అన్నమయ్య పద పరిచయం
జయప్రభ, 2006.
తేనెలపై తేట తిన్నని చెఱకు –
పానకముల నేరు పఱచిన మేలు
చక్కెరలో తీపు చల్లదెమ్మెరలు
చిక్కని కపురంబు జీవరత్నములు
కల యమృతంబు మీగడమీది చవులు
చిలుకుచు గవులెల్ల జేయెత్తి మ్రొక్క –
ఇది చిన్నన్న తన తాతగారైన అన్నమయ్య పదాల గురించి చేసిన వ్యాఖ్యానం. చిన్నన్న ఒక్కరే కాదు; ఈ తీపులకు కవులందరూ వారసులే!నని తాళ్ళపాక చిన్నన్న గురించి చెబుతూ ఆరుద్ర వ్యాఖ్యానించారు.
అన్నమయ్య పదాలతో పరిచయమున్న ఎవరికైనా పైన చెప్పినవన్నీ ప్రతీ అక్షరానికి పొల్లుపోకుండా నప్పుతాయని తెలుసు. ముప్పైవేల పైచిలుకు పదాలు రాసిన అన్నమయ్య పదకవిత్వంలో ఇమడని వస్తువు లేదు. అందని భావం లేదు. లొంగని సందర్భం లేదు.
లాలిపాటలు మొదలుకొని, శృంగార పదాలమీదుగా, విప్లవ పదాలతో కలుపుకొని వేదాంత, ఆధ్యాత్మిక పదాల వరకూ అన్నీ సృజించాడు. ఎందుకనో – లాలిపాటలూ, ఆధ్యాత్మిక పదాలూ ఆస్వాదించి అక్కున చేర్చుకున్నంత సులభంగా తెలుగువారు శృంగార పదాలని ఆస్వాదించలేదు. అక్కడక్కడ ఒకటీ అరా శృంగార కీర్తనల ప్రస్తావన వున్నా, ఆసాంతమూ స్వీకరించలేదు. కాస్త దూరంగానే ఉంచారు. ఆధ్యాత్మిక కీర్తనల మీద ఎన్నో వ్యాఖ్యాన సహిత వివరణలు వచ్చాయి. వస్తున్నాయి కూడా. శృంగార పదాలపై వ్యాఖ్యానించడానికి ఎవరూ సాహసించలేదు. కొంతమంది కవులు వాటిని ఆస్వాదించినా, తమ వేరే రచనలపై వీటి ప్రభావం పాఠకుల్లో కనిపిస్తుందని భావించారో ఏమో ఎక్కడ రాసినట్లు కనిపించదు.
అన్నమయ్య శృంగార పదాలని కేవలం శృంగారంగా చూడకుండా కవితాత్మకంగా పరిశీలించి అందులో ఉండే పద మాధుర్యాన్నీ, భావ సౌందర్యాన్నీ వివరిస్తూ ఒక పుస్తకరూపంలో ప్రచురించడం మెచ్చుకోదగ్గ విషయం. పైగా ఇది ఒక కవయిత్రి చెయ్యడం మరింత సాహసం. ఆ పుస్తకం – “వలపారగించవమ్మ వనిత నీ – యలుక చిత్తమున కాకలి వేసినది” పేరున అన్నమయ్య పదపరిచయం చేసింది జయప్రభ. తెలుగు పాఠకులకి, ముఖ్యంగా ఆధునిక కవిత్వంతో పరిచయమున్న వారికి జయప్రభ పేరు ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.
తెలుగు సాహిత్యం తీసుకుంటే ఇంతవరకూ కేవలం మగవాళ్ళే (ఒక్క ముద్దుపళని రాధికా స్వాతనం మినహాయింపు) శృంగార రచనలు చేశారు. వ్యాఖ్యానించిన వారి సంఖ్యలో కూడా వీరిదే పై చేయి. అటువంటిది స్త్రీవాద రచయిత్రిగా పేరుపొందిన జయప్రభ, అన్నమయ్య శృంగార కీర్తనలపై వ్యాఖ్యాన సహిత పరిచయం చెయ్యడం మెచ్చుకోదగ్గ విషయం. తను నమ్మిన సిద్ధాంతాలనీ, అనుసరించే వాదాలనీ పక్కన బెట్టి, కేవలం కవిత్వాన్ని కవిత్వంగా అంగీకరిస్తూ, ఆస్వాదిస్తూ రాసిన రచన ఇది. ఈ పుస్తకం ఏ తిరుమల తిరుపతి దేవస్థానం వారో ప్రచురించారని అనుకుంటే పొరపాటే! ఆవిడ సొంతంగా చైత్యన-తేజ పబ్లికేషన్స్ పేరున అచ్చు వేసారు.
చిన్నప్పుడు ఊహ తెలిశాక ‘కొలని దోపరికి గొబ్బిళ్ళో – యదుకుల స్వామికి గొబ్బిళ్ళో’తో ప్రారంభమయిన అన్నమయ్య పరిచయం, అడపా దడపా ‘జో అచ్యుతానంద జోజో ముకుందా’, ‘చందమామ రావే జాబిల్లి రావే!’ వంటి లాలిపాటలూ, ‘అదిగో అల్లదిగో శ్రీహరివాసము’ వంటి భక్తి పాటలు వినడం వరకే ఉన్న జయప్రభ, అన్నమయ్య కీర్తనలన్నీ సహేతుకంగా చదివాక ఆయన అక్షర వ్యామోహంలో పడ్డాననీ ‘పులకల మొలకల పున్నమి’ శీర్షికతో ముందుమాటగా చెప్పుకొచ్చారు. అన్నమయ్య పదం ఆవిణ్ణి చేరడానికీ లేదా అన్నమయ్య పదం వెతుక్కోవడానికీ చాలా కాలమే పట్టిందనీ, తానెందుకు ఈ పుస్తకం రాయడానికి ఉపక్రమించారో చెప్పే సందర్భంలో – “తొలితరం పండితులు అప్పటికే వయో వృద్ధులవటం వలన అన్నమయ్య సాహిత్యాన్ని పరిష్కరించే పని తోనే సరిపోయింది వారికి. వాటిని విశ్లేషించి వాటిలోని కవితా గంధాలని వెలికి తీసే పనికి వారెవ్వరూ పూనుకోలేదు. బహుశా ఇబ్బంది లేనందున కాబోలు, అన్నమయ్య రాసిన భక్తి-వేదాంత సంకీర్తనల గురించే హెచ్చు మాట్లాడారు గానీ వీరంతగా తమ చూపుని శృంగార కీర్తనల వైపు తిప్ప లేదు… అన్నమయ్య రాసిన వాటిలోంచి ఎంపిక చేసుకుంటూ భక్తి ప్రాధాన్యం ఉన్నవీ, వైరాగ్య భావనలతో ఉన్నవీ ఎక్కువగా పాడుతున్నారు తప్పితే ఆయన రాసిన అద్భుత శృంగార సంకీర్తనలని ఇంకా విస్తృతంగా పాడటమే లేదు!” – అని అన్నారు. ఇది మాత్రం అక్షర సత్యం.
ఇలా తెలుగువారి తీరుని తూర్పార బట్టడమే కాకుండా, పద్య సాహిత్యానికి పెద్ద పీట వేసిన పండిత వర్గం పద సాహిత్యాన్ని చాలా కాలంగా ఎందుకు పట్టించుకోలేదని తమ ముందుమాటలో ప్రశ్నించారు. ఇంతకాలం కవులందరూ అన్నమయ్య సాహిత్యాన్ని భక్తి సాహిత్యంగానో, ఆధ్యాత్మిక సాహిత్యంగానో పరిగణించారే తప్ప అందులోని కవితా ధారనీ, పద సౌందర్య ఝరినీ, భావనా పటిమనీ ఎందుకు విశ్లేషించడం లేదంటూ వాపోయారు.
“హిందూ నాగరికతలో శృంగార రసమెప్పుడూ శిఖరాయమానంగానే సాహిత్య, శిల్ప కళల్లో ప్రతిఫలించింది. ఐతే శృంగారానికీ, బూతుకీ తేడా తెలియనివారు శృంగార వ్యక్తీకరణని కూడా బూతుగానే చూడగలరు. అది దృక్పథంలో ఉన్న తేడా! దృష్టి మారినప్పుడే దృశ్యమూ మారుతుంది!” అన్న జయప్రభ వ్యాఖ్యానం చూసి ఈ పుస్తకాన్ని చదివితే అన్నమయ్య శృంగారపదాల్లో ఇమిడిన కవిత్వాన్నీ, భావ వ్యక్తీకరణనీ, తన్మయత్వ ప్రేమనీ చూస్తామే తప్ప ఎక్కడా బూతు అన్న భావన కూడా స్ఫురణకి రాదు. ఇది ఈ పుస్తకంలో మెచ్చుకోదగ్గ విషయం. మొత్తం శృంగార కీర్తనలన్నీ విశ్లేషించడం సాధ్యం కాదని తెలుసుననీ, అందుకే తనకి నచ్చిన, తను మెచ్చిన కొన్ని సంకీర్తనలని మాత్రమే ఎన్నుకున్నానని వివరణ ఇచ్చారు.
“ప్రేమ, మోహం, రతి అన్నవి జీవితంలో చాలామందికి చాలా ముఖ్యమయిన అంశాలు. వీటితో జీవితాన్ని నింపుకున్న వారికీ, నింపుకోని వారికీ కూడా! శృంగారాన్ని కాదనడం … తల్లి తండ్రుల ప్రేమని కాదనటమే! ప్రేమ, మోహం, రతి – వీటిని సాహిత్యంలో ఎన్ని రకాలుగా వ్యక్తీకరించారన్నది ఆసక్తికరమయిన విషయం కాగలగాలి. అలాంటి ఆసక్తి ఉన్న వారికి అన్నమయ్య పదం తరగని గని లాంటిది,” అంటారు జయప్రభ.
“ఏమిటి అన్నమయ్య శృంగారపద రచనలోని విశిష్టత? కామము అన్నది సమస్త ప్రాణి కోటికీ ప్రాణాధారమైనంత ముఖ్యమైన విషయం… మిగతా ప్రాణికోటికి కామమే ఉంది. శృంగారం లేదు. కోప ప్రకటనే ఉంది. వాటిలో పాపభీతి లేదు… సంస్కారయుతమైన రాసలీల అందుకనే మానవకోటి అనుభవించడానికి సాధ్యం అవుతుంది. మనిషి సంస్కారయుతుడైనప్పుడే ఉత్తమమైన శృంగార భావనలని అనుభవించగలడు. ఆవిష్కరించగలడు. వారిలోని శృంగారభావన ఉత్తమ స్థాయిలో లేనప్పుడు వారి శృంగార ప్రకటన కూడా ఉత్తమ స్థాయిలో ఉండదు. అది బూతు అవుతుంది! అలాంటి బూతు దృక్పథం గల్గిన మనుషులే శృంగారం పేరుతో అరాచకాలనీ, లైంగిక అత్యాచారాలనీ జీవితంలో ఆచరించడానికీ వెనుకాడరు. దీనిని ఎదుర్కోవడానికి తప్పని సరిగా – ఉన్నతమైన శృంగారాన్నీ, ప్రేమనీ ఆదర్శంగా చూపించాలి!” వంటి ప్రతిపాదనలతో కూడిన ఈ పుస్తకంలో అన్నమయ్య శృంగార కీర్తనల మీద సవివరణే కాదు, సహేతుక విశ్లేషణలు కూడా ఉన్నాయి.
అలాగే అన్నమయ్య పదాలలోని ఆకర్షణ ఎంత భావ వ్యామోహానికి దారి తీసిందో చెబుతూ – “ఆయన వర్ణించిన శృంగార వ్యవస్థ మీద ఎలాంటి నమ్మకమూ నాలో లేకుండానే అన్నమయ్య శృంగార కీర్తనలని చాలా గాఢంగా నచ్చుకున్నాను… ఆయన నాయికలలో ఎక్కడో వెతుక్కున్నానని అన్నా బహుశా అసహజమేమీ లేదనుకుంటాను. అలాగనీ నేనిష్టపడటంలో భక్తీ లేదు. నమ్మకమూ లేదు. గాఢమైన ఒక ఇష్టం వుంది.” అంటూ బహుభార్యాత్వం మీదా, వేశ్యా వృత్తి మీదా, కేవలం పురుషుని పరంగానే చెప్పిన శృంగారం మీదా తనకున్న అభ్యంతరాలని చెబుతూ తనదైన స్త్రీవాదాన్ని చూపించారు. అలాగే తాను రాసిన ప్రేమకవిత్వంలో కొన్ని భావనలు అన్నమయ్య కీర్తనల్లో కనిపిస్తే అబ్బురపడిన విషయాలు కూడా వివరించారు.