వెన్నెల తెరపై వెండి కల

“అమ్మా! నువ్వు అడిగిన సినిమా అమెజాన్ ప్రైమ్‌లో వచ్చింది చూడు,” నివాస్ ఫోన్, “ఆ సినిమా ఇక్కడ చూస్తేనే, సినిమా హాల్‌కి రాదు.”

సెవంటీ ఎం.ఎం. సినిమా ఇప్పుడు అరచేతిలో! ఆ డాల్బీ సౌండ్ ఉండదు, చెవులకు విసుగ్గా హెడ్‌ఫోన్స్!

“అదిగో ఆ కొండంచు వైపు చూడు!” ఎక్కడ ఏమి కనిపిస్తుందని ఈ అరచేతి వైకుంఠంలో.

“ఇదిగో ఇది బాగుంది చూడండీ…”

“హలో! ఉండవే ఫోన్ మాట్లాడి వస్తాను,” కొంచెం పాజ్… అనుభూతిలో కూడా.

మళ్ళీ ఎలానో మొదలు…

డోర్ బెల్. “ఉండండి వాటర్ కాన్ తీసుకొని వస్తాను,” మళ్ళీ పాజ్… మళ్ళీ మొదలు.

“దోసె వేసుకొని రారాదా! టీ కూడా. తింటూ చూద్దాం.”

ఇల్లాలు పని… మళ్ళీ పాజ్.

అనుభూతి ముక్కల్ని మనసులో జూమ్ చేసుకుని కలుపుకుంటే జ్ఞాపకం మైనస్ అయిపోతూ ఉంది.


ఫోన్ మోగింది. “లేదండీ. సినిమాహాల్‌లో ఉన్నాం. మళ్ళీ చేస్తాను.”

అంత ఎత్తైన జలపాతం ఒక్క ఉదుటున మనని కొండకొమ్ముకు లాక్కెళ్ళి పోతుంటే, చెవుల్లో జలపాత శబ్దం మనని తనతో ప్రవహింపచేస్తూ. ఆ సీతాకోక చిలుకలు చూడు! ఆ కొండకొమ్ములో తాను జారిపడితే మన గుండె ఆగి కొట్టుకుంటూ ఉంది.

అదిగో, ఒక్క నవ్వు పిలిస్తే ఎలా దూకేస్తున్నాడు! ఆ చిరుచీకటిలోనే ఇటు చూసి నవ్వుతాం. నువ్వలా చేయగలవా అనే సవాలు ఇటు నుండి అటు కళ్ళతోనే. చిన్న నవ్వు అటు నుండి ఇటు. సాహసాలు కావాలా ప్రేమ బలపడటానికి?

ఒకే హాండ్‌రెస్ట్, సర్దుకొని ఒద్దికగా మసలే చేతులు చాలు. ఒకరికొకరని ఎన్ని ప్రమాణాలు చేసుకుంటాయో!

ఇంటర్వెల్‌లో లైట్లు వెలగగానే ఒక చిన్ని మెలుకువ. “నీకు ఇక్కడ పాప్ కార్న్ ఇష్టంకదా, తెచ్చాను. డ్రింక్ ఎక్కువ కూలింగ్ లేదులే తాగు.”

కాసేపు మనం మహారాణి. కాదు, అలా ఫీలయ్యే అవకాశం ఈ సినిమా ఇచ్చింది. కలిసి తింటూ, ఫొటోగ్రఫీకి మైమరుస్తూ, స్క్రీన్‌ప్లే సస్పెన్స్‌తో సీట్లలో నిటారవుతూ, ఓ పాటకి కన్నీరు అవుతూ, ఓ చిలిపిచేష్టకు నవ్వుతూ- నిజంగా హృదయం ఉందని మర్చిపోయి ఎన్ని రోజులు అయిందో!

కొన్ని గంటలు మన జీవితానికి అతీతంగా ఏదో లోకం. బండి వెనుక కూర్చుని తిరిగి వస్తూ భుజం మీద వేసిన చేయి ఏదో హుషారు ఇస్తూ ఉంటుంది, మళ్ళీ ఈ జీవితాన్ని ఈదటానికి.


ఎందరికి తెలుసు ఈ నాస్టాల్జియా?

జీవితపు సర్కిల్ బయట గీసే ఊహాత్మక డిస్జాయింట్ సర్కిల్ సినిమా హాల్.

ఊరికే కథ తెలుసుకోవడానికా సినిమా చూడటం?

అరచేతిలో సినిమా చూడటానికి, ఫాస్ట్ ఫుడ్ తినడానికి ఏమిటి తేడా? కాకుంటే ఎసిడిటీ రాదేమో!