ఫాదరు జోజి

దినానికని వచ్చి
అలా వగవకండి;
ఎటూ పోను నేను,
సమాధిలో లేను.
రొజ్జకొండ గాలి
చలై తాకుతాను.
కొండ శిలువ దారి
తళుక్కు మంటాను.
నేలబారు గద్ద
నిడుపు సూపు నేను
నేలమీద లేను
ధూళి రేగుతాను.
ఎండపాటి వేళ
ఇలాగొచ్చినపుడు
కఱ్ఱి మబ్బు నీడ
గొడుగు పరుస్తాను.
నెల్లిచెఱువు నీరు
జల్లు కురుస్తాను.
సమాధుల్ని చూసి
భ్రమిస్తారు నన్ను!
దినానికని వచ్చి
అలా వగవకండి;
పిలిస్తే వింటాను
తలిస్తే ఉంటాను.
ఎటెల్తాను నేను?!
ఇటే నిలుస్తాను.


(Based on Mary E. Frye’s poem (1932) Do not stand at my grave and weep).