[కవిగా ఎంత విశిష్టుడో, తిలక్ కథకుడిగా కూడా అంతే విశిష్టుడు. తన కవిత్వంలో ఏ మానవ సామాజిక పార్శ్వాలను స్పృశించాడో, అవే మళ్ళీ ఆయన కథల్లో మనకు కనిపిస్తాయి. తన కవిత్వంలో తాను దొరుకుతానన్న తిలక్, ఈ కథల్లో కూడా మనకు దొరకడంలో ఆశ్చర్యమేమీ లేదు. కవిత్వంలో కనిపించే తిలకే ఇక్కడా మనకు కనిపిస్తాడు, కొంచెం తేడాతో. ఆ తిలక్ కథలనుంచి ఒక మూడు కథలు ఈమాట పాఠకుల కోసం ప్రచురిస్తున్నాం. ఆసక్తి గలవారికోసం పుస్తకం వివరాలు: తిలక్ కథలు, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, మూడవ ముద్రణ 1993, రూ. 35.00, అన్ని విశాలాంధ్ర బుక్ హౌస్‌లలో లభ్యం.]
కవుల రైలు
తెలుగుదేశం కవులతో నిండి మూడవతరగతి రైలు పెట్టె లాగ క్రిక్కిరిసిపోయింది. “ఇంక జాగా లేదు” అని కేకలేస్తున్నా వినిపించుకోక చవకగా అమ్మే టిక్కెట్లు కొనుక్కొని కొత్త కవులు తోసుకు లోపలి కెగబడుతున్నారు. కొందరు ఫుట్‌బోర్డుల మీద నిలబడీ, కొందరు కమ్మీలు పట్టుకుని వేలాడుతున్నారు.
ఒకావిడ మేలిముసుగు వేసుకుని వచ్చింది. సుతారంగా అందంగా వుంది. కళ్ళల్లో అపూర్వమైన వెలుగు. ఎర్రని పెదవుల్లో తియ్యని సిగ్గు వొంపులు. వెన్నెలనీ, ఉషఃకాంతినీ, మల్లెపువ్వుల్నీ, మంచిగంధాన్నీ, రత్నాలనీ కలబోసి మనమీద జల్లినట్లు అనిపిస్తుంది ఆవిడను చూస్తే.. అక్కడ దగ్గరలో నిలుచుంటే…
ఆవిడ నిస్పృహగా చూసింది రైలుపెట్టె కేసి. లోపలి బొగ్గు పులుసు గాలీ, చుట్టపొగా వాగుడూ కలసి పెట్టెలోంచి బయటకి దుర్భరంగా వ్యాపిస్తున్నాయి.
“ఇక్కడ చోటులేదు దయచేయవమ్మా. నువ్వు కూడానా మా ఖర్మ” వగలొలకబోసుకుంటూ అన్నాడొక చుట్ట ఆసామీ కాండ్రించి ఉమ్మివేస్తూ. ఆయన కవి శార్దూల బిరుదాంకితుడు. అప్పకవీయం అడ్డంగా బట్టీ వేశాడు.
“నో ప్లేస్ మేడం వెరీసారీ” అంటూ కన్ను గీటాడొక నవయువకుడు గాగుల్సు తీసి, సెకండ్‌హాండ్ బీడీ నోట్లో ఉంచుకునే.
కొందరు వెకిలిగా నవ్వారు. కొందరు దగ్గారు. మరికొందరు ఈలలు వేశారు. పాపం ఆవిడ వెనక్కి తిరిగి జాలిగా వెళ్ళిపోయింది. రైలు కదిలిపోయింది. స్టేషన్‌మేష్టర్ వచ్చి ఆమెను చూచి “పాపం చోటు లేదా అమ్మా, నీ పేరు?” అని అడిగాడు.
“కవిత” అందా సుందరి.
కవుల రైలు గమ్యం తెలీకుండా వడివడిగా వెళ్ళిపోతోంది.
మణిప్రవాళం
చీకట్లో గదిలో పడుకుని వుంది లత. ఏకాకిగా ఏ హృదయమూ స్పందించని ఏకాంతంలో, ఎవరూ చూడని నరకంలో చిక్కుకుని వుంది లత.
అతను మెరుపులాగా వచ్చాడు. అటు దక్షిణానిలం వీచే దారినుండి దయాసరస్సులలో విహరించే రాజహంసనెక్కి నక్షత్రకిరణం మీదుగా జారుతూ వచ్చాడు.
అతను పాట పాడాడు. పాటకి చీకటి చీకాకుపడి నల్లగా కోప్పడింది.
అతను పాట పాడాడు. చీకటిని చెరిపివేస్తూ వేయి పువ్వుల తావి వింతగా కమ్ముకుంది.
అతను పాట పాడాడు. జాలిగా తియ్యగా లత గుండెలో కోర్కెలా హాయిగా తెరతెరల్లాగ కదిలింది.
ఆమె కళ్ళు తెరిచింది. అతను నవ్వాడు. అతను వెళ్ళిపోయాడు.
అతను మళ్ళీ మరో రోజున వచ్చాడు. “లతా” అని పిలిచాడు. అతని గొంతులో మాధురీ మందాకిని జలజలించింది.
“ఇంకోసారి పాడు” అంది లత రెప్పల్ని కొంచెం ఎత్తి. నల్లని పొడుగాటి ఆమె తలవెంట్రుకలు చీకట్లో తరంగాలలా కదులుతున్నాయి.
అతను పాడాడు. చీకటి చికాకు పడింది. గుడ్లగూబలు దిగులుగా ఏడ్చాయి. అతను వెళ్ళిపోయాడు.
అతను మళ్ళీ ఇంకోరోజున వచ్చాడు. లత పెదవుల మీద సన్నని చిరునవ్వు విరిసింది. ఆప్యాయంగా అడిగింది, “ఒక్క పాట పాడవూ?” పాడాడు.
లత కళ్ళలో నీళ్ళు. నీళ్ళలోంచి చావును దాటిన వెలుగు. అతను నిట్టూర్చాడు.
కొన్నాళ్ళకి మాలతీ సౌరభం వీచిన రాత్రి –
“స్వామీ” అంది లత. అతను మాట్లాడలేదు.
“కవీ” అంది లత. అతను మాట్లాడలేదు.
“ప్రియా” అంది లత. అతను పలికాడు.
నక్షత్రాలు మెరిశాయి. వెన్నెల కురిసింది. అతని చేయి ఆలంబనగా లత లేచి నిలుచుంది. అతని వొళ్ళో వాలింది. కిటికీ అవతల మందారం ఎర్రగా నవ్వి తల పక్కకు తిప్పుకుంది.
వకుల వృక్షం విరిసిన రాత్రి –
“ప్రియా” అంది లత.
“లతా” అన్నాడతను.
“మిమ్మల్ని వదలలేను.”
జవాబుగా ఆమె ఫాలభాగాన్ని ముద్దాడాడు అతను.
“ఎక్కడనుంచి వచ్చారు?”
“మంచు పర్వతాల అంచున దయాసరస్సుకి దక్షిణాన మంత్ర విహంగాలు మసలే చోటున – రంగు రంగుల చెట్ల నీడలలో పాడుకుంటూ ఉంటాను”
“అక్కడికి దగ్గరగా మాయాలోకం ఉంది. భయం లేదా” అంది లత. అతను నిట్టూర్చాడు.
మొగలిచెట్టు మొదటిరేకు తొడిగిన రాత్రి –
“ప్రియా” అంది లత.
“ప్రియతమా” అన్నాడతను.
“ఏమిటాలోచిస్తున్నారు?”
అతను నిట్టూర్చాడు. అతను వెనక్కి చూశాడు. అతని వెనకాల మబ్బులు…
“పాట పాడవూ” అతని వొడిలో తల పెట్టుకుని అడిగింది లత. అతను పాడాడు – లత పులకరించింది. పరవశించింది. అరమోడ్పు కన్నులతో అతన్ని గుండెలకి హత్తుకుంది. అతను బరువుగా నిట్టూర్చాడు.