డిట్రాయిట్ నగరంలో, జులై 1,2,3 తేదీలలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 15వ సమావేశం జరుపుకోబోతుంది. ఈ సందర్భంగా, తానా ప్రచురణల కమిటీ, కథాసాహితి (హైదరాబాద్) సహకారంతో తెలుగు కథ-నవలల పోటీని నిర్వహించింది
ప్రపంచస్థాయిలో నిలబడదగ్గ తెలుగు సాహిత్యాన్ని సృష్టించడాన్ని, గణనీయమైన బహుమతులు ఇవ్వడంద్వారా, ప్రోత్సహించాలనే ఉద్దేశంతో 1997లో లాస్ ఏంజెల్స్లో జరిగిన 11వ ఉత్తర అమెరికా తెలుగు మహాసభల సందర్భంగా, తానా మొదటి నవలల పోటీని నిర్వహించి, శ్రీమతి చంద్రలత వ్రాసిన “రేగడివిత్తులు” నవలకు ఒక లక్ష ఇరవై వేల రూపాయలు బహుకరించింది. 1999లో నవలల పోటీకి 25 వేల రూపాయల బహుమతితో కథలపోటీని జోడించి, రెండేళ్ళకొకసారి ఉత్తర అమెరికా తెలుగు (తానా) మహాసభల సందర్భంగా ఈ పోటీలను తానా ప్రచురణల కమిటీ నిర్వహిస్తుంది. 1999లో “తపన” నవలకు శ్రీ కాశీభట్ల వేణుగోపాల్ లక్ష రూపాయల బహుమతి, 2001లో “టైటానిక్” కథకు శ్రీ సురేష్, “అస్తిత్వానికి అటూ ఇటూ” కథకు శ్రీ మధురాంతకం నరేంద్ర చెరి 15 వేల రూపాయల బహుమతి గెలుచుకొన్నారు. ఇప్పటివరకు బహుమతి పొందిన నవలలు, కథలు విపులప్రాచుర్యాన్ని పొంది, విస్తృతంగా చర్చింపబడ్డాయి. 2001 నుండి హైదరాబాద్ కథాసాహితి సంస్థ వారు ఈ పోటీలు నిర్వహించటానికి సహకరిస్తున్నారు.
2005 కథల పోటీకి శ్రీమతి వోల్గా, శ్రీ శ్రీరమణ, నవలల పోటీకి శ్రీయుతులు అంపశయ్య నవీన్, ఎ.కె. ప్రభాకర్ ఇండియాలో న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. శ్రీయుతులు ఆరి సీతారామయ్య, కన్నెగంటి రామారావు, జంపాల చౌదరి, పారనంది లక్ష్మీనరసింహం, మద్దిపాటి కృష్ణారావు, మాచవరం మాధవ్ అమెరికాలో రెండు పోటీలకూ న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. పోటీ నిబంధనల ప్రకారం, అంతిమ నిర్ణయం వరకు రచయితల వివరాలు గుప్తంగా ఉంచబడ్డాయి.
2005 కథల పోటీ
ఈ సంవత్సరం 424 కథలు పోటీకి వచ్చాయి. మొదటి వడబోత తర్వాత, 408 కథలు ద్వితీయ పరిశీలనకు ఎంపిక కాగా, వాటిలో 58 కథలను మూడవ దశలో ఇండియాలో న్యాయ నిర్ణేతలు పరిశీలించారు. వారు ఎంపిక చేసిన 13 కథలను అంతిమ దశలో తానా న్యాయ నిర్ణేతల బృందం పరిశీలించింది.
ఆఖరి పరిశీలనకు వచ్చిన కథలలో, 25,000 రూపాయల బహుమతికి ఉద్దేశించిన ప్రమాణాలను అందుకున్న కథ ఏదీ లేదని న్యాయనిర్ణేతల ఏకాభిప్రాయం. ఈ కథలన్నీ సహజత్వానికి దగ్గ్రగా ఉండి సమకాలీన సామాజిక సమస్యలను చర్చించినా, వస్తువు, అవగాహన, స్పష్టత, సహజత, పాత్రపోషణ, శిల్పాలలో ఉన్న హెచ్చుతగ్గులు ఈ కథల్ని మంచి కథల స్థాయినుంచి గొప్ప కథల స్థాయికి చేరకుండా ఆపేశాయి. పోటీకి వచ్చిన కథలలో ఉత్తమమైనవిగా పరిగణించబడిన రెండు కథలకు 6,000 రూ. చొప్పున బహుమతుల నివ్వాలని న్యాయ నిర్ణేతల నిర్ణయం.
రాతి తయారీ — ముని సురేష్ పిళ్ళై
విముక్తుడు — జొన్నగడ్డ రామలక్ష్మి
బహుమతి పొందిన కథలు తెలుగు పలుకు 15 వ సంచిక (2005 తానాసమావేశపు సావెనీర్), ఈమాట ఎలెక్ట్రానిక్ పత్రిక (www.eemaata.com) జులై సంచిక, నవ్య వారపత్రికలలో ప్రచురింపబడతాయి.
2005 నవలల పోటీ
ఈ సంవత్సరం 66 నవలలు పోటీకి వచ్చాయి. మొదటి వడబోత తర్వాత, 15 నవలలను ఇండియాలో న్యాయ నిర్ణేతలు పరిశీలించారు. వారు ఎంపిక చేసిన 4 నవలలను అంతిమ దశలో తానా న్యాయ నిర్ణేతల బృందం పరిశీలించింది. ఆఖరి పరిశీలనకు వచ్చిన నవలలలో, లక్ష రూపాయల బహుమతికి ఉద్దేశించిన ప్రమాణాలను అందుకున్న నవల ఏదీ లేదని న్యాయనిర్ణేతల ఏకాభిప్రాయం. అంతిమ స్థాయి వరకు వచ్చిన నవలలలో ఉత్తమంగా ఉన్న రెండు నవలలకు చెరి 10,000 రూ. ప్రోత్సాహక బహుమతులుగా ఇవ్వాలని న్యాయ నిర్ణేతల నిర్ణయం.
నీరు, నేల, మనిషి — సుంకోజి దేవేంద్రాచారి
సింగిల్ డైరీ — వెల్చేరు చంద్రశెఖర్
ఈ పోటీలు ఉద్దేశించిన స్థాయిలో కథలు, నవలలు లెకపోవడం తానా ప్రచురణల కమిటీని ఆందోళనకు గురి చేస్తూంది. మంచి కథకు, నవలకు ఉండవలసిన లక్షణాలు – సహజత్వం, పాత్రపోషణ, సన్నివేశ చిత్రణ, పక్వత, రససిద్ధి – గత మూడు పోటీలకు అంతిమ దశవరకూ వచ్చిన అనేక కథల్లోనూ, నవలలలోనూ లోపించడం గమనార్హం. ఈ పోటీల నిర్వహణను గురించి తానా ప్రచురణల కమిటీ పునఃసమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది.
కృతజ్ఞతలు
ఈ పోటీ వివరాలను విశేషంగా ప్రచారం చేసేందుకు సహకరించిన పాత్రికేయులకు, సంపాదకులకు, ఇండియాలో న్యాయ నిర్ణేతలు శ్రీమతి వోల్గా, శ్రీయుతులు శ్రీరమణ, అంపశయ్య నవీన్, ఎ.కె. ప్రభాకర్ గార్లకు, ప్రాథమిక పరిశీలకులుగా వ్యవహరించిన అనేకమంది మిత్రులకు, అమెరికా న్యాయనిర్ణేతలకు, శ్రీమతి అరుణా చౌదరికి తానా ప్రచురణల కమిటీ కృతజ్ఞతలు. కథాసాహితి (హైదరాబాద్), వాసిరెడ్డి నవీన్ల సహకారం ఈ పోటీలకు అమూల్యం. తానా అధ్యక్షులు శ్రీ గొర్రెపాటి నవనీతకృష్ణ, ప్రెసిడెంట్-ఎలెక్ట్ శ్రీ బండ్ల హనుమయ్య, డిట్రాయిట్ తానా సమావేశపు నిర్వాహకులు శ్రీయుతులు కొడాలి శ్రీనివాస్, కె.సి. ప్రసాద్ గార్లు ఈ పోటీ నిర్వహణను ప్రోత్సహించారు. వీరందరికీ నా వ్యక్తిపూర్వక కృతజ్ఞతలు
— జంపాల చౌదరి,
అధ్యక్షుడు, తానా ప్రచురణల కమిటీ
వాడ్స్‌వర్త్, ఇల్లినాయ్.
మే 30, 2005