“హే, కాన్ట్ కం టుడే… నాట్ వెల్” – కొలీగ్ కి ఎసెమ్మెస్ చేసి ఆలోచనలో పడింది ప్రత్యూష. ఆమె మనసంతా అశాంతిగా ఉంది వారం రోజులుగా. తన కలలకీ, వాస్తవానికి మధ్య దూరం చాలా పెరిగిపోతున్నట్లు అనిపిస్తోంది. ఎవరితోనూ మాట్లాడాలి అనిపించట్లేదు, ఎవర్నీ కలవాలి అనిపించట్లేదు. తనేమిటో, తన పనేంటో – అంతే! ఇలాగే ఉంది వాలకం. బుద్ధి పుడితే ఆన్లైన్ వెళ్ళి ఎవరన్నా పలకరిస్తే జవాబివ్వడం లేదంటే సైనవుట్ అవడం. ఫోను ఇరవై నాలుగ్గంటలూ సైలెంట్ మోడ్ లో హ్యాండ్‍బ్యాగ్ లో ఓ మూల పడి ఉంటోంది. పొద్దున్నోసారీ, రాత్రోసారి ఫోన్ చూస్కుని, ఉన్న కాల్స్‌లో అమ్మదో, నాన్నదో ఉంటే, మూడుంటే ఓసారి డయల్ చేసి ‘బ్రతికే ఉన్నా’ అన్నట్లుగా ముక్తసరిగా మాట్లాడటం, బై చెప్పేయడం. “ఏమిటే, ఎందుకలా ఉన్నావు?” అని అడిగిన ప్రతిసారీ – “పని ఎక్కువగా ఉంది” అని బొంకడం. చివరికి మనుష్యులతో ఆమాత్రం మాట్లాడటం కూడా విసుగు పుట్టేసింది తనకి. రోజంతా ఎవరికీ కనబడకుండా దాక్కుని, మాట్లాడాలా వద్దా.. మాట్లాడాలా వద్దా అని కాసేపు తటపటాయించడం, మాట్లాడకుండా ఆగిపోవడం – ఇలాగే ఉండింది. ఆఫీసులోనూ ఎవరితోనూ సరిగా మాట్లాడకపోయేసరికి అభిరామి అడిగింది కూడా – “ఆర్యూ ఓకే?” అని.
“ఆర్యూ ఓకే?” అన్నది ఎంత చెత్త ప్రశ్న అసలు? ఓకే? అంటే ఏ విధంగా ఓకే? అవతలివాళ్ళతో మాట్లాడకపోతే నాటోకే నా? అసలు మనతో మనమే మాట్లాడలేని పరిస్థితుల్లో అవతలివాళ్ళతో మాట్లాడగలిగితే అప్పుడు మనం ఓకే అన్నట్లేనా? అంటే, ‘నాటోకే’ అంటే, అవతలి వాళ్ళతో మన సంబంధాల పరంగా మాత్రమేనా? అసలు వాళ్ళతో సక్రమంగా ప్రవర్తించినంత వరకూ అవతలివాళ్ళకి మనలోని సంఘర్షణలు పట్టనక్కర్లేదా? అసలు అవతలివాళ్ళతో మనం ‘ఓకే’ గా ప్రవర్తించాల్సిన అవసరం ఏముంది? – “ఛ! ఏమిటీ పిచ్చి వాదం!” తనని తానే విసుక్కుంది ప్రత్యూష.
ఇలా బయట వెలుగే ఉన్నా, గదిలోపలి తన లోపలి చీకటిలో, ఒంటరిగా కూర్చుని ఉండటంతో – మనసు మేనేజర్ డ్యూటీకి దిగింది.
“పని మానేసి ఏమిటిది?”
“ఆఫీసులో చేసేదే పనా?” ప్రత్యూష జవాబు.
“ఇప్పుడసలు నువ్వేమీ చేయట్లేదు కదా…”
“ఏం చేస్తే నీకు చేసినట్లనిపిస్తుంది? అసలెప్పుడూ అవతలివాళ్ళకి ఏది చేస్తే సరైనది అనిపిస్తుందో – అదే చేయాలా నేను?”
“ఏంటి రెండు మూడ్రోజులుగా నీలో ఈ వితండవాదం ఎక్కువగా కనిపిస్తోంది?” మనసు తిరిగి ప్రశ్నించింది.
“నా సమస్యేంటో చెప్పాల్సింది నువ్వు. నేను కాదు.” చిరాగ్గా అన్నది ప్రత్యూష.
మనసు నవ్వింది. “నీ బాధని లోకువ కట్టి మాట్లాడట్లేదు నేను. ఎందుకు నీకిలా అనిపిస్తోందో నాకు సింపుల్గానే అర్థమైంది అని చెప్పబోతూ ఉండగా నువ్వే ఇలా అపార్థం చేసుకున్నావు..”
“సరే, అలా అయితే, నీ ఉద్దేశ్యంలో నా సమస్యేమిటి?”
“నీ సమస్య నీకు ఉన్న హై స్టాండర్డ్స్. హై హోప్స్”
“ఎవరి గురించీ? నేనే నాకు నచ్చట్లేదు. ఇంక ఇంకోళ్ళ గురించి హై హోప్స్ ఏంటి?”
“నీ గురించే నీవి హై స్టాండర్డ్స్ అంటున్నా. నువ్వు మనిషన్న సంగతి నువ్వు మర్చిపోతున్నావేమో అనిపిస్తోంది.”
“ఏం చేయమంటావ్ నన్ను?”
“ఏమీ చేయకు. అస్తమానం నీ లెవెల్‌కి తగ్గట్లు జీవించాలని, దానికి కాస్త స్థాయి తగ్గగానే నామోషీగా ఫీలవడం మానేయి. మనసుకేం తోస్తే అదే చేయి” గీతోపదేశం దొరికింది ప్రత్యూషకి ఫ్రీగా.
“మనసుకేది తోస్తే…- అంటే, అంతా నీ ఇష్టమనేగా?” – వెటకారంగా అంది ప్రత్యూష.
జవాబేదీ రాలేదు.
ఓ గంట తరువాత –
“నాకు కొన్నాళ్ళు ఎక్కడికన్నా ఎవరికీ కనిపించనంత దూరంగా వెళ్ళాలని ఉంది. కానీ, వెళ్ళే పరిస్థితులు లేవు. పరిస్థితులున్నా కూడా, అంత దూరాన్ని ఎక్కడ వెదుక్కోను? శాశ్వతంగా ప్రపంచం నుండి సెలవు తీసుకోడానికి ధైర్యం చాలట్లేదు.”
“అసలు నీకేమొచ్చిందని?” – మనసు ఆరా.
“ఏమొచ్చిందో నీకు అనవసరం. నాకు మాత్రం ఈ ప్రపంచంలో ఉండాలని లేదు.”
“ఎందుకంటున్నాను. ఆత్మహత్య అన్న ఆలోచనే తప్పసలు.”
“తప్పొప్పులు నిర్ణయించేది ఎవరు? నాకు ఒప్పనిపించింది నీకు తప్పనిపించదా ఏం?”
“ఈ వితండవాదానికేం కానీ, ఆత్మహత్య మాత్రం తప్పే!”
“నాకు తప్పు అనిపించట్లేదు. నేను ఆగుతున్నది నాకు ధైర్యంలేక. అలాగే, నాతో పెనవేసుకున్న బంధాలు తెంచలేక. అంతే కానీ, అది తప్పనీ, నేను పాపిననీ కాదు.”
“ఏదో ఒకట్లే, ఆగానన్నావు కదా, అది చాలు” – ప్రత్యూష లేకుంటే తన ఉనికి కూడా ఉండదని అప్పటిదాకా భయపడిందేమో. ప్రాణమంటే తీపి ప్రాణికా, మనసుకా?
“అద్సరే! ప్రపంచానికి దూరంగా వెళ్ళాలంటావు. మరి అదెలా చేద్దామని?” కుతూహలంగా అడిగింది మనసు.
“నిన్నూ, నన్నూ బాధపెట్టుకుంటూ..”
“అంటే?” మనసుకి అర్థంకాలేదు.
“How to lose friends & alienate people” అన్న సినిమా పేరు విన్నావా?
“నువ్వు చూడలేదుగా. అప్పుడోరోజు చూద్దామనుకున్నావు.”
“యా! చూళ్ళేదు. కానీ, ఇప్పుడు నేను చేయబోయేది ఆ టైటిల్ చెప్పేదే. సినిమా సంగతి దేవుడెరుగ్గానీ”.
“ఓహో! తమరి తెలివి తెల్లారినట్లు ఉందండి” – మనసు వెక్కిరించింది.
“నా బుద్ధికి ఆమాత్రం ఐక్యూ అన్నా ఉందండి. నా మనసుకి, అనగా మీకు. ఉత్త ఈక్యూనే.”
“ఏమే! రెండ్రోజులుగా ఫోను కూడా చేయలేదు. నేను చేసిన రెండుసార్లూ నువ్వు ఎత్తలేదు.” – అమ్మ.
“ఆఫీసులో బిజీగా ఉన్నానమ్మా” ఈ జవాబు పూర్తి నిజం కాదు అని తనకి తెలిసినా కూడా.
“మామయ్య ఇందాక ఫోన్ చేసాడు. పోయిన వీకెండ్ వాళ్ళింటి కెళ్ళినప్పుడు ఎక్కువ మాట్లాడలేదట? ఏమైంది? అని అడుగుతున్నాడు.”
“ఏమీ లేదని చెప్తున్నా కదే!”
“నువ్వు షేక్స్పియర్ మొహమేస్కుని కూర్చుని ఉండి ఉంటావ్ అక్కడ.”
“అబ్బా! వదిలేయి అమ్మా! ఇలా ఐతే వాళ్ళింటికి కూడా పోను. నాకు అసలే చిరాగ్గా ఉంది.”
“నీకంతా విసుగే, అంతా నసే. బొత్తిగా మనుషుల్తో మాట్లాడ్డమే నచ్చట్లేదు నీకసలు ఈ మధ్య”
“సరే, నచ్చట్లేదు. నువ్వొక్కదానివన్నా గుర్తించావు. థాంక్స్. ఏం చెయ్యమంటావ్ ఐతే?”
“ఈ వెటకారాలకేంలే! సరే, డోర్ బెల్ మ్రోగుతోంది. ఎవరో వచ్చినట్లు ఉన్నారు. బై.” ఫోన్ పెట్టేసిన శబ్దం.
వెటకారమేమిటీ? నిజంగానే నాకు మనుషులు నచ్చట్లేదు. ఎవరూ నమ్మరేం! అని నిట్టూర్చింది ప్రత్యూష.