క్రిస్టోవో డి కాస్ట్రో ది రాతకోతల్లో అందె వేసిన చెయ్యి. ఎక్కడి దాకానో ఎందుకు, అతని డైరీ చూస్తే చాలు అతనెంత మాటల పుట్టో ఇట్టే తెలిసిపోతుంది! అందులోనూ ఎక్కడెక్కడో తిరిగి ఎన్నెన్నో విశేషాలు చూసిన వాడాయె!!
ముఖ్యంగా 1543 44 ల్లో అతను రాసుకున్న కొన్ని విషయాల గురించి అతని మాటల్లో వింటుంటే భలేగా వుంటుంది. ఒక్కసారి 1543, సెప్టెంబర్ 11 కి పేజీలు తిప్పండి
సెప్టెంబర్ 11.
సముద్రం ప్రశాంతంగా వుంది. గోవాలో బయల్దేరి నాలుగు రోజులైనా ఇంకా “ఆవు దీవి” కనపడటం లేదు. బహుశ ఇవాళ రాత్రి ఇండియాకీ ఆ దీవికి మధ్య వున్న అల్లకల్లోల కడలిలోకి ప్రవేశిస్తామనుకుంటాను.
నేనున్న నావలో ఇంకా రెండొందల మంది మనుషులు వున్నారు. ఓ ఇరవై గుర్రాలు. మూడొందల తుపాకులు, వాటిక్కావల్సిన మందుగుండు సామాగ్రి. చూస్తే ఇదేదో భారీయుద్ధానికే సన్నాహంలా అనిపిస్తోంది. ఐతే ఎవరిలోను ఎలాటి జంకు గాని, అధైర్యం కాని లేవు. మనం ఒక్కొకళ్ళం తేలిగ్గా వందేసి మంది ఇండియన్ సైనికుల్ని మట్టు పెట్ట గలం!
అందులోను ఈ సైన్యానికి (అసలు దీన్ని సైన్యం అనాలా? ఇలాటి యాత్ర జరగబోతోందని వినటం తోనే ఎక్కడెక్కడి వాళ్ళూ చేతులో వున్న పన్లన్నీ అవతల పారేసి అందినంత డబ్బులు అవి సొంతానివి ఐనా కాకపోయినా పుచ్చుకుని సొంత ఖర్చుల మీద ప్రయాణమై వచ్చారు కదా! వీళ్ళలో నిజంగా ఇదివరకు సైన్యశిక్షణ పొందిన వాళ్ళు ఎంతమందో మరి!!) నాయకుడు మామూలు వ్యక్తి కాడు! మార్టిమ్ ఆఫాన్సో డి సౌసా అంటే ఇప్పటికీ దక్షిణ అమెరికా అంతా జడుసుకుంటారు. అతని పేరు చెప్తే పిల్లలు ఏడవటం మానేస్తారు. ఎంత పెద్ద ముదురు గాడైనా మార్టిమ్ ఆఫాన్సో వస్తున్నాడంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరిగెత్తాల్సిందే! అందుకే కదా, పట్టుమని నలభై ఏళ్ళు వచ్చాయో లేదో ఆసియాలోని పోర్చుగీస్ స్థావరాలన్నిటికీ కలిపి గవర్నరయ్యాడు!! భళా, ఆఫాన్సో!
అసలు ఆఫాన్సో పూనుకుని ఏదో యాత్రకి బయల్దేరుతున్నాడని తెలిసే సరికి చావుకి కాళ్ళు చాపుక్కూచున్న వాళ్ళ దగ్గర్నుంచి ఇంకా ముక్కు పచ్చలారని మూతికి మీసాలు రాని వాళ్ళ దాకా నేనోస్తానంటే నేనొస్తానని అతని కాళ్ళా వేళ్ళా పడ్డారు. అదీ ఆఫాన్సో పేరంటే! దక్షిణ అమెరికాలో అతను కొల్లగొట్టిన సంపదలు ఏడాది తర్వాత కూడ ఇంకా పోర్చుగల్‌కి మోసుకు పోతూనే వున్నారు ఓడల్లో! అసలు ఆఫాన్సోకీ ఐశ్వర్యానికీ ఏదో తెలీని లంకె వుంది. అతనెక్కడుంటే అక్కడ డబ్బు వచ్చి పడుతుంది!
అందుకే ఎక్కడికి వెళ్తున్నాం, ఏం చెయ్యబోతున్నాం, దార్లో ఏమైనా ప్రమాదాలు వున్నాయా? అంటూ ఒక్కడంటే ఒక్కడు అతన్ని అడగటానికి సాహసించలేదు కదా! ఆఫాన్సో “పదండి!” అన్నాడు, అందరం “అలాగే!” అని బయల్దేరాం. ఒకరూ ఇద్దరూ కాదు, రెండున్నర వేల మంది! పదిహేను పెద్ద పెద్ద నావల్లో. దాదాపు మూడొందల గుర్రాలు, ఆశ్వికులు.
కాకపోతే గోవాలో బయల్దేరిన దగ్గర్నుంచి ఇండియా తీరానికి దగ్గర్లోనే ప్రయాణిస్తున్నాం కనుక బహుశ ఇండియా తూర్పు వైపున మన గమ్యం వుందనిపిస్తోంది. అక్కడికి చేరటానికి ఎన్నాళ్ళు పడుతుందో తెలీదు! కాకపోతే ఇంత గుర్రపు దళం వుండటం చూస్తోంటే నేల మీద కూడ కొంత ప్రయాణం వున్నట్టు అనిపిస్తోంది. అది నిజమైతే చాలా విచిత్రమే! నాకు తెలిసి నంత వరకు సముద్రాల, నదుల తీరాల్లో వున్న ఊళ్ళకి తప్ప లోపల వున్న వాటికి వెళ్ళటం యూరోపియన్లకి అలవాటు లేదు. మన్లో మన మాట అలా చెయ్యాలంటే మనకి చాలా భయం కూడ. ఎవడు చూడొచ్చాడు ఎక్కడ ఎలాటి మృగాలుంటాయో, ఏ మానవభక్షకులు చొంగలు కార్చుకుంటూ మన తెల్ల ఒళ్ళ కోసం ఎదురు చూస్తుంటారో!
సెప్టెంబర్ 12.
ఆఫాన్సోని ఎప్పుడూ ఇలా చూడలేదు నేను. మంచి హుషారుగా వున్నాడు. చక్కటి మాంసంతో విందు చేశాక బాగా తాగినందు వల్లో ఏమో తెలీదు కాని ఎంతో ఉల్లాసంగా అందర్నీ పలకరించాడు. వెనక, ముందు వస్తున్న నావల వాళ్ళని కేకేసి మరీ పలకరించాడు. భోజనం అయ్యాక సరదాగా డాన్స్ చేశాడు. అదయ్యాక ఎగిరి గంతేసి ఒక బల్ల మీద ఎక్కి నిలబడి ఉపన్యసించాడు
” నా ప్రియమైన స్నేహితులారా! ఎక్కడికి వెళ్తున్నామో ఏమిటో చెప్పకుండా నేను రమ్మనటం తోటే నాతో వచ్చారు మీరు. నామీద మీకున్న నమ్మకానికి నాకెంతో ఆనందంగా వుంది. దీనికి ప్రతిఫలంగా మీ అందర్నీ నేను మిలియనీర్లని చెయ్యబోతున్నా!”
అతనలా అనేసరికి ఇక చూడాలి మా ఊపు! అరుపులు, కేకలు, చప్పట్లు, కేరింతలు, ఈలలు ఒకటేమిటి, నోటితో, చేతుల్తో, కాళ్ళతో చెయ్యగలిగినవన్నీ చేశాం మా ఆనందం చూపించటానికి.
“మనం ఇప్పుడు ఎక్కడికెళ్తున్నామో తెలుసా? మీకు తెలీదు. నేను చెప్తాను వినండి. ఒక గుడిని కొల్లగొట్టటానికి. మామూలు గుడి కాదు, ఇక్కడి వాళ్ళ వేటికన్ లాటి గుడి అది! ఆ గుళ్ళో ఇక్కడి పాపులు పెట్టి కొలుస్తున్న దెయ్యాన్ని నాశనం చెయ్యటానికి. అక్కడున్న లెక్కలేనంత డబ్బుని, బంగారాన్ని, నగల్ని మన నావలన్నిట్లో నింపుకుని మనకీ పదేసి ముందు తరాల వాళ్ళకీ డబ్బుకి లోటు లేకుండా చేసుకోవటానికి. మన రాజుగారి మెప్పు పొంది మనకి నచ్చిన పదవులు సంపాయించుకోవటానికి. పన్లో పనిగా ఇక్కడి అనాగరిక పశువుల మతాన్ని కూడ ధ్వంసం చేసి వాళ్ళనీ మన మతం వైపుకి తిప్పి కొంత నాగరికత కూడ కలిగిస్తే తప్పేం లేదుగా! వాళ్ళ బంగారం మన జేబుల్లోకి, మన మతం వాళ్ళ బుర్రల్లోకి! ఇంతకన్న మంచి వ్యాపారం మరెక్కడుంది?” అంటూ పగలబడి నవ్వాడు ఆఫాన్సో. అందరం గొంతు కలిపాం. ఆనందంగా తాగాం, గెంతాం, నిద్రపోయాం.
అలా ఎంతసేపు పడుకున్నానో తెలీదు. హఠాత్తుగా మెలకువ వచ్చింది. అంతా అంధకారం. దీపాలు వెలిగిస్తున్నా అవి గాలికి నిలవటం లేదు. నావలు దెయ్యాలు పట్టినట్టు ఊగిపోతున్నాయి. సముద్రం మమ్మల్ని ముంచెయ్యటానికి కంకణం కట్టుకున్నట్టు ఉద్రేకంగా ఉరకలేస్తోంది. అలలు రాక్షస పాముల్లాగా పడగలు పైకెత్తి మమ్మల్ని కాటెయ్యటానికి వస్తున్నాయి. ప్రకృతంతా మామీద పగబట్టి కసి తీర్చుకోవటానికి సిద్ధమైందా అన్నట్టుంది. ఎన్నో పెనుగాలుల్నీ, తుఫానుల్నీ చూసిన వాళ్ళు కూడ మూల కూర్చుని దైవ ప్రార్థనలు మొదలు పెట్టారు.
ఆఫాన్సో హడావుడిగా అటూ ఇటూ పరిగెత్తుతూ ఆర్డర్లు జారీ చేస్తున్నాడు. నావలు మునిగిపోకుండా వుండటానికి అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారు. అప్పటికే కొన్ని గుర్రాలు నీళ్ళలో కొట్టుకు పోయాయి. మనుషులు కూడ అందరూ వున్నారో లేదో! ఎవడి ప్రాణాల గురించి వాడు ఆలోచించుకునేటప్పుడు మరొకరి విషయం ఎవరికి కావాలి? అది రాత్రో, పగలో తెలీటం లేదు. ఆ రాత్రి ఎప్పటికైనా తెల్లవారుతుందో లేదో తెలియటం లేదు. ఈ గందరగోళంలో నావలు కొన్ని ఒకదానికొకటి కొట్టుకుని బద్దలౌతున్నాయి. మరికొన్ని కనిపించకుండా ఎటో కొట్టుకుపోయాయి.
సెప్టెంబర్ 14.
ఇంకా ఈ విపరీతవాతావరణం పూర్తిగా తగ్గలేదు. కొద్ది నిమిషాల పాటే తెరిపి, అంతలోనే మళ్ళీ బాదుడు!
గొప్ప గొప్ప ధైర్యవంతులకి కూడ అర్జంటుగా పెళ్ళం బిడ్డలు గుర్తొస్తున్నారు. ఇక్కడే జలసమాధులు తప్పవనిపిస్తోంది. ఎక్కడ చూసినా నిస్పృహ, నిరాశ, నిర్వేదం! డబ్బు గురించీ, కొల్లగొట్టబోయే సంపదల గురించీ ఆలోచనలు రావటం మానేసాయి. బతికుంటే బలుసాకు తినొచ్చు ననేది ఒక్కటే ప్రస్తుతానికి ఉన్న ఆలోచన! ప్రాణాల్తో బయటపడి ఇంటికి వెళ్తానన్న నమ్మకం లేదు. అలా జరిగి, ఈ డైరీ కనుక ఎలాగోలా ఎవరి కంట నన్నా పడితే దీన్ని మా వాళ్ళకి చేర్చండి. నా వివరాలు చివరి పేజీలో వున్నాయి.
సెప్టెంబర్ 16.
అమ్మయ్య! ఇంకా బతికే వున్నాను! దేవుడి దయ వల్ల గండం గడిచి బతికి బట్ట కడుతున్నా. చాలా మంది నిజంగానే స్వర్గానికి వెళ్ళిపోయారు, వాళ్ళ గుర్రాల్తో సహా!
తుఫాను దెబ్బ తీరింది కదా, ఇక మన గమ్యానికి దారి తీద్దాం అనుకుంటూండగా ఊహించని ఓ సంఘటన జరిగిపోయింది!
అప్పుడు మేము ఆవు దీవిని దాటి ఇండియా తూర్పు కొసకి చేరుకున్నాం. ఇంక రెండు రోజుల సముద్రప్రయాణం మాత్రమే వుంది. ఆ తర్వాత పదహారు లీగులు నేల మీద ప్రయాణం చెయ్యాలట! దాన్ని తల్చుకుంటే గుండెలు బేజారెత్తుతున్నాయి కాని ఒకరకంగా ఇంత తుఫాను లోంచి బతికి బయటపట్టంతో మాకు మా విధి మీద బోలెడంత నమ్మకం కుదిరిపోయింది! మాకు చావే రాసిపెట్టి వుంటే అది ఈ సముద్రం మీదనే జరిగుండేది. అలా జరగలేదంటే మాకింకా బాగా గింజలున్నట్టే లెక్క!
అలా అనుకుంటూ ఒకర్నొకరం అభినందించుకుంటూ ఇంకా బతికున్నందుకు దేవుణ్ణి తల్చుకుంటూ కొంత ప్రశాంతంగా వున్నామనే చెప్పొచ్చు. ఇంతలో దూరంగా రెండు చిన్న పడవలు కన్పించాయి. అవి మా కోసమే వస్తున్నాయని తెలిసి అందరం తుపాకులు సిద్ధం చేసుకుని ఎదురుచూస్తున్నాం. ఐతే ఆ పడవల మీద జెండాలు పోర్చుగీసువి!
ఆనందంగా వాళ్ళని ఆహ్వానించాం. మొత్తం ఓ పదిమంది వర్తకులు వాటిలోంచి దిగి మా నావలోకి వచ్చారు. ఒకరిద్దరు బాగా డబ్బుతో పులిసిన వాళ్ళు కనిపించారు. మొత్తం మీద వీళ్ళు పెద్ద తలకాయలే అయుండాలి, ఆఫాన్సో అందర్నీ దగ్గరుండి ఆహ్వానించి తన గదిలోకి తీసుకెళ్ళాడు.
ఓ రెండు గంటల పాటు వాళ్ళు ఆ గదిలోనే వున్నారు. ఉద్రేకపూరితమైన వాతావరణంలో చర్చలు జరుగుతున్నట్టున్నాయి అప్పుడప్పుడు ఆఫాన్సో అరుపులు బయటికి కూడ వినిపిస్తున్నాయి. అవతలి వాళ్ళు మాత్రం అచ్చమైన వర్తకులు ఏ మాత్రం గొంతు లేవకుండా సౌమ్యంగా మాట్లాడుతున్నారు.
కాసేపటికి వాళ్ళు బయటకు వచ్చి మళ్ళీ వాళ్ళ పడవల్లోకి వెళ్ళిపోయారు. అవి తీరం వైపుకు దారి తీశాయి.
ఆఫాన్సో మాత్రం బోనులో పడ్డ పులిలా అటు ఇటూ తిరుగుతున్నాడు. పిడికిళ్ళు బిగిస్తున్నాడు. అడ్డు వచ్చిన వాళ్ళని తోసేస్తున్నాడు. పళ్ళు పటపట కొరుకుతున్నాడు. కళ్ళలోంచి నిప్పులు రాలుస్తున్నాడు.
అలా కాసేపు పచార్లు చేసి, “కెప్టెన్లందరూ నా రూంలోకి వెంటనే రావాలి” అని అరిచి వెళ్ళిపోయాడు. మా నావలో వున్న కెప్టెన్లం వెంటనే జమకూడి చిన్న చిన్న పడవల్లో మిగిలిన నావల వాళ్ళకి కబురు పంపించాం. ఓ గంటలో అందరూ వచ్చారు. అందరం కలిసి ఆఫాన్సో గదికి వెళ్ళాం.
బాగా తాగినట్టున్నాడు అతని కళ్ళు చింతనిప్పుల్లా వున్నాయి. అందరి వంక ఒకసారి చూశాడు. కళ్ళు మూసుకున్నాడు. అతని నోట్లోంచి మాటలు రావటం కష్టంగా వుంది. మామూలుగా సింహంలాగా గర్జించే వాడు ఇప్పుడు హఠాత్తుగా పిల్లిపిల్లగా మారిపోయాడు. అందరమూ దగ్గర దగ్గరగా సర్దుకుని చెవులు రిక్కించుకుని వినాల్సొచ్చింది అతని మాటల్ని
“మీకు ఈ విషయం ఎలా చెప్పాలో తెలీటం లేదు. నా మీద మీరందరూ వుంచిన నమ్మకాన్ని నేను వమ్ము చేస్తున్నాను. మన ప్రయాణం ఇంక ముందుకు సాగటం లేదు. ఇక్కణ్ణుంచే వెనక్కు తిరుగుతున్నాం. గోవా దారి పట్టబోతున్నాం” అన్నాడతను.
అందరం మా చెవుల్ని మేం నమ్మలేక పోయాం. ఆఫాన్సో యేనా ఇలాటి మాటలంటున్నది అని ఆశ్చర్యపోయాం. చివరికి ఎవరో గొంతు పెగుల్చుకుని, “ఎందుకు?” అని మాత్రం అడగ్గలిగారు. నిస్పృహతో నిట్టూరుస్తూ అన్నాడు ఆఫాన్సో “ఇందాక వచ్చిన వాళ్ళు కోరమాండల్‌లో వుండే వర్తకులు. వాళ్ళ సలహా ఏమిటంటే ..”
“మొన్నటి దాకా మనకే తెలియని ఈ ప్రయాణం గురించి వాళ్ళకెలా తెలిసింది?” అడిగారెవరో దెబ్బ తిన్నట్టు. ఆఫాన్సో అందుకు సమాధానం చెప్పలేదు. ఆ దిక్కుకి ఒక్క చూపు చూశాడు. అంతే, అందరికీ అర్థం ఐపోయింది అతను బహుశ వాళ్ళ చేత ఈ ప్రయాణం ఖర్చులన్నీ ఇప్పిస్తున్నాడని. ఇలాటి విషయాలు పైకి మాట్లాడేవి కావు. అందులోను ఆఫాన్సో లాటి వాళ్ళు ఎన్నో విషయాలు ఆలోచిస్తారు, ఎంతో పథకం ప్రకారం పన్లు చేస్తారు. ఇంత భారీ కార్యక్రమం చేపట్టాడంటే బహుశ పోర్చుగీస్ రాజు గారిక్కూడ దీని గురించి ముందే చెప్పి అతని అనుమతి తీసుకుని వుండొచ్చు!
మాతో వచ్చిన కెప్టెన్లు చాలామంది ఆఫాన్సోకి దగ్గరి బంధువులే బెర్నాల్డిమ్ డి సౌస, ఫెర్నావ్ గొమెస్ డి సౌస, .. ఇలాగ. ఐనా కాని వాళ్ళకూ హద్దులున్నాయి.
“వాళ్ళు చెప్పేదేమంటే, మన ప్రయాణం విషయం ఎలాగో ఇక్కడి పాపులకి తెలిసిపోయిందట! ఆ పనికిమాలిన గుడిని రక్షించటానికి లక్షల మంది సైన్యం ఇప్పుడక్కడ సిద్ధంగా వున్నారట. మనం అక్కడికి వెళ్తే వాళ్ళు యుద్ధం చెయ్యక్కర్లేదు, తలో పిడికెడు మట్టి విసిర్తే చాలు మనం దాన్లో కూరుకుపోతాం అంటున్నారీ చవటలు. మీరే చెప్పండి వీళ్ళ వార్త నిజమని నమ్మి వెనక్కి తిరిగి వెళ్దామా? కాదని ముందుకు వెళ్ళి విజయమో వీరస్వర్గమో తేల్చుకుందామా?” అందరి వంక చూశాడతను. ఎవ్వరూ ఒక్కమాట మాట్లాడలేదు!
తనలో తను అనుకుంటున్నట్టు కొనసాగించాడు ఆఫాన్సో “ఇప్పుడా గుడి దగ్గర ఒక పేద్ద ఉత్సవం జరుగుతున్నది. లక్షలాది మంది వచ్చి వాళ్ళ దగ్గరున్న డబ్బంతా అక్కడ గొరిగించుకుని వెళ్తారు. చాలా మంది అక్కడి దెయ్యం బండి కింద పడి ప్రాణాలు తీసుకుంటారు చచ్చి స్వర్గానికి పోవటానికి వాళ్ళ మార్గం అదట! ఇలాటి మనుషుల్ని ఈ ప్రపంచంలో ఎలా పుట్టించాడో ఆ దేవుడు! వీపులకి పెద్ద పెద్ద ఇనప కొక్కేలు తగిలించుకుని వాటికి వేళ్ళాడుతూ తమ కండల్ని తమే కోసుకుని జనంలోకి విసిరేస్తారట ఇంకొంత మంది దౌర్భాగ్యులు. ఆ దెయ్యపు జనం ఆ మాంసపు ముక్కల్ని దేవుడి ప్రసాదం కింద ఇళ్ళకి తీసుకు పోతారట. ఇదేం మతమో వీళ్ళేం మనుషులో నాకేం అర్థం కాదు. మరి ఇలాటి వాళ్ళ దగ్గర ఇంతింత సంపదలు ఎలా వచ్చిచేరుతున్నాయో అసలే అర్థం కాదు. దేవుడనే వాడు వున్నాడా లేడా? ఉంటే మనం ఇప్పుడు వెళ్ళి ఆ దెయ్యానికి ఈ పిశాచులంతా కలిసి అర్పించుకున్న డబ్బు, బంగారం కొల్లగొట్టనియ్యకుండా ఎందుకు అడ్డం పడుతున్నాడు?” రాని సమాధానం కోసం ఆకాశం లోకి చూశాడు ఆఫాన్సో! అందరమూ అదే తరహా ఆలోచనల్లో వున్నాం. ఏం చెయ్యాలో పాలు పోవటం లేదు. ముందుకా వెనక్కా?
“మనం ఒక్కొక్కరం వాళ్ళు వెయ్యి మందిని చంపుతాం. పదండి ముందుకే!” ఆవేశంగా అన్నారొకరు.
ఐతే అతనికి ఇంకెవరి ప్రోత్సాహమూ దొరకలేదు. అంతటి ధీరుడు ఆఫాన్సో కూడ కాదన్నట్టు తల పంకించాడు తప్ప మాట్లాడలేదు.
ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నాం కాసేపు. పరిస్థితి అర్థమై పోయింది. సగం ఉత్సాహాన్ని సముద్రం పీల్చేసింది. మిగిలింది కాస్తా ఈ దుర్వార్తతో నీరుకారిపోయింది.
ఒక్కొక్కరే గదిలోంచి బయటకు నడిచారు జీవచ్ఛవాల్లా! ఆఫాన్సోనే తిరిగి వెళ్దామన్నాడంటే ఇంక ముందుకు నడిచే దమ్ము ఎవడికుంది?
సెప్టెంబర్ 17.
వెనక్కు తిరిగాం. జీవం అంతా లాగేసినట్టయింది. ఆఫాన్సో అవమానంతో ఒక్కడే తన గదిలో కూర్చుని బయటకు రాలేదు. మిగిలిన కెప్టెన్లు కూడ వాళ్ళ వాళ్ళ అనుచరులకి ఎలాగోలా సర్ది చెప్పి శూన్యం లోకి చూస్తూ కూలబడ్డారు. అంతటా నిరాశ. సముద్రం కూడ ఇంకా భయపెడుతూనే వుంది ఏ క్షణంలోనైనా మళ్ళీ తుఫాను రావొచ్చు నన్నట్టుగా. మా మనసుల్లాగే ఆకాశం కూడ మబ్బులు పట్టి వుంది.
అల్లంత దూరాన తీరం కనిపిస్తోంది. కాని ఉపయోగం ఏవుంది అనుకున్న చోటుకి వెళ్ళలేకపోతున్నాం, ఆ దెయ్యపు గుడిని కూలదొయ్యలేక పోతున్నాం.
ఇంతలో ఎవరో అరిచారు “అదుగో గుడి!” అని. అందరూ పరుగెత్తుకొచ్చి ఆ వైపుకు చూశారు. దూరంగా తీరం మీద ఓ చిన్న కొండ, దాని మీదో గుడి!
ఏదో ఉత్సవం జరుగుతున్నట్టుంది, జనం గుమికూడి వున్నారు.
ఆఫాన్సో చెవిలో కూడ ఈ హడావుడి పడినట్లుంది సుడిగాలిలా బయటకు పరుగెత్తుకొచ్చాడు. “తీరానికి పదండి” అని ఆజ్ఞాపించాడు.
అతనేమంటున్నదీ ఎవరికీ అర్థం కాలేదు ముందు. అర్థం కావటం తోనే అప్పటి దాకా ఆరిపోయి వున్న ఉత్సాహం మళ్ళీ రాజుకుంది. ఒక్కసారిగా ఊపిరి లేచివచ్చింది. మిగిలిన నావలన్నిటికీ కూడ వార్త పంపాం. అందరూ ఆనందంగా తీరానికి బయల్దేరారు.
మధ్యాన్నం ఔతున్నది. సూర్యుడి కిరణాలు పడుతూ కొండ మీద గుడి మెరిసిపోతున్నది. బంగారు గుడేమో నని కొందరం, కాదు వెండితో చేసి దానికి బంగారు పూత వేశారేమో నని మరికొందరం.
తీరానికి చేరటం తోనే ఆఫాన్సో ముందుగా కిందికి దూకాడు రెండు చేతుల్లో రెండు పిస్తోళ్ళు పట్టుకుని. మిగిలిన వాళ్ళం కూడ ఉత్సాహంగా పరుగులు తీశాం. పైకి వెళ్ళటానికి మెట్లున్నాయి. అడుక్కు రెండేసి మూడేసి మెట్ల చొప్పున పరుగెత్తి పైకెక్కాం.
తీరా చూస్తే అది బంగారు గుడి కాదు. వెండిది కూడ కాదు. కేవలం రాతిది. ఉత్సవం కోసమని రంగులు వేశారంతే!
ఎవరూ మా దారికి అడ్డం రాకుండా గాల్లోకి తుపాకులు పేల్చాం!
ఐతే, బహుశ వాటి అవసరం లేదు వాళ్ళు మమ్మల్ని వింతగా చూస్తూ ఉండిపోయారు తప్ప ఎవరూ మమ్మల్ని అడ్డగించాలని కూడ ప్రయత్నించలేదు. ఎవరన్నా అడ్డొస్తారేమో కొంతమందినైనా ఈ పాపుల్ని చంపి మన మతానికి సేవ చేద్దాం అనుకున్న వాళ్ళ కోరిక తీరనే లేదు.
గుళ్ళోకి పరుగెత్తుకెళ్ళాం ముందు ఆఫాన్సో, ఆ తర్వాత ఇంకో నలుగురం. అంతకంటే ఎక్కువమంది ఒకసారి పట్టే చోటు లేదక్కడ.
బంగారం, డబ్బు ఎక్కడున్నాయో అని వెదికాం. అక్కడి దెయ్యం విగ్రహానికి ఎదురుగా ఒక చెక్కపెట్టెలో కొంత డబ్బు వేసినట్టున్నారు, అది తీసుకున్నాం. బంగారం ఎక్కడా కనిపించలేదు. చేసేది ఏమీ లేక బయటికొచ్చాం.
చుట్టూ చూస్తుంటే దూరంగా మరో కొండ మీద ఇంకో గుడి కనిపించింది. కొంతసేపు మాలో మేము తర్జన భర్జనలు పడ్డాం అక్కడికి వెళ్ళాలా వద్దా అని. కొండ దిగి వచ్చి చెట్ల కింద నిలబడి చర్చించాం.
ఇక్కడి అనుభవంతో నీరుగారి పోయారు చాలామంది. రెండో గుడి కూడ ఇంతకన్నా మెరుగ్గా ఉంటుందో లేదో తెలీకుండా వెళ్ళటానికి వెనకాడారు. చివరికి ఒక చిన్న జట్టు అక్కడికి వెళ్ళేట్టు నిర్ణయించాం. ఆఫాన్సో తనే ముందుండి ఆ జట్టుని నడిపించాడు. నేనూ అతన్తో వెళ్ళాను.
గుర్రాల మీద ఆ రెండో గుడి దగ్గరకు వెళ్ళటం పెద్ద కష్టం కాలేదు. సమయం కూడ ఎక్కువ పట్టలేదు కూడ.
మేం ఆ ప్రాంతాలకు వెళ్ళేసరికి చీకటి పడుతోంది. చుట్టూ చెట్లు దట్టంగా పెరిగి వున్నాయి. విపరీతంగా కొబ్బరి చెట్లు. వాటి మధ్యలో ఇంకా రకరకాల చెట్లు, పూల మొక్కలు. అందంగా ఉంది ఆ ప్రదేశం!
ఎదురుగా గుడి కన్పిస్తోంది. మా కష్టానికి ఇక్కడైనా ఫలితం దొరకాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ ముందుకు సాగుతున్నాం.
ఇంతలో హఠాత్తుగా ఎక్కణ్ణుంచో ఒక బాణం వచ్చింది. వెంట్రుక వాసిలో ఆఫాన్సో తప్పించుకున్నాడు. అతని వెనక గుర్రం మీద వున్న వాడు ధడాల్న కింద పడ్డాడు. వెంటనే అందరం కంగారుగా చుట్టూ చూశాం. చెట్ల వెనక నుంచి ఎక్కుపెట్టిన విల్లులు కనిపిస్తున్నాయి. ఎన్నో చెప్పలేం. అది చూస్తూంటే ప్రతి చెట్టూ తనే విల్లంబుల్ని ధరించి నిలబడిందా అన్నట్టుంది.
ఇక్కడే ఇలా వుంటే ఇంక ముందు ముందు ఎలా వుందో తెలీదు!
ఒక వేళ ధైర్యం చేసి ముందుకు వెళ్ళినా వెనక్కు వచ్చేదెలాగా?
ఏం చెయ్యాలో పాలుపోలేదు. ఆలోచించుకునే సమయం లేదు.
మా నిర్ణయం కోసమా అన్నట్లు ఎక్కుపెట్టిన బాణాలు ఎదురుచూస్తున్నాయి.
ఆఫాన్సో నిజమైన నాయకుడు! ఒక్క క్షణంలో నిర్ణయం తీసుకున్నాడు. మెరుపు వేగంతో తన గుర్రాన్ని వెనక్కు తిప్పి పరుగు తీయించాడు.
ఎవరికీ ఏమీ చెప్పవలసిన అవసరం లేకపోయింది. అందరం రెప్పపాటులో అతన్ని అనుసరించాం.
వెళ్ళేటప్పుడే వేగంగా వెళ్ళాం అనుకుంటే వచ్చేటప్పుడు అంతకు రెట్టింపు వేగంతో తిరిగొచ్చాం!
వెళ్ళి మా నావల్లో పడే వరకు మరో విషయమే ఆలోచించ లేదు!
(ఈ కథలో పాత్రలు, సంఘటనలు అన్నీ వాస్తవాలే. కొంత నాటకీయత కోసం ఒక పాత్ర దృక్కోణం నుంచి చెప్పబడింది. మూలవ్యాసం “Syllables of Sky, Ed., David Shulman, Oxford University Press, 1995” లో దొరుకుతుంది. “An Eastern El Dorado: The Tirumala-Tirupati Temple Complex in early European views and ambitions, 1540 – 1660″, by Sanjay Subrahmanyam” )