చ.
కలకల కేరి నవ్వి పొడగాంచుచు బొంచుచు గౌగిలింపుచున్
గలగల నందియల్ మొరయగా నడయాడుచు ముద్దు వేడుచున్
మెలగెడి పట్టి నంసమున నెమ్మది జేర్చుట యెన్నడో చెలీ!
మ.
గల నిద్దా మగరాల చెక్కడపు చొక్కాటంపు బల్ మద్దికా
యలునుం జెక్కుల చక్కి గంతులిడ బాదాబ్జమ్ములన్ బైడి యం
దెలు ఘల్ ఘల్లన నాడు ముద్దు గొమరున్ వీక్షించు టింకెన్నడో!
సరళమైన శైలిలో తేటతెలుగు పదాలలోని సహజ సౌందర్యం రూపుకట్టిన పద్యాలివి. వీటిలోని మధుర భావాలు మనసును సూటిగా తాకుతాయి. అయితే ఈ పద్యాలు నాకు నచ్చడానికి ఇది మాత్రమే కారణం కాదు. మనకు ప్రచారంలో ఉన్న కొన్ని మూసభావాలకు (అంటే స్టీరియోటైపులకు) దూరంగా ఉండే ఒకానొక సున్నితమైన సన్నివేశాన్ని ఈ పద్యాలు చిత్రిస్తున్నాయి. ఇలాంటి సన్నివేశ చిత్రణ పూర్వకావ్యాలలో చాలా అరుదుగా కనిపిస్తుంది. ఆ మూసభావాలేమిటో, వాటికి కొంచెం దూరంగా ఉన్న ఆ అపురూప సన్నివేశం ఏమిటో తెలుసుకునే ముందు, అసలీ పద్యాలు ఎక్కడివో కొంచెం పరిచయం చేసుకుందాం.
తెనాలి రామభద్రకవి రచించిన ఇందుమతీ పరిణయ కావ్యంలోని పద్యాలివి. కుమార ధూర్జటి రచించిన ఇందుమతీ పరిణయ కావ్యంలోని పద్య మొకదాన్ని లోగడ చూసి ఉన్నాం కదా. ఆ ఇందుమతీ పరిణయాన్ని రచించినది ధూర్జటి మనుమడైన కుమార ధూర్జటి అయితే, ఇప్పుడు పరిచయం చేసుకోబోయే ఈ ఇందుమతీ పరిణయాన్ని రచించినది తెనాలి రామకృష్ణుని మనుమడైన రామభద్రకవి! అప్పటి వ్యాసంలో చెప్పుకున్నట్టు, ఆ కాలంలో రఘువంశం సంస్కృతాంధ్ర విద్యార్థులకు చాలా పరిచితమైన గ్రంథం. అందువల్లనే దాని ప్రభావంతో ఇందుమతీ పరిణయ కావ్యాలు ఒక ఆరేడు వెలువడ్డాయి తెలుగులో. బహుశా కావ్యరీతులలో భేదాలను విశ్లేషించడానికి ఈ వివిధ కథనాలు సాహిత్య విమర్శకులకు చక్కగా ఉపయోగపడతాయి.
తెనాలి రామభద్రకవి కాలం క్రీ.శ. 1570గా పరిశోధకులు చెపుతున్నారు. ఇతను పాండురంగ మాహాత్మ్యం రచించి ప్రసిద్ధి పొందిన తెనాలి రామకృష్ణకవి తమ్ముని మనుమడు. ఆ విషయం స్వయంగా రామభద్రకవి ఈ కావ్యంలో పేర్కొన్నాడు. ఈ కావ్యాన్ని యితడు పాలచూరి కృష్ణభూపాలునికి అంకితమిచ్చాడు. ఈ అంకితం విషయంలో ఒక ప్రత్యేకత ఉంది. సాధారణంగా మనకు పూర్వకావ్యాలలో, కవిని కృతిభర్త స్వయంగా పిలిచి ఫలానా కావ్యం రచించి తనకు అంకితమివ్వమని కోరడం జరుగుతుంది. ఈ కావ్యం అలా కాదు. కృతిభర్త లేకుండానే కవి కావ్య రచన మొదలుపెడతాడు. ఒకనాడు సభలో ఆ విషయం విన్న కృష్ణభూపాలుడు, తనకు ఆ కావ్యాన్ని అంకితమివ్వమని కోరతాడు.
తాతగారి కవితలోని పదగుంభనమూ ప్రౌఢత్వమూ యీ మనుమడు పుణికిపుచ్చుకున్నట్టు లేదు. రామభద్రకవి రచనలో ప్రౌఢతకన్నా సారళ్యము, ఓజస్సు కన్నా మాధుర్యమూ ఎక్కువగా కనిపిస్తుంది. తన కవిత గురించి చెప్పుకున్న సందర్భాలలో కూడా ‘మామక నవ్యకావ్యము సమంచిత మాధురి సాధురీతి’ అని, ‘మాధురీగతి ప్రబంధ మొనర్చిన నొప్పుగాక’ అనీ, మాధుర్య గుణాన్ని ప్రధానంగా పేర్కొన్నాడితను. పైన యిచ్చిన రెండు పద్యాలూ ఈ గుణానికి చక్కని మచ్చుతునకలు.
రఘుమహారాజు, అమరావతిని తలదన్నే అయోధ్యానగరం రాజధానిగా చేసుకుని మహావైభవంతో రాజ్యాన్ని పరిపాలిస్తూంటాడు. కేవలం బాణాన్ని వింటిపై ఎక్కుపెట్టడంతోటే శత్రురాజులు అతనికి వశమయ్యేవారట! సింధుదేశ రాజైన జలంధరుని కుమార్తె గంధవతి అతని భార్య. ఎంతటి వైభవమున్నా సంతానం లేకపోవడం రఘువుని క్రుంగదీస్తుంది. ఆ సందర్భంలో రఘుమహారాజు తన భార్యతో అంటున్న మాటలే ఈ పద్యాలు. బిడ్డలపై ప్రేమా మమకారాలు తల్లుల సొత్తన్న ఒక మూసభావం లోకంలో ప్రచారమయింది. కన్న మమకారం వల్ల తల్లి పిల్లలను ఎక్కువ ముద్దు చేస్తుందని, కొంత కఠినంగా వ్యవహరిస్తూ పిల్లలను దారిలో పెట్టే బాధ్యత తండ్రిదనీ–ఇలాంటి స్టీరియోటైపింగు మనకి సర్వత్రా కనిపిస్తూనే ఉంటుంది. ఇది ఎప్పటినుండి వచ్చిందో తెలియదు. బహుశా యిలాంటి ప్రచారం మరీ పాతది కాదేమో. అయితే, ప్రేమా వాత్సల్యం వంటి వ్యక్తిగత అనుభూతుల కోసం కాక, సంతానం ధర్మ సంరక్షణ కోసమే అనే భావం ప్రాచీన కాలంనుండీ మనకు పురాణాలలోనూ కావ్యాలలోనూ కనిపిస్తుంది. పుత్రుడు తమను పున్నామ నరకంనుండి రక్షించడానికి, తమ వంశాన్ని అభివృద్ధి చేయడానికి మాత్రమేనన్న భావన చాలా ప్రాచుర్యాన్ని పొందింది. పితృస్వామ్యానికి చెందిన రాజులకైతే అది మరీ ముఖ్యం! వాల్మీకి రామాయణంలో దశరథుడు, సుతార్థం తప్య మానస్య న అసీత్ వంశకరః సుతః అని వంశకరుడైన కొడుకు లేడని చింతిస్తాడు. మహాభారతంలో పాండురాజు కూడా సంతానం కోసం చింతిస్తూ కుంతితో ఇలా అంటాడు:
దానములం దపంబుల సదక్షిణ యజ్ఞములన్ విహీనసం
తానుల కూర్ధ్వలోక సుపథంబు లవశ్యము గావు; లబ్ధ సం
తానుల యెందుఁ బుణ్యు; లిది తథ్యము గావున నొండు దక్కి సం
తానము నాకు నయ్యెడువిధం బొనరింపుము ధర్మసంస్థితిన్
దానము, తపము, యజ్ఞము, మొదలైన కార్యాలు చేసినా సంతానహీనులకు ఊర్థ్వలోకములు లభించవనీ, సంతానమే పుణ్యాన్ని చేకూరుస్తుందనీ, అంచేత తనకు ధర్మబద్ధమైన సంతానాన్ని ప్రసాదించమని కుంతిని కోరతాడు పాండురాజు. ఈ పద్యంలో పాండురాజు మాటలను, పై పద్యాలలో రఘువు మాటలతో పోల్చి చూస్తే, రామభద్రకవి ఎంతటి కొత్తదారి తొక్కాడో మనకు స్పష్టంగా తెలుస్తుంది.
రఘుమహారాజు బాధ పూర్తిగా ఆత్మీయం, వ్యక్తిగతం. ఇందులో ధర్మమూ, పుణ్యమూ, స్వర్గమూ వంటి విషయాల ప్రసక్తి లేదు. కనీసం వంశ వర్ధనాన్ని గురించిన ప్రస్తావన కూడా లేదు. కేవలం నాన్నదనంలోని కమ్మని అనుభూతి తనకు దక్కలేదన్న చింత మాత్రమే ఉంది. ఆ అనుభూతిలోని అందాన్ని ఆనందాన్ని ఎంత చక్కగా ఊహించి వర్ణిస్తున్నాడో చూడండి.
జిలిబిలి మాటలతో ప్రేమగా దగ్గరకు చేరి, ఒంటిని రాస్తూ, కలకల కేరింతలతో నవ్వుతూ, తన వైపు చూస్తూ (పొడగాంచుచు), దాగుడుమూతలాడుతూ (పొంచుచు), కౌగిలించుకుంటూ, అందెలు గలగలమని మ్రోగేలా నడుస్తూ, ముద్దు ఇవ్వమని మురిపెంగా కోరుతూ తిరుగాడే చిన్నారిని (పట్టిని) నెమ్మదిగా భుజాలపైకి (అంసమున) ఎక్కించుకునే భాగ్యం ఎప్పుడో కదా చెలీ! అని భార్యతో అంటున్నాడు. చదువరుల కళ్ళకు కట్టే మూర్తిమంతమైన, సజీవమైన వర్ణన ఇది. రెండో పద్యం కూడా అంతే.
రావిరేక అంటే చిన్నపిల్లలకు పాపిటనుంచి నుదుటి వరకూ పెట్టే చిన్న పతకంలాంటి ఆభరణం. అలాగే మద్దికాయలు చెవితమ్మెలకుండే కుండలాలవంటి ఆభరణం.
ముద్దు కుమారుడు గంతులేస్తూ ఆడుతూ ఉంటే, ఆ పిల్లాడి తామరపూలంత లేత పాదాలకు (పాదాబ్జమ్ములన్) ఉన్న బంగారపుటందెలు (పైడి అందెలు) ఘల్లుఘల్లుమంటున్నాయి. అలా గంతులు వేస్తున్న ఆ పిల్లాడి నుదుటన, రావిరేక గొప్ప కాంతులతో మెరిసిపోతూ ఉంది. దాని జిగిని మరింత పెంచేలా (సాకన్ జాలు) వాని లేత నవ్వుల కాంతి (డాలు) ఉంది.
నిద్దా – నునుపైన, మగరాలు – వజ్రాలు, చెక్కడపు – పొదిగిన, చొక్కాటంపు – స్వచ్చమైన, శ్రేష్ఠమైన మద్దికాయలు, చెక్కుల చక్కి – చెంపల పక్కగా, గంతులు వేస్తున్నాయి. ఆ పిల్లాడు గంతులు వేస్తూ ఉంటే, అతని చెవులకున్న, నునుపైన వజ్రాలతో పొదిగిన మద్దికాయలు, చెంపలకి తాకుతూ ఊగుతున్నాయి.
ఇదీ రఘుమహారాజు మనసులో ఊహించిన చలనచిత్రం! అలాంటి ముద్దు కుమారుడిని ఎప్పటికి చూస్తానో అని ఉవ్విళ్ళూరాడు.
సంతానం గురించిన రఘువు చింతన మరి నాలుగయిదు పద్యాలలో సాగుతుంది. ఇలా కొడుకు కోసం రఘువు తపించినట్లుగా కాళిదాసు రఘువంశంలో లేదు. ఇది పూర్తిగా ఈ రామభద్రకవి స్వకపోల కల్పితం. మిగతా పద్యాలలో కూడా ఎక్కడా వంశాన్ని నిలపడం కోసం కొడుకుని కోరుతున్నట్లుగా ఉండదు, తన వ్యక్తిగత సంతోషం కోసం తప్ప. సుతుడు లేకపోవడం వలన ఎంతటి వైభవమూ తనకు ‘సాంద్రానందాన్ని’ కలుగజేయడం లేదని, ఎన్నో వస్తువులతో అలంకృతమైనా రత్నదీపకళిక లేని మందిరంలా ఉంది తన జీవితమని, ‘నందన వదన నిరీక్షానందము’ కలిగించే సుఖం నవనిధులుకూడా ఇవ్వవని, నలుదిక్కుల రాజులూ తనకు కట్టే కప్పాల వల్ల కలిగిన సంపద కూడా కొడుకు లేనితనం వల్ల, ఎన్నులేని వరిలాగా వ్యర్థమై పోయిందనీ–చింతిస్తాడు. అప్పుడతని భార్య ఆ రాజును అనునయిస్తుంది.
ఎంతటి మహారాజైనా, పైకి ఎంత గంభీరంగా కఠినంగా కనిపించినా, గుండె లోతుల్లో ఆర్ద్రత, లాలిత్యం, మానవ సహజమైన అనుభూతులూ ఉండవచ్చునన్న సత్యాన్ని యిలాంటి సన్నివేశాలు సాక్షాత్కరింపజేస్తాయి. ప్రాచీన కావ్యాలలో ఇలాంటివి బొత్తిగా లేవని చెప్పలేము కాని, వాటికుండే ప్రాధాన్యం తక్కువ. ఇంత వర్ణనాత్మకంగా, వివరంగా, ఒక బిడ్డకోసం తండ్రి పడే ఆర్తిని ఆవిష్కరించిన సన్నివేశం పూర్వకావ్యాలలో మరెక్కడా నాకు కనిపించలేదు.
కథతో నేరుగా సంబంధం లేదని అనిపించినా, యిలాంటి ప్రత్యేక కల్పనలే ఒక కావ్యానికి విశిష్టతను చేకూరుస్తాయి. కవి స్వతంత్రతను చాటుతాయి. కవి కాలానికి చెందిన సమాజాన్ని కూడా కొంత వరకూ ప్రతిబింబిస్తాయని చెప్పవచ్చు. సంఘగతమైన అస్తిత్వం కన్నా వ్యక్తి అస్తిత్త్వం బలాన్ని పుంజుకుంటూ, ప్రతి వ్యక్తికీ సొంతమైన స్వతంత్ర భావాలకూ అనుభూతులకూ ప్రాధాన్యం పెరుగుతున్న ఒక సామాజిక పరిణామానికి ఇలాంటి కావ్య కల్పనలు సాక్ష్యంగా నిలుస్తాయి. ఇలాంటి అపురూపు కల్పనలూ, చరిత్ర సాక్ష్యాలూ, అంతగా ప్రసిద్ధికెక్కని యిలాంటి కావ్యాలలో యింకెన్ని దాగున్నాయో!