కొన్ని లలితగీతాలు

ప్రస్తుతం నా ఆడియో టేపులు, డిస్కులు నాకు అందుబాటులో లేవు. అందువల్ల ఈ నెలలో కూడా మరికొన్ని లలిత గీతాలే అందిస్తున్నాను. ఇవన్నీ విజయవాడ రేడియో కేంద్రం నుండి ప్రసారమవుతున్నప్పుడు వేర్వేరు సమయాల్లో రికార్డు చేసుకున్నవి.

‘హృదయమా’, ‘పదిమందిలో’ (ఎంకి పాట) అన్న రెండు పాటలు ఎ. ఎమ్. రాజా సినిమా పాటల గాయకుడిగా నిలదొక్కకొనక ముందు పాడినవి. ఈ రెండు పాటలు ఒక రికార్డు పైన వచ్చాయి. ‘పాటలే నీ భక్తి’ చాలా కాలంగా వింటున్నా ఇది బాలమురళీకృష్ణ రాసిన పాట అన్న విషయం నాకు ఈ వీడియో చూసేవరకు తెలియదు. ఈ వీడియోలో బాలమురళీకృష్ణ శిష్యులైన రామవర్మ ఒక సంగీత పాఠశాలలో పిల్లలకు ఈ పాట నేర్పడం చూడవచ్చు. కేవలం బాలమురళీకృష్ణ సంగీతంపై దృష్టి పెడుతూ ఎన్నో అరుదైన కచేరీలు, పాటలతో యూట్యూబ్‌లో చాలా మంచి ఛానల్ నడిపే శ్రీనివాసమూర్తిగారు ఈ పాటను రెండు సంవత్సరాల క్రితం సేకరించి పోస్ట్ చేశారు. మీరు ఇక్కడ వింటున్న పాట డి. ఎల్. పద్మప్రియ పాడినది.

‘అందమైన చందమామ-అందరాని చందమామ’ (వింజమూరి లక్ష్మి), ‘వెళ్ళిపోయే వెన్నెలయ్యా, మళ్ళి వచ్చేదెన్నడయ్యా’ (M.S.రామారావు), పాటలు నండూరి రామమోహనరావు రచనలు. ఎమ్. ఎస్. రామారావు పాడిన మరొక పాట: నవ్వింది నవ్వింది నా రాణి. ‘అందమైన చందమామ’ బాలమురళీకృష్ణ పాడిన వెర్షన్ కూడా వుంది.

ఎమ్. వి. రమణముర్తి పాడిన ‘చుక్కలతో ఒక్కసారి’ సి. నారాయణరెడ్డి రచన. చివరిగా మరొక అపురూపమైన, నాకెంతో చాలా ఇష్టమైన పాట ‘ముజ్జగాలు మోహించగ’ అన్న బోయి భీమన్న రచన. పాడినది ప్రముఖ నటి, అంతకంటే గొప్ప గాయని అయిన పి. శాంతకుమారి.

  1. అందమైన చందమామ – రచన: నండూరి రామమోహనరావు. గానం: వింజమూరి లక్ష్మి.
  2. చుక్కలతోనొక్కసారి – రచన: సి. నారాయణరెడ్డి. గానం: ఎమ్. వి. రమణమూర్తి.
  3. హృదయమా – గానం: ఎ. ఎమ్. రాజా.
  4. ముజ్జగాలు మోహించగ – రచన: బోయి భీమన్న. గానం: పి. శాంతకుమారి.
  5. నవ్వింది నవ్వింది నారాణి – గానం: ఎమ్. ఎస్. రామారావు.
  6. పాటలే నీ భక్తి – రచన: ఎమ్. బాలమురళీకృష్ణ, గానం: డి.ఎల్. పద్మప్రియ.
  7. పదిమందిలో ఎంకి పాట నే పాడంగ – రచన: నండూరి వెంకట సుబ్బారావు. గానం: ఎ. ఎమ్. రాజా.
  8. వెళ్ళిపోయే వెన్నెలయ్యా – రచన: నండూరి రామమోహనరావు. గానం: ఎమ్. ఎస్. రామారావు.