గెలుపు
నాన్న గెలుస్తే
అమ్మ ఓడి పోతుంది
(ఎప్పుడూ)
అమ్మ గెలుస్తే
నాన్న ఓడి పోతాడు
(ఎప్పుడో)
అమ్మా నాన్నా కలిసి గెలిచింది
బహుశా నన్నే
గాలి
నిద్రపోని
గాలి పక్షి
ఆడుతూ పాడుతూ
భూభాగమంతా
ఎగురుతుంది
దాని రెక్కలు
అలసిపోనంత వరకే
ప్రపంచానికి నిశ్చింత
పేచీ
ఎక్కువయితే ఎక్కువయిందని
తక్కువయితే తక్కువుందని
తెగ అల్లరి చేస్తోంది పాప
ఏ ప్రయత్నాలూ ఫలించక
ఎంత కావాలో చెప్పవే
సతాయించక అంది తల్లి
ఇచ్చిన దాన్ని లాక్కుని
విసిరి కొట్టింది పాప
నాకూ తెలీదని
పగుళ్ళు
ఇంటికి పగుళ్ళొచ్చాయి, చూసారా అంది ఆమె
అప్పుడేనా, ఎలా వచ్చాయన్నాను
పనులు సరిగ్గా చేస్తే కదా? మనం సరిగ్గా చూసుకుంటే కదా?
రాకుండా ఎలా ఉంటాయంది ఆమె
సరే ఇప్పుడేమి చేద్దామంటావు?
కళ్ళు మూసుకుని కూర్చుంటే ఇంకా పెద్దవవుతాయంటాను. అంతే!