సమ్మోహనామృతం

సంజ చీకట్లు అలుముకుంటున్న వేళ చీకటి వెలుగుల చెలికాడు నారింజ రంగు కాంతితో వెలిగిపోతూ భూమిని ముద్దిడుతున్నాడు. ఆ నారింజ రంగుతో మిళితమై గుత్తులు గుత్తులుగా వేళ్ళాడుతున్న ఎర్రని మోదుగ పూలు మరింత ఎర్రగా కనిపిస్తున్నాయి. పుడమి సిగ్గులో నుండి తేరుకుని కళ్ళెత్తి చూసేటప్పటికే ఆ మోసగాడు క్షణంలో మాయమై పోయాడు. పాపం పుడమి దిగులుతో చీకటి చాటున దాగిపోయింది. ఆ ముఖంలో ఎంత నిరాశ?

ఆలోచిస్తూ చీకట్లో అలాగే కూర్చుండి పోయాను. పౌర్ణమి చంద్రుడు మబ్బుల చాటు నుండి బయట పడ్డాడు. నన్ను దర్శించుకోవాలని వచ్చినట్లుంది ఒక్కసారిగా వెలుగు. అప్పుడు చూశాను నాకు కొంచెం దూరంగా కూర్చుని ఉన్న ఆమెని. గోధూళి రంగు చీర. ఆ చీర మీద ఆకుపచ్చని చిలుకలు ఎగురుతున్నాయి చిక్కగా. ఎదని కప్పిన పైట మీద ఆమె హృదయానికి దగ్గరగా వాలినట్లున్న చిలుకతో, ఊసులాడుతున్నట్లుగా తల వంచుకుని కూర్చుని ఉంది. నాజూగ్గా, లేత తమలపాకులా ఉన్న ఆమె రూపం కాంతులీనుతూ మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తోంది. ఆమె తల ఎత్తితే ఆమె మోముని చూడాలనే కాంక్షతో రెప్ప వాల్చకుండా ఆమె వైపే చూస్తున్నాను.

గూటికి చేరిన పక్షులు తమ పిల్లలకి పగలంతా వెతికి తెచ్చిన పళ్ళని తినిపిస్తున్నాయి. తలిదండ్రులను చూసిన ఆనందంతో పక్షిపిల్లలు చేస్తున్న కిలకిలారావాలు మా చుట్టూ ఆవరించుకున్నాయి. ఆమె తల ఎంతకీ పైకెత్తడం లేదు. పొందిగ్గా, ఎంతో నైపుణ్యంతో చెక్కిన శిల్పంలా ఉన్న ఆమె రూపం ఆకర్షిస్తోంది. ఆమె ముఖం చూడాలి. ఆ పూర్తి రూపాన్ని నా గుండెల్లో దాచుకోవాలనే తపన నన్ను దహించివేస్తోంది. కాలం గడిచిపోతోంది యుగయుగాలుగా. ఆమె మాత్రం అలాగే ఉంది కాలంతో తనకు సంబంధం లేనట్లుగా, నిశ్చలంగా.

ఆమె ఏకాంతాన్ని భగ్నం చేయమని సన్నగా వీస్తున్న చల్లటి గాలికి చెబ్దామనుకున్నాను. ఊహు! ఆమెని ఆ మలయమారుతం తాకడం నాకు నచ్చలేదు. ఏమిటిది? అసూయా? ఆమెని ఇప్పుడు చూశానో లేదో ఇంతలోనే ఇంత ప్రేమా? కాదు కాదు ఇది ఇప్పటిది కాదు. యుగకల్పాల ముందే, ఎప్పుడో ఏకాగ్రతతో, దీక్షతో ఆ రూపాన్ని నా మనసులో చెక్కుకున్నాను. ఆమె నాదే. ఇన్నాళ్ళకు నాకు ప్రత్యక్షమైంది. నా కళ్ళల్లో వెచ్చని తడి. నా కన్నీటిని ఆమె చూడదు కదా! తల తిప్పుకున్నాను ఒక్క క్షణం. ఆమె అక్కడ లేదు. పచ్చని చిలకల చీర కొంగు నాకు వీడ్కోలు చెబుతూ కొండ చాటుకి వెళ్ళిపోయింది.

ఆమె కావాలనీ, ఆమె నా సన్నిధి లోనే ఉండాలనీ తపించిపోతున్నాను. నీ ఊహలతోనే కదా నా చూపు మళ్ళింది? అంత మాత్రానికే నీ సౌందర్యాన్ని చూడనివ్వకుండా వెళ్ళిపోతావా? ఎంత నిర్దయ? ఎదురుగానే ఉన్నానే? నీళ్ళు నిండిన నా కళ్ళనైనా పలకరించాలని అనిపించలేదా? పిచ్చిగా నాలో నేనే గొణుక్కున్నాను. ఆమె రూపం నా మనసుని పూర్తిగా ఆవరించుకుంది. ఆ రూపం ఏదో చెప్పలేని అనుభూతిని కలిగిస్తోంది. బలమైన చెట్ల పైకి ఎగబాకిన మాధవీ లతలు నాపై పువ్వులను చల్లుతూ మధుర పరిమళాన్ని వెదజల్లుతున్నాయి. ఆమెతో ఏకమై ఆ అపూర్వ సౌందర్యాన్ని అనుభవించాలనే రహస్యోద్రేకం నన్ను నిలవనీయడం లేదు. ఏమిటి ఆమె రహస్యం? ఎందుకింతగా సమ్మోహనపరుస్తోంది? ఆమెలోని లాలిత్యమేనా ఇంత మాధుర్యాన్ని కలిగిస్తున్నది?

అవ్యక్తమైన అసహనం, అశాంతి, ఆవేదన నాలో కట్టలు తెంచుకున్నాయి. దూరంగా ఎత్తైన కొండలు వెన్నెట్లో తడిసిపోతున్నాయి. వినీలాకాశంలో పౌర్ణమి చంద్రుడు వెన్నెలలు విరజిమ్ముతున్నాడు. పుడమి చీకటిని తొలగించుకుని కలలు కంటోంది. రేపు రాబోయే చెలికాడి కోసం తన శరీరాన్ని పాల నురుగులా మెత్తగా తయారు చేయడానికి వెన్నెల వెన్నను అలముకుంటోంది. వాళ్ళకే చేతనవును సమ్మోహపరుస్తూనే వాళ్ళని వాళ్ళే మరిచిపోయేంతగా మత్తులో పడిపోవడం. ధరణికి వెన్నెల ముద్దని ఇచ్చి అలిసిపోయిన చంద్రుడు కొండల వెనక్కి మరలిపోతున్నాడు. అంతటా నిశ్శబ్దం. ఎక్కడా ఏ అలికిడీ లేదు. తెలవారుఝాము చలిగాలి ఆర్తితో నను తాకి అనునయించింది. ఆ ఓదార్పులో నా రెప్పలు మూసుకున్నాయి నాకు తెలియకుండానే.

నులివెచ్చని సూర్యుడు నా ముఖాన్ని తాకుతుండగా మెల్లగా కళ్ళు తెరిచాను. ఇవ్వాళ ఏదో జరగబోతోందన్నట్లుగా మనసు ఉన్మత్తపరవశమై నా అధీనంలో నుండి జారిపోయింది. ప్రాతఃకాలపు అవ్యక్తరాగంలో ఆమె ముఖ సౌందర్యాన్ని ఆరాధించడం కోసం కనులు కెంజాయలైనాయి. నిర్నిబంధమైన ప్రతీక్షలో మధ్యాహ్నమూ నిశ్శబ్దంగా పాలుమాలి కదలలేక కదిలింది. సాయంసంధ్య ముడి విప్పి నీడలను పొడవుగా విరబోసుకుంది. పుడమి కప్పుకున్న నీలాల కురుల మేలి ముసుగు తొలగించే ఆ లేత నారింజ రంగు చెలికాడు ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో. అసలు వచ్చాడో రాలేదో. కనులెత్తి చూడాలనీ నాకు అనిపించలేదు.

ఆమె రాదేమిటి? ఇంకా రాలేదేమిటి? తెల్లవారక ముందే విరబూసిన పువ్వులు సాయంకాలం అయ్యేటప్పటికి సుగంధాన్ని విరజిమ్మి పొద్దెక్కేప్పటికి బాధతో ముడుచుకు పోయినట్లు ఉంది నా మనసు, ఆమె రాదేమోనన్న అనుమానం వల్ల. ఈ నిస్పృహ నీరవ సంగీతమై వేదనని కలగచేస్తోంది. పాడ్యమి చంద్రుడు మబ్బు చాటు నుండి తొంగి తొంగి చూస్తున్నాడు దొంగతనంగా, వేసారిన నా మనోమందిరంలో ఏమూలో ఆమె తప్పకుండా వస్తుందని మిణుకుమంటున్న ఒక చిన్న ఆశలా.

అదిగో, అప్పుడు వచ్చింది ఆమె! నా ప్రేయసి, నా పాలుషి, నా ప్రకృతి. అరిటాకు పచ్చని చీర చీర అంచుల్లో కొండరాళ్ళు రాళ్ళ మధ్యగా పారుతున్న సెలయేరు సెలయేరు పొడవునా ఆమెను నిలువెల్లా కప్పుకున్న పెద్ద పెద్ద కొమ్మల చెట్లు చెట్లను పెనవేసుకున్న లతలు తీగలు తీగలకి ఆలంబనగా ఊడలు ఊడల మధ్య గడ్డిలో ఆడుకుంటున్న లేళ్ళు కుందేళ్ళు ఎలుగులు పులులు పసరములు ఆమె నడుస్తూ ఉంటే ఆమెతో పాటు కదులుతున్నాయి, ఆమె చుట్టూ చిలుకలు వెండిగోరింకలు పరిభ్రమిస్తున్నాయి పాటలు పాడుతున్నాయి. ఆమె ఆగమనానందంలో లయ తప్పిన గుండె రొదలో ఇది సత్యమో స్వప్నమో, కనులు విప్పార్చి చూశాను. జ్యోత్స్నికాలావణ్యంతో, పరిపూర్ణ యవ్వనంతో, ముగ్దమనోహరంగా వెలుగుతున్నది ఆమె వదనం. ఆమె పెదవులపై శీతల శీకరం లాంటి నిశ్శబ్ద దరహాసం అలుముకుని ఉంది.

దీక్షగా నా చూపుతో ఆమెను తాకాను. ఆహా! చూసింది కళ్ళెత్తి అలవోకగా. జీవం ఆమెలో నుండి నాలోకి ప్రవహించినట్లయింది. సుమధుర వసంతాలు అన్నీ ఒక్కసారిగా నన్ను తాకినట్లనిపించింది. నన్ను చూసినప్పుడు ఆమె కళ్ళల్లో కనిపించిన కలవరాన్ని స్పష్టంగా చూశాను. పూర్తిగా వివశుడనైనాను. చేతులు చాచాను.

నా సాహచర్యం కోసం మాత్రమే ఎదురుచూస్తున్న దాని మల్లే, నన్ను చూడకుండా ఉండలేని దాని మల్లే, సమ్మోహనామృతం తాగిన దాని మల్లే తడబడే అడుగులతో ఆమె నాకు దగ్గరగా వచ్చింది. నాలో లీనమయింది. ఆమె తనువు నా తనువుతో మమేకమయింది. మనసు రెక్కలు విప్పుకుని గగనతలానికి రివ్వున ఎగిరింది. సృష్టి మొదలయింది.

ఆమె సౌందర్య రూపంతో పులకించి, ఆమెలో ఏకమై, లీనమై, విలీనమైన ఈ వేళ ఉద్భవించే ఈ సృష్టి నిర్ధారితమై నడుస్తుందో లేక ఇచ్ఛాపూర్వకంగా ప్రవర్తిస్తుందో నేను చెప్పలేను కాని ఈ సృష్టిలో ఉండబోయే అంతులేని రహస్యాలు మాత్రం నిరంతరం నాకు ఆనందాన్ని, ఆశ్చర్యాన్ని కలిగిస్తూనే ఉంటాయి. నన్ను నిత్యసమ్మోహితునిగా చేస్తూనే ఉంటాయి.


రాధ మండువ

రచయిత రాధ మండువ గురించి: భర్త ఉద్యోగరీత్యా మద్రాస్ లో 4ఏళ్ళు, పూనాలో 4ఏళ్ళు, అమెరికాలో 9ఏళ్ళు ఉన్నారు. ప్రస్తుతం జిడ్డు కృష్ణమూర్తి ఫౌండేషన్ వారి రిషీవ్యాలీ స్కూలు, మదనపల్లి, చిత్తూరు జిల్లాలో ఇద్దరూ తెలుగు టీచర్స్ గా పని చేస్తున్నారు. రాయడం 2013 మార్చి, ఏప్రిల్ లోనే మొదలు పెట్టిన వీరి కథలు సారంగ, వాకిలి, ఈమాట, భూమిక, ఆంధ్రజ్యోతి, సాక్షి, కౌముది, విపుల, తెలుగువెలుగు, చినుకు, పాలపిట్ట పత్రికలలో వచ్చాయి. బాలసాహిత్యం కూడా రాశారు. దాదాపు 30 కథలు కొత్తపల్లి పత్రికలో వచ్చాయి. ...