గాడ్ ఆన్ ది హిల్ – టెంపుల్ పోయమ్స్ ఆఫ్ తిరుపతి: ఒక మెచ్చుకోలు

ప్రపంచంలో ఏ కళా రూపాలు చూసినా అవి తన పురుడు పోసిన జాతినీ, నిలదొక్కుకున్న ప్రదేశాన్నీ, ఆనాటి సమాజాన్నీ, ఆలంబిత సంస్కృతినీ దాటి వేరొక పరిధిలోకి ప్రవేశించవు. ఒకవేళ ప్రదేశం మారి రూపాంతరం చెందినా అంతర్లీనంగా మూల సంస్కృతిని ప్రతిబింబిస్తూనే ఉంటాయి. కళలకున్న అంతర్గత సూత్ర స్వరూపం ఇది. ప్రతీ కళా రూపమూ తమ చుట్టూ ఉన్న సమాజంతో సంభాషణ జరుపుతుంది. అదే స్పందనకి దారితీస్తుంది. సాహిత్యం దీనికి మినహాయింపు కాదు.


గాడ్ ఆన్ ది హిల్: టెంపుల్ పోయెమ్స్(2004)
వెల్చేరు నారాయణ రావు, డేవిడ్ షూల్మన్

ప్రదర్శనాయోగ్యమైన కళలకి ప్రదర్శనే ఒక ప్రత్యేకమైన సంభాషణ. కానీ ఆ యోగ్యత లేని కళారూపాలకు భాషే ప్రధాన వాహకం. అంటే ఒక సంస్కృతిలోని కళారూపాన్ని మరొక సంస్కృతికి చేరవేసేటప్పుడు రెండవ సంస్కృతి భాషలో చెబితేనే అర్థమవుతుంది. సంగీతం తీసుకుంటే ధ్వనే దాని భాష. నాటకం లేదా నృత్యం తీసుకుంటే అభినయమే దాని భాష. ఇలా ప్రతీ కళకీ ఒక సొంత భాష లేదా గొంతుకుంటుంది. కానీ భాష చుట్టూ అల్లుకోబడ్డ కల్పన అనబడే కళారూపానికి మాత్రం వేరే భాషే ప్రధాన వాహకం అవుతుంది. అంటే ఒక కళారూపం తాను ధరించిన భాషావస్త్రాన్ని వదిలేసి రెండవ దాని భాషావస్త్రాలు ధరించి వారికి పరిచయమవుతుంది. పరిచయమున్న అలంకరణ చేయి పట్టుకొని మొదటి కళారూపం హృదయాన్ని వెతుక్కోవడానికి రెండోది ప్రయత్నిస్తుంది. సాహిత్యానువాదంలో భాష అలంకరణ అయితే, సాహిత్య మూలం దాని ఆత్మ. ఒక సంస్కృతిలోని సాహిత్యాన్ని వేరొక సంస్కృతికి అవగాహనయ్యేలా రూపాంతరం చేసి ఆవల చేరవేస్తాయి. అందుకే – అనువాదాలు వివిధ సంస్కృతులకి వారధులు. అనువాదం అనేది చాలా విస్తృతమైన కళ. కరపత్రమయినా, నినాదమయినా, ప్రభుత్వ పత్రాలయినా, సాహిత్యమయినా దేనికదే ప్రత్యేకమైనది. అన్నిటికంటే భిన్నమైనది సాహిత్యానువాదం. మూల రచయిత ఊహాశక్తీ, మేధాశక్తీ, అంతర్లీన భావనా, ఇవన్నీ ప్రతిబింబించినప్పుడే అనువాదం తన ఆశయం నెరవేర్చుకుంటుంది.

వెల్చేరు నారాయణ రావు, డేవిడ్ షూల్మన్‌ల God on the hill – temple poems from Tirupati పుస్తకం ఈ రకంగా అన్నమయ్య అక్షరాన్ని ఆవలి సాహిత్య తీరానికి చేరవేసిన పుస్తకం. ఇంతకుముందు వీరిద్దరూ చాటు పద్యాల మీద చేసిన అనువాదం, ఎ పోయమ్ ఎట్ ది రైట్ మూమెంట్, చదివాక ఈ పుస్తకం మీద మరింత ఆసక్తి కలిగింది నాకు. అన్నమయ్య కీర్తనలు అనువాదానికి లొంగవన్న అభిప్రాయం పాతుకుపోయిన వాళ్ళల్లో నేనూ ఒకణ్ణి. తీరా పుస్తకం తెప్పించుకొని చదివాక నా అభిప్రాయం పటాపంచలయ్యింది. నాకు బాగా తెలుసున్న కీర్తన వెతుక్కొని ఆ పద్యం ఇంగ్లీషు అనువాదం ఒకటికి రెండుసార్లు చదివాను.

Life day after day is a game
To find what you cannot see
is truth

Coming is real. Going is real.
What happens in between is a game.
Right in front of you
Lies the endless world.
At the very end
is truth.

ఇది చదివాక అన్నమయ్య కీర్తనలతో ఏపాటి పరిచయం ఉన్న వారికయినా ఇది ఏ కీర్తనో అర్థమయ్యే ఉంటుంది. ‘నానాటి బ్రతుకూ, నాటకమూ – కానక కన్నది కైవల్యమూ,’ కీర్తన అనువాదం ఇది. Life day after day is a game, అన్న వాక్యం చూడండి. మనకి, అంటే తెలుగు లేదా భారతీయ సాహిత్యంలో, జీవితాన్ని నాటకంతో పోల్చడం పరిపాటి. కానీ పాశ్చాత్య దేశస్థులు జీవితాన్ని ఆటతో పోల్చుకుంటారు. జీవితం ఒక ఆట అన్నది వారి జనస్రవంతిలో నానుడి. ప్రజల వాడుక భాషతో (ఇక్కడ ఇంగ్లీషు) పరిచయం లేకుండా, కేవలం భాషా పరమయిన పదజాలంతో పరిచయమున్న ఎవరైనా, Life day after day is a play (or drama)” అని అనువాదం చేసే ఆస్కారం ఉంది. ఇక్కడే అనువాదకుల గొప్పదనం కనిపించింది. ‘పుట్టుటయు నిజము పోవుటయు నిజము; నట్టనడిమి పని నాటకము – యెట్ట నెదుట గలదీ ప్రపంచము; కట్ట గడపటిది కైవల్యము.’ అన్న చరణానికి అనువాదం చూడండి. ఆటలో ప్రవేశమూ, నిష్క్రమణే ఉంటాయి. మధ్యలో ఉన్నదే నిజమైన ఆట. అది జరిగేది అంతులేని ప్రేక్షకుల ముందు. అంటే ప్రపంచం ముందు. ఆట చివర ముగింపే నిజమైనది.

మొత్తం పుస్తకంలో నాకు బాగా నచ్చిన అనువాదాలలో ఇది ఒకటి. తెలుగు వారు ఆస్వాదించ గలిగిన అన్నమయ్య భాష వాడుకలో ఉండే ప్రత్యేకతలూ, అందమూ ఇతర భాషల వారికి సహజంగా అర్థం కావు. ఈ పుస్తకం ప్రధాన ఉద్దేశ్యం అన్నమయ్య కీర్తనల్లో ఉన్న కవితా మాధుర్యాన్నీ, భావనా పటిమనీ ఇతర భాషల వారికి, ముఖ్యంగా ఇంగ్లీషులోకి, పరిచయం చెయ్యడమే కాదు, అన్నమయ్య ఎంత ఆధునికమైన కవో చూపించడం కూడా. ఈ మొత్తం పుస్తకం చదివాక అనువాదకుల లక్ష్యం పూర్తిగా నెరవేరిందనిపించింది.

సాధారణంగా పాటల్లో, పల్లవి ఇతివృత్త మూలాన్ని సూచిస్తే, అనుపల్లవి దాని గమనాన్ని నిర్దేశిస్తుంది. మిగతా చరణాల్లో అది విశదీకరించబడి, తిరిగి ఇతివృత్తాన్ని అంటే పల్లవిలో సారాంశాన్ని నొక్కి చెబుతుంది. పల్లవీ, చరణాలు ఒక గొలుసు కట్టులా ఇమిడుంటాయి. చరణాంతాలతో పల్లవి కలిసిపోతుంది. అనాదిగా ఇదే పద్ధతిని పాటలకి అనుసరిస్తూ వచ్చారు. ఈ పద్ధతే మనకి త్యాగయ్య, క్షేత్రయ్య, రామదాసు, అన్నమయ్య కీర్తనల్లో కనిపిస్తుంది. పల్లవి లేదా ఎత్తుగడ ప్రాధాన్యత పాటల్లో చాలా ముఖ్యమైనది. ఇవే పాటల్ని లేదా కీర్తనలని వేరొక భాషలోకి అనువాదం చేసేటప్పుడు కొన్ని సమస్యలున్నాయి. ముఖ్యంగా ఈ గొలుసుకట్టు ఇతివృత్తాన్ని అమలుపరచడం. ఈ సమస్యని వెల్చేరు, షూల్మన్లు చాలా చాకచక్యంగా ఈ అన్నమయ్య కీర్తనల అనువాదంలో పరిష్కరించారు. అంటే రెండు మూడు పాదాలున్న కీర్తనల్లో గొలుసుకట్టు పద్ధతిని సున్నితంగా, భావయుక్తంగా చూపించారు. పల్లవిలో ముఖ్యమైన అంశాన్నే తీసుకున్నారు తప్ప, దాని చుట్టూ అల్లబడిన నేపథ్యాన్ని కొన్ని సందర్భాల్లో పూర్తిగా త్యజించారు.

ఉదాహరణకి –

These marks of black musk
on her lips, red as buds,
what are they but letters of love
sent by our friend to her lover?

Her eyes the eyes of a cakora bird,
why are they red in the corners?

Think it over, my friends:
what is it but the blood
still staining the long glances
that pierced her beloved
after she drew them from his body
back to her eyes?

What are they but letters of love?

ఇది, ‘ఏముకో చిగురు టధరమున – ఎడనెడ కస్తూరి నిండెను – భామిని విభునకు రాసిన – పత్రిక కాదు కదా?’ కీర్తన అనువాదం. ఇక్కడ భామిని విభునకు రాసిన పత్రిక కాదు కదా? (What are they but letters of love?) అన్నదాన్నే మకుటంగా వాడుకున్నారు. అది చరణాంతాలతో చక్కగా కలిసిందనిపించింది. చదువుతూంటే ఒక ఇంగ్లీషు పద్య కవిత్వం చదువుతున్నట్లుగా అనిపించింది తప్ప వేరొక భాషలోని కీర్తన అనబడే ప్రక్రియని చూపిస్తున్నట్లుగా అనిపించలేదు. అలాగే అనువాదంలో ఎంచుకున్న సరళమైన పదాలూ, క్లుప్తత మరింత భావగర్భితంగా అమిరాయి.