పరిచయం: భారతీయ రచయిత్రులు

ఒక సంస్కృతిలో స్త్రీలు పోషించిన పాత్రని, వారి సాంఘిక స్థాయినీ చారిత్రక ఆధారాలతో పరిశీలించినప్పుడు, ఆ నాగరికత నిజస్పూర్తి, దాని గొప్పదనం, బలహీనతలూ పరిమితులూ స్పష్టంగా అర్థమవుతాయి. మానవనైజంలో బలంగా పాతుకుపోయిన స్వార్థస్వభావాన్ని ఆ సమాజం ఎంతమేరకు అధిగమించగలిగినదన్న విషయాన్నిబట్టి ఆ నాగరికత పరిణతిని మనం అంచనా వెయ్యవచ్చు. ఆ సమాజం ఎదుగుతున్న క్రమంలో అనాదిగా అన్నిటికీ పురుషుల మీదనే ఆధారపడిన స్త్రీలపట్ల పురుషుల దృక్పథంలో వచ్చిన మార్పులు, వారి న్యాయాన్యాయ విచారణాదక్షతకి, నిష్పాక్షికతకీ కొలమానంగా భావించవచ్చు. వాళ్ళ వైవాహిక ఆచారవ్యవహారాలు–పురుషులు స్త్రీలను ఒక అంగడి సరకుగా, యుద్ధంలో గెలుచుకున్న పతకంగా భావించారో లేక సంసారజీవితం ఆనందమయంగా కొనసాగడానికి పురుషుడితో పాటుగా అమూల్యసహకారమందించే సమవుజ్జీగా పరిగణించారో తెలియజెప్తాయి. లైంగికనైతికత విషయంలో నెలకొల్పిన నియమాలు లేదా కట్టుబాట్లు, ఆ సమాజపు నైతిక ధోరణిని, స్త్రీలకు నిర్దేశించిన ప్రమాణాలు, పరీక్షలకు పురుషులు కూడా లోబడి ఉంటున్నారా లేదా అన్న సంగతిని నిర్ధారిస్తాయి. తమ వివాహం విషయంలోను, కుటుంబ వ్యవహారాల్లోనూ స్త్రీలు తీసుకోగలిగిన స్వయంనిర్ణయస్థాయి, ఏ మేరకు వారి హక్కులు పరిరక్షింపబడుతున్నాయో, ఆ సమాజంలో పురుషులు ఏ మేరకు తమ స్వార్థ, అధికార, ధనాపేక్షలని నిగ్రహించుకోగలుగుతున్నారో సూచిస్తుంది. ఒక దురదృష్టవంతురాలైన భర్తృవిహీనపట్ల తోటి సమాజపు ప్రవర్తనే వారిలో నిజమైన జాలీ దయా ఉన్నాయో లేదో తెలియజేస్తుంది. అక్షరాస్యత యొక్క సరియైన విలువని వారు నిజంగా గుర్తించారా లేదా అన్నది స్త్రీలకు చదువుని అందుబాటులో ఉంచారా లేదా అన్నదాన్నిబట్టి గ్రహింపుకొస్తుంది. సంగీతం, నృత్యం వంటి కళలు నేర్చుకునేందుకు, ప్రావీణ్యం సాధించేందుకు స్త్రీలకు ఉన్న అవకాశాలను బట్టి సాంస్కృతిక అభ్యున్నతి ఏ మేరకుందో అర్థమవుతుంది. స్త్రీలు బహిరంగంగా తిరిగేందుకు, ప్రజాసేవలో పాలుపంచుకునేందుకూ లభించే స్వేచ్ఛ, ప్రగతికి వాళ్ళ భాగస్వామ్యం కూడా అవసరమనే సత్యాన్ని ఆ సమాజం ఎంతమేరకు గ్రహించిందన్నది తెలియజేస్తుంది.[1]

పురుషాధిక్య సమాజాలన్నిటిలోనూ అనాదిగా పుత్ర జననం ఒక వేడుక. కొడుకు కుటుంబం పేరు కొనసాగించడం, యుద్ధాలకు అందిరావడం, కుటుంబవృత్తి కొనసాగించడంలో ముఖ్యపాత్ర వహించడం, మొదలైనవి కారణాలుగా కనిపిస్తున్నాయి. వేదకాలంలోకూడా కొడుకుకే ప్రాధాన్యత ఉన్నా ఆడపిల్లపట్ల విముఖత ఉండేది కాదు.(బృహదారణ్యకోపనిషత్తు, IV, 4.18 ఆథ య ఇచ్చేద్, దుహితా మే పండితా జాయేత్, తిలౌదనౌ పాచయిత్వా అరణీయాతామితి) సంస్కారవంతులైన తల్లిదండ్రులు కొడుకుకోసం ఎంత తపించేవారో కూతుళ్ళకోసమూ అంతే తపించేవారు. మరికొంతమంది, కొడుకుకంటే తెలివైన, మంచినడతగల కూతురే కొడుకుకన్న మిన్న అని భావించేవారు. కుమార్తెలను కుటుంబగౌరవానికి గర్వకారణంగా సమ్మానించేవారు.[2]

ఇంత మంచి వారసత్వమూ మధ్యయుగాల్లోకి వచ్చేసరికి రూపు మారిపోయింది. కారణాలు ఎన్ని ఉన్నప్పటికీ, స్త్రీ పరిస్థితి కుల, మత, భాష, ప్రాంతభేదాలతో నిమిత్తం లేకుండా అత్యంత అమానవీయంగా, దయనీయంగా మారిపోయింది. ‘ఆడదానిగా పుట్టేకంటే అడవిలో మానైపుట్టినా మెరుగు’ అనే సామెత ఎలా వచ్చిందో ఊహించినపుడు దాని వెనుకనున్న బాధ అర్థం అవుతుంది.

ఈ నేపథ్యంలో శారదా శివపురపుభారతీయ రచయిత్రులు పుస్తకాన్ని విశ్లేషించి చూసినపుడు, ఈ పుస్తకం భారతీయ సాహిత్యానికే సంబంధించినదే అయినా, తెరమరుగునే ఉన్న రచయిత్రుల పట్టికో, వారిని వెలుగులోకి తీసుకువచ్చే ప్రయత్నమో కాదు. ఈ పుస్తకంలో రెండు వ్యాసాలు చదవకముందే శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రిగారి అరికాలిక్రింద మంటలు అనే కథ గుర్తుకు వచ్చి కళ్ళు చెమర్చేయి. ఈ వ్యాసాలు రచయిత్రుల జీవిత చిత్రణ అయినప్పటికీ శారదగారి కథనం బిగువైన కథలా సాగిపోతుంది. గృహహింస, రాజ్యహింస, సామాజికహింస విశదీకరిస్తున్న సందర్భాలలో వారు చేసిన పరిశీలనలు విలువైనవి. వ్యక్తిగత జీవితాంశాలు మాత్రమే స్పృశించకుండా, వాటితోపాటు ఆనాటి సాంఘిక వాతావరణాన్ని, పురుషాధిక్య సమాజాన్ని ఎదిరించడానికి ఇందులోని స్త్రీలు పడిన బాధలని, ఎదుర్కొన్న సవాళ్ళనీ ప్రస్తావించడం వల్ల వాటి నేపథ్యం, ఆ సవాళ్ళ కాఠిన్యత మనకూ అర్థమవుతాయి. కొన్ని కవితలకి శారదగారి అనువాదాలు, వారి పరిశీలనలను బలపరుస్తాయి.

తన జీవితాన్ని తనకు నచ్చిన రీతిలో మలచుకోగల స్వేచ్ఛ ఉందని, మహారాణి హోదాను సైతం ఒదులుకుని, సమాజాన్ని ఎదిరించి చెన్నమల్లికార్జునికి జీవితాన్ని అంకితం చేసిన అక్క మహాదేవి; విగ్రహారాధన లేని, స్థితప్రజ్ఞతతో కూడిన భక్తిమార్గాన్ని బోధించిన గంగాసతి; కేవలం 18 ఏళ్ళ అతి తక్కువ జీవితకాలంలో, నలభైరెండు అభంగ్‌లు వ్రాసి, వర్కారీ సంత్‌గా గుర్తింపు తెచ్చుకున్న ముక్తాబాయి; ఏ విద్యాగంధం లేకపోయినా 300 అభంగ్‌లు వ్రాసిన సంత్ జానాబాయి; స్త్రీని ఒక ఆట వస్తువుగా, ఆస్తిగా, సమాజం ఎలా చూసిందో చెప్పిన సంత్ కన్హోపాత్ర; యుద్ధాలకోసం ఏళ్ళకి ఏళ్ళు పురుషులు బయటకి వెళ్ళినపుడు, రాజమహలులలోని స్త్రీలు, పిల్లలూ పడే ఆవేదనలను హుమయూన్ నామాలో చిత్రించిన గుల్ బదన్ బేగమ్; సీత దృక్కోణంలో రామాయణాన్ని వ్రాసి సంచలనం సృష్టించిన చంద్రబతి; మూడేళ్ళ వయసులో ముప్ఫై ఏళ్ళ వాడితో పెళ్ళి అయినా, భర్త అసూయను, అవమానాలనూ సహించి, తుకారామ్ శిష్యురాలిగా అభంగ్‌ల్లో తన ఆత్మకథను చెప్పుకున్న బహినాబాయి; అక్షరజ్ఞానం లేకపోయినా, మహారాణిగారి ఇష్టసఖిగా, తాంబూలమందించే సేవకురాలిగా ఉంటూనే పదాలమీద పట్టుతో ఆస్థానకవి మెప్పు సంపాదించి, అతని శిష్యురాలై, చదువరియై, అతనిచేతనే ‘సాహిత్య వరదేవత’ అనిపించుకుని, సమాజపు విలువలు గౌరవిస్తూనే వాటిలోని లోపాలను సున్నితంగా ఎత్తి చూపిన (ఆడపిల్లలనీ మగపిల్లలనీ సమానంగా చూడమని; రూపగుణయవ్వనాలు లేని శవాలవంటి పెళ్ళికొడుకులకు పిల్లలను ఇవ్వవద్దని అంటుంది) సంచియ హొన్నమ్మ; స్త్రీలు చదువుకోవడం పాపం, అనర్థం అని పాతుకుపోయిన మూఢవిశ్వాసాన్ని ఎదిరించి, భారతదేశంలో మొదటిసారిగా బాలికలకు, వయోజనులకూ పాఠశాలలను, స్త్రీలు స్వేచ్ఛగా మాటాడుకునేందుకు మహిళామండలిని, బాల్యవివాహాలకు బలైపోయి విధవలుగా మారిన స్త్రీలకోసం ఒక ఆశ్రమాన్ని ఏర్పరచి తర్వాతి తరాలకు మార్గదర్శకురాలైన మహోన్నత సంఘసంస్కర్త సావిత్రీబాయి ఫూలే; 1882లోనే తొలి స్త్రీవాద రచనగా పేర్కొనదగిన, స్త్రీ-పురుష్ తులనాని (A comparison between women and men) మరాఠీలో వ్రాసిన తారాబాయి షిండే; పన్నెండేళ్ళకే 18వేల శ్లోకాలు సంస్కృతంలో అర్థతాత్పర్యాలతో చెప్పగలిగిన నేర్పు సంపాదించి, తనజీవితం చీకటిమయమైనా, అభాగ్య స్త్రీల జీవితాలలో వెలుగులు నింపడానికి సంఘసంస్కర్తగా, మానవతావాదిగా, అనువాదకురాలిగా జీవితకాలం కృషిచేసిన పండిత రమాబాయి; ‘స్త్రీలచుట్టూ పాతివ్రత్యపు తేజోరేఖలనో, పురుషుల్ని నాశనంచేసే కాముకిలుగానో చిత్రించటం తప్ప పురుషరచయితలు చేసినదేమి’టని నిర్భయంగా ప్రశ్నించిన సరస్వతి అమ్మ, మొదలైన వాళ్ళంతా (ఈ పుస్తకంలో యాభై మందికి పైగా రచయిత్రుల్ని, సంఘసంస్కర్తలని శారదగారు పరిచయం చేశారు) సమాజాన్ని సూటిగా ప్రశ్నించేదొక్కటే: పరిణామక్రమంలో పురుషుడితోపాటే నడిచి వచ్చిన తమకు, అన్ని రంగాలలోనూ వివక్ష ఎందుకు?

చరిత్ర పూర్తిగా పురుషుడిచుట్టూ అల్లిన కథ. స్త్రీలకు ఆ చారిత్రక కథనాల్లో ఏమాత్రం ప్రాముఖ్యం లేకపోవడంతో, ప్రాచీన సమాజాల్లో స్త్రీల పాత్రకు ఏ మాత్రం ప్రాధాన్యం లేదనుకునే అపోహ కలుగుతుంది[2] అని అన్నమాట అక్షర సత్యం.

హిందూ పురాణాలలో, ఇతిహాసాలలో దేవుళ్ళతో సమానంగా దేవతలున్నారు. చరిత్రలో వీరపురుషులతో పాటు వీరనారీమణులున్నారు. ప్రార్థనాది విషయాలు మినహాయిస్తే మన పాఠ్యపుస్తకాలలో ఏ స్థాయిలోనూ వారి వీరోచిత గాథలు గాని, ప్రేరణాత్మకమైన వారి జీవిత విశేషాలు గాని లేవు, ఉండవు. అందుకని, ఇరా ముఖోటీ (Ira Mukhoty), రూబీ లాల్ (Ruby Lal) వంటి ఆధునిక చరిత్రకారులు, అర్చన గుప్తా (Archana Garodia Gupta) వంటి పరిశోధకులు, చారిత్రక, పౌరాణిక స్త్రీ పాత్రలని తీసుకుని పురుషాధిక్య కథనాన్ని త్రోసిరాజని, స్త్రీల దృక్కోణంలో చారిత్రక కథనాన్ని తిరిగి వ్రాయడానికి పూనుకుంటున్నారు. గత రెండు దశాబ్దాలుగా స్వామి వివేకానంద, తెనాలి రామలింగ వంటి చారిత్రక వ్యక్తుల గురించి వ్రాస్తూ, కాశ్మీర రాజకుమార్తె డిద్ద జీవితం ఆధారంగా 2014లో వ్రాసిన తన నవల క్వీన్ ఆఫ్ ఐస్‌కు (Queen of Ice) నీవ్ బుక్ అవార్డు గెలుచుకున్న దేవిక రంగాచారి (Devika Rangachari), కోసల రాకుమారి ప్రిథ్వీమహాదేవి జీవితచరిత్ర ఆధారంగా క్వీన్ ఆఫ్ ఎర్త్ (Queen of Earth) పేరుతో సెప్టెంబరు 21న ఒక నవల తీసుకు వచ్చారు. ‘చరిత్ర నిర్మాణంలో రాణులూ, సామాన్య స్త్రీలూ కూడా ముఖ్యమైన భూమిక పోషించారు. పురుషుల కోణంలోనే చిత్రీకరించిన చరిత్రలో స్త్రీల ప్రాధాన్యత నిరూపించడం ద్వారా చారిత్రక కథనంలో వారిని జోడించి, ఆ తప్పుని సరిచేయడమే నా లక్ష్యం’ అంటారామె.

దేశంలో ఎటుచూసినా వయోభేదంలేకుండా స్త్రీలపై అత్యాచారాలు, మానభంగాలు, హత్యలు, ఏసిడ్ దాడులు, పరువుహత్యలూ జరుగుతున్న దారుణమైన పరిస్థితుల్లో, స్త్రీ గురించి, ఆమె వ్యక్తిత్వానికి ఇవ్వవలసిన గౌరవం, రక్షణ, స్వీయ నిర్ణయాత్మక హక్కు విషయాలలో పురుషుల మానసిక స్థితిలో విప్లవాత్మకమైన మార్పులు రావలసి ఉంది. ఆ దిశలో శారదగారి భారతీయ రచయిత్రులు పుస్తకం సంస్కారవంతులైన పురుషుల మనసులో, ఆచరణాత్మకమైన నిర్ణయాలు తీసుకునే దిశలో ప్రేరణనిస్తుంది.


పుస్తకం: భారతీయ రచయిత్రులు
రచయిత: శారద శివపురపు
ప్రచురణ: కవిసంగమం ప్రచురణలు, 2020.
వెల: రూ. 200/-
లభ్యత: నవతెలంగాణా పబ్లిషింగ్ హౌస్, విశాలాంధ్ర, నవోదయ, ఇతర పుస్తకాల దుకాణాలలో.


  1. The Position of Women in Hindu Civilization from Prehistoric Times to the Present Day. Anant S. Altekar. Motilal Banarasidas Publ. Delhi, 1987.
  2. These authors are resurrecting unsung heroines from Indian history and mythology. Manasvi Jerath.