గత సంచికల్లో ఈమాటలో ప్రచురించబడ్డ శ్రీ రోహిణీ ప్రసాద్ సంగీతపరమైన వ్యాసాలకు ఈమాట పాఠక-శ్రోతల నుంచి మంచి స్పందన వచ్చింది. ముఖ్యంగా, జంధ్యాల పాపయ్యశాస్త్రి గారి ఉదయశ్రీ ఖండ కావ్యంలోని పద్యాలైన పుష్పవిలాపం, కుంతీకుమారి పద్య రచనలను ఘంటసాల స్వరకల్పన చేసి పాడగా వాటిపై శ్రీ రోహిణీప్రసాద్ ఇచ్చిన వివరణ పాఠకుల మెప్పు పొందింది. గతంలో నేను ఇక్కడ రాసిన సంగీత వ్యాసాలను కూడా ఈమాట పాఠక – శ్రోతలు ఆదరించి నన్ను మరిన్ని సంగీతపరమైన సాహిత్యాన్ని పరిచయం చేయమని కోరారు. అందులో ఒక ప్రయత్నంగా, జంధ్యాల పాపయ్యశాస్త్రి గారి ఉదయశ్రీ ఖండ కావ్యం నుంచి కొన్ని పద్యాలను తీసుకొని ప్రముఖ గాయక, సంగీత దర్శకుడు ఘంటసాల స్వరపరచి, గానం చేసిన పద్యాలను పరిచయం చేసే ప్రయత్నం ఇది.
‘కరుణశ్రీ’గా పేరుపొందిన పాపయ్యశాస్త్రి గారి ఈ ఖండకావ్య రచనలో ముఖ్యరసం కరుణ. భార్య – పిల్లవాడిని వదిలి బరువు గుండెలతో వెళ్ళే కారుణ్యమూర్తి అయిన గౌతమ బుద్ధుడు, అయోధ్య నగర అంతఃపురాల్లో నుంచి దండకారణ్య పర్ణకుటిలో తన జీవిత సౌభాగ్యాన్ని వెతికే ఊర్మిళాదేవి ఉత్కంఠ, గంగానది గట్టు మీద నిలిచి నిర్ఘాంతపోయి ఏటి కెరటాలలో ఎక్కడకో కొట్టుకుపోయే కొడుకు వైపు నిశ్చల నిరీహ నేత్రాలతో చూచే కుంతీకుమారి గుండెల చప్పుడు – ఇతివృత్తాలుగా తీసుకొని చేసిన రచనలు ఈ ఖండకావ్యంలోని కొన్ని ఆణిముత్యాలు.
“ప్రణయమూర్తి అయిన ఆమె నాలోని కవిత్వం. ఆమె నా కరుణామయి – నా జీవిత సహచరి – నా కళ్యాణమూర్తి – నా ఆరాధ్యదేవి” అంటూ ప్రేయసిని వర్ణించే కవిత్వంలో ఆరాధన తప్ప మరేమీ చూడలేము.
కరుణకూ కవికీ అవినాభావ సంబంధం ఉంది. కరుణ లేకపోతే కవికి వ్యక్తిత్వం లేదు. కవి లేకపోతే కరుణకు అస్తిత్వంలేదు అన్న ఆలోచనల చుట్టూ అల్లుకొన్న “కరుణశ్రీ” సాహిత్యాన్ని – అంత మృదువుగా స్వరకల్పన చేసి తెలుగువారందరికి అందించిన ఘంటసాల ధన్యజీవి. ఘంటసాల ఈ ఖండకావ్యంలోని పద్యాలను అద్భుతంగా స్వరపరచి పాడి తెలుగువారికి అందించి ఉండకపోతే, ఈ సాహిత్యం మరుగున పడి ఉండేదని నా గట్టి నమ్మకం!
ఈ వ్యాసంలో ‘అంజలి, ‘అద్వైతమూర్తి,’ ‘సాంధ్యశ్రీ,’ అన్న పేరుతో రచింపబడ్డ ఎనిమిది పద్యాలను పరిచయం చేస్తాను. పుష్పవిలాపం, కుంతీకుమారి వంటి పద్యాల లాగా ఇప్పుడు పరిచయం చెయ్యబోయే సాహిత్యం అందరికీ తెలియకపోయినా, నా ఉద్దేశ్యంలో ఈ పద్యాలు కూడా సంగీత-సాహిత్యాల పరంగా అంత గొప్పవే! పాఠక-శ్రోతల వీలుకోసం ఈ పద్య సాహిత్యమే కాక, ఘంటసాల పాడిన ఈ పద్యాలను కొంత సంగీత వివరణతో సహా మీకు అందిస్తున్నాను.
ఘంటసాల పాడే పద్యాలలో ఒక ఒరవడి ఉంది. అంతకు మునుపెన్నడు, ఆ మాటకొస్తే ఘంటసాల కాలం చేసిన తరవాత కూడా, ఎవ్వరూ పద్యాన్ని ఇంత రాగ భావ యుక్తంగా బాణీ చేసి పాడినవారు కనపడరు. పద్యంలోని పదాలని అర్ధం చెడిపోకుండా ఎక్కడ విరవాలో అలా విరుస్తూ, ఆ విరుపులో సంగీతం ద్వారా భావాన్ని సాహిత్యంతో జోడించటంలో ఘంటసాల చూపిన అసాధారణ ప్రతిభ అనితరసాధ్యం. ఉత్సాహం ఉన్నవారు ఈ పద్యసాహిత్యాన్ని చూస్తూ ఘంటసాల ఎక్కడ, ఎలా పద్యంలోని పదాలను విరుస్తూ పాడాడో గమనించండి. ఘంటసాల లాగా అందరికీ సంగీతంలోని గమకాలు, ఆలాపనలు రాకపోవచ్చు కానీ – కొంచెం ప్రయత్నిస్తే, అపస్వరం పడకుండా అర్ధవంతంగా పద్యాన్ని ఎలా పాడవచ్చో తెలుస్తుంది!
అంజలి
ఈ క్రింది పద్యాన్ని హంసానంది రాగంలో బాణీ చెయ్యటం జరిగింది. హంసానంది ఒక కర్నాటక రాగం. ఈమాట పాత సంచికల్లో హాయిహాయిగా ఆమని సాగే.. అన్న ప్రముఖ రాగమాలిక అయిన సినీగీతం పరిచయ వ్యాసంలో సోహిని అన్న రాగాన్ని మొదటి రాగంగా పరిచయం చేశాను. హిందూస్తానీ రాగమైన సోహిని రాగం కర్నాటక రాగమైన హంసానంది రాగానికి దాదాపు సమానమైనది.
అంజలి
ఈ రెండు రాగాల్లోనూ పంచమం నిషిద్ధం! స, రి1, గ2, మ2, ద2, ని2 – స్వరాలు వాడబడ్డాయి. ఈ పద్య సాహిత్యానికి అతికినట్టుగా సరిపోయిన ఈ రాగంలోని భావం సాహిత్యంలో ఉన్న భావాన్ని రెట్టింపు చేసింది.
పుట్టబోయెడి బుల్లిబుజ్జాయి కోసమై
పొదుగుగిన్నెకు పాలు పోసి పోసి
కలికి వెన్నెల లూరు చలువ దోసిళ్ళతో
లతలకు మారాకు లతికి యతికి
పూల కంచాలలో రోలంబములకు రే
పటి భోజనంబు సిద్ధపరచి పరచి
తెలవారకుండ మొగ్గలలోన జొరబడి
వింత వింతల రంగు వేసి వేసి
తీరికే లేని విశ్వ సంసారమందు
అలిసిపోయితివేమో దేవాదిదేవ!
ఒక నిమేషము కన్నుమూయుదువు గాని
రమ్ము! తెరచితి నా కుటీరమ్ము తలుపు!!
పాపయ్యశాస్త్రి గారి అంజలి పేరుతో వచ్చిన చాలా పద్యాలలో నాకు తెలిసి రెండు పద్యాలకే ఘంటసాల బాణీ కట్టాడు. ఇందులో రెండవ పద్యం బాణీ కల్యాణి రాగంలో ఉంది. ఈమాటలోని గత సంచికల్లో చాలా సార్లు కల్యాణి (హిందుస్తానీ సంగీతంలో ‘యమన్’) రాగం గురించి మాట్లాడటం జరిగింది. ఇక ఈ పద్యంలోని సాహిత్యం చూస్తే, ఎంతో ఆర్తితో విశ్వసంసార నిర్మాత అయిన ఆ కరుణామయుడిని తాను ఏమీ లేని నిరుపేదనని చెపుతూ ఎలా తన ఆత్మపీఠమ్ముపైకి రమ్మనమని ఎంత వినయంగా ఆహ్వానిస్తున్నాడో కనపడుతుంది. కరుణ రసాన్ని చక్కగా పోషించగలిగే కల్యాణి రాగం తప్ప మరే రాగంలోనూ ఈ పద్యం ఇంత అందంగా ఉండదేమో అనిపిస్తుంది. రాగం ఆలాపన ఎక్కువగా తెలియని వారు, ఘంటసాల ఈ పద్యం చివర ఆలపించిన రాగాలాపన చెయ్యకుండా వదిలేసినా ఈ పద్యం అర్ధం చెడదు!
కూర్చుండ మాయింట కురిచీలు లేవు నా
ప్రణయాంకమే సిద్ధపరచనుంటి!
పాద్యమ్ము నిడ మాకు పన్నీరులేదు నా
కన్నీళ్ళతో కాళ్ళు కడుగనుంటి!
పూజకై మావీట పుష్పాలు లేవు నా
ప్రేమాంజలులె సమర్పించనుంటి!
నైవేద్యమిడ మాకు నారికేళము లేదు
హృదయమే చేతి కందీయనుంటి!
లోటు రానీయ నున్నంతలోన నీకు
రమ్ము! దయసేయు మాత్మపీఠమ్ముపైకి
అమృతఝురి చిందు నీ పదాంకములయందు
కోటి స్వర్గాలు మొలిపించుకొనుచు తండ్రి!