ఆవిరి

ఆవిరైనా సరే
ఆ మాట ఎప్పుడో
మేఘమై
నాపై కురుస్తుంది.

దూరమైనా సరే
ఆ ప్రేమ ఎప్పుడో
చిరుగాలిలా
నన్ను చుట్టేస్తుంది.

జల
ఎప్పుడైనా కనిపిస్తుందా?
చేదితేనే
గలగలమని పొంగుతుంది.

పరిమళం
దూరానికి తెలుస్తుందా?
దరి చేరితేనే
గుప్పుమని కప్పేస్తుంది.

కాలమెంత
కసిరినా
పారిపోదు ప్రేమెప్పుడూ
రహస్యంగా జీవిస్తుంది.

మనిషెంత
విసిగినా
మాయమవదు మనసెప్పుడూ
మౌనంగా మసలుతుంది.

తెంచినా
తెగిపోనిది
ఆ ఊసు
తిరిగి మొలకెత్తే మహిమ దానిది.

తుంచినా
వాడిపోనిది
ఆ ఊహ
మారాకు వేసే మనసు దానిది.