పికాసో కుడ్యచిత్రం గ్వెర్నికా గురించి…


గ్వెర్నికా-రెయినా సోఫియా నేషనల్ మ్యూజియమ్, మాడ్రిడ్, స్పెయిన్.

1.

పాబ్లో పికాసో (Pablo Picasso) జీవితంపై, అతని సృజనాత్మక కళపై అనేకమైన పుస్తకాలు ఉన్నాయి. అంతేకాకుండా గెర్నికా (స్పానిష్ ఉచ్చారణ) లేదా గ్వెర్నికా (ఇంగ్లీష్ ఉచ్చారణ) చిత్తరువుపై, ఎన్నో వ్యాసాలు, విమర్శలు, పుస్తకాలు కూడా ప్రచురితమయ్యాయి. ఒకే ఒక్క చిత్తరువు మీద పుస్తకాలు రావటం, ఎప్పుడో 1937లో గీయబడ్డ ఆ చిత్తరువు చరిత్రపై కొత్త కొత్త విషయాలు గత మూడు సంవత్సరాల వరకూ బయటపడుతూ ఉండటం నిశ్చయంగా ఆశ్చర్యకరమైన విషయమే. పికాసోని గూగిలిస్తే, పద్దెనిమిది మిలియన్ల పైచిలుకు హిట్స్ తగలచ్చు. ‘మరైతే ఇన్ని పుస్తకాలూ వ్యాసాలూ ఉండంగా, మళ్ళీ పికాసో గీసిన గెర్నికా గురించి రాయడం ఎందుకు?’ అని సహృదయులైన పాఠకులు, తదితరులూ అడగవచ్చు. వారికి, విశ్వనాథ సత్యనారాయణగారి కల్పవృక్షం, అవతారికనుంచి కాపీ కొట్టి నేనిచ్చే సమాధానం: …తన రుచి బ్రతుకులు తనవి గాన …తనదైన అనుభూతి తనది గాన, అని.

పికాసో దృక్పథం, ఆలోచన చాలా శక్తివంతమైనవి; చిత్రకళలో అతను చాలా పద్ధతులను ఉపయోగించాడు; చాలా వనరులు కూడా ఉపయోగించాడు. దృశ్య, సాహిత్య, తాత్విక, రాజకీయ, సంగీతాది వివిధ కోణాలనుండి పరీక్షించి, చరిత్రకారులెందరో అతని చిత్రాలను వ్యాఖ్యానించారు. అర్థం చేసుకోవటానికి ప్రయత్నించారు; కొత్తకొత్త వ్యాఖ్యానాలు పొందుపరిచారు. బ్రాక్ (Braque) సహకారంతో క్యూబిౙమ్ (Cubism) ఆవిష్కరణ ద్వారా అతను ఫ్రాన్స్, యూరప్‌ల లోనేకాకుండా, మొత్తం ప్రపంచంలో ఆధునిక కళ భవిష్యత్‌ మార్గాన్నే మార్చాడు. ఫ్యూచరిౙమ్ (Futurism), డాడాయిౙమ్ (Dadaism), సర్రియలిౙమ్ (Surrealism) లాంటి ఉద్యమాలలో ఆయన కీలకమైన కృషి ప్రతిబింబిస్తుంది. క్యూబిౙమ్ మనం వస్తువులను చూసే పద్ధతినే మార్చి వేసింది. ప్రథానంగా రూపాలతో వ్యవహరించే కళ క్యూబిౙమ్. ఒక రూపం నిశ్చయించబడిన తరువాత, ఆ రూపానికి స్వయంప్రపత్తి లభిస్తుంది, అని పికాసో క్యూబిౙాన్ని పునర్నిర్వచించాడు. దాని తరువాత క్యూబిౙమ్ మొత్తం చిత్రకళను అర్థం చేసుకోవడాన్నే పూర్తిగా మార్చివేసింది. ఒక్క మాటలో చెప్పాలంటే, పికాసో గొప్ప విప్లవకారుడు; అంతకన్నా పదిరెట్లు సంప్రదాయవాది. ఈ వ్యాసంలో, నేను గ్వెర్నికా చిత్రంపై ఇప్పటివరకూ తెలిసిన చరిత్ర, పూర్వకథ, ఇతర నేపథ్యాలు, క్లుప్తంగా చెప్పదలచుకున్నాను.

2.


ఓల్డ్ ఫిషర్‌మన్, 1895.

వేర్వేరు కాలాలలో గీసిన చిత్రాలు ‘ఒకే కళాకారుడు గీసినవే సుమా’ అని ఏ ఒక్కరూ గుర్తించలేనంత నేర్పుతో, త్వరత్వరగా తన శైలిని మార్చుకోగలిగిన గొప్ప చిత్రకారుడు పికాసో. అతనితో పోలికలో సమానంగా నిలబడగల ఒకే ఒక్క గొప్ప కళాకారుడు, శిల్పి, మికెలాంజెలో (Michelangelo). కానీ, పికాసోలా అతను భవిష్యద్కళాకారులను ప్రభావితం చేయలేదు. అతను ఏకాంతంగా ఉండిపోయిన గొప్ప కళాకారుడు మాత్రమే–అని ఆంథోనీ బ్లంట్‌ (Anthony Blunt), సుమారు యాభై సంవత్సరాల క్రితం రాశాడు. ఇప్పటికీ, ఏ ఒక్క విమర్శకుడూ ఈ పరిశీలనకి ప్రతివిమర్శ రాయలేకపోయారు.

పికాసోపై బహుశా, డెలక్ర్వా (Eugene Delacroix), మనే (Edouard Manet), మొనే (Claude Monet), వాన్ గో (Vincent Van Gogh), పిసారో (Camille Pissaro), డెగా (Edgar Degas) మొదలైన పూర్వచిత్రకారుల ప్రభావం ఉన్నదని చెప్పవచ్చు. కానీ ఈ ప్రభావాలు అన్నీ అల్పకాలికమైనవి. అతను ఇతర కళాకారుల నుండీ, వారి పద్ధతుల నుండీ అరువు తీసుకున్నాడు. ఇందులో కొన్ని ప్రత్యక్షంగా కాపీలు అని చెప్పవచ్చు. అతను దానిని ఎప్పుడూ ఖండించలేదు! ఇతరుల కళను అధ్యయనం చేయడం ద్వారా తన కళని సుసంపన్నం చేసుకున్నాడు.

1935లో పికాసో ఇలా వ్రాశాడు: ఎక్కడ మనకు మంచి దొరుకుతుందో అక్కడనుంచి ఆ మంచిని ఎంచుకోవాలి–మన స్వంత చిత్రాల నుండి తప్ప. నన్ను నేను కాపీ చేసుకోవటం భయానకం. ఈ ఆఖరి వాక్యం చాలా సందేహాస్పదమే! పికాసో తన పాత చిత్రాలనుండి ఎన్నోరకాల కాపీలు చేశాడు. కొత్త చిత్రాలకోసం, పాత చిత్రాలకి చిన్నచిన్న మార్పులు చేశాడు. ముఖ్యంగా, గ్వెర్నికా కుడ్యచిత్రం విషయంలో ఈ ఆఖరి వాక్యాన్ని మనం ఈ వ్యాసంలో నిరభ్యంతరంగా పరీక్షించవచ్చు.


వీపింగ్ ఉమన్, 1937.

పికాసో అనుకరణలు రెండు రకాలు. అతని కొన్ని అనుకరణలు చాలా సులభంగా గుర్తించవచ్చు. మిగిలిన కొన్నింటిలో ఈ అనుకరణలు సూచన ప్రాయంగానే కనిపిస్తాయి. ఉదాహరణకి, గ్వెర్నికా చిత్రంలో తలవెనక్కి పెట్టుకొని దుఃఖిస్తున్న తల్లిని చూడగానే, క్రైస్తవకళలో ప్రఖ్యాత చిత్రం, ప్రసిద్ధచిహ్నం అయిన మాగ్డలీన్ శోకం, ప్రాచీన పాశ్చాత్య చిత్రకళతో ఏమాత్రం పరిచయం ఉన్నవాళ్ళకైనా గుర్తుకు రావచ్చు. ఇటువంటి సందర్భాలలో పూర్వీకుల చిత్రకళతో సమాంతరాలు, పోలికలూ తప్పకుండా కనిపిస్తాయి. అయితే, ఇక్కడ పికాసోపై కాపీ అపవాదు వెయ్యటం ధర్మంకాదు.

పికాసో చిత్రకళ పట్ల చపలత్వం ప్రోత్సహించాడని విమర్శకులు, పత్రికారచయితలూ ఆరోపించారు. టిష్యూ పేపర్‌పై రాసిన గిలికి రాతలు, స్నేహితుల కోసం మెన్యూ కార్డ్స్ మీద గీసిన వ్యంగ్యచిత్రాలు, రేఖాచిత్రాలు, కేటలాగ్‌ చేసి అధిక ధరలకు అమ్ముకున్నారు; నిజమే! అందుకు అతనిని దూషించటం, తప్పుపట్టటం న్యాయంకాదు. వాస్తవానికి, ఇది సరదాగా చేసిన పని; అందువల్ల చిత్రకళ అభివృద్ధికి ఏవిధమైన హానీ జరగలేదు. కానీ, తన ప్రధాన చిత్రరచనా వ్యాసంగంలో అతను చాలా చిత్తశుద్ధితో ప్రవర్తించాడు.

3.

స్పానిష్ యుద్ధం ఫాసిౙమ్, ప్రజాస్వామ్యాల మధ్య సరికొత్త సమస్యను లేవనెత్తింది. పికాసోకి ఇది వ్యక్తిగతమైన సమస్య. అతను గ్వెర్నికా కుడ్యచిత్రం ప్రారంభించడానికి ముందు, గ్వెర్నికా పట్టణంపై బాంబు దాడి జరిగిన తరువాత, ఇలా అన్నాడు: ‘ఇకముందు నా చిత్రకళలో స్పెయిన్‌ను మరణాల సముద్రబాధలో ముంచివేసిన సైనిక కులాలపై నా అసహ్యత వ్యక్తపరుస్తాను…

గ్వెర్నికా చిత్రించడానికి ముందుగానే, జనరల్ ఫ్రాంకో (Francisco Franco) పట్ల ఆయనకున్న ద్వేషం ఒక జత ఎచింగ్స్‌లో (Dream and Lie of Franco) స్పష్టంగా కనపడుతుంది. అతను, 1937 జనవరి 8, 9లలో చేసిన రెండు ప్లేట్లు ఉన్నాయి. ఇవి రాగి పలకలమీద గీసినవి. పికాసో కంపోజిషన్లను వెనక్కి తిప్పలేదు. తేదీల ప్రకారం మనం ఈ ప్రతులను కుడి నుండి ఎడమకు చదవాలి. ఇవి ఫ్రాంకోపై పికాసోకున్న అసహ్యతను చిత్రిస్తూ గీసిన కార్టూన్లు. (వీటికి తోడుగా పికాసో ఒక పద్యం కూడా రాశాడు; ఆ పద్యంలో కొన్ని భాగాలు నెట్‌లో దొరుకుతాయి. పూర్తిపాఠం ఇవ్వటానికి, కాపీరైట్‌ అడ్డం వస్తుంది. పైగా, అదేమంత చెప్పుకోదగ్గ పద్యం కాదని నా అభిప్రాయం.) మొదటి ఐదు సన్నివేశాలు మాత్రమే ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా ఉన్నాయి. గ్వెర్నికాపై పనిచేస్తున్నప్పుడు మిగిలిన ఆఖరి నాలుగూ చేర్చాడు. అంతే కాదు; దీనిలో వాడిన ప్రతీకలు కొన్ని కొద్ది మార్పులతో గ్వెర్నికాలో వాడాడు. అందుకని వీటిని గురించి ప్రత్యేకంగా తెలుసుకోటం అవసరమని భావించాను. అందుకోసం క్లుప్తంగా ఈ కార్టూనుల గురించి ముచ్చటిస్తాను.


డ్రీమ్ అండ్ లై ఆఫ్ ఫ్రాంకో 1

డ్రీమ్ అండ్ లై ఆఫ్ ఫ్రాంకో లోని ప్రధాన వ్యక్తి ఒక భయంకరమైన పాలిప్ (polyp). దీనిని చర్మంపై బొడిప లేదా పెద్ద పురిపిడికాయతో పోల్చవచ్చు. ఈ కార్టూన్లలో జనరల్‌ ఫ్రాంకోయే పాలిప్‌! 1936లో, బహుశా సర్రియలిస్టుల ప్రేరణతో పికాసో ఈ బొమ్మ గీసి ఉంటాడు. ఈ పాలిప్‌, ఒక కౌదియ్యో (Caudillo)–అంటే మిలిటరీ నియంతకి–చిహ్నం. వీడు, వ్యక్తిగతంగా పరమ కర్కోటకుడు. సాధారణంగా భయంకరమైన, అసభ్యకరమైన సంఘటనలలో చాలా ఇష్టంగా పాల్గొంటాడు. (ఫ్రాంకో పదవిలో ఉండగా కౌదియ్యో అని తనను తాను పిలుచుకున్నాడు.)

ప్యానెల్ 1. స్పానిష్ చర్చిలో తరచూ కనిపించే మడోనా (Madonna) ధ్వజంపై మేరీ (Virgin Mary). పాలిప్‌ కిరీటం పెట్టుకొని, కత్తి పట్టుకొని వ్యంగ్యంగా గీయబడ్డ గుర్రం ఎక్కి యుద్ధానికి బయలుదేరాడు.

ప్యానెల్‌ 2. ఈ పటంలో బిగువైన తాడు మీద నడుస్తున్నాడు. బహుశా గోయా (Francisco Goya) చెక్కిన ఎచింగ్‌‌కి (etching) అనుకరణ కావచ్చు.

ప్యానెల్‌ 3. పాలిప్‌ బిషప్ కిరీటం ధరించి, గడ్డపారతో స్త్రీ శిల్పాన్ని మోదుతూ ఉంటాడు.

ప్యానెల్‌ 4. ఇందులో పాలిప్ స్త్రీగా మారుతాడు. ధ్వజం మీద కన్య మేరీ ఇప్పుడు వాడి చేతిలో విసనకర్ర మీద కొస్తుంది.

ప్యానెల్‌ 5. ఆంబోతు వీడిపై ఆకస్మికంగా దాడిచేస్తుంది. బహుశా, స్వతంత్రం కోసం యుద్ధంచేస్తున్న ప్రజలకి ఇది ప్రతీకగా వాడి ఉండవచ్చు. ఆంబోతు పికాసో చిత్రాలలో మారుతున్న పాత్రను పోషిస్తుంది; అయితే, ఆంబోతు ఎల్లప్పుడూ సత్తువకి, బలానికీ ప్రతీక. కొన్నిసార్లు మంచి, మరికొన్నిసార్లు చెడులతో ఈ ప్రతీక ముడిపడి ఉంటుంది.

ప్యానెల్ 6. ఇందులో మరొక రూపాంతరం కనిపిస్తుంది. పాలిప్ మతపరమైన దుస్తులలో, ఒక బలిపీఠం ముందు ముళ్ళతీగ ఆవరణలో రాక్షసాకారంలో ఉన్న మైక్రోఫోను ముందు మోకరిల్లి ఉంటాడు. దానిమీద ఒక డౌరో, అంటే ఒక డాలర్, అని చెక్కబడి ఉంటుంది.

ప్యానెల్‌ 7. బలిపీఠం పేలిపోయి, పాలిప్ కడుపులో ఒక పెద్ద గాయం చేస్తుంది. ఈ గాయం నుండి కప్పలు, పాములు మొదలైన అసహ్యకరమైన జీవులు బయటపడతాయి.

ప్యానెల్‌ 8. పాలిప్ రెక్కలున్న గుర్రంపై స్వారీ చేస్తూ దానిని ఈటెతో పొడుస్తుంటాడు. ఈ సాధుజంతువు పికాసో కళాత్మక ప్రేరణకు చిహ్నం. గెర్నికా కోసం ఆరంభదశలో గీసిన బొమ్మల్లో ఈ గుర్రం మళ్ళీ కనిపిస్తుంది.

ప్యానెల్‌ 9లో విషయం మరింత అస్పష్టంగా ఉంది కాని, ఇందులో కౌదియ్యో ఒక పందిపై కూర్చొని ఉంటాడు; వాడి ధ్వజం ఈటెగా మారుతుంది. సూర్యుడితో పోటీపడుతూ తన ఈటె తిప్పుతూ ఉంటాడు. బహుశా సూర్యకాంతి సత్యానికి చిహ్నం (symbol of Truth). డాన్ కిహోటే (Don Quixote) గాలిమరలతో పోటీపడతాడని మనకి తెలుసు. డాన్‌ కిహోటేకి ఇది అనుకరణ కావచ్చు. పికాసోకి సెర్వాంతెస్ (Miguel De Cervantes) అభిమాన రచయిత.


డ్రీమ్ అండ్ లై ఆఫ్ ఫ్రాంకో 2

రెండవ ప్లేట్ మొదటి సిరీస్‌లో ఎనిమిదవ సన్నివేశంతో కలుపుతుంది. ఎందుకంటే ఇక్కడ రెక్కలగుర్రం మృతదేహంపై కౌదియ్యో విజయం సాధించినట్లు కనిపిస్తుంది. తరువాత ప్యానెల్‌లో నేలపై ఒక మహిళ మృతకళేబరం కనిపిస్తుంది. బహుశా గోయా గీసిన ఎచింగ్‌ (సత్యం చనిపోయింది) దీనికి ప్రేరణ అయివుండవచ్చు. పికాసో చిత్రంలో రెండవ సన్నివేశం ఖచ్చితంగా తిరుగుబాటుదారుల దుష్టశక్తులు సత్యాన్ని చంపివేసినట్టు సూచిస్తుంది.

మూడవ సన్నివేశం చాలా భిన్నంగా వుంటుంది. చీకట్లో, గడ్డంతో ఉన్న వ్యక్తి గుర్రం మెడని కౌగలించుకొని నిద్రపోతూన్నట్టు కనిపిస్తుంది. బహుశా, వెచ్చదనం కోసం గుర్రం మెడని కౌగలించుకొని ఉండవచ్చు. పికాసోకి–రెక్కలు లేనిగుర్రాలు–మనిషిలో మంచితనానికి చిహ్నాలు. ఇవే చిహ్నాలు తరువాత గ్వెర్నికాలో కూడా గుర్తించవచ్చు. నాల్గవ సన్నివేశంలో, పాలిప్ తిరిగి వస్తుంది, మొదటి శ్రేణి చిత్రాలలోలాగా భయంకరమైన ఆంబోతును ఎదుర్కొంటుంది. కాకపోతే, జంతుసమూహం మరింత అసహ్యంగా చిత్రించబడి వుంటుంది.

డ్రీమ్ అండ్ లై ఆఫ్ ఫ్రాంకో కార్టూనుల్లో మిగిలిన బొమ్మలు (6-9), గ్వెర్నికా చిత్రానికి భూమికలుగా అర్థం చేసుకోవచ్చు.

4.

పారిస్‌లో జరగబోయే అంతర్జాతీయ ఎగ్జిబిషన్‌లో స్పానిష్‌ పెవిలియన్ కోసం ఒక కుడ్యచిత్రాన్ని చిత్రించమని స్పానిష్‌ ప్రభుత్వం పికాసోని ఆహ్వానించింది. 1937 జనవరిలో పికాసో ఆ ఆహ్వానాన్ని అంగీకరించాడు. అప్పటికి, ఏ విషయంపై కుడ్యచిత్రం గీయాలో పికాసో మనసులో స్థిరపడినట్టు కనిపించదు. గ్వెర్నికాపై బాంబు దాడి ఒక స్పష్టమైన ఇతివృత్తాన్ని సూచించి ఉండవచ్చు. అంతేకాదు, చాలామంది చిత్రకళావిమర్శకుల దృష్టిలో, ఈ బాంబుల దాడి పికాసోకి భావావేశం, ఉద్రేకం కలిగించాయి. గ్వెర్నికా ప్రారంభదశలో చిత్తు ప్రతులు (rough sketches) 1937 మే నెల మొదటి పదిరోజుల్లోనే పికాసో పూర్తిచేశాడు. జూన్ నెల మొదటి వారంలోనే ఈ 11’ 6” x 25’8” కుడ్యచిత్రం పూర్తయ్యింది.

జాన్ రిచర్డ్‌సన్ అన్న సమీక్షకుడు హాబియెర్ ఇరూహో (Xavier Irujo) రాసిన గ్వెర్నికా 1937: ఏ మార్కెట్‌ డే మసాకర్ (యూనివర్సిటీ ఆఫ్ నెవాడా ప్రచురణ, 2016) పుస్తకం సమీక్షిస్తూ, ఇలా రాస్తాడు: (ఈ క్రింది వివరాలు చారిత్రికంగా సరికొత్త విషయాలు.- వేవే)

ఏప్రిల్ 20న హిట్లర్‌ పుట్టినరోజు కానుకగా స్పెయిన్‌‌లో చరిత్రాత్మకమయిన బాస్క్‌ పట్టణం, గ్వెర్నికాపై బాంబులవర్షం కురిపించాలని నాజీ మంత్రి హెర్మన్‌ గోరింగ్‌ తలపెట్టాడు. అయితే ఈ తాంత్రిక వ్యూహం ఫలించలేదు. అందుచేత, ఈ దాడి ఏప్రిల్ 26కి వాయిదా పడింది. ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించిన కల్నల్ రిక్‌థోఫెన్ (Colonel Wolfram Von Richthofen) అత్యధిక ప్రాణనష్టం కలిగించడం కోసం ప్రణాళిక వేశాడు. ఏప్రిల్‌ 26 సాయంత్రం 4:30 గంటలకు క్లుప్తంగా బాంబు దాడి ప్రారంభించి, దాడి ఆపాడు. దాడి ఆగిపోయిందని ఊహించి, గ్వెర్నికా జనాభా వైమానిక దాడి ఆశ్రయాల నుండి బయటకు రాగానే, తక్కువ ఎత్తున ఎగిరే విమానాల సహాయంతో మూడు గంటలసేపు నిర్విరామంగా బాంబు దాడులు జరిపించాడు. ఈ దాడిలో 1500 మందికి పైగా మరణించారు. తరువాత కల్నల్ రిక్‌థోపెన్‌ మాట్లాడుతూ ‘ఇది ఖచ్చితంగా అద్భుతమైన దాడి’ అని అన్నాడు. హిట్లర్‌కి ఈ రకమైన దాడులు ఎంతో ఇష్టం. రెండు సంవత్సరాల తరువాత, వార్సాపై ఇటువంటి దాడి ఇంతకన్నా భారీ ఎత్తున జరిపించమని ఆజ్ఞాపించాడు. ఆ దాడే రెండవ ప్రపంచయుద్ధానికి నాంది పలికింది.


గ్వెర్నికా – మొదటి దశ

వాన్ లర్రేయా (Juan Larrea) అనే కవి ఈ దాడి గురించి రేడియోలో విని, వెంటనే పారిస్‌లో ఉన్న పికాసోని చూడటానికి హుటాహుటిన వెళ్ళాడు. పికాసో, పారిస్ ప్రపంచ ఉత్సవానికి స్పానిష్ రిపబ్లిక్ పెవిలియన్ కోసం ఒక కుడ్యచిత్రాన్ని చిత్రించడానికి కొన్ని నెలల ముందుగా నియమించబడ్డాడని ఇదివరకే చెప్పుకున్నాం. గ్వెర్నికా పట్టణాన్ని సమూలంగా నిర్మూలించడం, కుడ్యచిత్రానికి పనికివచ్చే గొప్ప అంశం అవుతుందని లర్రేయా భావించి, పికాసోకి సూచన చేశాడు. బాంబులు పడిన తరువాత ఒక పట్టణం ఎలా ఉంటుందో తనకు ఏమాత్రం అవగాహన లేదని, పికాసో అన్నాడు. వెంటనే, లర్రేయా ‘సున్నితమైన పింగాణీ వస్తువులు అమ్మే దుకాణంలో, ఉన్మాదంతో ఆంబోతు పరుగెత్తితే ఎలా వుంటుందో అలాగే వుంటుంది’ అని సమాధానం ఇచ్చాడు.


గ్వెర్నికా – రెండవ దశ

అంతే. లర్రేయా సూచించిన ఆలోచనపై పికాసో పనిచేయడం ప్రారంభించాడు. మే 9, 1937 నాటికి పికాసో ప్రాథమిక కూర్పు పెన్సిల్‌ డ్రాయింగులతో పూర్తయ్యింది. మే 11 నాటికి, డ్రాయింగ్ పెద్ద కాన్వాస్‌పై పూర్తి స్థాయిలో మొదలయ్యింది. పికాసో యొక్క అధివాస్తవిక స్నేహితులు ఆంద్రె బ్రెటాఁ (Andre Breton), పాల్ ఎల్వార్డ్ (Paul Eluard) అప్పటికి నాలుగు సంవత్సరాల ముందునుంచీ పికాసోని కమ్యూనిస్ట్ పార్టీలో చేరమని ఒత్తిడిచేస్తూ ఉన్నారు. తమాషా ఏమిటంటే, వాళ్ళిద్దరినీ కమ్యూనిస్ట్ పార్టీ ఎప్పుడో బహిష్కరించింది!


గ్వెర్నికా – ఏడవ దశ

పికాసో మొదట గీసిన డ్రాయింగులలో కమ్యూనిస్టు పద్ధతిలో వందనం–పిడికిలి బిగించి పైకి లేచిన చెయ్యి–కనిపిస్తుంది. ఫాసిస్టులకి వ్యతిరేకంగా స్పెయిన్‌ అంతర్యుద్ధంలో పిడికిలి బిగించిన చేత్తో వందనం చేయటం మామూలే! కానీ, పికాసో తరువాత వేసిన చిత్తరువుల్లో ఆ భాగం తీసివేశాడు.

పికాసో 1944లో రెండవ ప్రపంచయుద్ధం చివరి రోజుల్లో కమ్యూనిస్ట్ పార్టీలో చేరాడు. వాస్తవానికి, మొదట్లో గాలిస్టులతో చేరడానికి ఒప్పుకున్నాడు. కాని, ఒక విందులో వాళ్ళ ప్రవర్తన మీద అతనికి అసహ్యం కలిగింది. వాళ్ళని, (c’est une bande de cons; it’s a bunch of idiots) అని డోరా మార్‌‌తో (Dora Maar) అన్నాడు. (డోరా మార్‌ పికాసో ప్రియురాలు. గ్వెర్నికా కుడ్యచిత్రానికి ఆమె చేసిన సహకారం మరువరానిది. డోరా మార్‌ గురించి వ్యాసంలో తరువాత చెప్పుకుందాం.)

5.

పెయింటింగ్ యొక్క పరిణామం, ప్రతీకాత్మకతల గురించి చర్చించే ముందు, దానిలోని వివిధ భాగాలను ‘అర్థం’చేసుకోవడానికి ప్రయత్నిద్దాం.

పెయింటింగ్‌ దృశ్యం చీకటి. బహిరంగ ప్రదేశం. గ్వెర్నికా పట్టణంలో ఒక చదరపు ప్రదేశం. చిత్రం పైభాగంలో కన్నులా ఉండే ఒక వింత దీపం. కంటిగుడ్డులా ఒక విద్యుద్దీపం. (దీనిని గురించి డోరా మార్‌ చెప్పిన ఉదంతం చాలా విచిత్రంగా ఉంటుంది.)


గ్వెర్నికా – పూర్తి చిత్రం

ఈ బొమ్మలో పాత్రధారులు రెండు గ్రూపులుగా వస్తారు. ప్రధాన పాత్రలు: 1. మూడు జంతువులు–ఆంబోతు; గాయపడిన గుర్రం; మరియు ఎడమ నేపథ్యంలో చూచాయగా కనిపిస్తూ రెక్కలతో ఉన్న పక్షి. 2. ఇద్దరు మనుష్యులు–చనిపోయిన సైనికుడు; పైన కుడి వైపున కిటికీలోంచి వంగొని, స్టేజీ మొత్తానికి దీపం చూపిస్తున్నట్టుగా స్త్రీ. 3. వీళ్ళతో పాటు, గ్రీక్ కోరస్‌‌లా ముగ్గురు మహిళలు–ఎడమపక్కన చనిపోయిన శిశువుని ఎత్తుకొని కెవ్వున (భోరున ఏడుస్తూ) అరుస్తున్న తల్లి, కుడి వైపు నుండి ఎడమకు పరుగెత్తుతున్న స్త్రీ, ఆపైన మంటలతో కూలిపోతున్న ఇంట్లోనుంచి కింద పడిపోతున్న స్త్రీ.

ఈ మనుషులు, జంతువుల మూర్తులు–వాటి ప్రతీకాత్మకత ఒక్క ఉదుటున వచ్చినవి కావు. వీటికి జటిలమైన చరిత్ర ఉన్నది. ఒక్క పికాసో చిత్రకళే కాదు; అంతకుముందు సుదీర్ఘమైన యూరోపియన్‌ చిత్రకళ చరిత్ర కూడా నేపథ్యంలో ఉన్నది.

చిత్రం యొక్క అర్థం–దానిలో ప్రతీకల గురించి–పికాసో ఒక క్లూ మాత్రమే ఇచ్చాడు. ఒకసారి ఒక ఇంటర్‌వ్యూలో మాట్లాడుతూ, చిత్రంలో గుర్రం ప్రజలను సూచిస్తుందనీ, ఆంబోతు చీకటి, క్రూరత్వాలని సూచిస్తుందనీ అన్నాడు. ఎద్దు ఫాసిౙమ్‌కి ప్రతీకగా నిలబడుతుంది గదా అని పృచ్ఛకులు పదేపదే నొక్కి అడిగినప్పుడు, అతను అంగీకరించలేదు. అయితే ఒక విషయం గమనించాలి. పికాసో చిహ్నాలు ఎప్పుడూ స్థిరంగా ఉండవు అనడానికి ఇది ముఖ్యమైన ఉదాహరణ. అవి ఎప్పుడూ సరిగ్గా గూటిలోపెట్టి తాళం వేసినట్టుగా ఉండవు. అతని ఆలోచనలలో మార్పు వచ్చినప్పుడు, చిహ్నాల అర్థాలు కూడా మారిపోతాయి. అయితే, పికాసో గీసిన పాత బొమ్మలు అధ్యయనం చేయటం ద్వారా–ముఖ్యంగా 1930లలో–గ్వెర్నికాలో ఉపయోగించిన చిహ్నాల గురించి, కళాకారుడి ఉద్దేశ్యాల గురించి మరింత లోతుగా తెలుసుకోవడం సాధ్యం.

6.


ఆంబోతు-గుర్రం (1934)

ప్రధాన ఇతివృత్తం ఆంబోతు, గుర్రం మధ్య సంఘర్షణ. ఇది పికాసోకి జీవితమంతా ఆసక్తిని కలిగించింది. అతను పదవ ఏట గీసిన డ్రాయింగ్‌ ఆంబోతుల పోరాటం. ఆ తరువాత చేసిన ఆయిల్‌ పెయింటింగులలో కూడా ఈ ఎద్దుల పోరాటం కనిపిస్తుంది. వీటికి ప్రత్యేక ప్రాముఖ్యత ఏమీ లేదు. కేవలం ఎద్దుల పోరాటం జరిగే స్థలం రెండు భాగాలుగా చూపిస్తూ, ఆ రెంటిమధ్యా వైరుధ్యాలను చూపించడానికి వెలుగు-నీడలు వాడుకున్నాడు. మానవ జీవితంలో విషాదం–ఆనందం; చిత్రంలో వెలుగు-నీడలు ఈ వైరుధ్యానికి చిహ్నాలని ఒక అభిప్రాయం అప్పటికే విమర్శకులలో బలపడింది. (ఈ వెలుగు-నీడల ప్రతీకని, ఎద్దుల పోరాట దృశ్యాల్లో పికాసో చాలాచోట్ల వాడుకున్నాడని విమర్శకులు ఆక్షేపించారు.) అప్పట్లో, ఎద్దు-గుర్రాలమధ్య పోరాటంలో ఎద్దు గుర్రాన్ని భయపెడుతుంది; కానీ బాధ పెట్టదు. 1930 తరువాత ఇదే ఇతివృత్తంతో గీసిన చిత్రాలు, ఆయిల్‌ పెయింటింగులలో భయానక దృశ్యచిత్రణ కనిపిస్తుంది. అప్పట్లో పికాసో భార్య ఓల్గాతో వైమనస్యం, విముఖత పెరిగిపోయాయి. వ్యక్తిగతంగా తనకి దుస్థితి, దుఃఖం. 1934లో గీసిన ఎద్దు-గుర్రం పోరాట చిత్రాలన్నింటిలోనూ, భయానక దృశ్యం, భీభత్సం, కొట్టవచ్చినట్టు కనబడుతాయి. బొమ్మ ఎడమపక్క పైన ప్రేక్షకులలో ఒక స్త్రీ ఈ ఘోరాన్ని చూడలేక కళ్ళు మూసుకున్నట్టు కనిపిస్తుంది. ఇక్కడ సన్నివేశం రాత్రి సమయంలో జరుగుతుంది. ప్రేక్షకులలో ఒక అమ్మాయి ఒక కొవ్వొత్తి పట్టుకుంటుంది. ఇవి సత్యనిరూపణకి సంప్రదాయక చిహ్నాలు. గ్వెర్నికాలో కూడా దీపంతో ఉన్న స్త్రీని సూచిస్తుంది.


మినొటార్-గుర్రం

1934 డ్రాయింగ్‌లు, ఎచింగ్‌లలో ఒక ఆసక్తికరమైన వైవిధ్యం అకస్మాత్తుగా సంభవిస్తుంది. గ్రీకు పురాణాలలోవచ్చే మినొటార్ (minotaur) అనే నరవృషభం మరో ముఖ్యమైన పాత్రగా ప్రవేశిస్తుంది. మొదట్లో సర్రియలిస్టుల పత్రిక కవరు కోసం పికాసో ఈ నరవృషభం బొమ్మని గీశాడు. కానీ, దానిని తన స్వంత చిత్రాలలో సూక్ష్మభేదంతో విరివిగా వాడటం మొదలుపెట్టాడు. ఇది హింస, క్రూరత్వానికి చిహ్నం. ఎద్దుకి బదులు నరవృషభాన్ని వాడాడు. ఆ రోజుల్లో, ఈ నరవృషభాన్ని వాడి పికాసో చాలా బొమ్మలు, లిథోగ్రాఫులూ, డ్రాయింగులూ గీశాడు. అన్ని చిత్రాలలో, నరవృషభాన్ని ఒక యువతి ఓడిస్తుంది. మంచి చెడుని ఓడించి తీరుతుందన్న సూచన కావచ్చు.

7.


మినొటార్-స్త్రీ, 1937.

ముందుగా పికాసో వేసిన ఒక అద్భుతమైన డ్రాయింగ్‌ గురించి చెప్పుతాను. ఒక నెరిసిన గడ్డంతో ఉన్న మనిషి ఒక మహిళని చూస్తాడు. మనిషి తల పురాణ మానవతావాద శైలిలోఉంటుంది. స్త్రీ చిత్రం అమూర్త చిత్రకళాశైలిలో ఉంటుంది. అయినా సూచనార్థకరహితంగా ఉండే రెండు శైలులు ఒకే కాగితం మీద సామరస్యంగా ఉన్నట్లు కనిపిస్తాయి. ఇటువంటివే అనేకమైన డ్రాయింగులలో పికాసో ఒక మానవతావాది గానూ ఒక విశృంఖలదైవం (Satyr) గానూ గుర్తించవచ్చు. ఒక్కొక్కచోట ఆ సంబంధం తారుమారై, ఒక విచిత్రమైన, అతీతమైన ప్రేతం కనిపించవచ్చు. ఒక ప్రాచీన దేవుడు, సూపర్‌మాన్ (Superman) లేదా రాక్షసుడుగా ఎన్నో చిత్రాలతో తనను తాను చిత్రించుకొని, అవి తన వ్యక్తిత్వంలో భాగంగా సృష్టించుకున్న కళాకారుడు పికాసో. ఒక వైపు ఎన్నో అభూతకల్పనలు–అదే సమయంలో సంప్రదాయక నమూనాలపై ఆధారపడ్డ ఆదర్శవంతమైన అందమైన బొమ్మలు సృష్టించడంలో పికాసో జీవితమంతా కృషి చేశాడు. 1930 తరువాత గోయా కళలో ముఖ్యమైన పాత్రను పోషించిన బుల్‌ఫైటింగ్ (Tauromachie) యొక్క ప్రతీకవాదాన్ని పికాసో ముమ్మరంగా అన్వేషించడం ప్రారంభించాడు. తరువాత కాలంలో ఆంబోతు తన లోతైన ఆటవికతకు ప్రేరణలై ఉండవచ్చు.


మినొటారోమకీ, 1935.

1935లో పికాసో చేసిన గొప్ప ఎచింగులలో, మినొటారోమకీ (Minotauromachy) ఒకటి. ఒక మినొటార్‌ ఒక చిన్నపిల్ల పట్టుకున్న కొవ్వొత్తిని ఆర్పడానికి పోవడం, వారి మధ్య బాధతో గిజగిజలాడుతూ ఒక గుర్రం, దాని వీపు మీద, కత్తి ఇంకా చేతిలోనే పట్టుకొని ఉన్న ఒక చనిపోయిన ఆడ మెటడోర్‌. ఒక ప్రక్క నిచ్చెనపై ఒక గడ్డం ఉన్న క్రీస్తు లాంటి వ్యక్తి అసహాయస్థితిలో ఈ విషాదకరమైన దృశ్యాన్ని గమనిస్తున్నాడు. పైన ఒక కిటికీ వద్ద ఇద్దరు యువతులు; పావురాలూ ఉన్నాయి. ఈ దృశ్యంలో అర్థం స్పష్టంగా తెలియదు. ఒక్కొక్కసారి, రెండు పరస్పర విరుద్ధ శక్తుల సంపర్కం–ఒద్దికగా ఉండేవీ, విలవిలలాడేవీ–ఒకేచోట సామరస్యంగా ఉన్న భావం కలుగుతుంది. నరవృషభం తన సొంత ఖడ్గంతో మెటడోర్‌ను సంహరించడం కనిపిస్తుంది; మరియు క్రీస్తులాంటి మనిషి నరవృషభానికి మానవీకరణలా అగుపిస్తుంది. అందువల్ల మంచీ చెడుల సంబంధం బెడిసికొట్టి, చాలా సంక్లిష్టంగా తయారవుతుతుంది. ఏదేమైనా, ఆ చిన్న అమ్మాయి తన గుప్పెడు పువ్వులతో, చిన్న కొవ్వొత్తితో బిగుసుకుపోయి నిలబడి, అమాయక బాల-బాధితులను సూచిస్తుంది. ఆమె అమాయకత్వం, స్వచ్ఛత ఇక్కడ మరింత సానుకూలంగా వ్యక్తమయి, మిగిలిన చిత్రంలో దృశ్యాన్ని నిర్లిప్తంగా చేస్తాయి. ఒక మహా క్రూరమృగ౦ తన చిన్న కొవ్వొత్తిని ఆర్పడానికి వస్తున్నదా? అని సందేహం కలగవచ్చు. ఈ సన్నివేశం నాటకీయంగా మర్మం, అద్భుతమైన థియేటర్‌‌కి సూచనప్రాయంగా నిలబడుతుంది.


డైయింగ్ బుల్, 1934.

1935 నాటి మినొటారోమకీ ఎచింగ్ దాదాపు మనం పైన చెప్పుకున్న అన్ని ఇతివృత్తాలను క్రోడీకరిస్తుంది. దీనితో పికాసో మునుపటి సంవత్సరాల్లో ఎద్దుల పోరాటం, మినొటార్ కూర్పులలో ప్రయోగాలు చేశాడు. మధ్యలో గుర్రం. మినొటార్ కుడివైపు నుండి బెదిరింపుగా కత్తి పట్టుకొని కదులుతాడు. ఈ మినొటార్‌ తానే! కాని ఎడమ వైపున ఒక చిన్న అమ్మాయిని చూడగానే ఆగిపోతాడు. ఈ చిన్న అమ్మాయి, పికాసో చెల్లెలు కొంచితా. చిన్నప్పుడే డిఫ్తీరియా జబ్బుతో మరణించింది. పికాసోకి ఆ పిల్ల అంటే ఎడతెగని ప్రేమ. చాలా చిత్రాలలో, గ్వెర్నికాలో కూడా, ఆ పిల్లని సద్గుణాలకి ప్రతీకగా చూడవచ్చు. గ్వెర్నికాలో దీపం పట్టుకున్న యువతి కూడా కొంచితాయే అని ఈనాటి విమర్శకుల అభిప్రాయం! చిత్రం పైభాగంలో, ఎడమ వైపున ఉన్న ఒక కిటికీలో, పావురాలతో పాటు ఇద్దరు బాలికలను కూర్చొని ఉంటారు. ఎడమవైపున గడ్డం ఉన్న వ్యక్తి, కళాకారుడికి చిహ్నం అని కొందరు పాత విమర్శకుల అభిప్రాయం. పైన చెప్పినట్టుగా ఈ మధ్య రాసిన విమర్శకులు ఆ గడ్డం ఉన్న వ్యక్తి జీసెస్‌ అని ఊహించారు. అతను నిచ్చెన ఎక్కి ఎక్కడికో తప్పించుకుని పారిపోతున్నాడు. కాని పికాసో ఈ చిత్రంలో, సత్యం-అమాయకత్వం, ఈ రెండూ, చెడు-హింసలపై విజయాన్ని సాధించటం, అద్భుతంగా వ్యక్తీకరీంచాడు. బొమ్మలో కుడివైపు మూల కాంతిరేఖలు కనిపిస్తుంటాయి. మినొటార్‌ వీపుపై ఈ కాంతి పడుతూ ఉంటుంది. ఆ కాంతి ఇరానియన్‌ సంప్రదాయంలో మిత్ర (సూర్యుడని) నుంచి వచ్చే కాంతి అని, ఆ కాంతిరేఖలని తప్పించుకొని పోవటానికి జీసస్‌ ప్రయత్నిస్తున్నాడనీ, 2015 వ్యాసంలో జాన్‌ రిచర్డ్‌సన్‌ రాశాడు.

ఆధునిక అద్భుతకళాస్మృతిలో శాశ్వతంగా ఉండిపోయే చిత్రం మినొటారోమకీ. అద్భుతకళ అంశాలు అన్నీ ఇందులో మిళితమై ఉంటాయి: పురాణం, కల, చరిత్ర, లైంగిక భ్రాంతులు, అసంబద్ధమైన సమ్మేళనం, హైబ్రిడ్ మనిషి-జంతువు అయిన మినొటార్ క్రెటన్ పురాణంలోని పాత్ర. ఎద్దు వేషంలో జ్యూస్ యూరోపాను తీసుకుపోవడం గ్రీకు పురాణ సూచన: అపస్మారక స్థితిలో ఉన్న ఆడ మెటడార్‌, తీవ్రంగా గాయపడ్డ గుర్రం. ఈ సన్నివేశంలో హింసను ప్రశాంతంగా చూసే ముఖం కొంచితా చేతిలో పూలు, దీపం. దీనికి వ్యతిరేకంగా హింస, గందరగోళానికి చిహ్నంగా ఉన్న మినొటార్‌ తనను తాను కాపాడుకోవటం. ఒక కలలా తేలికగా వివరించడానికి తావు లేని చిత్రం. అయినప్పటికీ ఇది ఆధునిక యూరోపియన్ చరిత్రలోని అనేక అంశాల గురించి ప్రతీక. ఒక ఎద్దును చంపడం, క్రీస్తుపూర్వం సంతానోత్పత్తి కోసం కొన్ని పాశ్చాత్య సంస్కృతుల్లో పాతుకుపోయిన ఆచారం. అంతే కాదు, పాశ్చాత్య దేశాల జీవన నిర్మాణానికి ప్రారంభసూచిక కూడాను. మరోమాటలో చెప్పాలంటే, పురాణం, ఆధునిక దృశ్యం రెండూ మన చరిత్రలో కేంద్రీకృతమైన సంస్కరణలు. ఈ చిత్రం గీసిన రెండు సంవత్సరాల తరువాత అతను గ్వెర్నికాను చిత్రిస్తాడు. అతను ఈ పనిని ముందు మినొటారోమకీలో ఊహించినట్లు కనిపిస్తోంది! ఈ పాత్రల వైవిధ్యాలతో పికాసో చేసిన మరొక గొప్పసృష్టి: గ్వెర్నికా.

8.

గ్వెర్నికాలో పికాసో ఉపయోగించిన చిహ్నాలు ఆ పెయింటింగ్ కోసం అకస్మాత్తుగా కనుగొనబడలేదని, కాలక్రమేణా అభివృద్ధి చెందుతున్నాయని పై ఉదాహరణల నుండి స్పష్టమవుతుంది. స్పానిష్ అంతర్యుద్ధం యొక్క ప్రేరణతో పికాసో వాటిని ఉన్నత స్థాయికి తీసుకొని పోగలిగాడు. విశ్వవిషాదం గురించి తన ప్రతిచర్యనీ వ్యక్తీకరించడానికి వాటిని ఉపయోగించగలిగాడు.

ఏ ఇతర పెయింటింగ్ ఇంతకన్నా భారీగా డాక్యుమెంట్ చేయబడలేదు. నలభై ఐదు ప్రాథమిక అధ్యయనాలు వాటి ఉత్పత్తి క్రమంతోసహా సంరక్షించబడ్డాయి. పెయింటింగ్ ఏడు దశల్లో ఛాయాచిత్రాలు తీయబడ్డాయి. అతను అంతకుముందు రెండు సంవత్సరాల క్రితం వ్రాశాడు: ఫోటోగ్రాఫికల్‌గా భద్రపరచడం చాలా ఆసక్తికరంగా ఉంటుంది, చిత్రం యొక్క దశలు కాదు; కానీ రూపపరిణామం అర్థం చేసుకోవటానికి. ఒక కలను సాకారం చేయడంలో మెదడు అనుసరించిన మార్గాన్ని ఎవరైనా కనుగొనవచ్చు. గమనించదగ్గ ఒక విచిత్రమైన విషయం ఏమిటంటే, ప్రాథమికంగా చిత్రం మారదు, మొదట మెదడులో పడిన ‘దృష్టి’ దాదాపుగా చెక్కుచెదరకుండా ఉంటుంది.


గ్వెర్నికా చిత్రిస్తున్న పికాసో

1937లో పికాసో తన విషాద కుడ్యచిత్రం, గ్వెర్నికాను ఒక భారీ కాన్వాస్ పైన చిత్రించాడు. మరణం, అతీతమైన విధ్వంసం, యుద్ధకాల వేదనలను నలుపు, తెలుపు, బూడిద రంగులతో కూర్చిన చిత్రం. చిత్రం క్రిందిభాగంలో అపసవ్యంగా చిన్నాభిన్నంగా పడిఉన్న యోధుడు, మృతశిశువుతో స్త్రీ, పేగులు బయటపడ్డ గుర్రం, చనుమొనలు చీలలుగా మారి దుఃఖంతో మరో మహిళ–ఈ చిత్రాల్లో వ్యక్తీకృత వక్రీకరణలు క్రూరత్వాన్ని సూచిస్తున్నాయి. బొమ్మలో రెండు రూపాలు ముఖ్యం. భీకరమైన ఆంబోతు ఎద్దు, చచ్చిపోతున్న గుర్రం. కుడివైపునున్నఒక కిటికీ నుండి భయపెట్టే ఒక మహిళ ముఖం, ఒక భ్రూణంలా పొడవాటి భుజం–ఆమె ఆ దృశ్యానికి ఒక కొవ్వొత్తి పట్టుకొని చూపిస్తుంది. అది విడ్డూరంగా ఉన్న మానవత్వానికి ప్రతీక.

పికాసో తన ప్రతీకలని వివరించాడు. ఆంబోతు ‘క్రూరత్వం మరియు చీకటి’ అని ప్రకటిస్తూ… గుర్రం ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తుంది. చిత్రలేఖనం ఒక పీడకల యొక్క ప్రభావం, ఒక కామిక్ స్క్రిప్ట్‌ ప్రదర్శన, మెలోడ్రామా, నిరాడంబరత, విపరీత మానసికతకి సూచన అని ఖచ్చితమైన అలంకార రూప౦తో, బలమైన సూచనార్థక ప్రతీకల ద్వారా పికాసో తాను తెలియజేయాలనుకున్న భావోద్వేగాలను తీవ్ర౦గానే వ్యక్త౦ చేశాడు. సాధారణ ప్రజల భావోద్వేగాలను ఉత్తేజపరచటానికి ఈ ప్రతీకలూ వాటి కూర్పూ చాలా క్లిష్టంగా ఉన్నాయని గ్వెర్నికా చిత్రాన్ని విమర్శించారు. అదే నిజమైతే, స్వంతగా పికాసో చేసిన తప్పు కాదు, మన కళాత్మక చట్రపు పరిధి తరిగిపోయిదని అనవచ్చునేమో! వాస్తవానికి, పికాసో, ఉద్దేశపూర్వక౦గా శాస్త్రీయ సూచనార్థక ప్రతీకలని సరళీకరించాడు. తన స్పష్టతను పెంచుకోవడానికి కామిక్ స్ట్రిప్‌లా పేర్చి, వాటితో సమ్మిశ్రణం చేయడానికి ప్రయత్నించాడు. ప్యానెల్ అడుగున అస్తవ్యస్తంగా పడివున్న యోధుడు ఈ కలయికకి ఉదాహరణ.

చిత్రానికి బలం ఆంబోతు, పీడిత గుర్రం, దిష్టిబొమ్మల్లా మనుషులు–ఇవన్నీ క్రూరమైన వక్రీకరణల నుండి ఉద్భవించాయి. ఈ రూపాల్లో పికాసో ప్రజల అరాచకాలకీ దురాక్రమణకీ ఆత్మాశ్రయసమానత చూపించాడు. గ్వెర్నికా అత్యంత విషాదార్థాలకి, సామూహిక అవివేకతకి ప్రత్యేక ప్రతీక. మరో రకంగా చెప్పాలంటే, ఇది దాదాపు ఒక సైకాటిక్ డ్రాయింగ్. గోయా రాస్తాడు: The dream of reason produces monsters. గోయా మానవతావాద దృష్టికి, పికాసో తన తాజాకలం జోడించాడు.


గ్వెర్నికా, మే 9, 1937

మే 1, పికాసో గ్వెర్నికా చిత్రంపై పని ప్రారంభించిన రోజు. మే 9వ తారీకు కల్లా డ్రాయింగులలో కూర్పు పూర్తయినట్టే. మే 11న కేన్వాస్‌‌పై అసలు బొమ్మ గీయటం మొదలయ్యింది. జూన్ 4 కల్లా గ్వెర్నికా కుడ్యచిత్రం తయారయ్యింది. పికాసో మొదలుపెట్టినప్పటి నుంచీ, బొమ్మ పూర్తి అయ్యేవరకూ డోరా మార్‌ ఫొటోగ్రాఫులు తీసి భద్రపరిచింది. మే 9వ తారీఖున చేసిన చాలా విస్తృతమైన కంపోజిషన్ డ్రాయింగ్‌లో కుడ్యచిత్రం సుమారుగా తుది రూపాన్ని సంతరించుకుంటుంది. మే 9 తరువాత కూర్పుకై చేసిన డ్రాయింగ్‌లు లేవు, ఎందుకంటే రెండు రోజుల తరువాత పికాసో పెయింటింగ్‌ పని ప్రారంభించాడు. ఇంకా అవసరమైన మార్పులు కాన్వాస్‌ పైనే జరిగాయి. అతను మే 11న అసలు కాన్వాస్‌పై పని ప్రారంభించినప్పుడు, పికాసో తన కూర్పును మే 9 యొక్క డ్రాయింగ్ ఆధారంగా రూపొందించాడు.

ఒక కళాకారుడు అంటే ఏమిటి? అతను చిత్రకారుడు అయితే కళ్ళు మాత్రమే ఉన్నవాడు, సంగీతకారుడు అయితే చెవులు, లేదా అతను కవి అయితే అతని గుండెలో ఒక మాట, లేదా అతను బాక్సర్ అయితే అతని కండరాలు, ఇవేనా? దీనికి విరుద్ధంగా, అతను అదే సమయంలో రాజకీయ జీవి. హృదయవిదారకంగా మండుతున్న సంఘటనలకు, లేదా సంతోషకరమైన సంఘటనలకు, నిరంతరం సజీవంగా ఉంటాడు, దానికి అతను విధిగా స్పందిస్తాడు. ఇతర వ్యక్తుల పట్ల ఆసక్తి కనబరచడం అవసరం; ఉదాసీనతతో వారిని జీవితం నుండి వేరుచేయడం ఎలా సాధ్యమవుతుంది? పికాసో పెయింటింగ్ అలంకరణ కోసం చెయ్యలేదు.

గ్వెర్నికా ఒక అరుదైన గొప్ప చిత్రం. దీనిలో సంవత్సరాల అనుభవం మరియు ప్రయోగాలు సంగ్రహించబడ్డాయి. పూర్తిగా కొత్త ప్రాముఖ్యత సంతరించుకున్నాయి. ముప్పైల కాలంలో పికాసో మనసులో ఊహించిన చిహ్నాలు నెమ్మదిగా అభివృద్ధి చెందుతున్నాయని ఇప్పటికే చూశాము, కాని వాటి మూలాలు వాటి కంటే చాలా పాతవి. చాలా సంవత్సరాలు వెనక్కి తీసుకొని వెళ్తాయి. ఒక వైపు ఇది బ్లూ పీరియడ్ భావోద్వేగ తీవ్రతను మెటామార్ఫిక్ పెయింటింగుల ఫాంటసీతో మిళితం అవుతుంది. మరోవైపు ఇది ఇరవైల ఆరంభంలో వచ్చిన క్లాసికల్ డ్రాఫ్ట్స్‌మన్‌షిప్‌ను, అలాగే క్యూబిౙమ్ యొక్క కఠినమైన అధికారిక క్రమశిక్షణను ఉపయోగించుకుంటుంది. యూరోపియన్ కళ యొక్క అత్యుత్తమ సంప్రదాయాల నుండి కళాకారుడు పొందిన జ్ఞానం ఈ చిత్రానికి మరింత ప్రాధాన్యతను ఇచ్చాయి. బాహ్య సంఘటనల ప్రేరణ లేకపోతే, ఇవన్నీ చాలా పేలవంగా ఉండేవి. ఇది కళాకారుడు తన మునుపు ఊహించినదానికన్నా గొప్ప ఇతివృత్తం. ఈ ఇతివృత్తం తన భావాలను వ్యక్తీకరించడానికి తన ఆలోచనలు నైపుణ్యాల సంపదను చక్కగా, ఉపయోగించుకునేలా చేసింది.

స్పానిష్ రిపబ్లిక్ ప్రభుత్వం 1937లో పికాసో నుండి కుడ్యచిత్రం గ్వెర్నికాను కొనుగోలు చేసింది. రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమైనప్పుడు, పెయింటింగ్‌ భద్రత కోసం న్యూయార్క్ మ్యూజియం ఆఫ్ మోడరన్ ఆర్ట్, మోమా (MoMA) అదుపులో ఉండాలని పికాసో నిర్ణయించుకున్నాడు. 1958 తరువాత స్పెయిన్లో ప్రజాస్వామ్యం పునరుద్ధరించబడే వరకు, పెయింటింగ్ మోమాలో నిరవధికంగా ఉంచడానికి పికాసో ఆమోదించాడు. గెర్నికా 1981లో స్పెయిన్‌కు తిరిగి వచ్చింది. (ప్రస్తుతం, మ్యూజియో నేషనల్ సెంట్రో డి ఆర్టే – రెయినా సోఫియాలో ఈ చిత్రం చూడవచ్చు.)

పికాసో డిసెంబర్ 1937లో ఇలా అన్నాడు: ఆధ్యాత్మిక విలువలతో జీవించి పనిచేసే కళాకారులు మానవాళి నాగరికత యొక్క అత్యున్నత విలువలను పణంగా పెట్టే సంఘర్షణకు భిన్నంగా ఉండకూడదు.

9.

హాబియేర్ ఇరూహో రాసిన గ్వెర్నికా 1937 (2015) పుస్తకంపై మే 12, 2016 నాటి జాన్ రిచర్డ్సన్ సమీక్ష నుండి…


వీపింగ్ ఉమన్, 1937.

డోరా మార్ అని పిలవబడే హెన్రియెట్టె థియోడోరా మార్కోవిక్ సర్రియలిస్ట్ ఫోటోగ్రాఫర్. అధివాస్తవిక ప్రదర్శనలో మార్‌ తీసిన చాయచిత్రం ఉద్యమానికే చిహ్నంగా మారింది. కానీ, పికాసో ప్రభావంతో, ఆమె చివరికి పెయింటింగ్ కోసం ఫోటోగ్రఫీని వదులుకుంది. ఫొటొగ్రఫీ చిత్రకళకన్నా హీనమైనదిగా పికాసో ఎల్లప్పుడూ భావించేవాడు. ‘ప్రతి ఫోటోగ్రాఫర్ లోపల ఒక చిత్రకారుడు బయటకి రావడానికి ప్రయత్నిస్తూవుంటాడు,’ అని నొక్కి చెప్పాడు. పికాసో గీసిన ‘ఏడుపు మహిళల’ ధారావాహికను ప్రేరేపించిన మ్యూజ్ డోరా మార్‌. డోరా యొక్క నైపుణ్యం ఎంతో గొప్పది; ఆధునిక కళాకృతిని సృష్టించిన మొదటి ఫోటోగ్రాఫిక్ రికార్డును ఆమె మొదటి నుండి చివరివరకూ పూర్తి చేయగలిగింది.

డోరా మార్‌ 1936లో పికాసోని కలిసింది. త్వరలోనే ఇద్దరూ ప్రేమికులు అయ్యారు. 36 రోజుల వ్యవధిలో పికాసోకి అధికారిక ఫోటోగ్రాఫర్‌గా పనిచేసింది.

పికాసో అభ్యర్థన మేరకు రోజుకు పెయింటింగ్ పురోగతి యొక్క ఛాయాచిత్రాలను తీయడంతో పాటు డోరా మార్ పెయింటింగ్‌లో తన మెరుగులను జోడించింది. బొమ్మ తయారవుతున్న రోజుల్లో, కేన్వాస్‌ చూడటానికి పాత్రికేయులు తొందరపెడుతూ ఉంటే, పికాసో ‘పబ్లిసిస్ట్’గా పనిచేసింది. పికాసో డోరా మార్‌‌తో చెప్పాడు: ‘చిత్రంలో చనిపోతున్న గుర్రం మరణానికీ బాధకీ చిహ్నం’ అని. అంతే కాదు; అపోకలిప్స్‌ (Apocalypse) గుర్రాలకి ఐతిహ్యం. విచ్ఛిన్నమైన సైనికుడి తల పక్కన ఉన్న గుర్రపు షూ ఇస్లాం మతంలో పవిత్రమైన నెలవంకను సూచిస్తుంది. ఫ్రాంకో యొక్క మొరాకో దళాలంటే పికాసోకు భయం. స్పెయిన్ మూరిష్ ఆక్రమణకు అతను భయపడ్డాడు. ఎద్దు స్పెయిన్ ప్రజలకి చిహ్నం, అని డోరా మార్‌ చెప్పింది. ఆంబోతు, పక్షి బలిపశువులు. గ్వెర్నికా కాన్వాస్ మధ్యలో ఉన్న లైట్ బల్బ్ ఆమె ఫోటోగ్రాఫిక్ దీపాలలో ఒకదానినుండి ప్రేరణ పొందింది. స్పెయిన్‌లోని మాడ్రిడ్‌లోని మ్యూజియో రీనా సోఫియాలో డోరా మార్‌ తీసిన 28 ఛాయాచిత్రాలు ఉన్నాయి. పికాసో జూన్ 4న కాన్వాస్‌ను పూర్తి చేశాడు. అతనికి 35 రోజులు పట్టింది.

డోరా మార్‌‌తో ఉంటూనే, పికాసో మేరీ-థెరోస్ వాల్టర్‌ను చూడటం కొనసాగించాడు. ఆమెతో అతనికి సంతానం కూడా ఉంది. 1945లో మార్‌ మానసికంగా దెబ్బతిన్నది. మార్ మతం వైపు మొగ్గు చూపి జీవితాన్ని కాథొలిక్ ఆధ్యాత్మికతకు అంకితం చేసుకుంది. డోరా మార్‌ కాథొలిక్ అయిన తరువాత గ్వెర్నికా గురించి వ్రాసిన రాతలు అన్నీ చాలావరకు కొట్టిపారేసింది.

10.

స్వోత్కర్ష:

నేను ఈ వ్యాసం రాయటానికి ఒక ముఖ్య కారణం: 1957లో ఏలూరు సాహిత్య మండలి సంక్రాంతి ఉత్సవాలలో ప్రతి ఒక్కరూ కవితలు చదివి పారేస్తున్నారు. నేను కూడా ఒక కవిత రాసిపారేసి చదువుదామని కోరిక పుట్టింది. భోగి రాత్రి, కూర్చొని పద్యం రాయటం మొదలు పెట్టాను. కరెంటు దీపాలు ఆరిపోయాయి.

పద్యం రాస్తుంటే దీపం ఆరిపోయింది
అక్కడ ఆకలి, ఆకలి అని పేదల హాహాకారాలు;
ఇక్కడ నేను అప్పకవీయాన్ని కప్పుకొని పడుకున్నాను

అని ఒక చవకబారు ‘ఎర్ర’రంగు పద్యం రాసేశాను. దానికి మా మేష్టారు (పేరు చెప్పను) గ్వెర్నికా అని మకుటం పెట్టారు. దాని అర్థం నాకు తెలియదు. యుద్ధ భయానక భీభత్సం చూపించే పికాసో చిత్రం అని ఆయన చెప్పారు. నేను ఆ పద్యం మర్నాడు స్టేజీమీద చదివేశాను. (Now I am so ashamed of my arrogance.)

1973లో న్యూయార్కులో ఎవడో ఉద్యోగం ఇస్తానంటే, ఇంటర్‌వ్యూకి వెళ్ళాను. అప్పుడు, న్యూయార్క్‌ మోమాలో గ్వెర్నికా కుడ్యచిత్రాన్ని చూశాను. నాకు ఏమీ బోధపడలేదు, సరిగదా, బొమ్మ అర్థం కూడా కాలేదు. నచ్చిందని కూడా అనలేను. పికాసో వేసిన బొమ్మ కాబట్టి, విమర్శకులు దీనిని గొప్పబొమ్మ అన్నారన్న అభిప్రాయం నాలో దృఢపడిపోయింది. చాలాకాలం తర్వాత, నా అదృష్టవశాత్తూ, ఒక సెకండ్ హ్యాండ్ పుస్తకశాలలో, పికాసోస్ గ్వెర్నికా అని ఆంథోనీ బ్లంట్ రాసిన పుస్తకం ఒక డాలరుకి లభించింది. ఆ పుస్తకం వెంటనే కొన్నాను. ఇప్పటికి ఆ పుస్తకం, కనీసం పదిసార్లన్నా చదివి ఉంటాను. ఆ పుస్తకంలో పసుపుపచ్చ షార్పీ హైలైటర్‌తో గుర్తుపెట్టని వాక్యాలు బహుశా, చాలా కొద్దిగా వుంటాయి. ఆ పుస్తకం నాకు కనువిప్పునిచ్చింది. తరువాత, గ్వెర్నికాపై చాలా వ్యాసాలు, పికాసోపై రెండు పుస్తకాలూ కూడా చదివాను. 2004లో బార్సెలోనా వెళ్ళాను. ఆ బొమ్మని మళ్ళీ చూశాను. ఈ సారి నిజంగా ఆ బొమ్మని చూశాను. పుస్తకాలు, వ్యాసాలూ, వగైరా చదివింతరువాత, ఆ బొమ్మపై నా పాత అభిప్రాయం పూర్తిగా మారింది. గ్వెర్నికా నిజంగా గొప్ప చిత్రం. నిజంగా చాలా గొప్ప కుడ్యచిత్రం. మంచి పద్యం ఏదయినా ఇది ఎందుకు మంచిపద్యమో ఎక్కడన్నా చదివితేనో, ఎవరన్నా విశదీకరిస్తేనో, ఆ పద్యాన్ని మళ్ళీ చదివి (మరింతగా) ఆనందించగలం అని నా అభిప్రాయం. అట్లాగే, ఆధునిక చిత్రకళకూడానూ! – వేవే)


పుస్తకాలు, వ్యాసాలు

  1. Alfred Barr, Picasso: Fifty Years of his Art, New York, 1946.( This is like a catalog.)
  2. Rudolf Arnheim, Picasso’s ‘Guernica’, Berkeley, California, 1962. ( A good reference, but Blunt is better.)
  3. Anthony Blunt, Picasso’s Guernica, Oxford University Press, 1969. (An excellent book.)
  4. Gijs van Hensbergen, Guernica: The Biography of a Twentieth Century Icon , Bloomsbury, 2004.
  5. Xabier Iruzo, Gernica, 1937: Market Day Massacre, University of Nevada Press, 2015. (A very good book with new information.)
  6. John Richardson’s articles in The New York Review of Books, June 25, 2015, and May 12, 2016. ( great review articles.)
  7. John Richardson, A Life of Picasso – in Four Volumes, Random House. (4th volume to be released at the end of 2019. I saw only the 3rd volume in the library.)