“In the end, we always arrive at the place where we are expected“
– Book of Itineraries.
చిట్టిబాబు తిరుపతి కొండ దేవుడికి యధావిధిగా, అలవాటు ప్రకారం మొక్కి, శఠగోపం పెట్టించుకొని, ప్రసాదం భక్తిగా రెండు చేతులతోటీ పుచ్చుకొని, కృష్ణ తులసీదళం చెవికి తగిలించుకొని కారు దగ్గిరకొచ్చాడు. రాజకీయ తైనాతి ఒకడు చిట్టిబాబుకి దణ్ణం పెట్టి ఏదో చెప్పడానికి సిద్ధమయ్యాడు. చిట్టిబాబు విన్నట్టు నటిస్తూ ఠకాలుమని కారులో కెక్కబోయాడు. ఇది వారంవారం, ప్రతి శనివారం ఆనవాయితీగా జరుగుతున్న పనే. ముఖ్యమంత్రిగా వుండే రోజుల్లో పొద్దున్నే తిరుపతికెళ్ళి హుటాహుటిన హెలికాప్టర్ ఎక్కి భాగ్యనగరం తిరిగి వచ్చేవాడు. ఇప్పుడు మాజీ మంత్రి కాబట్టి కారులో కొండ ఎక్కి కారులోనే క్రిందకి దిగవలసిన గతి పట్టింది.
అయితే ఈ సారి అనుకోని ఘోరం జరిగింది. పొరపాటున చేతిలో ప్రసాదం నేల మీద పడింది. ఏడుకొండలవాడా వెంకన్నా అనుకుంటూ లెంపలు వేసుకొని నేల మీద పడ్డ ప్రసాదం తీసుకొని కళ్ళకద్దుకుంటూ వుంటే, చెవిలో తులసీ దళం నేల పాలయ్యింది. అక్కడికి దగ్గిరగా నేల వాసన చూస్తూ తారట్లాడుతున్న ఒక ఊరకుక్క అదేపనిగా మొరగటం మొదలెట్టింది. అది మామూలు మొరుగుడు కాదు; మొర్రోమని ఎడతెరిపి లేకండా ఏడవటం మొదలు పెట్టింది. కుక్కలు అల్లా మొర పెడితే శ్మశానంలో నక్కలు అరుస్తున్నట్టు ఉంటుంది. చిట్టిబాబు ఆ పవిత్ర తులసీదళం తియ్యబోతూ, నేల కేసి శ్రద్ధగా చూశాడు. నేలమీద ఒక సన్నని గీత, ఎవరో కావాలని కత్తితో గీసినట్టుగా చూపుకి అందినంత మేరా కనిపించింది. చిట్టిబాబు ఆ గీత వెంటే నిటారుగా చూస్తూ నడిచాడు. ఆ గీత నేలపైన పగులు. భూమి విచ్చుకొపోతున్నట్టు కనిపించింది. దబ దబ కారెక్కి కొండ కిందకి వచ్చి, అలివేలు మంగమ్మ వారికి దణ్ణం పెట్టుకోకండానే, జోరుగా ఉత్తరాదికి కారు తోలుకొని పొమ్మన్నాడు, డ్రైవర్ని.
కొండమీద వీధికుక్క ఏడుపు, భూమి మీద పొడుగ్గా విచ్చుకొపోతున్న పగులు; ఈ రెండూ చిట్టిబాబుని కలవరపెట్టాయి. కొండదిగువ కుక్కలు కూడ కూడపలుక్కున్నట్టు అరవటం మొదలుపెట్టాయి.
అలా కుక్కలు ఎడతెరిపి లేకుండా అరిస్తే ఏదో అరిష్టం రాబోతున్నదని ప్రజల్లో గట్టి నమ్మకం ఉంది. అన్ని దేశాల్లోనూ అదే రకమయిన నమ్మకం బలీయంగా వున్నదని తెలిసినా కూడా సాధువుల చుట్టూ తిరిగే ఆస్తిక శాస్త్రవేత్తలు మాత్రం పైకి ఒప్పుకోరు. శాస్త్రజ్ఞులకి, సాధారణ జనానికీ అదే తేడా.
దిగువ తిరుపతిలో జనం గుంపులు గుంపులుగా రోడ్డు మీద కనపడేటప్పటికి, చిట్టిబాబు కారు ఆపమన్నాడు. ఊళ్ళో కుక్కలన్నీ ఒకేసారి మొరగటం మొదలు పెట్టేటప్పటికి, రోడ్ల మీద జనం పోగవుతున్నారు. ‘భూకంపం వస్తున్నాది,’ అన్నాది ఒక గుంపు. ‘తిరుపతి కొండ మొత్తం కదిలి తూర్పుకి జరిగి పోతున్నది,’ అన్నారు మరో గుంపు జనం. మొత్తం మీద జనానికి విపరీతమయిన భయం పట్టుకొని ఇళ్ళల్లోనుంచి బయటికి వచ్చెయ్యటం మొదలు పెట్టారు, గోవిందా! శ్రీనివాసా! అని అరుచుకుంటూ. ఇదంతా విన్న చిట్టిబాబుకి కంగారు పెరిగి తిన్నగా విజయవాడ దాకా ఆగకుండా కారు తోలుకోపొమ్మని డ్రైవర్ని మళ్ళీ హెచ్చరించాడు. విశాఖపట్టణం చిన్న (సుబ్బ)రాజు ఇంటికి పిలిచి అర్జెంటుగా తనని సెల్‌లో పిలవమని చెప్పాడు.
2
చిట్టిబాబు చెవిలోనుంచి తులసీ దళం భూమ్మీద పడ్డ సమయం లోనో, ఆ తరువాత కొద్దిక్షణాల తరువాతనో, కచ్చితంగా చెప్పలేం కాని, విశాఖపట్టణం దిగువ బీచ్ లో నడుస్తూ, చిన్న(సుబ్బ)రాజు యధాలాపంగా ఒక పెద్ద రాయి సముద్రం లోకి విసిరాడు. ఇదేం గొప్ప విషయం కాదు. ప్రతి రోజూ మాజీ మంత్రి చిన్న (సుబ్బ)రాజు అదే బీచ్ మీద నడుస్తాడు. ప్రతి రోజూ చిన్న చిన్న గులక రాళ్ళు, కుండ పెంకులూ ఏరి సముద్రం లోకి విసురుతాడు. ఒక్కొక్కసారి విపరీతమయిన కోపంతో చిళ్ళపెంకులు ఏరి వరసగా సముద్రం లోకి విసురుతాడు; ఈ వెధవ నాయకులు తనని ముఖ్య మంత్రిగా గద్దెకెక్కించ లేదన్న కోపంతో! అయితే ఈ రోజు, ఈ క్షణం, తన బుర్రలో ఏమి తొలిచిందో తెలియదు ఒక పెద్ద రాయి — నిజంగా పెద్ద రాయే! దాన్ని ఎత్తి సముద్రం లోకి గిరవాటు వేశాడు.
అంతే! వెనక్కి తిరిగి వస్తూ ఉన్న అతనికి కొత్త సిమెంటు రోడ్డు అడ్డంగా చీలినట్టు కనిపించింది. ఇంతకు ముందు ఈ చీలిక లేదు. ఇదేదో కొత్తగా రోడ్డు పగిలి పోతున్నట్టు అనిపించింది. అసలీ పగులు ఎంత దూరం పోయిందో చూద్దామని రోడ్డు మీద నడవటం మొదలుపెట్టిన మరుక్షణంలో దిగువ విశాఖపట్టణంలో కుక్కలు అరవడం మొదలయ్యింది. కుక్కలు ఒకేసారి గొంతెత్తి అరవడం, నేలమీద సన్నగా బారుగా రోడ్డు పొడుగూతా చీలిక కనిపించడం: ‘ఇదేదో కొంప ముణిగే ప్రమాదానికే,’ అని అనుకుంటూ చిన్న (సుబ్బ)రాజు ఇంటి ముఖం పట్టాడు. భూమి మీద పగులు చూస్తూ చూస్తూ ఉండంగా పెద్దదవటం, దిగువ విశాఖ పట్టణం, ఎగువ పట్టణం మధ్య రోడ్డు విడిపోవడం ఒకేసారి ప్రారంభం అయ్యింది. చిన్న (సుబ్బ)రాజుకి కంగారు పెరిగింది. ఇంటికి కబురంపాడు. చిట్టిబాబు వెంటనే యమర్జెంటుగా తన సెల్లుకి పిలవమన్నాడని కబురు! దానితో చిన్న (సుబ్బ)రాజుకి కంగారు రెండింతలయ్యింది.
3
శీని నాయుడుకి అసలే కోపం జాస్తి. ఎందుకో ఇవ్వాళ మరీ పిచ్చెక్కినంత కోపంగా ఉన్నాడు. గత నాలుగు వారాలనుంచీ ఒకటే వాన. కుండపోతగా వాన. పట్టు విడవకుండా కురుస్తూన్నది. భాగ్యనగరం శివార్లలో ఏ రోడ్డు చూసినా బురద బురదే. కొందరికి ప్రతి పౌర్ణిమకి, అమావాస్యకీ పిచ్చెక్కిపోతుందంటారు. అదేమో కాని, శీని నాయుడుకి వాన వొచ్చినప్పుడల్లా ఒళ్ళు జలదరించిపోయి కోపంతో పెల్లుబికి పోతాడని కొంతమంది గిట్టని వాళ్ళు అంటారు. కాని నిజం ఎవరికీ తెలియదు. ఇలాంటి విషయాలలో, నిజమేదో, అబద్ధమేదో ఏ మానసిక శాస్త్రవేత్తా కచ్చితంగా చెప్పలేడు. అది మాత్రం నిజం.
మూసీ నదికి ఉత్తరాన పెద్ద బంగళా. వరండాలో సింహాసనం లాంటి పేము కుర్చీ మీద కూర్చున్నాడు శీని నాయుడు. అతని రాజకీయ బంధువులు, దగ్గిర వాళ్ళూ ఒక ఇరవైమంది బలగం ఆ వరండా నేల మీదే కూర్చొని ఉన్నారు. నాయుడు మాట్టాడటల్లేదు. అది వ్యూహాత్మక మౌనం అని అతని బలగం చెప్పుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం అటొక మాట, ఇటొక మాట చెప్పుతూ అతన్ని ఆడిస్తున్నదని అతనికి కోపం. ఎడతెరిపి లేని వానలు ఆ కోపానికి అగ్గి మీద గుగ్గిలంలా పనిచేస్తూ వుండవచ్చునేమో! అసలు విషయం ఆ దేవుడికే తెలియాలి. మహమాంచి కోపంగా ఉన్నాడో ఏమో, పళ్ళు బిగబట్టి నేలమీద ఎడమకాలితో ఒక్క తన్ను తన్నాడు, శీని నాయుడు.
అంతే! ఎంత గట్టిగా తన్నాడంటే, అక్కడ భూమి దద్దరిల్లి పోయిందంటే నమ్మండి. అతని వరండాలో కూచున్న ఛోటా ఛోటా నాయకులందరూ ఒక్కసారి ఉలిక్కి పడ్డారు; భూకంపం కాని వచ్చిందా అని! అంత జోరుగా భూమి కంపించి పోయింది. ఏ పుట్టలో ఏ పామున్నదో ఆ పాములవాడికే తెలియాలి! హిరణ్యకశిపుడు భూమిని తన్నినప్పుడు భూమి అంత జోరుగా కంపించే ఉంటుంది. అది కథ! ఇది కాకతాళీయమేమో తెలీదు. అయితే, అతని తన్ను వల్లనే భూమి కంపించిన విషయం మాత్రం నిజమని అతని అనుయాయులంతా ఏక కంఠంతో చెప్పటం మాత్రం నిజం. అతగాడి భవనం ముందు అంత వాన లోనూ ఊరకుక్కలు పోగుపడి అన్నీ ఒకేసారి అరవటం మొదలు పెట్టాయి. అంతే! కొన్ని క్షణాల తరువాత కాబోలు! భాగ్యనగరం ఉత్తరభాగంలో భూమి మీద మూసీ నదికి సమాంతరంగా స్టెన్సిల్‌తో సీనారేకు పలక మీద గీసిన గీతలా సన్నటి బీట కనిపించింది. భాగవతంలో వామన మూర్తి లాగా, ఈ బీట ఇంతై, ఇంతింతై పెద్ద గండిలా తయారయ్యింది.
4
రెక్కలు తడిసిపోయిన నల్ల కాకులు కావు కావు అని అరుస్తూ గుంపులు గుంపులుగా తూర్పుకి ఎగిరిపోవటం మొదలుపెట్టాయి. ఉమ్మడిగా ఎగిరిపోయే కాకులకి తర్కం తెలియదు; కాకులకున్నది కేవలం పక్షిబుద్ధి. తర్కం శాస్త్రజ్ఞుడిదే! సహజ గుణం మాత్రం కాకులది.
5
విశాఖ దిగువలో భూమి పైన వచ్చిన చీలిక పెద్దదై ఆ చీలిపోయిన పట్టణం తూర్పు దిశగా కదలడం, మూసీ ఉత్తరాన భూమి కంపించి భాగ్యనగరం ఉత్తర భాగం తూర్పు దిశగా ప్రయాణం చేయడం –- ఈ చీలిక, ఈ నేలలో వచ్చిన చీలిక రాష్ట్రం పొడుగూతా వ్యాపించడం మొదలయ్యింది. ఈ మూడు సంఘటనలకీ -– తిరుపతి కొండ కంపించి భూమి బద్దలవటం; దిగువ విశాఖపట్టణం రోడ్డు మీద పగులు మెల్లి మెల్లిగా పెద్దదయి అగాథం ఏర్పడటం, భాగ్యనగరం ఉత్తర భాగం వేర్పడి తూర్పు పక్కకి కదిలి పోవటం; మొత్తం మూడు చోట్లా ఊరి(ర)కుక్కలు నక్కల్లా మొరపెట్టడం – వీటన్నిటికీ ఏకకాలీనత ఉన్నదని ఏ భౌతిక శాస్త్రజ్ఞుడూ రుజువు చెయ్యలేడు. ఇవి పరంపరానుగత సంఘటనలు కావటానికే ఆస్కారం ఎక్కువ. ఏది ఏమయితేనేం! ముచ్చెంగా మూడు విషయాలు మాత్రం నిజం.
ఒకటి: విశాఖపట్టణం దిగువభాగం నుంచి తిరుపతి కొండతో సహా ఒక సరళరేఖ గీసినట్టుగా భూమి బద్దలై మొత్తం తూరుపు దిశగా ఒక్క కుదుపు కుదిపి, ఆగ్నేయ దిశగా ముందుకు సాగి పోవటం.
రెండు: భాగ్యనగరం ఉత్తరభాగం ఇదే సమయం లోనో, కొద్ది క్షణాల తరువాతనో మూసీలో కలిసిపోతున్నదా అన్నట్టు కదిలి పోవటం.
మూడు: ఊర కుక్కలు ప్రతి ఊళ్ళోనూ – ముఖ్యంగా విశాఖ పట్టణం, కర్నూలు, అనంతపురం, చిత్తూరులో తిరుపతి, ఉత్తర భాగ్యనగరం అంతానూ — అదుపు లేకండా ఒకే బిగిని మొరపెట్టి అరవడం. ఈ మూడు విషయాలూ మాత్రం నిజం.
మొదటి బీట తిరుపతిలోనా? విశాఖలోనా? లేదా భాగ్యనగరం శివార్లలోనా? – ఈ విషయం కూలంకషంగా చర్చించి, శాస్త్రీయంగా కారణాలన్నీ పరిశీలించి నిజానిజాలు ప్రజలకి తెలియ పరచడానికి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఒక త్రైపాక్షిక సంఘాన్ని నియమించింది. ఈ సంఘంలో భూగర్భ శాస్త్రజ్ఞులు, భాషా శాస్త్రవేత్తలు, వాతావరణ శాస్త్రవేత్తలు, వీరికి అండగా కొంతమంది రాజకీయ నాయకులూ మొత్తం పాతికమంది సభ్యులున్నారు.
అయితే కుక్కలు అరవటానికి, అర్థంతరంగా ఆంధ్రప్రదేశ్ అనబడే భారత దేశంలో ఒక భాగం రెండు ముక్కలై పోవటానికీ ఏ విధమయిన కార్యకారణ సంబంధం ఉన్నదా లేదా అన్న విచారణకి మరొక ద్వైపాక్షిక సభ ఏర్పడ్డది. దానికి అధ్యక్షుడిగా, ఒకప్పుడు వామపక్ష రాజకీయ నాయకుడిగా పేరు పొంది, ప్రస్తుతం ప్రపంచంలో అన్నిటికన్నా పెద్ద సాయిబాబా గుడి కట్టడానికి ముఖ్య కార్యకర్తగా నిర్విరామంగా పనిచేస్తున్న ఒక మాజీ పాత్రికేయుడిని రాష్ట్రప్రభుత్వం నియమించింది. ఇందులో సభ్యులుగా ఏ వర్గాన్నీ వదలి పెట్టకుండా అన్ని రాజకీయ వర్గాలకి, అన్ని కులాల వారికీ సమాన ప్రాతినిధ్యం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తరువు జారీ చేసింది.
ఈ సంఘాలు ప్రతి రోజూ పత్రికాముఖంగా, ప్రతి గంటకీ టెలివిజన్ ద్వారా ప్రజలకి తమ నిర్ణయాలని తెలియపరుస్తాయని ప్రధానమంత్రి రేడియో ద్వారా ప్రకటన చేశారు.