క్షణికమైన భయం మాటున వొదిగి
అబద్దమాడటం
ధర్మరాజుకే తప్పలేదంటూ
యేసు శిష్యరికంలో మెలిగిన
పేతురుకే తప్పలేదంటూ
సాకుల పరదా వేసుకుంటాము
ఎవ్వరూ
నిజాన్ని అబద్ధంగానూ,
అబద్ధాన్ని నిజంగానూ మార్చలేరు
అహంకారపు కిరీటాన్ని కాలదన్నేవాడు
ఏదోమూల తన ఇంటనే పుడ్తాడని తెలిస్తే
క్రౌర్యం కమ్మిన కళ్ళతో
శిశుహత్యా పాతకానికి కత్తి ఝుళిపించబడుతుంది
అయినా
కిరీటం ఎవరికి నిలబడిందని?
అబద్దాల వంతెనపై నడుస్తూ
లాలించడానికో వెన్నెల మొక్కను
కిటికీకి తగిలించాలనుకుంటాం!
పాలించడానికో సూర్య కిరణాన్ని తెంపి
గుమ్మానికి తోరణం కట్టాలనుకుంటాం!
ఏదీ నెరవేరని అయోమయమౌతుంది.
ఆకలి పేగుకు
అబద్దాల బిర్యానీ రుచించదు
సాకుల పరదాను చించి
గొంతు చించుకొని అరుస్తుంది.
అడుగులు లిఖించే
అబద్ధాల చిట్టాకు కొలమానమెక్కడ?
భయం లేకుండా నిర్భయంగా
అడ్డొచ్చిన నీటి ప్రవాహాన్ని దాటాల్సిందే!
పాదం మోపినప్పుడు
తడిసే కాలు అబద్దం కాదు కదా!