంట్లో పడి నేను నాశనమైపోయాను. నన్ను ఈ దారిలో పంపించిన గురుదేవుని దగ్గరికి మొన్న వెళ్ళాను. ఆయన ‘రా సాధకా, కూర్చో’ అని అన్నారు. ఆ సమయంలో ఇద్దరు స్త్రీలు ఆయన శరీరానికి మాలీష్ చేస్తున్నారు. మాలీష్ అయిపోయాక ఆయన నన్ను తన పవిత్రమైన కళ్ళతో చూశారు. ‘సాధన ఎలా నడుస్తుంది?’ అని అడిగారు. ‘గురుదేవా, సాధన అయితే సఫలం అయిపోయింది’ అని చెప్పాను. ఆయన ఉలిక్కిపడ్డారు. ‘నేనెవర్ని?’ అనే ప్రశ్నకి నీకు సమాధానం దొరికేసిందా అని అడిగారు. ‘లేదు కానీ నాకు ‘నువ్వు ఎవరివి?’ అన్న ప్రశ్నకి సరైన సమాధానం దొరికింది.

అని చెప్పి నేను గురువు మీద విరుచుకుపడి ఆయనను చితక్కొట్టాను. ఇప్పుడు నాకు వకీలు సాయం ఇప్పించండి.”

రచయిత పూర్ణిమ తమ్మిరెడ్డి గురించి: పుస్తకం.నెట్ నిర్వాహకుల్లో ఒకరైన పూర్ణిమ వృత్తి రీత్యా సాఫ్ట్‌వేర్ ఇంజనీరు. ...