చిన్నయ సూరి – గిడుగు రామమూర్తి 3

[మొదటి భాగం], [రెండవ భాగం]

మేము ఇంతకు పూర్వం రాసిన రెండు భాగాలలోని సమాచారం ఇంగ్లీషువాళ్ళు మన దేశానికి వచ్చి, దేశాన్ని దాదాపుగా ఆక్రమించుకుని పరిపాలన చేయడం మొదలుపెట్టిన తరవాత కాలానికే వర్తిస్తుంది. ఇంగ్లీషువాళ్ళు మన దేశానికి రాకముందు తెలుగు పరిస్థితి ఏమిటి, అది ఎలా వాడబడేది, రాయబడేది అనేదాన్ని గురించి మేము ఏమీ చర్చించలేదు. అంటే మేం రాసిన రెండు వ్యాసాలకి వెనకాతల ఇంగ్లీషు పాలకుల ప్రభావం ప్రత్యక్షంగానో, పరోక్షంగానో వున్నదన్నమాట. చిన్నయసూరి బాలవ్యాకరణం రాసినా, ఉదయగిరి శేషయ్య, తా. వెంకయ్య లాంటివాళ్ళు వాళ్ళ వ్యాకరణాలు రాసినా వీటి మీద ఇంగ్లీషు పరిపాలనా ప్రభావం వుంది. స్కూళ్ళల్లో తెలుగు చెప్పడంలో చెప్పించుకోవడంలో ఇంగ్లీషువాళ్ళు తిన్నగానో అడ్డంగానో ప్రవేశించారు.

ఇంగ్లీషువాళ్ళ పరిపాలనా కాలాన్ని మేము రెండు ముఖ్యమైన భాగాలుగా విభజించాం. ఒకటి: మెకాలేకి ముందు కాలం. రెండు: మెకాలేకి తరువాతి కాలం. మెకాలేకి ముందు కాలంలో ఇంగ్లీషు పాలకులు తెలుగువాళ్ళని తెలుగులోనే పాలించాలి అని పట్టుదలగా అనుకున్నారు. అందుకని వాళ్ళు, అంటే అప్పటి ఈస్ట్ ఇండియా కంపెనీలో పనిచేసే ఉద్యోగులు తెలుగు నేర్చుకోవడానికి తెలుగు పండితుల దగ్గరికి వెళ్ళారు. అంతకన్నా ముఖ్యంగా ఇంగ్లండులో వుండగానే అంతో ఇంతో తెలుగు నేర్చుకుని ఈస్ట్ ఇండియా కంపెనీలో ఉద్యోగం సంపాదించుకున్నారు. ఈ విషయం గతంలో బ్రౌన్ గురించి రాసిన వ్యాసంలో చెప్పాం. కాగా అంత పట్టుదలగా తెలుగు నేర్చుకోవాలని వచ్చిన ఇంగ్లీషువాళ్ళకి తెలుగు ఎలా నేర్పాలో మన పండితులకి తెలియలేదు. తెలుగు రెండవ భాషగా విదేశీయులకు నేర్పడం ఎలాగో మనకి అప్పటికీ, ఇప్పటికీ తెలియదు. తెలుగు పండితులు తమ దగ్గరికి వచ్చిన ఇంగ్లీషువాళ్ళకి నన్నయ భట్టీయం నేర్పారు. ఈ సంగతి వివరంగా పూర్వం మా వ్యాసంలో చెప్పాం. అది వాళ్ళకి పనికొచ్చే తెలుగు కాదని గ్రహించిన ఇంగ్లీషువాళ్ళు తమకి కావలసిన వ్యాకరణాలని తామే రాసుకున్నారనీ, తమకు కావలసిన నిఘంటువులని కూర్చుకున్నారనీ కూడా చెప్పాం. ఆ తరవాత ఇంగ్లీషువాళ్ళు పెట్టిన స్కూళ్ళలో ఎలాటి తెలుగు నేర్పాలి అన్న సమస్య మీదే తెలుగు మీద చర్చ అంతా జరిగిందని కూడా ఇంతకు ముందు చెప్పాం. ఆ సందర్భంలోనే గిడుగు, గురజాడ, జయంతి రామయ్యపంతులు గురించి కూడా చెప్పాం. అంతకు ముందే సామినేని ముద్దునరసింహం నాయుడు రాసిన ఆలోచనాపూర్వకమైన, అభివృద్ధికారకమైన హితసూచిని గురించి కూడా రాశాం. అది ఎలా మూలబడిపోయిందో చెప్పాం కూడా.

తరవాతి కాలంలో వచ్చిన పరిణామాలని ఈ మూడవ భాగంలో చర్చిస్తున్నాం.


ఇంగ్లీషు బళ్ళలో ఏ తెలుగు నేర్పాలన్న విషయంలో లాక్షణిక భాషావాదులకి, వ్యావహారిక భాషావాదులకి వచ్చిన వివాదాల ఫలితంగా చివరికి లాక్షణిక భాషావాదులే–వీళ్ళకే గ్రాంథిక భాషావాదులు అన్న పేరు స్థిరపడింది–గెలిచారు. ఈ సందర్భంలో అప్పట్లో స్కూలు పిల్లలకి ఏ పుస్తకాలు చెప్పేవారు, ఏ రకమైన భాష నేర్పేవారు అనే ప్రశ్న వేసుకోవడం అవసరం. ఈ సందర్భంగా అందరికీ వెంటనే జ్ఞాపకం వచ్చేది పెద్దబాలశిక్ష. ఈ పుస్తకం రకరకాల అవతారాలు ఎత్తి చాలాకాలం పాటు అచ్చవుతూ వచ్చింది. దీని మొదటి పేరు బాలశిక్ష అనే. దీని మొదటి ముద్రణ 1832లో[1]1832లో మొదటిగా అచ్చయిన బాలశిక్ష పుస్తకాన్ని మేము చూడలేదు కానీ 1856లో అచ్చయిన ప్రతి ఒకటి బ్రిటిష్ లైబ్రరీలో వుంది. ఆ పుస్తకం పీఠికలో చెప్పినట్లు మొదటి ముద్రణతో పోలిస్తే చాలా అదనపు సమాచారం జోడించారు. 1865 నాటికి పెద్దబాలశిక్షగా పేరు మారినట్లు తెలుస్తుంది. 1865లోనే బాలవివేక కల్పతరువు అన్న పేరుతో కూడా (పెద్ద)బాలశిక్ష అచ్చయ్యింది. ఏదో ఒక రూపంలో ఈ పుస్తకాన్ని చాలా సంవత్సరాల పాటు బళ్ళల్లో చేరిన పిల్లలకు పాఠాలు చెప్పడానికి వాడారు.

అయితే బడిలో చేరని పిల్లలు కూడా చాలామంది ఉండేవారు. మాకు అక్షరాలు నేర్చుకోవడం ఎందుకు, మేము కరణీకం పనులు చేయాలా, వ్యాపారాలు చేయాలా అనుకునే చిన్న కులాలవాళ్ళు, అందులో కొందరు బాగా పొలమున్న మోతుబరులు కూడా, పిల్లల్ని స్కూలుకి పంపేవారు కారు. పెద్ద కులాల్లో పెళ్ళిచూపుల్లో మా అమ్మాయి పెద్దబాలశిక్ష చదువుకుంది అని చెప్పేవారు. ఒక సొంత విషయం చెప్పాలంటే ఈ వ్యాసం రాస్తున్న మా యిద్దరిలో నారాయణరావు పెద్దబాలశిక్ష చదువుకునే స్కూలుకి వెళ్ళాడు. అతని మీద ఆ పుస్తకం ప్రభావం ఎంత ఎక్కువ అంటే అందులో కథలు, నీతులు, లెక్కలు, శ్లోకాలు, పద్యాలు ఇప్పటికీ అతనికి కంఠతా వచ్చు. ఉదాహరణకి పెద్దబాలశిక్షలో లెక్కలు చెప్పేటప్పుడు ఒక పద్యం వుండేది.

ఖర్జూర ఫలములు గణికుండు గొనితెచ్చి సగపాలు మోహంబు సతికి నిచ్చె
నందు నాలవ పాలు ననుగుతమ్మునకిచ్చె నష్టభాగంబిచ్చె నతనిసతికి
దగ తొమ్మిదోపాలు తనయున కిచ్చెను తనచేత నాల్గున్ను దల్లికిచ్చె
మొదట దెచ్చిన వెన్ని మోహంబు సతికెన్ని భ్రాత కెన్ని వాని భార్య కెన్ని

తనయుకెన్నియిచ్చె దడయకదల్లికి
నాలుగెట్టులాయె నయము తోడ
గణిత మెరిగినట్టి కరణాల బిలిపించి
యడుగవలయు దేవ యవసరముగ

అలాగే పిడుగు పడినప్పుడు పఠించవలసిన శ్లోకము:

అర్జునఃఫల్గునఃపార్థఃకిరీటీశ్వేతవాహనః
భీభత్సుర్విజయః కృష్ణస్సవ్యసాచీధనంజయః

మందు వేసుకునేటప్పుడు పద్యం:

శరీరే జర్ఝరీభూతేవ్యాధిగ్రస్తే కళేబరే
ఔషధం జాహ్నవీతోయం వైద్యోనారాయణో హరిః

ఇవన్నీ నారాయణరావుకి ఇప్పటికీ గుర్తున్నాయి. దాంతో పాటు పెద్దబాలశిక్షలో రకరకాల నీతి కథలు, నీతి వాక్యాలు, పురాణాల్లో వుండే షట్చక్రవర్తులు, అష్ట దిక్పాలకులు, వాళ్ళ భార్యల పేర్లు–ఈ వ్యవహారమంతా వుండేది. శచీదేవి అంటే ఎవరు? ఇంద్రుడి భార్య. స్వాహాదేవి అంటే ఎవరు? అగ్నిదేవుని భార్య. ఇలాటి సమాచారం వుండేది. ఉత్తరాలు ఎవరికి ఎలా రాయాలి? వైదికులైన బ్రాహ్మణులకు ఎలా రాయాలి; శూద్రులకు రాసేటప్పుడు ఎలా రాయాలి; శూద్రులకు బ్రాహ్మలు రాసేటప్పుడు ఎలా రాయాలి, లాంటి వివరాలు చాలా యెక్కువగా వుండేవి. ఈ పుస్తకంలో అర్జీలు రాసే పద్ధతి ఉండేది. కొద్దిగా ఛందస్సు కూడా ఉండేది. భూగోళశాస్త్ర విషయాలు, భారతదేశంలో ఇతర ప్రాంతాల పేర్లు ఉండేవి. చిట్టచివర ఒక స్తోత్రం, దండకంతో బాలశిక్ష పూర్తయ్యేది. మొత్తం మీద ఈ పుస్తకం పూర్తిగా చదువుకున్న పిల్లలకి తమ ప్రాంతంలో బతకడానికి అవసరమైన విద్యాబుద్ధులు నిండుగా దొరికేవి. ఈ పుస్తకంలో భాష అవసరాన్ని బట్టి మారుతూ వచ్చింది కాని చిన్నయసూరి చెప్పిన గ్రాంథికము, గిడుగు రామమూర్తి చెప్పిన వ్యావహారికము అనే మాటలు లేవు. మనకి అలవాటైన మాటల్లో చెప్పాలంటే రకరకాల గ్రాంథికాలు, రకరకాల వ్యావహారికాలు దీనిలో ఉండేవి. ఇది తెలుగుదేశంలో నిజమైన వ్యవహార భాష. ఈ భాష మాట్లాడుతూనే రాస్తూనే చదువుకున్నవాళ్ళందరూ పెరిగారు.

గురజాడ అన్నట్లు బ్రిటిషువాళ్ళు వచ్చి బడులు పెట్టిన తరువాతే గ్రాంథికం అన్న భాష, ఆ నియమాలు ఏర్పడాయి. ఇది 20వ శతాబ్దంలో వచ్చిన సమస్య.

క్రిస్టియన్లు తమ స్కూళ్ళల్లో పిల్లలకి పాఠాలు చెప్పడానికి కొన్ని రీడర్లు తయారు చేశారు[2] సుమారు 1851 నుండి విశాఖపట్నం కేంద్రంగా క్రిస్టియన్ మిషనరీలు తెలుగు పాఠ్యపుస్తకాలని, రీడర్లని, వొకాబులరీ పుస్తకాలని, వ్యాకరణ పుస్తకాలని చాలా విస్తృతంగా ప్రచురించారు. వీటిలో ఎక్కువ భాగం The Christian Vernacular Educational Society వారు ప్రచురించినవి..అందులోని భాష మొత్తం అంతా ఒకే శైలిలో ఉంటుంది. ఆ శైలి చదువుకున్నవాళ్ళు మాట్లాడేదానికి దగ్గరగా ఉంటుంది. వాక్యాలు తగినంత విరామాలతో అందంగా అచ్చు వేసిన పుస్తకాలివి. అందులోని విషయాల దగ్గరికొస్తే, పుస్తకాన్ని ఎంత జాగ్రత్తగా వాడాలో, పేజీల మీద చేతులు వేస్తే అవి మరకలు పడిపోకుండా ఎలా చూసుకోవాలో, చదవడం అయిపోయిన తరువాత పుస్తకాన్ని మూసి ఎలా జాగ్రత్తగా పెట్టుకోవాలో, ఇలాంటి విషయాలు మొదటి పాఠం. రెండవ పాఠంలో దేవుడిని గురించి. దేవుడు ఆకాశంలో ఉంటాడని, లోకానికంతటికీ ఆయనే కర్త అని, ఇలాంటి వాక్యాలు ఉంటాయి. తరవాత రాతి బొమ్మలలో దేవుడు ఉండడని ఆ రాళ్ళని పూజిస్తే అవి పలకవని, ఇంకో మాటలో చెప్పాలంటే విగ్రహారాధన తప్పని చెప్పే వాక్యాలు ఉంటాయి. మొత్తం మీద ఈ పుస్తకాలు అందంగా అచ్చు వేశారు. అక్షరాలు స్పష్టంగా ఉన్నాయి. భాషా శైలిలో చెప్పుకోతగ్గ ఏకత్వం ఉంది. వీటిలో కూడా లాక్షణిక భాష, గ్రామ్య భాష ఇలాంటి మాటలు లేవు. ఈ పుస్తకాల్లో ఇంతకుముందు చెప్పిన బాలశిక్షలో మల్లే లెక్కలు, ఉత్తరాలు రాసే పద్ధతులు, లౌకికమైన నీతి కథలు, పద్యాలు, శ్లోకాలు ఇలాంటివి ఏమీ లేవు. అంచేత ఈ పుస్తకాలు కేవలం క్రైస్తవ మత ప్రయోజనాలకి మాత్రమే పనికొచ్చాయి.

తరవాత కాలంలో వచ్చిన వ్యావహారిక భాషావాదంలో గిడుగు రామమూర్తిగారు బాలశిక్షలోనూ, క్రిస్టియన్ పుస్తకాల్లోనూ వున్న భాషా విశేషాలను పట్టించుకోలేదు. అంచేత భాషా విషయకమైన చర్చల్లో ఈ పుస్తకాలకి ఏ రకమైన ప్రాముఖ్యం లేకుండా పోయింది[3]గిడుగు వేంకటరామమూర్తి తన గద్యచింతామణిలో (1933) మిషనరీలు ప్రచురించిన బాలబోధ (1852) నుంచి, అలాగే పెద్దబాలశిక్ష నుంచి కొన్ని వాక్యాలను వ్యావహారిక భాషకి ఉదాహరణలుగా ఇచ్చారు..

ఇదిలా వుండగా ఒక పక్క ఇంగ్లీషు ముంచుకొస్తూ వుంటే, తెలుగు చదివితే మంచి ఉద్యోగాలు రావనే అభిప్రాయం బలపడుతూ వుంటే, తెలుగు తప్ప మిగతా ఆధునిక విషయాలన్నీ–చరిత్ర, భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రం, గణితం మొదలైనవన్నీ–ఇంగ్లీషులోనే చెప్తూ వుంటే, పై చదువుల్లో తెలుగు గూడుకట్టుకుపోయింది[4]భారతదేశంలో మదన్ మోహన మాలవీయ బెనారెస్ హిందూ యూనివర్సిటీని, సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ అలీగఢ్ ముస్లిమ్ యూనివర్సిటీని పెద్ద ఉత్సాహంతో స్థాపించినా చివరికి ఈ రెండు విశ్వవిద్యాలయాలలోను కూడా చరిత్ర, సాహిత్యము, రసాయనశాస్త్రము, భౌతికశాస్త్రము, ఇలాంటివన్నీ ఇంగ్లీషులోనే చెప్పేవారు. అందుచేత ఈ రెండు విశ్వవిద్యాలయాలు కూడా పైకి హిందూ, ముస్లిమ్ అని పేరు ఉన్నా అవి కేవలం పాశ్చాత్య విశ్వవిద్యాలయాలే. ఒక్క ఉస్మానియా విశ్వవిద్యాలయమే ఇంగ్లీషులో ఉన్న శాస్త్ర విషయాలని ఉర్దూలోకి తీసుకొచ్చి భారతీయ విజ్ఞానంలో దానిని భాగంగా చేసి ఉర్దూలోనే చెప్పాలని ఒక పెద్ద ప్రయత్నం చేసింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం దృక్పథంలో ఉర్దూ ముస్లిమ్ భాష కాదు, జాతీయ భాష. ఈ రకంగా ఉర్దూని మతంతో సంబంధం లేని భాషగా ప్రపంచ విజ్ఞానాన్ని తన మాటల్లోకి పరివర్తించుకోవాలనే భాషగా చేయాలని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఒక పెద్ద అనువాద శాఖని ప్రారంభించి ఆ విజ్ఞానాన్ని ఉర్దూలోకి తీసుకురావడానికి పర్యాయ పదాల్ని సృష్టించి పెద్ద ప్రయత్నం మొదలుపెట్టారు. కానీ దురదృష్టవశాత్తు జాతీయ ఉద్యమానికి ప్రధాన నాయకుడైన గాంధి ఈ విశేషాన్ని గ్రహించలేదు. ఆయన దృష్టిలో ఉర్దూ ముస్లిముల భాషే. వందేమాతరం ఉద్యమం ప్రభావంగా ఉస్మానియా విద్యార్థులలో హిందూ మత భావనలు పెరిగి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రవేశపెట్టబడిన ఈ ఉద్యమానికి అడ్డుకట్ట కొట్టింది. ఈ రకంగా భారతీయ భాషల్లోకి ప్రపంచ జ్ఞానం అందుబాటులోకి తేవాలి అనే ఉద్దేశంతో జరిగిన పని కొనసాగలేదు. ఈ విషయాన్ని మరి కొంచెం వివరంగా తెలుసుకోవాలనుకునేవారు కవితా సరస్వతి దాట్ల రాసిన పుస్తకాన్ని తప్పకుండా చదవాలి. Kavita Saraswathi Datla; The Language of Secular Islam: Urdu Nationalism and Colonial India; University of Hawaii Press, 2013 (Indian edition from Orient Blackswan Private Limited, 2013).. తెలుగులో ఏ పుస్తకాలు చదివినా జీవితంలో పనికొచ్చే కొత్త విషయాలేవీ తెలియవు, కావలసిందల్లా ఇంగ్లీషే అన్న అభిప్రాయం క్రమక్రమంగా బలపడింది. స్కూళ్ళలో ఇంగ్లీషు నుంచి అనువాదం కోసం వాడే తెలుగు భాష నిర్జీవంగా ఎవరికీ పట్టనట్లు తయారయింది.

జస్టిస్ పార్టీ ఆవిర్భావం

తెలుగులో వ్యాకరణాలు రాసినా, పెద్దబాలశిక్ష లాంటి పిల్లల పాఠాలు రాసినా, దస్తావేజులు రాసినా, అర్జీలు రాసినా, ఉత్తరాలు రాసినా, ఏ రాత పనైనా బ్రాహ్మణులే చేశారు. అంచేత వ్యావహారిక వాదం అనే మాట బలపడ్డ తరవాత కూడా బ్రాహ్మణ వ్యావహారికమే ఈ వ్యావహారిక వాదుల మనసుల్లో వుంది. ఒక చిన్నయ సూరి మినహా గ్రాంథిక భాషకి వ్యాకరణం రాసినవాళ్ళు కూడా అందరూ బ్రాహ్మణులే. చిన్నయ సూరి బ్రిటిష్ ప్రభుత్వపు ఉద్యోగాల్లో, లేదా ఇతర వ్యాపారాల్లో సంపన్నులైన అబ్రాహ్మణుల ప్రాపకం వల్లే పైకొచ్చాడు. పెద్ద ఉద్యోగం సంపాదించుకున్నాడు. అతను వ్యావహారికం రాస్తే ఎలాంటి వ్యావహారికం రాసేవాడో మనకి తెలియదు. మాట్లాడేటప్పుడు, ఉపన్యాసాలు చెప్పేటప్పుడు అతను ఎలాటి భాష వాడేవాడో ఊహించుకోవాలి గాని సమాచారం దొరకదు. ముఖ్యంగా అతను మాట్లాడేటప్పుడు, ఉపన్యసించేటప్పుడు క్రియా పదాలు ఎలాంటివి వాడేవాడు! వచ్చితిని, వెళ్ళితిని, చేయుదును, ఇలాంటి వ్యాకరణ సమ్మతమైన క్రియా పదాలే వాడేవాడా? బ్రాహ్మణ వ్యవహారంలో వుండే రాస్తున్నాను, చేస్తున్నాను, మాట్లాడాను, వస్తాను ఇలాంటి క్రియా పదాలు వాడేవాడా? ఈ విషయమై మనకు ఏ రకమైన సమాచారమూ లేదు.

ఇటువంటి పరిస్థితుల్లో జస్టిస్ పార్టీ ఏర్పడిన తరవాత బ్రాహ్మణులతో ఉద్యోగాలలో పోటీపడి చాలామంది అబ్రాహ్మణులు పెద్ద పెద్ద ఉద్యోగాలు సంపాదించారు. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లుగా, కాలేజీల్లో అధ్యాపకులుగా చాలామంది అబ్రాహ్మణులు ఉండేవారు. తెలుగు కాని మిగతా సబ్జెక్టులన్నీ ఇంగ్లీషులోనే చెప్తూ ఉండడం బట్టి వాళ్ళు ఆ పాఠాలు ఇబ్బందిలేకుండా హాయిగా చెప్పేవారు[5]1960కి ముందు కాలంలో డిగ్రీ చదువుల్లో తెలుగు కాని మిగతా సబ్జెక్టులని తెలుగు మీడియములో బోధించేవారు కాదు.. కానీ సభల్లో ఎక్కడైనా మాట్లాడవలసివచ్చినా, పదిమందితో కబుర్లు చెప్పవలసివచ్చినా, ఇంగ్లీషే మాట్లాడేవాళ్ళు. చివరికి పత్రికలు కూడా ఇంగ్లీషు పత్రికలే చదివేవాళ్ళు. వాళ్ళు ఇంగ్లీషు మాట్లాడేటప్పుడు చక్కగా మాట్లాడేవారు. అందుచేత వాళ్ళ పలుకుబడిలో అబ్రాహ్మణత్వం బయటపడవలసిన అవసరం వుండేది కాదు. అంతే కాకుండా సమాజంలో పైకి రావాలనుకునేవాళ్ళు ఇంగ్లీషు మాట్లాడటం అవసరం. అందువల్ల వాళ్ళ స్థాయి పెరుగుతుంది. ఆ కారణం చేత బ్రాహ్మణులు కూడా ఇంగ్లీషులోనే మాట్లాడేవారు.

నిత్యవ్యవహారానికి ఇంగ్లీషు వాడేవాళ్ళు విద్యావంతులు, కేవలం తెలుగే వాడేవాళ్ళు అయితే పండితులు, లేకపోతే వాళ్ళ తక్కువ కులాన్ని వ్యక్తపరిచే తెలుగు మాట్లాడే సామాన్యులు. జస్టిస్ పార్టీలోనే వున్న కట్టమంచి రామలింగారెడ్డి, త్రిపురనేని రామస్వామి ఇందుకు మినహాయింపు. రామలింగారెడ్డి అద్భుతంగా ఇంగ్లీషు మాట్లాడేవారు. అవసరమైతే చక్కని పాండిత్య స్ఫోరకమైన తెలుగు మాట్లాడగలిగినా తరచు ఇంగ్లీషే మాట్లాడేవారు. త్రిపురనేని రామస్వామి గొప్ప పండితుడు. ఆయనకి ఇంగ్లీషు బాగా వచ్చును. కానీ పాండిత్య స్ఫోరకమైన తెలుగే మాట్లాడేవారని ప్రతీతి. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో రిజిస్ట్రారుగా పనిచేసిన కె.వి. గోపాలస్వామి నాయుడు ఎప్పుడూ ఇంగ్లీషే మాట్లాడేవారు. ఆయన మాట్లాడే ఇంగ్లీషుకి ఎంతో గౌరవం ఉండేది కూడా.

తెలుగు పాఠాలలో తరవాత పరిస్థితి

కాని తెలుగు పాఠాలు మాత్రం ఇంకా ఆ గూడుకట్టుకున్న భాషలోనే వుండేవి. నాన్-డిటెయిల్డ్ స్టడీ (Non-Detailed Study) అనే పేరుతో ఏదో ఒక వచన గ్రంథం ఉండేది. ఇది కూడా తెలుగు సాహిత్యంలో పేరున్న రచయితల వచన గ్రంథం కాకుండా చిన్నయసూరి వ్యాకరాణనికి లోబడి రాయబడిన వచన గ్రంథం అయి వుండేది. తరవాత తరవాత గ్రాంథికమైన తెలుగులో మంచి వచన రచనలు కనిపించకపోతే ఆంధ్ర విశ్వవిద్యాలయం నవలల పోటీలు పెట్టి ఆ పోటీలలో బహుమానాలు వచ్చిన పుస్తకాలనే నాన్-డిటెయిల్డ్ స్టడీగా పెట్టేవారు. ధూళిపాళ శ్రీరామమూర్తి గృహరాజు మేడ, మల్లాది వసుంధర–తంజావూరి పతనము, సప్తపర్ణి, వంటి పుస్తకాలే ఉండేవి! అలాగే మోడర్న్ పొయెట్రీ (Modern Poetry) అనే విభాగం కింద ఏదో ఒక పుస్తకం నిర్ణయించబడేది. అంతే కాని, తెలుగు సాహిత్యంలో వస్తున్న పెద్ద మార్పులు గమనించి కాని, నిజంగా ఆధునికులు కవులు అయినవాళ్ళ పుస్తకాలు పరిశీలించి కాని, టెక్స్ట్ బుక్ కమిటీవాళ్ళు పుస్తకాలు పెట్టేవాళ్ళుకాదు. ఆధునిక సాహిత్యంలో గొప్ప రచయితలయిన శ్రీశ్రీ, పఠాభి, చలం, కుటుంబరావు, గోపీచంద్, కృష్ణశాస్త్రి, ఇలాంటి వాళ్ళ పుస్తకాలేవీ విద్యార్థులు చదివేవాళ్ళుకారు. చిన్నయ సూరి వ్యాకరణం ప్రకారం రాసిన, అంత పెద్ద పేరు లేనివాళ్ళ పుస్తకాలు ఆధునిక కవిత్వం పేరుతో పాఠం చెప్పబడేవి. క్రమంగా తెలుగు శాఖల్లో నేర్పే తెలుగుకి బయట లోకంలో తయారవుతున్న తెలుగుకి ఏ రకమైన సంబంధం లేని ఒక పెద్ద అగాధం యేర్పడింది. ఇది కేవలం భాషకి సంబంధించిన విషయమే కాదు. భాషలో చెప్పే ఆలోచనలకి, విజ్ఞానానికి, సృజనాత్మకతకి సంబంధించిన విషయం. తెలుగు పాఠం చెప్పే పండితులు కేవలం చిన్నయ సూరి వ్యాకరణం ప్రకారం అరసున్నలు, బండి ర(ఱ)లు ఉన్నాయా? సంధులు యడాగమాలు ఉన్నాయా? సరళాదేశాలు గసడదవాదేశాలు పాటింపబడ్డాయా? అనే చిన్న చిన్న విషయాలు మాత్రమే ప్రధానంగా చూసి దిద్ది వ్యాస రచనల్ని తిరిగి విద్యార్థులకి ఇచ్చేవారు. లాక్షణిక భాష అన్న పేరుతో భాష లోకానికి దూరమైపోవడం మూలంగా వచ్చిన దుస్థితి ఇది.

గిడుగు రామమూర్తి ఆంధ్రపండిత భిషక్కుల భాషా భేషజం చూస్తే ఆయన వాదనంతా చిన్నయ సూరి వ్యాకరణం ప్రకారం అసాధువులు అని చెప్పిన మాటలు తిక్కన మొదలుకొని పూర్వ కవులు అందరూ వాడారని రుజువు చేయడమే. ఆ మాటకొస్తే చిన్నయ సూరి కూడా తన వ్యాకరణం ప్రకారం తానే రాయలేకపోయాడు. అందుచేత శిష్టవ్యావహారికం వాడటం భాషకి మంచిది. ఇదీ రామమూర్తిగారి వాదం. ఈ సంగతి సూచనగా ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాం.

కాకపోతే వ్యావహారికం అనే మాటని రామమూర్తిపంతులు చాలా ఉదారంగా వాడారు. ఆయన వ్యావహారికానికి చూపించే ఉదాహరణల్లో ఒకే రకమైన వ్యావహారికం లేదని, అనేక రకాలైన వ్యావహారికాలు వున్నాయని ఆయన పట్టించుకోలేదు. అన్నమయ్య పాటల్లో ఒక రకమైన వ్యావహారిక భాష ఉంటుంది. సారంగపాణి పాటల్లో ఇంకో రకమైన వ్యావహారికం వుంటుంది. పండితులు రాసే వ్యాఖ్యానాల్లో ఇంకో రకమైన వ్యావహారికం వుంటుంది. కరణాలు రాసే దస్తావేజుల్లో మరొక రకమైన వ్యావహారికం వుంటుంది. ఈ వ్యావహారికాలు వాడేవాళ్ళు అందరూ శిష్టులే అయినా వాళ్ళ భాషలు వేరువేరుగా వుంటాయి. వీటినన్నిటీ కలిపి వ్యావహారికం అనే పేరు పెట్టటం వల్ల చిన్నయసూరి వ్యాకరణానికి విరుద్ధమైనది వ్యావహారికం అనే అభిప్రాయం బలపడింది. ఇన్ని రకాల వ్యావహారికాలకి వాటి వాటి సందర్భాలలో ఏకత్వం వుందని, ఆ ఏకత్వాలకి ఒక నియమం వుందని, వాళ్ళందరూ శిష్టులే అయినా శిష్ట వ్యావహారికం అంటూ ఒకటి లేదని అది అనేక రకాలుగా వుందని రామమూర్తి గమనించారు కానీ వాటిని గురించి చర్చించలేదు. శిష్టులంటే ఎవరు అని ఎన్నిసార్లు అడిగినా ఆ మాటని కూడా ఆయన నిర్ధారించలేదు.

తెలుగు మీద సర్ ఆర్థర్ కాటన్ ప్రభావం

గిడుగు రామమూర్తిగారు శిష్టులు అంటే ఎవరో వివరించకపోయినా ఒక విచిత్రమైన రాజకీయ, సామాజిక కారణాల వల్ల శిష్టత్వం అనుకోకుండా యేర్పడింది. ఆధునిక కాలంలో తెలుగు భాషకి నన్నయకన్నా, చిన్నయసూరికన్నా, సర్ ఆర్థర్ కాటన్ ఎక్కువ కారణమయ్యాడని చెప్పాలి. కాటన్ గోదావరి మీద, కృష్ణ మీద ఆనకట్టలు కట్టకముందు ఆ ప్రాంతానికి ఆర్థికంగా ఇప్పుడున్న బలం లేదు. ఆ కాలంలో రాయలసీమ ఆర్థికంగా కృష్ణా, గోదావరి జిల్లాల కన్నా ముందుండేది. అక్కడ వున్న చెరువుల పద్ధతి వల్ల నీరు సమృద్ధిగా అంది పంటలు పుష్కలంగా పండేవి. కృష్ణా, గోదావరి జిల్లాల్లో ఒక డెల్టా భాగాన్ని మినహాయిస్తే మిగతా ప్రాంతాలలో పంటలు కేవలం వర్షాల మీదే ఆధారపడేవి. బ్రిటిష్‌వారి పుణ్యమా అని రాయలసీమలో చెరువులు ధ్వంసం అయిపోయాయి. అంచేత రాయలసీమ కరువు ప్రాంతమయింది. ఈ లోపున కాటన్ కట్టిన ఆనకట్టల వల్ల కృష్ణా, గోదావరి జిల్లాలు పంటలు పండే నేలలయ్యాయి. తాము రైతులకి కౌలుకిచ్చిన భూములవల్ల వచ్చిన డబ్బుతో అక్కడి బ్రాహ్మణ కులాలవాళ్ళు మొట్టమొదట ఇంగ్లీషువాళ్ళు పెట్టిన స్కూళ్ళలో చదివి పై చదువులకు మద్రాసు వెళ్ళి ఆధునిక విద్యావంతులయారు. పై చదువులు చదివినా చదవకపోయినా మద్రాసులో వుండే వావిళ్ళవారి వంటి ప్రచురణాలయాల కారణంగాను, కొత్తగా పెట్టిన భారతి, ఆంధ్రపత్రిక వంటి పత్రికల కారణంగాను బ్రాహ్మణులు చాలామంది మద్రాసు చేరారు. వీళ్ళు పత్రికల్లోను, ఆ తర్వాత ఏర్పడిన రేడియోలోను ఉద్యోగాల్లో చేరారు. రేడియో వచ్చిన తరువాత, పత్రికల ప్రచారం పెరిగిన తరువాత, పత్రికల భాష బ్రాహ్మణ వ్యావహారిక భాషకు దగ్గరకాక తప్పలేదు. అంటే చదువుకున్న బ్రాహ్మణులు మాట్లాడే భాషకీ సరళ గ్రాంథికానికీ మరీ దూరం కాని మధ్యస్థాయిలో పత్రికల భాష, రేడియో భాష వుండేది. పత్రికల్లో ఇంగ్లీషులో టెలీప్రింటర్ మీద వచ్చిన వార్తలు అనువాదం చేయవలసిన అవసరం వల్ల సంస్కృత పదాల ఉపయోగం ఒక పక్క పెరుగుతూ వచ్చినా క్రియాపదాలు మాత్రం బ్రాహ్మణ వ్యవహారంలో వున్నవే వుండేవి. ఈ రకంగా ఒక ఆధునిక రచనాభాష తయారయింది.

ఈ ఆధునిక రచనాభాషలో కూడా అలవాటు బలిమి వల్ల ‘వ్రాయు’ వంటి గ్రాంథిక వర్ణక్రమాలు, ‘చెప్పవలెను’,’ఏతెంచిరి’ లాంటి క్రియాపదాలు వాడుతూనే వచ్చారు. 1947 సంవత్సరంలో ఆంధ్రపత్రిక చూస్తే ఒక పక్క సరళ గ్రాంథికం, ఇంకొక పక్క బ్రాహ్మణ వ్యావహారికం రెండూ కనిపిస్తాయి. మేము సరిగా తైపారు వేసి చూడలేదు కానీ నార్ల వెంకటేశ్వరరావుగారి సంపాదకత్వంలో ఆంధ్రప్రభ పూర్తిగా బ్రాహ్మణ వ్యావహారిక భాష వాడుకలోకి తెచ్చిందని మా అంచనా. కాని ఇదే సమయంలో అదే ఆంధ్రప్రభ వాడుకలో ఎప్పుడూ లేని పెద్ద పెద్ద సంస్కృత సమాసాలు (ఉదా. సప్తతిమ జన్మదినోత్సవం), సంస్కృత వ్యాకరణం వొప్పుకోని ‘విలేఖరులు’ వంటి పదప్రయోగాలు వ్యావహారిక రచనాభాష లోకి పట్టుకొచ్చింది. ఈ రకంగా వ్యావహారికం అనే భాష నిజంగా వ్యవహారంలో పూర్తిగా లేదని, రచన కోసం ఏర్పడిన ఒక కొత్త రకమైన భాష అని, అయినా దీన్ని వ్యావహారికం అంటున్నారని బోధపడుతుంది.

ఇది ఇలా వుండగా వ్యావహారిక భాషకి ఏ రకమైన నియమాలు లేవు, ఎవరికి తోచినట్లు వాళ్ళు రాయొచ్చు అనే అభిప్రాయం బలంగా అందరిలోనూ వేళ్ళూనుకుంది. ఇందువల్ల తెలుగు పత్రికల స్థితి క్రమేణా ఎలా అయిందో చూడడానికి కొద్దిగా ప్రయత్నం చేద్దాం. ఒకప్పుడు తెలుగు పత్రికల్లో తెలుగులో అంతో ఇంతో పాండిత్యం వున్నవాళ్ళే సబ్-ఎడిటర్లుగా చేరేవారు. భారతిలోను, ఆంధ్రపత్రికలోను పనిచేసిన వాళ్ళందరూ తెలుగు బాగా చదువుకున్నవాళ్ళే. వీళ్ళందరూ ఏ రోజుకారోజు తెలుగు వార్తలు రాయడానికి ఇంగ్లీషులో వున్న మాటలకి కొత్త అనువాదాలు సృష్టించి అవి పత్రికల్లో హెడ్‌లైన్లుగా (పతాక శీర్షిక అనే మాట ఈ కాలంలోనే అమలులోకి వచ్చింది) పెట్టినందుకు గర్వపడుతూ వుండేవాళ్ళు. ఆల్ ఇండియా రేడియో కూడా ఇదే సమయంలో కొత్త కొత్త మాటలు, భాషలో కొత్త అలవాట్లు సృష్టించింది: నిలయ విద్వాంసులు, ఆకాశవాణి, ఇలాంటి మాటలు ఆల్ ఇండియా రేడియో కల్పించినవే[6] ‘ఆకాశవాణి’ అన్న మాటని రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మగారు సృష్టించారని కొందరు అంటారు.. తెలుగు వార్తలు ఢిల్లీ నుంచి వచ్చేవి. ఢిల్లీ నుంచి ఉదయం, సాయంత్రం ఏడు గంటలకి చదివే వార్తలు ఇంగ్లీషులోనుంచి అప్పటికప్పుడు అనువాదం చేసేందుకు అక్కడి ఆకాశవాణి స్టూడియోలో తెలుగు సంపాదకులు కొందరు పనిచేసేవారు. వీళ్ళందరి ఉమ్మడి ప్రయత్నం ఫలితంగా ఆధునిక తెలుగు రచనాభాష పైకి చెప్పబడని కొన్ని నియమాలతో, కాగితం మీద ఎక్కడా రాయని కొన్ని కట్టుబాట్లతో తయారవుతూ వస్తూ వుండేది.

గురజాడ అప్పారావుగారు తమ కన్యాశుల్కం రెండవ ముద్రణకి ఇంగ్లీషులో రాసిన ఉపోద్ఘాతంలో ఆధునిక తెలుగు వచన నిర్మాణానికి పుట్టబోయే మహాకవులు దారి చూపిస్తారని అని రాశారు. (‘A great writer must write and make it. Let us prepare the ground for him.’) ఆయన అప్పట్లో ఊహించినా, ఊహించకపోయినా ఆధునిక తెలుగు భాషని తయారు చేసినది గొప్పరచయితలు కారు. తెలుగు పత్రికల్లో వార్తలు రాస్తున్నవాళ్ళు, సంపాదకీయాలు రాస్తున్నవాళ్ళు, వ్యాసాలూ రాస్తున్నవాళ్ళు.

చిన్నయ సూరి సూత్రములఁ జిక్కి కృశించి, విషాదమొందుతూ
వున్న తెనుంగు, శృంఖలము లూడి, సుఖంబుగ మేడమీదఁ గూ
ర్చున్నది; నూత్నకాంతి గనుచున్నది, హాయిగ నేడు సంచరి
స్తున్నది, రామమూర్తి విబుధోత్తమ! నీ శ్రమకున్ ఫలంబుగాన్

అని భోగరాజు నారాయణమూర్తి కాస్త గ్రాంథికంలోను, కాస్త వ్యావహారికంలోను పద్యం రాసి (గ్రాంథిక రూపాలు లేకుండా పద్యాలు రాయడం కుదరదని ఇంతకు ముందు చెప్పాం.) గిడుగు రామమూర్తి పంతులుని ఎంత మెచ్చుకున్నా, ఆధునిక వ్యావహారిక భాష తయారయ్యింది రేడియోల వల్ల, పత్రికల వల్ల మాత్రమే. అయితే గిడుగు రామమూర్తిగారి గంభీరమయిన ఉద్యమం వల్ల ఒక గొప్ప మార్పు జరిగింది. తెలుగులో రాసేవాళ్ళకి వ్యాకరణం అంటే భయం పోయింది. వ్యాకరణ విరుద్ధం అని పాత తెలుగు పండితులు అనే మాటకి గౌరవం పోయింది. పత్రికలలో రాసే తెలుగుకి గౌరవం వొచ్చింది.

కాలక్రమేణా పండితులు తగ్గి ఆధునిక కవులు, అంటే పాండిత్యంతో సంబంధం లేనివాళ్ళు పత్రికల్లో చేరారు. వాళ్ళకి ఏ రకమైన జర్నలిస్టు తర్ఫీదు వుండేది కాదు. అది కేవలం ఉద్యోగంలో చేరిన తరవాత నేర్చుకున్నదే అయివుండేది. కాని వచన పద్యంలో అయినా, గేయంలో అయినా, కేవలం వచనంలో అయినా సమర్థంగా భాషని వాడగల శక్తి వాళ్ళకి వుండేది. నార్ల వెంకటేశ్వరరావు దగ్గరనించి, నండూరి రామమోహనరావు దాకా, ముళ్ళపూడి వెంకటరమణ దగ్గరనించి పురాణం సుబ్రహ్మణ్యశర్మ దాకా అప్పటికి పెద్ద పేరు లేకపోయినా అసాధారణ ప్రతిభావంతులు తెలుగు పత్రికల భాషకి ఒక గొప్ప గౌరవాన్ని కలిగించారు. కాని, వాళ్ళ తరం ఒక పదిహేనేళ్ళలో అయిపోయింది.

ఈనాటి తెలుగు వచనం

క్రమక్రమంగా ఈ ఉద్యోగాల్లో తెలుగు మీద ఏ విధమైన పట్టు లేనివాళ్ళు, అంతో ఇంతో ఇంగ్లీషు మాత్రమే చదువుకున్నవాళ్ళు చేరారు. దీని ఫలితంగా తెలుగు పత్రికల్లో భాష ఇటు తెలుగూ కాని, అటు ఇంగ్లీషూ కాని ఒక విలక్షణమైన స్థితికి చేరుకుంది. ఇంగ్లీషుకి సమానమైన ఏ తెలుగు మాటా వెంటనే తోచకపోతే, ఆ ఇంగ్లీషు మాటనే వాడెయ్యడం ఈ కొత్త ఉపసంపాదకులు అలవాటుచేసుకున్న పద్ధతి.

ఇటీవల ఆంధ్రజ్యోతి దినపత్రికలో మాకు కనిపించిన, తెలుగు అక్షరాలలో రాసిన, కొన్ని ఇంగ్లీషు మాటల జాబితా ఇది: రూమరేనట, బిగ్ బ్రేకింగ్ న్యూస్, మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది, కిడ్నీ ఫెయిలయ్యే ప్రమాదం, బ్యాంకింగేతర లావాదేవీలు, ఫిస్కల్ రోడ్‌మ్యాప్, టెంపర్ టాంట్రం, ట్రెండింగ్ ఫోనులు, ఫ్యాబ్రిక్‌తో ఫోన్ వ్యాలెట్, విమానాలు ల్యాండు చేసి, కన్‌ఫం చేశారు, యాంటీ టెర్రరిజం స్క్వాడ్, పాక్ ఆర్మీ, రైల్వే జోన్ పరిధిలో సింథటిక్ వినియోగానికి చెక్ చెబుతున్నారు… (ఇది కేవలం ఈ దినపత్రికకే ప్రత్యేకమయిన జాడ్యం కాదు.)

ఇక పోతే కర్త కర్మలను పట్టించుకోకుండా ఏ అన్వయమూ లేకుండా రాసిన వాక్యాలు అన్ని తెలుగు పత్రికల్లో కొల్లలుగా కనిపిస్తాయి. అవి చదివి వార్తలు ఇలాగే వుంటాయి అని సహించి వూరుకుంటున్న తెలుగు పాఠకుల ఔదార్యాన్ని మన్నించాలి.

కవిత్వం, కథలు కాకుండా ఆలోచనాపరమైన విమర్శలతో, వ్యాసాలతో గట్టిగా చదువుకున్నవాళ్ళు ప్రాచీన, మధ్యకాలపు, ఆధునిక రంగాలలో ప్రపంచవ్యాప్తంగా వస్తున్న ఆలోచనల్ని పురస్కరించుకుని వ్యాసాలు రాసే మేధావులు కానీ, అవి ప్రచురించే పత్రికలు కానీ మనకి లేవు. తెలుగులో మేధావులకు కావలసిన ప్రోత్సాహం లేదు. అంచేత మేధావి అని చెప్పడానికి అనువైన ప్రమాణాలు లేవు. వాళ్ళని గుర్తించే సమాజమూ లేదు.

తెలుగులో పద్యాలు రాసేవాళ్ళకి చాలా నిక్కచ్చి అయిన శిక్షణ వుండాలనే నియమం వుంది. కథలు రాసేవాళ్ళకి కూడా, మంచి కథలు అని గుర్తింపు పొందిన కథలు అనేకం చదవడం మూలంగా వొచ్చిన అనుభవం వుంది. కాని, వచనమంటే నోటికి ఏది వస్తే అదే రాసే వాక్యాలు అనే అభిప్రాయమే మన మనసుల్లో వుంది. వచన రచనకి ప్రత్యేకమైన శిక్షణ కావాలని, వ్యాసనిర్మాణానికి నియమాలు, పద్ధతులు ఉన్నాయని, ఆలోచనలు చెప్పడానికి, అవి స్పష్టమైన భాషలో రాయడానికి ప్రత్యేకమైన తర్ఫీదు అవసరమని, ప్రతి ఆలోచనారంగానికీ అనువైన ఒక తార్కిక విధానం వుందని, ఆలోచనల్లో క్లిష్టత, వాక్యనిర్మాణంలో సరళత, రెండూ కలుపుకున్నదే మంచి వచనమని మనకి చెప్పేవాళ్ళు ఎవరూ లేరు. బళ్ళు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు విద్యార్థుల్ని సమాచారం కంఠతా పట్టి అప్పచెప్పేవాళ్ళుగానే తయారుచేస్తున్నాయి కాని విమర్శతో కూడిన ఆలోచన చేయగలవాళ్ళుగా తయారుచేయడం లేదని మనం ఇప్పటికీ గుర్తించడంలేదు. విశ్వవిద్యాలయాలలో తెలుగు శాఖలు మరో విచిత్రమైన పరిస్థితిలో చిక్కుకున్నాయి. తెలుగులో పిహెచ్.డి.లు తయారవడం మొదలుపెట్టి దాదాపు 90 ఏళ్ళు కావస్తున్నా డజన్ల కొద్దీ పిహెచ్.డి.లు తయారవుతున్నా, ఇంతవరకూ సిద్ధాంత నిరూపణ కోసం ఎలా పరిశోధన చేయాలి, ఏమి చదవాలి, తన పరిశ్రమ చేస్తున్న రంగంలో ఎలాంటి ప్రశ్నలు వేసుకోవాలి? అనే విషయంలో ఏ రకమైన ప్రావీణ్యం లేకుండా నానాటికీ చవకబారు పిహెచ్.డి.లు వస్తున్నాయి. పిహెచ్.డి. కోసం రాసిన థీసిస్‌ ఎంత చవకబారుగా వున్నా, డాక్టర్ అనే బిరుదుకి మాత్రం గౌరవం పెరిగిపోయింది. కవిత్వం రాసేవాళ్ళు కూడా పేరు ముందు డా. అని పెట్టుకుంటున్నారు.

తెలుగు భాషలో వాక్యనిర్మాణక్రమం కానీ, వాక్యాన్ని వాక్యాన్ని కలిపి ఒక ఊహని సహేతుకంగా ఒక పద్ధతిలో రాయడం కానీ ఎలాగో మనం ఎప్పుడూ నేర్పలేదు. పిల్లలకి తెలుగు పాఠాలు చెప్పే ఉపాధ్యాయులు పదస్వరూపంలో తప్పుందా, అరసున్నాలు, బండి-రలు సరిగా ఉన్నాయా లేదా, సంధులు సరిగా చేశారా లేదా, ఇవే పట్టించుకున్నారే కానీ వాక్య నిర్మాణ క్రమాన్ని, ప్రసంగ పాఠపు పొందికని ఎప్పుడూ గమనించలేదు. ఈ రోజుక్కూడా తెలుగు వచనంలో ఆ లక్షణాలు సరిగ్గా లేవు. మంచి వచనం అంటే ఏమిటి అన్నదాని గురించి ఆలోచన లేదు, శిక్షణా లేదు. ఈ సంగతి దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు మనం రాస్తున్న తెలుగు వచనాన్ని పరిశీలిస్తే ఎంత మంది పెద్ద పేరున్న తెలుగువాళ్ళు అవలీలగా గజిబిజి వాక్యాలు రాస్తారో, గందరగోళంగా ఊహలు చెప్తారో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఇంగ్లీషు నుంచి మనం కామాలు, ఫుల్‌స్టాపులు, ఆశ్చర్యార్థక గుర్తులు, ప్రశ్నార్థకాలు తెచ్చుకున్నాం సరే. ఇవి వచ్చిన తరవాత కూడా పేరాగ్రాఫులు ఎలా కూర్చాలి, పేరాగ్రాఫు ఎక్కడ అయిపోతుంది, మొదటి పేరాగ్రాఫుకి రెండవ పేరాగ్రాఫుకి మధ్య ఉన్న సంబంధం ఏమిటి, ఈ వ్యాసంలో చెప్పిన ఊహ మళ్ళామళ్ళా చెప్పామా, ఆ చెప్పిన ఊహ స్పష్టంగా చెప్పామా, ఇందులో అక్కర్లేని వాక్యాలు ఎన్ని ఉన్నాయి, నిరాధారమైన విషయాలు అస్పష్టంగా చెప్పినవి, బాధ్యత లేకుండా రాసిన వాక్యాలు ఈ వ్యాసంలో ఉన్నాయా? వంటి ప్రశ్నలు వేసుకుని చూస్తే ఇవాళ అచ్చయిన పుస్తకాలలో వున్న వచనంలో ఎన్ని లోపాలున్నాయో మనకు తెలుస్తుంది.

ఈ లోపాలని ఎలా సవరించుకోవాలి అన్న ప్రశ్న మనకు పుట్టనే పుట్టదు. రాసింది రాసినట్లే అచ్చు కావటం, ఇంతే మనకు కావలిసింది. ఈ రకమైన విశృంఖలమైన స్వేచ్చకి వ్యావహారిక భాషా వాదం బోలెడు సాయం చేసింది. ఒక మాట వ్యాకరణం ప్రకారం సాధువా కాదా అని ఆలోచించవలసిన రోజుల్లో అందమైన వాక్యానికి, నిర్దుష్టమైన వాక్యానికి తేడా చూసుకోవలసిన అవసరం మాత్రమే ఉండేది. వ్యావహారిక భాషా వాదం వచ్చి మనకు నేర్పినది ఏమిటి అంటే, మనకు నోటికి వచ్చిన వాక్యం ఎలాంటి శిక్షణా లేకుండా హాయిగా రాసేయవచ్చు అని.

ఈ రకమైన విశృంఖలమైన స్వేచ్ఛ వల్ల ఇప్పుడు తెలుగు భాషలో రచన ఏ స్థితిలో వుంది? ముందు రచనలని రెండు భాగాలు చేద్దాం. ఒకటి సాహిత్య రచనలు: పద్యాలు, వచన పద్యాలు, పాటలు, కథలు, నవలలు, ఇలాంటివి. వీటిని ఎవరూ ఏ రకంగానూ శాసించకూడదు. కవి, రచయిత, ఆడ, మగ, ఎక్కువ కులాలవారు, తక్కువ కులాలవారు, హిందువులు, ముస్లిములు, ఇంకా అనేక సమూహాలవాళ్ళు తమ సృజనాశక్తిని, ఆలోచనని, ఉద్యమాలని, ఊహల్ని, రకరకాల భాషల్లో వాళ్ళకి ఇష్టమొచ్చిన పద్ధతిలో రాయనివ్వండి. ఆ రకమైన రచనలకి భాష పరంగా ఏ రకమైనటువంటి నియమాలు అక్కరలేదు.

రెండవది, ఇక మిగిలినది, వచనం. కేవలం ఆలోచనలు స్పష్టంగా చెప్పడానికి మాత్రమే వచనం ఉపయోగపడాలి. ఇది రాసే భాష వ్యావహారిక భాష అనే పేరు పెట్టుకుంటే తప్పులేదు కానీ ఇది ఆధునిక రచనాభాష అని గుర్తించాలి. ఈ భాషకి ఏకత్వం, ప్రామాణికత ఉండి తీరాలి. ఇప్పటికీ దీనికి మంచి పేరు ఏర్పడలేదు. ఏమయినా ఇది కథలు, కావ్యాలు రాసే భాష కాదని, ఆలోచనలు రాసే భాష మాత్రమే అని, ఇది రచనా భాష అని, అక్షరాలా మాట్లాడే భాష కాదని–గుర్తించాలి. భాషా చర్చల్లో పాల్గొన్న కొన్ని వందల మంది–గిడుగు రామమూర్తిగారి దగ్గరినుంచి వీధిని పోయే దానయ్య వరకు–ఎవరూ స్పష్టంగా చెప్పలేదు, ప్రపంచంలో ఏ భాష కూడా అక్షరాలా మాట్లాడినట్టు రాయబడదని, రాసినట్టు మాట్లాడబడదని. అంచేత రాసే భాషకి ఒక రకమైన ప్రామాణికత, కొన్ని నియమాలు ఉండక తప్పదు. ఎవరి ఇష్టం వచ్చినట్లు, ఎవరు పలికినట్లు వాళ్ళు రాయొచ్చు, అదే వ్యావహారిక భాష అనే అభిప్రాయం తెలుగు వచనాన్ని ఏ స్థితికి తీసుకొచ్చిందో ఏ ఒక రోజు పత్రికల్ని చూసినా తెలుస్తుంది.

తెలుగు వచన రచనకి కావలసిన శిక్షణ

వ్యావహారిక భాష అనే పేరుతో చెప్పుకోదగ్గ కట్టుబాట్లు లేని ఒక ఆధునిక రచనాభాష 1940ల నాటికి తయారయింది. ఆ భాషలో చెప్పుకోదగ్గ మంచి వచన రచనలు చేసినవాళ్ళు చాలామంది వున్నారు. వీళ్ళలో చాలామంది కథలు, నవలలు రాసినవాళ్ళయితే కొద్దిమంది మాత్రం వైజ్ఞానిక విషయాల మీద పుస్తకాలు రాసినవాళ్ళు. ఇలాంటి వచనం రాసినవాళ్ళందరూ ఇంగ్లీషు బాగా వచ్చినవాళ్ళే. ఇంగ్లీషులో వచ్చిన వచనాన్ని అనుసరించి దాదాపు అదే తర్కంతో అదే ఆలోచనా విధానంతో తెలుగు వచనాన్ని సమర్థంగా రూపొందించినవాళ్ళలో కొడవటిగంటి కుటుంబరావు పేరు ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కొ.కు. వ్యాసాలుగా వి.ర.సం. ప్రచురించిన సంపుటాలు చూస్తే వ్యాస నిర్మాణంలో కుటుంబరావు ఎంత శ్రద్ధ తీసుకున్నారో తెలుస్తుంది. దానితో పాటు వాక్యనిర్మాణంలో, ఆలోచనా తర్కంలో పైకి ఆడంబరంగా చెప్పకపోయినా, విమర్శకులు ప్రత్యేకంగా గుర్తించకపోయినా ఆయన తెలుగు వచనానికి, తెలుగు వ్యాసానికి యెంత గొప్ప నిర్మాణాన్ని ఇచ్చారో బోధపడుతుంది. కాకపోతే వచనాన్ని గురించిన చర్చలు మనకు లేవు కాబట్టి, మనకు ఎవరు ఏది రాసినా వచనమే ఎలా రాసినా వచనమే అనే అభిప్రాయం యేర్పడబట్టి తెలుగు రచనలో పొల్లు, నెల్లు కలిసిపోయి వుంటాయి. వీటిని విచక్షించి చూపించేవాళ్ళు లేకపోవడంతో మనకు తెలుగు వచనం మీద ఆలోచన వృద్ధి పొందలేదు. ఒక పక్క తెలుగు పత్రికలు ఇంగ్లీషు మాటలు విచ్చలవిడిగా వాడేస్తూ, తెలుగులో వందల కొద్ది పుస్తకాలు దారీ తెన్నూ లేకుండా అచ్చు అవుతూ వున్నా కూడా, తెలుగు పుస్తకాల గతి ఏమిటి అని ఆలోచించేవాళ్ళు ఇప్పటికీ కనిపించరు.

మల్లాది వెంకటరత్నం రాసిన పూర్తి తెలుగు పుస్తకం ఒకటి పై అట్ట మీద, Development of Telugu Prose – How to write Telugu అనే ఇంగ్లీషు పేరుతోనూ, లోపల తెలుగు వచన కావ్య వృద్ధి – తెలుగు వ్రాయుట ఎట్లు? (మద్రాసు, 1918) అన్న పేరుతోనూ ఉంది. ఈ పుస్తకం ఆ కాలంలో పెద్దగా చర్చించబడినట్టు లేదు. అందుచేత, దీనిలో వున్న ముఖ్య సూచనలని మాత్రం ఈ కింద ఇస్తున్నాం. అవి ఇవి:

1. సులభమయిన మాటలను వాడుట
2. పెద్ద సమాసములను వాడకుండుట
3. కొత్త మాటలను భాషలోనికి రానిచ్చుట
4. సంధులను విడగొట్టి వ్రాయుట
5. ‘య’డాగమమును విసర్జించుట
6. విభక్తుల చివరను ‘ను’గాగమమ్మును వదలివేయుట
7. అరసున్నలను విడిచివేయుట
8. బండి ‘ర’ను మానివేయుట

ఈ విషయాలని ఇంకా వివరంగా చెప్పటం కోసం పుస్తకంలో మిగతా పేజీలన్నీ గ్రంథకర్త ఉపయోగించారు. ముఖ్యభాగాన్ని నాలుగు పేజీల్లో చెప్పి ఉంటే ఈ పుస్తకానికి ఎక్కువ ప్రచారం వచ్చి ఉండేదేమో. దీర్ఘమైన చర్చల్లో పేజీలన్నీ నింపడం చేత కాబోలు ఈ పుస్తకానికి అంత ప్రచారం రాలేదు. ఆ మాటకొస్తే ఈ పుస్తకాన్ని గురించి ఎవరూ చెప్పలేదు, గిడుగు రామమూర్తిగారు ఈ పుస్తకాన్ని గురించి ఏమీ మాట్లాడలేదు. ఆ తరవాత వచ్చిన అనేకమంది వ్యావహరికవాదులు కూడా ఈ పుస్తకాన్ని గుర్తించలేదు.

‘తెలుగు యెప్పుడుగాని ఉత్తమ విద్యాద్వారంగా వుండలేదు’ అని అక్కిరాజు ఉమాకాంతంగారు అన్నారని ఈ వ్యాసం రెండవ భాగంలో చెప్పాం (చూ. ఫుట్‌నోట్ 14). ఒకప్పుడు, అంటే ఇంగ్లీషు మనదేశంలో రాజ్యం యేలక ముందు, మనం శాస్త్ర గ్రంథాలన్నీ సంస్కృతంలోనే రాశాం. ఒక్క దక్షిణాంధ్ర యుగంలో మాత్రం తెలుగు శాస్త్రభాష అయ్యింది అని నిడదవోలు వెంకటరావు అన్నారు అని ఈ వ్యాసం రెండవ భాగంలో చెప్పాం. అయినా మొత్తం మీద సంస్కృతానిదే శాస్త్రాధికారం. జగన్నాథ పండితరాయలు తెలుగువాడు అని మనం ఎంత గొప్పగా చెప్పుకున్నా ఆయన రసగంగాధరం సంస్కృతంలోనే రాశాడు. ఇవాళ ఆలోచనాశక్తిని పెంపొందించే పుస్తకాలు తెలుగు వాళ్ళయినా ఇంగ్లీషులోనే రాయాలి. అంటే పూర్వపు సంస్కృతం స్థానాన్ని ఇంగ్లీషు ఆక్రమించింది. ఇప్పుడు ప్రస్తుత సమస్య తెలుగు వచనానికి శాస్త్రస్థాయి కల్పించగలమా అనేది. అలా కల్పించగలగాలి అంటే తెలుగు రాసే పద్ధతిలో రెండు మార్పులు రావాలి.

1. వాక్యనిర్మాణక్రమం: అచ్చులో వున్న ఆధునిక తెలుగు వచనం పరిష్కృత రూపంలో ఏర్పడడానికి పత్రికలు, ప్రచురణ సంస్థలు ఉమ్మడిగా పూనుకోవాలి. ప్రచురణ సంస్థలకి ప్రత్యేకమైన భాషా పరిష్కర్తలు వుండాలి. వాళ్ళు ఆ ప్రచురణ సంస్థ వాడే భాషకి నియమాలు యేర్పరిచి ఆ నియమాలకి లోబడి రాసిన వచనాన్నే తాము ప్రచురిస్తామని నిక్కచ్చిగా చెప్పాలి. ఈ భాషా పరిష్కర్తల్నే ఇంగ్లీషు ప్రచురణ సంస్థలవారు కాపీ ఎడిటర్లు అంటారు. తెలుగులో ఏ ప్రచురణ సంస్థకీ పాఠపరిష్కర్తలు, కాపీ ఎడిటర్లు లేరు. ఈ విషయం మేము గతంలో తెలుగులో పుస్తక ప్రచురణ – ఆకారవికారాలు అన్న వ్యాసంలో చర్చించాం.

2. వచనం: ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూస్తే పూర్వం మనకి శాస్త్రగ్రంథాలు రాసేటప్పుడు అనుబంధ చతుష్టయం పాటించాలి అని ఒక నియమం ఉండేది. అనుబంధ చతుష్టయం అంటే ఈ నాలుగు; 1. విషయము, 2. ప్రయోజనము, 3. సంబంధము, 4. అధికారి. ఏ పుస్తకంగానీ రాసేవాళ్ళు ఈ నాలుగు ముందుగా చెప్పాలి. అంటే: 1. ఈ పుస్తకంలో విషయమేమిటి? 2. దీనివల్ల ప్రయోజనమేమిటి? 3. ఈ పుస్తకంలో విషయానికి చుట్టూ వున్న ఇతర విషయాలకి సంబంధం ఏమిటి? అంటే ఈ పుస్తకంలో చెప్పిన విషయం ఏ విధంగా ఈ శాస్త్రానికి సంబంధించిన ఇతర విషయాలతో సంబంధిస్తుంది? ఇందులో ఏది చెప్పబడుతుంది? ఏది చెప్పబడదు? 4. ఈ పుస్తకాన్ని చదవడానికి పాఠకులకి ఎటువంటి అర్హతలు కావాలి? ఈ నాలుగు విషయాల్ని ముందే చెప్పేస్తే చదివేవాళ్ళు ఆ పుస్తకం సరిగ్గా చదవగలుగుతారు. లేదా అందులో వున్న విషయంపై అధికారం లేకపోతే చదవడం మానేస్తారు. అంతేగానీ ఆ పుస్తకం తీసి తమకు తోచిన మాటలు చెప్పరు. తెలుగులో మనం రాసే పుస్తకాల్లో ఈ అనుబంధ చతుష్టయాన్ని పాటించాలని అనుకుంటే తెలుగు వచన సంప్రదాయం పటిష్టంగా, తార్కికంగా వుంటుంది.

ఆంగ్ల నిఘంటువుల సంప్రదాయం తెలుగులో కూడా వుంటే అందులోని పదాలకి వాటి వాడుక గురించిన గుర్తింపులు ఉండేవి: ఉదా. 1. కవిత్వోపయోగి, 2. పాండిత్య ప్రకర్షకం, 3. ప్రాచీనం, 4. కృతకం. తెలుగులో ఇప్పటికీ నిఘంటువులలో ఈ రకమైన గుర్తింపులు మనకు కనపడవు. ఈ గుర్తింపులు లేకపోవడం చేత తెలుగులో ఉత్తరం ముగించేటప్పుడు భవదీయుడు, విధేయుడు, అనే మాటలు గౌరవార్థంలోను, ప్రేమగా, ఆప్యాయంగా అనే మాటలు వ్యక్తిగతమైన ఉత్తరాలలోను ఉండటమే కాకుండా ఉద్యోగసంబంధమైన ఉత్తరాలలో ‘నమస్సుమనుస్సులతో’ లాంటి మాటలు రాస్తే ఎవరూ కాదనడానికి వీల్లేదు. ఏది ఆధునిక తెలుగు భాష, ఏది కాదు అనే విషయంలో మనకు ఒక నిశ్చితమైన అభిప్రాయం రావడానికి మనకు నిఘంటువులు, ప్రచురణకర్తలు తోడ్పడాలి. పైన చెప్పినట్లు పద్యాలు రాయడానికి కవిత్వాలు చెప్పడానికి పాటలు పాడడానికి ఎవరి తోడ్పాటు, పోషణ అక్కర్లేదు. అందులో యే భాష వాడినా దాన్ని తప్పు పట్టవలసిన అవసరం లేదు. అది కవిస్వేచ్ఛ. కాని, వచనం కొన్ని నియమాలకి లోబడి ఉండాలి, ఆ నియమాలు అందరూ అనుసరించాలి. వచనం రాయడం ఎలాగో, వ్యాసం రాయడం ఎలాగో చిన్నప్పటినుంచి తరగతి గదుల్లో నేర్పించాలి. ఈ రకంగా నేర్పకుండానే వచనం రాయడం వచ్చేస్తుందనే భ్రమ మనందరిలో ఇప్పటికీ వుంది. మంచి వచనం లేని జాతికి మంచి ఆలోచన కూడా వుండదు. అందుచేత మనం ఆలోచించవలసింది సాహిత్యాన్ని గురించి కాదు వచనాన్ని గురించి.


అధస్సూచికలు[+]

రచయిత వెల్చేరు నారాయణరావు గురించి: వెల్చేరు నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్‌ విస్కాన్‌సిన్‌‍లో కృష్ణదేవరాయ చైర్‌ ప్రొఫెసర్‌‍గా పాతికేళ్ళపైగా పనిచేశారు. తెలుగు సాహిత్య విమర్శ రంగంలో ఎన్నో పుస్తకాలు ప్రచురించారు, పరిశోధనాపత్రాలు రాశారు. ఆయన రాసిన సిద్ధాంతగ్రంథం \"తెలుగులో కవితా విప్లవాల స్వరూపం\" తెలుగు సాహిత్య విమర్శ రంగంలో ఒక మైలురాయి. పాల్కూరికి సోమనాథుని సాహిత్యం నుండి ఆధునిక సాహిత్యం వరకూ తెలుగులోని శ్రేష్టసాహిత్యాన్ని (Classicsను) అనువదించడానికి నిర్విరామంగా కృషి చేస్తున్న వెల్చేరు నారాయణ రావు  ఎమరి యూనివర్సిటీ నుంచి పదవీవిరమణ అనంతరం ఏలూరు దగ్గర నివసిస్తున్నారు. ...