గుండుగొమ్ములనుమానం – 2

రచనల్లో నిజాయితీని గురించి త్రిపుర చెప్పిన మాటలు – రాతలన్నీ కల్పనలు. ‘నిజం’ కావు. రక రకాల కళాకారులు తమ కళారూపాల్ని ప్రదర్శించినట్లే రచయిత తన సృజనను ప్రదర్శిస్తున్నాడు. రచనకు సంబంధించినంత వరకు ‘నిజం’ అని, ‘నిజాయితీ’ అనీ పట్టు పట్టడం సబబు కాదు. రచయిత ఒక ఐంద్రజాలికునిలా వదిలించుకొనే వీల్లేనంత గట్టిగా పాఠకుడి ధ్యాసను, దృష్టినీ చేజిక్కించుకుని రక రకాల వింతలు మలుపులున్న తన కాల్పనిక వీధుల్లోనికి ఈడ్చుకుపోతూ ఆ కల్పననే చూడమని ప్రదర్శిస్తున్నాడు. గాయకులు, నర్తకులు, చిత్రకారులు, నటులు – ఇలాంటి కళాకారుల ప్రదర్శనల్ని చూసి అవి రక్తి కట్టేయా లేదా అని శ్రోతలు, ప్రేక్షకులు తమకు తాముగా నిర్ణయించుకుంటారు. ఇలాంటి నిర్ధారణలను సమంజసంగా ప్రతిపాదించి, ఒప్పించగలిగే వాళ్ళని మంచి అభిరుచి ఉన్నవాళ్ళని చెప్పుకుంటాము.

రాతపూర్వకంగా ఉన్న ఏ విషయానికైనా పాఠకుడ్ని ఒక కాల్పనిక ప్రపంచంలోకి తీసుకొనిపోయే శక్తి ఉంది. త్రిపుర ఒకసారి దీనికి రైల్వే టైంటేబుల్ ఉదాహరణగా చెప్పేరు. రైళ్ళ రాక పోకల పట్టిక తెరచి దాన్లో ‘రాయగడ బొలాంగీర్ మీదుగా కిరుబురు మరియు ఆ పైకి’ అని ఆపాటి చదివితే కాల్పనిక ప్రపంచాలు అప్పుడే కిటికీలు తెరుచుకోవడం ప్రారంభిస్తాయి. నారాయణరావు ఈ విషయాన్నే ఇంకొకలాగ, ఇంకా తీవ్రంగా చెప్పేరు. ప్రతి మాటకీ కల్పించే శక్తి ఉంది. మాట అంటేనే కల్పన. ‘కనక ప్రసాద్’ అని అంటే ఆ పాటి మాటే విన్నవాళ్ళకి రక రకాల ఊహా చిత్రాల్ని కల్పిస్తుంది. నారాయణరావు ఈ సంగతికి కొనసాగింపుగా తిరిగి ఒక ప్రశ్న అడిగేవారు. ఒకసారి కల్పించిన పాత్రలు ఆ రచన అయిపోయేక ఎక్కడికి నిష్క్రమిస్తున్నాయి? గుర్తుండిపోయిన పాత్రల్ని గురించి ఈ ప్రశ్న వేసుకుంటే చిత్రంగా ఉంటుంది.

రచన కవి నిర్వహిస్తున్న ప్రదర్శన. దానిలో కవి తన నిజ స్వరూపాన్నో, తను చూసే జీవితపు శకలాన్నో యధాతధంగా త్రుంచి చూపించాలని ఆశించలేము. అటువంటి షరతులు వాస్తవంగా సృజన జరిగే పద్ధతికి, కల్పన స్వరూపానికీ విరుద్ధం. కవి, రచయిత ఒక మాటల నటుడు, మాటలతో తన చదువరులు ఒక్కొక్కరికీ వాళ్ళకే ప్రత్యేకమైన ఊహా ప్రపంచాన్ని కట్టి ఇచ్చే దృశ్య శిల్పి. రచన నుండి ఆశించవలసింది ఏమంటే – ఆ రచన ఒక్కో పాఠకుడికీ ప్రత్యేకంగా చూపిస్తున్న తన ప్రదర్శనను రక్తి కట్టించటంలో ఆ ఒక్క పాఠకుడి అనుభవంలో ఏ మేరకు సఫలమయ్యిందన్న విషయాన్ని మాత్రమే. ప్రత్యేకం ఎందుకంటే ఆ ప్రదర్శన పాఠకుని మనోరంగంపై కవీ, పాఠకుడూ జట్టుగా నిర్వహించేది. ఇలాంటి అనుభవాల కలబోత ఆ రచన గురించి ఉమ్మడి అభిప్రాయానికి దారితీస్తుంది. అయితే, అంతగా రక్తి కట్టని ఏ ప్రదర్శననైనా చూసొచ్చి ఆ నటుల, శిల్పుల, చిత్రకారుల కల్పనల్ని కూడా ‘జూటాకోరు సృజనలు’ అని నిందిస్తామా? ఆ ప్రదర్శనలు, ఈ చూసినవాడ్ని మాత్రం రంజింపచెయ్యలేకపోయాయి అని సర్దిచెప్పుకుంటామా? లేదా ఇంకా తీవ్రంగా ఆ కళాకారులే ‘జూటాకోర్లు’ అని నిందిస్తామా? నామిని ఇటీవలి వ్యాఖ్యల్ని ఈ ప్రశ్నల నేపధ్యంలో ఎలా అర్ధం చేసుకుంటాము?

ఇక్కడ శిల్పాల్ని గురించి ఒక సంగతి జ్ఞాపకం వస్తుంది. మా చిన్నప్పుడు నగరపాలక సంస్థ వాళ్ళు గొప్ప జాతీయనాయకుల విగ్రహాల్ని చెక్కే పనిని ఒక పేరుమోసిన శిల్పిగారికి అప్పగించేరు. తీరా ఆయన చేసిన శిల్పాల్ని కూడళ్ళలో ప్రతిష్టించేక ఏ బొమ్మ తీరు చూసినా ఇంచుమించు ఒక్కలాగే ఉండేది. ఉన్నది ఒకటే బొమ్మనీ, దానికే గెడ్డం మకుటం ఉంటే అది శివాజీ అనీ, చీర కట్టుకుని కత్తీ డాలూ ధరిస్తే ఝాన్సీ లక్ష్మీబాయి అనీ, కోటూ గులాబీ పువ్వూ ఉంటే నెహ్రూ గారనీ పోల్చుకోవాలి. శిల్పిగారికి చెక్కడం తెలిసింది ఒక్కరకం బొమ్మేననీ, అదెవరి బొమ్మో దుస్తుల్ని బట్టే పోల్చుకోవాలనీ హాస్యంగా చెప్పుకునేవాళ్ళు. శిల్పులకైతే ఎదర చూసి అనుకరించేందుకు, చెక్కిన శిల్పాల్ని వెనుదిరిగి కొలిచి చూసేందుకూ ప్రమాణాలుగా నిజం శివాజీ, నిజం ఝాన్సీ రాణీ ఉన్నారు. మాటలతో చెక్కే శిల్పమైన సృజనకి ముందూ, పిమ్మటా ఇలాంటి ప్రమాణాలు ఏమున్నాయి?

త్రిపుర రచయితల, కవుల ‘నిజాయితీ’ మీద కటువైన విమర్శల్ని హర్షించరు. చదివినప్పుడు నిజాయితీ మీద సందేహాలు వస్తే ఆ కాల్పనిక ప్రదర్శన పేలవంగా ఉందని మాత్రం అర్ధంచేసుకోమంటారు. ఇక్కడ సఫలం కానిది వ్యక్తిగానో, కళాకారునిగానో ఆ రచయిత నిజాయితీ కాదు. సఫలం కానిదల్లా అతని (ఆమె) కళా ప్రదర్శన (Artistic Performance) మాత్రమే. ఈ క్షమా దృష్టిని ఇదివరకు అనుకున్న సానుభూతి నేపధ్యంలో అర్ధం చేసుకోవచ్చు. రచయితల ప్రవృత్తి రాయటం కాబట్టి ఆ వ్యాపారానికి త్రిపుర పూర్తి సానుభూతి, మద్దతు ఉన్నాయి. ఇక్కడి వరకు త్రిపుర, నారాయణరావుల అభిప్రాయాలు రమారమి ఒక్కటిగానే ఉన్నాయి. నారాయణరావు కూడా అడిగినవాళ్ళందరికీ ‘బుద్ధిగా హాయిగా రాసుకో!’ అని చెప్తుంటారు. అయితే, ఆ రాతలలో ఏవి సఫలమైన సృజనలు అనే విషయంలో త్రిపుర గొప్ప నిరంకుశుడు. నారాయణరావు గారు కూడా నిరంకుశుడే. కాని వాళ్ళిద్దరి ప్రాపంచిక దృక్పధాలు, తాత్విక భూమికలు, రచనల నేపధ్యాలూ, ఉద్దేశాలూ చాల భిన్నమైనవి. నారాయణరావు మౌలికంగా సాహిత్య శాస్త్రజ్ఞుడు కాబట్టి ఆయన బహుళము, విస్తృతమైన సాహిత్యాన్నంతట్నీ కాపలా కాస్తూ ఆ సంచయం మొత్తం ప్రాతిపదికగా తన అభిప్రాయాల్ని, సిద్ధాంతాన్నీ నిర్మించుకోవాలి, ప్రకటించుకోవాలి. అంతే కాకుండా ఆ సాహిత్యం ఆవరణల్లో ఉన్న సాటివాళ్ళని (peers) ఒప్పించుకోవాలి. ఇది చాల కష్టమైన పని, ఒంటరి పని, కాని శాస్త్రవేత్తలకు వృత్తి ధర్మంగా వచ్చే తప్పనిసరి పని. దీన్ని తలకెత్తుకొని, నిర్వహించి ఒప్పించటానికి అసాధారణమైన ప్రతిభ, చదువు, కృషి, జబ్బ సత్తువ, మొండి పట్టుదల నిర్మమత వంటి వ్యక్తిత్వ లక్షణాలు కావాలి. ఇవి ఏమిటో సాహిత్య సిద్ధాంతాల్ని ప్రతిపాదించే వాళ్ళు చరిత్రలో ఇదివరకే చర్చించి ఉన్నారు.

కవులకు, రచయితలకు ఈ బాధ్యత ఇంత విస్తృతంగా లేదు. కాని వాళ్ళు తమ స్వంత సృజన విషయంలో నిరంతరం తమని తామే ప్రశ్నించుకొని ఒప్పించుకోవాలని చూస్తారు. ఇదికూడ ఏమంత తేలికైన పని కాదు. రక రకాల కారణాల్ని, ప్రయోజనాల్నీ చూపించి సృజనకు ఆయువుపట్టయిన ఈ అంతర్మధనం (త్రిపుర భాషలో కవిని తప్పనిసరిగా నిరంతరం తొలుస్తుండే జంట కుమ్మరిపురుగుల తవ్వకం) నోరు నొక్కెయ్యటమే మేధస్సు చేసే పని. నామిని దీన్నే నిరసిస్తున్నాడు. రాసింది ప్రచురణకివ్వాలా వద్దా అని, తీరా ప్రచురించేక తప్పైపోయిందేమోననీ కవులు పడే మధన గురించి త్రిపుర, నారాయణరావులు చెప్పిన సంగతులున్నాయి. ‘ప్రతీ రచనా ఏదో ఒక మేరకు అసంపూర్తి అయిందే, కాబట్టి మరీ సంకోచం, మమకారం లేకుండా ప్రచురణకు ఒప్పుకోవడమే మంచిది. (Go ahead and publish with a certain abandon!)’ అని నారాయణరావనేవారు. ప్రచురించేక దానిమీద పడే రాళ్ళనీ పువ్వుల్నీ ‘నాది కాద’నుకొని చూడగలిగితే పోతుంది. తను రాస్తున్న పుస్తకాల్ని గురించి కూడా ఆయనకి ఇలాంటి మధన ఉంటూనే వచ్చింది. ఒకరోజు మాటల్లో ఆయన, ‘ఇలా రాస్తున్నానండీ! తిడతారేమోనని అనుమానంగా ఉంది!’ అని చెప్పుకున్నారు. నేను ‘మీరు రాసినా తిడతారు, రాయకపోయినా తిడతారు!’ అన్నాను. ఆమాట ఆయనకి చాలా నచ్చింది ఎందుకో. దాన్నొక మహా వాక్యంలాగ చాన్నాళ్ళు మళ్ళీ చెప్పేవారు. ‘రాసినా తిడతారు, రాయకపోయినా తిడతారన్నాడు. నిజమే! తిట్లు ఎలాగూ తప్పవు కాబట్టి రాసుకుంటేనే మంచిది!’ అని.

కవులు, రచయితల్ని ఈ అనుమానం ఎలా పట్టి పల్లారుస్తుందో త్రిపుర చెప్పింది ఉంది. కవికి సృజనతో ఉన్న సంబంధం చాల జటిలమైనది. దాన్ని నిర్మమకారంగా పరిత్యజించడం అంత సులభం, సాధ్యమూ కాదు. ఒక్కొక్క సారి సృజనకి కవి ఊహావరణాన్ని రక రకాల జ్ఞాపకాలుగా ఆక్రమించి అతన్ని తీవ్రమైనవి, వదిలించుకోవీల్లేని ఉద్వేగాలతో ఉక్కిరిబిక్కిరి చేసే శక్తి ఉంటుంది. ఒక్కో కధ, కవిత అయితే దశాబ్దాలతరబడి రాసినవాడ్ని వెంటాడగలవు. రాస్తున్నప్పుడూ, రాసిన తర్వాత కూడా దాన్నుండి తప్పించుకోవడం అసలు సాధ్యమే కాకపోవచ్చు. సృజనకి ఒక వెర్రిలాగో, దెయ్యం పట్టినట్టో ఆవహించి బాధించే శక్తి ఉంది. దీన్ని వదిలించుకోలేక, ఇంక విధిలేక తప్పనిసరై రాసేవాళ్ళున్నారు. త్రిపుర స్వయంగా దీనికొక ఉదాహరణ. నా అనుభవం త్రిపుర అన్నదానికి దగ్గరగా ఉంది.

సృజన సమయంలో, కల్పనకు కేవలమైన చోదక శక్తిగా ఈ వెర్రి ఎంత తీవ్రంగా ఉంటుందో సృజన తర్వాత పశ్చాత్తాపం (guilt) అంత తక్కువగా ఉంటుంది. అప్పుడు సృజన మాత్రమే ఉంది, దాన్ని రాసేవాళ్ళని ఎవరూ లేరు. రాసేవాడి పేరుతో, ఉనికితో, వ్యక్తిత్వంతో, లౌకికంగా అతను ప్రదర్శించే ముఖాలతో సృజనకు అవసరం గాని, ఖాతరు గాని లేదు. తీవ్రమైన, నైసర్గికమైన వాంఛతో మనుష్యులు, జంతువులు అనివార్యంగా సృష్టించే సంతతికి పేర్లు పెట్టేదీ, వర్గీకరించేదీ, విలువ కట్టేదీ మేధస్సు. సృష్టి కార్యం మేధస్సుకు అతీతంగా, దాన్ని ధిక్కరించి జరుగుతుంది. అందుకే అదంత తియ్యగా ఉంటుంది. ఉన్మాది చేసే నేరాలని న్యాయస్థానాలు కూడా క్షమిస్తాయి. అతనికి లౌకికమైన తన వ్యక్తిత్వాన్ని గురించీ, లోకపు మంచి చెడ్డల గురించీ స్పృహ ఉండదని. సృజనలో మేధస్సు చేసే మోసాల్ని, అవి ఎంత లోక కళ్యాణాన్నీ, ఎన్ని మంగళకరమైన ఆలోచనల్నీ ప్రతిపాదిస్తున్నా వివేకం ఉన్న పాఠకులు మన్నించరు. ఏదో ఒకనాడు తప్పకుండా పోల్చీసుకుంటారు.

సృజన ఎక్కడ్నుంచి పుట్టిందనేది ఎలాగయితే ఒక అంతుచిక్కని విషయమో, సృజించేది ఎవరు అనేది కూడా అంతే నిగూఢమైన సంగతి. రాస్తున్నది ఎవరు? జాతరలో పూనకం పట్టినావిడ (అతను) నిజం పేరు, లింగం, వయసు, జాతి, వ్యక్తిత్వంతో సంబంధం లేకుండా చూసే జనాలందరికీ సమిష్టిగా ఒక్కర్తే ‘అమ్మతల్లి’. సృజన పూనిన కవి తన సంకల్పం, అనుమతీ లేకుండానే తనను తాను హననం చేసుకుని మనందరికీ అనాదీ, ఒక్కటీ (common) అయిన ‘తలలోని జేజమ్మని’ దర్శింపచేస్తున్నాడు. మేధస్సు తీవ్రంగా ఆశించి, కావాలని ఎలుగెత్తి ఘోషించీ సాధించలేక విఫలమయ్యే రక రకాల సమానత్వాల్ని సృజన పాఠకుల అంతరంగాల్లోన ఇలా అసంకల్పితంగా సాధిస్తున్నాది. నారాయణరావు గారన్న సంస్కరణ ఇది. బలమైన కవి ఎన్ని కష్ట నష్టాలకు, అవమానాలకైనా ఓర్చి, సృజన సమయంలో తన అహంతో సహా మొత్తం మానవ జాతి మేధస్సును, అది నిర్మించిన నాగరికతను, సాంఘిక మర్యాదలను, అది కట్టిన భాషను సైతం అవసరమనిపిస్తే ‘థూ నువ్వు పోయే నియ్యమ్మా ముత్తరాసి రండ నాయాలీ ముండా!’ అని ధిక్కరించి, తన సృజన దరిదాపుల్లోనికి కూడా రానివ్వకుండా కాచుకుంటున్నాడు. నిరంతరమైన ఆత్మ హననం వలన వీళ్ళకి సహజంగా అబ్బే వినయంలోనూ, ఆక్రోశంలోను కూడా కపటం కనిపించదు.

వృత్తి రీత్యా విశ్లేషించి రాయవలసిన బాధ్యత ఉన్నవాళ్ళకు రాసి, ప్రచురించక తీరదు. ఈ వ్యాసంగంలో నారాయణరావు గారు ఎదుర్కొనే ఇబ్బందుల్ని గురించి, అనుభవించే సంఘర్షణల్ని గురించి మా పరిచయం వల్ల నాకు కొంతైనా తెలుసు. పైన చెప్పినట్లు ఆయన రక రకాల అంశాల్ని లెక్కలోకి తీసుకొని, వాటిని విభిన్నమైన కోణాల్లోంచి పరిశీలించి విమర్శను నిర్వహించాలి. సృజనలో, విమర్శలో కూడా ఆయన పెద్ద పీట వేసేది ప్రతిభకి. దీన్నే ఆయన ‘తెలివితేటలు’ అని వ్యవహరిస్తారు – సృజించే ప్రతిభ, సృజన తత్వాన్ని గురించిన ఎరుక, వివేకం అని. పేలవంగా ఉండే రచనల్ని, విమర్శల్ని ఉద్దేశించి ఆయన మహా అయితే ‘ఇలాటి తెలివితక్కువ పని ఎందుకు చేసేరో?!’ అని విసుక్కుంటారు. తొందరపడి రచనల్ని ప్రచురించేవాళ్ళనీ, తనని అకారణంగా నిందించేవాళ్ళని గురించి కూడా ఆయన ఇంతకంటె తీవ్రంగా అనడం నేను వినలేదు. బాగా రాసేవాళ్ళని ఆయన యధాలాపంగా పొగిడే పద్ధతి ‘తెలివైనవాడండీ! చాలా తెలివైనవాడు!’ అని. ఈమాట ఆయన ఎవరిగురించో తప్ప అనడం నేను వినలేదు. నామిని గురించీ, వేలూరి శివరామశాస్త్రి గారి గురించీ, కవికొండల వెంకట రావు గారి గురించీ ఆయన ఇలా అనడం నాకు గుర్తుంది. వీళ్ళు ముగ్గురి సృజనలంటే నాకు చాలా ఇష్టం కాబట్టి ఇది నాకు బాగుండేది.

నారాయణరావు గారు స్వయంగా కూడ చాలా ‘తెలివైనవాడు’ అని నేను అనుకుంటాను. కేవలం భౌతికము, తర్క సమ్మతమైన వివేచననే ఆధారంగా ఎంచుకొని ఆయన కళా విమర్శను, చర్చను రమారమి ఒక విజ్ఞానశాస్త్రపు స్థాయిలో నిర్వహించే పద్ధతి చెప్పుకోదగినది, చూసి నేర్చుకోవలసినది. దీన్నే శాస్త్రీయ దృష్టి అని అంటున్నాము. శాస్త్రగతమైన విశ్లేషణలలో, చర్చలలో పాండిత్యం ప్రదర్శించడానికి అవకాశాలు చాలా ఎక్కువ. ఇది ఒక బలహీనత. నారాయణరావు గారి రచనలలో ఇలాంటి ప్రదర్శన కాగడా పెట్టి వెతికినా కనిపించదు. సృజనకి, వివేచనకి మధ్య ఉండే సరిహద్దులు కూడా ఆయనకి స్పష్టంగా తెలుసును. ‘సృజన ఎలా జరుగుతుందో ఆ వివరాలు నాకు అనుభవపూర్వకంగా తెలీవు, అవి మీరే చెప్పాలి!’ అని ఆయన తాను మన్నించే కవులు, రచయితలతో చెప్పుకుంటారు. రాతల్లో, మాటల్లో కూడా ఆయన వైఖరి సృజన అనే అపురూపమైన నిధిని గొప్ప పట్టుదలతో కాపాడుకునే రక్షకభటుడిలాగ ఉంటుంది.

ఇది తెలిసి ఆయన వివేచననే ఒక సృజనాత్మకమైన రచనలా అసలీ గాను, పకడ్బందీగాను నిర్వహిస్తారు. అంటే ఆయన రాతలు, మాటలు original గాను, internally consistent గాను ఉంటాయి. ప్రతి వాక్యం ఆయనకే స్వయంగా తట్టిన ఆలోచనను, పరిశీలనను లోతుగా చూపిస్తాయి. సృజనల అన్వయార్ధాలు విపులీకరించి ఒప్పించడానికి ఈ నైశిత్యాన్ని ఆయన ప్రయోగించే తీరు ఇందుకు ఒక్క ఉదాహరణ. ‘నేను తెలిసినవాణ్ణి, చెప్తున్నాను వినండి!’ అనే భేషజం కనిపించదు. ఇది ముఖ్యమైన పని అన్న పట్టుదల ఉంటుంది గాని, ఏదో గొప్ప పని చేస్తున్నానన్న ‘ఉదాత్తత’ సూచన కూడా ఉండదు. గొంతులో వినయం, మర్యాద, లేదా పెద్దమనిషి తరహాగా ‘ వెన్నుతట్టి ప్రోత్సహిస్తూ ముందుకి సాగిపోదాం!’ అన్న ఉదారవాదం ఇవేవీ వ్యక్తిగతంగా అలవోకగా జరిగే సంభాషణల్లో కూడా స్ఫురించవు. ఇందుకేనేమో అసలైన కవులు కూడా ఆయన సాంగత్యాన్ని సహించగలిగేవారు. ఇవి ప్రయత్నించి పొందగలిగే గుణాలు కావు. తన నిర్మాణాల్ని ఒకొక్క ఇటికా ఇటికా పేర్చి చెక్కినట్లు ఎంత జాగ్రత్తగా కడ్తారో, తను స్వీకరించిన వస్తువులు, అంటే ఇతరుల రచనలని కూడా అంతే జాగ్రత్తగా ప్రతి మాట, వాక్యం, ఖాళీ జాగాల్నీ పరిశీలించి చూస్తారు. ఈ రెండు పనుల్నీ (సృజన, విమర్శ) ఆయన ఇళ్ళు, శిల్పాలు, కుర్చీలు వంటి భౌతిక నిర్మాణాల్లాగే పరిగణిస్తారు.

శాస్త్రవేత్తలలో ఎన్నదగినవాళ్ళు శాస్త్రాలు చదివి, గుర్తుంచుకొని వల్లించేవాళ్ళుగా కాక, శాస్త్రాల్ని చదివి జీర్ణించుకోగా పక్వమైన తమ స్వంత వివేచనను, నిశితమైన తమ స్వంత దృష్టిని, నూతనంగా తాము స్వీకరించే వస్తువులకు అన్వయించి చూపించేవాళ్ళు. ఈ పని వైజ్ఞానిక రంగాల్లో చెయ్యటమే కష్టం. రసం వంటి అభౌతికమైన పదార్ధాల్ని వస్తువులుగా స్వీకరించే సాహిత్యం వంటి రంగాల్లోన ఈ పని చెయ్యటం మరింత కష్టమైన పని. స్పష్టమైన విలువలు గాని ప్రమాణాలు గాని గోచరించటానికి, నిర్ధారించటానికీ వెసులుబాటు లేని ఈ రంగంలో విమర్శ రకరకాల అజాగ్రత్తల వలన, అశక్తత వలన, ప్రలోభాల వలనా పతనమవడానికే అవకాశాలు ఎక్కువ. అందుకే కాబోలు ఎవరో తప్ప విమర్శ చేసి ఒప్పించలేరు. సమంజసంగా విమర్శను నిర్వహించడం ఎంతో కష్టసాధ్యమైన పని. ఈ మాట త్రిపుర, నారాయణరావులు కూడా నాకు చాలా సందర్భాల్లో సూచనప్రాయంగా చెప్తూ వచ్చేరు. త్రిపుర స్వయంగా సాహిత్యం (English Literature) చదువుకున్నారు, దాన్నే బోధించేరు. ఎవరైనా అలవోకగా విమర్శకు పూనుకుంటే దాన్ని ఆయన సున్నితంగా త్రోసిపుచ్చేవారు. ‘ఏ సైన్స్ లోనైనా లోతుగా చదివి చేసేకొద్దీ ఆ పని వేరేగా ఉంటుంది కదవై!’ అని.

నారాయణరావు వ్యాసంగాన్ని గురించి, సాహిత్య శాస్త్రజ్ఞునిగా ఆయన మూర్తిమత్వాన్ని గురించి అధివిమర్శ (meta-criticism) రావలిసి ఉంది. స్థూలంగా ఇది ఆయన ఇంగ్లీష్ రచనలు, తెలుగు రచనల్ని కలిపీకుండా, విడి విడిగా పరామర్శించాలి. ఇది ఉదారంగా కాక ముక్కుసూటిగా ఉంటేనే ఆయన సరదా పడతారు. కాని దాన్ని ఆయన చేసినంత తర్కసమ్మతంగానూ చెయ్యాలి. ఆయన విమర్శ పునాదులతోను, తాత్విక భూమికలతోను నాకు పేచీలైతే ఉన్నాయి. అవి సంఘర్షణలుగా పరిణమించి ఇంక చేపట్టక తప్పనప్పుడు అలాంటి పన్లు తప్పనిసరి అవుతాయి గాని, నాకు సాధ్యమా అనిపిస్తుంది.

త్రిపుర, నామిని, Salinger వంటి కాల్పనిక రచయితలు విమర్శ వంటి సమిష్టి బాధ్యత తలకెత్తుకోనక్కర్లేదు, వాళ్ళ ఆసక్తి అది కాదు. కాబట్టి ఇక్కడ నిరంకుశత్వం అంటున్న భావ తీవ్రత స్వరూపం, దాన్నే ఆధారంగా వాళ్ళు సృజనకి ప్రతిపాదించే ప్రమాణాల, విలువల అల్లికలు, అభివ్యక్తి కూడ వేరు వేరుగా ఉంటాయి. ఈ నిరంకుశత్వమే త్రిపురలో మౌనం గాను, నామినిలో తిమురు గాను, Salingerలో తిరస్కృతి గాను, నారాయణరావు గారిలో సశాస్త్రీయమైన తర్క విన్యాసం గానూ వ్యక్తమవుతున్నాది. వీటిని తరచి చూడటం నాకు ఆనందమే కాదు, అది చేస్తే తప్ప నాకు శాంతి లేదు. ఎందుకంటే ఈ వ్యాసంగంతో నాకున్న కొద్దిపాటి పేచీలు ఈ అంశంతో ముడిపడి ఉన్నాయి. వీటిని నివృత్తి చేసుకోవటానికి ఈ రచన పనికొస్తుందేమోనన్న ఆశతో, వేరే ఏ గతీ లేక దీన్లోకి దిగేను. ఈ పేచీలేమిటో, ఇవి సంఘర్షణలుగా పరిణమించి ఎందుకు బాధిస్తాయో ముందుకి వివరిస్తాను. త్రిపుర, నారాయణరావు గారి మాటల్నుండి నేను రాబట్టుకుంటున్న సాహిత్య సిద్ధాంతానికి నామిని వంటి సజీవమైన రచయితా, ఆయన రచనలు, వ్యాఖ్యలు గీటురాళ్ళుగా దొరికేయి.

లోక వ్యవహారంలో నిరంకుశత్వం చాల దుర్మార్గపు వైఖరి. దానికి విరుద్ధంగా ప్రజాస్వామ్యం, సామరస్యం, ఉదారంగా, ప్రేమతో అందర్నీ కలుపుకుంటూ పోయే సుహృద్భావం చాల వాంఛనీయమైన వైఖరులు. మేధస్సు వీటినే సృజనకి కూడా పరమ ప్రమాణంగా ప్రతిపాదిస్తుంది. త్రిపురలోను, నారాయణరావు గారిలోను, Salinger లోను, నామినిలోనూ ఇలాంటి సుహృద్భావం చూడము. కవయా నిరంకుశ: అని ఎవరన్నారో తెలీదు గాని ఇలాంటివాళ్ళని చూసే అని ఉంటారు. త్రిపురలోను, నారాయణరావు గారిలోను నేను దగ్గరగా చూసింది ఏమంటే తమకు నైసర్గికం, తప్పనిసరి అయిన ఈ వైఖరిని వాళ్ళు, ఇంక ప్రకటించక తప్పనప్పుడు మాత్రం చాల మార్దవంతో, తమ వ్యక్తిత్వపు లోతుల్నుండి ఒక అసంకల్పిత ప్రతీకార చర్య లాగ వ్యక్తం చేస్తారు. విస్తృతం, బహుముఖం, బహిరంగమైన తమ వ్యాసంగాల్లో వైజ్ఞానికులు ఈ సహజాతాన్ని తమ రంగాల మర్యాదలకు, సంప్రదాయాలకు, ఆర్ధిక రాజకీయ వాస్తవాలకూ లోబడే వ్యక్తం చేసుకోక తప్పదు. ఏకాకి కవికి ఈ అగచాటు లేదు. సృజనను వృత్తిగా స్వీకరించేవాళ్ళు పడే యాతనల్ని గురించి, విశ్వనాధ, శ్రీ శ్రీ, శిష్ట్లా వంటి వాళ్ళకి కవులుగా బతకడం ఎంత కష్టమయ్యిందో నారాయణరావు గారే చెప్పిన సంగతులు, ఇలాంటివే త్రిపుర సంగతులు, ఇప్పుడు నామిని చెప్పుకుంటున్న సంగతులూ ఉన్నాయి.

త్రిపుర సాహిత్యం అని పరిగణించే రచనల్లోన మనిషి స్వభావాన్ని గురించీ, బతుకును గురించీ ఒక నేరాంగీకారం వంటి ఒప్పుకోలు – అంటే confession – ఉంటుంది. కల్పన ‘నిజం’ కానక్కర్లేదు గాని దాన్లోని ఈ ఒప్పుకోలు పాఠకుల్ని కదిలిస్తుంది. లౌకికంగా కేవలం అబద్ధం ఐన కల్పనలో ఈ ఒప్పుకోలు ఒక అంతర్లీనమైన నిజంగా ఉంది. అది లేని రచనల్లో మౌలికంగా ఏదో ‘అబద్ధం’ ఉంది. అంటే వాస్తవం కాని కల్పనను చదివి పాఠకుడు దాని వెనుక అంతర్లీనంగా ఉన్న కవి అబద్ధాలాడుతున్నాడో లేదో పోల్చుకోగలుగుతాడు. ఈ ప్రతిపాదన ఒక చిక్కుముడి లాగ, తిరకాసుగా (paradox) ఉంటుంది. వస్తుత: పూర్తిగా అబద్ధమైన సృజనలో పాఠకుడు ఆశించే నిజం స్వరూపం ఏమిటి? కవి దేనికి నిబద్ధం కాలేక విఫలుడై, మేధస్సు భాష, సంస్కృతుల దన్నుతో కల్పించే రక రకాల సదుపాయాల మాటున దాక్కుని కూడా చివరికి దొరికిపోతున్నాడు? అలా ఎందుకు చేస్తున్నాడు? ఈ ‘అపరాధ పరిశోధన’ను రూఢి చేసుకోగలిగితే నామిని, Salinger అంటున్న ‘జూటా’ స్వరూపం ఏమిటో అవగతం కావచ్చు. దీనితోనే ముడిపడి ఉన్నది, ఇలాంటిదే ఇంకో ప్రశ్న – త్రిపుర ప్రతిపాదిస్తున్న నేరం స్వభావం ఏమిటి, దాన్ని రచయిత ఎలా ప్రదర్శిస్తున్నాడు, పాఠకుడు ఎలా అనుభవిస్తున్నాడు? ఈ ప్రశ్నల్నిగాని, నిజానికి ఈ వ్యాసంలో స్పృశిస్తున్న ప్రశ్నల్ని వేటినైనా గాని సంతృప్తికరంగా చర్చించటానికి, విస్తృతమైన, సమగ్రమైన చర్చ కావాలి.

(ఇంకా ఉంది).