ఇలాంటి ఫీచర్స్ చదివిన పాఠకులు చరిత్రపరంగా ఆసక్తి కనబరిచినా సినీజర్నలిజంలో అప్పటికీ ఇప్పటికీ ఉన్న తేడాలను గురించి కామెంట్లు రాయకపోవడం ఆశ్చర్యమే. ఆ కాలపు సినిమాలే కాక, సినీజర్నలిజం, విమర్శలూ, సమీక్షలూకూడా భిన్నంగానే ఉండేవి.
అక్కినేని స్కెచ్
అక్కినేని నాగేశ్వరరావు పై వచ్చిన ఈ వ్యాసం కుటుంబరావుగారి రచనే. ఆయన పద్ధతికి సరిపోని నటీనటులందరి జన్మరాశి ప్రస్తావనా కనబడు తోందంటే అది ఎడిటోరియల్ పాలిసీ అయుంటుందని నేననుకుంటున్నాను. నిజజీవితంలో sun signs గురించి మా నాన్న ఒక్కసారి కూడా మాట్లాడలేదు కనక అది నా అభిప్రాయం. బహుశా హాలీవుడ్ సినిమా పత్రికల ప్రభావమేమో.
దుక్కిపాటి, కె.వి.రెడ్డిల కాంబినేషన్లో అప్పటికింకా రాబోతున్న సినిమా దొంగరాముడు. 1952 లోనే నాగేశ్వరరావులో ‘కొత్తపోకడలూ, కొత్తశక్తులూ చూడబోతా’మనే అభిప్రాయం ఎంత నిజమయిందో ఈనాడు అందరికీ తెలుసు. విశేషమేమిటంటే అతని సుదీర్ఘమైన ఆయుష్షు, నటజీవితం మిక్కిలినేని వంటివారికి కూడా సాధ్యం కాలేదనే సంగతి.
సందేహాలు, సమాధానాలు :- ఇందులో సినీజర్నలిస్ట్‌లకు పాఠకులు వేసే ప్రశ్నలు దాదాపు ఎల్లప్పుడూ ఒకేలా ఉండేవని అనిపి స్తుంది. కొన్ని వివరాలకు జర్నలిస్ట్ చాలా ఫుట్‌వర్క్ చెయ్యకతప్పదని కూడా మనం తెలుసుకోవచ్చు.
తొలి అనుభవాలు :- రాబోయే కాలంలో మాయాబజార్‌లో శకుని, అప్పుచేసిపప్పుకూడులో రామదాసు మొదలైన పాత్రలు వేసి శభాష్ అనిపించుకున్న సిఎస్ఆర్ నాటకాల్లో గాయకుడనీ, కృష్ణుడి వేషానికి పేరుపొందాడనీ తరవాతి తరాలకు తెలియదు. అలాగే కృష్ణకుమారి 1952లోనే సినీజర్నల్ స్థాయిలో పరిచయం చేసేంత ఉండేదంటే ఆశ్చర్యమే.
సావిత్రి స్కెచ్
ఇందులో కూడా కొంతభాగం చిరిగింది. 60 ఏళ్ళు గడిచిపోగా ఇంకెన్నాళ్ళు ఈ కాగితాలు భద్రంగా ఉంటాయో తెలియదు కనక స్కాన్ చేసి పెట్టాను. సావిత్రిమీద పాఠకులకూ, ప్రేక్షకులకూ అభిమానం ఏ మాత్రమూ తగ్గలేదు కనక ఈ వ్యాసాన్ని వారు చదివి ఆనందిస్తారనుకుంటాను.
ఆమెకు కుటుంబరావుగారు ఊహించిన ‘మంచి భవితవ్యం’ మాట నిజమయింది కాని హిందీ సినిమాల్లో ప్రవేశం మటుకు లభించలేదు. విజయావారు రషెస్ అందరికీ చూపడం వంటి అపురూపమైన విషయాలు మనం ఈ వ్యాసంనుంచి తెలుసుకోవచ్చు. అలాగే సావిత్రి తొలిదశ విశేషాలు ఇంత వివరంగా మరెక్కడా దొరకవేమో. మొత్తంమీద ఇలాంటివి చదివితే టైమ్ మెషీన్ మీద కూర్చుని గతంలోకి వెళ్ళినట్టుగా ఉంటుంది. ఎందుకంటే అప్పటి భవిష్యత్తు మనకు గతమే!