థాయ్‌లాండ్ యాత్రాగాథ – 6

నగర విహారం – ఉపసంహారం

మే తొమ్మిది.

థాయ్‌లాండ్‌లో చిట్టచివరి రోజు.

అచ్చంగా నాకోసం నేను అట్టేపెట్టుకొన్న రోజు…

అప్పటిదాకా ఉపరితల పరామర్శ తప్ప నగరపు లోతుల్లోకి వెళ్ళలేదు గదా. రోజంతా ఊరంతా తిరిగితిరిగి, నాదైన బాణీలో చూసిచూసి, అనుబంధం ఏర్పరచుకొని, అనుభవాలూ జ్ఞాపకాలూ సంపాదింకోవాలి–అదీ సంకల్పం.

పెద్దగా ప్లానంటూ పెట్టుకోలేదు గ్రాండ్ పాలెస్‌కు వెళ్ళడం తప్ప.

ముందటి రాత్రే ఓసారి మ్యాపులు చూశాను. కాలి నడక, రైలు, బస్సు ప్రయాణాల కలయికతో ఏడెనిమిది గంటలు తిరిగివచ్చే రూటు మ్యాపు ఒకటి మనసులో రూపొందించుకొన్నాను. అందులో మొట్టమొదటి మజిలీ, వార్ మెమోరియల్-విక్టరీ మాన్యుమెంట్.

నగరానికింకా తెల్లవారకముందే, సత్యజిత్-కల్యాణి-మధుర నిద్ర లేవకముందే ఇల్లువదిలి, అశోక్ స్టేషను చేరి, బిటిఎస్ స్కైవే రైలు పట్టుకొని నగరపు ఉదయలీలలను అవలోకిస్తూ, గంటసేపట్లో గమ్యం. నిజానికీ గమ్యం ఓ సాకు మాత్రమే అని నాకు స్పష్టంగా తెలుసు. ఆ ప్రదేశం టూరిస్టుల గమ్యం కాకపోయినా ట్రావెలర్లను తప్పక అలరించగలదని ఎలానో నా ఆరోజ్ఞానం చెప్పింది.

నగరానికి ఈశాన్య దిశలో 1941 నాటి ఫ్రాంకో థాయ్ యుద్ధంలో విజయానికి చిహ్నంగా నిర్మించిన నిడుపాటి కట్టడమిది. దిగువనుండి పైకి సన్నబారుతూ సాగిపోయేలా రాతితో నిర్మించిన విజయ స్థంభం– ఆంగ్లంలో ఆబలిస్క్ (Obelisk) అంటారు. స్థూలంగా మన కుతుబ్‌మినార్, చిత్తోడ్‌గఢ్‌లలోని విజయ స్థంభాల కోవకు చెందిన కట్టడమిది. వాషింగ్టన్‌లోని వాషింగ్టన్ మాన్యుమెంట్ ఇలాంటి కట్టడాలన్నిటికీ పెద్దన్న. ఆ పెద్దన్న నూట అరవై మీటర్ల ఎత్తయితే ఈ బ్యాంకాక్ చిన్న తమ్ముడిది అంతా కలసి ముప్పైరెండు!

ఎత్తులూ విభ్రమాలూ సంగతి ఎలా ఉన్నా ఆ కట్టడం ఉన్న ప్రదేశమంతా వృత్తాకారపు రహదారితో కూడిన విశాలమైన ఆవరణ. ఆ వృత్తంలోంచి వెలువడి పరుగులు పెడుతోన్న మూడునాలుగు నగరపు ముఖ్యమార్గాలు. ఇంకా ఉదయమే అవడంవల్ల చెదురుమదురుగా వాహనాలు. రౌండ్-ఎబౌట్‌కు కాస్తంత దూరాన అన్నివేపులా చిన్నాపెద్దా భవనాలు. ఓ పక్కన సువిశాలమైన లోకల్ రైళ్ళ జంక్షను, మరోపక్కన సిటీబస్సుల స్టాండు. రైలుస్టేషన్నూ బస్టాండునూ కలుపుతూ ఓ స్కైవాక్, దానిమీదకు ఎక్కీదిగడానికి ఎస్కలేటర్లు, మెల్లగా పుంజుకొంటోన్న నగరపు వడి, ఆ వేగంతో ప్రమేయం లేకుండా నా నింపాది అడుగులు, ‘వీళ్ళకింత తొందరెందుకో…’ అని అడుగుతోన్న మనసు, ఎస్కలేటర్ దిగువున తమతమ పాటలు వాద్యాలతో పదిమందినీ ఆకర్షించే ప్రయత్నం చేస్తోన్న గుడ్డి దంపతులూ, వాళ్ళ సంగీతమూ ప్రయత్నమూ నచ్చి ఆ సంతోషంతో పది బాథ్‌లు వాళ్ళకిచ్చి కరచాలనాలు చేస్తోన్న నేను, దానికి స్పందనగా చిరునవ్వులు అందిస్తోన్న ఆ దంపతులు, అదంతా చూసి ముచ్చటపడి ఫోటో తీసుకొంటోన్న ఓ స్థానికుడు…

అందుతోంది, అందుతోంది, నగరం నాడి నాకు అందుతోంది!

తెలియకుండానే గంట గడిచిపోయింది. ఆ విక్టరీ మాన్యుమెంట్ ప్రాంగణమంతా పరిచయమయిపోయిన భావన. హఠాత్తుగా అలాంటి రూపమూ, వాతావరణమూ ఉన్న బొంబాయి ఫ్లోరా ఫౌంటైన్ ప్రాంతం గుర్తొచ్చింది. అనేకసార్లు అక్కడ తిరుగాడిన జ్ఞాపకాలు…


గ్రాండ్ పాలెస్ వెళదామన్న కోరిక అయితే ఉంది గానీ ‘మొన్ననేగదా పట్టాభిషేకం ముగిసిందీ, అక్కడ ఆ హడావుడి ఇంకా కొనసాగుతున్నదేమో, మామూలువాళ్ళకి ఇంకా తలుపులు తెరవలేదేమో…’ అన్న అనుమానం. గూగుల్ కూడా సరిగ్గా చెప్పలేకపోయింది. ఆ పరిసరాలలో కనిపించిన ఒకరిద్దర్ని అడిగాను. ‘తెరిచే ఉంటుంది’ అని భరోసా ఇచ్చారు.

అక్కడ్నించి గ్రాండ్ పాలెస్‌కి అంతాకలసి ఏడు కిలోమీటర్లే అని గూగుల్ చెప్పింది. ఉబర్ తీసుకొంటే వందలోపే అనీ చెప్పింది. కానీ అక్కడ బస్టాండులో బిరబిరా గూళ్ళు వదిలి చెరచెరా పరుగులు పెడుతోన్న బస్సుల్ని చూడగానే ఆ బస్సుల అనుభవం పొందడానికి ఇది చక్కని అవకాశం అనిపించింది. రెండు మూడు బస్టాండులు ఉన్నాయక్కడ. స్థానికుల సహాయం తీసుకొని సరైన బస్టాండు చేరాను. అక్కడ బిజీబిజీగా పనిచేస్తోన్న ట్రాఫిక్ సూపర్వైజర్ సాయంతో గమ్యం చేర్చే బస్సు ఎక్కాను. ‘ఇంకా పట్టాభిషేక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈ బస్సు నిన్ను గ్రాండ్ పాలెస్ దాకా తీసుకువెళ్ళకపోవచ్చు…’ అని ముందస్తు జాగ్రత్త చెప్పాడా సూపర్వైజరు.

విక్టరీ మాన్యుమెంట్ ప్రాంతంలో కనిపించే అధునాతన నగరపు ఛాయలు క్షణాల్లో మటుమాయమయ్యాయి. బస్సు రాచరికపు రాజధానిలో ప్రవేశించిందని అర్థమయింది. ఆ ప్రవేశపు త్వరితగతిని చూస్తే ‘ఇది బస్సా, మనం చెప్పుకునే టైమ్ మెషినా!’ అన్న అబ్బురం. బాహుబలి సినీమాను తలపించే అలంకరణలు, ఆర్చ్‌లు, కొత్తరాజుగారి చిత్రాలు. దారిలోని భవనాలకు రంగురంగుల తళుకులు మెరుపులు… ఓ పక్కనున్న విశాలమైన మైదానంలో తెల్లతెల్లని షామియానాలు. వాటిల్లో మతాధికారులు, స్కూలు పిల్లలు, సైనికులు–విచిత్రమైన సమ్మేళనం! అక్కడ జరుగుతోన్న సంప్రదాయ కార్యక్రమాలు… పెద్దగా శబ్దకాలుష్యం సృష్టించకుండా మంద్రంగా వినిపిస్తోన్న మంత్రాలు. అన్ని కార్యక్రమాలు పక్కనే జరుగుతోన్నా ఏమాత్రం గందరగోళం లేని రోడ్లు, కొన్నిచోట్ల దారి మళ్ళింపులు, ఒన్‌వే నియమాలు, ఎంతో నింపాదిగా సాగుతోన్న మా బస్సు, హఠాత్తుగా మైసూరు దసరా బాణీలో అలంకరణ నిండిన గజరాజులు, డజన్లకొద్దీ అశ్వారూఢులు, అయిదు కిలోమీటర్లు బస్సు నడవడానికి దాదాపు గంట!

కానీ ఒక్కమాట. ఆ వాతావరణం బాహుబలుల్నీ, విఠలాచార్యల్నీ, మైసూరు మహరాజుల్నీ తలపించిన మాట నిజమే కాని, మధ్యయుగాలలోకి అడుగుపెట్టిన భావన కలిగినమాట నిజమే కాని, మరి ఎంచేతనో 2019 నుంచి 1819 లోకో 1019 లోకో వెళ్ళినట్టు అనిపించలేదు. ఆ 1019నే, 1819నే 2019లోకి తీసుకువచ్చినట్టు అనిపించింది. అది ఎలా సాధ్యమయిందీ? బహుశా పి. సి. సర్కార్ మాత్రమే చెప్పగలడనుకొంటాను.

బస్సు అనుకున్నట్టే పాలెస్‌కు బాగా దూరాన దింపింది.

గూగుల్‌ను అడిగితే గ్రాండ్ పాలెస్‌ 1.8కిలోమీటర్లు అంది.

సులువేమిటంటే ఏ మలుపులూ తిరగని సరళరేఖలో ప్రయాణం.

అడుగులు సాగించాను. ట్రాఫిక్ లేని రాజమార్గం. కడిగితుడిచినట్టున్న రోడ్డు. కళకళలాడుతోన్న రోడ్డు. ఎండ ఊపందుకొంటోన్న మాట నిజమేగానీ దాన్ని పట్టించుకొనేదెవరూ?!

హఠాత్తుగా కుడివేపున ఒక అతిసుందర రాజప్రాసాదం! పరిశీలిస్తే అది థాయ్‌లాండ్ నేషనల్ మ్యూజియం అని తెలిసింది. దాని సుందరగాంభీర్యం అటు అడుగువేయమంది. వేశాను. తొమ్మిదింటికిగానీ తెరవరట. ఇంకా అరగంట. ఆగే ప్రసక్తి లేకపోయినా కాసిని ఫోటోలు తీసుకోవచ్చుగదా… గేటు దగ్గర సెక్యూరిటీ యువకుడిని అనుమతి అడిగాను. బూత్‌లో ఉన్న సూపర్వైజర్‌ను అడగమన్నాడు. ఆ సూపర్వైజరు కుశలమడిగి భారతీయుడ్నని తెలుసుకొని సంతోషపడి ‘నీకిష్టమైనంతసేపు తిరుగాడు, ఫోటోలు తీసుకో’ అని వరమిచ్చేశాడు.

ఒకప్పుడు అది ఎవరో రాజవంశీకుల నివాసగృహమట. నూట ఏభై ఏళ్ళ క్రితం అప్పటి రాజు రామ-5 దాన్ని మ్యూజియంగా మార్చారట. ఆగ్నేయాసియా అంతటికీ పెద్ద సంగ్రహాలయమట. అప్పటి రాజులు వాడిన ఉత్సవ రథాలు అక్కడి ప్రత్యేకత అట. శతాబ్దాలనాటి చారిత్రక వస్తుసముదాయానికీ, కళాసంపదకూ కొదవలేదట…

ముఖద్వారాన్ని, బౌద్ధ వాస్తురీతిలో అలంకరించి ఉన్న ముఖ్య భవనాన్ని, పక్కనే ఉన్న అతి సుందరమైన గుమ్మటాన్ని, ఆ పక్కనే ఉన్న కోదండరాముని విగ్రహాన్ని… ఫోటోలే ఫోటోలు! లోపలికివెళ్ళి చూడలేకపోతున్నందుకు కలిగిన విచారాన్ని కనీసం ఈ మాత్రమైనా ఆ ప్రాంగణంతో సావాసం చెయ్యగలిగాను గదా అన్న సంతృప్తి జయించింది.

మళ్ళా రోడ్డు పట్టుకొని నడక సాగించాను.

నాలుగడుగులు వెయ్యగానే ఒక చిన్నపాటి అందమైన బౌద్ధమందిరం కనిపించి నన్ను నిలువరించింది. వాట్‌మహథట్ యువాంట్ రంగ్ సరిత్ అన్నది ఆ ఆలయం పేరు. రాజవంశీకులు తరచూ దర్శించే మందిరమట. కాస్తంత దూరాన కనీకనిపించని ఛోప్రయా నది. బౌద్ధ విగ్రహాలు, విశాలమైన ధ్యాన మందిరం, ప్రశాంత వాతావరణం, టూరిస్టుల తాకిడి లేనేలేని ప్రదేశం–అచ్చమైన ధ్యానమందిరానికి అతి చక్కని ప్రతీక అనిపించింది. ఆ భవన నిర్మాణరీతిలో అయుత్తయ్యలో చూసిన పోకడలు కనిపించాయి.

ఆలయం బయట నాలుగయిదు పెద్దపెద్ద చెట్లు. వాటి నీడన చేరి లోగొంతుకలతో కబుర్లు చెప్పుకొంటోన్న స్థానికులు, సాగుతోన్న చిరువ్యాపారాలు, వాటిని నడుపుకొంటోన్న బడుగుజీవులు. పక్కనున్న పట్టాభిషేకపు కోలాహలాలూ ఉత్తేజాలూ ఏమాత్రం సోకని విభిన్న అతి సామాన్య ప్రశాంత వాతావరణం. ఏభై-వంద మీటర్ల దూరంలోనే భిన్న భిన్న ప్రపంచాలు కనిపిస్తున్నాయిగదా అనిపించింది. వింతగా అనిపించింది. మళ్ళా ఇందులో వింతేముందీ? ఏకఖండంగా కనిపించే ఈ ప్రపంచం వందలాది భిన్న భిన్న ప్రయోజనాలున్న ప్రపంచాల సమాహారం కదా అన్న స్ఫురణ… ఒకరిద్దరు స్థానికులతో ముచ్చట్లు, చిరు కొనుగోళ్ళు. ఒక యువ విద్యార్థి జంట. వాళ్ళకు ఫోటోలు తీసిపెట్టడం.

ఆ మందిరానికి బాగా ముందుభాగంలోనే మెయిన్‌రోడ్డు నుంచి కనబడేలా ఎవరో పెద్దాయన విగ్రహముంది. పంచెకట్టు, వదులుపాటి పైబట్టలు, నడుముకు గట్టిగా కట్టిన కండువాలాంటి వస్త్రం–మన ఈ మధ్యకాలపు వస్త్రధారణకు బాగా దగ్గరగా ఉన్న ఆహార్యమతనిది. ఎవరతనూ? చేతిలో నేలకు సమాంతరంగా పట్టుకొని ఉన్నది ఆయుధమా, మతధర్మాలకు చెందిన రాతల పత్రమా? ఎవరా మహానుభావుడూ? ఏమిటతని కథా? విగ్రహం ముందు వివరాలున్న ఫలకం ఉందిగానీ అదంతా థాయ్ భాష! ఆ వివరాలకోసం ప్రయత్నిస్తే ఎవరూ సరిగ్గా చెప్పలేకపోయారు. చివరికి అతడు యోధుడో, మతాచార్యుడో తెలుసుకోకుండానే అక్కడ్నించి బయటపడ్డాను. ఆయనే స్వయంగా కలలోకి వచ్చి తన కథ చెపుతాడన్న వింత ఊహ! నవ్వొచ్చింది.

పదీపదిహేను అడుగులు వెయ్యగానే పక్కనే ఓ సువిశాల భవనం. ముందున్న ఆంగ్ల ఫలకంలోని వివరాలు చదివితే అది వందేళ్ళ క్రితం కట్టిన గ్రంథాలయమని తెలిసింది. విజిర ఉథ్ రాయల్ లైబ్రరీ అన్నది దాని అసలు పేరు. మొన్నమొన్నటిదాకా ఎప్పటెప్పటివో తాళపత్ర గ్రంథాలు, పురాతన పుస్తకాలూ అక్కడే ఉండేవట. ఇపుడు వాటిల్ని నేను చూడబోతోన్న గ్రాండ్ పాలెస్‌లోకి తరలించారట. ఇపుడీ గ్రంథాలయం అచ్చుపుస్తకాలకూ, వార్తాపత్రికలకూ మాత్రమే పరిమితమయిందట.


కనుచూపుమేరలో గ్రాండ్ పాలెస్.

దగ్గరకు వెళితే ఏకాగ్రతతో దానికేసి సాగిపోతోన్న జనసందోహం. అప్పటికి నాలుగయిదు రోజులుగా సామాన్యులకు అందుబాటులో లేకపోవడంవల్ల కాబోలు, వందలకొద్దీ పర్యాటకులు.

టికెట్ కౌంటరుకేసి వెళుతోంటే తెలుగు తెలిసిన గైడొకాయన ఎంతో మర్యాదగా పలకరించాడు. మాతృభాష తమిళమట. గైడు రుసుము పదిహేను వందల బాథ్‌లు అన్నాడు. అది నాకు అందుబాటులో లేని ఖర్చు అని మర్యాదగా తిరస్కరించాను.

కౌంటరు దగ్గర చూస్తే ప్రవేశ రుసుము మహా భారీగా కనిపించింది. విదేశీ పర్యాటకుల సౌకర్యార్థం డాలర్లను బాథ్‌లలోకి మార్చి రుసుము నిర్ణయించినట్టనిపించింది. మనసు ‘వామ్మో’ అంటూ వాపోబోయింది. ‘ఆ భావన రానీయక. ప్రాంగణపు విలక్షణతల మీదే దృష్టిపెట్టు.’ వివేకం హెచ్చరించింది.

సువిశాల ప్రాంగణంలో 1782లో రామ-1 పూనికతో కట్టబడిన మినీ నగరమది. అప్పటిదాకా ఆ రాజసౌధాలూ, ముఖ్య కార్యాలయాలూ చోప్రయా నదికి అవతలిపక్క ఉండేవట. అక్కడ స్థలం చాలటం లేదనీ, సౌకర్యవంతంగా లేదనీ భావించిన రామ-1 ఏకమొత్తంగా నగరం నగరమే నిర్మించి అందర్నీ అన్నిటినీ తరలించాడట. ఆరువందల ఎకరాల సువిశాల నగరం, వాటికన్ సిటీతో పోలిస్తే సగానికి సగం. చుట్టుకొలత సుమారు రెండు కిలోమీటర్లు.

నగరం ప్రధానంగా రెండు విభాగాలుగా ఉంది. రాజసౌధాలు, అతి ముఖ్యమైన రాజదర్బారులు, కార్యాలయాలూ ఉన్నది ఒక భాగం. రాజవంశీకుల సొంత ఆలయం–ఎమరాల్డ్ బుద్ధా ఆలయం–దాని చుట్టూ అనుబంధ మందిరాలూ బౌద్ధ కట్టడాలూ ఉన్నది రెండో విభాగం. ఈ రెండు విభాగాలనూ కలగలపి వాడుక భాషలో గ్రాండ్ పాలెస్ అని వ్యవహరిస్తున్నారు.

ముందుగా పర్యాటకులమంతా ఆ ఎమరాల్డ్ బుద్ధా విభాగంలో అడుగుపెట్టాం. కళ్ళు చెదిరాయి. బంగారు రంగు ధగధగల భవన సమూహం. కట్టి రెండున్నర శతాబ్దాలు అయినా నిన్ననే కట్టారా అన్నంత కళగా సుందరంగా దృఢంగా ఉన్న భవనాలు. అతి చక్కని భవన నిర్వహణ, పరిశుభ్రత, శ్రద్ధ నిండిన ప్రాంగణం. డజన్లకొద్దీ పర్యాటకులు సందడి చేస్తోన్నా ఈషణ్మాత్రం గందరగోళం లేని ప్రాంగణ నిర్వహణ. వాహ్‌రెవాహ్ అనిపించింది. ‘ప్రాంగణములలోకెల్ల ఏ ప్రాంగణము మేలు?’ అని చిన్నప్పటి పాఠాల్లోలా ఎవరైనా అడిగితే ‘రామరాజులు నివసించు ఈ ఘనసౌధమే మేలు!’ అని జవాబివ్వాలన్నంత ఉత్సాహం కలిగింది.

ఆ భవనాలు చూసి చూసి కళ్ళు చెదరడం తగ్గిన తర్వాత మెల్లగా పరిసరాలను పరీక్షించాను. పక్కనే ఉన్న కౌంటర్లో దొరుకుతోన్న సమాచారపు బ్రోషర్ అందిపుచ్చుకున్నాను. మెల్లగా ఆ సవివరపు బ్రోషరును అధ్యయనం చేశాను. వివరాలు ఒంటబట్టించుకొన్నాను. భవనాలను ఒకటొకటిగా గుర్తుపట్టసాగాను. ముఖ్య రాజసౌధం చేరువలో ఉన్న ఫరామహామోంటియన్ భవన సముదాయమూ మళ్ళా అందులోని అమరేంద్ర(!) విన్‌ట్చాయ్ హాలూ మొట్టమొదట నిర్మించిన కట్టడాలని గ్రహించాను. రాజ ప్రముఖుల్నీ, ముఖ్య అధికారుల్నీ, విదేశీ రాయబారుల్నీ రాజుగారు ఈ హాల్లోనే కలుసుకొంటారని తెలుసుకొన్నాను. ఆ రాజుల పట్టాభిషేకాలకూ, జన్మదిన వినోదాలకూ ఈ హాలే ఆలవాలమనీ తెలిసింది. అలాంటి ముప్పై అయిదు భవనాలూ కట్టడాల అతి చక్కని వివరాలు బ్రోషర్లో కనిపించాయి. ఆ పరిజ్ఞానం సాయంతో ముందుకు సాగాను.

కానీ నాలుగు అడుగులు వెయ్యగానే అక్కడి అధికారులే నిర్వహిస్తోన్న కండెక్టెడ్ టూర్ కనిపించింది. మరో అరడజను మంది దేశదేశాల పర్యాటకులతో పాటు ఆ టూర్లో చేరిపోయాను. మా గైడమ్మ వచ్చి పరిచయం చేసుకొంది. నడివయసు మహిళేగానీ కుర్రకారు చురుకుదనం, మార్గదర్శక అభిలాష!

ముందుగా కంటికి నదరుగా కనిపిస్తోన్న స్వర్ణ వర్ణపు స్థూపం దగ్గరకు వెళ్ళాం. వృత్తాకారం పీఠం మీద గంట ఆకృతిలో నిలచి ఆకాశంలోకి సూటిగా దూసుకుపోతోన్న కట్టడమది. శ్రీలంక వాస్తురీతిలో దాన్ని నిర్మించారట. బుద్ధుడికి చెందిన అవశేషాలు ఆ స్థూపంలో నిక్షిప్తమై ఉన్నాయట. దాని వివరణ వింటూ, చదువుతూ ఓ పది నిమిషాలు.

ఆ స్థూపానికి పక్కనే ఉన్న ఫరా మండోస్ అన్న అతి విలక్షణ భవనం చూపించి ‘ఇది బౌద్ధ గ్రంథాలు నిక్షిప్తమై ఉన్న గ్రంథాలయం. 1789లో రామ-1 ఎంతో భక్తిశ్రద్ధలతో నిర్మించిన అతిసుందర భవనమిది. ఆ తలుపుల మీద ఉన్న యక్షులూ. నాగుల ముఖాలు చూడండి… వాటిలో నిక్షిప్తం చేసిన ముత్యాలసరాలు చూడండి. నాలుగుమూలలా నిలబెట్టిన పద్నాలుగో శతాబ్దం నాటి బుద్ధ ప్రతిమలు చూడండి.’ చక్కగా వివరించింది గైడు.

స్వర్ణ స్థూపం చేరువలోనే ఉన్న అంకోర్‌వాట్ దేవాలయపు నమూనా వేపు మా దృష్టిని మళ్ళించిందావిడ. ‘అసలు దేవాలయం ఇక్కడికి నాలుగు వందల కిలోమీటర్ల దూరాన కంబోడియా దేశంలో ఉంది. పన్నెండో శతాబ్దపు నిర్మాణమది. వెయ్యి మీటర్ల పొడవూ, ఎనిమిది వందల మీటర్ల వెడల్పూ ఉన్న ప్రాంగణంలో కట్టిన విష్ణు ఆలయమది. అందులోని సూక్ష్మ వివరాలను చూపించే ఈ నమూనాను రామ-4 ఇక్కడ నిర్మించారు.’ అన్నది ఆవిడ వివరణ.

ఆ రాజసౌధపు అనుబంధ మందిరాలు బౌద్ధానికి చెందినవే అయినా ఆ ఆవరణలో నిండుగా హిందూమత ప్రతీకలు… గరుడ శిల్పాలు, రాక్షస రూపాలు, వానర భటులు, యక్షగంధర్వులు. అన్నట్టు వీటిలో కొన్ని బౌద్ధానికీ చేరువే కదా…

మా తదుపరి మజిలీ ఆ ప్రాంగణపు మంటపాలలో ఉన్న రామాయణ కుడ్యచిత్రమాలికలు. రామాయణంలోని ముఖ్య ఘట్టాలను నూట ఎనభై విభాగాలుగా చిత్రించి ఆ గోడల్లో నిక్షిప్తం చేశారట. ఆ కుడ్య చిత్రమాలికలను గురించి మా గైడు వివరించడం మొదలెట్టగానే అపశ్రుతులు జలజలా కురిశాయి. దశకంఠుడిని తొసకంఠ అంటోంది. సీతను సీద అంటోంది. ఆపుకోలేకపోయాను. సవరించడం మొదలెట్టాను. ఆయా ఘట్టాలలోని కొన్నికొన్ని ముఖ్యమైన వివరాలను ఆవిడ చెప్తోన్న విశేషాలకు జోడించసాగాను. నాది అసందర్భమైన అధిక ప్రసంగమేగానీ మా గైడమ్మా, ఇతర పర్యాటకులూ ముచ్చటపడి ‘చెప్పు చెప్పు’ అని ప్రొత్సహించారు. ఆ రామాయణ చిత్ర మాలికలను చూడటం ముగిసేదాకా నేనే డి ఫాక్టొ గైడును అయ్యాను. తర్వాత పరిశీలిస్తే ఆవిడ ఉచ్చారణలో తప్పేమీ లేదనీ, థాయ్ భాషలో ఆయా పేర్లను అలానే ఉచ్చరిస్తారనీ, అసలు రామాయణాన్నే వాళ్ళు రామాకిన్ అంటారనీ, ఆ ఇతిహాసం వాళ్ళ జాతీయ గ్రంథమనీ తెలియవచ్చింది. నా అత్యుత్సాహం గుర్తొచ్చి కించిత్తు సిగ్గు…

ఆ ప్రాంగణానికి కేంద్రబిందువయిన ఎమరాల్డ్ బుద్ధ ఆలయం వేపుకు దారి తీసింది మా గైడమ్మ. 1782లో నిర్మించిన మరకత బుద్ధ మందిరమది. బయటి మండువా మార్గంలో ఆరు జతల రాక్షస రక్షక భటులు. బుద్ధుడిని దుష్టశక్తులనుంచి కాపాడటానికి నిలబెట్టిన భటబృందమట! భగవంతునికి ఆ భటబృంద రక్షణ కావాలా అని క్షణకాలం అనిపించి పెదాల మీద నవ్వు విరిసినా, ‘అది రక్షణ కోసం కాదు, మహాయాన బుద్ధుని ఘనగౌరవాల కోసం’ అన్న విషయం స్ఫురించి తమాయించుకొన్నాను.

లోపల ఉన్న బుద్ధ విగ్రహం అంతా కలసి రెండడుగుల ఎత్తు. పదులూ వందల అడుగుల విగ్రహాలు చూడడానికి అలవాటుపడిన కళ్ళకు ‘అయ్యో, ఈ మరకత విగ్రహం ఇంత చిన్నగా ఉందేమిటీ!’ అనిపించకపోలేదు. ఆ విగ్రహాన్ని 1464లో కనుగొన్నారనీ, వివిధ రాజులూ దేశాల చేతులు మారి చివరికి 1778లో రామ-1కు దక్కిందనీ గైడమ్మ వివరణ. అన్నట్టు ఆ విగ్రహానికి వేసవికీ, వర్షాకాలానికీ, శీతాకాలానికీ వేరువేరు వస్త్రాలున్నాయట. అవన్నీ బంగారమూ, ఆభరణాలతో చేసిన వస్త్రాలు. ఆయాకాలాలకు అనుగుణంగా ఏడాదికి మూడుసార్లు రాజుగారు చక్కని ఉత్సవం జరిపి విగ్రహపు వస్త్రాలు మారుస్తారట.

మందిర దర్శనం ముగియగానే ‘ఇహ ఇక్కడితో నా పని ముగిసింది. అదిగో ఆ ద్వారంలోంచి వెళితే రాజసౌధాల విభాగం వస్తుంది. అటుకెళ్ళి అది చూసి మీరు నిష్క్రమణం మార్గం పట్టవచ్చు’ అని చెప్పింది గైడమ్మ. టిప్ ఇచ్చే ప్రయత్నం చేస్తే వద్దేవద్దంది. అది పద్ధతి కాదంది. పైగా తనకు అంతగా వివరాలతో సహాయం చేసినందుకు నాకే కృతజ్ఞతలు చెప్పింది. ఒక కరచాలనం, కౌగిలింత, వీడ్కోలు!

రాజసౌధ విభాగంకేసి నడుస్తోంటే ఒక శిలావేదిక మీద విపరీత భంగిమలో బానపొట్టతో కూర్చుని ఉన్న పెద్దమనిషి పలకరించాడు. వివరాలు పరిశీలిస్తే ఆయన పేరు ఛీవోక్ కుమర ఫట్ అని తెలిసింది. పురాతన థాయ్ మూలికావైద్య పితామహుడట. మనకూ ఉన్నారు కదా చరకుడూ, శుశృతుడూ… ఆయన శిలావిగ్రహంలో మూలికలు నూరే కల్వమూ చేరి ఉండటం మరో చిరువిశేషం.

ప్రాంగణంలో ప్రవేశించినపుడు ఒక పక్కగా చైనా రూపురేఖలు ఉన్న ఒక పెద్దాయన విలక్షణ విగ్రహం కనిపించింది. థాయ్‌లాండ్‌లో చక్రి రాజవంశ పాలన సమయంలో చైనా దేశంతో వ్యాపార సత్సంబంధాలు ఉండేవట. ఆ సమయంలో, బహుశా సుహృద్భావ సూచికలుగా ఇక్కడికి చేరిన అక్కడి విగ్రహమది. ముందుకు వెళితే మరికొన్ని కనిపించాయి.

రాజసౌధ ప్రాంగణంలో అనేకానేక విలక్షణ సౌధాలున్నాయని మా బ్రోషరు చెపుతోంది గానీ వాటిల్లోకి తొంగిచూసి ఆనందించి ప్రశంసించే అవకాశం సామాన్య పర్యాటకులకు లేనేలేదు. బయటనుంచే చూస్తూ సాగిపోవాలి. అంతే. ముఖ్య రాజప్రాసాదం దిగువున యూరోపియన్ శైలిలోనూ, పైభాగంలో స్థానిక శైలిలోనూ కనిపించి కుతూహలం రేకెత్తించింది. బ్రోషరులోని వివరాల్లోకి వెళితే ఆ భవన రూపకల్పన 1877లో జరిగిందని, బ్రిటిష్ వాస్తుశిల్పి జాన్ క్లూనిష్ అన్న మహానుభావుడు ఈ ప్రాక్పశ్చిమ వాస్తురీతుల సమ్మేళనం జరిపారనీ, అది మూడంతస్తుల భవనమని, అతి విశాలమైన బాంక్వెట్ హాలు అందులో ఉందనీ… వివరాలే వివరాలు.

ఆ భవనాన్ని చూస్తోన్న సమయంలో ఒక ఆఫ్రికన్ మహిళ కళ్ళముందు కనిపించారు. అక్కడున్న వందలాది పర్యాటకుల్లో ఆఫ్రికన్ మూలాలకు చెందిన ఒకే ఒక వ్యక్తి ఆమె. సహజ కుతూహలం. రెండుమూడుసార్లు కళ్ళు కళ్ళు కలిశాక చొరవచేసి పలకరించాను. కుశలమడిగాను. వివరాల్లోకి భారతీయ సహజ కుతూహలంతో ప్రవేశించాను. ఏమాత్రమూ విసుగు చూపించకుండా మాటల్లో పడ్డారావిడ. నైజీరియాలో పుట్టిపెరిగారట. పదిహేనేళ్ళ క్రితం కుటుంబం కుటుంబమంతా అమెరికాకు శరణార్థులుగా వెళ్ళారట. పౌరసత్వం, పట్టభద్రత, ఉద్యోగం… ఇప్పుడు ఫిలిప్పీన్స్‌లో రిసెర్చ్ చేయడానికి వచ్చారట. ఏడాదిగా ఆ దేశంలో నివాసం. తూర్పు దేశాల గురించి కాస్తంత తెలుసుకొందామన్న జిజ్ఞాసతో వారం రోజులపాటు తిరగడానికి థాయ్‌లాండ్ వచ్చారట. అన్నట్టు సోషియాలజీ ఆమె అధ్యయన విషయం.

మాటలు విరివిగా సాగాయి. చర్చ ప్రపంచం చుట్టూ తిరిగి తిరిగి ట్రంప్ దగ్గరకు చేరింది. వర్ణ వివక్ష, జాత్యహంకారం, మత అసహనాలు, దేశాల మధ్య విబేధాలూ ఘర్షణలూ, ఇరాన్-ఇరాక్, సిరియా సౌదీ అరేబియా… గలగలా కబుర్లు. చిత్తశుద్ధీ, ఆత్మనిష్టా కలగలసిన కలవరపాట్లు… ‘పదండి, ఆ పక్కన కెఫెటేరియా కనిపిస్తోంది. కాఫీ తాగుదాం,’ అంటూ దారితీశాను.

“ఆ కుడ్యచిత్రాలు చూశాను. చివరిలో అగ్నిప్రవేశం అన్నమాట విన్నాను. ఆందోళన కలిగింది. ఆ ఆలోచన ఇంకా వెంటాడుతోంది. ఆ ఇతిహాసం, ఆ అగ్నిప్రవేశ ఘట్టం మరికాస్త వివరాలు చెప్పగలరా?” అడిగిందావిడ.

వీలయినంత సరళంగా చెప్పుకొచ్చాను. రాముని పితృభక్తీ (బాధ్యత విస్మరించి అడవులకు వెళ్ళిపోవడం ఏమిటీ?), లక్ష్మణుని భాతృభక్తీ (భార్యను వదిలి అన్నవెంట వెళ్ళడం ఏమిటీ?), సీతమ్మవారి అగ్నిప్రవేశం గురించీ (ఎంత భర్త అయినా దూకమంటే నిప్పుల్లో దూకడమేనా?!) ఆవిడ ప్రశ్నలే ప్రశ్నలు.

“ఏ కాలపు ఏ దేశపు సాహిత్యమయినా, అది రామాయణమో ఆడెస్సీనో అయినా, భగవంతుని పురాణమూ, ఇతిహాసమే అయినా, ఆ సాహిత్యంలో ఆనాటి దేశకాలమాన పరిస్థితులు ప్రతిబింబించడం, అప్పటి విలువలూ సాంఘిక పరిస్థితులూ, సామాజిక అవసరాలకు ఆయా రచనలు అద్దంపట్టడం అతి సహజం. నిజానికి ఆ అవసరాలకు ఆయా సాహిత్యాలు ప్రతీకలు. అవసరాలు తీర్చే వాహికలు. పితృభక్తి, భాతృభక్తి, ఏకపత్నీ వ్రతం, పతివ్రతా ధర్మం అప్పటి అవసరాలు. రామాయణంలో ఆయా విషయాలకూ, విలువలకూ చోటు ఉండటంలో ఆశ్చర్యం లేదు. కానీ అప్పటి విలువల్ని ఇప్పుడు కూడా పాటించాలనుకోవడం, రాజధర్మం కోసం శంభూక వధలు జరగడం నిజమైన విషాదం.” అని నాదైన వ్యాఖ్య చేశాను. సమాధానపడినట్టే అనిపించిందామె.

ఆ పక్కనే సిరికిత్ మహరాణి ఇటీవలే నెలకొల్పిన టెక్స్‌టైల్ మ్యూజియం ఉంది. ‘శతాబ్దాలుగా థాయ్‌లాండ్ దేశంలో వస్త్రధారణలో జరిగిన మార్పుల్ని ఒడిసిపట్టుకొని ముందు తరాలకు అందించాలని ఆవిడ పడ్డ తాపత్రయానికి ఫలితంగా పుట్టిన చక్కని సంగ్రహాలయమది’ అని అక్కడి వివరాలు చెపుతోన్నా ఇంకా చూసి చూసి మెదడుకు శ్రమ కలిగించడం ఇష్టంలేక అక్కడ్నించి బయటపడ్డాను. పడేముందు అక్కడున్న భటునితో ఫోటో తీసుకోమని నాలోని బాలుడు చెప్పగా మరో సహపర్యాటకుని సాయంతో ఆ ముచ్చటా తీర్చుకున్నాను.

ఆ పక్కనే కిలోమీటరు దూరాన పవళిస్తోన్న బుద్ధుని మందిరం ఉందనీ తప్పక చూడవలసిన ప్రదేశమనీ సత్యజిత్ చెప్పారు. అటు నడక సాగించాను. ఎండ ముదిరింది. కానీ చక్కని రాజవీధి, పక్కనే కనిపించీ కనిపించని ఛోప్రయా నది, హఠాత్తుగా ఊడిపడ్డ ఓ తెలుగు పర్యాటక బృందం, వారితో కాసేపు కబుర్లూ నడకా… అలసట తెలియకుండానే ఆ మందిర ప్రాగణం. వాట్ ఫరా చెటుఫన్ అన్నది ఆ మందిరపు అధికార నామం.

నూట ఏభై అడుగుల అతి బృహత్తర విగ్రహమది. అయుత్తయ్యలో ఆరుబయట మిగిలిపోయిన విగ్రహంతో పోల్చదగిన పరిమాణం ఈ విగ్రహానిది. కానీ అది పై కప్పు లేకుండా దీనావస్థలో ఉంటే ఇది మహా విలాసంగా సువర్ణ కాంతులు చిమ్ముతూ ఉంది. గబుక్కున ఉండవల్లిలోని పవళిస్తోన్న విష్ణు విగ్రహం గుర్తొచ్చింది. అదీ ఒకప్పటి బుద్ధ విగ్రహమే కదా.

నగర విహారం ముగించి ఇంటికి చేరేసరికి మధ్యాహ్నం గడచిపోయింది. నకనకలాడే కడుపుకు కల్యాణీ సత్యజిత్‌ల స్నేహవచనాలూ, అందించిన భోజనమూ ఉపశమనం. ఆ తర్వాత గంటన్నరా రెండు గంటలు ఒళ్ళు తెలియని నిద్ర!

నిద్ర లేచేసరికి ఆతిథేయ దంపతుల పలకరింపు. “అలసట తీరిందా? ఊర్లో బాగా తిరగాలన్న కోరిక తీరిందా?”

“అలసట తీరినమాట నిజం. తిరగాలన్న కోరికా… అది తీరే కోరిక కాదు. నిజానికది తీరగూడని కోరిక.” నా జవాబు.

వెలుగులు ముగిసి చిరుచీకట్లు కమ్ముకొంటోన్న వేళ. దిగువున ఉన్న విశాల సరోవరం తళతళా మెరవడం గడచిపోయి మృదువైన రంగులు సంతరించుకొంటోన్న వేళ. దిగువున ఉన్న రహదారిమీద కారుల బారుల టెయిల్ లేంప్స్ ఎర్రెర్రగా మెరవడం మొదలెట్టిన వేళ. మరోసారి బాల్కనీలో ఓ పెద్ద కప్పు నిండా కాఫీ.

“ఎయిర్‌పోర్ట్‌లో మీకో చక్కని కళాకృతి కనిపిస్తుంది గమనించండి. క్షీరసాగర మథనం దృశ్యాన్ని ఎంతో అందంగా శిల్పీకరించారక్కడ.” చెప్పారు సత్యజిత్. నా తిరుగు విమానం తెల్లవారుఝామున నాలుగింటికి. అర్ధరాత్రి లేవడమూ, అందర్నీ లేపడమూ, అప్పుడు వీడ్కోళ్ళూ అప్పగింతలూ–ఆ హడావుడి లేకుండా వీలయినంత త్వరగా ఇల్లు వదిలి, ఎయిర్‌పోర్టు చేరి అక్కడే ఆ రాత్రిపూట గడపాలన్నది నా అభిమతం. దాన్ని వీలయినంత ముందుకు జరిపి పదిన్నర ప్రాంతంలో కల్యాణి, సత్యజిత్, మధుర, అశోక్ స్టేషను దాకా తోడుగా వచ్చి బైబైలు చెప్పారు. మరో ఒకటిరెండు నెలల్లో తప్పకుండా కలుసుకొనే అవకాశం ఉందిగాబట్టి పెద్దగా బెంగలూ దిగుళ్ళూ ఎవరికీ లేవు!


చకచకా సరదాగా రెండు రైళ్ళు మారి సువర్ణ భూమి విమానాశ్రయం చేరుకొనేసరికి దాదాపు పన్నెండు. నిద్రపోవడాలూ, గంటలు లెక్కపెట్టుకోవడాలూ, ఎంతకీ నాలుగవదేం అన్న విచారాలూ దగ్గరకురావు గాబట్టి ఉన్న నాలుగు గంటలూ ఎయిర్‌పోర్టునూ, భిన్న విభిన్నమైన వ్యక్తులనూ చూస్తూ గడపాలనీ, వీలయితే కబుర్లాడాలనీ నా ప్రణాళిక.

ముందుగా క్షీరసాగర మథనం కోసం చూశాను. ఎయిర్‌పోర్ట్‌లోకి ప్రవేశించగానే కనబడిందా శిల్ప మాలిక. ఊహించినదానికన్నా ఎంతో బావుంది.

పద్నాలుగేళ్ళ క్రితం జకార్తా సిటీ సెంటర్లో చూసిన గీతోపదేశం శిల్పం గుర్తొచ్చింది. తొమ్మిదిమంది సురులు తోక భాగాన్ని పట్టుకొని, మరో తొమ్మిదిమంది అసురులు తల భాగాన్ని పట్టుకొని మంధర పర్వతాన్ని కవ్వంగా చేసుకొని పాల సముద్రాన్ని మథిస్తోన్న దృశ్యం. పైన పర్వత అగ్రం మీద సుదర్శనం, శంఖం, త్రిశూలం, ఖడ్గం ధరించిన నాట్య భంగిమలో ఉన్న విష్ణువు. దిగువున మంధర పర్వతానికి ఆధారపీఠంగా మహాకచ్చపం. చూడగానే కళ్ళనూ మనసునూ ఆకట్టుకొని కలకాలం జ్ఞాపకాల్లో నిలచి ఉండే శిల్పమాలిక అది. అరగంట చూసినా తనివితీరలేదు. దాన్ని రూపొందించిన శిల్పులెవరో ఆ వివరాలు చూద్దామన్న ఆలోచనే తట్టనంతగా ఆ శిల్పంలో మునిగిపోయాను!

ఇమ్మిగ్రేషనూ, సెక్యూరిటీ చెక్ లాంటి పనులన్నీ ముగించుకొని మా ఢిల్లీ విమానం బయలుదేరే గేటు దగ్గరికి చేరేసరికి దాదాపు ఒంటిగంటయింది. అంత అర్ధరాత్రి అవడం వల్ల గాబోలు ప్రయాణీకులు దాదాపు లేరు. అక్కడొకరు, ఇక్కడొకరు. విభిన్న విచిత్ర భంగిమల్లో శయనాసనాలు. ఒక బక్కపల్చటి మనిషి ఏదో చిన్న సాయం అడిగితే చేశాను. వెళ్ళి కూర్చుందేగానీ నాలాగే నిద్రపోయే ఆలోచనలో లేనట్టుంది. పక్కన చేరాను. పలకరించింది. ఫిలిప్పీన్స్ మనిషట. ఇంగ్లీషు పర్లేదు, బానే మాట్లాడింది.

కాసిన్ని డబ్బులు సంపాదిద్దామని ఫిలిప్పీన్స్ వదిలి అవకాశాలు వెదుక్కుంటూ థాయ్‌లాండ్ వచ్చిన మహిళ ఆమె. ఎవరో డబ్బున్న వాళ్ళింట్లో సహాయకురాలు. సరిగ్గా చూడని యజమానులు. తను పంపే డబ్బుల కోసం ఎదురుచూసే కుటుంబం. అంతులేని ఒంటరితనం, పన్నెండూ పద్నాలుగు గంటల రోజువారీ పని, బాధలూ దిగుళ్ళూ వ్యక్తపరచడానికి ఏ మనిషీ లేని పరాయి దేశం–అరగంటలోనే నాకు పరిచయం లేని జీవితాన్ని అసంకల్పితంగానే అతి సన్నిహితంగా చూపించిందామె. కువైట్ వెళ్ళిన సీమవాసులయినా, దుబాయ్ వెళ్ళిన మళయాళీలయినా, అప్పట్లో రంగం వెళ్ళిన శ్రీకాకుళంవాళ్ళయినా, బడుగు జీవులందరిదీ ఒకటే కథ. ఒకటే వ్యథ. ఆమె కష్టాలు, కలతలకు నా దగ్గర ఏ పరిష్కారమూ లేదని తెలుసుగానీ తాను చెప్పి భారం దించుకోవాలనుకొన్న అనేక విషయాలకు శ్రోతనయినందుకు సంతోషమే కలిగింది. సంతృప్తి మిగిలింది.


ఇంకా విమానం ఎక్కడానికి రెండు గంటల సమయముంది.

మధ్యాహ్నం నిద్రవల్లా, యాత్రా జ్ఞాపకాలు కలిగిస్తోన్న ఉత్తేజం వల్లా నిద్ర దగ్గరకు రావడమేలేదు. మెల్లగా ఆలోచనల్లో పడ్డాను.

ఒకరకమైన చిన్న చూపుతో, ఎంతో కొంత ఉదాసీనతతో వచ్చిన థాయ్‌లాండ్ దేశం, వారం పదిరోజులు గడిచేసరికల్లా నా మనసును జయించడమూ, నన్ను ఉత్తేజపరచడమూ తలచుకొంటే ఎంతో ఆశ్చర్యమనిపించింది. వచ్చిన మొదటి రోజు నుంచి చిట్టచివరి రోజుదాకా భాష రాకపోయినా సొంత ఊళ్ళో తిరిగినంత సరళంగా స్వేచ్ఛగా ఎలా తిరిగగలిగానా అనిపించింది.

నిజానికి నాకు థాయ్‌లాండ్ పరాయిదేశమనిపించలేదు.

అమెరికాలూ, ఆస్ట్రేలియాలూ, జర్మనీలూ తిరిగినపుడు తెలియకుండానే పరాయి దేశమన్న స్పృహ నావెంట ఉంటూవచ్చింది. సింగపూరు, ఇండోనేషియాలు వెళ్ళినపుడూ అవి విదేశాలనే అనుకొన్నాను. మరి ఈ థాయ్‌లాండ్‌లో ఎప్పుడూ లేనిది ఈ స్వదేశ భావన ఏమిటీ?

తరచి తరచి చూస్తే కారణాలు దొరికాయి. బౌద్ధం, రామాయణం, అడుగడుగునా వినిపించే భారతీయ మూలాల పేర్లు–సువర్ణభూమి, కాంచనబురి, అయుత్తయ్య, శ్యామనగరం సయాం, ఐరావతపు ఇరావన్ జలపాతం–అడుగడుగునా మన ‘భాషే’! గాఢతలేని భావనతో అవగాహనతో సంస్కృతీ సారూప్యం అన్న మాట వాడను కానీ దాని ఛాయలు నాకు పుష్కలంగా కనిపించాయని మాత్రం చెప్పగలను.

వ్యక్తిగతమైన కారణం మరి ఒకటి ఉంది. సరళ జీవనసరళి. పోటీలూ పరుగులూ లేని జీవితాన్ని వాళ్ళు ఇష్టపడతారని సత్యజిత్ వ్యాఖ్యానించిన దగ్గర్నించీ దాని ఆధారాలకోసం వెదికాను. దొరికాయి. నాకూ ఆ జీవనసరళి ఇష్టంగాబట్టి అదింకో కారణం. మొత్తానికి అన్ని కారణాలూ కలసి థాయ్‌లాండ్‌లో పరాయి ప్రాంతంలో ఉన్నాను అన్న భావన కలగలేదు.

పరాయి ప్రాంతం కాకపోయినా కనీసం కొత్త ప్రదేశం గదా, బెరుకూ వెరపూ కలగడం సహజంగదా. భాష రానిచోట అది మరికాస్త ఇబ్బంది కలిగిస్తుందిగదా. రోడ్డుమీద మనుషులూ, ఉబర్ చోదకులూ ఆట్టే మాటల్లో ఎలా పడిపోతున్నారూ?! ఆలోచిస్తే రెండు కారణాలు కనిపించాయి. స్వభావరీత్యా నేను దాదాపు అన్నిరకాల మనుషులతోనూ సులభంగా కలసిపోగలను, ఐడెంటిఫై అయిపోగలను. సమానుభూతి చెందగలను. నేనూ తమలాంటివాడినే అని వాళ్ళు గ్రహించిన మరుక్షణం–ముఖ్యంగా టాక్సీల్లో–మాటలు గలగలా సాగిపోతాయి. అది మొదటి కారణం కావాలి. రెండోది నాకంటూ అనవసరపు బెరుకులూ భయాలూ లేకపోవడం. బహుశా ఎన్నెన్నో కొత్త ప్రదేశాలూ దేశాల్లో మారుమూలల్లో కూడా తిరిగిన అనుభవం వల్ల నాకంటూ మనుషులంటే ఒక నమ్మకం ఏర్పడిపోయింది. కొత్త మనిషి కనిపించినపుడు కుతూహలమే తప్ప సంకోచాలూ భయాలూ కలగవు. అంచేత అలాంటి వ్యతిరేక భావనలు బాడీలాంగ్వేజ్‌లో కనిపించే అవకాశమే లేదు. ఎప్పుడైతే మనస్సూ, హావభావాలూ పరిసరాలతో కలసిపోయి సహజంగా సాగిపోతాయో అపుడు అవతలివాళ్ళకు కూడా మనమంటే ఒక సానుకూల అభిప్రాయం ఏర్పడిపోతుంది. అలా కాకుండా మన హావభావాల్లో ‘బెదురుగొడ్డుతనం’ కనిపిస్తే పరాయి ప్రాంతంవాళ్ళు అసంకల్పితంగానైనా ఆటపట్టించడమో, మోసాలు చెయ్యడమో జరిగే అవకాశం ఉంటుంది.

కొత్త ప్రదేశాలకు వెళ్ళినపుడు గైడ్లూ, టూరిస్టు బ్రోషర్లు భట్టీయం పట్టకపోయినా కనీసం గూగుల్‌ను సంప్రదించి ఆయా ప్రదేశాల మీద ఒక అవగాహన ఏర్పరచుకోవడం నా అలవాటు. థాయ్‌లాండ్ విషయంలో–ఉదాసీనతవల్లే అనుకొంటాను–ఆ పని చెయ్యలేదు. అది చివరికి గొప్ప మేలు చేసిందని క్రమక్రమంగా అర్థమయింది. అధ్యయనం చేసి వెళితే ఆ ప్రదేశం మీదా అక్కడి మనుషులూ సంస్కృతి మీదా ఒక పూర్వ (అర్ధ)నిర్ధారిత అభిప్రాయంతో వెళతాం. ఆ అభిప్రాయానికి అనుగుణంగానూ బలపరచేలానూ ఉండే వివరాలూ అనుభవాల కోసం తెలియకుండానే వెదుకుతాం. ఒక్క క్వాయ్ నది మీది వంతెన గురించి తప్ప థాయ్‌లాండ్‌లోని అయుత్తయ్యలూ, కాంచనబురిల గురించి ఏ మాత్రమూ తెలియకుండా తెలుసుకోకుండా వెళ్ళడం వల్ల అక్కడ కనిపించిన అన్ని వివరాలనూ, అన్ని అనుభవాలనూ ఏ మాత్రమూ కల్తీ లేకుండా మనసులో ఇంకించుకోగలిగాను. ఆయా ప్రదేశాలను స్వేచ్ఛగా ఆవిష్కరించుకోగలిగాను. ఒక యాత్రికుడిగా ఇది నాకొక కనువిప్పు. కొత్త దృష్టి కోణం అమర్చుకొన్నట్టనిపించింది.

ఒక యాత్రికునిగా ఏడెనిమిది రోజులు దేశంలో తిరిగి ఎన్నెన్నో వివరాలనూ, ఎంతెంతమందో మనుషులనూ ‘తెలుసుకొన్న’ మాట నిజమేగానీ సూక్ష్మమైన వివరాలు తెలిసినంతగా దేశపు స్థూలమైన వివరాలు గ్రహించలేకపోయాననే అనిపించింది. ఆర్థికంగా థాయ్‌లాండ్ దేశం ఆగ్నేయాసియాలో నాయక స్థానంలో ఉందని గూగుల్ చెపుతోంది. మరోవేపు ప్రపంచంలో ఈ దేశపు మసాజ్ ఎకానమీ అపఖ్యాతికి హేతువు. సంపన్నదేశమయినపుడు మరి ఆ మసాజ్ సంస్కృతి ఎందుకూ? అసలు దేశ సంపన్నతకు వెన్నెముక పరిశ్రమలా? వ్యవసాయమా? సృష్టించిన సంపద ప్రజల్లోకి చేరుతోందా లేకపోతే ప్రముఖుల కనుసన్నలలోనే మెలుగుతోందా? ముఖ్యమైన పంటలేమిటి? పరిశ్రమలేమిటి? ఇవన్నీ రిసెర్చి విద్యార్థిలాగా పరిశోధించనక్కరలేదు కానీ మరికాస్త పరిజ్ఞానం కోసం ప్రయత్నించి ఉండాల్సింది.

అలాగే రాజకీయ వ్యవస్థ… ఒక పక్క అచ్చమైన ‘రామ’ రాజరికం, మరోపక్క సైనికాధికారుల ఆధిపత్యం, ఇంకోపక్క ప్రజాస్వామ్యపు ఎన్నికలు… ఇందులో ఏది సత్యం? ఏదసత్యం? థాయ్‌లాండ్ రాజ్యపు ఆయువుపట్టు ఎక్కడ ఉంది? అధికార పీఠం గ్రాండ్ పాలెస్సా? మిలిటరీ హెడ్‌క్వార్టర్‌లా? కాస్త అర్థంచేసుకొనే ప్రయత్నం చేశానుగానీ విషయం ఏమాత్రం కొరుకుడు పడలేదు. అలాగే రాజవంశపు హిందూమతమూ, సామాన్య ప్రజల బౌద్ధమతమూ అంత సులువుగా చెట్టపట్టాల్ వేసుకొని ఎలా సహజీవనం చేస్తున్నాయీ?

బోలెడన్ని ఆలోచనలు. మరో రెండు మూడు వారాలు గడిపితే బావుండునన్న ఊహ. నచ్చిన దేశాన్ని వదిలివెళ్తున్నందుకు చిన్నపాటి బెంగ. మళ్ళా చూస్తే, మళ్ళీ ఢిల్లీ ఇంటికి మరో ఆరేడు గంటల్లో చేరబోతున్నానన్న ఉత్సాహం.

‘ప్రయాణీకులు విమానం ఎక్కవచ్చును’ అన్న బోర్డింగ్ ప్రకటన వినిపించింది.

పక్కనే సీమటపాకాయలు పేలినట్టు సహ ప్రయాణికులంతా గబగబా కళ్ళు తెరిచి చకచకా సామాన్లు అందిపుచ్చుకొని ఒలెంపిక్ వీరుల్లా క్యూకేసి వడివడి అడుగులు వెయ్యడం కనిపించింది. నవ్వొచ్చింది.

నింపాదిగా బ్యాక్‌ప్యాక్ అందుకొని బోర్డింగ్ క్యూ వేపు అడుగులు వేశాను.

(సమాప్తం)