గల్ఫ్ గీతం: 5. నగర సంచారి

దుబాయ్‌లో అప్పుడే నాల్రోజులు గడచిపోయాయి.

రెండోరోజు ఉదయం కాస్తంత స్వేచ్ఛగా షార్జా వీధుల్లో తిరిగిన మాట నిజమే అయినా మొత్తానికి ఈ నాలుగురోజులూ బుద్ధిగా పద్ధతిగా ఒక ప్రణాళిక ప్రకారం నడిచాయన్నమాట ఇంకా నిజం. అసలు ఇది నా పద్ధతి కాదు. పూర్వనిర్ధారిత ప్రణాళిక అంటూ ఏమీలేకుండా, అలా నగరంలో తిరుగాడుతూ ఎక్కడ నచ్చితే అక్కడ ఎంతసేపు కావాలంటే అంతసేపు ఆయా ప్రదేశాల్లో తిరుగాడుతూ నగర ప్రవాహంలో ఒక పిల్లకాలువను కాగలనా?

అనుకోవాలేగానీ అందులో సాధ్యం కానిదేముందీ?

ఫిబ్రవరి తొమ్మిదీ పదీ అలా రికామీగా గడుపుదామని నిర్ణయం.

శుక్రా శని వారాల వీకెండ్ గడచిపోయింది గాబట్టి ఇహ రాజేష్ కూడా బిజీ బిజీ…

ముందటి రాత్రే రాజేష్‌తో విషయం కదిపి సలహా అడిగాను. “బిగ్ బస్‌లో మొదటిరోజు ఊరంతా తిరిగారు కదా, ఏ ప్రదేశాలు మిమ్మల్ని బాగా ఆకట్టుకొన్నాయో అక్కడికే మళ్ళా వెళ్ళి రోజంతా గడిపిరండి.” అతని సలహా. రోగి కోరినదే వైద్యుడు చెప్పిన పథ్యం.

ఉదయపు బాల్కనీ కాఫీ పలకరింపులు అయ్యాక మెల్లగా తలుపు దగ్గరకు జారవేసి మార్నింగ్ వాక్‌కు బయల్దేరాను. షార్జాలో నాల్రోజులు నివసించినమాట నిజమే; ఎదురుగా సాగిపోతున్న రహదారిని, దానికి ఎడమ చివర ఉన్న పెద్దమసీదును, అక్కడ్నించి కుడివేపుకు మళ్ళితే వచ్చే మెగామాల్‌నూ అడపాదడపా చూసి పలకరించిన మాటా నిజమే. కానీ కనీసం ఓ గంటసేపు ఆ దారుల్లో తిరుగాడి, ఊరు మేలుకోకముందే వాటన్నిటినీ మరోసారి పలకరించి, ఓ కిలోమీటరు దూరాన ఉందని గూగుల్ చెపుతోన్న షార్జా మెయిన్‌రోడ్డును పరామర్శించి వస్తే బావుండదూ…

నడక ఆరంభించాను. ముందుగా ఎదురుగా ఉన్న రోడ్డు. అక్కడ్నించి కింగ్ ఫైజల్ మాస్క్. పక్కకు మళ్ళితే మెగామాల్. ఇహ ముందంతా తెలియని ప్రదేశాలు. అయినా ముందుకు వెళ్ళి వెళ్ళి… ఇంకా తెలవారని నగరపు వీధుల విద్యుద్దీపాల శోభను ఆస్వాదిస్తూ, మరోమలుపు తిరిగి, నేను చేరుకొందామనుకొన్న ఎయిర్‌క్రాఫ్ట్ మ్యూజియం కోసం వెదకగా అది కనపడలేదు! అక్కడి భవన సముదాయాల మధ్య ఓ పదినిముషాలు తారట్లాడాక పూర్తిగా మినహాయింపులు లేకుండా దారితప్పానని అర్థమయింది. రాజేష్‌వాళ్ళ ఎపార్ట్‌మెంట్ భవనం, దాని పరిసరాలూ బాగా గుర్తేగానీ ఆ భవనం పేరూ నెంబరూ గుర్తులేవు! అంచేత గూగుల్ కూడా చేతులెత్తేసింది. ఎయిర్‌క్రాఫ్ట్ మ్యూజియం లక్ష్యంగా పెట్టుకొని గూగుల్ నావిగేషన్‌లో వెళదామంటే నా కంగాళీతనం వల్లగాబోలు అదీ తిప్పితిప్పి పద్మవ్యూహంగా చేసేసింది. రాజేష్‌కు ఫోనుచేసి గజేంద్రమోక్షం పాడదామా అనుకొంటోన్న సమయంలో ఎవరో దానయ్య దారిలో కనిపించాడు. అతని సాయంలో ఎయిర్‌క్రాఫ్ట్ మ్యూజియం, దాని ఆధారంతో ఇంటికి చేరడం- సుఖాంతం!


తన ఆఫీసుకు వెళుతూ వెళుతూ రాజేష్ నన్ను షార్జా బస్టాండ్‌లో దింపాడు. అక్కడ్నించి బస్సులో డెయ్‌రామాల్, అక్కడ మెట్రో పట్టుకొని అల్‌ఫాహిదీ ఫోర్ట్–అదీ నా ఆలోచన. ఆరోజు ఎక్కడ గడపాలీ అన్న విషయంలో జుమైరా బీచ్, పామ్ జుమైరాలాంటి ప్రదేశాలవేపు మనసు ఊగినా చివరికి నగరపు హృదయం అల్‌ఫాహిదీ ఫోర్ట్ ప్రాంతంలో ఉందనిపించి అక్కడికే వెళ్ళాలని నిర్ణయించాను. “అలా అయితే డెయ్‌రా సిటీ సెంటర్ దగ్గర మెట్రో తీసుకోండి. అది రెడ్‌లైను. మొదటిరోజు మీరు దుబాయ్‌మాల్ నుంచి డెయ్‌రా మాల్‌దాకా వచ్చారుగదా, ఆ లైను అన్నమాట. ఆ లైన్‌లో మీరు బుర్జ్‌మన్ అన్న స్టేషను దాకా వెళ్ళి గ్రీన్‌లైన్ పట్టుకోవాలి. గ్రీన్‌లైన్లో మొట్టమొదటి స్టాప్ అల్‌ఫాహిదీ మెట్రో స్టేషన్. అక్కడ్నించి ఫోర్టు ఓ కిలోమీటరు ఉంటుంది. ఫోర్టు నుంచి వాటర్ ట్రాన్స్‌పోర్ట్ సెంటరు మరో అరకిలోమీటరు. అన్నట్టు ఫోర్టుకు దగ్గర్లోనే ఓ కృష్ణమందిరం, ఓ శివాలయం ఉన్నాయి. పన్లో పనిగా అవీ చూడండి.” వివరంగా చెప్పి బస్సులకీ మెట్రోకీ పనికొచ్చే స్మార్ట్ కార్డు చేతిలో పెట్టాడు రాజేష్.

గంట తిరిగేసరికల్లా అల్‌ఫాహిదీ మెట్రోస్టేషన్ చేరాను. దిగి కోటవేపుకు నడక ఆరంభించాను. వచ్చిందే నగరపరిశోధనకు కాబట్టి గూగుల్ నావిగేషన్ లాంటి సదుపాయాలు కట్టిపెట్టి దేశీయ పద్ధతిలో సాటి పాదచారుల సాయంతో గమ్యం చేరాలని అనుకొన్నాను. పొద్దుట్లాగా దారి తప్పుతామా… మంచిదే. అదీ మరో అనుభవమవుతుంది.

స్టేషను బయటకు రాగానే ఒకపక్క పదినిలువుల ఎత్తున అమితాబ్ బచ్చన్, మరో పెద్ద భవనం మీద సొగసులు విరజిమ్ముతూ కరీనాకపూర్, ఇంకోమూల వీళ్ళకన్న చిన్నస్థాయిలో కాజోల్ కనిపించి పలకరించి నిలవరించారు. అమితాబ్ కల్యాణ్‌వారి దగ్గర నగలు కొనమంటాడు. వాళ్ళు మూడొందల బంగారు నాణేలు ఉచితంగా పంచిపెడుతున్నారంటాడు. గ్రాముకు కేవలం మూడే దిర్హమ్‌లు మేకింగ్ ఛార్జెస్ అంటాడు. కరీనా కపూర్ మలబార్ వారి బంగారమూ వజ్రాలూ కొనమంటుంది. పాపం హుందాగా చూస్తూ ఏ ప్రలోభాలూ ప్రకటించడంలేదావిడ. వీళ్ళిద్దరిమధ్య బిక్కిబిక్కుమంటూ కాజోల్ పీలగొంతుతో జాయ్ అలుక్కాస్ నగలే కొనండి అంటోంది. ఏదీ ఏమైనా దుబాయ్ నగరంలో బంగారం వ్యాపారానికి భారతీయ తారలే ముఖ్య ప్రచారకర్తలన్నది స్పష్టమయింది!

కోటదాకా వెళ్ళే మార్గం దుబాయ్ నగరపు పాతపట్నంలోంచి సాగింది. నాకు ప్రాణం లేచొచ్చింది. ఏ టూరిస్టు ఎట్రాక్షన్ల మేకప్పులూ లేని దుబాయ్ కనిపించేసరికి మరి ఉత్సాహం పొంగిపోదూ?! అదంతా సంసారపక్షపు విపణివీధి. ఎలక్ట్రిక్ పరికరాలు, హార్డ్‌వేర్ సామాన్లు, రిఫ్రిజిరేటర్లు, ఎలక్ట్రానిక్స్ ఉపకరణాలు వంటి షాపులు ఉన్న మధ్యతరగతి మార్కెట్ ప్రదేశమది. మరి ఆయాషాపుల్లో పనిచేస్తున్నారో, వాటిల్ని నిర్వహిస్తున్నారో తెలియదుగానీ మన దక్షిణాత్యుల ఉనికి బాగానే కనిపించిందక్కడ. లుంగీని పైకి మడచి కట్టుకొన్న మర్యాదాపురుషోత్తముడు కనిపించగానే గొప్ప నేటివ్ భావన! పలకరించి, కావాలని ఏదో సమాచారం అడగటం… ఆ వంకన రెండునిముషాలు మాట్లాడటం. ఈలోగా తోపుడు బళ్ళమీద ఇనపసామాన్లు రవాణాచేస్తూ భారీకాయపు ఆఫ్ఘన్లు. మాటలకు చోటులేదు గాబట్టి చిరునవ్వుతో సరిపెట్టుకోడం… రోడ్డుపక్కన చిన్న సందులో కూరగాయలూ పళ్ళూ అమ్ముతోన్న స్థానికుడు. అనుమతి తీసుకొని అక్కడ ఒక ఫోటో.

అక్కడ్నించి నాలుగడుగులు వెయ్యగానే అల్‌ఫాహిదీ ఫోర్ట్ పలకరించింది. ఒకడుగు అటువేద్దామా అనిపించినా ముందుకే సాగాను. ఇంకో నాలుగడుగులు వెయ్యగానే కంటిని ఆకట్టుకొనే మసీదు. ‘గ్రాండ్ బుర్ దుబాయ్ మాస్క్’ అట దానిపేరు. మెట్లదగ్గరే ఇద్దరు ముగ్గురు యువకులు ప్రసన్నవదనాలతో పర్యాటకుల్ని పలకరిస్తున్నారు. హలో చెపుదామని ఒకతనితో మాట కలిపితే లోపలికి రమ్మని ఆహ్వానించాడు! వెళ్ళాను. చక్కని ఇంగ్లీషు అతనిది. నైజీరియా అట. మతసంబంధమైన చదువులో ఉన్నాడట-ఇంటర్న్‌షిప్‌లాంటి పనిమీద దుబాయ్‌లో నాలుగునెలలు. అక్కడ అమర్చి ఉన్న పుస్తకాలను చూపించి వివరాలు చెప్పాడు. ఆ వివరాలు గ్రహించే శక్తి నాకు లేదన్నది వేరే విషయం. ఈలోగా నైజీరియాకే చెందిన ఓ కుటుంబం వస్తే దృష్టి అటు మళ్ళించి వాళ్ళకు తోడుగా వెళ్ళిపోయాడు.

వాకబు చేస్తే ఆ మసీదు వెనకవేపునే వందా నూటయాభై గజాల దూరంలో కృష్ణమందిరమని, అక్కడ్నించి ఇంకో వందమీటర్లలో శివాలయమనీ తెలిసింది. మందిరాల దారుల్లో మనవేపు ఉన్నట్టే పూజాసామాగ్రి అమ్మే చిన్న చిన్న దుకాణాలు… ఒక్కసారిగా భారతదేశంలోని ఏదో చిన్న పట్నంలోకి అడుగుపెట్టిన భావన. చిన్న చిన్న వీధులు, అందులోనే ఇళ్ళు. అందులోనే షాపులు. నా ప్రమేయం లేకుండానే చెవినబడుతోన్న శుద్ధమైన హిందీ మాటలు. షాపుల్లోంచి వినిపిస్తోన్న భక్తిగీతాలు, అనూప్ జలోటా భజన్లు.

చిన్న ప్రాంగణంలో అతిముచ్చటగా అమరివుంది ఆ కృష్ణమందిరం. నిడుపాటి వృక్షాలు రెండు, వాటికింద కూర్చోడానికి సౌకర్యవంతమైన బెంచీలు, ప్రాంగణంలో ఒకమూల చిన్నపాటి రెండతస్తుల భవనం. అందులో క్రిందిభాగం కార్యాలయం, పైన కృష్ణుడి కోవెల. లోపలికి వెళ్ళానేగానీ ఏ గుడికి వెళ్ళినా అక్షరాలు రాని చిన్నపిల్లాడు బొమ్మల పుస్తకాన్ని తిరగేసినట్టు తిరగేసే బాపతు నాది.

‘శివాలయం ఎక్కడా? ఎక్కడ శివాలయం?’ అని హడావుడి పడుతోంటే ఎవరో జాలిపడి ఓ ఆరడుగుల సందు చూపించారు. ఈసారి విజయవాడ వన్‌టౌన్‌లోకి వెళిపోయిన అనుభూతి. ఎదురుమనిషిని చూసి తప్పుకోవలసినంత సన్నపాటి సందు అది. అందులో ఓ వంద అడుగులు వెళితే ‘అదిగో, అదే శివాలయం!’ అంటూ ఓ మూడంతస్తుల ఇరుకిరుకు కట్టడాన్ని చూపించారు. మెట్లు ఎక్కి పైకి వెళితే ఎదురుగా శివాలయ విభాగం కనిపించింది. దానిపక్కనే సాయిమందిరం. అతి మంద్రంగా వినిపిస్తోన్న ఇరుపక్షాల భక్తిగీతాలు. ఎంతో ధారాళంగా అందుతోన్న ప్రసాదం థాలీలు…

కాస్త పరిశీలనగా చూస్తే పై అంతస్తులో గురుద్వారా కూడా ఉందని తెలియవచ్చింది. ఉత్సాహంగా కార్యకర్తలు అందించిన శిరోవస్త్రం ధరించి మెట్లు ఎక్కాను. ఉన్నంతలో మందిరపు హాలును సువిశాలంగా మలచారు నిర్వాహకులు. ఎదురుగా గురుగ్రంథసాహిబ్… ఎడమవేపున హార్మోనియం, తబలాలు వాయిస్తూ కీర్తనలు పాడుతోన్న యువజనులు. ప్రాంగణం అంతా ఒక వింత ప్రశాంతి. చుట్టూ గోడలమీద అయ్యప్పస్వామి నుంచి ఆంజనేయుడిదాకా చిత్రపటాలు. సిక్కు మతగురువుల శోభాసింగ్ వర్ణచిత్రాల ప్రింటులు సరేసరి. ఒక్కక్షణం నేను ఉన్నది దుబాయ్‌లోనేనా అన్న ధర్మసందేహం! అన్ని ధర్మాలకు చెందిన మందిరాలూ ఒకే ప్రాంగణంలో కనిపించేసరికి నాకో భావన కలిగింది: పరమత సహనం, మతసామరస్యం దేశం విడిచి దూరం వెళ్ళినపుడు ఇంకా ఇంకా పటిష్టమవుతాయా?!

ఒకే ఊపులో ఒకే గూటిలో నాలుగు మందిరాలు చూసేశానుగదా పుణ్యం మరీ ఎక్కువయిపోతోందా అని భయమేసింది. పుణ్యభారం తగ్గించుకోవడం ఎలా అని ఆలోచించాను. స్వర్ణవిపణి గుర్తొచ్చింది. ‘అవును, అదే సరియైనమార్గం’ అనుకొని, పడవలరేవు చేరి, ఒక దిర్హమ్ చెల్లించి, అవతలివొడ్డుకి చేరాను. నాలుగడుగులు వేస్తే గోల్డ్ సౌఖ్. మళ్ళా ప్రవేశద్వారంలో కరీనా కపూర్!

కారణమేమిటో తెలియదుగానీ తెలుగువారి బంగారుగని ఈ గోల్డ్ సౌఖ్. వనితలు సరే, పురుషులు కూడా బరువు బరువు పలుపుతాళ్ళు మెడలో వేసుకొని కస్టమ్స్‌కు దొరక్కుండా వచ్చేయటం బాపతు కథలు విన్నాను. అసలు షాపింగ్ కోసమే దుబాయ్‌కి ప్యాకేజ్ టూర్లు నడపడం అన్న వార్త ఇంకా వార్తాపత్రికల్లో తటస్థపడుతూనే ఉంటోంది. మనదేశంలోకన్నా ఇక్కడ బంగారం ధర గణనీయంగా తక్కువ అన్నది నిస్సందేహం. బంగారానికీ  చిలకలపూడి ఆభరణాలకీ తేడా చెప్పలేని నాకు ఆ వీధిలోకి అడుగుపెట్టడానికి ఏ ప్రేరణా లేదు. అయినా అంత ఘనత వహించిన స్వర్ణవిపణిని పలకరించకపోతే బాగోదుకదా, అందుకని దానికోసం ఓ అరగంట. అడుగుపెట్టగానే దిక్‌భ్రమ!

కర్ణుడు కవచకుండలాలతో పుట్టినట్టు విన్నాం. రాజస్థాన్ రసపుత్రయోధులూ గ్రీసుదేశపు రణరంగధీరులూ నిలువెత్తు లోహకవచాలూ గొలుసుతెరలూ ధరించి యుద్ధాలకు వెళ్ళేవారని విన్నాం; జైపూర్ లాంటి మ్యూజియంలలో వాటిని చూశాం. కోలార్ లాంటి చోట బంగారు గనులున్నాయనీ తవ్వుకొని తీసుకొచ్చేయడమేననీ చిన్నప్పుడు అతిశయోక్తి కథలు కల్పించి చెప్పుకొన్నాం. కానీ ఆ నిలువెత్తు బంగారు కవచాలు, గనుల్లో తవ్వుకొన్న బంగారపు నిధులూ ఒకేచోట పోగుపడితే ఎలా ఉంటుందీ?

దుబాయ్ గోల్డ్ సౌఖ్‌లా ఉంటుంది!

సుమారు వందగజాల చిన్న విపణి వీధి. చెక్కల పైకప్పు. నలభై అడుగులు వెడల్పు ఉన్న ఆ వీధికి అటూ ఇటూ అతిమామూలు పరిమాణపు బంగారు దుకాణాలు. షోకేసులో నాలాంటివాడి ఊహకు కూడా అందని డిజైన్లతో, తూకంతో, పరిమాణంతో బంగారు ఆభరణాలు, మధ్యలో అక్కడక్కడా ప్లాటినమ్ సరుకులు, గ్లాసు బీరువాలలో కొన్ని వందల బంగారు గాజులూ గొలుసులు, అంగుళం కూడా అసలు రంగు కనిపించకుండా బంగారు ఆభరణాలు నిండిన ప్రదర్శనా ప్రతిమలు… హంపీ బజార్లలో రత్నాలు రాసులు పోసి అమ్మారని విని అది కవుల అతిశయోక్తీ స్వేచ్ఛాప్రలాపం అనుకొన్నాను. అది సాధ్యమేనని దుబాయ్ స్వర్ణవిపణి చెప్పింది.

భ్రమావిభ్రమల మధ్య ఊగిసలాడుతోంటే ఫోను మోగింది. ‘ఏవిటీ, నేను బంగారు దుకాణాల మధ్య తిరుగాడుతున్నట్టు ఆకాశవాణికి గానీ తెలిసిందా!’ అని ఫోను ఎత్తితే అవతలి చివర ప్రియాంక. ఢిల్లీలో మా సహోద్యోగి వాళ్ళమ్మాయి. నేను ఇలా దుబాయ్ వెళుతున్నానని తెలిసి, ‘భాయ్‌సాబ్! ప్రియాంకావాళ్ళింటికి తప్పకుండా వెళ్ళిరండి,’ అంది వాళ్ళ అమ్మ. గత నాలుగు రోజులుగా రోజూ లక్ష్మి గుర్తుచేస్తూనే ఉంది. నేను ప్రియాంకతో ఆ విషయం రోజూ మాట్లాడుతూనే ఉన్నాను. ఇప్పుడు ఆమె కన్‌ఫర్మ్ చేసింది.

“అంకుల్, మధ్యాహ్నం మూడున్నర ప్రాంతంలో రాగలరా? రాహుల్‌కూడా ఇవాళ ఆఫీసు నుంచి త్వరగా వచ్చేస్తానన్నాడు.”

“అలాగే ప్రియాంకా, వస్తాను. కానీ ఓ అరగంటే ఉండగలను. అక్కడే మా చుట్టాలబ్బాయి ఉన్నాడు. అతన్ని కలవాలి. మీ ఇంటికి వచ్చి తీసుకువెళ్ళమంటాను, సరేనా?”

సరేనంది ప్రియాంక. అరగంట అనుకొన్నది మూడు గంటలుగా పరిణమించింది.

మూడున్నర ప్రాంతమంటే నేనా దుబాయ్ క్రీక్ దగ్గర మరో గంటా గంటన్నర గడపవచ్చన్నమాట. మొదటిరోజు ఈ పక్కనే ఉన్న హెరిటేజ్ విలేజ్ పక్కనుండి బిగ్‌బస్ వెళ్ళింది. దిగలేదు. ఆ పరిసరాల్లో అల్‌ఫాహిదీ హిస్టారికల్ డిస్ట్రిక్ట్ ఉన్నట్లు గూగుల్ చెపుతోంది. వాటినీ పలకరించి వెళ్ళొచ్చు. ముందుగా భోజనం ముగించేస్తే పోలా! భార్గవి కట్టి ఇచ్చిన లంచ్ బాక్స్ ఉండనే ఉంది. ఎక్కడ ఆగుదాం లంచ్ కోసం…

కృష్ణమందిరపు వృక్షాలే అనువైన ప్రదేశమనిపించింది. చేరాను.

రెండు పళ్ళు, రెండు స్వీట్లు, రెండు అరిసెలు, రెండు జంతికలు, ఒక చిక్కని మజ్జిగ ప్యాకెట్టు. ఇవిగాక మరో బాక్సులో నలుగురికి సరిపోయే ప్రశస్తమైన పులిహోర! ఫైవ్‌కోర్స్ మీల్ అన్నమాట! తల్లీ భార్గవీ, నీ శ్రద్ధకూ ఆప్యాయతకూ జోహార్లు. ఆశపడ్డానేగానీ స్వీట్లన్నీ మిగిలిపోయాయి. తర్వాత తెలిసింది, వాటి హక్కుదారుడిని నాలుగింటికి కలవబోతున్నానని.

లంచ్ ముగిస్తూ ఉండగా ఓ నూనూగు మీసాల యువ ‘సాధువు’ పలకరించాడు. పేరు రాహుల్ మహరాజ్ అట. ఏడాది క్రితం కృష్ణమందిరంవారి సహాయంతో దుబాయ్ వచ్చాడట. సంస్కృతం చదివాడట. అన్నిరకాల పూజలూ నిర్వహించగలడట. వాస్తు, జోతిష్యం, కుండలి, గృహప్రవేశాలు, కారు పూజలు అన్నీ తెలుసట. మనిషిని చూస్తే ముచ్చట అనిపించింది. జాలీ కలిగింది. ‘జీవితమంతా ఈ స్వపరభ్రాంతులమయమేనా చిన్నోడా’ అనాలనిపించింది. మన దిగుళ్ళు మనవేగానీ మనిషి మాటతీరు, వర్ఛస్సూ చూస్తే ఈ దుబాయ్ సంపదలో తన వాటా తాను ఆర్జించగలడనీ అనిపించింది.

మళ్ళా ఏటి ఒడ్డుకు చేరి మ్యాపులో చూపించిన ప్రకారం ఎడమచేతి వేపున ఆ నీటి ఒడ్డమ్మటే హెరిటేజ్ విలేజ్ వెతుక్కుంటూ బయల్దేరాను. ఎండ మండుతోన్న మాట నిజమేగానీ నీటి ఒడ్డున నడుస్తోన్న సంబరంలో ఎండను పట్టించుకొనేదెవరూ! ఓ నాలుగయిదు వందల మీటర్లు అలా సాగగా సాగగా మట్టిరంగు భవనాలు దూరాన కనిపించాయి. అదే నే వెదుకుతోన్న విలేజ్ అయివుండాలి అనిపించి గబగబా అటు అడుగులు వేశాను. అవును. అదే! వెళ్ళీవెళ్ళటమే ‘పొయెట్రీ హౌస్’ అన్న భవనం దగ్గర తేలాను. ఓహ్! కవిత్వానికి ఇంత పెద్ద పీటా అని మనసు మురిసిపోయింది.

ఇరవైపాతికేళ్ళ క్రితం దుబాయ్ సాంస్కృతిక విభాగంవారికి ‘మనదేశపు సంస్కృతికి ప్రతిబింబంగా ఏదైన సృష్టిద్దాం’ అన్న ఆలోచన కలిగిందట. ఒకానొకప్పటి వాస్తురీతిలో ఇళ్ళూ భవనాలూ రోడ్లూ, చెట్లనీడలూ రచ్చబండలూ రూపకల్పన చేసి, నిర్మించి చక్కని ‘గ్రామాన్ని’ సృష్టించి వదిలారు ఆ విభాగంవారు. పైగా ఆ గ్రామమంతా నీటి ఒడ్డున ఉండటం, అవతలివేపున నగరం వడివడిగా సాగిపోతున్నా ఈ గ్రామంలో అలనాటి వడిలేని జీవనసరళి పునఃసృష్టి చెయ్యడం భలేబావుందనిపించింది. ఆ గ్రామాన్ని అలా హడావుడిగా వచ్చి చూడటం కాదు, మళ్ళావచ్చి కనీసం గంటన్నరా రెండుగంటలు గడపాలి అనుకొని ఆ ప్రదేశం వదిలాను. మ్యాపుల్ని సంప్రదిస్తే అల్ ఘబైబా అన్న మెట్రో స్టేషను కిలోమీటరు దూరంలో ఉందని చెప్పాయి. అటు నడక సాగించాను.


“ఓయ్ ప్రియాంకా! అసలు నువ్వు పదిహేనేళ్ళ చిన్నపిల్లవి కాస్తా ముప్పైఅయిదేళ్ళ పరిణత యువతివి ఎప్పుడయ్యావో గమనించనేలేదురా!” మా చిరకాలపు సహోద్యోగీ సహకాలనీవాసీ మంచిమిత్రుడూ అయిన మురారీలాల్‌వాళ్ళ పెద్దమ్మాయిని కలసి రెండుగంటలు గడిపాక, పసిపాప కాస్తా ప్రపంచాన్నీ దాని పోకడలనూ తెలుసుకొన్న వ్యక్తిగా ప్రత్యక్షమయ్యాక, సంతోషాన్నీ ఆశ్చర్యాన్నీ ఆపుకోలేక నేను పెట్టిన కేరింతలు అవి!

మురారీలాల్ నాకన్నా అయిదేళ్ళ తర్వాత మా భారత్ ఎలక్ట్రానిక్స్‌లో చేరాడు. వారణాసి మనిషి. కొత్తగా పెళ్ళయిన దశలో వాళ్ళూ మేవూ కంపెనీ కాలనీలో ఏడెనిమిదేళ్ళు కలసి గడిపాం. మా మా పిల్లలంతా దాదాపు ఒకే సమయంలో పుట్టుకొచ్చారు. కలసి పెరిగారు. కలసి చదువుకొన్నారు. పిల్లలకు ఏడెనిమిదేళ్ళ వయసులో వాళ్ళు కాలనీ వదలి దగ్గర్లోనే ఇల్లు కట్టుకొని వెళ్ళిపోయినా పునాది పటిష్టమైనది కావటంవల్ల స్నేహాలు చక్కగా కొనసాగాయి. టీనేజ్ వచ్చాక మురారీవాళ్ళ పిల్లలతో మా అనుబంధం తగ్గింది. వాళ్ళ ప్రపంచాలు వాళ్ళు నిర్మించుకొని వాళ్ళ స్నేహాల్లో వాళ్ళు బిజీ అయిపోయారు. అయినా తల్లిదండ్రుల వెనక క్లబ్బు ఫంక్షన్లలోనూ, పెళ్ళిళ్ళూ పుట్టినరోజుల్లోనూ కనిపించి ‘నమస్తే అంకుల్’ అనేవాళ్ళు. అంతే. వాళ్ళ పెళ్ళిళ్ళకు మేం వెళ్ళి పలకరించి వచ్చినమాట నిజమేగానీ వాళ్ళతో చిన్నప్పుడు ఉన్న అనుబంధం కొనసాగే మార్గమే లేదు.

అదిగో అక్కడ ఆగిన అనుబంధం ఈనాటి మధ్యాహ్నం దుబాయ్ నగరంలో రెండు గంటలు ప్రియాంకతో మాట్లాడుతూ గడిపేసరికి–ఏదో మంత్రం వేసినట్టు చెకచెకా రెమ్మలూ కొమ్మలూ వేసి ఫలాలుగా పరిణమించడం–ఓహ్! గొప్ప సంతోషం.

ప్రియాంకవాళ్ళు ఉండేది పామ్‌ జుమైరాకు దగ్గరలో ఉన్న ది గ్రీన్స్ అన్న ప్రాంతంలో. దుబాయ్ ఇంటర్‌నెట్ సిటీ అన్నది వాళ్ళింటికి చేరువలో ఉన్న మెట్రో స్టేషను. ఢిల్లీ రైళ్ళలో తిరిగినంత చులాగ్గా చకచకా రైళ్ళు మారి రెండున్నరా మూడు ప్రాంతంలో ఇంటర్నెట్ సిటీ స్టేషను దగ్గర దిగాను. ‘అక్కడ్నించి ఇల్లు దగ్గరే అంకుల్, టాక్సీ తీసుకోండి’ అన్నది ప్రియాంక సూచన. కానీ నాలోని నడకరాయుడు వద్దు, నడిచే వెళదాం అన్నాడు. రోడ్లవీ పట్టుకోవడంలో కాస్తంత తడబడినా, వెంటనే నిలదొక్కుకొని తాపీగా ఆ రెండు కిలోమీటర్లూ సాగిపోయాను. పదినిముషాలు గడిచేసరికి నడక నిర్ణయం ఎంత మంచిదో అర్థమయింది. నే వెళుతోన్న దారి ఒక అద్భుతమైన గృహసముదాయం మధ్యలోంచి సాగింది. రోడ్డుకు అటూ ఇటూ ఏభై మీటర్ల వెడల్పున కిలోమీటరు పొడవున అతి పచ్చని చక్కని పార్కు. మళ్ళా ఆ పార్కులో అందమైన శిలాకృతులు, నీటిచెలమలు. ఇదేదో చక్కని అభిరుచి ఉన్నవారి కాలనీలా ఉందే అనుకొన్నాను. “అభిరుచే కాదు అంకుల్, ఇది బాగా ఖరీదైన ప్రదేశం. బహుశా దుబాయ్‌లోకెల్లా ఎక్కువ అద్దెలు ఇక్కడే అనుకొంటాను. స్థానికులకన్నా ఇక్కడ యూరప్ నుంచీ అమెరికా నుంచీ వచ్చినవాళ్ళే ఎక్కువగా ఉంటారు.” కలిశాక ప్రియాంక వివరించింది.

ఈమధ్యకాలంలో కలిసింది లేకపోయినా ఒక్కసారి ప్రియాంకవాళ్ళ ఇంటికి చేరగానే పాత చనువులు మొలకలెత్తాయి. కాలనీ రోజులు, క్లబ్బు కార్యక్రమాలు, మా పిల్లలూ వీళ్ళూ కలసి చేసిన నాట్యాలూ నాటకాలూ, వీళ్ళందర్నీ తీసుకొని మేం ఏర్పాటు చేసిన ఢిల్లీ ప్లానిటోరియం విజిట్లూ-మెల్లమెల్లగా కబుర్ల ప్రవాహం వడిదేరింది. కాసేపు వీడియోకాల్ చేసి మురారీతోనూ కాంతాతోనూ సంభాషణ. వాళ్ళమ్మాయి ఇంటికి నే చేరుకోగలిగినందుకు నాకన్నా వాళ్ళే ఎక్కువ సంబరపడ్డారు.

ఈలోగా వాళ్ళ రెండేళ్ళ పిల్లడు నిద్రలేచాడు. నా బాక్‌పాక్‌లో ఉన్న స్వీట్లు గుర్తుకొచ్చాయి. అవి చూసి వాడు సంతోషపడిపోయాడు. సంకోచిస్తూనే భార్గవి చేసిన పులిహోర ప్రియాంకకు చూపించాను. కాస్తంత రుచి చూసి ప్రియాంక మరింత సంబరపడిపోయింది. ఆ సాయంత్రం మాకు అదే ఫలహారం అయింది.

తెలియకుండానే మాటలు పుస్తకాలవేపు, ప్రయాణాలవేపు, జీవితంవేపూ మళ్ళాయి. ప్రియాంక ఇంజినీరింగ్ చదువుకుంది. పిల్లాడు పుట్టకముందుదాకా ఉద్యోగం చేసింది. ఆఫీసులో అయిన పరిచయమే రాహుల్‌తో పెళ్ళికి దారితీసింది. 2013లో దుబాయ్ వచ్చారట. ఏదో ఆయిల్ కంపెనీలో కోర్ ఇంజినీరింగ్‌లో రాహుల్ ఉద్యోగం. ప్రియాంకకు పుస్తకాలంటే ఇష్టమూ గురీ అని మాటల్లో తెలిసిపోయింది. డాన్‌బ్రౌన్‌ల దగ్గర ఆగకుండా హండ్రెడ్ యియర్స్ ఆఫ్ సాలిట్యూడ్ దాకా సాగిన పఠనాయానం ఆమెది. పుస్తకాలకూ జీవితానికీ ఉన్న సంబంధం గుర్తెరిగిన మనిషి. కైట్‌రన్నర్ లాంటి నవలల్లో అక్షరాన్ని సరుకుగా మార్చి అమ్మే చాతుర్యాలను పసిగట్టగల నిశితమైన బుద్ధి ఆమెది. పుస్తకాలే కాకుండా ప్రయాణాలూ చేసిన మనిషి. టూరిస్టుకూ ట్రావెలర్‌కూ తేడా బాగా తెలిసిన మనిషి. కాసేపయ్యేసరికి ఆమెలోనూ ఆమె మాటల్లోనూ నా ప్రతిబింబం కనిపించసాగింది! నన్ను నేనే డిస్కవర్ చేసుకొన్నంత సంబరం… జీవితం విషయంలోనూ జీవితాన్ని మలచుకోవడం విషయంలోనూ చాలా ఆరోగ్యకరమైన స్పష్టతా సమర్థతా కనిపించాయి. ఆ విషయంలో మా పిల్లల ప్రతిబింబాలు ప్రియాంకలో కనిపించాయి. వీళ్ళంతా ఈ తరం మనుషులు. “ఉద్యోగం వదలడమన్న మాటే లేదు అంకుల్. వీడికి మూడేళ్ళు రాగానే వాడు స్కూలు నేను ఉద్యోగం. అసలు ఇప్పుడే చేరొచ్చుగానీ వాడి బాల్యాన్ని బాగా ఆస్వాదించాలి అన్న ఉద్దేశంతో ఆగిపోయాను” అంది ప్రియాంక.

మేం మాటల్లో ఉండగానే రాహుల్ వచ్చి చేరాడు. వస్తాడు అనుకున్న మా చుట్టాలబ్బాయి రాలేనని మెసేజ్ పెట్టాడు. రాహుల్ కూడా ప్రియాంకలానే గాఢత ఉన్న మనిషి. పుస్తకాలు, ప్రయాణాల విషయంలో ప్రియాంకకు సరిజోడు. ‘అంకుల్‌కు కూడా ప్రయాణాలూ పుస్తకాలూ అంటే బాగా ఇష్టం. ఇదిగో నేను ఇంకా చదవాల్సిన పుస్తకాల లిస్టు రాసి కూడా ఇచ్చారు’ అంటూ సంబరంగా చూపించింది ప్రియాంక. రాహుల్‌ను కలవటం అదే మొదటిసారి, అయినా ఆ కొత్త తెలియనే తెలియకుండా అతనితోనూ మాటలు సాగిపోయాయి. అప్పటికే అయిదు దాటేసింది, బయల్దేరతానన్నాను. “కాదంకుల్, మా నైబర్‌హుడ్‌లో ఓ చెరువు, దానిచుట్టూ పార్కూ ఉన్నాయి. మీరు బాగా ఇష్టపడతారు. మరో అరగంట ఆగి వెళ్ళండి” అన్నారు ఇద్దరూ. రాజేష్‌కు ఫోనుచేసి రావడం బాగా లేటవవచ్చు అని చెప్పేశాను.

వాళ్ళ ఎపార్టుమెంటు భవనంలోంచి బయటపడగానే పార్కు, చెరువు. బాగా పొడవూ, తక్కువ వెడల్పూ ఉన్న దీర్ఘ చతురస్రాకారపు కృత్రిమ జలరాసి అది. అభిరుచికి ఆర్థికశక్తి తోడయితే ఎలాంటి సౌందర్యసృష్టి జరగగలదూ అన్న విషయానికి అతి చక్కని ఉదాహరణ ఆ ఉద్యానవనం. “చెరువు అటుపక్క కూడా మాలాంటి ఎపార్టుమెంటు భవనాలే ఒక వరస ఉన్నాయి. అవి దాటితే భలే పెద్ద గోల్ఫ్ క్లబ్.” చెప్పింది ప్రియాంక. సుందరమైన దృశ్యాలు కనపడగానే కెమెరా నేను ఉన్నానని గుర్తుచేసింది. ప్రకృతిదృశ్యాలు సరే, ప్రియాంకా రాహుల్‌లకన్న ఫోటో తియ్యడానికి సుందరదృశ్యమేముంటుందీ?!


“హైస్కూలూ కాలేజీ రోజుల్లో నువు మీ స్నేహబృందాలకు నాయకురాలివి అయివుంటావు కదూ?”

“అంతేం కాదులే అంకుల్!” అన్నది కానీ ఆ అనడంలోనే భార్గవి ఒప్పుదల కనిపించింది. తన బలమైన వ్యక్తిత్వం, స్పష్టమైన అభిరుచులు, స్వతంత్రత నిండిన ఆలోచనలూ నాతో ఆమాట అనిపించాయి. ఆరోరోజు, పది ఫిబ్రవరి, కాస్త విశ్రాంతిగా గడుపుదామనుకొన్నాను. అప్పటికి అయిదురోజులుగా తీరికలేని తిరుగుళ్ళయిపోయిందికదా, ఒకరోజు కాస్త నెమ్మదించడం అవసరమనిపించింది.

నిజానికి ఆరోజూ మర్నాడూ సతీష్-ప్రవీణల ఇంట్లో గడపాలి. ఆనాటి సాయంత్రం ఆఫీసునుంచి తొందరగా వచ్చేసి దుబాయ్ శివార్లలో ఉన్న మిరకిల్ గార్దెన్, గ్లోబల్ విలేజ్ తీసుకువెళతానన్నారు సతీష్. ఎలాగూ దంపతులిద్దరూ పొద్దున్నే ఆఫీసులకు వెళ్ళే హడావుడిలో ఉంటారు, పిల్లలు స్కూళ్ళకు వెళ్ళాలి, అదంతా ముగిశాక మధ్యాన్నానికి అక్కడికి చేరితే బావుంటుందని ప్లాను చేశాను. తనకు ఆఫీసులో ఉన్న ఓ ముఖ్యమైన మీటింగు చూసుకొని పదకొండింటికి తిరిగివచ్చి నన్ను అపుడు ప్రవీణావాళ్ళింట్లో దింపుతానని చెప్పి రాజేష్ ఆఫీసుకు వెళ్ళిపోయాడు. అలా భార్గవితో తీరిగ్గా ఓ గంటా గంటన్నర మాట్లాడే అవకాశం దొరికింది. సహజంగానే మాటలు తన చిన్నతనంవేపు, రాజేష్‌తో పరిచయమూ పరిణయం వేపూ సాగాయి. మొదటిరోజు రాజేష్ ‘…అదిగో ఆ ప్రగతి ప్రింటర్స్ ఉద్యోగమే నన్ను భార్గవి దగ్గరకు చేర్చింది’ అన్నాడు గదా… అది గుర్తొచ్చి వివరాల్లోకి వెళ్ళాను.

భార్గవిది కూడా ఘంటశాల ప్రాంతమే. అక్కడ డిగ్రీ ముగించాక హైదరాబాద్ చేరుకొంది. ప్రగతి ప్రింటర్స్ హనుమంతరావుగారు చుట్టాలవుతారట. ఆయన సంరక్షణలోకి వెళ్ళింది. హనుమంతరావుగారికీ ఆయన భార్యకూ భార్గవి ఇష్టదౌహిత్రి అయింది. ప్రగతిలోనే ఉద్యోగమూ చేసింది. అలా రాజేష్‌తో పరిచయం. వీళ్ళిద్దరికీ ఈడూజోడూ కుదురుతుందనిపించి హనుమంతరావుగారు విషయం కదిపారట. ఈలోగా రాజేష్‌కు పోలండ్‌లో ఉద్యోగం వస్తే అక్కడికి వెళ్ళాడట. కానీ విషయం ముందుకువెళ్ళి అతను పోలండ్‌లో ఉండగానే 2013 ఫిబ్రవరిలో పెళ్ళయిందట. భార్గవి కూడా పోలండ్ వెళ్ళి నాలుగు నెలలు గడిపింది. యూరప్ అంతా తిరిగింది. 2013 మే నెలాఖరులో దుబాయ్ చేరారిద్దరూ.

“మీరన్నట్టు నేను ఎప్పుడూ లీడింగ్ రోల్‌లోనే ఉండేదాన్ని. అది అలవాటయిపోయింది. అలా ఉండాలని కోరుకొనేదాన్ని. దాంతో కాస్తంత పట్టుదలలూ ఎక్కువయ్యాయి. పెళ్ళయాక రాజేష్‌ని చూసి సహనం, ఇతరుల మాటల్ని గమనించడం, వినడం, గౌరవించడం బాగా అలవాటయింది.” చెప్పుకొచ్చింది భార్గవి. ఈలోగా రాజేష్ వచ్చి మాతో కలిశాడు. తనవైపు నుంచి మరికొన్ని వివాహపు వివరాలు అందించాడు.

ఈలోగా ప్రవీణ ఫోను: “ఇంకా మా ఇంటికి చేరలేదా! వెళ్ళండి. మా వంటావిడ లక్ష్మి మీకోసం భోజనం చేసి ఎదురుచూస్తున్నారు. పిల్లలు ఒంటిగంట ప్రాంతంలో వచ్చేస్తారు. నేనూ సతీషూ మూడుగంటల ప్రాంతం.” అన్నారావిడ. “అసలు మీరు నిన్న రాత్రో ఇవాళ బాగా పొద్దున్నో వస్తారనుకొన్నాను. మా ఇంటిదగ్గర వాకింగ్‌కు వెళదామనుకొన్నాను. మీరేమో మధ్యాన్నం వస్తున్నారు!” అని నిష్టూరమాడారు ప్రవీణ.

ప్రవీణావాళ్ళ ఇంటికి చేరేసరికి పన్నెండు దాటింది. ఏడో అంతస్తు అనుకొంటాను, చక్కని వ్యూ. ఎడమవేపున ప్రస్ఫుటంగా కనిపించే మసీదు. ముందంతా పేద్ద ఖాళీ స్థలం. కుడివేపున కాస్త దూరాన రహదారి ఉన్న శబ్దఛాయలు. “పక్కనే ఆసక్తికరమైన షాపులూ రెస్టారెంట్లూ ఉన్నాయి. మీరు ఊరికే ఉండరుగదా, ఓ అడుగు అటువేసిరండి…” అని ఫోన్లో ప్రవీణ సలహా. అయినా బద్ధకించాను. లక్ష్మిగారినడిగి నాకు నచ్చే విధంగా కాఫీ చేయించుకొన్నాను. ఆమెది కోనసీమ అట. వచ్చి పదేళ్ళు దాటినట్టుంది. కొన్నాళ్ళు ట్రావెల్ డాక్యుమెంట్ల విషయంలో ఇబ్బంది పడ్డారట. ఆమధ్య యు.ఎ.ఇ.  ప్రకటించిన అమ్నెస్టీ పథకంలో – ప్రవీణ పూనికతో – డాక్యుమెంట్లన్నీ సరిదిద్దుకొన్నారట.

భోజనాలవేళకు కవలపిల్లలిద్దరూ గూటికి చేరారు. తొలి టీనేజి దశ. తొమ్మిదోక్లాసనుకొంటాను. స్కూలు దగ్గరే, నడిచివెళ్ళిరావచ్చు. కాసేపు కబుర్లు.

భోజనం అయ్యాక కొద్దిసేపు నడుం వాల్చాను. ఢిల్లీ వదిలాక ఈ పగటి నిద్ర సుఖం అనుభవించడం అదే మొదటిసారి!

చెప్పినట్టుగానే మూడింటికల్లా ప్రవీణ వచ్చేశారు. వచ్చీరాగానే ఏదో చిన్నప్పటి స్నేహితులలాగా కబుర్లలో పడిపోయాం. అలా అని గంభీరమైన విషయాలేంగాదు… విజయవాడ గురించి, ఫేస్‌బుక్ గురించి, అప్పటికే ఇద్దరికీ పరిచయమున్న కామన్ ఫ్రెండ్స్ గురించి, మాటల్లో బయటపడుతోన్న కొత్తపరిచయాల గురించి, చదివిన పుస్తకాల గురించి… తెలియకుండానే ఒకరి గురించి ఒకరికి అవగాహన పెరిగే కబుర్లు. ఆమె ఒకప్పుడు విరివిగా బ్లాగులు రాశారు. ఇపుడు ఆ ఊపు తగ్గింది. ఎపుడైనా ఎఫ్బీలో చక్కని పోస్టులు, ఫోటోలు పెడుతూ ఉంటారు. ఆ పోస్టుల భాషలో ఒక ఈజ్ కనిపిస్తుంది. ఇపుడు తన మాటల్లో దానికి రెట్టింపు ఈజ్ కనిపిస్తోంది. స్పష్టమైన ఆలోచన, భాషమీద చదువులకే పరిమితం కాని సహజమైన పట్టు ఉంటే తప్ప సంభాషణలలో ఆ స్పాంటేనిటీ రాదు. ఈలోగా లక్ష్మి వచ్చి చెరో కాఫీ అందించారు. “ఈమె జీవితం నిండా అనుభవాలే. పదేళ్ళుగా ఇక్కడ ఉండి పిల్లల్ని అక్కడ చదివిస్తోంది. వాళ్ళు పి.జి. దాకా వెళ్ళారు. ఒక పట్టాన మాట్లాడదుగానీ మాట్లాడించగలిగితే వినడానికి ఎన్నో విషయాలు ఉన్నాయి ఆమె దగ్గర.” అది ఆమె వెళ్ళాక ప్రవీణ లక్ష్మిగారి గురించి ఇచ్చిన పరిచయం.


అనుకొన్నదానికన్నా కొంచెం ఆలస్యంగా వచ్చారు సతీష్. వచ్చీరాగానే ఇద్దరం మిరకిల్ గార్డెన్ వేపు సాగిపోయాం.

ఇంటినుంచి గంట ప్రయాణం. దుబాయ్ నగరమంతా దాటాక సుమారుగా నిన్న నేను వెళ్ళిన ప్రియాంకవాళ్ళ ఇంటి పరిసరాల్లో ఉందీ అద్భుత ఉద్యానవనం.

వెళ్ళేదాకా ‘ఏవిటో ఒక పూలతోట కోసం ఇంతింత దూరాలు రావాలా?’ అనుకొన్నాగానీ అక్కడ ఓ గంట గడిపాక ‘అవును, తప్పకుండా చూడవలసిన అద్భుతమే ఇది!’ అనిపించింది.

ఈ దుబాయ్‌వాళ్ళకు ఏమొచ్చినా పట్టలేమనుకొంటాను. ఎవరో రియల్టర్‌కు ఒక ఆలోచన తట్టింది. ఒక విశాలమైన ప్రాంగణంలో లక్షలాది పూలతో ఉద్యానవనం సృష్టిస్తే ఎలా ఉంటుందీ? ఆ ఆలోచనకు ఫలితమే ఆరేడేళ్ళ క్రితం ఈ ఎడారిలో కోట్లాది పూలకు నివాసస్థలంగా పుట్టుకొచ్చిన మిరకిల్ గార్డెన్.

అంతా కలసి నూటేభై రెండొందల ఎకరాలుంటుందేమో… వెళ్ళీవెళ్ళగానే ఏభై అడుగుల ఎత్తున పచ్చని లతలు నిండిన గుర్రపు శిరస్సుల స్వాగతం. స్వాగతం సంగతి ఎలా ఉన్నా ముందువేపూ కుడి ఎడమలా పరచుకొని ఉన్న అనేకానేక పూల ఆకృతులు చూస్తే ఎటువెళ్ళాలో తెలియని సందిగ్ధత. ఆనుపానులు తెలిసిన సతీష్ మార్గదర్శకత్వంలో పార్క్ చుట్టూ ఉన్న పూలబాటలో నడక.

ఒక పక్కన పూలతోపాటు రంగురంగుల గొడుగులు నిండిన పందిరిబాట (ఇక్కడ ఒకటిరెండు తెలుగు సినిమాలు తీశారు- సతీష్), మరికాస్త దూరం వెళితే హృదయాకారంలో అమర్చిన పూల ఆర్చిలగుండా సాగిపోయే బాట. ఓ పక్క ఏభై అరవై అడుగుల మికీమౌస్, ఇంకాస్త దూరాన ఎమిరేట్ ఎయిర్‌వేస్‌వారి విమానం సహజ ఆకృతిలో అమర్చిన పూలదొంతరలు. ఓ కొలనుపక్క పూల కురులను విరయారబోసిన వనిత శిల్పం. మధ్యలో కనిపించే ఒక పెద్ద పూలకోట, పూల పెంగ్విన్‌లు, డోనాల్డ్ డక్‌లు, జపనీస్ ఇళ్ళు- వందలవేలలక్షల, బహుశా కోట్ల పూలు. పెద్దాళ్ళని కూడా చిన్నపిల్లల్ని చేసే శక్తి ఉన్న పుష్పవనమది. ప్రపంచంలోనే అతిపెద్ద పుష్పోద్యానవనమట. గినెస్‌వాళ్ళూ ఒకటోరెండో అవార్డులిచ్చారని అక్కడి బోర్డులు చెపుతున్నాయి. ఏమాటకామాట- మిరకిల్ అంటూ కాస్తంత అతి చేశారా అనిపించింది కానీ పూలను చూసి ‘ఎక్కువయ్యాయి’ అని ఫిర్యాదుచేసే అరసికులు ఉంటారా?!

మిరకిల్ గార్డెన్ నుంచి గ్లోబల్ విలేజ్ అరగంట దూరం.

ఈ గ్లోబల్ విలేజ్ గురించి స్ఫూర్తి రెడ్డి అనే స్నేహితుడు ఇండియాలో ఉండగానే తప్పకుండా చూసిరమ్మని మరీమరీ చెప్పారు. ఆ ప్రేరణ నా మనసు వెనుక ఉంది.

అక్కడికి చేరేసరికి ఏడు దాటేసింది. ఓ గంటన్నరా రెండు గంటలు గడిపి వెళ్ళాలన్నది మా ఆలోచన. కానీ మాకు ఆదిలోనే హంసపాదు ఎదురయింది.

సోమవారాలు అక్కడ కుటుంబాల కోసం ప్రత్యేకించారట. బానేవుంది కానీ కుటుంబాలను ‘మాత్రమే’ అనుమతిస్తారట. అది అవరోధమయింది. ‘ఈయన మా ఇండియా నుంచి వచ్చిన అంకుల్, మళ్ళా ఇక్కడికి వచ్చే అవకాశం ఈయనకు లేదు, మా ఇద్దర్నీ ఓ కుటుంబంగా పరిగణించి టికెట్లివ్వండి’ అని అడిగాడు సతీష్. వీలుకాదని కౌంటరు వనిత ఎంతో మర్యాదగా చెప్పేసింది. ‘ఓ పనిచెయ్యంది, సెక్యూరిటీ దగ్గర అడిగిరండి. వాళ్ళు సరేనంటే నేను టికెట్లిస్తాను’ అని తనకు తోచిన పరిష్కారం సూచించిందావిడ. సెక్యూరిటీ దగ్గర ఉన్న చురుకైన అరబ్బు దుస్తుల కుర్రాడు సారీ చెప్పేశాడు.

ఎలాగా ఎలాగా అనుకొంటొంటే మాకో స్వదేశీ ఆలోచన వచ్చింది. ఎవరైనా భారతీయ కుటుంబాలవాళ్ళు కనబడితే వాళ్ళను అడిగి వాళ్ళతో చేరి వెళ్ళవచ్చుగదా అనిపించింది. వెదుకులాటలో పడ్డాం. పావుగంట తర్వాత ఓ కుటుంబం… వాళ్ళకు మా సమస్య వివరిస్తూ ఉండగానే గరుత్మంతుడి మీద విష్ణుమూర్తిలాగా ఓ నిడుపాటి తెల్లదుస్తుల అరబ్బీ ఆఫీసరు ఎలక్ట్రిక్ వాహనంలో వచ్చేసి మాముందు వాలాడు. ‘ఏం చేస్తున్నారిక్కడ?’ అని అధికారం నిండిన స్వరంతో ప్రశ్న! సమాధానం చెపుతూ చెపుతూ ఉండగానే మేవు చేస్తోన్న పనిలోని అనౌచిత్యం స్పష్టంగా బోధపడింది. బేషరతుగా క్షమాపణ చెప్పేశాం. ఆ సెక్యూరిటీ అధికారి కంఠస్వరంలో మార్పు వచ్చింది. ‘సరే, మీ అంకుల్‌కు మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశం లేదంటున్నారుగదా, రండి మీ సమస్యను పరిష్కరిస్తాను’ అంటూ కౌంటరు దగ్గరకు తీసుకువెళ్ళి ప్రత్యేక అనుమతిని సూచించే ఫ్రీ టికెట్లు ఇష్యూచేయించి చేతిలో పెట్టి, ‘మీరు అలా ఏ కుటుంబం వెనకో వెళిపోతే కోరి ప్రమాదం తెచ్చుకొనేవారు. లోపలికి వెళ్ళాక వారి దారి వారిది, మీ దారి మీది అయ్యేది. ఇలా చొరబడినవాళ్ళను పసిగట్టడం మా సెక్యూరిటీకి మంచినీళ్ళప్రాయం. మీరు దొరికిపోయేవారు. అది పెద్ద అపరాధమయ్యేది’ అంటూ సాదరంగానే హితవు పలికాడు!

ప్రపంచం మూలమూలల్లో ఉన్న నూటికి పైగా దేశాలు తమతమ చరిత్ర సంస్కృతులకు అనుగుణంగా రూపకల్పన చేసుకొని నిర్మించుకొన్న సువిశాలమైన ప్రాంగణాలతో నిండిన మూడునాలుగువేల ఎకరాల మినీ ప్రపంచమది. సంస్కృతీ ప్రదర్శనలతో పాటు ఆయాదేశాలవాళ్ళు పెట్టుకొన్న స్టాల్స్, అందులో దొరికే విభిన్నమైన వస్తువులూ, పనిలోపనిగా ఆయా సంప్రదాయాల తినుబండారాలూ భోజనాలూ, పెద్దదేశాల ఆవరణలో ఉన్న వేదికల మీద జరుగుతోన్న నాట్య ప్రదర్శనలూ- అదో నిత్య వసంతం.

లోపలికి వెళ్ళి నాలుగడుగులు వెయ్యగానే మనదేశం స్టాలు. ఆవరణ పెద్దదేగానీ అలంకరణా అమరికా ఏదో మొక్కుబడిగా చేసినట్టనిపించింది. లోపల ఆరుబయలు వేదిక మీద ఏవో సినిమా డాన్సులు. అవి ఓపిగ్గా చూశాక ఓ భాంగ్రా నృత్యం, కొన్ని హిందీ సోలో పాటలు… కళాకారుల్ని కలుసుకొని మిత్రధర్మంగా అభినందించి ముందుకు సాగాం. ఆఫ్రికా ఎవెన్యూ ఆకట్టుకొంది. ఉమ్మడి వేదిక మీక షారుఖ్‌ఖాన్ పాటలకు నాట్యాల హోరు వినబడుతూనే ఉంది. అమెరికా ప్రాంగణం మొగలో ఆకట్టుకొనే నేటివ్ అమెరికన్ శిల్పం. ఆఫ్ఘనిస్తాన్ స్టాల్లో మన సంగీతమేనా అనిపించేంత పోలికలున్న సంప్రదాయ గీతాల కార్యక్రమం. యు.ఎ.ఇ ఆవరణలో ఆ దేశపు సంప్రదాయ దుస్తుల్లో ఆజానుబాహుల నాట్యం. అజర్‌బైజాన్, ఇరాన్, సిరియా, మంగోలియా, యూరప్, చైనా, ఈజిప్ట్- అన్ని దేశాలలోకీ తొంగిచూసిన అనుభూతి. మొత్తానికి అక్కడ గడిపిన గంటా-అదో అరుదైన అనుభవం.

(సశేషం)