పదిహేను రోజులనుంచీ భగవానుడి ఆరోగ్యం బాగుండకపోవడం తెలుస్తోంది. మొదటి సమస్య నోట్లోంచి వచ్చే దగ్గు. రెండవది ఊపిరి తీసుకోవడం కష్టమౌతోంది. మూడోది ఈ రెండింటి వల్లా వచ్చే నిద్రలేమి, వంటి నెప్పులూ వగైరా. ఇన్ని రోజులు చూసాక ఆనందుడు చెప్పాడు, “జీవకుణ్ణి ఓ సారి పిలిపిద్దాం. ఆయనకి మంచి వైద్యుడిగా పేరుంది. బింబిసార మహారాజు మనవడే. మీ కోసం పిలుస్తే రాను అనలేడు.”
“ఎంతకాలం నుంచి తెలుసు వైద్యం ఆయనకి? వైద్యం ఎక్కడ నేర్చుకుంటున్నాడో?” భగవానుడు అడిగాడు.
“మొదట్లో ఏడేళ్ళు తక్షశిలలో విద్య పూర్తి చేశాక చాలామందికి కుదరని రోగాలని నయం చేశారని చెప్తూ ఉంటారు. ఆ మధ్య ఒకావిడకి ఏళ్ళబట్టీ తగ్గని తలనెప్పికి నేతిలో ఏదో కలిపి ముక్కులో పోసి పది నిముషాల్లో తగ్గించాడుట. మరొకాయనకి తలలో వ్రణం కత్తితో తీసి మళ్ళీ కుట్టేశాడని, తగ్గిన తర్వాత చూస్తే అసలు కుట్టు ఎక్కడ పడిందో చెప్పడం ఎవరి వల్లా కాలేదనీ చెప్పారు.”
“అంతటి గొప్పవైద్యుడైతే మన నుంచి డబ్బు ఆశించవచ్చేమో?”
“బింబిసారుడంతటివాడు మీ శిష్యుడే కదా, అయినా జీవకుడు ఎవరైనా డబ్బు ఇవ్వగలరా, లేదా అని చూసుకుని వైద్యం చేసే మనిషి కాదు అని విన్నాను.”
“సరే అయితే వీలున్నపుడు ఆయన వచ్చినా సరే, లేకపోతే నన్ను రమ్మన్నా సరే.”
జీవకుడు వస్తూనే ప్రశ్నలు అడగడం మొదలుపెట్టాడు భగవానుణ్ణి. “దగ్గు వచ్చేటపుడు నోట్లోంచి శ్లేష్మం పడుతుందా? అది విషపు వాసన వేస్తుందా? రోజులో ఎంతసేపు వస్తోంది? పొడిదగ్గు మాత్రమేనా? మందు కానీ తైలంలో కలిపి ఇస్తే భగవానుడికేమైనా అభ్యంతరం ఉందా తీసుకోవడానికి? ఊపిరి తీసుకోవడంలో ఛాతీ నెప్పులున్నాయా?” వగైరా వగైరా. అన్నీ అడిగాక సమాధానాలు విని చెప్పాడు జీవకుడు:
“మీకు ఉన్నది ఊపిరితిత్తులలో సమస్య. దానికి నేను మూడు మందులు పట్టుకొస్తాను. వాటిని నేరుగా నోట్లోంచి తీసుకోనక్కర్లేదు. మూడు ఫలాల్లో పెట్టిన మందులని మూడు గంటలకోసారి వాసన చూస్తూ ఉండండి. వారం రోజుల్లో మామూలు ఆరోగ్యం వస్తుంది.”
మర్నాడు మందు స్వయంగా పట్టుకొచ్చి భగవానుడికిచ్చి వెళ్ళబోతూంటే ఆనందుడడిగాడు, ఈ మందుకీ వైద్యానికీ ఖర్చు ఏమైనా ఇవ్వాలా అని. దీనికి జీవకుడు ముక్కుమీద వేలు వేసుకుని తల అడ్డంగా ఊపి వెళ్ళిపోయాడు. ఆనందుడు ఈ విషయం చెప్పినప్పుడు నవ్వి ఊరుకున్నాడు తథాగతుడు.
ఆ పైవారంలో జీవకుడు ఒక రత్న కంబళీ బుద్ధుడికి పంపించాడు తన సేవకుడి ద్వారా. ఆనందుడీ కంబళీ చూసి వాటిని జీవకుడు ఎలా సంపాదించాడో కనుక్కోబోయేడు, ఎందుకంటే అంతటి ఖరీదైన రత్న కంబళీలు మహారాజుల దగ్గిర తప్ప ఉండడానికి లేదు. అప్పుడు తెలిసిన ప్రకారం జీవకుడు ఉజ్జయిని రాజైన చండప్రజ్యోతుడికి కామెర్లు తగ్గించాడు. జీవకుడు చేసిన వైద్యానికి అబ్బురపడి రాజు ఓ రెండు రత్న కంబళీలు బహుమానం ఇచ్చాడు. బుద్ధుడి బోధనలపట్ల ఆకర్షితుడైన జీవకుడు ఒక కంబళీని ఆయనకి పంపించాడు కానుకగా.
అయితే బుద్ధుడికి ఈ కంబళీని ఏం చేసుకోవాలో తెలియలేదు. సన్యాసం తీసుకున్న తాను దీన్ని వాడలేడు, తనకి దాని అవసరమూ లేదు. మరెవరైనా సన్యాసులకిస్తే ఏ దొంగ వచ్చి ఎత్తుకెళ్తాడా అనే భయంవల్ల వాళ్ళు ధర్మమార్గం తప్పవచ్చు. ఈ విషయం విన్న ఆనందుడు చెప్పాడు ఏం చేయాలో. కంబళీని ముక్కలు ముక్కలుగా కత్తిరించి ప్రతీ సన్యాసికీ ఓ ముక్క ఇవ్వడం. దీనివల్ల సన్యాసులకి తెలిసేది, ధర్మం విలువ, ఏది దగ్గిర ఉంచుకోకూడదో అనేవీ.
తాను పంపిన కంబళీని తథాగతుడు ఇలా చేసినందుకు జీవకుడికి కోపం రాలేదు. తనకి జీవితంలో డబ్బు విలువ, ధర్మం అనేదాని విలువా సరిగ్గా తెలియచెప్పినందుకు తథాగతుడికి మనసులోనే ధన్యవాదాలు అర్పించాడు. ఏళ్ళు గడుస్తుంటే తథాగతుడి జాడల్లో నడిచే జీవకుడికి జీవితం అంటే తెలిసివస్తూ, బుద్ధుడు ప్రత్యక్షంగానో పరోక్షంగానో తెలియపరిచే ధర్మసూక్ష్మం కొంచెం కొంచెం అర్థమౌతోంది. ప్రపంచంలో జనం అందరూ కూడా అనేకానేక రోగాలతో, విపత్తులతో మూలుగుతున్నారు. కొంతమందికి శారీరిక అనారోగ్యం అయితే కొంతమందికి మానసిక అనారోగ్యం. తనతో సహా ఎవరికీ కూడా పూర్తి ఆరోగ్యం అనేదే లేదు. జీవితంలో ఒకే ఒక విషయం ప్రతీవారికీ జరిగేదీ, జరగక తప్పనిదీ – చావు మాత్రమే. ఇదేనా సిద్ధార్థుడు సన్యాసం తీసుకోవడానిక్కారణం?
ఇటువంటి రోజుల్లో మరోసారి ఆనందుడు కబురుపెట్టాడు జీవకుడికి. ఈ సారి బుద్ధుడి కాలికి గాయమైంది. రక్తం కారుతూ నడవడానికి కష్టంగా ఉంది. వచ్చి సహాయం చేయగలడా అని సంగతీ సందర్భం చెప్పారు.
జీవకుడు వెళ్ళి చూశాక తెల్సిన విషయం – దెబ్బ బాగా లోతుగా తగిలింది. కుట్లు వేసి కట్టు కట్టాక మూడు వారాలవరకూ కట్టు విప్పరాదు. రెండు గంటలు కష్టపడ్డాక కుట్లన్నీ పూర్తి చేసి అడిగాడు జీవకుడు.
“ఈ దెబ్బ ఎలా తగిలింది?”
“నడిచేటపుడు రాయి తగిలింది, అంతకన్నా ఏమీ లేదు.” భగవానుడు చెప్పాడు.
“ఆశ్చర్యంగా ఉందే, నడిచేటపుడు రాయి తగిలి ఇంత లోతుగా పెద్ద దెబ్బ తగలడం అసంభవం. మరోవిధంగా…”
జీవకుడి మాట పూర్తి కాకుండా ఆనందుడు చెప్పాడు. “దేవదత్తుడు విసిరిన రాయి అది.”
ఒక్కసారి కోపం కట్టలు తెంచుకోబోతూంటే తమాయించుకుని అన్నాడు జీవకుడు, “మిమ్మల్ని బాగా చిన్నప్పటినుండీ కష్టపెడుతూ ప్రతీ పనికీ అడ్డుతగులుతూ మీ మీద కోపంతో, ఈర్ష్యతో రగిలే మనుషులని మీరెందుకసలు సంఘంలో చేర్చుకుంటారు?”
దీనికి భగవానుడు సమాధానం చెప్పాడు చిరునవ్వుతో, “దొంగతనం చేస్తుంటే ఓ దొంగకి దెబ్బ తగిలింది లేదా ఎవరో కసాయి జంతువధ చేస్తుంటే ప్రాణాంతకమైన దెబ్బ తగిలింది. నీ దగ్గిరకి వచ్చారు వైద్యం కోసం. వైద్యం చేస్తావా లేక వాళ్ళు చేసిన పని బట్టి వైద్యం చేయడమా మానడమా అనేది తేల్చుకుంటావా?”
ఛెళ్ళున చెంపమీద కొట్టినట్టూ మ్రాన్పడిపోయిన జీవకుడు మాట తడబడుతూండగా చెప్పాడు, “రోగి ఎటువంటివాడు, ఏం చేస్తుంటే రోగం తగిలిందీ అన్న విషయం వైద్యుడు ఎప్పుడూ గుర్తుపెట్టుకోరాదు.”
“ఈ సన్యాసం ఇవ్వడం, సంఘంలో జేర్చుకునే విషయం కూడా అటువంటిదే.”
మరో మూడు వారాల్లో కట్టు విప్పడానికి వస్తానని చెప్పి జీవకుడు బయల్దేరాడు ఇంటికి. మూడు వారాలు తిరిగేసరికి భగవానుడి కట్టువిప్పడానికి బయల్దేరుతుంటే ఎవరో వచ్చి చెప్పారు, “శ్రావస్తిలో ఎవరికో ప్రాణంమీదకి వచ్చింది. అత్యధిక ప్రాధాన్యంగా భావించి వచ్చి చూడాలి.” భగవానుడి కాలి కట్టు విప్పడం కొన్ని రోజులు ఆగవచ్చు కనక వెంఠనే బయల్దేరాడు.
అయితే ప్రాణం మీదకి వచ్చిన మనిషికి నయంకావడానికి మరో మూడు వారాలు పట్టింది. ఈ లోపులే ఓ రోజు సాయంత్రం గుర్తొచ్చింది మరోసారి. తాను బుద్ధుడి కాలికి కట్టిన కట్టు, కుట్లు విప్పడానికి విహారంలో ఎవరూ లేరు. ఏమి చేయాలో తోచక కళ్ళుమూసుకున్నప్పుడు మానసిక ప్రకంపనలు కలగడం తెలుస్తోంది. మనసులో ఎవరో తనతో మాట్లాడటానికి చేసే ప్రయత్నం అన్నట్టుంది. కాసేపు మౌనంగా ధ్యానం చేశాక తెల్సినది తనతో మాట్లాడడానికి ప్రయత్నించేది బుద్ధుడేనని. కాలికట్టు ఎలా విప్పాలో చెప్పమని అడుగుతున్నాడా? ఓసారి ఆ కట్టుకట్టిన విధం, దాన్ని ఎలా విప్పాలో మనసులో విశదంగా ఒక్కో మెట్టూ గుర్తు చేసుకున్నాడు. ఈ విషయం కాస్త ముందే భగవానుడికి చెప్పి వచ్చి ఉండాల్సింది. అయ్యో పాపం ఎంత బాధపడుతున్నాడో. అంతలోనే ఒక్కసారి మనసులో ప్రశాంతత. ప్రకంపనలు ఆగిపోయాక తాను ఆ రోజు భగవానుడితో ప్రత్యక్షంగా మాట్లాడిన అనుభూతి.
మూడు వారాలకి శ్రావస్తి నుంచి వెనక్కొచ్చిన జీవకుడు దాదాపు పరుగులాంటి నడకతో విహారానికి వెళ్ళి బుద్ధుణ్ణి చూడబోయేడు. నవ్వుతూ పలకరించిన తథాగతుడు అడిగాడు.
“ఆ రోగి ప్రాణం కాపాడగలిగావా? ఎప్పుడు వచ్చావు వెనక్కి?”
భగవానుడి కాలికేసి చూసిన జీవకుడు ఆశ్చర్యపోయాడు. కట్టు విప్పేసి ఉంది. గాయం మానిపోయి ఎప్పటిలాగానే ఉల్లాసంగా ఉన్నాడు. ఆశ్చర్యంగా అడిగాడు.
“శ్రావస్తిలో రోగికి ప్రాణం మీదకి వచ్చి, కట్టుబట్టలతో ఉన్నది ఉన్నట్టూ బయల్దేరవల్సి వచ్చింది. రెండు రోజుల్లో వచ్చేద్దామని అనుకున్న పని మూడు వారాలు పట్టింది అనుకోకుండా. ఇంతకీ మీ కాలికి కట్టు ఎవరు విప్పారు? లోతుగా అయిన గాయానికి వేసిన కుట్లు విప్పడానికి వైద్యుడికి తప్ప సాధ్యం కాదే? మీకు తగిలిన గాయం పూర్తిగా మానినట్టుందే?”
“అదేమిటి జీవకా, ఆ రోజు నువ్వు ధ్యానంలో చెప్పావు కదా, కుట్లు ఎలా విప్పుకోవాలో? నువ్వు చెప్పినట్టే చేసి నేనే విప్పుకున్నాను. ఎప్పుడైతే ఇద్దరి మానసిక తరంగాలు ఏకం అవుతాయో అప్పుడు ఆలోచనలు ఒకరికొకరికి తెలియడం అంత కష్టం కాదు. మనిషి ఎదురుగా ఉండాల్సిన పని లేదు మాట్లాడుకోవడానికి. అందుకే భిక్షువులు ఎంత దూరంగా ఉన్నా నేనెప్పుడూ వాళ్ళతో ఉన్నట్టే, భౌతికంగా ఎదురెదురుగా ఉండాల్సిన అవసరం లేదు.”
జీవకుడికి ఒక్కసారిగా తెలిసివచ్చింది, తాను శారీరికమైన వ్యాధులు మాత్రమే పోగొట్టగలడు. భగవానుడో? మనుషులని సంసారమనే రోగం కుదర్చడానికి దారి చూపించి మహోన్నతులుగా మార్చగలడు. ఆ రోజుకి ఇంక ఇంటికి బయల్దేరడానికి విహారంలోంచి బయటకి వస్తూంటే ఆనందుడు కూడా వచ్చాడు. జీవకుడు ఏదో అనబోతూంటే ఆనందుడే అన్నాడు:
“అర్ధమైందా ఇప్పుడైనా? మీరు శరీరానికి, కొంత మాత్రం మనసుకీ వైద్యం చేయగలరేమో కానీ భగవానుడు భవరోగనివారకుడు. ఈ సంసారంలోంచి ఎలా తరించాలో అనే వైద్యం అతి నేర్పుగా – దేవదత్తుడి నుంచి మనవరకూ, అన్ని రకాల ప్రజలకీ చేయడం చేతనైనది ఆయన ఒక్కడికి మాత్రమే.”