అక్కడికి

ఎక్కడా లేని చోటికి
ఎప్పుడూ లేని కాలానికి
ఏదీ లేని అనుభవానికి
నాలుగువైపులా ద్వారాలున్నాయి

నేను
ఇప్పుడు
ఇక్కడ
ఇలా

ఏదో ఒక ద్వారంలోంచి
లోనికి వెళ్ళినపుడు
పూర్తిగా వెలుపలికి వెళ్ళిపోతావు
కాలం కక్ష్య దాటి అనంతంలోకి

అక్కడ
రంగులేని రంగు
రూపంలేని రూపం
రుచిలేని రుచి
స్పర్శలేని స్పర్శ
శబ్దంలేని శబ్దం
వాసనలేని వాసన
నీకోసం ఎదురుచూస్తాయి

తెలిసినచోటునుండి
దానిని మృత్యువంటారు
తెలియనిచోటునుండి
దానిని జీవితమంటారు

బివివి ప్రసాద్

రచయిత బివివి ప్రసాద్ గురించి: హైకూకవిగా, తాత్విక కవిగా సుపరిచితులు. మూడు హైకూ సంపుటాలు: దృశ్యాదృశ్యం, హైకూ, పూలు రాలాయి; నాలుగు వచన కవితా సంపుటాలు: ఆరాధన, నేనే ఈ క్షణం, ఆకాశం, నీలో కొన్నిసార్లు ప్రచురిత రచనలు. హైకూ సాహిత్యానికి గాను మచిలీపట్నం సాహితీసమితి అవార్డు, ఆకాశం సంపుటికి ఇస్మాయిల్ అవార్డుతో సహా మూడు అవార్డులూ వచ్చాయి. సంపుటాలన్నీ బ్లాగులో ఈ-పుస్తకాల రూపంలో చదవవచ్చును. ...