రాతి పడవ

In the end, we always arrive at the place where we are expected

– Book of Itineraries.

చిట్టిబాబు తిరుపతి కొండ దేవుడికి యధావిధిగా, అలవాటు ప్రకారం మొక్కి, శఠగోపం పెట్టించుకొని, ప్రసాదం భక్తిగా రెండు చేతులతోటీ పుచ్చుకొని, కృష్ణ తులసీదళం చెవికి తగిలించుకొని కారు దగ్గిరకొచ్చాడు. రాజకీయ తైనాతి ఒకడు చిట్టిబాబుకి దణ్ణం పెట్టి ఏదో చెప్పడానికి సిద్ధమయ్యాడు. చిట్టిబాబు విన్నట్టు నటిస్తూ ఠకాలుమని కారులో కెక్కబోయాడు. ఇది వారంవారం, ప్రతి శనివారం ఆనవాయితీగా జరుగుతున్న పనే. ముఖ్యమంత్రిగా వుండే రోజుల్లో పొద్దున్నే తిరుపతికెళ్ళి హుటాహుటిన హెలికాప్టర్ ఎక్కి భాగ్యనగరం తిరిగి వచ్చేవాడు. ఇప్పుడు మాజీ మంత్రి కాబట్టి కారులో కొండ ఎక్కి కారులోనే క్రిందకి దిగవలసిన గతి పట్టింది.

అయితే ఈ సారి అనుకోని ఘోరం జరిగింది. పొరపాటున చేతిలో ప్రసాదం నేల మీద పడింది. ఏడుకొండలవాడా వెంకన్నా అనుకుంటూ లెంపలు వేసుకొని నేల మీద పడ్డ ప్రసాదం తీసుకొని కళ్ళకద్దుకుంటూ వుంటే, చెవిలో తులసీ దళం నేల పాలయ్యింది. అక్కడికి దగ్గిరగా నేల వాసన చూస్తూ తారట్లాడుతున్న ఒక ఊరకుక్క అదేపనిగా మొరగటం మొదలెట్టింది. అది మామూలు మొరుగుడు కాదు; మొర్రోమని ఎడతెరిపి లేకండా ఏడవటం మొదలు పెట్టింది. కుక్కలు అల్లా మొర పెడితే శ్మశానంలో నక్కలు అరుస్తున్నట్టు ఉంటుంది. చిట్టిబాబు ఆ పవిత్ర తులసీదళం తియ్యబోతూ, నేల కేసి శ్రద్ధగా చూశాడు. నేలమీద ఒక సన్నని గీత, ఎవరో కావాలని కత్తితో గీసినట్టుగా చూపుకి అందినంత మేరా కనిపించింది. చిట్టిబాబు ఆ గీత వెంటే నిటారుగా చూస్తూ నడిచాడు. ఆ గీత నేలపైన పగులు. భూమి విచ్చుకొపోతున్నట్టు కనిపించింది. దబ దబ కారెక్కి కొండ కిందకి వచ్చి, అలివేలు మంగమ్మ వారికి దణ్ణం పెట్టుకోకండానే, జోరుగా ఉత్తరాదికి కారు తోలుకొని పొమ్మన్నాడు, డ్రైవర్ని.

కొండమీద వీధికుక్క ఏడుపు, భూమి మీద పొడుగ్గా విచ్చుకొపోతున్న పగులు; ఈ రెండూ చిట్టిబాబుని కలవరపెట్టాయి. కొండదిగువ కుక్కలు కూడ కూడపలుక్కున్నట్టు అరవటం మొదలుపెట్టాయి.

అలా కుక్కలు ఎడతెరిపి లేకుండా అరిస్తే ఏదో అరిష్టం రాబోతున్నదని ప్రజల్లో గట్టి నమ్మకం ఉంది. అన్ని దేశాల్లోనూ అదే రకమయిన నమ్మకం బలీయంగా వున్నదని తెలిసినా కూడా సాధువుల చుట్టూ తిరిగే ఆస్తిక శాస్త్రవేత్తలు మాత్రం పైకి ఒప్పుకోరు. శాస్త్రజ్ఞులకి, సాధారణ జనానికీ అదే తేడా.

దిగువ తిరుపతిలో జనం గుంపులు గుంపులుగా రోడ్డు మీద కనపడేటప్పటికి, చిట్టిబాబు కారు ఆపమన్నాడు. ఊళ్ళో కుక్కలన్నీ ఒకేసారి మొరగటం మొదలు పెట్టేటప్పటికి, రోడ్ల మీద జనం పోగవుతున్నారు. ‘భూకంపం వస్తున్నాది,’ అన్నాది ఒక గుంపు. ‘తిరుపతి కొండ మొత్తం కదిలి తూర్పుకి జరిగి పోతున్నది,’ అన్నారు మరో గుంపు జనం. మొత్తం మీద జనానికి విపరీతమయిన భయం పట్టుకొని ఇళ్ళల్లోనుంచి బయటికి వచ్చెయ్యటం మొదలు పెట్టారు, గోవిందా! శ్రీనివాసా! అని అరుచుకుంటూ. ఇదంతా విన్న చిట్టిబాబుకి కంగారు పెరిగి తిన్నగా విజయవాడ దాకా ఆగకుండా కారు తోలుకోపొమ్మని డ్రైవర్ని మళ్ళీ హెచ్చరించాడు. విశాఖపట్టణం చిన్న (సుబ్బ)రాజు ఇంటికి పిలిచి అర్జెంటుగా తనని సెల్‌లో పిలవమని చెప్పాడు.

2

చిట్టిబాబు చెవిలోనుంచి తులసీ దళం భూమ్మీద పడ్డ సమయం లోనో, ఆ తరువాత కొద్దిక్షణాల తరువాతనో, కచ్చితంగా చెప్పలేం కాని, విశాఖపట్టణం దిగువ బీచ్ లో నడుస్తూ, చిన్న(సుబ్బ)రాజు యధాలాపంగా ఒక పెద్ద రాయి సముద్రం లోకి విసిరాడు. ఇదేం గొప్ప విషయం కాదు. ప్రతి రోజూ మాజీ మంత్రి చిన్న (సుబ్బ)రాజు అదే బీచ్ మీద నడుస్తాడు. ప్రతి రోజూ చిన్న చిన్న గులక రాళ్ళు, కుండ పెంకులూ ఏరి సముద్రం లోకి విసురుతాడు. ఒక్కొక్కసారి విపరీతమయిన కోపంతో చిళ్ళపెంకులు ఏరి వరసగా సముద్రం లోకి విసురుతాడు; ఈ వెధవ నాయకులు తనని ముఖ్య మంత్రిగా గద్దెకెక్కించ లేదన్న కోపంతో! అయితే ఈ రోజు, ఈ క్షణం, తన బుర్రలో ఏమి తొలిచిందో తెలియదు ఒక పెద్ద రాయి — నిజంగా పెద్ద రాయే! దాన్ని ఎత్తి సముద్రం లోకి గిరవాటు వేశాడు.

అంతే! వెనక్కి తిరిగి వస్తూ ఉన్న అతనికి కొత్త సిమెంటు రోడ్డు అడ్డంగా చీలినట్టు కనిపించింది. ఇంతకు ముందు ఈ చీలిక లేదు. ఇదేదో కొత్తగా రోడ్డు పగిలి పోతున్నట్టు అనిపించింది. అసలీ పగులు ఎంత దూరం పోయిందో చూద్దామని రోడ్డు మీద నడవటం మొదలుపెట్టిన మరుక్షణంలో దిగువ విశాఖపట్టణంలో కుక్కలు అరవడం మొదలయ్యింది. కుక్కలు ఒకేసారి గొంతెత్తి అరవడం, నేలమీద సన్నగా బారుగా రోడ్డు పొడుగూతా చీలిక కనిపించడం: ‘ఇదేదో కొంప ముణిగే ప్రమాదానికే,’ అని అనుకుంటూ చిన్న (సుబ్బ)రాజు ఇంటి ముఖం పట్టాడు. భూమి మీద పగులు చూస్తూ చూస్తూ ఉండంగా పెద్దదవటం, దిగువ విశాఖ పట్టణం, ఎగువ పట్టణం మధ్య రోడ్డు విడిపోవడం ఒకేసారి ప్రారంభం అయ్యింది. చిన్న (సుబ్బ)రాజుకి కంగారు పెరిగింది. ఇంటికి కబురంపాడు. చిట్టిబాబు వెంటనే యమర్జెంటుగా తన సెల్లుకి పిలవమన్నాడని కబురు! దానితో చిన్న (సుబ్బ)రాజుకి కంగారు రెండింతలయ్యింది.

3

శీని నాయుడుకి అసలే కోపం జాస్తి. ఎందుకో ఇవ్వాళ మరీ పిచ్చెక్కినంత కోపంగా ఉన్నాడు. గత నాలుగు వారాలనుంచీ ఒకటే వాన. కుండపోతగా వాన. పట్టు విడవకుండా కురుస్తూన్నది. భాగ్యనగరం శివార్లలో ఏ రోడ్డు చూసినా బురద బురదే. కొందరికి ప్రతి పౌర్ణిమకి, అమావాస్యకీ పిచ్చెక్కిపోతుందంటారు. అదేమో కాని, శీని నాయుడుకి వాన వొచ్చినప్పుడల్లా ఒళ్ళు జలదరించిపోయి కోపంతో పెల్లుబికి పోతాడని కొంతమంది గిట్టని వాళ్ళు అంటారు. కాని నిజం ఎవరికీ తెలియదు. ఇలాంటి విషయాలలో, నిజమేదో, అబద్ధమేదో ఏ మానసిక శాస్త్రవేత్తా కచ్చితంగా చెప్పలేడు. అది మాత్రం నిజం.

మూసీ నదికి ఉత్తరాన పెద్ద బంగళా. వరండాలో సింహాసనం లాంటి పేము కుర్చీ మీద కూర్చున్నాడు శీని నాయుడు. అతని రాజకీయ బంధువులు, దగ్గిర వాళ్ళూ ఒక ఇరవైమంది బలగం ఆ వరండా నేల మీదే కూర్చొని ఉన్నారు. నాయుడు మాట్టాడటల్లేదు. అది వ్యూహాత్మక మౌనం అని అతని బలగం చెప్పుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం అటొక మాట, ఇటొక మాట చెప్పుతూ అతన్ని ఆడిస్తున్నదని అతనికి కోపం. ఎడతెరిపి లేని వానలు ఆ కోపానికి అగ్గి మీద గుగ్గిలంలా పనిచేస్తూ వుండవచ్చునేమో! అసలు విషయం ఆ దేవుడికే తెలియాలి. మహమాంచి కోపంగా ఉన్నాడో ఏమో, పళ్ళు బిగబట్టి నేలమీద ఎడమకాలితో ఒక్క తన్ను తన్నాడు, శీని నాయుడు.

అంతే! ఎంత గట్టిగా తన్నాడంటే, అక్కడ భూమి దద్దరిల్లి పోయిందంటే నమ్మండి. అతని వరండాలో కూచున్న ఛోటా ఛోటా నాయకులందరూ ఒక్కసారి ఉలిక్కి పడ్డారు; భూకంపం కాని వచ్చిందా అని! అంత జోరుగా భూమి కంపించి పోయింది. ఏ పుట్టలో ఏ పామున్నదో ఆ పాములవాడికే తెలియాలి! హిరణ్యకశిపుడు భూమిని తన్నినప్పుడు భూమి అంత జోరుగా కంపించే ఉంటుంది. అది కథ! ఇది కాకతాళీయమేమో తెలీదు. అయితే, అతని తన్ను వల్లనే భూమి కంపించిన విషయం మాత్రం నిజమని అతని అనుయాయులంతా ఏక కంఠంతో చెప్పటం మాత్రం నిజం. అతగాడి భవనం ముందు అంత వాన లోనూ ఊరకుక్కలు పోగుపడి అన్నీ ఒకేసారి అరవటం మొదలు పెట్టాయి. అంతే! కొన్ని క్షణాల తరువాత కాబోలు! భాగ్యనగరం ఉత్తరభాగంలో భూమి మీద మూసీ నదికి సమాంతరంగా స్టెన్సిల్‌తో సీనారేకు పలక మీద గీసిన గీతలా సన్నటి బీట కనిపించింది. భాగవతంలో వామన మూర్తి లాగా, ఈ బీట ఇంతై, ఇంతింతై పెద్ద గండిలా తయారయ్యింది.

4

రెక్కలు తడిసిపోయిన నల్ల కాకులు కావు కావు అని అరుస్తూ గుంపులు గుంపులుగా తూర్పుకి ఎగిరిపోవటం మొదలుపెట్టాయి. ఉమ్మడిగా ఎగిరిపోయే కాకులకి తర్కం తెలియదు; కాకులకున్నది కేవలం పక్షిబుద్ధి. తర్కం శాస్త్రజ్ఞుడిదే! సహజ గుణం మాత్రం కాకులది.

5

విశాఖ దిగువలో భూమి పైన వచ్చిన చీలిక పెద్దదై ఆ చీలిపోయిన పట్టణం తూర్పు దిశగా కదలడం, మూసీ ఉత్తరాన భూమి కంపించి భాగ్యనగరం ఉత్తర భాగం తూర్పు దిశగా ప్రయాణం చేయడం –- ఈ చీలిక, ఈ నేలలో వచ్చిన చీలిక రాష్ట్రం పొడుగూతా వ్యాపించడం మొదలయ్యింది. ఈ మూడు సంఘటనలకీ -– తిరుపతి కొండ కంపించి భూమి బద్దలవటం; దిగువ విశాఖపట్టణం రోడ్డు మీద పగులు మెల్లి మెల్లిగా పెద్దదయి అగాథం ఏర్పడటం, భాగ్యనగరం ఉత్తర భాగం వేర్పడి తూర్పు పక్కకి కదిలి పోవటం; మొత్తం మూడు చోట్లా ఊరి(ర)కుక్కలు నక్కల్లా మొరపెట్టడం – వీటన్నిటికీ ఏకకాలీనత ఉన్నదని ఏ భౌతిక శాస్త్రజ్ఞుడూ రుజువు చెయ్యలేడు. ఇవి పరంపరానుగత సంఘటనలు కావటానికే ఆస్కారం ఎక్కువ. ఏది ఏమయితేనేం! ముచ్చెంగా మూడు విషయాలు మాత్రం నిజం.

ఒకటి: విశాఖపట్టణం దిగువభాగం నుంచి తిరుపతి కొండతో సహా ఒక సరళరేఖ గీసినట్టుగా భూమి బద్దలై మొత్తం తూరుపు దిశగా ఒక్క కుదుపు కుదిపి, ఆగ్నేయ దిశగా ముందుకు సాగి పోవటం.

రెండు: భాగ్యనగరం ఉత్తరభాగం ఇదే సమయం లోనో, కొద్ది క్షణాల తరువాతనో మూసీలో కలిసిపోతున్నదా అన్నట్టు కదిలి పోవటం.

మూడు: ఊర కుక్కలు ప్రతి ఊళ్ళోనూ – ముఖ్యంగా విశాఖ పట్టణం, కర్నూలు, అనంతపురం, చిత్తూరులో తిరుపతి, ఉత్తర భాగ్యనగరం అంతానూ — అదుపు లేకండా ఒకే బిగిని మొరపెట్టి అరవడం. ఈ మూడు విషయాలూ మాత్రం నిజం.

మొదటి బీట తిరుపతిలోనా? విశాఖలోనా? లేదా భాగ్యనగరం శివార్లలోనా? – ఈ విషయం కూలంకషంగా చర్చించి, శాస్త్రీయంగా కారణాలన్నీ పరిశీలించి నిజానిజాలు ప్రజలకి తెలియ పరచడానికి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఒక త్రైపాక్షిక సంఘాన్ని నియమించింది. ఈ సంఘంలో భూగర్భ శాస్త్రజ్ఞులు, భాషా శాస్త్రవేత్తలు, వాతావరణ శాస్త్రవేత్తలు, వీరికి అండగా కొంతమంది రాజకీయ నాయకులూ మొత్తం పాతికమంది సభ్యులున్నారు.

అయితే కుక్కలు అరవటానికి, అర్థంతరంగా ఆంధ్రప్రదేశ్ అనబడే భారత దేశంలో ఒక భాగం రెండు ముక్కలై పోవటానికీ ఏ విధమయిన కార్యకారణ సంబంధం ఉన్నదా లేదా అన్న విచారణకి మరొక ద్వైపాక్షిక సభ ఏర్పడ్డది. దానికి అధ్యక్షుడిగా, ఒకప్పుడు వామపక్ష రాజకీయ నాయకుడిగా పేరు పొంది, ప్రస్తుతం ప్రపంచంలో అన్నిటికన్నా పెద్ద సాయిబాబా గుడి కట్టడానికి ముఖ్య కార్యకర్తగా నిర్విరామంగా పనిచేస్తున్న ఒక మాజీ పాత్రికేయుడిని రాష్ట్రప్రభుత్వం నియమించింది. ఇందులో సభ్యులుగా ఏ వర్గాన్నీ వదలి పెట్టకుండా అన్ని రాజకీయ వర్గాలకి, అన్ని కులాల వారికీ సమాన ప్రాతినిధ్యం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తరువు జారీ చేసింది.

ఈ సంఘాలు ప్రతి రోజూ పత్రికాముఖంగా, ప్రతి గంటకీ టెలివిజన్ ద్వారా ప్రజలకి తమ నిర్ణయాలని తెలియపరుస్తాయని ప్రధానమంత్రి రేడియో ద్వారా ప్రకటన చేశారు.

6

రెండు రోజులు గడిచాయి.

ఈ భూతలంపై పుట్టిన చీలిక పెరుగుతున్నదే కాని తగ్గు ముఖం పట్టటల్లేదు. ఈ సంఘటన ఎక్కడ మొదలయ్యిందో ఇంతవరకూ ఎవ్వరికీ అంతు పట్టలేదు. తిరుపతిలో మొదలయిన బీటకి కారణం, ఈ అనంత విశ్వాంతరాళంలో మరొక గ్రహం నుంచి వచ్చిన పరదేశీయులు తెచ్చి పెట్టిన అఘాతం అని ఎరిక్ వాన్ డానికెన్ సిద్ధాంతాలని నమ్మిన ఒక జర్మన్ సంస్థ ప్రచారం చెయ్యటం మొదలు పట్టింది. అది నమ్మి కొంత మంది సాధుజనం గుళ్ళల్లో పూజలూ, వ్రతాలూ చేయించడం మొదలు పెట్టారు. ఇటువంటి మూర్ఖత్వాన్ని ఆపటానికి ప్రభుత్వానికి దమ్ము లేదని వేరే చెప్పనవసరం లేదు.

మూడో రోజున భాగ్యనగరంలో పుట్టిన చీలిక బాగా పెద్దదయ్యింది. ఉత్తర భాగ్యనగరం దక్షిణ నగరం మధ్య సుమారు అరవై అడుగులు పైచిలుకు (శాస్త్ర పరిభాషలో ఇరవై మీటర్లు) వెడల్పుగా పెరిగి పెద్ద గండిగా తయారయ్యింది. ఈ రెండు భాగాలనీ గొలుసులతో కట్టి పెట్టటానికి ప్రభుత్వం దేశంలో ఉన్న ఇంజనీర్లు అందరికీ ఫర్మానా పంపింది. ఉక్కు, యాన్టిమొనీ కలిపి చేసిన గొలుసులు తెప్పించి రెండు భాగాలపైనా అయస్కాంతాలు పాతించి ఈ గండి ఇంకా పెద్దది కాకండా ఆపటానికి సర్వ ప్రయత్నాలూ చేశారు. ప్రకృతి సహజంగా జరిగే పరిణామాన్ని ఎవరు ఆపగలరు? గొలుసులు కట్టీకట్టకముందే తెగిపోవటం, గండి పెరగటం ఆగలేదు.

ఇలా ఉండగా, ఒక మాజీ భూగోళ శాస్త్రవేత్త ఊరూ పేరు లేని ఒక దిన పత్రికలో ప్రకటన ఇచ్చాడు: కొద్ది రోజుల్లో ఉత్తర భాగ్యనగరం మూసీ నది మీదుగా కృష్ణానదిలో కలిసిపోయి కొత్త లంకల్లో చేరుతుందని! అయితే, భూగోళ శాస్త్రవేత్తగా విశ్వవిద్యాలయంలో పనిచేసే రోజుల్లోనే ఆయనకున్న పలుకుబడి అంతంత మాత్రవేఁ. అందుచేత ఆ ప్రకటనని ఎవడూ ఖాతరు చెయ్యలేదు.

భాగ్యనగరంలో జనం ఇళ్ళు వదిలిపెట్టి కట్టుగుడ్డలతో తూర్పు జిల్లాల వేపు ప్రయాణాలు మొదలుపెట్టారు. అయితే, అటు కోస్తా ప్రాంతం అంతా వేరు పడి ఇంతకన్నా వేగంగా బెంగాలు సముద్రం లోకి పోతున్నదని వారికి తెలియదు.

7

చిట్టిబాబు చేతిలో నుంచి ప్రసాదం, చెవిలో నుంచి తులసి దళం భూమి మీద పడ్డ మూడో రోజున ప్రపంచవ్యాప్తంగా ఒక్క విషయం తెలిసిపోయింది.

దక్షిణ విశాఖపట్టణం నుంచి నైరుతి దిక్కుగా కత్తితో గీసినట్టు కర్నూలు వరకూ భూమిలో చీలిక బాగా వెడల్పుగా బాగా లోతుగా వచ్చింది. అక్కడనుంచి అనంతపురం దాకా పెరిగి, అనంతపురం నుంచి ఆగ్నేయంగా తిరుపతిని పట్టణాన్ని, తిరుమలకొండ మొత్తాన్ని కలుపుకొని, ఒకే ఒక రాతి పడవ లాగా బంగాళాఖాతం లోకి ప్రయాణం చెయ్యటం ప్రారంభమయ్యింది. ఇది సహజంగా సంభవించిన సంఘటన కాబట్టి, కొన్ని పశ్చిమభాగంలో భౌతికంగా చిరకాలం నుంచీ ఉన్న ఊళ్ళు ఈ తూరుపు ముక్కలో కలిసి వచ్చాయి. అల్లాగే కొన్ని కోస్తా జిల్లాలలో ఉన్న గ్రామాలు పడమర పక్కకి పోయాయి. ఇది విపరీతమయిన గందరగోళానికి నాంది పలికింది. చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవా అనుకుంటూ చిల్లర జనం, పేదవాళ్ళూ, తట్టా బుట్టా నెత్తిన పెట్టుకొని, దారీ తెన్నూ తెలియని కాందిశీకులయ్యారు.

ఈ విడిపోయిన భాగం, రోజుకి పది మీటర్ల నుంచి వంద మీటర్ల వేగంతో సముద్రయానం చేస్తూన్నదని అమెరికాలో చదువుకున్న ఒక భూగర్భశాస్త్రవేత్త, ఒక ద్రావిడభాషా శాస్త్రవేత్తతో కలిసి ఒక టెలివిజన్ ప్రకటన ఇచ్చారు.

ఉత్తర భాగ్యనగరానికి, దక్షిణ నగరానికీ మధ్య ఏర్పడ్డ అగాథం కనీసం అరవై మీటర్లన్నా ఉంటుందని, ఇది ఇంకా బాగా పెద్దదై కోతిపుండు బ్రహ్మరాక్షసిగా తయారవుతుందని రాజకీయ నాయకుడొకడు చేసిన ప్రకటనలని రోజు పొడుగూతా చెప్పిన వార్తలే మళ్ళీ మళ్ళీ అప్పజెప్పే వార్తల టెలివిజన్లో గంట గంటకీ ప్రసారం చేస్తున్నారు. భాగ్యనగరానికి సందర్శనార్ధం వచ్చిన పరదేశీయులు — అంటే ముఖ్యంగా అమెరికనులు, తెల్లదొరలూ –- విమానాశ్రయానికి గుంపులు గుంపులుగా వచ్చి పడగాపులు పడుతున్నారు. అల్లాగే, ప్రతి సంవత్సరం ఆనవాయితీగా అమెరికా నుంచి ఆంధ్రదేశం సందర్శించి, విచ్చలవిడిగా ఎడా పెడా డాలర్లు విరజిమ్మే ప్రవాసాంధ్రులు, ‘ఈ ఉపద్రవం తప్పితే అమెరికాలో మరో తిరుపతి కట్టడానికి చందా ఇద్దామని,’ రహస్యంగా మొక్కుకొని ముడుపులు కట్టుకొని విమానాశ్రయానికి వస్తున్నారు. వీళ్ళకి తోడుగా బాగా మదించిన మొఖాసాదారులు, అంటే అమెరికాలో బంధువర్గం దట్టంగా ఉన్న వాళ్ళు, విమానాశ్రయం అధికారులకి లంచాలు పెట్టి భాగ్యనగరం నుంచి ఎక్కడికి కెళ్ళే విమానంలో టికెట్టు దొరికితే అక్కడికే వెళ్ళటానికి సిద్ధమయ్యారు. ఏదో విధంగా భాగ్యనగరం విడిచి పోవాలి, అంతే!

ఏ రకమయిన ఆత్రుతా చూపించని జనం లేకపోలేదు. వీళ్ళు పేదవాళ్ళు; కిమ్మన్నాస్తి అని ఎక్కడి వాళ్ళు అక్కడే పడి ఉండగల అదృష్టవంతులు వీళ్ళు! ఈ క్షణంలో వీళ్ళని చూసి అసూయ పడని వాడు ఉండడు.

8

చిట్టిబాబు ప్రసాదం నేల మీద పడ్డ తరువాత నాలుగో రోజున, చిట్టిబాబు, చిన్న (సుబ్బ)రాజు, వాళ్ళ కార్లలో విజయవాడకి వచ్చారు. అదేమీ అంత తేలిక ప్రయాణం కాలేదు. అటూ ఇటూ కేంద్ర ప్రభుత్వం ఆదేశంతో వచ్చిన మిలిటరీ పోలీసులు పెద్ద రోడ్డులన్నీ బంద్ చేశారు, ఆ రోడ్డులేవీ కారు ప్రయాణానికి పనికి రావని; అపాయకరమనీ. అటు విశాఖ నుంచి చిన్న (సుబ్బ)రాజు, ఇటు తిరుపతి నుంచి చిట్టిబాబూ, విజయవాడ రావటానికి నాలుగు రోజులు పట్టింది. వచ్చీ రాంగానే, కిష్టయ్యని పిలిచారు. కిష్టయ్య ఉభయ గోదావరి జిల్లాలకి నాయకుడు. వాడు చెప్పందే గోదావరి జిల్లాలలో కాకులు కూడా కావు కావుమని అరవవు. ఇతనంటే చిన్న రాజుకి, చిట్టిబాబుకీ పడేది కాదు, ఒకప్పుడు! కానీ, ఇప్పుడు అవసరం పడింది. అవసరానికి వసుదేవుడు గాడిద కాళ్ళు పట్టుకున్నాట్ట! రాజకీయాల్లో ఒకడంటే ఒకడికి పడకపోవటం తాత్కాలికం.

ఈ ముగ్గురికీ భాగ్యనగరంలో కొన్ని వేలకోట్ల రూపాయలు చేసే ఆస్తి పాస్తులున్నాయి. శీని నాయుడు, అతని బలగం కబ్జా చేయకముందే ఏదో రకంగా వాటిని కాపాడుకోవాలి. అది ముఖ్యం; చవకబారు రాజకీయాలు అప్రస్తుతం. ఈ ముగ్గురూ ఆలోచించి వాళ్ళ ఆస్తి పాస్తులు సురక్షితంగా కాపాడుకునేందుకు ఒక పథకం వేశారు. డబ్బున్నవాళ్ళు కలిసి తలుచుకుంటే దెబ్బలకి కొదువా అన్నట్టు!

ఇది ఇలా ఉండగా, కొద్దిమంది రాజకీయ నాయకులు, దేశం నలుమూలల నుంచీ హస్తినాపురం చేరుకున్నారు. ఈ ఆపత్తు నుంచి అందరినీ కాపాడగలిగిన ఒకే ఒక వ్యక్తి మరియా! ఆవిడని అందరూ మరియా మాత అనడం ఆనవాయితీ. మరియా మాత గనక కల్పించుకోకపోతే, బహుశా దేవుడు కూడా ఈ ప్రమాదం నుంచి పుణ్యభూమిని రక్షించలేడు, అని చాలా మంది నాయకుల నమ్మకం. ఆ నమ్మకాన్ని సాధారణ ప్రజల బుర్రల్లోకి మత్తులా ఎక్కించేశారు, పత్రికలవాళ్ళతో కలిసి కుమ్మక్కుగా! మరియా మాత భారతీయ రాజకీయ వ్యాధులన్నింటికీ ఐంద్రజాలిక చికిత్స చెయ్యగలదనే నమ్మకాన్ని వమ్ము చెయ్యటం అసంభవం.

మరియా మాత దర్శనానికి విచ్చేసిన నాయకుల్లో ఒరిస్సా నుంచి నవీన్ బాబు, తమిళనాడు నుంచి మాజీ ముఖ్యమంత్రి వరుణానిధి చెప్పుకోదగ్గ బయటి వాళ్ళు. ఈ సందర్భంలో నవీన్ బాబుది ఒకే ఒక్క కోరిక. విశాఖపట్టణం వరకూ ఒరిస్సా రాష్ట్రంలో కలపాలని. ఇది ఏనాడో జరగవలసిందని, అప్పటి ప్రధాని అడ్డంపడి జరగనియ్యలేదనీ, అతని కంప్లయింటు. అంతే కాదు; విశాఖపట్టణంలో విశ్వవిద్యాలయానికి ముందుగా డబ్బిచ్చిన ధర్మదాత ఒరియా వాడని ఆయన రుజువు చెయ్యగలడట! ఈ విషయంలో మరియా మాత సహకారం కోరుకోటానికి హస్తినాపురం వచ్చాడు, నవీన్ బాబు.

వరుణానిధి ఎన్నాళ్ళనుంచో తిరుపతి చారిత్రికంగా, భాషాపరంగా తమిళనాడులో భాగమని, తెలుగు వాళ్ళు మోసం చేసి కాజేశారనీ ప్రచారం చేస్తున్నాడు. ఇప్పుడు తిరుపతి గండి పడి సముద్రం లోకి పోతున్నది కాబట్టి, కనీసం తిరుపతిలో ఉన్న కోట్లకోట్ల నిధులు తమిళనాడుకి ఇప్పించమని మరియాని కోరటానికి వచ్చాడు.

మరియా మాత గురించి ఒక ముఖ్య విషయం చెప్పాలి. ఆవిడ దర్శనం అందరికీ అంత తేలిగ్గా దొరకదు, చచ్చిన కాఫ్కా మళ్ళీ బ్రతికి వచ్చినా సరే! మరియా మాత దర్శనం కావాలంటే దాటవలసిన అవరోధాలు అడ్డంకులూ కోకొల్లలు. అవన్నీ దాటిన వారికి ప్రస్తుతం మరియా మాత రాజకీయ నాయకుల చేత నాలుగు స్థంభాల ఆట ఆడిస్తోంది. ఈ ఆటలో నెగ్గిన రాజకీయ నాయకుడికి ఆవిడతో భేటి కుదురుతుంది. ఈ నాలుగు స్థంభాల ఆట క్లుప్తంగా ఇది: మరియా మాత ఇంటి ముందు నాలుగు పాలరాతి స్థంభాలున్నాయి. ఒక స్థంభం మోహన్ మంత్రి పట్టుకొని వదలడు. రెండవ స్థంభం ఏకాంబరం మంత్రి కౌగిలిలో ఉంటుంది. ఇకపోతే ఖాళీ స్థంభాలు రెండు. వాటిని పట్టుకోటానికి దేశవ్యాప్తంగా రాజకీయ నాయకులు పడిగాపులు పడుతూ ఉంటారు. మరియా మాత తనకి నచ్చిన సంగీతం టేపు పెడుతుంది. సంగీతం వినిపిస్తున్నంత వరకూ ఎవ్వరూ స్థంభాలని పట్టుకొని ఉండకూడదు. నాలుగు స్థంభాల చుట్టూ పరిగెడుతూ ఉండాలి. సంగీతం ఆగిపోగానే దబుక్కున దగ్గిరలో ఉన్న స్థంభం పట్టుకోవాలి. ఇది మనకందరికీ తెలిసిన సంగీతం కుర్చీల ఆటే! అయితే, ఇక్కడ స్థంభాలు శాశ్వతంగా నాలుగే! కుర్చీల ఆటలో కుర్చీల సంఖ్య ఆట ఆడే మనుషులకన్నా ఒక్కటి తక్కువగ ఉంటుంది. అంతే తేడా.

ఏదో ఒక స్థంభం ఖాళీ అవకపోతుందా అని కాసుకొని కూచున్న రాజకీయ నాయకులు చాలా మంది ఉన్నారు. వాళ్ళు సంగీతం వినిపించినంతసేపూ, చప్పట్లు కొడుతూ, మాత పిల్లలని ముద్దు చేస్తూ, గుమ్మం దగ్గిర వేసిన ఇటాలియన్ పాలరాతి బెంచీల మీద కూర్చొని ఉం(డాలి)టారు. ఎప్పుడో ఒకప్పుడు ఒక స్థంభం ఖాళీ కాకపోదు అనే ఆశ ప్రతి నాయకుడికీ ఉన్నదని అందరికీ తెలుసు. నవీన్ బాబు, వరుణానిధి మిగిలిన మాజీ రాజకీయ నాయకుల్లాగా పాలరాతి బండల మీద చేరారు. తప్పదు మరి, మరియా మాతని మంచి చేసుకోవాలంటే!

ఆవిడ సంగీతం టేపు మార్చి బర్తోలి ఆపెరా సంగీతం పెట్టింది. వరుణానిధి అదృష్టం పండింది. గభాలున దూకి ఒక స్థంభం పట్టేసుకున్నాడు. మరియా మాత ఎవరు ఏది చెప్పుకున్నా వింటుంది. అయితే శ్రద్ధగా ఆలకించి లక్ష్యపెట్టుతుందనేందుకు ఆధారాలు తక్కువే! వరుణానిధి చెప్పినది విన్నది. చిరునవ్వు నవ్వి, ఈ విషయం పార్లమెంటులో పెట్టి మెజారిటీ ఒప్పందంతో చెయ్యవలసిన పని. నా చేతిలో పని కాదే, అని జవాబిచ్చింది. నవీన్ బాబుకి అసలు స్థంభమే దొరకలేదు! ఇక ఆవిడ వినేదెప్పుడు!

9

ఇది ఇలా ఉండగా, విజయవాడలో చేరిన ముగ్గురు అమీగోలూ – చిట్టిబాబు, చిన్న (సుబ్బ)రాజు, కిష్టయ్య – జాతీయ నాయకత్వం ఈ విషయంపై శ్రద్ధ తీసుకొని మనవాళ్ళ డబ్బూ దస్కం సురక్షితంగా ఉంచలేకపోతే, వెంటనే అంతర్జాతీయ సంస్థలకి, అంటే అమెరికాకి చెప్పుకుందామని లోపాయకారీగా ఒప్పందం చేసుకున్నారు. పైకి చెప్పరు కానీ, ముగ్గురికీ ఉన్న మరో కోరిక: అదేమిటంటే, దేవుడు మేలు చేస్తే, ఈ విడిపోతున్న భాగానికి ముఖ్యమంత్రి అవుదామని! అయితే పడమర దిక్కుగా ఉన్న భాగంలో కొంతమంది రాజకీయ నాయకులకి ఇది పెద్ద పండగ. కేంద్ర ప్రభుత్వం అదిగో ఇదిగో అంటూ నీళ్ళు నవులుతూ కూర్చొని చెయ్యలేని పని ప్రకృతి చేసి పెట్టింది. అక్కడక్కడ ఊరేగింపులు, ఉత్సవాలూ చేసుకుంటున్నట్టు వార్త! ఈ ఉత్సవాలు ఊరేగింపులతో పాటు, భాగ్యనగరం శివార్లలో లూటింగు, అరాచకం యధావిధిగా సాగిపోతూ ఉన్నది. ఖాళీగా ఉన్న ఇళ్ళు, కాండోలు, ఖాళీ స్థలాలూ ఎవడికి దొరికింది వాడు స్వంతం చేసుకుంటున్నాడు. స్థానిక పోలీసు బలగం ఎంతని ఆపగలదు? అందుకని, చూసీ చూడనట్టు ఊరుకున్నారని అపవాదుల ప్రచారం పెరిగిపోయింది.

ఇరవై నాలుగ్గంటల టి.వి. ఇదొక ఇబ్బంది. ఒక భూగర్భశాస్త్రవేత్త ఈ చీలిపోయిన భూభాగం అండమాన్ల వరకూ పోవచ్చని అంచనా వేసి చెప్పాడు. అంతే! అండమాన్లలో జనం గగ్గోలు గగ్గోలు. ఇదే సందుగా అండమాన్లలో ఏ నాటినుంచో పాతుకొపోయిన అరవ జనం, ఆంధ్రా వాళ్ళు బలవంతంగా ఐనా సరే అండమాన్లని తమ రాష్ట్రంతో కలుపుకోవాలని అరవడం మొదలు పెట్టారు. ఈ వార్త అమెరికా దాకా పాకిపోయింది, ఇంటెర్నెట్ ధర్మమా అని.

మరొక భూగర్భశాస్త్రవేత్త, అమెరికాలో చదువుకున్న వాడు, అంటే ఆంధ్రులందరికీ మంచి నమ్మకం ఉన్న వాడేనని అర్థం. ఆయన అంచనాలో ఈ చీలిన భాగం ఆగ్నేయ దిక్కుగా కొంత దూరం పోయి, రాబోయే సోలార్ ఫ్లేర్ల మూలంగా సముద్రంలో కొరియాలిస్ ఘర్షణ మార్పుల వలన ఈ రాతి పడవ ప్రయాణం ఆగిపోతుంది అని జోస్యం చెప్పాడు. అంతే కాదు. ఈ చీలిన భాగం యధాస్థితికి కూడా రావచ్చునట! శాస్త్రవేత్తలు ఎవడికీ అర్థం కాని భాషలో ఏదో చెప్పుతారు. రాజకీయ నాయకులు ఎవడికీ అక్కరలేని భాషలో ఏదో చెప్పుతారు. ఈ ఇద్దరు చెప్పిందీ, వాళ్ళ స్వంత భాషలోకి తర్జుమా చేసి జర్నలిస్టులు అసలు ఎవడికీ అర్థం కాకండా మాట్లాడుతారు. అసలు విషయం ఆ దేవుడికి గూడా తెలియదు.

10

నాలుగో రోజుకి విడిపోయిన భూభాగం నిడివి దక్షిణాన బంగాళాఖాతంలో చాలా బాగా కనపడింది. ఆ ప్రాంతంలో తిరుగుతున్న అమెరికన్ సబ్‌మెరీనులు, నేటో వాళ్ళ ఓడలూ ఈ విషయం అమెరికన్ అధికారులకి తెలిపాయి. ఈ జలసంధిలో అమెరికన్ ఓడలు సుస్థిరంగా ఉంచడానికి అమెరికన్ అధ్యక్షుడి నుంచి ఫర్మానా కోసం ఎదురు చూస్తున్నట్టు కొన్ని పత్రికలు ప్రకటించాయి. వెంటనే, ఈ వాసన పసిగట్టి, అటువంటి అన్యాయం జరగనీయం, అని చైనా వాళ్ళు, రష్యనులూ అమెరికన్లకి స్నేహపూర్వకమైన వార్నింగ్ పంపించారు. రష్యా కాస్త ఘట్టిగానే చెప్పింది. అమెరికన్లు ఆఫ్ఘన్ యుద్ధం తరువాత, అల్లాంటిదే మరొక యుద్ధం లోకి దిగటం వాళ్ళకే నష్టం అని!

దేశంలో పత్రికలు దేశం చీలిపోయినట్టే చీలిపోయాయి. అసలు ఏ సంపాదకుడు లేని ఒక దినపత్రిక ఈ చీలిక రావటం దురదృష్టం. ఒక వేళ ఈ చీలిక శాశ్వతం అయితే గియితే, అందరూ కలిసి మెలసి ఉంటే అందరికీ మంచిదే, అని నీతులు రాసింది. సొంతలాభం కోసం, చీలికను కోరుకునే ఒక చిన్న సంపాదకుడున్న మరొక దినపత్రిక, ఈ చీలిక ఏనాడో రావలసింది; దైవ సంఘటనగా వచ్చిన ఈ చీలిక పడమర పౌరులకి, వారి స్నేహితులకీ ఎంతో ఉపకరిస్తుంది, తథాస్తు! అని ఆఖరి మాట రాసేసింది. ఇక పోతే ఇంకో పత్రిక ముఖ్య మంత్రి రాజీనామా చేసి కేంద్రప్రభుత్వానికి ఘాటుగా చేతల ద్వారా చెప్పాలి గాని, మాటల ద్వారా చెప్పటం సబబు కాదని రాసింది. ఈ చీలిక రాజకీయ నాయకులు చేస్తున్న కుంభకోణం మూలంగానని ప్రజలకి ఈ చీలిక నిరుపయోగకరమైనదనీ పదే పదే రాయిస్తున్నది.

చిట్టి బాబు, చిన్న (సుబ్బ)రాజు, కిష్టయ్య రహస్యంగా అమెరికాలో వాళ్ళ వాళ్ళు సాంస్కృతిక ముసుగు వేసుకున్న రాజకీయ సంస్థల నాయకులకి సందేశాలు పంపించేశారు. ఏదో రకంగా మీరంతా కలిసికట్టుగా –- అంటే, ఇప్పుడు మాకు మల్లే — అమెరికా ప్రభుత్వం జోక్యం కలిగించుకోకపోతే భాగ్యనగరంలో మన వాళ్ళ ఆస్తి పాస్తులు ఖతం అవుతాయని, మీ పెట్టుబడి కానీకి కొరగాదనీ హెచ్చరించారు. అంతే కాదు. అమెరికా ప్రభుత్వం వెంటనే ఆదుకోకపోతే, భాగ్యనగరంలో కంప్యూటర్ కంపెనీలకి ముప్పు తప్పదని హెచ్చరించవలసిన ఆవశ్యకత ఉన్నదని మీరు అక్కడ అల్లరి చెయ్యండి, అని మరీ మరీ చెప్పారు.

ఈ రకమయిన హెచ్చరిక వలన లాభం లేకపోలేదు. ఎందుకంటే, అమెరికాలో ఉన్న ఆంధ్రా కంప్యూటర్ ఇంజనీర్లందరికీ, భాగ్యనగంలో ఒక్కొక్కడికీ ఒకటో రెండో మూడో కాండోలున్నాయి. ఖాళీ స్థలాలున్నాయి. కొందరికి భారీ ఎత్తున రకరకాల వ్యాపారాలున్నాయి. అంటే, అమెరికాలో ఉన్న ప్రతి తెలుగు వాడికీ –- కనీసం నూటికి తొంభైతొమ్మిది మందికి — భాగ్యనగరం భాగ్యంలో వాటా ఉన్నది.

అన్ని సంస్థలూ, అమెరికా ప్రతినిధులకి, ప్రెసిడెంటుకీ, ఉత్తరాలు రాయటం మొదలుపెట్టారు. పత్రికల్లో ప్రకటనలు ఇవ్వటం మొదలయ్యింది. కొద్దిమంది రిపబ్లికన్ నాయకులకి ఎక్కడ వీలు దొరికితే అక్కడా వేలు పెట్టటం అంటే గొప్ప సరదా కదా! వాళ్ళని పట్టుకొని, దువ్వి (అంటే వచ్చే ఎన్నికల్లో చందాలు మీకే ఇస్తామని వాగ్దానలు చేసి), వాళ్ళ చేత ప్రకటనలు చేయించడం మొదలు పెట్టారు. వెంటనే, అమెరికన్ ప్రభుత్వం ఆదుకోకపోతే, కొన్ని వందల బిలియన్ల డాలర్లు ఆస్తి పాస్తులనష్టం కలుగుతుందని టి.వి.లో ఊదర కొట్టటంతో, అమెరికన్ ప్రభుత్వ ప్రతినిధులు ప్రకటన చేశారు: “ఈ ఉపద్రవం సహజమైనదే అని మనకి తెలుసు. దీని రాజకీయ అవసరాల కోసం వాడుకోవటం శ్రేయస్కరం కాదు. ఇది భారతదేశ స్థానిక సమస్య. అంతర్గత సమస్య. అయితే, భారత ప్రభుత్వానికి అవసరమయిన సహకారం ఇవ్వటానికి అమెరికా ప్రభుత్వం ఎప్పుడూ వెనకాడదు. శాంతియుతంగా ఈ సమస్య పరిష్కరించబడుతుందని మా నమ్మకం.”

ప్రెసిడెంటుగారు సి.ఐ.ఏ.తో, పెంటగన్‌తో నేటోతో మంతనాలు చెయ్యటల్లేదని, ఇందులో అమెరికన్లకి ఎంత లాభం ఉన్నదో బేరీజు వెయ్యటల్లేదనీ ఏ అమాయకులూ అనుకోరు. అమెరికాకి కావలసిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు ఈ చీలిపోయిన భాగం నుంచే వస్తున్నారని, కనీసం ఇంకో యాభై సంవత్సరాల పాటు అమెరికాకి వీళ్ళ అవసరం ఉన్నదని, రహస్య వర్గాలు ప్రెసిడెంటుగారికి తెలియపరుస్తూనే ఉన్నారు. ఇక రాబోయే రెండు సంవత్సరాలలో, ప్రతి సంవత్సరం అమెరికాకి పదివేల డాక్టర్లు అవసరం ఉన్నది. ప్రపంచంలో సంవత్సరానికి పదివేల పైచిలుకు డాక్టర్లని తయారు చేసే దేశం భారత దేశమే! ఆ విషయం అమెరికన్ ప్రభుత్వానికి తెలుసు. అవసరాన్ని బట్టి, ఆఫ్ఘనిస్థాను నుంచి తిరిగి వచ్చే సిపాయీలని ఏ శ్రీలంక లోనో, గ్వామ్ ప్రాంతంలోనో ఉంచటం అమెరికా భవిష్యత్తుకి ఉపయోగం. అంతే కాదు; ఏడవ నంబరు సముద్ర నౌకలని ఆస్ట్రేలియా అండమానులకి మధ్యకి తరలించడం అందరికీ ఉపయోగం అని అమెరికా రహస్యవర్గాలకి తెలిసిన విషయమే!

హస్తినాపురంలో చేరిన కొందరు మంత్రులు రాజీనామా చేస్తామని మరియా మాతని బెదిరిస్తున్నారు. ఆవిడ యధావిధిగా బర్తోలి సంగీతం వింటూ నాలుగు స్థంభాల ఆట ఆనందిస్తున్నది. కొత్త విషయం ఏమిటంటే, మరియా మాత పెంపుడు కుక్కలు ఒక్కసారి కూడా మొరగలేదు. అవి కూడా స్థంభాల ఆట చూస్తూ ఆనందిస్తున్నాయి. ఈ లోగా భారత ప్రధాన మంత్రి శాంతియుతంగా ఈ సమస్యని పరిష్కరిస్తామని హామీ ఇస్తూ టి.వి. లో ప్రసంగించారు. విధ్వంసక చర్యలని సహించమని, దౌర్జన్యంగా ఆస్తిపాస్తులు తమ స్వంతం చేసుకుంటున్న దుండగులని కఠినంగా శిక్షించడానికి కేంద్ర ప్రభుత్వం కంకణం కట్టుకొని ఉన్నదని, అవసరమయితే మిలిటరీని పంపించడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఎప్పటిలాగే వాగ్దానం చేశారు. ప్రతి విషయం కేంద్ర ప్రభుత్వ స్వాధీనంలోనే ఉన్నదని, ఈ భౌగోళిక సమస్య అనుకున్నట్టుగా ఎవరికీ బాధ కలగకండా, ఏ ఒక్కరికీ అన్యాయం జరగకుండా పరిష్కరిస్తామని నొక్కి వక్కాణించారు.

11

ఆరురోజులు గడిచాయి.

ఆ మంచి పుస్తకంలో చెప్పినట్టు, ఏడవ రోజున ఆగ్నేయంగా ప్రయాణం చేస్తున్న భూభాగం – రాతి పడవ – ఇక ముందుకు వెళ్ళటం మానేసింది. దాని పయనం స్తంభించింది. ఒక్క సారిగా, ఉత్తరభాగం గిరుక్కున పశ్చిమానికి తిరిగి, తిరుగు ప్రయాణం సాగించడం మొదలు పెట్టింది. ప్రపంచంలో శాస్త్రవేత్తలందరూ విస్తుపోయారు. ఇది ఎన్నడూ ఎవరూ కనీ వినీ ఎరగని విశేషం. విపరీతం.

భాగ్యనగరం ఉత్తరభాగం చీలిక కూడా స్థంభించింది. రెండూ ఒకే సమయంలో జరిగాయో లేదో ఎవరూ చెప్పలేకపోయారు. భాగ్య నగరం రెండు భాగాలనీ కొత్త కొత్త వంతెనలతో జతపరిచి ఒకే నగరంగా ఇప్పటికన్నా అందంగా అందరికీ నచ్చేదిగా ఉంచటం అసాధ్యం కాదని రాజకీయ నాయకులందరూ ప్రస్తుతానికి ఒప్పుకున్నట్టే! ఈ కొత్త వంతెనలకి ప్రపంచ బ్యాంకు తక్కువ వడ్డీతో రుణాలిస్తుందని పత్రికల్లో ప్రకటనలు వేశారు.

చీలిపోయిన పెద్ద భూభాగం ఉత్తరాన సరిగ్గా రెండు మైళ్ళ దూరం వచ్చి ఆగిపోయింది. దక్షిణాన తిరుపతి కొండ సముద్రంలో తూర్పు పక్కకి ఒక ఇరవై మైళ్ళ దూరంలో స్థిరపడింది. ఇదీ ఒకందుకు మంచిదే! ఇక నుంచీ తిరుపతి కొండకి వెళ్ళే వాళ్ళు ఇంచక్కా సముద్రంలో అందమైన భవంతుల్లాంటి పెద్ద పెద్ద ఓడల్లో క్రూజ్ లకి వెళ్ళి రావచ్చు.
ఉత్తరాన వంతెనలు కట్టటానికి అమెరికా ప్రభుత్వం సహకరిస్తానని వాగ్దానం చేసింది.

అయితే కవుల పైన, రచయితల పైన, ఈ చీలిక సాంఘికంగా సాంస్కృతికంగా తెచ్చిన విపత్తూ కలిగించినన బాధ, ఎన్నటికీ చెరగని శాశ్వత ముద్ర వేశాయి అని బుధ వర్గాలు వాపోయాయి. సాధారణ ప్రజలు ఏమనుకుంటున్నారు అని అడిగితే, సరిగ్గా స్కార్లెట్‌తో ఆఖరిగా రెట్ బట్లర్ అన్న మాటలు వల్లించవలసి వస్తుందని ఎవరో వ్యంగ్య రచయిత రాశాడు.

[The Stone Raft నవల రాసిన జోసె సరమగోకి కృతజ్ఞతలతో]