గడినుడి – 44 సమాధానాలు, వివరణలు

జూన్ నెల గడినుడి కొంచెం కఠినంగా ఉందని, సరిచూపు సౌకర్యం ఉన్నా కొన్ని సమాధానాలకు అర్థమేమిటో తెలియలేదని కొందరు పాఠకులు అభిప్రాయపడ్డారు. అందుకని అవసరమైన చోట్ల సమాధానాలతో పాటు వివరణలు కూడా ఇస్తున్నాము.

అడ్డం

  1. మల్లెలకాలపు మధురసాలమేలుకుంభం (7)
    సమాధానం: పంచదారకలశ.
    వివరణ: ఎండకాలంలో రసాలూరు ఫలరాజం పంచదార కలశ. పేరుకు తగ్గట్టే ఈ మామిడిపండు రుచి పంచదార పాకంలా తియ్యగా ఉంటుంది. కుంభం అంటే కలశం కూడా.
  2. నవరాత్రి కృతులకాంచీపురపు నాయిక (7)
    సమాధానం: కంజదళాయతాక్షి
    వివరణ: కంజ దళాయతాక్షి కామాక్షి అన్న ముత్తుస్వామి దీక్షితార్ కృతి, కాంచీపురపు కామాక్షి అమ్మవారి మీది కృతులలో ప్రసిద్ధమైనది.
  3. రాసినదెవరైనా, ఎటైనా మేలుజాతిమల్లెపూదండ (4)
    సమాధానం: లమాదకుం
    వివరణ: రామాయణ సంస్కృత నాటక వాఙ్మయంలో దిఙ్నాగుని ‘కుందమాల’ నాటకానికి ఒక విశిష్ట స్థానముంది. గోమతీ నదీతీరంలో శ్రీరామునికి కుందమాల ఒకటి కనబడి అది సీతా సంబంధితమని, సీతా విషయక స్మరణ కలిగి అతడు ఆమె పాదముద్రల ననుసరించి వాల్మీకి ఆశ్రమంలో సీతను చేరటం వలన ఈ నాటకానికి ‘కుందమాల’ అని పేరు వచ్చింది.
  4. వణికి తడబడిన భయము (4)
    సమాధానం: దరముద
    వివరణ: దరదము అంటే భయము.
  5. నారదభజనచేతనుపలుకు క్షేత్రము (5)
    సమాధానం: జనపచేను
    వివరణ: నారకు కావల్సిన జనప పండించే క్షేత్రము (చేను)
  6. అపర్ణ లో ఉండదు.. ‘అపన’ లో వెతికితేగానీ దొరకదు (5)
    సమాధానం: పరిశోధన
    వివరణ: పరాధ రిశోధన వలలను ‘అపన’ అన్న పొడి అక్షరాలుగా (abbreviation) పిలిచే సంప్రదాయం ఉంది.
  7. ఎంత విద్యను అర్థించే వాడైనా అంతగా గురువును అంటుకొని ఉండాలా? (2)
    సమాధానం: చేలా
    వివరణ: చేలా అంటే పైవస్త్రపు కొంగు, శిష్యుడు.
  8. అటువైపు మద్రాసు షణ్ముగం వారు పీల్చేది (2)
    సమాధానం: స్యంన
    వివరణ: మద్రాసు షణ్ముగం అన్నది పాత నస్యం (ముక్కుపొడి) అమ్మే కంపెనీ పేరు.
  9. సముచితమైనదే కనక కోరతగినది(2)
    సమాధానం: వాంఛనీయము
  10. మంచికైనా చెడుకైనా తప్పని పరాకాష్ఠ (5)
    సమాధానం: చరమదశ
  11. మొదలుతెగిన వెన్నెల ముసలితనమా? (2)
    సమాధానం: ముది
  12. తలలేకున్నా పండితుడే (2)
    సమాధానం: విద
    వివరణ: కోవిద- అంటే పండితుడు. విద- అన్నా పండితుడే. విదులకు మ్రొక్కెద, సంగీత కోవిదులకు మ్రొక్కెద అన్న త్యాగరాజు కృతి ప్రసిద్ధమే.
  13. మనమతము అసలే పడని వారి ధోరణి అటునుండి తెలుసుకో వాలి.. (5)
    సమాధానం: ముతమనత
    వివరణ: మిస్సమ్మ సినిమాలో ప్రసిద్ధమైన “రావోయి చందమామ” పాటలో “తనమతమేదో తనది, మనమతమసలే పడదోయ్” అని వస్తుంది.
  14. అప్పుడు అందమైన కథలు చెప్పి ఇప్పుడు రూటు మార్చి అవినీతి కథలు చెప్తున్న ముఖ్యపట్నం (5)
    సమాధానం: తివరామఅ
    వివరణ: అమరావతి కథలు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రసిద్ధమైనవే కదా.
  15. మనకి శక్తి లేక ఒక్క అక్షరంతో పిలిచినా పాపం మోస్తూ భరిస్తుంది (1)
    సమాధానం: క్ష్మా
    వివరణ: క్ష్మా అంటే భారమునోర్చునది, భూమి. క్షమయా ధరిత్రి అన్నారు.
  16. తెలుగుసినీ సీతమ్మని పేరంటానికి పిలవాలంటే కావలసింది ఆవిడ సినిమాయే (6)
    సమాధానం: కుంకుమభరిణె
    వివరణ: తెలుగుసినీ సీతమ్మ అంజలీదేవి. ఆమె సినిమా కుంకుమభరిణె
  17. పిల్లాడిని బళ్ళో పడేశాకా, పంపకాల సంబరాల కాలం (6)
    సమాధానం: పలకాబలపం
  18. గెలుపుగుర్రమే, చేతిలో ఉంటే ఎప్పుడైనా ఆడుకోవచ్చు (5)
    సమాధానం: తురుపుముక్క
  19. కనపడకుండానే జీవితాన్ని తారుమారు చేస్తున్న కొరోనాలాంటివి (5)
    సమాధానం: లువుజీక్ష్మసూ
    వివరణ: సూక్ష్మజీవులు అటునుండి.
  20. తిరగేసి కుట్టాలన్నా సూదికి ఉండాల్సిందే (2)
    సమాధానం: నమొ
    వివరణ: మొన తిరిగేస్తే.
  21. తుంటి కొడితే పళ్ళు (2)
    సమాధానం: రాలు
  22. అక్కడక్కడ రంగునిచ్చు పరపుకరము కూబరము సుమ (5)
    సమాధానం: కూరపసుపు
  23. గుట్టుగానున్నది పొందిక (5)
    సమాధానం: అరమరిక
  24. కొసఊడిన దుకూలము (5)
    సమాధానం: వలు
    వివరణ: దుకూలము అంటే వలువ. కొస ఊడితే వలు- అయ్యింది.
  25. మొదలు తెలియని లోకంతీరు చివర (2)
    సమాధానం: కడ
    వివరణ: లోకంతీరు అంటే పోకడ. మొదలు లేని పోకడ -కడ అవుతుంది. కడ అంటే చివర కూడాను.
  26. ఉమ్మెత్త పువ్వు వద్దన్న తుమ్మెద తిండి (7)
    సమాధానం: మందారమకరంద
    వివరణ: మందారమకరందమాధుర్యమునఁ దేలు మధుపంబు బోవునే మదనములకు? అన్న ప్రసిద్ధమైన పోతన పద్యం సుపరిచితమే కదా.
  27. వావావావావా (7)
    సమాధానం: పంచవకారములు
    వివరణ: 1. వంశము, 2. వపువు, 3. వాక్కు, 4. వస్త్రము, 5. విభవము అన్నవి పంచవకారములు.

నిలువు

  1. ముత్తాతగారి సృష్టిని కాస్త ఘనంగా చెప్పాలి ఎదో గాడిదగుడ్డన్నట్టుగా కాదు (7)
    సమాధానం: పంకజభవాండము
    వివరణ: ప్రపితామహుడు (ముత్తాత) అంటే బ్రహ్మ అన్న అర్థం కూడా ఉంది.
  2. వాళ్ళచేత గ్రాంథికంలో తలగొట్టి (3)
    సమాధానం: రలచే
    వివరణ: వాళ్ళచేత అన్నది గ్రాంథికంలో వారలచే అవుతుంది. దాని తలకొట్టివేస్తే -రలచే మిగులుతుంది.
  3. మరో భాషలో వచ్చినా పలికేవి రాగాలే (3)
    సమాధానం: కమాను
    వివరణ: ఫిడేలు వాయించు కొడువుకు కమాను అని పేరు. అలాగే, కమాను అంటే ఆంగ్లంలో రమ్మని అర్థమే కదా?
  4. ఆద్యంతాలు కాలదన్ను (2)
    సమాధానం: లద
    వివరణ: కాలదన్ను లో ఆది అక్షరాన్ని, అంత్య అక్షరాన్ని కాలదన్నితే మిగిలేది -లద-.
  5. అప్సరస కూతురి కొడుకు (6)
    సమాధానం: శకుంతలాత్మజ
    వివరణ: భరతుడు అప్సరస అయిన మేనక కూతురు శకుంతలకు కొడుకు కదా.
  6. అతనుడికనువైనరదము (6)
    సమాధానం: కందర్పస్యందనం
    వివరణ: అతనుడు అంటే మన్మథుడు. అరదము- అంటే రథము, వాహనము. కందర్పస్యందనం అతనుడికి అనువైన అరదము కదా?
  7. కాస్తా ఆగమన్నా వినక మీదపడినవయసు (6)
    సమాధానం: జర
    వివరణ: జర అంటే ముసలితనము.
  8. కాలు పలుకు తడబడింది (3)
    సమాధానం: దముప
    వివరణ: పదము అన్న పదానికి కాలు అన్న అర్థంతో పాటు మాట్లాడే పదము అన్న అర్థం కూడా ఉంది కదా?
  9. కిందామీదా పెట్టిబేరంచేస్తాడా? (3)
    సమాధానం: ళాదరి
    వివరణ: దళారి అంటే బేరగాడు అన్న అర్థంకూడా ఉంది.
  10. ఎలాగైనా మంచిమాట చెప్పరాని జీవి (7)
    సమాధానం: క్షిపనకుశపఅ
    వివరణ: అటునుండి అపశకున పక్షి
  11. వినయమున కదలు నది (3)
    సమాధానం: యమున
    వివరణ: వినయమున అన్న పదంలో యమున అన్న నది మీకు కనిపించడం లేదా?
  12. సంతసమందినది (3)
    సమాధానం: ముదిత
  13. చలపతివి ఉండ్రాళ్ళు (3)
    సమాధానం: చవితి
  14. చెల్లాచెదురైన వెల్లువ (3)
    సమాధానం: రదవ
    వివరణ: వరద చెల్లాచెదురైనది.
  15. అటూ ఇటూ తిరిగినా పాపం కూర్చున్నచోటకే అన్నం తెచ్చేది (7)
    సమాధానం: కుంచతుతకూరుమం
    వివరణ: “కుంచమంత కూతురుంటే మంచంలోనే కూడు” అన్న తెలుగు సామెత ఉంది.
  16. సూతమునిపంచనచేరుమైలకములు (7)
    సమాధానం: పంచసూతకములు
  17. తననలుపు కనని సొగసు వాసంతి (6)
    సమాధానం: పూలగురివెంద
  18. శ్రీ మంజునాథుని క్షేత్రంలో వెలిగినదే (6)
    సమాధానం: మహాప్రాణదీపం
    “మహా ప్రాణ దీపం శివం శివం భజే మంజునాథం” అన్న పాట ప్రసిద్ధమైనది.
  19. ఈ చిందరవందర సొగసులు మనసు కవనమున విరిసినవే (5)
    సమాధానం: మునసువమ
    వివరణ: సుమవనము చిందరవందర అయ్యింది.
  20. తోటలో ఎటువైపు పెరిగినా పీకవలసిందే (5)
    సమాధానం: క్కమొపులుక
    వివరణ: అటునుండి కలుపుమొక్క
  21. వైకల్యాలు కావు, చెత్తకుప్పలు చిందరవందర! (5)
    సమాధానం: లురాఅకవ
    వివరణ: అవకరాలు అంటే చెత్తకుప్పలు.
  22. చెల్లాచెదురవడంతో కాకులు దూరలేనివి (5)
    సమాధానం: వులురడకా
    వివరణ: కారడవులు చెల్లాచెదురు.