బతుకు వస్త్రం

అడగలేని ప్రశ్నల గజిబిజిలా
చుట్టుకుంటున్న దారపు బంతి
తిరగబడినట్టు విప్పుకుని
చెల్లాచెదరుగా అవుతోంది.

కొస దొరకని వెతుకులాటలో
ఎన్ని చిక్కు ముళ్ళు
ఒద్దికగా చుట్టి పెట్టడంలో
ఎన్ని బంధనాలు

కలపడానికి వేసే ఒక కుట్టు కంటే
దారపువంటిలో గుచ్చి దించిన
సూది బాధ ఎక్కువ కుడుతోంది

అల్లిన అనుబంధాలు
పరచిన బతుకు వస్త్రం మీద
కుట్టిన వంకర టింకర చిత్రంలా
చేతిలో పట్టుకు చూసుకుంటుంటే
పొంగే దిగులు
ఇప్పుడిక ఎలా సరిచేయనూ

రంగులద్దినా అంటుకోనంత
విచలితమైన తెలుపు
మనసుకు
మౌనంగా అంతర్లీనమవడమే కోరిక.

ఊహలు గీసే గీతలకు
సమయం గడిచింది
చుట్టూ కప్పుకుని మిగిలిన కాసిని
చలి దారులలో నడచినా
మండించే కొన్ని ఎండలకి
తలమీద ఆచ్ఛాదించుకున్నా
యథాతథంగా లభించినది మాత్రమే
నాకు ప్రాప్తించినది