భారతీయ సంగీత సాంప్రదాయానికి మూలం సామ వేదం. అతి ప్రాచీనమయిన భరతముని నాట్యశాస్త్రానికి సామవేదంలో ఉపవేదమైన గాంధర్వ వేదమే ఆధారం. ప్రాచీన కళారూపాల్లో సంగీత, నాట్యాలకి చాలా ప్రశస్తి వుంది. ఈ రెండూ కాలానుగుణంగా పరిణామం చెందుతూ అనేక రూపాలు సంతరించుకున్నాయి. అలాంటి రూపాల్లో భరత నాట్యానికీ, యక్షగానానికీ (opera) ప్రత్యేక చరిత్రా, స్థానమూ ఉన్నాయి. భరతనాట్యం కేవలం నృత్యానికే పరిమితమయితే, యక్షగానం నృత్య నాటికగా ప్రసిద్ధి చెందింది. అందువల్ల పూర్వకాలంలో యక్షాగానాలకు ప్రత్యేకమైన ఆదరణ ఉండేది.
మేవారి – గీత గోవింద
కపిల వాత్స్యాయన్
శ్రీ జయదేవకవి రచించిన గీతగోవిందము[1] బహుశా భారతీయ సాహిత్యములో మొదటి యక్షగానము అని చెప్పుకోవచ్చు. సరళమైన సంస్కృత పదాలతో నిండిన పద్యాలలో, పాటలలో శ్రీజయదేవుడు గీతగోవింద కావ్యాన్ని రాశాడు. ఇందులో రాధాకృష్ణుల విప్రలంభ (విరహము) సంభోగ (కలయిక) శృంగార వర్ణనలతో నిండిన కావ్యము ఇది. పన్నెండు సర్గలలో ఇరవైనాలుగు అష్టపదులు ఉన్నాయి. అష్టపదిలో ఎనిమిది చరణాలుంటాయి. సంస్కృతములో ప్రబంధము అని పిలువబడే అష్టపది పాట రూపంలో ఉంటుంది. గీతగోవిందములో ముచ్చటగా మూడే పాత్రలు – శ్రీకృష్ణుడు, రాధ, రాధ ఇష్టసఖి.
భారతదేశములో అన్ని ప్రాంతాలలో ఎవరికి తోచిన రాగాలలో, తాళాలలో ఈ అష్టపదులను పాడారు. తెలుగులో ఎన్నో చలన చిత్రాలలో అష్టపదులను పాడారు (ఉదా. విప్రనారాయణ, తెనాలి రామకృష్ణ, మేఘసందేశం). శాస్త్రీయ సంగీత కచేరీల చివరలో కూడా అష్టపదులను పాడడము వాడుక. తెలుగువారికి బాగా పరిచయమైన అష్టపది, విప్రనారాయణ చిత్రంలో భానుమతి పాడిన ‘సా విరహే తవ దీనా’. ఈ అష్టపదిని ఎన్ని రకాలుగా అనువదించారో, స్వరబద్ధం చేశారో పరిశీలించడం మా ఈ వ్యాసపు ఉద్దేశం. గీతగోవిందములో స్నిగ్ధ మధుసూదనము అనే నాలుగో సర్గలో హరివల్లభాశోక పల్లవము అనే ఈ అష్టపది నిందతి చందనం అనే పదాలతో ఆరంభమవుతాయి. దీని పల్లవి సా విరహే తవ దీనా.
ఈ అష్టపదిలో కృష్ణుడు లేని రాధ విరహోత్కంఠితయై పడే వియోగబాధ వర్ణించబడింది. ప్రియుడి విరహంతో ప్రియురాలు దగ్ధమవుతున్నట్లుగా భావించడం అష్టవిధ నాయికా లక్షణాలలో ఒకటి. యమునా తీరంలో ఒక పొదరింటిలో చంచల మనస్కుడై రాధను తలుస్తున్న కృష్ణుణ్ణి సమీపించి, రాధ పడే బాధనీ, నానా అవస్థలనీ ఆమె చెలికత్తె చెప్తుంది. ఈ సా విరహే అష్టపది చతుర్మాత్రాబద్ధమైనది. ప్రతి పంక్తికి ఏడు చతుర్మాత్రలు. చివరి చతుర్మాత్ర స-గణము లేక గ-గణము. అష్టపదిలోని ప్రతీ పదమూ ఒక ద్విపద. ఈ ద్విపదకు అంత్యప్రాస నియమం వుంది.
శ్లో. యమునాతీరవానీర
కుంజే మంద మాస్థితం
ప్రాహ ప్రేమభరోద్భ్రాంతం
మాధవం రాధికాసఖీ
అష్టపది – 8 హరివల్లభాశోకపల్లవము
కర్ణాటరాగైకతాలీతాలాభ్యాం గీయతే
నిందతి చందన మిందుకిరణ మనువిందతి ఖేద మధీరం
వ్యాలనిలయ మిలనేన గరల మివ కలయతి మలయసమీరం
మాధవ మనసిజ విశిఖ భయాదివ భావనయా త్వయి లీనా
సా విరహే తవ దీనా – ధ్రువం (1)
(రాధ విరహం చేత చల్లని వస్తువులయిన గంధాన్నీ, వెన్నెలనీ, మలయమారుతాన్నీ తట్టుకోలేక దూరంగా మసలుకుంటున్నది. ఇవేవీ రాధకి శాంతినివ్వడం లేదు. మన్మధ బాణాల తాకిడికి భయపడిన దీనురాలైన రాధ అనుక్షణమూ నీ భావనలో లీనమై ఉన్నది.)
అవిరల నిపతిత మదనశరా దివ భవదవనాయ విశాలం
స్వహృదయ మర్మణి వర్మ కరోతి సజల నలినీదలజాలం
సా విరహే తవ దీనా – (2)
(మన్మథుడేమో విడువకుండా పుష్పబాణాలను ఎక్కుపెడుతున్నాడు. నీకేమవుతుందోనని ఆ శరాఘాతాలు నీ మీద పడకుండా, నీ రూపాన్ని భద్రంగా తన హృదయాంతరాళాలలో రాధ దాచుకున్నది.)
కుసుమవిశిఖశరతల్ప మనల్ప విలాస కలా కమనీయం
వ్రత మివ తవ పరిరంభసుఖాయ కరోతి కుసుమ శయనీయం
సా విరహే తవ దీనా – (3)
(నీవెప్పుడు వస్తావో అని తహతహలాడుతూ పూలపానుపుని పరిచి వుంచింది. ఆ పడకపై నిన్ను కౌగిలించుకొని ఆనందంగా పడుకోవాలని రాధ కలలు కంటున్నది.)
వహతి చ వలిత విలోచన జలధర మాననకమల ముదారం
విధు మివ వికటవిధుంతుద దంత దలన గలితామృతధారం
సా విరహే తవ దీనా – (4)
(గ్రహణ సమయములో రాహువు కొరికినప్పుడు స్రవించే అమృతబిందువులతో ప్రకాశించే చంద్రునిలా రాధ ముఖం నీకై విలపిస్తూ వున్నది.)
విలిఖతి రహసి కురంగమదేవ భవంత మసమ శరభూతం
ప్రణమతి మకర మధోవినిధాయక కరేచ శరం నవచూతం
సా విరహే తవ దీనా – (5)
(ఏకాంతములో కస్తూరితో నిన్ను మదనమనోహరునిగా చిత్రిస్తున్నది. తరువాత మకరధ్వజాన్ని, మామిడి చిగురును రచించి మన్మథా ఇహ నన్ను బాధించకు, నీకొక నమస్కారమంటున్నది.)
ధ్యానలయేన పురః పరికల్ప్య భవంత మతీవ దురాపం
విలపతి హసతి విషీదతి రోదితి చంచతి ముంచతి తాపం
సా విరహే తవ దీనా – (6)
(రాధకు మనసులో సదా నీవే. ఎప్పుడూ ఆమెకు నీ తలపే. నవ్వుతుంది; ఏడుస్తుంది; అటూ యిటూ తిరుగుతుంది. పిచ్చి పట్టినదానివలె ఉన్నది రాధ.)
ప్రతిపద మిద మపి నిగదతి మాధవ తవచరణే పతితాऽహం
త్వయి విముఖే మయి సపది సుధానిధి రపి తనుతే తనుదాహం
సా విరహే తవ దీనా – (7)
(ఒక్కొక్క అడుగు వేస్తున్నప్పుడు నీ పేరునే ఆమె జపిస్తుంది. నీ ఉదాసీనత వల్ల ఆమెను చంద్రుడు కూడా కాల్చి వేధిస్తున్నాడు.)
శ్రీజయదేవ భణిత మిద మధికం యది మనసా నటనీయం
హరివిరహాకుల వల్లవయువతిసఖీ వచనం పఠనీయం
సా విరహే తవ దీనా – (8)
(రాధ వియోగబాధను శ్రీకృష్ణునికి సవివరముగా తెలిపిన జయదేవ విరచితమైన రాధ చెలి పలుకులు సదా పఠనీయములు.)
శా. ఆవాసో విపినాయతే ప్రియసఖీ మాలాऽపి జాలాయతే
తాపోऽపి శ్వసితేన దావదహనజ్వాలాకలాపాయతే
సాऽపి త్వద్విరహేణ హంత హరిణీరూపాయతే హా కథం
కందర్పోऽపి యమాయతే విరచయన్ శార్దూలవిక్రీడితం
(రాధ ఇల్లు అడవిలా (అస్తవ్యస్తముగా) వున్నది. ప్రియసఖులను కూడా సహించుట లేదు. వెచ్చని ఊపిరులు వదులుతున్నది. మన్మధుడు జింకను వేటాడే పులిలా ఆమెతో ఆడుతున్నాడు.)
ఇందులోని ఐదవ చరణము ఎంతో భావయుక్తమైనది. దీన్ని చదువుతుంటే షేక్స్‌పియర్ రాసిన కింది పంక్తులు గుర్తుకు వస్తాయి.
More strange than true: I never may believe
These antic fables, nor these fairy toys.
Lovers and madmen have such seething brains,
Such shaping fantasies, that apprehend
More than cool reason ever comprehends.
The lunatic, the lover and the poet
Are of imagination all compact:
– William Shakespeare, A Midsummer night’s dream, Act 5, Scene 1.
ఈ అష్టపదిలోని కొన్ని పదాలని భారతీయ భాషలలో ఆయా భాషల ఉచ్చారణ రీత్యా వాడుతారు. ఒరియాలాటి భాషలలో ళ-కారము, బ-కారము ఎక్కువగా వుంటాయి. తెలుగులాటి ద్రావిడ భాషలలో కూడా కొన్ని పదాల మధ్యలో ఉండే ల-కారాన్ని ళ-కారంగా పలుకుతారు. తమిళ మలయాళ భాషలలో ‘అంత’, ‘చంచతి’ లాటి పదాలను అంద’, ‘చంజ’ లాగా ఉచ్చరిస్తారు.
జయదేవ మూల ప్రతి సంస్కృతంలో ఉన్నా దాదాపు ప్రతీ భారతీయ భాషలోకీ గీతగోవిందకావ్యము అనువదించబడింది. సాహిత్య పరంగా వీటికొక ప్రత్యేక స్థానం వుంది. ఎంతో మంది కవిత్వానికి ఈ అష్టపదుల్లో సాహిత్యం ప్రేరణగా నిలిచింది. Love song of the Dark LorD – Jayadeva’s Gita Govinda[2] అనే పేరుతో Barbara S. Miller అనే ఆవిడ జయదేవాష్టపదుల్ని ఇంగ్లీషులో చాలా చక్కగా అనువదించారు. అలాగే వుయ్యూరు సంస్థనానికి చెందిన బొమ్మకంటి వీరరాఘవాచార్యులు[3], శతావధాని పిచ్చయార్య[4], యతిశ్రీ[5] తెలుగులోకి గీతగోవిందాన్ని అనువదించారు. ఈ అష్టపదికి ఈ వ్యాసరచయిత మోహన రావు చేసిన తెలుగు, ఆంగ్ల అనువాదాలను ఇక్కడ ఇస్తూ, ఈ వ్యాసానికి అనుబంధంలో కొన్ని ఇతర తెలుగు, ఇంగ్లీషు అనువాదాలను సంకలించాం.
యమునా తీరమందొక్క
సుమాల పొదరింటిలో
భ్రమించి యుండు పద్మాక్షు
సమీపించె సఖీమణి
చల్లని గంధము చల్లని వెన్నెల
నొల్లక నలిగెను రాధ
చల్లని గాలిని సర్పపు విషమని
చాల భయంపడె బాధ …
భావజు శరముల పూవులు దాకగ
భావించెను నిను గాన
నీ విరహమ్మున దీన (ధ్రు. 1)
హృదయాలయమున మృదు నళినమ్ముల
కవచము మూర్తిని దాచె
మదనుని యమ్ముల పదునుకు జడువక
పదిలముగా నిను గాచె
నీ విరహమ్మున దీన (2)
నానా సుమముల మెత్తని పానుపు
బాణమువలె తా వేసె
ఈ నీ కౌగిలి యానందములో
మేను మఱువగా వేచె
నీ విరహమ్మున దీన (3)
మోహన వదనపు కావిరి కన్నులు
శ్రావణ మేఘము లాయె
రాహువు కోఱలు రాచిన శశి ముఖ
మమృతపు వాహిని యాయె
నీ విరహమ్మున దీన (4)
మకరధ్వజముల మామిడి చిగురుల
స్వకరమ్ముల రచియించె
ఒకతెగ నుండగ మకరాంకునివలె
ముఖరూపము చిత్రించె
నీ విరహమ్మున దీన (5)
తలచుచు మదిలో గల నీ మూర్తిని
గొలుచుచు తాను తపించు
విలవిల యేడ్చుచు కలకల నవ్వుచు
కలగుచు నిను ధ్యానించు
నీ విరహమ్మున దీన (6)
శరణము మాధవ చరణము లను యు-
చ్చరణము నీ నామమ్మె
పరాకు సేయగ విరహిణి కుడుపతి
కిరణము లగు ననలమ్మె
నీ విరహమ్మున దీన (7)
హరి విరహమ్మున కరగెడు రాధిక
గుఱించి చెలియయు జెప్పె
మఱువని జయదేవాఖ్యుని మాటలు
స్మరణీయమ్మై యొప్పె
నీ విరహమ్మున దీన (8)
అయ్యెన్ గేహ మరణ్యమై, చెలి సమూహ మ్మెల్ల జాలమ్ముగా
నయ్యెన్, దాపముచేత నూర్పులు మంటయ్యెన్ వికారమ్ముగా,
సయ్యాటయ్యెనుగా మనోజునికి యా శార్దూలవిక్రీడితం,
బయ్యో జింకయె బేల, వేగిరమె కాపాడంగ రమ్మో హరీ
On the banks of the river Yamuna
in a bower of flowers
Krishna was sitting brooding
immersed in his thoughts about Radha
when her dear friend appeared before him
And she begins to narrate the plight of Radha
Anything cool, she rejects
be it sandalwood paste or the moonlight
and she considers the cool breeze from the south
as laden with poison
Smitten by the arrows of Eros
the poor girl is in anguish
In her separation
Radha pines for you … 1
In her heart of hearts
she has put you on a pedestal
and she tries to protect that image
with the shield of tender lotus blooms
Even as the Love God is relentless
she still tries to keep you away from his sharp arrows… 2
She made a bed of flowers
in the form of an arrow
to be with you
and to forget herself
in your fond embrace… 3
Any moment
her dark eyes may burst forth
like the monsoon clouds
Her face is oozing ambrosia
even when it sparkles
like the full moon
being devoured at the time of the eclipse… 4
When she is alone
she draws the picture of your likeness
She paints her hands with
the flags of the Love God with the crocodile ensign
and mango leaves that are his choice arrows… 5
One moment she is lost
another moment she is pensive
One moment she cries
another moment she laughs
Her thoughts are always about you
her worship is always your image… 6
Without any inhibitions
she has fallen at your feet
and repeatedly she utters your name
You ignored her
and in your separation
even the caress of moonbeams
makes her jump up as if it were fire… 7
Thus spoke to Krishna
the dear friend of Radha
of her mate’s loneliness and suffering
in the absence of Krishna
These words of apt description
by the poet Jayadeva
are worth reading again and again… 8
Radha’s dwelling as disorderly as a forest
She considers even her close friends as a distraction
Her shallow breaths have a feverish tinge
Alas, the Love god is playing with her
as a tiger ready to pounce on the hapless deer.
సా విరహే అష్టపది, మేవారి శైలి
కపిల వాత్స్యాయన్
కేవలం అనువాదాలే కాక జయదేవుని గీతగోవింద కావ్యపు పాటలకు, పద్యాలకు ఎందరో చిత్రకారులు శతాబ్దాలుగా చిత్రాలు వేస్తున్నారు. గీతగోవింద అష్టపదులకి మేవార్, కాంగ్రా శైలుల చిత్రాలను నేషనల్ మ్యూజియం[6], [7] వారు పుస్తకంగా ప్రచురించారు. ఈ అష్టపదికి సంబంధించిన చిత్రాలను ఇందిరా గాంధీ జాతీయ కళా సంస్థ వారి వెబ్‌సైట్లో కూడా చూడవచ్చును. జయదేవుని అష్టపదులకు భరతనాట్యం, కూచిపూడి, మణిపురి, ఒడిస్సీ, కథక్, మోహినియాట్టం వంటి ఎన్నో రీతులలో నాట్యము చేస్తారు. ఈ సా విరహే అష్టపదికి కేరళ సాంప్రదాయమైన మోహినియాట్టంలో అంజలీ పణిక్కర్ నాట్యాన్ని, భరతనాట్య శైలిలో శివకామి నాట్యాన్ని ఇంటర్నెట్లో చూడవచ్చు.
సామాన్యంగా అష్టపదులను పాడేటప్పుడు, మొదట అష్టపది ముందు శ్లోకాన్నీ, తరువాత వచ్చే సంక్షిప్త సంగ్రహాన్నీ ఆలపించాలి. అయితే ఈ నియమాన్ని అందరూ పాటించరు. అదే విధంగా ఎవరికి తోచిన రాగతాళాలను వాళ్ళు వాడుతారు. ఏ కొందరో తప్ప అందరూ అష్టపదిలో అన్ని చరణాలూ పాడరు. సంస్కృతంలో మొదట చరణము, ఆ తరువాత ధ్రువము లేదా పల్లవి వస్తాయి. ఈ అష్టపదికి పల్లవి సా విరహే తవ దీనా. కానీ, చాలా మంది ‘నిందతి చందన మిందుకిరణం’ అనే దానినే పల్లవిగా కూడా వాడతారు. భారతీయ సంగీత పద్ధతుల్లో (హిందూస్తానీ, కర్ణాటక) పాడేవారు ఒక్కొసారి అష్టపదులకు ‘రాధా’ అనో, ‘రాధే’ అనో, ‘కృష్ణా’ అనో అష్టపదిలో లేని పదాలు కలుపుతారు.
జయదేవుడు ఈ అష్టపదిని కర్ణాట రాగంలో, ఏక తాళంలో స్వరపరిచినట్లుగా అష్టపది ప్రారంభంలో వుంది. దీన్ని ఏక తాళ బద్ధంగా పాడాలి. కర్ణాట రాగం అన్నది ప్రస్తుతం వాడుకలో లేదు. ఈ రాగం గురించిన ఏ వివరాలూ అందుబాటులో లేవు. కానీ ఈ రాగం గురించి శ్రుతిరంజని[8] అనే గీతగోవింద వ్యాఖ్యలో ఒక ధ్యాన శ్లోకంగా ఈ క్రింది విధంగా చెప్పబడింది.
కృపాణపాణిః గజదంతపత్రం
ఏకం వహన్ దక్షిణ కర్ణపూరం
సంస్తూయమానః సురచారణౌఘైః
కర్ణాటరాగః శిఖి నీలకంఠః
(సురచారణులు పొగడుతూ ఉంటే, శిఖికంఠుడు కుడి భుజంపై గజదంతాన్ని, మరో చేతిలో కత్తిని పట్టుకొని నడుస్తున్నాడు. ఇట్టి సమయాలలో కర్ణాటరాగాన్ని పాడుట సమంజసము.)
ఈ అష్టపదిని బాగేశ్వరి రాగంలో పాడుతారని మంచాళ జగన్నాథ రావు[9] సూచించారు. ఈ బాగేశ్వరి రాగంలో ప్రస్తుతం ఎవరూ పాడినట్టు లేదు. ఈ అష్టపదిని సౌరాష్ట్ర, కానడ, దర్బారీ కానడ రాగాలలో కూడా పాడవచ్చనీ ఈ కావ్యపు వావిళ్ళ వారి ప్రతిలో[1] వున్నది. వీటిలో ఈ అష్టపది దర్బారీ కానడ రాగంలో చాలా ప్రసిద్ధి చెందింది. ఇదే కాకుండా కొంతమంది మిశ్ర కానడలోనూ, యమన్ కళ్యాణిలోనూ, మాండ్ లోనూ, చక్రవాకంలోనూ, ఇలా పలురాగాల్లో స్వరపరిచారు. ఈ జయదేవాష్టపది చాలా భాషల సినిమాలలో కూడా వున్నది. దర్బారీ కానడ రాగం కానడ రాగానికి అనుబంధ రాగమనీ, దక్షిణాదినుండి తాన్సేన్ హిందూస్తానీ సంగీతానికి తీసుకెళ్ళాడని నానుడి. దర్బారీ కానడ రాగ కదంబములో మిగిలిన రాగాలను గురించి రాజన్ పర్రికర్ ఒక చక్కటి వ్యాసం రాశారు.
సంగీతంలో రాగాలన్నీ రసప్రధానమయినవి. కొన్ని రాగాలకి నిర్దిష్టమయిన రస రూపం వుంది. అంటే ఆయా రాగాలు ఆయా రసాలు పలికించడానికి వాడడం కద్దు. రసాలకీ ఒక అర్థమూ, సమయమూ ఉంటాయి. ఈ రసప్రధాన రాగాల్ని కొన్ని ప్రత్యేక సందర్భాలని చెప్పడం కోసం సంగీతంలో వాడుతారు. ఈ అష్టపదిని స్వరపరిచిన రాగాలూ, పాటల వివరాలూ ఇక్కడ పొందుపరుస్తున్నాం.
దర్బారి కానడ
సా విరహే – ఎం.ఎల్. వసంత కుమారి, శ్రీవిద్య
పైన చెప్పిన దాన్ని బట్టి చూస్తే, సా విరహే అష్టపది విరహగీతం కాబట్టీ, పైగా పున్నమి వెన్నె లనే సందర్భం ఉండడంవల్లా, దీనికి రాత్రి పాడే ఒక రాగమయితే సరిగ్గా వప్పుతుందన్న అభిప్రాయముంది. ఈ విధంగా చూస్తే దర్బారి కానడ రాత్రి పూట పాడే రాగం. ధ్యానానిక్కూడా వాడుతారు. ఎం.ఎల్. వసంత కుమారి పాడిన ఈ అష్టపది వింటే అటువంటి భావనే కలుగుతుంది. కానడ, దర్బారీ కానడ వినడానికి ఒకేలా ఉన్నా రెంటికీ చాలా తేడాలున్నాయి. కానడ రాగంలో శుద్ధ దైవతం వాడతారు. దర్బారీకానడలో చతురస్ర దైవతం ఉంటుంది. రి,ప,గా అన్న ప్రయోగం రెంటిలోనూ ఉన్నా, గా-మా-రీ-సా, మ-ప-ద-ని-సా ప్రయోగాలు దర్బారీకానడలో ఎక్కువగా కనిపిస్తాయి. కానడలో కాకలి నిషాదం అన్య స్వర ప్రయోగం కనిపిస్తుంది. అలాగే కానడలో గ-మ-ద-ని-సా అన్న ప్రయోగమూ కనిపిస్తుంది.
దర్బారీ కానడలో చాలా సినిమా పాటలున్నాయి. జగదేక వీరుని కథలో ‘శివశంకరి’, అలాగే బైజూ బావరా సినిమాలో ‘ఓ దునియాకే రఖ్ వాలే’ కూడా దర్బారీ కానడ పాటలే. ఇందులో మ-ప-ద-ని-సా ప్రయోగం ఉంటుందని ఇంతకు ముందు అనుకున్నాం. ఈ బైజూ బావర పాట ఈ మ-ప-ద-ని-సా స్వరాల తోనే మొదలవుతుంది. సాధారణంగా రాగంలో మధ్యనున్న స్వరాలతో పాటనెత్తుకోడం ఒరవడి కాదు. కష్టం కూడా. నౌషాద్ వంటి మహా సంగీత దర్శకులకే అలాంటి ప్రయోగాలు సాధ్యం. అలాగే మేరే హుజూర్ సినిమాలో మన్నాడే అవార్డు గెలుచుకున్న పాట ‘ఝనక్ ఝనక్ తొరి బాజే పాయలియా’ కూడా దర్బారీ కానడలోదే! ఈ సినిమా పాటలు ఇక్కడ దర్బారీ కానడరాగాన్ని గుర్తుపట్టడం కోసం ఇవ్వడం జరిగింది. తెలుగునాట ఎంతో ప్రాచుర్యం పొందిన తెలుగు హనుమాన్ చాలీసాక్కూడా ఎం.ఎస్ రామారావు గారు ఈ దర్బారీ కానడ రాగానే ఎంచుకున్నారు.
మిశ్ర కానడ
సా విరహే తవ దీనా – రఘునాధ్ పాణిగ్రాహి
లక్షణాల రీత్యా కానడకీ, మిశ్ర కానడకీ తేడాలున్నాయి. ముఖ్యమైన తేడా నిషాద స్వరం (ని) లోనే ఉంటుంది. మిశ్రకానడలో కైశిక, కాకలి రెండు నిషాదాలూ వుంటాయి. కాకలి నిషాదాన్ని అపురూప ప్రయోగంగా వ్యవహరిస్తారు. రఘునాధ్ పాణిగ్రాహీ పాడిన గీతగోవింద ఆల్బంలో సా విరహే అష్టపది ఈ రాగం లోనిది. లవకుశ సినిమాలో జగదభి రాముడు శ్రీ రాముడే పాట కానడ రాగమే. అలాగే శ్రీ నగజా తనయం పాట కూడా. నర్తన శాలలో ‘జననీ శివకామినీ’, గృహాప్రవేశం లో ‘దారి చూపిన దేవతా’, సిరిసిరి మువ్వలో ‘పిలిచాను ఎదుట నిలిచాను – గోదారల్లే’ మరికొన్ని ఉదాహరణలు.
చక్రవాకం
సా విరహే – మంగళంపల్లి బాలమురళీకృష్ణ
హిందూస్తానీలో పైన చెప్పిన రాగాల్లోనే ప్రసిద్ధి చెందినా, కర్ణాటక సంగీతంలో ఈ అష్టపదిని చాలా రాగాల్లోనే స్వరపరిచారు. మంగళంపల్లి బాలమురళీ కృష్ణ ఈ పాటని చక్రవాక రాగంలో అతి సరళంగా భజన సాంప్రదాయ పద్ధతిలో పాడారు. ఈ పాటలో కూడా కొత్తదనం కనిపిస్తుంది. దీన్ని అనుసరించే కె. కృష్ణకుమార్ – బిన్ని కృష్ణ కుమార్ పాడారు. మంగళంపల్లి బాలమురళీ కృష్ణ పాడిన ‘పిబరే రామరసం’ ఈ చక్రవాకరాగం లోదే. తులాభారం సినిమాలో ‘రాధకు నీవేరా ప్రాణం’ పాట ఈ రాగంలోనే కూర్చారు.
ద్విజావంతి
సా విరహే తవ దీనా – కవళం శ్రీకుమార్
ఇది హిందూస్తానీ సాంప్రదాయ రాగం. ప్రముఖ వాగ్గేయకారుడు ముత్తుస్వామి దీక్షితులు ఈ రాగాన్ని కర్ణాటక సంగీతంలోకి తెచ్చారని అంటారు. ఈ రాగాన్ని జుజావంతి లేక జయజయవంతి అని కూడా వ్యవహరిస్తారు. కవళం శ్రీకుమార్ (1, 2, 3) ఈ అష్టపదిని పూర్తిగా కర్ణాటక శాస్త్రీయ సంగీత పద్ధతిలో పాడారు. ‘హిమగిరి సొగసులూ’ (పాండవ వనవాసం), ‘మనసున మనసై బ్రతుకున బ్రతుకై’ (డాక్టర్ చక్రవర్తి) పాటలు ఈ రాగంలోనివే.
మరికొన్ని రాగాలు
సా విరహే – గాలి వెంకటేశ్వర రావు (మాలపిల్ల) సా విరహే – భానుమతి (విప్రనారాయణ) సా విరహే – టంగుటూరి సూర్యకుమారి సా విరహే – శ్రీనివాస్, ఊర్మిళ (వనజ) సా విరహే – శ్రీకుమార్ (అగ్నిసాక్షి)
మాలపిల్ల చిత్రంలో గాలి వెంకటేశ్వర రావు ఈ అష్టపదిని మాండ్ రాగంలో పాడారు. ఇదే తెలుగు సినిమాలో ఈ అష్టపది మొట్టమొదటిసారిగా వినబడడం. మాండ్ రాగం గమ్మత్తైన రాగం. దీన్ని నాటకాల్లో ఎక్కువగా వాడేవారు. దేవులపల్లి వారి అతి ప్రసిద్ధి చెందిన “ఆకులో ఆకునై పాట” కి ముందున్న సాకీ ( ఈ పలుకారు వేళ వికసించిన సంపెగ చెట్ల క్రింద ) మాండులోనే ఉంది. కానీ ఈ అష్టపదిని విప్రనారాయణ సినిమాలో ఎస్. రాజేశ్వరరావు యమన్ కళ్యాణిలో స్వరపరిచారు. చాలా మంది తెలుగువాళ్ళకి ఈ పాట ద్వారానే ఈ అష్టపది చిరపరిచితం. దీన్ని భానుమతీ రామకృష్ణ శ్రావ్యంగా పాడారు. టంగుటూరి సూర్యకుమారి కూడా ఇదే రాగంలో పాడినా, పాట వరస వినడానికి కాస్త తేడాగా ఉంటుంది. ఈ మధ్యనే విడుదలైన వనజ సినిమాలో కూడా ఈ అష్టపదుంది. దీన్ని బేహాగ్ రాగంలో, శ్రీనివాస్ మంథా, ఊర్మిళా దమ్మనగిరి పాడగా, భాస్కర నారాయణ స్వరపరిచారు. ఈ పాట కూడా నృత్య నాటక సాంప్రదాయ పద్ధతిలోనే ఉంటుంది. భక్త ప్రహ్లాద సినిమాలో ‘వరమొసగే వనమాలీ’ పాట బేహాగ్ రాగమే.
అగ్నిసాక్షి అనే మళయాళ సినిమాలో ఈ పాట సగం కర్ణాటక పద్ధతినే అనుసరిస్తూ, మరో సగం కథకళి నృత్య రీతి పాటలాగా శ్రీకుమార్ ఎంతో గంభీరంగా పాడారు. ఇవి కాకుండా సావిరహే అష్టపదిని కొంతమంది ఫ్యూజన్ స్టైల్లో కూడా పాడారు.
ఒక పదం వదలకుండా ఈ అష్టపదిని సంపూర్ణముగా పాడిన వారి ధ్వని ముద్రికలు నాలుగే. అవి – (1) వేదవల్లి-కృష్ణమూర్తి కర్ణాటక శైలిలో దర్బారి కానడలో పాడిన పాట, (2) దర్బారీ కానడలో శారదా వెంకట్రామన్ తంబూరాతో మాత్రమే పాడిన పాట, (3) ఒడిస్సీ బాణీలో శుద్ధ ధనశ్రీ రాగములో నజియా పాడిన పాట, (4) కల్యాణి రాగములో నిత్యసంతోషిణి పాడిన పాట. ఇవే కాక ఇప్పటి కర్ణాటక గాయనీమణులైన సౌమ్య, బాంబే సహోదరుల పాటlanuను, రాధాకళ్యాణ సందర్భంగా ఉమయాళ్‌పురం భక్తులు పాడిన పాటలు ఆన్లైన్లో వినడానికి లభిస్తాయి.
అష్టపదులను ఎన్నో బాణీల్లో పాడినా ముఖ్యమైనవి మూడే! అవి – ఒరియా పద్ధతి, కర్ణాటక పద్ధతి, సోపాన పద్ధతి. హిందూస్తాని సంగీత పద్ధతిని అనుసరించి రాగాభావాలను రమ్యంగా కలిపి పాడిన రఘునాథ్ పాణిగ్రాహి పాట, కర్ణాటక పద్ధతిలో భరత నాట్యానికై పాడిన వసంతకుమారి పాట, రెండు చక్కని ఉదాహరణలు. సోపాన పద్ధతి కేరళ దేశములో చాలా ప్రసిద్ధమైనది. గుడి మెట్లను ఎక్కుతూ, ఇడుక్క అనే వాద్యాన్ని వాయిస్తూ ఈ అష్టపదులను పాడతారు ఈ పద్ధతిలో రామ పొదువళ్ ఇందులో ఆరితేరిన దిట్ట.
ఎంతో మంది కవులకి ఈ అష్టపదులు ప్రేరణ ఇచ్చాయి అనడంలో సందేహం లేదు. సంగీత కచేరీల్లో అష్టపదులను తరచు పాడుతుంటారు. కూచిపూడి భరతనాట్యాలలో వీటికి నాట్యం చేసి అభినయిస్తారు. పైన ఉదహరించిన పాటలను వింటే సంస్కృత సాహిత్యం అర్థం కాకపోయినా భావాన్ని హృదయానికి హత్తుకునేలా చేస్తాయి. అందువల్లే ఏ భాష వారయినా, ఏ ప్రాంతం వారయినా భారతీయులకి ఈ అష్టపదులు ఎప్పటికీ ఇష్టపదులే!
గ్రంథసూచి
- గీతగోవింద కావ్యము – శ్రీజయదేవకవి, ఉత్పల వేంకటనరసింహాచార్యుల వ్యాఖ్య, వావిళ్ళ రామస్వామి శాస్త్రులు అండ్ సన్స్, చెన్నపురి, 1918.
- Love Song of the Dark Lord – Jayadeva’s Gitagovinda, translated by Barbara Stoler Miller, Columbia University Press, New York, 1977.
- గీతగోవిందము – బొమ్మకంటి వీరరాఘవాచార్యుల అనువాదము, 1940.
- శ్రీమదాంధ్ర గీతగోవిందకావ్యము – చల్లా పిచ్చయార్య, ఓంకార్ ప్రెస్, గుంటూరు, 1950.
- ఆంధ్ర గీతగోవిందము, యల్లకరి తిరువేంగళ సూరి (యతిశ్రీ), శ్రీ సాయిరాం ప్రింటర్స్, మార్కాపురం, ప్రకాశం జిల్లా, 1996.
- Mewari Gita-govinda, Kapila Vastyayan, National Museum publ., New Delhi, 1987.
- Kangra paintings of gita govinda, J. Bhattacharjee, National Museum Publ., New Delhi, 1982.
- Gitagovinda of Jayadeva with the commentary Srutiranjani of Lakshmidhara, ed. K S Ramamurthi, Sri Venkateswara University, Tirupati, 1990.
- శ్రీ గీతగోవిందము, సం. మంచాళ జగన్నాథ రావు, Andhra Pradesh Government Oriental Manuscripts Library and research Institute, Hyderabad, 1972.