మరణానికి ముందే
మనుషులంతా నిను వదిలేయడం
ఓ మహద్భాగ్యం
మలినం లేని స్నేహం
మహిలో దొరకకపోతే..
నీది మహర్జాతకమని అర్ధం
అయినవాళ్ళందరూ
అవకాశవాదులే అవడం
ఆనందంతో నవ్వుకోవలసిన విషయం
ఆత్మీయులనుకున్నవారే
ఆరోపణల శరాలు రాల్చడం
అందరికీ దొరకని అదృష్టం
నువు పంచి యిచ్చిన రక్తం
నిన్నే చూసి మరిగిపోవడం
నువ్వెపుడో అడిగి వచ్చిన వరం
నీకన్నా ముందు పుట్టిన బంధం
నీపైనే కత్తి దూయడం
నువ్విపుడు తీర్చేస్తున్న ఋణం
ఎడబాయని తోడుకోసం నడిచిన ఏడడుగులూ
ఏకాంతకాననంలోకి దారితీయడం
ఎన్నోజన్మల పుణ్యఫలం
ఎదపై ఆడుకున్న బాల్యం
ఇక నీ అవసరం లేదంటూ క్రిందికి జారడం
ఎదురుచూడవలసిన అనుభవం
నీ ప్రయత్నమేమీ లేకుండానే
సంకెలలన్నీ సడలిపోవడం
ఏ అదృశ్యహస్తమో నీకందిస్తున్న సాయం
సాధనలారూ రాకుండానే
సత్యానికి చేరువవడం
నువు సంబరపడవలసిన విజయం