గుమ్మం

మిట్టమధ్యాహ్నం పదకొండింటికి అతని కళ్ళు చీకట్లోకి చూస్తునట్టు చూస్తున్నాయి. చుట్టూ జనం గుమిగూడడం ఒక కారణమైతే అరగంట క్రితం తెలిసిన విషయం మరొక కారణం. చిట్ ఫండ్ కంపెనీ బోర్డు తిప్పేసింది అన్నది ఆ బయటపడ్డ విషయం. అసలే అప్పులపరమైన జీవితానికి జీతం కూడా ఆగిపోయిందన్న విషయం అతనికి విషం.

‘నేను ముందే పసిగట్టాల్సింది…’ అనుకున్నాడు. ‘తెలివితక్కువవాడిని. మా ఓనరు పారిపోతాడని ముందే ఊహించాల్సింది.’ ఇంతలో ఇతన్ని ఎవరో గుర్తుపట్టి జనమందరినీ ఇతని మీదకు ఉసిగొల్పారు. ‘ఏం చెప్పాలి వీళ్ళకి? అయినా ఏం చెప్పినా నమ్మరు. ఇలాంటి వెర్రిబాగుల జనానికి నాలాంటి తెలివితక్కువవాడు నేనూ మోసపోయానని ఏం చెప్పి నమ్మించగలడు?’

ఆలోచనలంతే వేగంగా జనం అతని చుట్టూ గుమిగూడారు. సమాధానాలు కావలసినట్టు లేవు అక్కడ ఎవ్వరికీనూ. వారి ముష్టిఘాతాలకు అతను నేలపైకొరిగాడు. ఆవేశం సలసలా కాగే స్థాయి నుండి గోరువెచ్చని స్థాయికి చేరాక జనం అతనికి మాట్లాడే అవకాశమిచ్చారు. “నాకు ఏమీ తెలీదు. నేనూ మోసపోయినవారిలో ఒకడినే. నాకు ఈ నెల జీతం కూడా ఇవ్వలేదు.”

కొందరు ఆడవారు ఏడవడం మొదలుపెట్టారు. మరికొందరు పెడబొబ్బలు. ఇంకొందరు నిబ్బరం ప్రదర్శించేందుకు ప్రయత్నించారు. ఏదైతేనేం… అక్కడున్న అందరూ బాధ, భయం, కోపం, అయోమయాల కూడలిలో నుంచున్నారు. కానీ అతను మాత్రం ఓ అలౌకిక స్థితిలో కూర్చొన్నాడు. అతను ఎప్పుడూ తన నిస్సహాయతను నమ్ముతూనే వచ్చాడు. బాగా, బలంగా. అందుకే అతను సమస్యలను పట్టించుకోడు. ‘ఎందుకంటే నేను తెలివితేటలు లేనివాడిని. తెలివైన ఈ లోకంలో నాకు సమస్యలు మామూలే!’ అతడు వాటి నుండి బయటపడాలనీ అనుకోడు. ‘ఎందుకంటే నేను తెలివితక్కువవాడిని. నేను ఏం చేసినా అది ఇంకో సమస్య అవుతుంది.’

జనం చితకబాదడం, వారి సూటిపోటి మాటలు, పోలీసు కేసు, జైల్లో నిశ్శబ్ద సమయం, తమ యజమాని ఐ.పి. పెట్టి కోర్టుని ఆశ్రయించటం, తను నిరుద్యోగిలా మారిపోవడం… అన్నింటినీ పంటల్లో ఆకులు తినే పురుగు ఆకాశంలో కదిలే మబ్బుల్ని చూసినట్టు చూస్తూ ఊరుకున్నాడు. ఉండిపోయాడు.

ఉద్యోగం పోవడంతోపాటు, జైలుకెళ్ళడం వల్ల పరువు కూడా పోయింది. ఎవరూ ఇంకో ఉద్యోగం ఇవ్వటంలేదు. ఒక్క పెద్దమనిషి మాత్రం, ‘కేసు జరుగుతోంది కదా…’ అన్నాడు. దానికీ తనకూ ఏం సంబంధం లేదు అన్నాడు ఇతను. ‘అలా కాదు, ఓ రెండు మూడు నెలలాగి రా. అప్పుడు జనం మీద దాని గుర్తులు చెరిగిపోతాయి. రోజూ ఎంతోమంది వచ్చే షాపు… కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది నీకు, మాకు కూడానూ…’ అన్నాడు. అడిగిన అందరిలో ఆ మాత్రమైనా మాట్లాడింది ఈయన ఒక్కరే! సరే అనుకున్నాడు. కానీ రెండు నెలల నిరుద్యోగం రెండు వారాలకే అసంభవం అని అర్థమైంది.

ఆ రోజు సాయంత్రం కావస్తూంది. చెప్పులు అరిగేలా తిరిగినా అప్పు మాత్రం పుట్టలేదు. జేబులో చిల్లిగవ్వ లేదు. భార్య పుట్టింటి నుండి కానీ కూడా తేనని ఖరాఖండిగా చెప్పేసింది. జీవితంలో అప్పటిదాకా దేవుణ్ణి తిట్టుకునేవాడు తనని తెలివితక్కువవాడిగా పుట్టించినందుకు, తనకు తనకంటే తెలివైన భార్యను ఇచ్చినందుకు. తనని పేదవాడిగా, భార్య దృష్టిలో తనను ఏమీ చేతకానివాడిలా మిగిల్చినందుకు వీలు చిక్కినప్పుడల్లా, లేదంటే రోజుకోసారైనా తిట్టుకునేవాడు. ఆ క్షణం మాత్రం వేడుకున్నాడు. ‘ఈ ఒక్క రోజుకి నా భార్య నన్ను డబ్బులు అడక్కుండా చెయ్యి. రేపు ఎలాగైనా అప్పు సంపాదిస్తా. కరుణించు!’

డబ్బులేక కుటుంబాన్ని కూడా నడపలేనివాడిని. అలా నా భార్య నన్ను చూడవలసిరావడం నేను తట్టుకోలేను. ఊరందరి చేతిలో పిడిదెబ్బలు తిన్నా మనసుకు ఎక్కించుకోలేదు, కానీ భార్య చూపుకు మాత్రం భయపడతాను. తనముందు తలవంచుకోవడం నామోషీగా వుంటుంది. ఎందుకూ? ఎందుకో! అదంతే. కొన్నిసార్లు ఏమీ చెయ్యలేం… ఆలోచిస్తూ ఇంటికి చేరేసరికి ఆరయ్యింది. కొడుకు కాలేజీ నుండి వచ్చి ఉంటాడు. అసలు వెళ్ళాడో లేదో! తనకు అనవసరం. అయినా బ్రతకడానికి ఎన్ని దారుల్లేవూ. వాడిష్టం. భార్య పక్కింట్లో ఉంది. తనని చూసి లేచి వచ్చి ఇంట్లోకి వెళ్ళింది. ఆకాశం వైపు చూస్తూ వేళ్ళను పెదాలకు ఆన్చి ‘అడక్కూడదు. ఇవాళ ఒక్క రోజుకి…’ అని అనుకుని తనూ లోపలికి కదిలాడు.

కాళ్ళు కడుక్కుని టీవీ ముందు కూర్చొన్నాడు. అవయవాల తర్వాత అవసరమైనవి పెద్దవారికైతే టీవీలు, కుర్రవారికైతే ఫోన్లు. కొంత సమయం గడిచింది. ‘సరుకులు నిండుకుని ఉంటే ఈపాటికే అడిగుండేది.’

రిమోట్‌తో ఛానల్స్ మారుస్తూ ఉన్నాడు. కొడుకు ఏమైనా డబ్బులు అడిగితే ‘రేపు చూద్దాం లే’ అని చెబుదామని ముందుగానే నిర్ణయించుకున్నాడు. భయమంతా భార్య గురించే. ఇంతలో భార్య తన కొడుకుని కేకేసింది. ఇరుగుపొరుగువారి పిల్లలతో కొడుకు ఇకఇకలు పకపకలు వినిపిస్తూనే ఉన్నా మిన్నకున్నాడు. వాడు మూడుసార్లకు కూడా పలకలేదు. తను లేవబోతూంటే భార్యే ఈసారి గుమ్మం దగ్గరికొచ్చి గట్టిగా పిలిచింది. ‘డబ్బులు ఉండే ఉంటాయి. సరుకులు వాడిచేత తెప్పిస్తుందేమో!’

పిలిచిన కాసేపటికి నింపాదిగా వచ్చాడు కొడుకు. మీసాలు పూర్తిగా రాలేదు కానీ అవి వచ్చాక రావాల్సిన లక్షణాలన్నీ వచ్చేశాయి. అతనికేనేంటి, బయట సగం మందికి అంతే. కాల ప్రభావం.

భార్య, కొడుకు వంటింట్లోకి వెళ్ళారు. తను టీవీ చూడట్లేదు. ఛానల్స్ తిప్పుతున్నాడంతే. ‘ఇక అవసరం లేనట్టే ఇవ్వాల్టికి. హమ్మయ్య. దేవుడు నా మాటా వింటాడు!’ అనుకోలేదు. అనుకోబోయాడు. మధ్యలో తన కొడుకు టీవీకి అడ్డంగా, తనకు ఎదురుగా నిల్చొన్నాడు. “నాన్నా! అమ్మ సరుకులు తెమ్మంది. డబ్బులు నిన్ను అడగమంది,” ఆ మాటల్లో అంతరార్ధం ఎంతుందో వెతుక్కోలేదు, ఎందుకంటే తనకు తెలుసు కాబట్టి. ఏది వద్దనుకున్నాడో అది పదింతలై ఎదురుగా నిలుచుంది.

వంటింట్లోంచి గిన్నెల చప్పుడు వినిపిస్తోంది. తన భార్య తన ముందు తెలివి ప్రదర్శిస్తోంది. కొడుకు ముందు కూడా తనను అధఃపాతాళానికి దిగజార్చేసింది. నేరుగా తనే అడిగితే బాధే ఉండేది. ఇప్పుడు అహం కూడా దెబ్బతింది. గట్టి ఉలి దెబ్బ. తన భార్య తనకంటే తెలివిగలది. మొదటి దెబ్బ. తనిప్పుడు కుటుంబానికి ఓ పూట తిండి పెట్టలేని నిస్సహాయుడు. రెండో దెబ్బ. ఈ రెండు అంతకు ముందే తగిలినవి. ఇప్పుడు ఈ నిజాలు కొడుకు గొంతులో మైకు కట్టుకుని వినిపిస్తున్నాయి. ఓ వంద దెబ్బలు.

“నాన్నా…” కొడుకు పిలిచి మళ్ళీ చెప్పాడు. కొరడా మచ్చలపై మరగబెట్టిన సున్నం రాశాడు.

“లేవు…” తనక్కూడా వినబడలేదు. గొంతు సవరించుకుని “లేవు.” అన్నాడు.

కొన్ని మనం భరించలేమని తెలిసినపుడు వాటిని చూడటానికి గుండె ధైర్యాన్ని ఇవ్వదు. కొడుకు మొహం, భార్య చూపులు, మాటలు, అసలు ఆమె తలపులు, నిజానికి సర్వం. పరిసరాలతో సహా! ఇప్పుడతను దేన్నీ భరించలేకున్నాడు, అప్పుడే ఆ వీధిలోకి ప్రవేశించిన ఓ స్కూటరు చప్పుడుతో సహా.

‘నేను ఏమీ చెయ్యలేను. నిజంగా చెయ్యలేనా? ఏదైనా చెయ్యగలనా? ఏం చెయ్యగలను?’ ప్రశ్నించుకుంటూ మెల్లగా లేవగా రిమోటు కింద పడింది. టీవీ మోగుతూనే ఉంది. పట్టించుకోలేదు. అశక్తత నుండి ఆలోచన వైపు అడుగులేశాడు. ఆ ఆలోచనలో తన ప్రశ్నలకు జవాబులు వెతికాడు. గుమ్మం దగ్గర నుంచుని ఆకాశంలోకి చూశాడు. శూన్యం అనడం సబబేమో! కొద్ది క్షణాలకే శూన్యంలో తన గతం కనబడ్డది. తప్పతాగిన తండ్రి చావబాదుతుంటే ఏడ్చే తల్లి కనిపించింది. పదో క్లాసు పాసై ఖాళీగా రోడ్ల మీద తిరుగుతుంటే తనని చూసీచూడనట్టు వదిలేసిన తండ్రి కనబడ్డాడు. ఒకప్పుడు జీవితంపై లెక్కలేని తను, ఇప్పుడు రేపటి గురించి ప్రతిరోజూ భయపడుతున్న తనకు కనిపించాడు.

పగలంతా ఎగిరీ తిరిగీ, సాయంత్రం ఆహారం సంపాదించిన పక్షులు తినేసి హాయిగా ఈల వేస్తూ పడుకుంటాయేమో కానీ, పస్తులుండే పక్షి ఏ మలుపులో తిరుగుంటే బావుండేదో ఆలోచిస్తుంది. గతమంతా కళ్ళ ముందు తిరిగాక, పెద్దగా బంధం లేని తండ్రే పెనుభూతంలా తోచాడు. అన్ని దారులూ రోము నగరానికి వెళ్తాయో లేదో కానీ తన పరిస్థితికి కారణాలైన అన్ని కోణాలూ తన తండ్రి వైపుకే తిరిగిన బాణాలయ్యాయి.

ఖాళీగా తిరుగుతున్న తనను కాళ్ళు విరగ్గొట్టి కాలేజీకి పంపుంటే ఇలా ఉండేవాడు కాదేమో! కనీసం తిన్నావా లేదా అని కొంచెం సహానుభూతి చూపుంటే ఇలా నిర్లిప్తంగా ఉండేవాడు కాదేమో! కుటుంబం గురించి కొంచెమైనా ఆలోచిస్తే ఇలా అప్పులపాలయ్యేవాడు కాదేమో! కనీసం తన యజమానికున్న చావు తెలివితేటలనో, బతుకుని ఈడ్చే సలహాలనో తగలేసి ఉంటే ఇలా నిస్సహాయ జీవితం గడిపేవాడు కాదు! అలా తన సమస్యలకు తండ్రిని బాధ్యుడిని చేసేశాక మనసు కొద్దిగా కుదుటపడింది. కానీ తీరం దాటబోయిన తుఫాను తిరిగొచ్చినట్టు తన దృష్టి తల్లి వైపుకు మరలింది. భర్త దెబ్బలకు శుష్కించిన ఆవిడ కళ్ళ ముందు మెదలగా ఆవిడ నుంచి ఏమైనా ఆశించడమే అన్యాయం అనిపించింది. ఇంతలో ఎవరో చెవిలో దూరి ‘నువ్వు ఇప్పుడు కోరుకున్నట్టు ఉండడానికి అప్పుడు నీ తండ్రి మాత్రం పెద్ద గొప్పోడా మరి?’ అని ప్రశ్నించారు.

ఓ చిన్న వీధి పంపు గొడవ న్యాయస్థానం ముందుకెళితే ఏమవుతుందో అదే అయ్యింది అతని పరిస్థితి. వాద-ప్రతివాదాలు, సంజాయిషీలు, అంతస్సంఘర్షణలు, అనంత విశ్లేషణలు కొనసాగుతూనే ఉన్నాయి. తుఫాను తీరం దాటింది. అతను ‘తప్పు ఎవరిదైతేనేం, నేను సరిగ్గా పెరగలేదు.’ అని మనస్ఫూర్తిగా ఒప్పుకున్నాడు.

ఇందాకటి శూన్యంలో ఇప్పుడు భవిష్యత్తు మొదలైంది. తను ‘ఖళ్… ఖళ్’ మని దగ్గుతున్నాడు. భార్య పక్కన బాగానే ఉంది. కొడుకు? ఎలా ఉంటాడు? రెక్కలున్నట్టు భావించే ఈ వయసులో గాలికి తిరిగితే, రేపు రెక్కాడితే కానీ డొక్కాడని స్థితికి వస్తాడు. తన తర్వాత నిస్సహాయ జీవితానికి అతను వారసుడవుతాడు. ఏదో మెరుపు మెరిసినట్టు అనిపించింది. నేనూ వాడి గురించి నాకెందుకులే అనుకుంటే, వాడూ రేపు ఏడుస్తూ నా మీద ఉమ్మేస్తాడు. నేను నా తండ్రిలా ఉంటే, నా కొడుకు నాలాగే తయారవుతాడు. పట్టెడన్నం కోసం కష్టపడుతూ, పెళ్ళాం దృష్టిలో చిన్నబోతున్నందుకు సిగ్గుపడుతూ. తత్వం బోధపడింది. ఒక్కోసారి నమ్మలేనివీ అనుకోనివీ అర్ధాంతరంగా జరిగిపోతాయి. బోధి చెట్టు కింద బుద్ధునికి, గుమ్మం మీద ఇతనికి జ్ఞానం దొరకడం ఆ కోవలోకే వస్తాయి.

మెదడులో ఇంత జరుగుతుండగా ఇందాక ఇబ్బంది పెట్టిన కొడుకు ఇకఇకలు పకపకలు, కేకలు మళ్ళీ వినబడ్డాయి. కానీ ఈసారి అతను విన్న విధానం వేరు. జీవితంలో తొలిసారి కొన్నింటికి తెలివి అక్కర్లేదు బాధ్యత తెలిస్తే చాలని ఆ క్షణం నమ్మాడు. బాగా, బలంగా. తన కొడుకుకేసి నడిచాడు. స్నేహితులు ఫోన్‌లో చూపిస్తున్న వీడియోలో మునిగిపోయిన వాడు, తండ్రిని కూడా పట్టించుకోలేదు.

“కాలేజీకి వెళ్ళావా?”

తల పైకెత్తి తేలిగ్గా, “లేదు,” సమాధానమిచ్చాడు.

‘ఛళ్!’ పగిలింది ఆ కుర్రాడి చెంప. విసురుగా పైకి లేవబోయాడా కుర్రాడు. వెంటనే మళ్ళీ ‘ఛళ్!’ మన్నది చెంప. ఈసారి శబ్దం వినసొంపుగా ఉంది.

“ఎందుకు వెళ్ళలేదు?” కొడుకు తేరుకున్నాక అడిగాడు.

అరలిప్త పాటు కోపం నిండిన కొడుకు కళ్ళల్లో ఇప్పుడు భయం ఉప్పొంగింది. నోటి నుండి సమాధానం మాత్రం రాలేదు.

‘ఛళ్!’ మూడోసారి వినముచ్చటగా వినిపించింది చెంపదెబ్బ. “ఇంట్లోకెళ్ళి పుస్తకం తీయ్! నేను వచ్చే వరకు చదువుతూనే ఉండాలి.”

‘ప్రారంభం సంపూర్ణం’ అన్న భావం పొంగింది తండ్రి మోహంలో.

ఒక్క చెంపదెబ్బా తన పరిస్థితులు, అశక్తత వల్ల కొట్టింది కాదు. ప్రతీదీ తన కొడుకు భవిష్యత్తుకు భయపడి కొట్టిందే. అరిగిపోయిన చెప్పులతో మళ్ళీ రోడ్డు మీదకొచ్చాడు అతను. ఎలాగైనా ఈ పూట తన కుటుంబాన్ని పస్తులు ఉంచకూడదని…