సోర్సరస్

If she had been happy, she would have been charming. Happiness is the poetry of woman, as the toilet is her tinsel. If the delightful excitement of a ball had made the pale face glow with color, if the delights of a luxurious life had brought the color to the wan cheeks that were slightly hollowed already, if love had put light into the sad eyes, then Victorian might have ranked among the fairest; but she lacked the two things which create woman a second time –pretty dresses, and love-letters.– Pere Goriot, Honor de Balzac.


‘పిచ్చి భద్రయ్య! ఈ 2019లో, ఎందుకింత కష్టపడి ఈ ట్రావెల్ సమాచారం నాకు ఈమెయిల్ చేశాడు టోనీ? వయసు పెరిగిన చాదస్తం కాకుంటే! ఇంటర్నెట్ తెరిస్తే చాలు, ప్రపంచంలో ఎక్కడైనా కాని ఏం చూడాలో సమాచారం అంతా బొమ్మలతో సహా, అక్కడే ఉంటుంది కదా! ఎవరి బడ్జెట్ లిమిట్స్‌లో వాళ్ళు ఊరేగటమే! ఇదేమన్నా బారిస్టర్ పార్వతీశం కాలమా! తన లింగు లింగు విదేశయాత్ర గురించి ఎవరైనా దస్తాలు దస్తాలు రాయటానికి? నా తాటాకూ పళ్ళపొడీ, నా హోల్డాలూ! అంటూనూ…’ అనుకుంది నిసి షామల్.

తనేమో ఈమధ్య కొంతకాలంగా పట్టుకున్న ఏక్రోఫోబియా, ఫస్ట్‌క్లాస్ కేబిన్‌లో సైతం క్లాస్ట్రోఫోబియా మూలాన విమానప్రయాణాలు తగ్గించి వేసింది. ఒకవేళ వెడితే, విమానంలోంచి కిందకు దూకకుండా నిగ్రహించుకుని ఉంటానికి ముందే తగిన మందులు తీసుకుంటుంది. ఫ్లైట్ అటెండంట్స్ స్పెషల్ మెన్యూ కార్డ్స్ తేకముందే, కర్టెసీ షాంపేన్ ఇవ్వకముందే, చీజ్‌లు వైన్‌లు, ఏమీ తినీ తాగాలేనప్పుడు ఎందుకొచ్చిన ఫస్ట్‌క్లాస్ ఎయిర్ ట్రావెల్?! అని తన ముఖాన చెప్పకుండానే చెప్పే వాళ్ళ జాలి నిట్టూర్పులు వినకముందే నిద్రకు జారుతున్నది.

సీట్ పాకెట్‌లోని ట్రావెల్ మేగజీన్‌లు తియ్యనే తియ్యటల్లా. వెళ్ళే చోటల్లా, హోటెల్ వాళ్ళ ఆప్ తన సెల్‌లో డౌన్లోడ్ చేసే ఉంటుంది. తన ఇష్టాలు ముందే అడిగి నోట్ చేసుకుని, దేశంలోనో, విదేశంలోనో ఉండదలిచిన అన్ని రోజులకూ, ఆ చుట్టుపక్కల కేలండర్ ఈవెంట్స్ మార్క్ చేసి, వాళ్ళు ఐటినరరీ పంపుతారు. తను అప్రూవ్ చేసిన టూర్లు, ప్రైవేట్ గైడ్‌లతో మహ చక్కగా అమరుస్తారు. షాంపేన్, ఫ్లవర్ బొకే హోటల్‌లో చెకిన్ చెయ్యగానే రూమ్‌కి పంపనే పంపుతారు. ఏ సందేహమొచ్చినా, తీర్చటానికి ఒక ప్రత్యేకమైన ఫోన్ లైన్ ఉండనే ఉంటుంది.

ఎందుకితని హంగామా! టోనీ తనేదో మార్కోపోలో, క్రిస్టఫర్ కొలంబస్ అనుకుంటున్నాడా?

అబ్బే! ఎందుకంటే, నాకీ ఉత్తరం టోనీకి కొంత తోచుబడికి. తనతో పోచుకోలుకి. అంతకన్నా ఏముంది! మా ఇద్దరికీ పనా, పాటా! ఇదొక రకమైన లవ్ లెటర్! ఇట్స్ నైస్! ఏం రాశాడో, సర్లే! చదువుదాం, అని ఈ-మెయిల్ ఓపెన్ చేసింది నిసి.

హాయ్ నిసీ!

మొన్న సాయంత్రం రిట్జ్ కార్ల్‌టన్‌లో నువ్విచ్చిన విందు ఎంత బాగుందో! మాకందరికీ కాలం ఎంతో హాయిగా గడిచింది. థాంక్యూ.

2020 మార్చ్‌లో ఆమ్‌స్టర్‌డామ్ ప్రయాణం బుక్ చేసుకో మర్చిపోకుండా. ఆ నెలలో సంగీతకారులు, ఛేంబర్ మ్యూజిక్ వేదికల గురించి మరో ఉత్తరం పంపుతాను.

న్యూయార్క్ తరుచూ వెడతావు కాబట్టి అక్కడి నుండి డైరక్ట్ ఫ్లైట్ తీసుకో. లేదూ, ఫోర్ట్ మయర్స్, ఫ్లారిడా నుండి యూరోవింగ్స్‌లో నేరుగా డ్యుసెల్‌డార్ఫ్ వెళ్ళు. అక్కడ ఎయిర్‌పోర్ట్ షెరటన్‌లో కొన్నిగంటలు నిద్రపో. వాళ్ళకప్పుడు ఉదయం ఏడు గంటలు. నీకు ఫ్లారిడా టైమ్ అర్ధరాత్రి. నిద్రపో హాయిగా కాసేపు. ఆపైన, మధ్యాహ్నం రైలన్నా తీసుకో, లేకపోతే కార్లో ఆమ్‌స్టర్‌డామ్ చేరుకో. (అలెక్స్ నుండి, నీ ఫోర్ సీజన్స్ రిసార్ట్స్, ప్రైవెట్ కార్ అండ్ షోఫర్ ఫెటిష్ విన్నాను. అలానే చెయ్యి. అంతా నీ సౌఖ్యానికేగా!)

కనీసం నాలుగు రోజులన్నా ఆ సిటీలో గడుపు. మిగతా యూరప్ కన్నా, శతాబ్దాలుగా ఆ నగరవాసులకి యుద్ధాల మీద కన్నా, వాణిజ్యం మీద ఆసక్తి ఎక్కువ. నార్త్ సీ, బాల్టిక్ సముద్రాల మీద వర్తకం, తర్వాత ఇండొనీషియాతో, అమెరికాతో వాణిజ్యం మూలాన, వారు మనుషుల పట్ల ఎంతో స్నేహభావం, ఆలోచన అలవరచుకున్నారు. మిగతా ప్రపంచం యూదులను పట్టి పీడిస్తుంటే, ఈ నగరపు ప్రజలు వారిని ఉండనిచ్చి, భద్రత కల్పించారు. బరూక్ స్పినోజా కుటుంబం ముందు స్పెయిన్ నుండి, స్పానిష్ ఇంక్విజిషన్ తర్వాత పోర్చుగల్ నుండి పారిపోయి, తర్వాత ఆమ్‌స్టర్‌డామ్‌లో కుదురుకున్నారు. అక్కడే అతడు తన డిసర్టేషన్స్ ప్రకటించింది. (స్పినోజా ఇప్పటికీ నా ఫేవరెట్ ఫిలాసఫర్!)

తప్పకుండా రైక్స్‌ముసేయమ్, వాన్ గో మ్యూజియమ్ చూడు! ముందుగా టిక్కెట్లు కొని ఉంచుకో. ఆ క్యూలలో గంటల తరబడి నిలబడ్డం నీవల్ల కాదు. రైక్స్‌లో రెంబ్రాంట్ ‘నైట్‌ వాచ్’, ఇంకా ఏడో ఎనిమిదో వెర్మీర్ చిత్రాలున్నాయి తప్పక చూడవలసినవి. నీకోసం లింక్స్ కూడా ఇస్తున్నాను ఈమెయిల్‌లోనే.

చాలా ఫేమస్ అక్కడి కాన్సర్ట్‌జిబూ. అందులో ఒకసారైనా సంగీతం విను. ఆపైన అక్కడి కెనాల్స్‌లో బోట్ ట్రిప్, ఫ్లోటింగ్ ఫ్లవర్ మార్కెట్స్, రెడ్ లైట్ డిస్ట్రిక్ట్‌లో లీజర్ వాకింగ్, ఇవేవీ మర్చిపోవద్దు. వాన్డెల్ పార్క్ ఎదురుగా లైడ్‌సప్లైన్ సెంట్రల్ స్క్వేర్‌ సిటీలో హాట్‌స్పాట్! అక్కడ డిన్నర్, రైల్వే స్టేషన్ పక్కల్లో అర్ధచంద్రాకారపు కాలవల వెంట నడవటం, ఇవేవీ వదిలిపెట్టకుండా చెయ్యి. వీలైతే, విండ్‌మిల్స్ కూడా చూడు నిసీ! యూ విల్ లవ్ దెమ్.

తర్వాత డెల్ఫ్ట్ కానీ హేగ్ కానీ వెళ్ళు. డెల్ఫ్ట్ ఒక పురాతన నగరం. నీలం, తెలుపుల పింగాణీ పనికి ప్రసిధ్ధి. హేగ్‌లో మౌరిఛౌస్ మ్యూజియమ్‌లో తప్పకుండా వర్మీర్ ‘ది గర్ల్ విత్ ది పర్ల్ ఇయర్ రింగ్’ చూడకుండా ఎలా? ఆర్ట్‌లో ఇంత ఆసక్తి ఉన్న నువ్వు, ఆర్ట్ గురించీ ఆర్టిస్ట్స్ గురించీ ఇంతగా చదివే నువ్వు, ఈ పెయింటింగ్ చూడకుండా ఎలా ఉండగలవు!

తప్పకుండా ఒక సైకిల్ అద్దెకు తీసుకో. నువ్వు సైకిల్ తొక్కుతావని నాకు తెలుసు. నార్త్ సీ కోస్ట్ వెంబడి సైకిల్ తొక్కావంటే నువ్వు నెదర్లాండ్స్ సిటిజెన్ ఐనట్టే లెక్క.

(ఓరి నాయనా! ఇంకా అతని ఈ-ఉత్తరం సాగుతూనే ఉంది.)

ఆమ్‌స్టర్‌డామ్ నుండి ఆన్‌ట్వెర్ప్ వెళ్ళి, ఏదైనా హోటల్లో ఒక నాలుగు రోజులైనా ఉండాలి నువ్వు! అసలు ఆన్‌ట్వెర్ప్ కూడా చూడదగిన పురాతన నగరం. అది కేంద్రంగా పెట్టుకుని ఫ్లెమిష్ కంట్రీ అంతా తిరుగు. ముఖ్యంగా ఘెంట్‌ నగరంలో వాన్ ఐక్ చిత్రించిన ది ఎడొరేషన్ ఆఫ్ ది మిస్టిక్ లామ్ ట్రిప్టిక్ చూడాలి.

అక్కడనుంచి బ్రసెల్స్. ల గ్రాఁ ప్లాస్ మెయిన్ స్క్వేర్ మొత్తం పూలతో నిండి ఉంటుంది. అది ఒక అద్భుత సుందర దృశ్యం. బ్రస్సెల్స్ చిహ్నమైన లె ఆన్ఫాఁ కి పిస్ ఫౌంటెన్ చూడాలి. అలాగే స్త్రీల లేస్ అల్లికలకు పేరొందిన బ్రూజ్ నగరం. కారు, షోఫర్ ఉంటే హాలండ్, బెల్జియమ్ చుట్టుపట్ల చిన్న చిన్న స్థలాలెన్నో. 800 ఎ.డి.లో రోమన్ ఎంపైర్ అధినేత పట్టాభిషేకం జరిగిన ఆకెన్ నగరం, 1992లో ట్రీటీ ఆఫ్ యూరోపియన్ యూనియన్ జరిగిన మాస్‌ట్రిక్ట్ నగరం కూడా చూడాలిగా. బెల్జియన్ చాకొలెట్, గూడా ఛీజ్, క్యూర్‌డ్ హెరింగ్, ప్యాన్ కేక్స్, ఫ్లామ్‌సె ఫ్రిటె (మా ఫ్రెంచ్ ఫ్రైస్) అన్నీ రుచి చూడాలిగా. (యా, యా! తమకు కొత్తగా ఛీజ్ ఎలర్జీ వచ్చిందని నేను మర్చిపోలేదు. మీకు ఎన్ని రకాల ఎలర్జీలో అని, మిమ్మల్ని గురించి ఆలక్స్ నవ్వుతాడు మా దగ్గర. నా మీద ఎలర్జీ రాకపోతే అంతే చాలు!)

అన్నీ తాపీగా చూసి, మళ్ళీ డ్యుసెల్‌డార్ఫ్ నుండి ఫోర్ట్ మయర్స్‌లో హాయిగా దిగొచ్చు.

నేను ముందే అడిగినట్టు, మనం ఈ యాత్ర కలిసి చేస్తే, నాకు ఎంతో హాయినిస్తుంది. అది గుర్తుంచుకోమని మనవి!

ఆంటోనియో.

ఆ లాంగ్ లవ్ లెటర్ టోనీ నుండి చదువుకొని నవ్వుకుంది నిసి.

ఓ ఆంటోనియో! ఆంటోనియో! మై రోమియో! ఇంత పొడుగు ఉత్తరం, నాకు రాయటానికి నీకెంత ఓర్పు!

విడిగా అతని నుండే వచ్చిన ప్రోగ్రామ్ నిసికి నోరూరించేదిగా ఉంది. అది మార్చ్‌లోనే ఉట్రెక్ట్ నగరంలో జరగబోయే ఇంటర్నేషనల్ పియానో కాంపిటీషన్.

టోనీ కైతే యూరప్‌లో ఈ ప్రదేశాలన్నీ ఎన్నోసార్లు తిరిగి చూసినవి. ఐనా తనతో కలిసి చూడాలని కొంత మోజు. అతడి లక్షణమేంటంటే కుర్రపిల్లల వెనకాల పడడు. వారిని తన డబ్బుతో వలలో వేసుకోవాలనే చాపల్యం ఇంతకూడా లేదు. తన సమవయస్కులతో, సమమైన ఇష్టాలు, అభిలాషలు ఉన్న వాళ్ళతో స్నేహం చేస్తాడు.

ఇంకొద్ది రోజులలో, టోనీ లోకల్‌గా ఏర్పాటు చేసిన ఒక ఆర్ట్ ఎక్జిబిషన్‌కి అతని నుండి నిసి షామల్‌కి ఇన్విటేషన్ ఉంది. అక్కడ చూపేది అతడి సతీమణి ఆర్ట్! వెళ్ళకుంటే ఊరుకోడు. వెళ్ళినప్పుడో, మళ్ళీ ఎక్కడైనా కలిసినప్పుడో, నా ఈ-మెయిల్ చదివావా, లేదా? అని తప్పక అడుగుతాడు. చదివాగా, ఇంకెందుకు భయం. నవ్వులాట కాదు, ఇది నిజంగా కన్సిడర్ చెయ్యాల్సిన ట్రిప్. మధ్యమధ్యలో టోనీ బృందంతో కలుస్తూ, కొంత తన సొంత విశ్రాంతి సమయం, తన ప్రైవెట్ ఆర్ట్-లెసన్స్, రైటర్స్ వర్క్ షాప్స్ ఆయా చోట్ల తను అమర్చుకోవచ్చు. ఇట్ రియల్లీ హేజ్ పొటెన్షియల్!అనుకుంటూ, నిసి అతని ఈ-మెయిల్ సేవ్ చేసింది.


టోనీ బ్రాచ్చియో ఒక రిటైర్డ్ బేంకర్. ఆమ్‌స్టర్‌డామ్‌లోనూ ఆ చుట్టుపక్కల నగరాలలోనూ అంతర్జాతీయ వ్యాపార సంస్థలలో పనిచేసి, సరిపడా ఆర్జించి, ఫ్లారిడాలో ఇల్లు కొనుక్కుని కొన్నేళ్ళుగా స్థిరపడ్డాడు. మ్యూచ్యుయల్ ఫండ్స్, హెడ్జ్ ఫండ్స్, ఆ తర్వాత చేర్చిన డౌ జోన్స్ ఇండెక్స్ ఫండ్స్, అమెజాన్, గూగుల్, నెట్‌ఫ్లిక్స్ వంటి స్టాక్స్– ఇవన్నీ పిల్లల్ని, మళ్ళీ పిల్లల్ని పెడుతున్నయి. ప్రస్తుతం చాలా ధనవంతుడు. వెనకటి రోజుల ధనవంతుల మాదిరిగానే వచ్చేపోయే సంగీతకారులకు, విద్యార్థులకూ తన ఇంట్లో ఆశ్రయమిచ్చి, ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుంచి, చుట్టుపక్కల చిన్న విమానాశ్రయాలు, దగ్గరలో ఉన్న యూనివర్సిటీలు, ఎన్నో కాన్సర్ట్ వెన్యూల మధ్య వారిని ఉచితంగా రవాణా చేస్తుంటాడు. వారికి సర్వసదుపాయాలూ కల్పిస్తాడు. అవసరమైతే ధనసహాయం అందిస్తుంటాడు. (ప్రేమ్‌చంద్ తన కథల్లో, కొంత డబ్బు చేరాక, ధనవంతుల్లో పుట్టుకొచ్చే ధర్మపరిరక్షణ, సంఘ సంస్కరణ, కళాపోషణ యావలు ఎంతైనా చక్కగా చెప్తాడు.) ప్రతి కొన్ని నెలలకూ ఫ్లారిడావాసులకు విదేశయానం, విలాసజీవితం తప్పనిసరి. కీపింగ్ అప్ విత్ జోన్సెస్ మెంటాలిటీ, సౌత్ వెస్ట్ ఫ్లారిడాలో కావలసినంత ఉంది.

నిసికి మనసులో టోనీ బ్రాచ్చియో అంటే చాలా ఇష్టం. కాని వారి ఏ సోషల్ మీటింగ్ లోనూ అది బైటకు కనపడనీయదు. అతని భార్య నటాషా ఎప్పుడూ గద్దలా పొంచి, కనిపెట్టి ఉంటుంది. నటాషాకు డబ్బూ దస్కం లేదు. ఆమెకు సంగీతం పెద్దగా అర్థం కాదు. ప్రోగ్రామ్ ముందు పెట్టుకుని కూడా అన్నీ తప్పులు చెపుతుంది. వర్ణచిత్రాలు గీస్తుంటుంది. అవి అమ్ముడు పోవు. డబ్బున్న బేంకర్ మొగుడున్నప్పుడు, కేన్వాసులు ఈజిల్ మీద ఇంట్లో గీకితే చాలదా! అవి శ్రమపడి అమ్మి, ఆ అణా కానీ డబ్బు ఏ బేంక్‌లో వేస్తుంది! టోనీ డొనేషన్ ఇచ్చిన ప్రతి భవనంలో, అతని ఫొటోతో పాటు నటాషా ఫొటో కూడా పెడతారు. మొగుడు సంపాదించి డబ్బు దానం చేస్తే, తగుదునమ్మా అని పెళ్ళాం కూడా ఎందుకు గోడలని అలంకరిస్తుందో నిసికి అర్థం కాదు. బరాక్ ఒబామా అమెరికా ప్రెసిడెంట్‌గిరీ వెలగబెట్టాడని అతని పెళ్ళాం చిత్రం కూడా ఇప్పుడు స్మిత్‌సోనియన్ నేషనల్ పోర్ట్రెయిట్ గేలరీని అలంకరించినట్టు. ఆ మిషెల్ వర్ణచిత్రం చూసినపుడు నిసికి ఒళ్ళు మండింది. మిషెల్ మాట్లాడటం అంతా నల్లవారి హెరిటేజ్ గురించి. కానీ, తన రంగుల బొమ్మ వేయించుకున్నప్పుడు తన శరీరం రంగు, ముఖకవళికలు మార్చివేసి ఏదో 14శతాబ్ది డచ్ రాయల్ లాగా సిల్క్ హూప్డ్ బాల్ గౌనులో బొమ్మ వేయించుకోటం. అందులో ఆఫ్రికన్ నల్లవారి హెరిటేజ్ ఎక్కడుంది! ఆ చిత్రించిన క్వీన్ బొమ్మ చూసి అది ఆఫ్రికన్ అమెరికన్ మిషెల్ ఒబామా అని ఒక్కరు కూడా గుర్తుపట్టరు.

బరాక్ ఒబామాకి కొన్నేళ్ళ క్రితం నోబెల్ పీస్ ప్రైజ్ ఇచ్చినందుకే, ఇంకా కారాలూ మిరియాలూ నూరే నిసికి, ఈ సంవత్సరం గ్రామీ అవార్డ్స్ ప్రోగ్రామ్‌లో డాలీ పార్టన్, జెనిఫర్ లోపెజ్, అలీషియా కీస్ వంటి ఆర్టిస్టులతో పాటు మిషెల్ ఒబామా స్టేజ్ ఎక్కితే కోపం నషాళానికంటింది. ఆమెకేం పని ఆ స్టేజ్ మీద! పిసరంత సంగీతం రాదు. మిసెస్ ఒబామా ఒక పాట రాయలేదు, పాడలేదు. ఐనా సిస్టర్, సిస్టర్ అంటూ వాళ్ళు తైతక్కలాడారు. ఇట్స్ ఎ షేమ్! షి డజ్ నాట్ డిజర్వ్ టు బి ఆన్ ది స్టేజ్ విత్ దోజ్ ఆర్టిస్ట్స్! డాలీ ఈజ్ ఎ గ్రేట్ సాంగ్ రైటర్, సింగర్. అలీషియా సింగ్స్ లైక్ ఏన్ ఏంజెల్! దేశదేశాల్లో, మొగుడి పేరు చెప్పుకు బతికే పెళ్ళాలెందరో. నిసి నటాషాను అసలు ఏం పట్టించుకోదు. న్యూజెర్సీ ఆడదానికి ఆ రష్యన్ పేరెందుకసలు! ఫేక్! త్రూ అండ్ త్రూ ఫేక్! టోనీ! హి ఈజ్ ఎ జెంటిల్‌మన్. హి డిసర్వ్‌స్ బెటర్. సన్నగా, చక్కని ముఖకవళికలతో, ఉదారహృదయంతో ఉండే అతనికి ఈ సుద్దమొద్దు. ఎందుకు పెళ్ళాడినట్టు! రెండో పెళ్ళి పైగా!

టోనీకి తనకు ఇటీవలే ఐన ఈ స్నేహానికి, తనకు ఇంతకు ముందరి స్నేహితురాళ్ళు, ఇతర స్నేహితులతో ఉన్న సంబంధాలకీ కల తేడా ఏమిటి అని ఒకసారి నిసి తర్కించుకుంది.

టోనీ బ్రాచ్చియో, నిసి షామల్‌ల పరిచయం ఎలాటిదంటే, గడిచిపోయిన జీవితకాలపు పాత ఫొటోగ్రాఫులు, పూర్వ కుటుంబపు చరిత్రల వంటి గుర్తులు లేనిది. వారు మొదటిగా చూసుకున్న ఆ రోజు, ఆ క్షణంలో ఆ మొదటిసారి దుస్తులూ, అప్పటి ముఖం, అప్పటి శరీరం, వారున్న వయసు, అవే వారి గుర్తు. ఇద్దరికీ వారంతకు ముందు ఎలాటి ఉద్యోగాలు చేశారో, ఎలాటి జీవితం గడిపారో కొంచెమైనా తెలియదు. ఐనా, టోనీ తన పట్ల మొదటి చూపులోనే ఆకర్షితుడు అనే స్పృహ ఆమెకు కలిగింది. అది రాను రానూ బలపడింది. ఈ పరిచయం, ఈ ఆకర్షణ లోని స్వారస్యం ఆమెను ఉత్తేజపరిచింది. ఈ పరిచయం ఇప్పటి తనను గుర్తించే పరిచయం. శ్యామ్‌తో లాగా వివాహం మూలాన కలిగిన సంబంధం, ఎన్నో ఏళ్ళు నడిచిన చరిత్ర కాదు. విక్టర్ బెర్నెట్టీకి, కుమార్ అద్వానీకి, ఇంకెందరికో ఒక పర్సనల్ డాక్టర్‌గా, హుస్సేన్, లాజ్లో మరి కొందరు ఆంకాలజిస్ట్‌లకు ఒక కాలీగ్‌గా, తనతో కొన్ని ఏళ్ళ మీద బలపడిన స్నేహం కాదు.

నిసికి టోనీతో ఈ పరిచయంలో ‘నిన్ను నిన్నుగా ప్రేమించుటకు… నేనున్నానని నిండుగ పలికే’ ఒక కంఠం ఉద్భవించింది అని ఆమె మనసు మరోసారి మేల్కొంది.

నిసి మీద టోనీ ఇంట్రెస్ట్ గమనించిన ఆలెక్స్ అప్పుడప్పుడూ నిసితో ఈర్ష్యతో “హి ఈజ్ స్వీట్ ఆన్ యూ! నువ్వు కూడా పెద్ద డొనేషన్ ఇస్తే, నీ ఫొటో కూడా యూనివర్సిటీ డోనర్స్ హాల్లో, అతని ఫొటోకి ఇటు పక్కన పెట్టిస్తా!” అంటాడు.

“యూ విష్! అందరు స్టూడెంట్లకీ డబ్బు అమరుస్తావు. నేనూ మ్యూజిక్ విద్యార్థినని నీకు గుర్తుండదు ప్రొఫెసర్! నాకెందుకు గ్రాంట్ ఎరేంజ్ చెయ్యవూ? ఏమిటి తేడా? ఎందుకీ పక్షపాతం!” అని అతనిపై విసుక్కుంటుంది నిసి.


టోనీ సంగతేమో కాని నిసి షామల్‌లో గత దశకాల మార్పులు ఎన్నని చెప్పేది. నిసి కట్టుకునే గుడ్డలు, జుట్టు, భాష, అభిరుచులు ఎప్పటికప్పుడు మారిపోతున్నయి. ఆ మార్పులు, బైటి వారినంటం దేనికీ, ఆమె ఫేమిలీ మెంబర్స్‌ని కూడా కళవళపెడుతున్నయ్యి. నిసికి ఈ గడబిడలన్నీ అందుతూనే ఉన్నయ్యి.

అమెరికాలో తమ కట్టూ బొట్టూ ఇంతమార్చకుండానే జీవితకాలం వెళ్ళదీసిన భారతీయ లలనామణులున్నారు. అదే మీసకట్టుతో, వయసు మీరినా ఎప్పటికీ నల్లరంగు జుట్టుతో, అదే రకం క్రాఫుతో, ట్రెడిషనల్ దుస్తుల్లో అన్ని చోట్లా హాజరయ్యే ఇండియన్ మగ పరిచయస్థులూ ఉన్నారు. తనను చిన్నప్పటి నుండి ఎరిగి ఉన్నవారు కొంతమంది ఆమెలోని తర్వాతి మార్పులను హర్షించలేదు. ‘అప్పుడు తెలుగులో సుబ్బరంగా మాట్లాడేదానివి. అబ్బో! ఇప్పుడు ఇంగ్లీషు దంచికొడుతున్నావే’ అనే బాపతు తెలుగువారు కొందరు. ‘నువ్వు హైదరాబాదులో ఉన్నప్పుడు, నువ్వు, నీ మొగుడు శ్యామ్ జాతకమంతా మాకు తెలుసు. హిందీ సుబ్బరంగా మాట్లాడేదానివి. బషీర్‌బాగ్‌లో చాలాసార్లు బటోరాలు కలిసి తిన్నాంగా. ఔనూ, జడ మానేసి జుట్టెప్పుడు ఇలా పొట్టిగా కత్తిరించావూ?’ అనే తెలంగాణా పరిచయాలు కొన్ని.

శ్యామ్‌తో తను హైదరాబాద్‌లో జీవించినప్పుడు, అతడొక షావుకారు. షోకిల్లారాయుడు. అప్పటికి తన కాలేజ్ చదువు ఇంకా పూర్తి కాలేదు. అసలు పూర్తి చేస్తుందో లేదో కూడా ఆ తెలంగాణా ఏజిటేషన్ టైమ్‌లో అనుమానమే! ఒకసారి రాజకీయపు గొడవల్లో మూసివేసిన కాలేజీలు ఎప్పుడు తెరుస్తారో, అసలు తెరుస్తారో లేదో కూడా ఎవరు చెప్పగలరు! ఐనా, వివాహం తర్వాత, అప్పుడతనితో శ్రీనగర్ కాలనీలో నివసించిన ఆ బంగళా, తోట సౌందర్యం ఆమెకు మరవరానిది. శ్యామ్‌తో ఆమె జీవితం, నౌబత్ పహాడ్, పబ్లిక్ గార్డెన్ల పిక్నిక్‌గా, ఒకో సంవత్సరం మెడ్రాస్ ఉడ్‌లాండ్స్, మైసూర్, బెంగుళూర్ గార్డెన్స్, చాముండీ హిల్స్, మరో సంవత్సరం అజంతా, ఎల్లోరా సందర్శనాలుగా గడిచింది.

తను మెడిసిన్ పూర్తి చేస్తుందనీ, తనూ శ్యామల గోపాల్ కలిసి ఇండియా విడిచి పెడతారనీ, వీసా అప్లికేషన్‌లలో వారి పేర్లు అడ్డదిడ్డంగా కత్తిరించేసి అతికించేస్తారనీ, అఫీషియల్ రికార్డులలో తన పేరు డాక్టర్. నిసి షామల్ అవుతుందని, అమెరికాలో వారిద్దరి జీవిత విధానమే మారిపోతుందని, తను అమెరికా హాస్పిటల్స్‌లో, ఏళ్ళ తరబడి పని చేస్తుందని, వారు కలగన్నారా!

నిసి అమెరికాలో కేన్సర్ రంగంలో ప్రవేశించినప్పుడు ఆ శాఖ ఇప్పటి రోజుల్లోలాగా డాక్టర్లకు హైరైజ్ స్టయిలిష్, గ్లామరస్ శాఖ కాదు. ఆస్పత్రి బేస్‌మెంట్‌లలో అతి తీవ్రమైన వ్యాధులకు నిలయం. ఇతర డాక్టర్లు ఆ శాఖను మెడికల్ గ్రేవ్‌యార్డ్ అనేవారు. నిసి మెల్లిగా కేన్సర్ రోగులకు ఒక పక్కా వైద్యురాలిగా మారుతూ వచ్చింది. తెలియకుండానే వేదన రేఖలు ముఖంలో, నిరాశలు వైద్యుల కళ్ళలో, రోగుల నిస్పృహలు నడకల్లో వచ్చి చేరిపోతాయి. ఆ శాఖలలో పనిచేసేవాళ్ళు నవ్వటమే మెల్లిగా మరిచిపోతారు. గమనించుకోకుండా ఉంటే, వారే విషాదం వలలో చిక్కిపోతారు. ఐతే, ఓ పాతికేళ్ళ నిరంతర శ్రమ తర్వాత, ఆటుపోటుల తర్వాత, నిసి జీవితంలో ఎంత విచిత్రంగా మొదలయిందో అంతే విచిత్రంగా ఆమె కేన్సర్ వైద్యురాలి పాత్ర, శ్యామ్ భార్య పాత్ర, విశ్వనాథ నవలల ముగింపు లాగా రెండూ వెంటవెంట హడావుడిగా సముద్రంలో మునిగి ముగిసిపోయాయి. (నవలను చావుతో గాని, పెళ్ళితో గాని అంతం చేయటంతో నవలా రచయిత అశక్తత తెలుస్తుందని ఇ. ఎమ్. ఫార్‌స్టార్ చక్కగా చెప్తాడు.)

నిసి క్రమేపీ వేరే రకమైన సరళ జీవన విధానం అలవరచుకుంది. ఇప్పుడు, ఇన్ని ఏళ్ళ తదనంతరం, తన సౌందర్యం గురించి కొత్త స్ఫురణ ఆమెలో కలిగింది. పొడవుగా వదిలేసిన తెల్లని మెరుపుల జుట్టు, మృదువుగా మారిన ముఖరేఖలు. కళ్ళలో జాలి, వేదన, ఆలోచనల స్థానంలో, కొత్త తరహా చురుకు చూపులు, ప్రఫుల్లమైన నవ్వు. దుస్తులు నగల ఎన్నికలో కొత్త నాజూకులు. ఏది ఇందులో తన స్వాభావికం? తన బాహ్యాంతరాలలోని ఈ మార్పులు క్రమేపీ ఆమె జీవితాన్ని మరోలా రసవంతం చేశాయనటంలో ఆమెకింత కూడా సందేహం లేదు.

నేపుల్స్ జ్యూయలర్స్ నిసి జుట్టు పొట్టిగా కత్తిరించుకునే ఆలోచనను తీవ్రంగా వ్యతిరేకించారు. ఆమె హెయిర్ స్టైలిస్ట్‌లు, రంగులు వెయ్యటానికి నిరాకరించి, జుట్టు పొడవుగా పెరగనిస్తూ, అక్కడక్కడా అందమైన కత్తెరలు మాత్రమే వేసి, టవల్‌తో తడి వత్తేసి, వదిలేసి, ‘గో! ఫ్లై యువర్ స్పార్క్లింగ్ హెయిర్ ఇన్ సన్’ అని పంపేసేవారు. ఆ ఊరికి వచ్చే వివిధదేశాల అపరిచిత పర్యాటకుల ప్రశంసలు, నిసికి ధైర్యాన్నిచ్చాయి. ఎక్కువగా ఆర్టిస్టులతో పరిచయాలు, ఆర్ట్ షోలకు ఆహ్వానాలు, విదేశాలలో కాన్సర్ట్ హాల్స్‌లో మ్యూజికల్ ప్రోగ్రామ్స్ ఆనందించటం, విలాస గృహాలలో అద్దెకు ఉండి, పరిసర ప్రాంతాల ఆకర్షణలలో పాలుపంచుకోటం, ఆమె గత పదేళ్ళ జీవితం ఇంద్రధనుసులా రంగురంగులతో విరిసింది. ఎందరో దేశస్తుల స్నేహాలు. రకరకాల రొమాన్స్‌లు. షి లవ్స్ దెమ్ ఆల్!

ఐతే, ఆమె ఎవరో ఒకరి భార్యగా మళ్ళీ నమోదు అవటానికి ఇంతకూడా ఉత్సాహం చూపలేదు. అలాటి ప్రపోజల్స్ ఆమె సున్నితంగా తిరస్కరిస్తూ వచ్చింది. ఆమె తన స్వాతంత్ర్యాన్ని ఎంతగానో ప్రేమించసాగింది. అలా అని, మగవారి స్నేహం విడవనూ లేదు. అనవసరపు ఆశలు చూపిస్తూ, వారి డేట్స్, పెళ్ళి అన్వేషణల దారిలో అడ్డంగా నిలవనూ లేదు.


“నిసీ! నిసీ!”

కాన్సర్ట్ హాల్‌లో ముందు సీట్ కోసం మెట్లు దిగుతున్న ఆమె వెనక్కు తిరిగింది. గబగబా మెట్లు దిగుతూ టోనీ!

“ఓహ్! ఎంత బాగున్నావో! ఎప్పుడు, ఎక్కడ చూసినా ఎంత ఎలిగెంట్!”

నిసి మెడలో రెండు పేటల రవ్వల కంఠహారం ధరించింది. రంగుల ఎస్కాడా సిల్క్ స్కార్ఫ్ వేసుకుంది. కాని, చాలా మెలుకువగా రవ్వల ధగధగలు కాని, భుజాల నునుపుని కానీ ఏ మాత్రం దాచకుండా ఆ స్కార్ఫ్ ధరించింది. చేతులకు బాపలాల్, ఇవానా ట్రంప్, బుల్గారీ, షోపార్డ్, యెల్లో గోల్డ్, రోజ్ గోల్డ్, రకరకాల రవ్వల కంకణాలెన్నో మెరుస్తూ.

“కాన్సర్ట్‌కి ఇలాగే రావాలి చక్కగా ముస్తాబై. యూరప్‌లో స్త్రీలు ఇలా, నీ లాగా వస్తారు. మగవాళ్ళు అందమైన స్త్రీలను మెచ్చుకోటం, అది మా ఇటాలియన్‌ల పద్ధతి. లేకుంటే ఎందుకూ మగ పుట్టుక!”

మాట్లాడుతున్నంతసేపూ ఆంటోనియో నాజూకుగా, ఆమె బ్రేస్‌లెట్స్, గాజులు, సవరిస్తూ, నిసి చేతులు తాకుతూనే ఉన్నాడు. నిసి నవ్వుతూ, స్కార్ఫ్ మరింత తొలిగించి, ఆమె నవ్వు తళతళలు, మెడలోని రవ్వల ధగధగలు అతనికి నేత్రానందంగా అందజేసింది. చుట్టూవారు తమని చూస్తున్నారని ఆమెకు తెలుసు. ఆ కాన్సర్ట్ సీరీస్ అంతా, ఇకముందు కూడా నిరంతరంగా సాగేట్టు ఫండ్ చేసింది ఈ ఆంటోనియో మహాశయుడే. అతడిది, అతడి ఇప్పటి భార్య నటాషాది, పెద్ద ఫొటోలు ఇప్పుడు కాన్సర్ట్ హాలు ప్రాంగణంలో అలంకరించబడి ఉన్నయ్యి.

“నిసీ! మేము ఆ చివర సీట్లలో కూర్చుని ఉన్నాం. మాతో పాటు వచ్చి కూర్చోవూ?”

హాలు ఆ చివరి నుంచి ఈ చివరికి, అంత స్వల్పవ్యవధిలో తనున్న చోటికి టోనీ ఎలా వస్తాడో నిసికి అర్థంకాదు. అతడు వచ్చేది మాత్రం ఖాయం. వారిని చూస్తున్నవారు, కొందరు తలాడించి, చేతులు విసిరి, ఆమెకు పలకరింపులు పంపారు.

నిసి, “క్షమించండి, ఈ రోజు ఈ పక్కన కూర్చుని, రెండు పియానోలు వినాలని ఉంది, ఇంటర్‌మిషన్‌లో కలుద్దాం. మీ ఈ-మెయిల్ చూశాను. నటాషా ఆర్ట్ ఎక్జిబిషన్‌కి కూడా వస్తాను. ధేంక్స్ ఫర్ ది ఇన్విటేషన్!” అంది.

అతడు వెళ్ళిపోయాడు. తన సీట్లో కూర్చుని, నిసి ఆలోచనలో పడింది.

టోనీ బ్రాచ్చియోకి షావుకారుతనంలో శ్యామ్‌తో ఎన్నో పోలికలు. టోనీ స్త్రీల పట్ల చూపే మర్యాదలో శ్యామ్‌తో సరితూగుతాడు. చక్కగా డ్రెస్ అవటంలో వ్యామోహం, శ్యామ్‌కి ఖరీదైన కార్ల మీద ఎక్కువ ఇష్టం ఉండేది. టోనీకి ఖరీదయిన పియానోలంటే ఇష్టం. అందరూ స్టెయిన్‌వే, స్టెయిన్‌వే అంటుంటే, అతడు అదొక్కటేనా గొప్ప, ఎందుకా మొనాపలీ అని, ఫాత్సియోలి, బెక్‌స్టెయిన్, బారన్‌బొయిమ్, బ్యోసెన్‌డోర్ఫర్ పియానోలు సేకరిస్తాడు. కాన్సర్ట్ హాల్స్‌లో వాటిని ఉంచటానికి డొనేషన్స్ ఇస్తాడు. విదేశాల పర్యటనలో ఆసక్తి. టోనీ హేట్స్ రెలిజియన్! టోనీ హేట్స్ ట్రంప్! టోనీకి, పాత ఫిలాసఫర్లు –డెస్కార్టెస్, స్పినోజా, కాంట్–ఇష్టం. టోనీకి ఇండియా అంటే విపరీతమైన గౌరవం. అన్ని గొప్ప ఫిలాసఫీలు, గొప్ప సంగీతం, భారతదేశం నుంచే కదా వచ్చాయని మెచ్చుకుంటాడు.

ఆ నాటి కచేరీలో ఆమె సంగీతం కన్నా టోనీ, అతని మిసిమి రూపం, తన వయసువారితో స్నేహభావం, తనకు నచ్చినవారికోసం, ఇతరులను లెక్కచేసుకోకుండా వచ్చి తను చెప్పాలనుకుంది చెప్పితీరటం గురించి ఆలోచిస్తూ కమ్మగా నిట్టూర్చింది.

కాన్సర్ట్ ఇంటర్‌మిషన్‌లో నిసి కాసేపు ఊపిరి తియ్యటానికి, అటూ ఇటూ నడిచేందుకు బైటికి టెరేస్ మీదికి పోదామనుకుంటుండగా ఇంతలోనే ఆశ్చర్యంగా నటాషా తన ముందు వరసలో ప్రత్యక్షమయింది. తన సీట్ వైపు కొంచెం వాలి, “ఈ ప్రోగ్రామ్ అయ్యాక అందరం కొంచెంసేపు మా ఇంట్లో కలిసి మాట్లాడుకుందాం. మీరు రావాలి” అంది.

“మరెప్పుడైనా, ఈ రోజు కాదు.”

“టోనీతో, కాన్సర్ట్ తర్వాత మీకు వైన్ తాగాలని ఉందన్నారట కదా.”

“ఎప్పుడూ!? ఓ, కొన్నిసార్లు మనమంతా కచేరీ తర్వాత దగ్గర్లో ఏదైనా బార్‌కి వెళ్ళి, కబుర్లాడుతాం కదా. అలా అన్నాను. మిగతావాళ్ళు వస్తున్నారా?”

“కొందరు వస్తున్నారు మా ఇంటికి. బార్ ప్లాన్ లేదు. మా ఇంటికి రండి. ఉయ్ హేవ్ ప్లెంటీ ఆఫ్ వైన్!”

నిసికి అర్థమయింది. ఇది టోనీ నిర్వాహకం. ఈమె టోనీ పంపితే నన్ను పిలవటానికి వచ్చింది. నేనొచ్చేందుకుగాను అతడు ఇతరులను పిలుస్తున్నాడు. నటాషాకు ఇంత కూడా నా మీద ఆసక్తి లేదు. కేవలం మొగుడు పంపితే వచ్చింది.

“మరోసారి! నాకు ఒక లేట్ మీటింగ్ ఉంది. ఐ కాంట్ స్కిప్ ఇట్! ఇప్పుడు మార్చలేను. మరోసారి!” నవ్వు ముఖంతోనే చెప్పింది నిసి.

నటాషా, “ఐ అండర్‌స్టాండ్! ఇంత చప్పున వేరే మీటింగ్ ఎలా మార్చగలరు!” అని చుట్టూవాళ్ళు వినేట్టు బిగ్గరగా అనేసి అక్కడినుంచి నిష్క్రమించింది.

నిసి మనసులో విసుక్కుంది. ఈమె ఆర్టిస్ట్! ఇల్లు తన పర్సనల్ స్పేస్! తన ఇంటికి నన్నెందుకు పిలుస్తుంది? నా మీద అయిష్టత టోనీతో ఎందుకు వ్యక్తం చెయ్యదు? పైగా నన్ను పిలుచుకుపోటానికి వచ్చింది! నేను సంగీతం వినటానికి ఈ పబ్లిక్ వెన్యూకి వస్తే, ఏమిటీ సొసైటల్ న్యూసెన్స్!”

కాన్సర్ట్ ముగిశాక, ఎవరితోనూ మాట్లాడకుండా నిసి చప్పున పార్కింగ్‌లాట్ లోని తన కారుకేసి వెళ్ళిపోయింది. కారు డ్రైవ్ చేస్తూ, ‘ఐ యామ్ నాట్ గోయింగ్ టు నటాషాస్ ఆర్ట్ ఎక్జిబిట్! నెవర్! నాకేం పనక్కడ! అసలు టోనీ, నాతో డిన్నర్ తినాలనుకుంటే ఒంటరిగా రావటం మంచిది. నాకేం పని, నటాషాతో, నేనేం పెళ్ళాడలేదుగా ఆమెను. ఆమె టోనీ ప్రియురాలో, పెళ్ళామో, గుదిబండో, వాట్ డు ఐ కేర్! నా సమయం నాకు ఎంతో విలువైంది. ఇంకా ఎన్నో సంవత్సరాల జీవితకాలం మిగిలి లేదు. ఈ ఊళ్ళో మొగుడు పెళ్ళాల లవ్వులు, ఘరానాలు, సొసైటీలో వారి పేరు పెంపొందించుకునే ఆహ్వానాలతో నాకేంటి పని.’ అని పెద్దగా బైటకే అనుకుంది.

‘చూడు టోనీ, నీతో ఆమ్‌స్టర్‌డామ్ వస్తాను కానీ ముందు నువ్వు నటాషా డేమ్‌ని నేపుల్స్ గోర్డన్ రివర్‌లో దించితే, ఆ తర్వాత!’ అనుకుంది. ‘యప్! ఐ ఆమ్ నాట్ గోయింగ్!’

అంతలోనే ఆమెకు ఆ మధ్యే చదివిన ఒక న్యూ ఇంగ్లండ్ రచయిత్రి కథ ఒకటి గుర్తొచ్చింది. ఆమె పెదవుల మీద చిరునవ్వులు విరిశాయి. ఉత్తిపుణ్యానికి, తనను వలచినవాడి భార్యను అతడు ఉన్నపళాన వదిలెయ్యాలని కోరుకుంటుంది కథలోని హీరోయిన్! అది జరుగుతుంది కూడా. ఈ రచయితలకెంత ఫ్రీడమ్! వారి హీరోయిన్‌లను ఎలా ఐనా ఆడిస్తారు. కానీ నేను ఆనా కెరినీనాను కాను. మదామ్ బొవరీని కాను. లేడీ చటర్లీను కాను. ఆ మాట కొస్తే మేడమ్ క్యూరీనీ కాను. రోజాలిన్ యాలోనీ కాను.

ఆ నిశీధిలో, తన తెల్లటి బెంజ్ కారులో ఒంటరిగా ఇంటికి వెడుతున్న నిసి మనసు పలు ఆలోచనలతో ఇంకా ఇంకా చలించిపోయింది. ఇంత సుందరి! ఎందుకు ఒంటరి! చందమామ లాటి తనేంటీ! ఒంటరిగా ఈ కారు నడపటమేంటి! కన్వర్టబుల్ కారు వేగం ఎక్కువయింది. మలుపుల్లో, మెలికలు తిరుగుతూంది. గాలికి జుట్టు అలలుగా ఎగురుతోంది. ఎస్కాడా స్కార్ఫ్ మెడలోంచి ఎప్పుడో ఎగిరిపోయింది. రవ్వలు జ్వలించిపోతున్నయ్! కార్లోని మూడ్ లైటింగ్ ఒక మాయాజాలం సృష్టిస్తోంది. నిసి దేవతలనే మంత్రించేట్టు ఎంతో మెస్మరైజింగ్‌గా నవ్వింది.

‘యప్! డియర్ గాడ్స్ ఇన్ హెవెన్! ఐ వాంట్ నటాషా టు బి డెడ్! డెడ్ యాజ్ ఎ డోర్ నెయిల్! దట్స్ వాట్ ఐ వాంట్!’ అన్నది నిసి ఆకాశంలోకి చూసి.

ఆకాశం నుండి వెంటనే ఒక ఉల్క రాలిపడింది.

(నిసి షామల్ డైరీ నుంచి, 2019.)