జీనో పేరడాక్సు

ఒరే, నీకు జీనో పేరడాక్సు తెలుసునా?
రెస్టారెంటు పొడుగాటి మెనూ
శ్రద్ధగా చదువుతున్న నాకు, మావాడు
-కళ్ళజోడూ, ఖద్దరు చొక్కా-
వేసిన మొదటి ప్రశ్న.

అల్లూరి సీతారామరాజెలా పోయాడో తెలుసునా?
చిల్లీ చికెనా, మలై కోఫ్తానా
తేల్చుకోలేని నాకు, మావాడు
-ఒత్తుగడ్డవూఁ, జులపాల జుట్టు-
వేసిన రెండో ప్రశ్న.

జీనోకీ రాఁవరాజుకీ సంబంధవేఁవిటో
తలెత్తి చూడక తప్పింది కాదు నాకు
మెనూ కంటే మావాడి కథ మీద మోజెక్కువై.

చలనంలో ఉన్న వస్తువేదైనా సరే!
తను చేరవలసిన దూరంలో
సగం ముందు ప్రయాణించాలి.
ఆ సగంలో సగం దూరం అంతకంటే ముందు.
ఆ సగంలో సగం దానికంటే ముందు.
ఈ వరసన
అదెప్పటికీ గమ్యం చేరుకోలేదు.
– మావాడు కొనసాగించేడు.

ఈ లెక్కన జీనో (సిద్ధాంతం) ప్రకారం
సీతారామరాజు చచ్చిపోయింది
తుపాకీ గుళ్ళు తగిలి కాదు.
సగం సగం దూరాలలో
అనంతంగా తనవేపుకే అలా
వస్తున్న వాటిని చూసి
ఎప్పటికొచ్చి తగుల్తాయో తెలీని సందిగ్ధంతో
హడలెత్తి గుండె పోటొచ్చి పోయుంటాడు
– మావాడు తీర్మానించేడు.

నానూ చికెను ఆర్డరిచ్చేను
మావాడు మాటలాపి
సూపు తాగుతున్నాడు.
చెట్టుకు కట్టేయబడ్డ సీతారాఁవుడి
శరీరం వైపుకి తూటాలు మాత్రం
ఆ కాస్తంత దూరాన్ని మరిన్ని
మరిన్ని సగాలుగా చేస్కుంటూ
దూసుకొని వస్తూనే ఉన్నాయి.
(తుపాకీలు పేల్చిన వాళ్ళెపుడో
మూటా ముల్లే సర్దుకుని
ఇళ్ళకెళ్ళిపోయేరు.)

జీనో సిద్ధాంతం నా ముందు
టేబుల్ పై మందకొడిగా
మబ్బల్లే కమ్ముకునున్నా
నా చేయి మాత్రం
నా నోటికి
నిరంతరంగా
నానూ చికెన్ల ముక్కలు
అందిస్తూనే ఉంది.

అవును కదూ!
తప్పతాగి దూసుకొచ్చిన కారు
రోడ్డు పక్కగా నిలబడున్న కుర్రాణ్ణి చేరేది కాదు.
ఉన్నట్టుండి చిమ్మబడిన ఆసిడ్
బస్టాపులో అమ్మాయి ముఖాన్ని చేరేదే కాదు.
పాత ఖార్ఖానాల నుండి టిఫిను బాక్సు బాంబులు
స్కూళ్ళకీ, ఆఫీసులకీ చేరేవీ కావు.

తినేసీ, గ్లాసులో ఆఖరి చుక్కలు తాగేసీ
రోడ్డు మీదకొచ్చి ఎవరి దారిన వాడు
గమ్యాలను నిజంగానే
చేరుకోగలిగిన ప్రపంచంలో పడ్డాం.
పొద్దున్నే ఆఫీసుకీ చేరుకోగలం
సాయంత్రం ఇంటికీ.
రైళ్ళూ బస్సులూ స్టేషన్నుంచి
స్టేషనుకి చేరుకుంటాయి. పక్షులు
గూళ్ళకి చేరుకుంటాయి. ఇంట్లో అడుగెట్టగానే
పరిగెత్తుకుంటూ వచ్చి నీ అనుబంధాలు
చేతుల్లోకి చేరుకుంటాయి.

ఈ ప్రపంచంలో తుపాకీ గుళ్ళు శరీరాన్ని
చేరుకుని ఛిద్రం చేస్తాయి
రామరాజు దైనా ఇంకోడిదైనా
ఏ సంస్కర్తదో సాధుజీవిదో అయినా
భక్తి తలకెక్కిన చరిత్రకారుడెవడో
రక్త సిక్తమైన ఆ మాంసపుముద్దని
ఎర్ర మందారఁవనో
మోదుగపూవనో కీర్తిస్తాడు.

(అక్టోబర్ 11, 2010 ది న్యూ యార్కర్ పత్రికలో ప్రచురితమైన బిల్లీ కాలిన్స్ (Billy Collins) కవిత ‘టేబుల్ టాక్‌’కి స్వీయ-ఇచ్ఛానుసరణం).